The secret of spiritual life lies in living it every minute of your life

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

శిరిడీ సాయి

చాలా రోజుల తర్వాత ధియేటర్ కెళ్ళి ఒక తెలుగుసినిమా చూచాను. ఆంధ్రాలో షిరిడీ సాయిబాబాకున్న క్రేజ్ వల్ల ఆ సినిమా హిట్ అవుతుందని ముందే అనుకున్నారు. అయితే ఏ స్థాయిలో హిట్ అవుతుందో ఊహించడం జనానికి కష్టం అయింది. బాగుందని చాలామంది చెప్తేతప్ప నేను సామాన్యంగా నేటి తెలుగుసినిమాలు చూచే ధైర్యం చెయ్యను. అదే విధంగా ఈ సినిమా గురించి అడిగినప్పుడు, కొందరు చాలా బాగుందనీ, కొందరు బాగుందనీ అన్నారేగాని, బాగులేదని ఒక్కరూ అనలేదు. సరే పరవాలేదు చూడొచ్చు అని ధైర్యం వచ్చింది.

బాబా మీద ఇప్పటికే చాలా భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. హిందీలో మరాటీలో పాతకాలంలో వచ్చిన సినిమాలు కొన్ని చాలా బాగున్నాయి. వాటిలో ఒక మరాటీ సినిమా నాకు బాగా నచ్చింది. ఎప్పుడో పదేళ్ళ క్రితం దాన్ని దూరదర్శన్లో చూచాను. అది తెలుపు నలుపు చిత్రం. అందులో బాబాగా నటించిన వ్యక్తి ఎవరోగాని అద్భుతంగా నటించాడు. తెలుగులో కూడా విజయచందర్ ఒక సినిమా తీశాడు. అది బాగానే హిట్ అయ్యింది. అందులో జేసుదాస్ పాడిన పాటలు ఇప్పటికీ అనేక మైకుల్లోంచి వినిపిస్తూ ఉంటాయి.వాటి ముందు ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాను. చూచాక ఒక్కటే అనిపించింది. సినిమా బాగానే ఉంది. నిరాశపరిచేటట్లు అయితే లేదు. అయితే మరీ గొప్పగా మాత్రం లేదు.

బాబా పుట్టు పూర్వోత్తరాలను చూపించకుండా సరాసరి ఆయన పదిహేను పదహారు ఏళ్ళ వయసులో శిరిడీకి వచ్చిన సీన్ తో మొదలు పెట్టారు. దానికి భూమికగా బాబాను దత్తాత్రెయుని అవతారంగా భావించే లోకనమ్మకాన్ని బాపూ బొమ్మలలో చూపించారు. అది నిజం కాకపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉన్నది. మన దేశంలో, మహారాష్ట్రలో మాత్రమె దత్తాత్రేయుని ఎక్కువగా పూజిస్తారు. కనుక అక్కడి మహనీయులను అందరినీ దత్తాత్రేయ అవతారాలుగా భావించడం సహజం. కానీ బాబా ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. అది జనాలు సృష్టించిన ఒకకధ మాత్రమే అని నా వ్యక్తిగత అభిప్రాయం. రమణమహర్షిని కూడా కుమారస్వామి అవతారం అని ఆయన శిష్యులు కొందరు ఒకకధ అల్లారు. యధాప్రకారం ఆయనకూడా దానిని ఎక్కడా నిర్ధారించలేదు. మనుషుల అజ్ఞానం చూచి వారు చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు. దానిని వారి సమ్మతిగా తీసుకుని పిచ్చిజనం కధలు అల్లుకొని ఆనందిస్తారు. ఏదో ఒక అవతారానికి ముడి పెట్టకపోతే జనాలకు వారి గురువులు గురువులుగా కనిపించరు. మనుషులలో ఇదొక బలహీనత.

