నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

20, ఆగస్టు 2014, బుధవారం

శ్రీకృష్ణుని జన్మ కుండలి-2(బీవీ రామన్ వర్గం)

BV రామన్ వర్గం నమ్ముతున్న శ్రీకృష్ణ జననతేదీ 18-7-3228 BC.

వారు ఈ నమ్మకానికి రావడానికి ఏమేమి ఖగోళ లెక్కలు వేసి ఈ తేదీని నిర్దారించారో నేను మళ్ళీ అదంతా ఇక్కడ వ్రాయబోవడం లేదు.ఎందుకంటే వారివారి పుస్తకాలలో ఆ విషయాలన్నీ ఉన్నాయి.కావలసిన వారు ఆయా పుస్తకాలు చూడవచ్చు.

కృష్ణుడు పుట్టినది అర్ధరాత్రి సమయం అని మనకు తెలుసు.అలాగే పుట్టిన స్థలం మధుర అని కూడా తెలుసు.ఇప్పుడు ఒక తేదీ కూడా తెలిసింది.కనుక ఇప్పుడు ఈ వివరాల ఆధారంగా జాతకపరిశీలన చేద్దాం.

జనన తేదీ:18-7-3228 BC
జనన సమయం:అర్ధరాత్రి
జనన ప్రదేశం: మధుర 77E41;27N30.

ఇది జూలియన్ కాలెండర్ తేదీ.దీనిని గ్రెగేరియన్ కాలెండర్ లోకి మార్చగా ఇదే తేదీ 23-6-3227 BC అవుతుంది.కానీ ఆరోజున అర్ధరాత్రికి కృత్తికా నక్షత్రం నడుస్తున్నది.

కనుక మరుసటి రోజున అనగా 24-6-3227 BC అర్ధరాత్రికి చూడగా రోహిణీ నక్షత్రం కరెక్ట్ గా సరిపోతున్నది.తిధికూడా శ్రావణ బహుళాష్టమి అవుతున్నది.ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులు పక్కనే కుండలిలో చూడవచ్చు.

ఆ తేదీకి ఆ సమయానికి ఉన్న ఇతర జ్యోతిష్యవివరాలు ఇవి:
సంవత్సరం:శ్రీముఖ.
తిధి:శ్రావణ బహుళ అష్టమి.
వారం:శనివారం
యోగం:హర్షణ
కరణం:బలవ
హోర:శుక్రహోర

ఈ జాతకం ఒక పరిపూర్ణ అవతార పురుషుని జాతకాన్ని ప్రతిబింబించడం లేదని నేననుకుంటున్నాను.

ఎలా ఈ నిర్ధారణకు వచ్చానో కొంచం వివరిస్తాను.

భగవంతుని అవతారాలలో ఖచ్చితమైన జననవివరాలు మనకు దొరుకుతున్న ఒకే ఒక్క జాతకం శ్రీ రామకృష్ణులది మాత్రమే."అవతార వరిష్ఠాయ(అవతారములలో నీవు వరిష్ఠుడవు)" అని శ్రీరామకృష్ణ స్తోత్రంలో వివేకానందస్వామి అంటారు.

శ్రీరామకృష్ణుల జాతకంలో కుజ,శుక్ర,శని,రాహు,కేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి.రవి,బుధ,చంద్రులు లగ్నంలో ఉన్నారు.గురువు తన ఉచ్ఛస్థితికి దగ్గరగా ఉన్నాడు.అంటే దాదాపుగా ఆరు గ్రహాలు ఉచ్ఛస్థితిలోనూ మిగతా మూడు గ్రహాలు లగ్నంలోనూ ఉన్నాయి.

వివేకానందస్వామి,బ్రహ్మానందస్వామి, శారదానందస్వామి,శివానందస్వామి,
అఖండానందస్వామి,మాస్టర్ మహాశయ మొదలైన ఎందఱో మహనీయులు ఇలా అంటారు.

