The secret of spiritual life lies in living it every minute of your life

31, ఆగస్టు 2014, ఆదివారం

శ్రీకృష్ణుని జన్మ కుండలి-తీర్పు

మనకు ప్రస్తుతం నాలుగు జాతకాలు ఫైనల్ రౌండ్ లో మిగిలాయి.వాటిని తులనాత్మక పరిశీలన చెయ్యబోయే ముందు కొన్ని విషయాలను పరిశీలిద్దాం.

జ్యోతిశ్శాస్త్రం అనేది ఎంత లోతైన సబ్జెక్టో అర్ధం చేసుకోవాలంటే ఈ విషయాలను తెలుసుకోవడం అవసరం.

గ్రహములు నిత్య చలన శీలములు.సూర్యుని చుట్టూ వాటి కక్ష్యలూ ఆ కక్ష్యలలో వాటి పరిభ్రమణ వేగములూ కూడా వేర్వేరుగా ఉంటాయి.కనుక ఒకసారికి ఉన్న గ్రహస్థితులు మళ్ళీ తిరిగి రావాలంటే ఆయా గ్రహాలను బట్టి ఒకనెలనుంచీ కొన్ని వేల సంవత్సరాల వరకూ పట్టవచ్చు.

ఉదాహరణకు చంద్రుడు ప్రతినెలా రాశిచక్రంలో అదే ప్రదేశానికి వస్తాడు.అదే సూర్యుడయితే ఏడాది కొకసారి మాత్రమే ఇంతకు ముందు తానున్న చోటకు వస్తాడు.మిగతా గ్రహాలూ కూడా వారి వారి పరిభ్రమణ వేగాలను బట్టి రకరకాలుగా వస్తారు.అందరిలోకీ శని 30 ఏళ్ళ కొకసారి మాత్రమే రాశిచక్రంలో ఒక ప్రదేశాన్ని రెండోసారి తాకుతాడు.యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లయితే ఇక చెప్పనక్కరలేదు.వారివి ఇంకా దీర్ఘకక్ష్యలు.

శని గురువులను ఉదాహరణగా తీసుకుంటే వారిద్దరూ ఖగోళంలో ఒకసారి ఉన్న పరస్పరస్థితి(relative position) నుంచి మళ్ళీ అదే స్థితికి రావడానికి 60 ఏళ్ళు పడుతుంది.అదే వీరికి రాహువును కూడా కలిపితే వీరు ముగ్గురి పరస్పర స్థితి మళ్ళీ తిరిగి ఖగోళంలో దర్శనం ఇవ్వడానికి 180 ఏళ్ళు పడుతుంది.అప్పుడు కూడా వారు ఖచ్చితంగా అదే స్థితిలో కలవరు.గ్రహవక్రత్వం (retrogression) వల్లా ఇంకా అనేక భ్రమజనిత కారకాలవల్లా (illusory factors) ఇంకా చాలా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.

అదే విధంగా అయిదు లేదా ఆరు గ్రహాలను మనం తీసుకుంటే వారందరూ ఉచ్చస్థానాలలో గాని లేదా ఒకసారి ఉన్న ఆయా స్థానాలకు దగ్గరగా గాని మళ్ళీ రావడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుంది.

అనేక మంది పరిశోధకులు వారి వారి పరిశోధన ప్రకారం చెప్పినది గమనించగా శ్రీకృష్ణుని జననతేదీలు 3000 BC నుండి 3300 BC వరకూ ఉన్నాయి.మహాభారత యుద్ధసమయంలో వర్ణించబడిన గ్రహస్థితులు కూడా ఆ సమయంలోనే ఖగోళంలో ఉన్నాయి.

డా||వర్తక్ వంటి కొందరి ప్రకారం ఈ తేదీ 5000 BC లోకి వెళ్ళిపోయింది.కానీ అప్పటి గ్రహస్థితులను లెక్కించే సాఫ్ట్ వేర్లు మనవద్ద లేవు.వర్తక్ గారు వేసిన లెక్కలు మాన్యువల్ గా వేసినవి గనుక అవి ఖచ్చితంగా ఉంటాయని భరోసా లేదు.