తన తల్లిదండ్రులు బ్రాహ్మణులు అని బాబా చివరిరోజుల్లో తన అంతరంగ భక్తులలో కొందరికి చెప్పినట్లు కధలున్నాయి. కాని అందరు భక్తులూ దీనిని ఒప్పుకోలేదు. తన గురువు 'వెంకూసా' అని మాత్రం బాబా కొన్ని చోట్ల చెప్పారు. సెలూ గ్రామంలో తన మూలాలున్నాయని కూడా ఒకసారి అన్నారని చెబుతారు. అది పట్టుకొని దాసగణు అక్కడికి వెళ్ళినా పెద్దగా సమాచారం ఏమీ ఆయనకు దొరకలేదు. బాబా పుట్టుపూర్వోత్తరాలు చరిత్రలో కలిసిపోయి ఉన్నాయి. అవి ఇదమిద్ధంగా ఎవరికీ తెలియవు. బాబా కూడా తనగురించి ఏమీ చెప్పలేదు. చెప్పిన కొన్ని మాటలూ మార్మికంగా ఉండి అర్ధం చేసుకోవడం కష్టమైన రీతిలోనే ఆయన చెప్పారు. అందుకేనేమో వాటిని ఒదిలేసి పురాణప్రామాణికతను తెరపైకి తీసుకొచ్చారు. దత్తాత్రేయుని అవతారాలు అయిదు అని చూపినప్పటికీ మిగిలిన నాలుగు ఎవరో చెబితే బాగుండేది. అయితే సాయిభక్తులకు వారెవరో తెలుసనుకోండి. అది వేరే సంగతి.

కొన్నాళ్ళు శిరిడీలో ఉండి మాయమైన బాబా, హిమాలయాలలో తిరిగినట్లు అక్కడ రకరకాల మతస్తులతో కలిసి వారి మతాలను అధ్యయనం చేసినట్లు చూపించడం బాగులేదు. ఇది నిజంగా జరిగినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. ఆ సమయంలో అయన కొందరు ఫకీర్లతో సాదువులతో తిరిగినట్లు అంటారు. కాని హిమాలయాలకు వెళ్ళినట్లు ఎక్కడా వ్రాసిలేదు. సినిమా కోసం అలా మార్చి ఉండవచ్చు.

తన గురువు వెంకూసా శిక్షణలో తాను ఎలా సాధన చేసినదీ బాబా కొన్ని సందర్భాలలో చెప్పారు. బావిలో తలక్రిందులుగా వేలాడడం అందులో ఒకటి. వాటినీ చూపించలేదు. ఒక స్త్రీని కామదృష్టితో చూచినందుకు శిక్షగా వెంకూసా తన కళ్ళను తానె పోడుచుకున్నాడని ఒక గాధ ఉన్నది. అదీ చూపించలేదు. బాబా ఖండయోగాన్ని, పేగులను కక్కి వాటిని శుభ్రం చేసుకునే హటయోగవిద్యనూ ఎక్కడ నేర్చుకున్నారో కూడా చూపించలేదు.  బాబా శిరిడీకి వచ్చిన కొన్నేళ్ళకు, ఒక ముస్లిం పహిల్వాన్ తో కుస్తీ పోటీలో పాల్గొంటాడు. అందులో బాబా ఓడిపోతాడు. అంతకు ముందు బాబా వేషం ఒక సైనికుని వేషంలాగా ఉండేది. ఆ తర్వాత ప్రస్తుతం అందరూ చూచే సూఫీవేషంలోకి ఆయన మారుతాడు. ఈ విషయాలేవీ సినిమాలో చూపలేదు. అనవసరంగా రీళ్లు పెరుగుతాయనీ, వాటిని చూపడం వల్ల అసలుకధకు ఉపయోగం లేదనీ భావించి ఉండవచ్చు.

సినిమాలో నాకు నచ్చిన రెండు విషయాలు. ఒకటి బాబా మహిమలమీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఆయన తత్వాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసారు. ఇది మంచి పరిణామం. బాబా చేసిన మహిమల కంటే, మన పిచ్చిజనానికి బాబా తత్త్వం తెలియవలసిన అవసరం ఎక్కువగా ఉన్నది. బాబా ఏ విధంగా జీవించాడు, మనుషులని ఏ విధంగా జీవించమన్నాడు అన్న విషయాల మీద ప్రస్తుతం ఫోకస్ ఎక్కువగా కావాలి. అది తెలీకపోబట్టే జనం ఆయన్ని కోరికలు తీర్చే యంత్రంగా ప్రస్తుతం భావిస్తున్నారు. అందుకనే సాయిబాబా భక్తుల నిత్యజీవితాలలో పెద్దగా ఔన్నత్యం ఏమీ కనిపించదు. 

మనం ఎలా జీవించినా పరవాలేదు ఆయన్ని నమ్ముకుంటే చాలు మన కోరికలు తీరుతాయి అన్న భావన నేడు సమాజంలో ప్రబలంగా ఉంది. ఇది పూర్తిగా నిరాధారమైన తప్పు భావన. బాబా ఎక్కడా అలా చెప్పలేదు. బాబా మహిమల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, ఆయన తత్వాన్ని భావాలనూ వివరించే దిశగా ప్రయత్నం చేసిన నిర్మాతా దర్శకుడూ అందుకే అభినందనీయులు. లేకపోతే కొన్నాళ్ళకి 'హిందూ జీసస్' గా బాబా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ పోకడలు మన సమాజంలో బాగా ఎక్కువైనాయి.