"అత్యున్నత ఆధ్యాత్మికతకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక కొలబద్ద గురుదేవుని జీవితమే.ఆయన జీవితంలో అత్యున్నతమైన ఆధ్యాత్మికత తన మహావైశాల్యంతో బహుముఖ ప్రతిభతో దర్శనమిస్తుంది.ఆయన జీవితం అనే గీటురాయి మీద గీచి,ఒకరిది నిజమైన ఆధ్యాత్మికతా కాదా అనే విషయం తేలికగా నిర్ధారించుకోవచ్చు."

శ్రీ రామకృష్ణుని జాతకం చూస్తే, ఒక అవతారపురుషుని జాతకం అనేది ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది.కనుక ఈ కొలబద్ద మీద కొలిచి మనకు దొరుకుతున్న అనేక శ్రీకృష్ణ జనన తేదీలను పరిశీలిస్తే సరిపోతుంది.మిగతా జాతకాలను శ్రీరామకృష్ణుని జాతకంతో పోల్చి చూచినప్పుడు అవి ఒక అవతారమూర్తి జాతకాలా కాదా అనే విషయం తేలికగా చెప్పెయవచ్చు.

ఇది నేననుసరించే ఒక నావెల్ మెథడ్.

దీనికి చారిత్రిక ప్రామాణికత ఉండకపోవచ్చు.సైంటిఫిక్ ప్రామాణికత ఉండకపోవచ్చు.ఆధ్యాత్మిక ప్రామాణికత మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మిగిలిన అన్నింటికంటే ఉత్తమమైనది గనుక ఈ పధ్ధతి చాల సరియైనది అని నేను భావిస్తాను.

ఇక ఈ జాతకం పైన కొద్దిగా దృష్టి సారిద్దాం.

ఇదే కృష్ణుని అసలైన జనన సమయం అని వాదించేవారివీ,వారి ప్రతికూల వర్గానివీ కూడా అభిప్రాయాలను పరిశీలిద్దాం.

నేను న్యాయశాస్త్రం చదివాను గనుక రెండువైపులా నేనే వాదిస్తాను.

అనుకూల వర్గం:-

1) శ్రీకృష్ణుడు చంద్రవంశపు రాజు గనుక చంద్రుడు ఆయన లగ్నంలో ఉచ్ఛస్థితిలో ఉండటం కరెక్ట్ గా ఉన్నది.

2) తిధీ(శ్రావణ బహుళ అష్టమి), నక్షత్రమూ(రోహిణి) సరిపోయాయి.

3) తృతీయాధిపతి చంద్రుడు గనుక దగ్గర ప్రయాణాలు తరచుగా చెయ్యడమూ,తన వాక్చాతుర్యంతో నలుగురినీ సమ్మోహింప చెయ్యడమూ సరిపోయాయి.శ్రీకృష్ణుని జీవితమంతా ద్వారకకూ మధురకూ హస్తినాపురానికీ ఇంద్రప్రస్థానికీ మధ్యన అటూఇటూ తిరగడమే సరిపోయింది.

4) రాహువూ కుజుడూ శుక్రుడూ పరాక్రమానికి చిహ్నమైన తృతీయంలో ఉండటం వల్లనూ అక్కడనుంచి రాహుదృష్టి సప్తమం మీద పడినందువల్లనూ కుజునికి ఇది నీచస్థితి కావడం వల్లనూ,అంతమంది ప్రియురాళ్ళనూ భార్యలనూ కలిగి ఉన్నాడు.

5) చతుర్దంలో స్వక్షేత్రంలో ఉన్న సూర్యుని దృష్టి దశమం మీద పడుతూ ఈయనొక రాజవంశానికి చెందిన వ్యక్తి అని చెబుతున్నది.

6) పంచమంలో పంచమాధిపతి బుధుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్లనూ అష్టమాధిపతి గురువుతో కలసి ఉండటం వల్ల మతసంబంధ మార్మిక విషయాలలో మహా తెలివైనవాడనీ,మంత్రసిద్ధి కలిగిన వాడనీ,మాయలు చెయ్యడంలో ఘటికుడనీ తెలుస్తున్నది.