మనం ఇప్పుడు అనుసరిస్తున్న జ్యోతిష్యశాస్త్రం వేదములలో పురాణములలో లేదు.అప్పట్లో నక్షత్రమండల పరిజ్ఞానం ఉన్నది.గ్రహ పరిజ్ఞానం ఉన్నది.గ్రహములను వారు టెలిస్కోప్ సహాయం లేకుండా కళ్ళతోనే చూడగలిగేవారు.నూరేళ్ళు వచ్చినా వారి కళ్ళూ పళ్ళూ గట్టిగానే ఉండేవి.మన కంటే వారి ఇంద్రియశక్తులు చాలా ఎక్కువగా బలంగా ఉండేవి.వారికి కంప్యూటర్లూ లేవు కళ్ళజోళ్ళూ లేవు.ఈ రెంటి అవసరం వారికి లేదు.లెక్కలన్నీ మనసులోనే వేసేవారు.ఎంతదూరాన్న ఉన్న వస్తువునైనా చక్కగా స్పష్టంగా కళ్ళతోనే చూడగలిగేవారు.

ఏ పరికరం సహాయం లేకుండా వేల ఏళ్ళ నాడే విషువచ్చలనం (precision of equinoxes) ను వారు కొలవగలిగారంటే, ఈ విషయం ఒక్కటి చాలు వారి మేధస్సు ఎలాంటిదో గుర్తించడానికి.వారిని విమర్శించే మనకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా కనీసం 'గ్రహం' అనే పదానికి అర్ధం తెలియదు.

లేని రాహుకేతువులు గ్రహాలెలా అవుతాయి,చంద్రుడు గ్రహం ఎలా అవుతాడు?ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేస్తూ అవేవో గొప్ప తెలివితేటలన్నట్లుగా మన అజ్ఞానాన్ని బహిర్గతం చేసుకుంటూ ఉంటాం.ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్న మనకు ప్రాచీన జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించే అర్హత ఎంతవరకూ ఉంటుందో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్ధమౌతుంది (వారికి ఆత్మ అనేది ఒకటి ఉంటే).

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న జ్యోతిష్య విధానం వేదకాలం తర్వాత ఎన్నో రకాలైన మార్పులకూ చేర్పులకూ లోనైన విధానం.కనుక దీనిని వేదిక్ అస్ట్రాలజీ అనడం సరికాదు.హిందూ ఆస్ట్రాలజీ లేదా ఇండియన్ ఆస్ట్రాలజీ అంటే బాగుంటుంది.లేదా భారతీయ జ్యోతిష్యం అంటే ఇంకా బాగుంటుంది.

వేదకాలంలో మనం ఇప్పుడు చూస్తున్నట్లు లగ్నం లేదు.ప్రాచీన నాడీ జ్యోతిష్యంలో కూడా లగ్నం లేదు.లగ్నం అనేది యవనజాతక విధానం.

రామాయణ భారతాది కాలాలలో నక్షత్ర మండలాలలో గ్రహాల సంచారమే ముఖ్యంగా చూచేవారు.కొన్నికొన్ని నక్షత్రాలలో కొన్ని గ్రహాలు సంచరించినప్పుడు కొన్ని ఖచ్చితమైన ఫలితాలూ ప్రభావాలూ భూమి మీద ఉంటున్నాయన్నది కనీసం 10,000 ఏళ్ళ నుంచీ మనకు తెలుసు.

రామాయణ భారతాలలో దీనికి ఎన్నో ఋజువులున్నాయి.

నక్షత్ర మండలాలకు మనవాళ్ళు చాలా విలువనిచ్చారు.ఎంత విలువంటే, నక్షత్రాలే భగవంతుని రూపం అని వారు దర్శించారు.

'అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమ్ అశ్వినౌ వ్యాత్తమ్' అనే పురుషసూక్త మంత్రమే దీనికి ప్రమాణం.

"యో వై నక్షత్ర్యం ప్రజాపతిం వేద ఉభాయోరేనం లోకయోర్విదు:"

"నక్షత్ర మండలముల రూపంలో ప్రజాపతి(భగవంతుడు,సృష్టికర్త) నిలచి ఉన్నాడన్న జ్ఞానమును కలిగినవాడు,ఈలోకమును పరలోకమును కూడా చక్కగా తెలిసికొంటున్నాడు" అంటుంది యజుర్వేద బ్రాహ్మణంలోని ప్రధమ అష్టకం.

జ్యోతిష్యశాస్త్రం దైవానికీ దైవజ్ఞానానికీ విరుద్ధం అని భావించేవారు పరమ మూర్ఖులు మరియు అజ్ఞానస్వరూపాలు.వారికి సత్యజ్ఞానం లేదు.ఎవరో పనికిమాలిన పాశ్చాత్య పండితుల అభిప్రాయాలనో లేక కలగూర గంప లాంటి తియోసఫీ భావాలనో ఆధారం చేసుకొని వారికి ఏమాత్రమూ తెలియని సబ్జెక్ట్ మీద వారికి తోచిన అవాకులూ చెవాకులూ వ్రాస్తుంటారు.

అలాంటివారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమంటే--జ్యోతిష్యశాస్త్రం వేదాంగములలో ఒకటి అనీ,అదొక రహస్య విజ్ఞానమనీ,నక్షత్ర గ్రహ మండలములు అన్నీ దైవస్వరూపమే అనీ వాటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే మానవుని విధి(fate,destiny) ఏమిటి అన్నది తెలిసిపోతుందనీ,మానవుని జీవితాన్నీ అతని పూర్వకర్మనూ చదవాలంటే దీనిని మించిన రహస్యశాస్త్రం లేదన్న విషయాన్నీ వారు మొదటగా గ్రహించాలి.

నక్షత్ర మండలాలలో దాగియున్న రహస్యాలను నేటి సైన్స్ ఇంకా గుర్తించలేక పోతున్నది.కానీ ఈ రహస్యాలు వేదములలో చాలా నిగూఢమైన భాషలో చెప్పబడినాయి.వృద్ధగర్గుడనే మహర్షి నక్షత్ర మండలాలలో దాగి ఉన్న రహస్యాలను పరిశోధన చేసి వాటిని ఆమూలాగ్రమూ గ్రహించిన వేత్త.

ఏయే నక్షత్ర మండలం నుంచి ఏయే స్పందనలు (వైబ్రేషన్స్) వస్తున్నాయి. వాటిలోని భేదాలు ఏంటి?వాటి ప్రభావాలు మానవుల మీదా భూమిమీదా ఎలా ఉంటాయి అన్న విషయాలను ఆయన ఇప్పటికి దాదాపు 9000 సంవత్సరాల నాడే పరిశోధన చేసి రికార్డ్ చేసి పెట్టినాడు.వేదములలో ఉన్న 'నక్షత్రేష్టి' 'నక్షత్రశాంతి' మంత్రములలో ఆ రహస్యాలు దాగి ఉన్నాయి.

నవీన సైన్స్ దీనిని కొంతవరకూ గ్రహించింది.ఉదాహరణకు,నక్షత్ర మండలాలు అన్నీ ఒకే రకమైన స్పందనలను వెలువరించడం లేదన్న విషయం అది గుర్తించింది.వాటి తరంగాలలో తేడాలున్నాయి.కొన్నింటి నుండి రేడియో వేవ్స్ వస్తున్నాయి.కొన్ని ఎక్స్ రేలను వెదజల్లుతున్నాయి.కొన్ని గామా కిరణాలను వెదజల్లుతున్నాయి.వీటన్నిటి పౌన:పున్యములు (frequencies) వేర్వేరుగా ఉన్నాయి.ఆయా తరంగాల ప్రభావాలూ వేర్వేరుగానే ఉన్నాయి.ఇంతవరకూ నేటి సైన్స్ గ్రహించగలిగింది.

