Human ignorance is incurable

17, నవంబర్ 2013, ఆదివారం

శబరిమల వెళ్ళాలి చందాలివ్వండి

మొన్నొకరోజున ఏదోపని మీద వెళ్ళి ఇంటికి తిరిగివచ్చి లోనికి వెళ్లబోతుండగా వెనకనుంచి ఎవరో పిలిచినట్లు అయితే చూచాను.ఒక అయ్యప్పవేషధారి నిలబడి ఉన్నాడు.అతను అప్పటివరకూ ఒక ఇంటిముందు నిలబడి యాచిస్తున్నట్లుగా ఉన్నాడు.నన్ను చూచి గబగబా నావైపు వచ్చి చెయ్యి చాచాడు.

నేనతని ముఖంలోకి తాపీగా చూచాను.

అతనికి 30-40 మధ్యలో ఉంటాయి.మనిషిని చూస్తే పేదవాడి చాయలు కనిపించడం లేదు.కొంచం ఘరానాగానే ఉన్నాడు.

'ఏమిటి?' అడిగాను.

ఉపోద్ఘాతంతో సమయం వృధా చెయ్యడం ఎందుకనుకున్నాడో ఏమో,అతను సరాసరి విషయంలోకి వచ్చేశాడు.

'శబరిమల వెళ్ళాలి డబ్బులు తక్కువైనాయి' అన్నాడు క్లుప్తంగా.

'దానికి నేనేం చెయ్యను?' అడిగాను.

'చందా ఇవ్వండి' అన్నాడు.

'నువ్వు శబరిమల వెళ్తుంటే నేనెందుకు డబ్బులివ్వాలి.నిన్నక్కడికి వెళ్ళమని నేనేమీ చెప్పలేదు కదా?' అడిగాను.

చాలా కోపంగా చూచాడు.

'అందరూ ఇస్తున్నారు?' అన్నాడు.

'అందరూ ఇస్తే నేనెందుకు ఇవ్వాలి?' అడిగాను.

అతనికి అసహనం ఇంకా పెరిగిపోయింది.

'మీకు తోచినంత ఇవ్వండి' అన్నాడు.

'నాకేమీ తోచడం లేదు' అన్నాను.

అతను ఒక్కసారి బరస్ట్ అయిపోయాడు.

'నువ్వు నరకానికి పోతావ్' అన్నాడు ఏకవచనంలోకి దిగుతూ.

నాకు భలే నవ్వొచ్చింది.అతన్ని చూచి జాలీ కలిగింది.

'చూడమ్మా బుచ్చిబాబు.నీలా పిల్లిశాపాలు చాలామంది నాకు పెట్టారు.ఒక్కటీ తగల్లేదు.తగలవు కూడా.ఒక విషయం విను.నీకు నిజంగా ఆకలిగా ఉంటే భోజనం పెడతాను తిను.అంతేగాని నీకు డబ్బులివ్వను.అదే మళ్ళీ రెండోసారి అయితే అదీపెట్టను.నీకు దీక్ష ముఖ్యమైతే నడిచివెళ్ళు.నల్లగుడ్డలు వేసుకున్నంత మాత్రాన అడుక్కోడానికి ఒక లైసెన్స్ అనుకోకు.పని చూసుకో.నీలాంటి సోమరిపోతులకు నేను సాయం చెయ్యను.' అని చెప్పాను.

ఇదంతా చూస్తున్న మా ఫ్రెండ్ అడిగాడు.

'అంత వాదనెందుకు? ఎంతో కొంత ఇస్తే వాడే పోతాడుగా?'

'నేనలా చెయ్యలేను.' చెప్పాను.

'పోనీ నీ హితబోధ వల్ల వాడేమైనా మారుతాడా?'

'అతను మారాలనీ మార్చాలనీ కాదు నా ప్రయత్నం.మతాన్నో దేవుడినో బూచిగా చూపి ఆడుకోవాలని చూస్తే అందరూ లొంగరన్న విషయం అతనికి తెలియాలి.అంతే.' చెప్పాను.

తానొక ఘోరమైన దోషిననీ,పాపిననీ భయంకరమైన గిల్టీ ఫీలింగ్ అంతరాంతరాలలో ఉన్నవారే శరీరాన్ని ఇలా హింసపెట్టుకునే దీక్షలు చేస్తుంటారు.శరీరాన్ని ఎంత హింస పెట్టుకుంటే అంతపుణ్యం వస్తుందని ఏ దేవుడూ ఎక్కడా చెప్పినట్లు దాఖలాలు లేవు.