7) నవమాధిపతి శని సప్తమంలో దిగ్బలయుతుడుగా ఉండటం కూడా ఆధ్యాత్మికరంగంలో ఉన్నతస్థానాన్ని పొందిన వ్యక్తిగా సూచన ఇస్తున్నది. అంతేగాక,సంసారం చేసినా కూడా దానిమీద ఆసక్తి లేని ఒక విరక్త కర్మయోగిని ఈ యోగం సూచిస్తున్నది.

చంద్రుని మీద ఉన్న శని దృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.

8) నవమంలో ఉన్న కేతువు లోతైన ఆధ్యాత్మిక చింతననూ ధార్మికజీవితాన్నీ సూచిస్తున్నాడు.

9) ఈ జనన సమయానికి ఆయనకు చంద్ర/గురు/రాహు దశ నడుస్తున్నది. చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థితి ఉన్నాడు.గురువు జీవకారకుడు పైగా పంచమకోణంలో ఉన్నాడు.రాహువు చంద్రుని సూచిస్తున్నాడు.కనుక జనన సమయం సరిపోయింది.

10) అయిదు నుంచీ పదిహేను ఏళ్ళ వరకూ ఈయనకు కుజదశ జరిగింది. కుజుడు రాహువుతో కలసి ఆయు:స్థానంలో ఉండటం చూడవచ్చు.రాహువు మాయావీ రాక్షసుడూ.కనుక ఆ దశలో అనేక బాలారిష్టాలూ ఆయన్ను చంపాలని కుట్రపూరితంగా వచ్చిన పూతనా బకాసురుడూ శకటాసురుడూ వంటి అనేకమంది రాక్షసులతో యుద్ధాలూ జరిగాయి.

బృందావన రాసలీలా ఘట్టాలన్నీ అప్పుడే జరిగాయి.రాహు కుజ శుక్రుల కలయిక దీనిని స్పష్టంగా సూచిస్తున్నది.

కనుక దశలు సరిగ్గా సరిపోతున్నాయి.

11) మహాభారత యుద్ధం జరిగే సమయానికి శ్రీకృష్ణునకు దాదాపు 90 ఏళ్ళ వయస్సు ఉన్నది.అంటే ఆ సంవత్సరం 3137 BC అవుతుంది.అప్పుడు ఆయనకు శుక్రదశ జరుగుతున్నది.శుక్రుడు షష్టాధిపతిగా శత్రువులనూ యుద్ధాన్ని సూచిస్తున్నాడు.అదీగాక లగ్నాదిపతిగా ఉంటూ తనే చేయించిన యుద్ధాన్ని సూచిస్తున్నాడు.శుక్రుడు రాహుకుజులతో కలసి ప్రతాప సూచకమైన తృతీయంలో ఉండటంవల్ల ఆ యుద్ధం అనేక కుట్రలతో కుతంత్రాలతో జరిగిందన్న సూచన సరిగ్గా సరిపోతున్నది.

12) శ్రీకృష్ణ నిర్యాణ తేదీగా చెప్పబడుతున్న 18-2-3102 BC అనే తేదీ గ్రెగేరియన్ కాలెండర్ లొకి మారిస్తే 23-1-3101 BC అవుతుంది.

ఆ సమయానికి ఆయన జీవితంలో కుజ/రాహు/కేతుదశ నడిచింది.కుజుడూ రాహువూ ఆయు:స్థానంలో ఉన్నారు.కనుక ఒక వేటగాని చేతిలో దుర్మరణం పాలయ్యాడు.అంతేగాక ముసలం పుట్టి తనవారందరూ కూడా తన కళ్ళముందే త్రాగి కొట్టుకుని చచ్చారు.ఇది శపితయోగదశ.అందుకే ఋషి శాపం వల్ల యాదవవంశ నాశనం సరిగ్గా ఈ సమయంలోనే జరిగింది. 

13) ఒకవేళ ప్లానెటేరియం సాఫ్ట్ వేర్ చూపినట్లుగా 3067 BC లో మహాభారత యుద్ధం జరిగితే,ఆ సమయానికి ఈ జాతకునికి గురు/శుక్ర దశలో గురు,శని విదశలు జరిగాయి.యుద్ధ సూచనా సర్వనాశన సూచనా స్పష్టంగా ఉన్నది.