కానీ వృద్ధగర్గ మహర్షి వంటి మహనీయులు ఎన్నొ వేల సంవత్సరాల క్రితం ఈ విషయాలు గ్రహించడమే గాక,ఆయా నక్షత్రస్పందనల ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటున్నదో దర్శించి,ఆయా నక్షత్ర శక్తులను ఎలా కంట్రోల్ చెయ్యవచ్చో మంత్రముల రూపంలో రహస్య విజ్ఞానాన్ని వేదంలో నిక్షిప్తం చేసి ఉంచారు.

ఆ నక్షత్ర మండలం నుంచి వెలువడుతున్న స్పందనలతో మనలను అనుసంధానం చేసేదే నక్షత్రమంత్రం.ఎందుకంటే రెండూ శబ్దశక్తులే.ఒక శబ్దాన్ని సరిగ్గా జపించడం ద్వారా ఇంకొక శబ్దపు అదే ఫ్రీక్వెన్సీని అందుకోవచ్చు.దానితో అనుసంధానం గావచ్చు.ఇది శాస్త్రీయ విధానమే.నక్షత్ర శక్తిని స్వీకరించి దానితో మన 'కర్మ' ను మనకు అనుకూలంగా మార్చుకునే మంత్రప్రక్రియలు వేదంలో ఉన్నాయి.అదొక రహస్యసాధనా విధానం.వృద్ధ గర్గమహర్షి దీనికి ద్రష్ట.అంటే ఈ విధానాన్ని కూలంకషంగా పరిశోధించి దానిని codify చేసిపెట్టిన ఋషి.ఇదంతా ఒక అద్భుతమైన సీక్రెట్ సైన్స్.

రెండువేల సంవత్సరాల నాటి వరాహమిహిరుడు తన గ్రంధాలలో వృద్ధగర్గమహర్షిని స్మరించినాడంటే ఆయన అంతకుముందు ఇంకా పూర్వం వాడే అయి ఉంటాడు కదా.రామాయణకాలంలో (7000 BC) దశరధుడు నక్షత్ర మండలాలలో గ్రహసంచారాన్ని స్మరించినాడంటే అప్పటికే ఈ విజ్ఞానం అందుబాటులో ఉన్నట్లే కదా.

జ్యోతిశ్శాస్త్రం యొక్క ప్రాచీనతను గురించీ దాని బహుముఖ విస్తృతిని గురించీ ఈ మాత్రం ప్రాధమిక అవగాహన ఉంటే చాలు.

ప్రస్తుతానికి దానిని అలా ఉంచి విషయంలోకి వద్దాం.

ఇప్పుడు మనకు లభించిన నాలుగు జన్మకుండలులను తులనాత్మక పరిశీలన చేద్దాం.

మొదటిది-23-5-5626 BC(డా||వర్తక్ గారి పరిశోధన)

రెండవది-18-7-3228 BC(డా||రామన్ గారి పరిశోధన)
మూడవది-24-6-3132(డా||నరహరి ఆచార్ పరిశోధనలో విషయం)
నాలుగవది-1-7-3111 BC(డా రాఘవన్,సంపత్ అయ్యంగార్ పరిశోధన)

మొదటిది

ఈయన వేసిన లెక్కలు మాన్యువల్ గా వేసినవి.ఈ లెక్కలు అప్పటి పరిస్థితులతో సరిగ్గా సరిపోతాయో లేదో మనకు తెలియదు.ఖచ్చితమైన ఖగోళ సాఫ్ట్వేర్ ఉంటే తప్ప అప్పటి గ్రహస్థితులు లెక్కించడం కష్టం.

పైగా,ఈ జాతకంలో అవతార పురుషుని లక్షణాలు లేవు.సంఘటనలు కూడా పేలవంగా సరిపోతున్నాయిగాని పరిపూర్ణ సంతృప్తిని ఇవ్వడం లేదు.