ఇక నాకు నచ్చిన రెండో విషయం. బాబాను దేవునిగా చూపకపోవడం. 'నేను దేవుణ్ణికాను ఆయన ప్రతినిధిని మాత్రమే' అని ఒక డైలాగ్ ఆయనచేత చెప్పించారు. ఇది వాస్తవికతకు దగ్గరగా ఉన్నది. ముస్లింలుగానీ సూఫీగురువులు గానీ బాబాను దైవంగా భావించరు. ఆయన్ను ఒక గొప్ప సద్గురువుగా మాత్రమె వారు భావిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బాబా జీవించి ఉన్నపుడు ఆయనను దర్శించిన ఇతర మహనీయులు ఆయన్ను 'ఒక అమూల్యమైన మణి'గా మాత్రమే సంబోధించారు అన్న విషయమూ గమనార్హమే. బాబా స్వయంగా తాను దేవుని సేవకుణ్ణి అన్న విషయం చాలా చోట్ల చెబుతారు. అంతే కానీ తానే దైవాన్ని అని చెప్పిన దాఖలాలు లేవు.ఒకవేళ ఉంటే అవి భక్తుల సృష్టే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. "కబీర్ పంధా" కు చెందిన బాబా ఎన్నటికీ అలా చెప్పడు అని నా నమ్మకం. 

గురువును దైవంగా భావించమని మన గ్రంధాలు చెప్పినమాట నిజమే. అయితే అవి ఎందుకు చెప్పాయి? గురువాక్యాన్ని దైవాదేశంగా భావించి మారుమాట్లాడకుండా దానిని ఆచరించమని వాటి ఉద్దేశం.కాని జనులేం  చేస్తున్నారు? సాధనలో తమ బాధ్యతనుండి తప్పుకోవడానికి, గురువును దైవాన్ని చేసి కూచోబెట్టి, ఆయనకు హారతులు ఇచ్చి అష్టోత్తరాలు చదివి 'అంతా అయిపొయింది,ఇక మనం చెయ్యవలసిన పని ఏమీ లేదు.అంతా  బాబాయే చూచుకుంటాడు' అన్న భ్రమలో, తమ ఇష్టం వచ్చిన జీవితాలు తాము జీవిస్తూ, దొంగల్లా బతుకుతున్నారు. లేకపోతే వారి అవినీతి సోమ్ముతో ఆయనకు కిరీటాలు చేయిస్తున్నారు. అంతేగాని ఆయన ఎలా జీవించమని చెప్పాడో దాన్ని మాత్రం ఎవరూ పాటించరు. సద్గురువులకు కావలసింది మన పూజలు కావు. వారు చెప్పిన రీతిలో మనం జీవించడం కావాలి. వారు సూచించిన మార్గంలో మనం నడవడం కావాలి. వారు చూపుతున్న గమ్యాన్ని మనం చేరడం కావాలి. అది మాత్రం ఎవరూ చెయ్యరు. పూజలు మాత్రం విపరీతంగా చేస్తారు. ఇదే వింతల్లో కెల్ల పెద్ద వింత. సరే ఈ సంగతులు అలా ఉంచి మళ్ళీ సినిమాలోకోద్దాం.

కామెడీ ట్రాక్ చాలా అద్వాన్నంగా, కొన్నిచోట్ల చాలా అసహ్యంగా ఉంది. సినిమా మొత్తం మీద బాగా చేసిన నటులు నాగార్జున,సాయికుమార్, శ్రీహరి మాత్రమే. నాగార్జున వాయిస్ పేలవంగా ఉంటుంది. యోగుల స్వరంలో ఉండే సహజ మాధుర్యం నాగార్జున గొంతులో పలకలేదు. అయినప్పటికీ నాగార్జున  కష్టపడి నటించాడనే చెప్పాలి. అందరిలోకీ సాయికుమార్, శ్రీహరీ మాత్రం చాలా బాగా చేశారు. లేడీ ఆర్టిస్టులు నటించడానికి వారికి పెద్దగా అవకాశం లేదు.