మన దేశంలో ప్రతిదీ ఎదుటివాడిని దోచుకోవడానికి ఒక లైసెన్స్ అయిపోతుంది.చివరకు దేవుడిని కూడా మనం ఒదలం.రోడ్డుమీద పెట్టి రూపాయికి అమ్మిపారేస్తాం.అందులోనూ కాపీరైట్ హక్కులూ రిజిస్టర్డ్ దేవుడూ కాకపోతే ఆ దేవుడిపని అధోగతే.ప్రతివాడూ ఒక గుడికట్టేసి వ్యాపారం మొదలు పెట్టేస్తాడు.షిర్డీ సాయిబాబాకు ప్రస్తుతం అదేగతి పట్టింది.

రైల్వే స్టేషన్ దగ్గర పేవ్ మెంట్ మీద తెల్లవారేసరికి ఒకసారి సాయిబాబా ప్రతిమ వెలిసింది.చిన్నగా దానిమీద ఒక చిన్నగుడి లేచింది.రెండేళ్లు గడిచేసరికి అదే పేవ్మెంట్ మీద ఒక చిన్న శివలింగమూ నందీ వెలిశాయి.ఇదిచూచి పక్కనే ఉన్న ఒకచెట్టుకి కొన్ని ఆకుపచ్చ జెండాలు రాత్రికిరాత్రే వచ్చి చుట్టుకున్నాయి. ప్రస్తుతం అదొక సర్వమతసమానత్వ మందిరం అయిపోయింది.దానిని మొదలుపెట్టిన ఆసామీ ఒక కుర్చీ వేసుకుని రోడ్డు మీదే కూచుంటాడు.భక్తులు క్యూ కడుతున్నారు.మొక్కులు చెల్లిస్తున్నారు.ట్రాఫిక్ మొత్తం వేరే సందులోనుంచి తిరిగిపోతున్నది.ఇక దీక్షలు ఒక్కటే తక్కువ.త్వరలో అవీ మొదలౌతాయి.స్పెషల్ బస్సులు మొదలౌతాయి.స్పెషల్ రైళ్ళూ రంగంలోకి దిగుతాయి.అదొక గొప్ప పుణ్యక్షేత్రం అయిపోతుంది.మనుషులు అజ్ఞానంలో ఇంకాఇంకా కూరుకుపోతూ అదేదో గొప్ప మతాచరణగా భావిస్తూ ఉంటారు. మనదేశంలోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ ప్రతిచోటా ఇదే తతంగం నడుస్తూ ఉంటుంది.

ఇరవైఏళ్లక్రితం నాకొక మిత్రుడుండేవాడు.ఆయన అయ్యప్పకు వీరాతివీరభక్తుడు.విజయవాడ నుంచి శబరిమలకు నడిచి పొయ్యేవాడు.అలా చాలాసార్లు వెళ్లాడు.శరీరాన్ని అంతగా హింస పెట్టుకున్నప్పటికీ ఆయనకు తృప్తి కలగలేదు.ఒకసారి రూటు మార్చాడు.విజయవాడ నుంచి కాశీకి కాలినడకన వెళ్ళి అక్కడనుంచి శబరిమలకు కాలినడకన వెళ్ళి అక్కణ్ణించి విజయవాడకు నడిచి వచ్చాడు.ఇదంతా జరగడానికి నాలుగైదు నెలలు పట్టేది.మధ్యమధ్యలో మజిలీలు చేసుకుంటూ వెళ్ళేవాడు.తన వస్తువులన్నీ భుజాన కావడి కట్టుకుని దానికి గంటలు తగిలించి పెద్దవేషంతో నడుస్తూ వెళ్ళేవాడు.దారిలో కుక్కలు వెంటపడేవి.వాటిని తోలడానికీ,నడకలో ఊతానికీ చేతిలో ఒకకర్ర ఉండేది.

చూచీ చూచీ ఒకసారి ఆయన్ను ఇలా అడిగాను.

'ఎందుకు శరీరాన్ని అంత హింస పెడుతున్నారు?దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నారు?ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఇదంతా అవసరమా?'

