“Self service is the best service”

22, ఆగస్టు 2014, శుక్రవారం

శ్రీకృష్ణుని జన్మకుండలి -3(డా||నరహరి ఆచార్ వర్గం)

డా||నరహరి ఆచార్--మెంఫిస్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్.

ఈయన లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం 3067 BC లో జరిగింది. 'నాసా'వారు ఉపగ్రహాలను ప్రయోగించడానికి వాడే ఖగోళ సాఫ్ట్ వేర్ 'ప్లానెటేరియం' ను వాడి ఈయన ఈ నిర్ధారణకు వచ్చాడు.

ఎందుకంటే,మహాభారత యుద్ధ సమయంలో ఖగోళంలో కనిపించినట్లుగా వ్యాసమహర్షి ఇచ్చిన అనేక ఖగోళ రిఫరెన్స్ లను ఈ సాఫ్ట్ వేర్ కు ఫీడ్ చెయ్యగా ఇదే సంవత్సరానికి ఆయా గ్రహగతులు ఆకాశంలో ఉన్నట్లుగా అది నిర్ధారణగా చూపించిందిట.

కనుక ఆ గ్రహపరిస్థితులన్నీ 3067 BC లో ఉన్నట్లుగా తేలిందని ఈయనంటున్నాడు.

ఈ విషయాన్ని 2003 లో బెంగుళూర్ లో జరిగిన ఒక మెగా కాన్ఫరెన్స్ లో పండితుల సమక్షంలో ఆయన నిరూపించి చూపించాడు.అంతేగాక ఇదే విషయాన్ని అంతకు 30 ఏళ్ళ క్రితం ప్రొ||రాఘవన్ అనే ఆయన కూడా ఇంతకుముందే నిరూపించి ఉన్నాడు.

వీరిద్దరూ చెప్పినట్లుగా, మహాభారత యుద్ధం అనేది 3067 BC లో జరిగితే,ఆ తరువాత 36 ఏళ్ళకు కృష్ణనిర్యాణం జరిగింది.అంటే కృష్ణనిర్యాణ సంవత్సరం 3031 BC అన్నమాట.అదే నిజమైతే,అప్పటికి శ్రీకృష్ణుడు పుట్టి 'వర్షాణాం అధికం శతం' కనుక 3131 BC నుంచి 3156 BC మధ్యలో ఏదో ఒక సంవత్సరం అయ్యి ఉండాలి.ఎందుకంటే శ్రీ కృష్ణుడు నూరేళ్ళ పైబడి నూట పాతిక సంవత్సరాల వరకూ దేహంతో జీవించాడని అనేకమంది ఊహిస్తున్నారు.కనుక ఈ పాతిక సంవత్సరాల లోపల దాగిఉన్న అసలైన జనన సంవత్సరాన్ని కనుక్కోవడమే మన ముందున్న సమస్య.

శ్రీకృష్ణుడు దేహాన్ని విడచిన రోజునే కలియుగం మొదలైందని కొందరంటారు. కాని ఇది సరికాదని భాగవతం అంటుంది.ఆ శ్లోకాన్ని అర్ధం చేసుకోవడంలో ఉన్న చిన్న పొరపాటు వల్ల ఈ గ్రహపాటు ఏర్పడింది.

ఆ సందర్భంలో వ్యాసమహర్షి వ్రాసిన శ్లోకం ఏమంటున్నదో చూడండి.

శ్లో||యదా ముకుందో భగవానిమాం మహీం
జహౌ స్వతన్వా శ్రవణీయ సత్కధ:
తదాహరేవ అప్రతిబుద్ధ చేతసాం
అభద్ర హేతుర్ 'కలిరన్వవర్తత:'

(సంస్కృత మహాభాగవతం 1.15.36)

(ఏ రోజునైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిని విడచి పెట్టినాడో ఆరోజునుంచే కలిప్రభావం అనేది అపరిపక్వ మనస్సులు కలిగిన వారిని సంపూర్ణంగా ఆవరించడం మొదలు పెట్టింది)

'కలిరన్వవర్తత:' అన్న పదానికి 'కలి సంపూర్ణంగా ఆవరించడం' అని అర్ధం.అంటే ఇంతకు ముందే,అంటే శ్రీకృష్ణుడు దేహంతో ఉన్నప్పుడే కలియుగం మొదలైంది.కొంత ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది.కానీ ఆయన దేహంతో భూమిపైన ఉన్నాడు కనుక తన పూర్తి ప్రభావాన్ని చూపలేక పోయింది.ఆయన వెళ్లిపోవడంతోనే తన పూర్తి శక్తితో విజ్రుమ్భించడం మొదలు పెట్టింది- అని అర్ధం.

