ఇప్పుడు మిగిలిన రెండవ జాతకాన్ని పరిశీలిద్దాం.
24-6-3151 BC

శ్రావణ బహుళ అష్టమి
బుధవారం రోహిణి నాలుగో పాదం
కుజ హోర
జనన సమయానికి ఈ జాతకంలో చంద్ర/శుక్ర/గురుదశ జరిగింది.చంద్ర శుక్రుల గురించి ఇంతకు ముందే అనుకున్నాం.ఇకపోతే గురువు అష్టమాధిపతి గనుక మేనమామ గండం వచ్చింది అనుకోవచ్చు.అయితే ఇది కొంచం దూరాలోచనే అవుతుంది.ఎందుకంటే నవమంలో ఉంటూ గురువు పితృపక్షాన్ని సూచిస్తున్నాడు గాని మాతృవర్గాన్ని సూచించడం లేదు.కనుక తల్లివైపు నుంచి వచ్చిన ప్రమాదం సూచన లేదు.
కుజుని సప్తమాదిపత్యం వల్ల ప్రత్యర్ధులకు సూచకుడవుతున్నాడు.శుక్రునితో కలసి పంచమంలో ఉన్నందువల్ల శత్రువుల ప్లాన్ ను సూచిస్తున్నాడు.ఇది కూడా బాగానే ఉన్నది.కాకపోతే లగ్నానికి ఇది పంచమం కావడంవల్ల ఇది దుష్ట పన్నాగాన్నీ దానివల్ల ఈయనకు వచ్చిన ప్రాణగండాన్నీ సూచించదు. కనుక ఈ జాతకంలో జననకాల గండం అనేది ఒక wild guess మాత్రమే గాని స్పష్టత లేదు.
పంచమంలో ద్విస్వభావ రాశిలో కుజశుక్రులు ఉండటం శనిచేత చూడబడటం అతికామ యోగం.ఈ జాతకునికి ఎన్నో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని సూచన ఉన్నది.ప్రేమస్వరూపునికి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది?ప్రేమ అనే పాయింట్ నిజమే అయినప్పటికీ,కీచక రావణాదులకు ఉన్నట్లుగా శ్రీకృష్ణునికి అతికామం ఉన్నట్లు ఎక్కడా ఋజువు లేదు.కనుక ఈ యోగాన్ని సంశయించవలసిన అవసరం ఉన్నది.
ఇకపోతే 3067 BC భారతయుద్ధ సమయంలో ఈ జాతకునికి కేతు/గురు దశ జరిగింది.ఇది ఒకరకమైన నాశనాన్నే సూచిస్తున్నది కాని డైరెక్ట్ గా యుద్ధ సూచన లేదు.గురువు ఈ జాతకానికి అమాత్య కారకుడు.పైగా చంద్రుని శ్రవణా నక్షత్రంలో ఉన్నాడు.కనుక తన తమ్ములూ స్నేహితులను సూచిస్తున్నాడు. వాళ్ళు నాశనం అయ్యే సూచన ఇక్కడ ఉన్నది.యుద్ధంలో తన సైన్యం కౌరవుల పక్షాల పోరాడింది.వారిలో కూడా చాలామంది చనిపోయారు.పిత్రుపక్ష నాశనం సూచింపబడుతూ ఉన్నది.కనుక పైపైన సరిపోయినట్లు అనుకోవచ్చు.కొంత సరిపోయినట్లూ కొంత సరిపోనట్లూ ఉన్నది.స్పష్టత లేదు.
ఇకపోతే,శ్రీకృష్ణ నిర్యాణ సమయానికి 3031 BC లో ఈ జాతకానికి చంద్ర/శుక్ర/గురుదశ జరిగింది.ఈ దశలో పుత్రనాశనం సూచితం అవుతున్నప్పటికీ ఇంతకు ముందు కుండలిలో ఉన్నంత బలంగా లేదు.పైగా చంద్ర/గురు దశలో అంత విధ్వంసం జరగదు.చంద్ర శుక్ర గురువులలో ఎవరికీ రాహుస్పర్శ లేదు.కనుక యాదవులు మదించి త్రాగి ఆ మత్తులో ఒకరినొకరు కొట్టుకుని చావడం స్పష్టంగా సూచింపబడటం లేదు.
పైగా,పంచమంలో శుక్రకుజుల వల్ల ఈయనకు తన పుత్రులతో విరోధం ఉన్నట్లు సూచన ఉన్నది.కానీ అలా జరగలేదు.కృష్ణుని పుత్రులు చాలా మంచివాళ్ళు.వాళ్ళు ఆయనకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు సరిగదా తమకు సంబంధమే లేని యుద్దానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే నోర్మూసుకుని వెళ్లి కౌరవుల పక్షాన యుద్ధం చేశారు.
పైగా అవతార పురుషుని జాతకంలో గురువు నీచలో ఉండటం అందులోనూ ధర్మస్థానంలో అలా ఉండటం అసంభవం.ఒకవేళ గురువుకు నీచభంగం అయిందా అంటే అదీ కాలేదు.గురువు యొక్క వక్రస్థితీ శనికి సమసప్తకంలో ఉండటమూ అవతార పురుషుల జాతకాల్లో ఉండే యోగం కాదు.విపరీతమైన చెడుకర్మ ఉన్న మామూలు మనుషుల జాతకాల్లో ఈ యోగం ఉంటుంది.
ఈ జాతకంలో అన్ని పాయింట్లూ పూర్తి బలంతో సరిపోలేదు.ఏదో కలిసీ కలవనట్లుగా ఉన్నాయి.కనుక ఈ జాతకం అంత కరెక్ట్ గా సరిపోవడం లేదు.కనుక దీనిని తిరస్కరించక తప్పడం లేదు.
డా||నరహరి ఆచార్ గారి ఖగోళ పరిశోధనా కోణాన్ని ఇప్పటిదాకా జ్యోతిష్య దుర్భిణిలో నుంచి చూచాము గనుక ఇప్పుడు డా|| వర్తక్ గారి పరిశోధన ఏమిటో జ్యోతిష్యపరంగా చూద్దాం.
(ఇంకా ఉన్నది)