కనుక ఆయన జీవితం అంతా కరెక్ట్ గా సరిపోయింది. 

ఇప్పుడు వీరి ప్రతికూల వాదుల అభిప్రాయాలు విందాం.

ప్రతికూల వాదనలు 

14) ఒక పరిపూర్ణావతారానికి ఉండవలసిన లక్షణాలు ఈ జాతకానికి లేవు.చంద్రుడు ఒక్కడు ఉచ్చస్థితిలో ఉన్నంతమాత్రాన ఇది అవతార పురుషుని జాతకం అని చెప్పలేము.

15) స్థిరరాశి అయిన చతుర్దంలో ఉన్న రవివల్ల ఇద్దరు తల్లులు సూచింప బడటం లేదు.

16) సప్తమం శనికి దిగ్బలమే.కానీ అది శత్రుస్థానం అయ్యింది.కనుక పూర్ణాయుష్షు సూచన ఈ జాతకంలో లేదు.ఆయు: కారకుడైన శని యొక్క మారకరాశి స్థితి, కృష్ణుని నూరేళ్ళ పైబడిన జీవితాన్ని స్పష్టంగా సూచించడం లేదు.

17) లగ్నాధిపతి తృతీయంలో నీచకుజ రాహువులతో కలసి ఉండటం అనేది పూర్ణాయుష్షు యొక్క సూచన కాదు.

18) పంచమంలో ఉచ్ఛబుధునితో కూడిన గురువూ,నవమంలో కేతువూ ఉండటమూ,లగ్నారూడాధిపతి లగ్నంలో ఉచ్చస్థితిలో ఉండటమూ పంచమంలో కేతువూ నవమంలో ఉచ్ఛచంద్రుడూ ఉండటం ఒక ఉన్నత ఆధ్యాత్మిక జాతకాన్నే సూచిస్తున్నది.

కానీ అవతారపురుషుని స్థాయి జాతకాన్ని సూచించడం లేదు.

19) సప్తమశనివల్ల అందవికారమైన ఆకారమూ,వివాహం ఆలస్యం కావడమూ, లేదా తనకంటే వయస్సులో చాలా పెద్దవారితో గానీ,పెద్దవారుగా కనపడేవారితో కానీ,అంగవికలురతో గానీ,కురూపులతో గానీ వివాహం కావాలి.కానీ కృష్ణుని యొక్క పరిస్థితి అదికాదు.ఆయన స్వతహాగా మహా అందగాడు.ఆయన భార్యలూ ప్రియురాళ్ళూ అందరూ మహా అందగత్తెలే.పైగా ఆయన ప్రేమ వ్యవహారాలన్నీ జీవితంలో చాలా చిన్న వయస్సులోనే మొదలయ్యాయి.కనుక సప్తమ శని స్థితి ఈ వివరాలతో సరిపోవడం లేదు.

20) అన్నింటినీ మించి, కృష్ణ జనన సమయంలో వ్యాసమహర్షి చెప్పినట్లు -'అన్ని గ్రహములూ వాటివాటి శుభస్థానములలో ఉండగా'- అన్న పరిస్థితి ఈ జాతకంలో కనిపించడం లేదు.

21) చంద్ర/గురు/రాహుదశ నడుస్తున్నపుడు ఈయన జన్మిస్తే,ఆయన జనన సమయంలో ఉన్నట్టి ప్రతికూల భయానక పరిస్థితులనూ కారాగారంలో ఆయన పుట్టడాన్నీ ఈ దశ స్పష్టంగా చూపడం లేదు.

కనుక ఈ సమయం సరియైన కృష్ణ జన్మసమయం అని చెప్పలేము.

ఇవి-రెండు వైపులవారి వాదనలు.

ఇప్పుడు ఇంకా కొన్ని ఇతర తేదీలు ఏమంటున్నాయో చూద్దాం.

(ఇంకా ఉన్నది)