ఈ శ్లోకాన్ని అర్ధం చేసుకోవడంలో పొరపాటుపడిన కొందరు-'శ్రీ కృష్ణుడు దేహత్యాగం చేసిన రోజే కలియుగం మొదలైంది' అనిన అర్ధాన్ని స్వీకరించారు.

ఇక్కడే తప్పు జరిగింది.

18-2-3102 BC కలియుగ ప్రారంభ తేదీ గనుక అయితే ఆరోజే శ్రీకృష్ణ నిర్యాణమూ జరిగి ఉండాలి.అలాంటప్పుడు అంతకు 36 సంవత్సరాల ముందు అంటే 3138 BC లో మహాభారత యుద్ధం జరిగి ఉండాలి.

కానీ డా|| నరహరి ఆచార్ వేసిన ఖగోళ లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం 3067 BC లో జరిగింది.అంటే ఈ రెంటికీ మధ్యన 71 ఏళ్ళ తేడా వచ్చేసింది.

'నాసా' వారు వాడే 'ప్లానెటేరియం' సాఫ్ట్ వేర్ తప్పులు చూపించదు కనుక మహాభారత యుద్ధం జరిగినది 3067 BC అనుకుంటే అప్పుడు శ్రీకృష్ణ నిర్యాణం అనేది 3031 BC అవుతుంది.కానీ ఆర్యభట్టు మొదలైన ఖగోళ శాస్త్రవేత్తలను మనం విస్మరించలేము.వారు చెప్పిన ప్రకారం కలియుగం అనేది 3102 BC లో మొదలైంది.

అలాంటప్పుడు,ఆర్యభట్టు వాదననూ,డా||నరహరి ఆచార్ పరిశోధననూ సమన్వయపరుస్తూ పై శ్లోకానికి సరియైన అర్ధాన్ని గ్రహిస్తే 3102 BC లో కలియుగం మొదలైనప్పటికీ ఆ తర్వాత 35 ఏళ్లకు అంటే 3067 BC లో మహాభారత యుద్ధం జరిగిందనీ ఆ తర్వాత 36 ఏళ్లకు 3031 BC లో శ్రీకృష్ణనిర్యాణం జరిగినదనీ అనుకుంటే లెక్క సరిగ్గా సరిపోతుంది.

అంటే కలియుగంలోనే మహాభారత యుద్ధం జరిగిందన్నమాట.ఇంకా సరిగ్గా చెప్పాలంటే ద్వాపర కలియుగాల సంధికాలంలో మహాభారత యుద్ధం జరిగి ఉండాలి.

యుగాల లెక్కల పరంగా ఇక్కడ ఇంకో సమస్య తలెత్తుతుంది.

యుగాల లెక్కలలో క్లారిటీ లేనివారికి ఈ పాయింట్ దగ్గర మళ్ళీ అనేక సందేహాలు రావచ్చు. మహాభారతం ద్వాపరయుగంలో కదా జరిగింది?ఈయన కలియుగంలో అంటాడేమిటి?అసలు కలియుగమే 4,32,000 సంవత్సరాలని మన పంచాంగాలు చెబుతుంటే నిన్న గాక మొన్న 5000 సంవత్సరాల నాడు ద్వాపరయుగంలో ఇదంతా జరగడం ఏమిటి? అని ఎన్నో సందేహాలు రావచ్చు.ఈ యుగాల లెక్కలను ఇంకో వ్యాసంలో వివరిస్తాను.అప్పుడు ఆయా లెక్కలు అర్ధంకాని వారికి క్లారిటీ వస్తుంది.

ఇప్పుడు ప్రస్తుతం లోకి వద్దాం.