కనుక ఈ జాతకం మన పరీక్షకు నిలబడటం లేదు.

రెండవది


ఈ జాతకంలో ఏ గ్రహమూ ఉచ్చస్థితిలో లేదు.ఒక అవతార పురుషుని జాతక లక్షణాలు ఈ జాతకానికి లేవు.

పైగా కుజుడు నీచస్థితిలో ఉన్నాడు.చంద్రుని లగ్నస్థితి వల్ల నీచభంగం అయినప్పటికీ రాహు కుజ శుక్రుల యోగం వల్ల ఇదేదో రాక్షస జాతకం లాగా కనిపిస్తున్నది గాని ఒక దివ్యపురుషుని జాతకంగా అనిపించడం లేదు.

సంఘటనలు కూడా దశలతో సంతృప్తికరంగా సరిపోలేదు.

మూడవది


ఈ జాతకం కూడా చాలావరకూ సరిపోయినట్లు పైపైన కనిపిస్తున్నప్పటికీ దీనిలో రాహుకేతువులు తప్ప ఇతర ఉచ్చగ్రహాలు లేవు.ఒక అవతార పురుషుని లక్షణాలు ఈ జాతకానికి లేవు.

పదింట శని వక్రిగా ఉన్నందున వృత్తిలో పరాజయాలుండాలి.కృష్ణునికి అలాంటిదేమీ లేదు గనుక ఈ జాతకం సరిపోలేదని  చెప్పవలసి వస్తుంది.


నాలుగవది

ఈ జాతకం ఒక అవతార పురుషుని జాతకానికి చాలా వరకూ దగ్గరగా ఉన్నది.దాదాపు ఏడు గ్రహాలు ఉచ్చస్థితిలో గాని దగ్గరగా గాని ఉన్నాయి. ఈజాతకంతో కృష్ణుని జీవితంలో సంఘటనలు కూడా స్పష్టంగా సరిపోతున్నాయి.కనుక ఇది కృష్ణుని జాతకం అని మనం నమ్మవచ్చు.అయితే దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.ఏమంటే మిగతా పరిశోధకుల అభిప్రాయాలతోనూ వారు కనుక్కున వివరాలతోనూ పురాణాలలోని ఇతర వివరాలతోనూ ఈ జాతకం సరిపోకపోవచ్చు.ఈ జాతకాన్ని మనం ఒప్పుకుంటే ఈ క్రింది సమస్యలు వస్తాయి.
  • మహాభారత యుద్ధ సమయానికి కృష్ణునకు 45 ఏళ్ళ వయస్సు మాత్రమే ఉంటుంది.
  • కృష్ణ జననం జరిగిన పదేళ్లకు కలియుగం ప్రవేశించి ఉండాలి.
  • కృష్ణ నిర్యాణం 3011-3010 ప్రాంతంలో జరిగి ఉండాలి.
మరి వీటిని ఆయా పరిశోధకులు ఎంతవరకు ఒప్పుకుంటారో అనుమానమే. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా,మనకు లభిస్తున్న తేదీలలో ఇంతకంటే మంచి తేదీ దొరకడం లేదు.

శ్రీ రామకృష్ణుని జాతకాన్ని మనం పరిశీలిస్తే,అందులో శని గురువు కుజుడు ముగ్గురూ ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు చూడవచ్చు.రాహు కేతువులు కూడా ఉన్నారు.వారిని కొంచం సేపు పక్కన ఉంచుదాం.అందులో ఒక విచిత్రం ఉన్నది.

శని ఉచ్చస్థితిలో ఉన్నపుడు గురువు మిధునంలో ఉంటేనే తన పంచమ దృష్టితో శనిని వీక్షించగలుగుతాడు.అలాగే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నపుడు సహజరాశిచక్రంలో ప్రధమగృహమైన మేషరాశిని తన చతుర్ధదృష్టితో వీక్షించగలడు.అలాగే సహజ చతుర్ధాన్ని తన సప్తమ దృష్టితో చూడగలడు.సహజ పంచమాన్ని తన అష్టమ దృష్టితో చూడగలడు.ఈ మూడూ ఒక అవతార పురుషుని జాతకానికి చాలా అవసరం.