'ఆత్మజ్ఞానం కోసం కాదు.నేననుకున్న కొన్ని పనులుకావడం కోసం ఇలా చేస్తున్నాను.'

'ఇలా చేస్తే ఆ పనులు అవుతాయని ఎక్కడైనా ఎవరైనా చెప్పారా?'

'లేదు.నేనే అనుకొని దీక్షపూని చేస్తున్నాను.'

'మీరనుకున్నది సత్యమే అవ్వాలని ఎక్కడుంది?కానప్పుడు మీరు అసత్యాన్ని అనుసరిస్తున్నట్లే కదా?' అడిగాను.

జవాబు లేదు.

జనాల దీక్షలన్నీ ఇంతే.వాటికి ఒక రీజనూ రైమూ ఉండదు.'అనుకొని' చేసేస్తుంటారు.ఆ అనుకోవడానికి ఆధారం ఏమిటన్నది ఎవరూ చెప్పలేరు. నిరాధారమైన నమ్మకాలూ,'ఇలాచేస్తే మాకు పనైంది,బాగుపడ్డాము'అని ఇతరులు చెప్పడమూ వారిని నడిపిస్తాయి.అంతేగాని ఆలోచనా,తర్కమూ నడిపించవు.అందుకే ఇవన్నీ అసలు దీక్షలేకాదనీ వీటివల్ల పరమప్రయోజనం అంటూ ఏదీ ఉండదనీ నేనంటాను.

వీరి జీవితాలలో ఉన్నతమైన మార్పులుకూడా రావు.పైన చెప్పిన మా మిత్రుడు మామూలు రోజుల్లో మంచి పేకాటవీరుడు.సిట్టింగ్ లో కూచుంటే మూడురోజులైనా ఆడుతూనే ఉండేవాడు.ఒక్కోసారి ఒంటిమీద ఉంగరాలూ వాచీ మొదలైనవి కూడా ఆటలోపెట్టి ఓడిపోయి ధర్మరాజులాగా కట్టుబట్టలతో ఇంటికి చేరినరోజులు ఎన్నో ఉన్నాయి.ఇలాంటి వాళ్ళు దీక్షలంటూ వెఱ్ఱి వేషాలు వేస్తుంటే నాకు నవ్వూ జాలీ ఒకేసారి వస్తుంటాయి.

నిన్న ఒక ఊరినుంచి శబరీ ఎక్స్ ప్రెస్ లో గుంటూరుకు వస్తున్నాను.అందులో హైదరాబాద్ నుంచి శబరీమల వెళ్ళే యాత్రీకులు ఎక్కువ.ఒకడు పై బెర్త్ లో నిద్రపోతున్నాడు.గుంటూరు స్టేషన్ వస్తున్నది లేచి స్నానం చెయ్యమని ఇంకొకడు అతన్ని లేపుతున్నాడు.ఆ క్రమంలో మాటామాటా పెరిగి వాళ్ళిద్దరూ ఘోరంగా తిట్టుకున్నారు.అయితే మాటమాటకూ తిట్టుతిట్టుకూ మధ్య స్వామీ స్వామీ అని అనుకుంటున్నారు.ఇదొక వింత ప్రహసనం.ఇక ఈదీక్షలు ఎందుకో అసలు ఇవేమి దీక్షలో నాకేమీ అర్ధం కాలేదు.

ఎన్ని పల్టీలు కొట్టినా,దేవుడనేవాడు మనిషికి ఎందుకు కనపడడో నాకు బాగా తెలుసు.ఎందుకంటే,కనిపిస్తే దేవుడిని రోడ్డుమీద నిలబెట్టి 'భలేమంచి చౌక బేరమూ...'అంటూ అమ్మేస్తాడు మనిషి.దానికి భయపడే దేవుడు మనిషికి కనపడకుండా దాక్కుంటున్నాడు.

మనిషి అజ్ఞానానికి బానిసగా ఉన్నంతవరకూ వెఱ్ఱిదీక్షలూ,మతవ్యాపారాలూ సాగుతూనే ఉంటాయి.నిజమైన మతం మనిషికి అందనంత ఎత్తులో ఉంటూనే ఉంటుంది.నిత్యజీవితంలో సక్రమంగా బ్రతికేవాడికి ఏ దీక్షలూ అవసరం లేదు....ఒక్క ఆత్మదీక్ష తప్ప.