ఇప్పటివరకూ మన లాజిక్కును బట్టి మనకు అర్ధమైనది ఏమంటే, కృష్ణ జనన సంవత్సరం 3131 BC-3156 BC మధ్యన ఏదో ఒక సంవత్సరంలో దాక్కుని ఉండాలి.కనుక ఆ 25 సంవత్సరాలలో ఉన్న శ్రావణ బహుళ అష్టమి+రోహిణీ నక్షత్ర తేదీలను జల్లెడ పట్టి,అప్పుడు వచ్చిన 25 జాతకాల్లో అవతార పురుషుని లక్షణాలున్న జాతకాన్ని గుర్తిస్తే అదే శ్రీ కృష్ణుని జాతకం అవుతుంది.

అవతార పురుషుని జాతక లక్షణాలు ఎలా ఉంటాయో ఎలా ఉండాలో మనకు శ్రీరామకృష్ణుని జాతకాన్ని బట్టి తెలుసు.

ఇది నా లాజిక్.

అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో ఒక లొసుగున్నది.త్వరపడి ఇదే అసలైన కృష్ణ జనన సంవత్సరం అనే నిర్ధారణకు మనం అప్పుడే రాకూడదు.ప్రో||నరహరి ఆచార్ గారు అన్నట్లుగా మహాభారత యుద్ధం 3067 BC లో జరిగింది అన్న విషయం నిజం అయితే మాత్రమే,ఈ లెక్క అంతా నిజం అవుతుంది.లేకపోతే ఈ మొత్తం లెక్క అంతా తప్పుతుంది.

అయినా సరే మనకు వేరే గత్యంతరం లేదు గనుక,ఇప్పుడు వరుసగా ఆ 25 జాతకాలనూ పరిశీలించి చూద్దాం.


14-6-3131 BC
సౌమ్య నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణి నక్షత్రం -రెండవ పాదం
గురువారం
చంద్ర రాహువులు ఉచ్ఛస్థితి,కుజుడు నీచస్థితి.
తిధి నక్షత్రాలు సరిపోలేదు



24-6-3132 BC
కీలక నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి నక్షత్రం మూడవ పాదం
శనివారం
యధావిధిగా చంద్రుడు ఉచ్ఛస్థితి.
రాహుకేతువులు ఉచ్చస్తితిలో ఉన్నట్లే.



7-6-3133 BC
ప్లవంగ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణీ నక్షత్రం రెండవ పాదం
సోమవారం
తిధి+నక్షత్రాలు సరిపోలేదు




16-6-3134 BC
పరాభవ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి నక్షత్రం ఒకటవ పాదం
చంద్రుడు గురువు ఉచ్ఛస్థితి




26-6-3135 BC
విశ్వవసు నామ సంవత్సరం 
నిజ శ్రావణబహుళ అష్టమి
రోహిణి మూడవ పాదం
చంద్ర బుధుల ఉచ్చస్థితి
శుక్రుని నీచస్థితి




8-6-3136 BC
క్రోధి నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి శనివారం
రోహిణి నక్షత్రం ఒకటవ పాదం
గజకేశరీ యోగం
చంద్ర ఉచ్ఛస్థితి;శుక్ర నీచస్థితి
తిధి+నక్షత్రం సరిపోలేదు




19-6-3137 BC
శోభన నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి శనివారం
రోహిణి నక్షత్రం ఒకటవ పాదం
సోమవారం
తిధి+నక్షత్రం సరిపోలేదు



2-6-3138 BC
శుభకృత్ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణి ఒకటవ పాదం
గురువారం
తిధి+నక్షత్రం సరిపోలేదు




13-6-3139 BC
ప్లవ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణి నాల్గవ పాదం
చంద్ర బుధుల ఉచ్చస్థితి;గురువు నీచ.
తిధి+నక్షత్రం సరిపోలేదు


22-6-3140 BC
శార్వరి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి ఒకటవ పాదం
సోమవారం
చంద్రకేతు సమసంయోగం
బుధుని ఉచ్ఛ స్థితి



6-6-3141 BC
వికారి నామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
రోహిణి మూడవ పాదం
గురువారం;శుక్రుని నీచ స్థితి.
మాలికా యోగం
తిధి+నక్షత్రం సరిపోలేదు




15-6-3142 BC
విలంబ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి ఒకటవ పాదం
శుక్రవారం
ఆరింట శని గురు సంయోగం
శని ఉచ్ఛస్థితి

(ఇంకా ఉన్నది)