గురువుకు పంచమ దృష్టీ కుజునికి చతుర్ధ దృష్టీ మంచివి.ఎందుకంటే అవి వారివారి స్వభావానికి సహజసూచికలు.గురువు మంత్రాధిపతి అనీ కుజుడు ధరాధిపతి అనీ గుర్తుంచుకుంటే ఈ దృష్టుల ప్రత్యేకతలేమిటో తెలుస్తాయి.

3000 BC నుంచి 3300 BC వరకూ ఉన్న కాలవ్యవధిలో శని గురుకుజుల ఉచ్చస్థితి ఉన్న సంవత్సరాల కోసం నేను ప్రతి ఏడాదికీ ఉన్న గ్రహస్థితులను జల్లెడపడుతూ వెదికాను.రాశిచక్రంలో వీరి ముగ్గురి పరస్పర స్థితులు (relative positions) దాదాపు 237-240 సంవత్సరాల కొకసారి ఒకేవిధంగా ఉంటున్నాయి.అప్పుడు కూడా పూర్తిగా ఒకే విధంగా ఉండటం లేదు.దాదాపుగా మాత్రమే అంతకు ముందరి స్థితికి దగ్గరగా ఉంటున్నాయి.

3111 BC తర్వాత 3348 BC లో మాత్రమే మళ్ళీ ఇలాంటి గ్రహస్తితి ఉన్నది.కానీ అప్పటికి మహాభారతయుద్ధం చాలా దూరానికి వెళ్ళిపోతుంది. అప్పుడు గనుక కృష్ణుడు పుట్టినట్లు మనం అనుకుంటే,మహాభారత యుద్ధ సమయానికి ఆయనకు 281 ఏళ్ళు ఉన్నట్లు అవుతుంది.ఇది అసంభవం గనుక ఆ సంవత్సరాన్ని స్వీకరించలేము.పైగా 3348 BC జాతకంలో కూడా మిగిలిన గ్రహాల పరిస్తితి మళ్ళీ అవతార పురుషుని జాతకాన్ని సూచించే విధంగా లేదు.

పోనీ వెనక్కు వద్దామా అంటే, 2874 BC నాటికి మాత్రమే మళ్ళీ కుజ గురు శనుల గ్రహస్థితి వారి వారి ఉచ్ఛస్థితులకు దగ్గరగా ఉంటున్నది.ఈ ఏడాది కూడా భారతయుద్ధానికి బాగా దూరం అయిపోతుంది.కనుక ఇదీ పనికి రాదు.

మహాభారత యుద్ధం గనుక 3067 BC లో జరిగినది నిజమే అయితే(నిజమే అని చాలామంది ఖగోళ పరిశోధకులు అంటున్నారు,ఒక్క వర్తక్ గారు తప్ప),అప్పుడు దాని దగ్గరలో ఒక అవతార పురుషుని జాతకంలో ఉండవలసిన పరిస్థితిని ప్రతిబింబించే సంవత్సరం ఒక్క 3111 BC మాత్రమే కనిపిస్తున్నది.ఆ దరిదాపుల్లో 480 సంవత్సరాల పరిధిలో అలాంటి గ్రహస్థితులు మళ్ళీ లేవు.

కాబట్టి ఇంతకంటే ఇంకొక మంచితేదీ ఇంకొకరి పరిశోధనలో కనిపించేవరకూ 1-7-3111 BC భాద్రపద బహుళ అష్టమిని శ్రీకృష్ణ జననతేదీగా ప్రస్తుతానికి స్వీకరించవచ్చు.

ఇది జ్యోతిష్య శాస్త్రపు తీర్పు.

(అయిపోయింది)