బాబా మూడురోజుల పాటు సమాధిలోకి వెళ్ళినపుడు ఏమి జరిగింది? ఆయన ఎక్కడికి వెళ్లాడు? ఆ సమయంలో ఏమి చేశాడు? అన్న విషయాలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎవరికీ చెప్పిన దాఖలాలు లేవు. కనుక ఎవరికి తోచిన కధలు వారు అల్లుకున్నారు. అవన్నీ సత్యదూరాలే. ఈ సంఘటన 1886 డిసెంబర్ లో జరిగింది. ఆ సమయంలో బాబా ఆత్మ, దేహం చాలిస్తున్న రామకృష్ణుని కలుసుకోవడానికి వెళ్ళింది అని ఒక ఆంధ్రాగురువు  ఒక పుస్తకంలో వ్రాశాడు.అది నిజం కాదు.ఎందుకంటే రామకృష్ణుడు ఆగస్ట్ 15 రాత్రి దేహాన్ని వదిలేశాడు. డిసెంబర్ లో సమాధిలోకి వెళ్ళిన బాబా, ఆగస్ట్ లో మహాసమాధి చెందిన రామకృష్ణుని దేహత్యాగ సమయంలో ఎలా కలుసుకోగలడు? 

'నేను అల్లాలో లీనం అవడానికి వెళ్లాను. కాని అప్పటికే అక్కడ నా స్నేహితుడు గదాధర్ వేచి ఉన్నాడు. అందుకే నేను వెనక్కు వచ్చాను' అని బాబా అన్నట్లు ఇదే గురువు చెప్పిన ఒక కట్టుకధ ప్రచారంలో ఉంది. అసలు ఇలాంటి చవకబారు కధలు ఈ గురువులు సృష్టిస్తారో లేక వారి శిష్యులే సృష్టిస్తారో ఆ అల్లాకే ఎరుక. ఎందుకంటే సద్గురువైన వాడికి దేహం ఉన్నా పోయినా తేడా ఏమీ ఉండదు.శరీరంతో ఉన్నపుడు వారు చేసిన పనినే అది లేనప్పుడూ చెయ్యగలరు. ఇంకా చెప్పాలంటే శరీరం లేనప్పుడే వారి శక్తి ఇతోధికంగా పనిచేస్తుంది. ఇవన్నీ శరీర భావనకు అతీతులు కాలేని కొందరు సృష్టించిన కట్టుకధలు మాత్రమే. సరే, ఈ సంఘటనను కొద్దిగా మార్చి సినిమాలో కూడా చూపించారు. కాని నవ్వుతూ ప్రసన్నంగా ఉండే దక్షినేశ్వర్ కాళీవిగ్రహం బదులు భీకరంగా ఉండే పాతాళభైరవి లాంటి విగ్రహాన్ని చూపించారు. అది అతకలేదు. ఇకపోతే బాబా ఆ సమయంలో త్రిమూర్తుల లోకాలకు వెళ్లి వారి దర్శనం చేసుకున్నట్లు చూపారు.ఇదీ నిజమోకాదో ఎవరికీ తెలియదు. కాకపోతే సినిమా కోసం ఆమాత్రం కథ అల్లారేమో అని సరిపెట్టుకోవలసి వచ్చింది.

బాబా సమక్షంలో సాయంత్రం పూట ఖవ్వాలీలూ, భక్తి గీతాలూ పాడబడేవి. ఆయన వాటిని వినేవారు.ఆ విధమైన సీన్ ఒకటి పెట్టి, మంచి సూర్ దాస్ భజన ఒకటి జేసుదాస్ చేత పాడించి ఉంటే ఇంకా బాగా ఉండేది. భక్తిరసం రక్తి కట్టేది.అనవసరమైన కామెడీట్రాక్ ను ఎక్కువగా పెంచి ఇలాంటి ముఖ్యమయిన విషయాలు పక్కన పెట్టారు. అక్కడే సినిమా దెబ్బతిన్నట్లు అనిపించింది.

బాబా పరమ శాంతస్వభావుడన్నట్లు సినిమా మొత్తం చూపించారు. అది సరికాదు. కొన్నిసార్లు బాబాకు పిచ్చికోపం వచ్చేది. కొందరి మీదకు రాళ్ళు విసిరేవాడు. ఇంకొందరిమీదకు కర్రలు విసిరేవాడు. కొందరిని పిచ్చి తిట్లు తిట్టేవాడు. ఇంకొందరిని మసీదు చాయలకు రానివ్వకుండా తరిమేవాడు. కనీసం అలా నటించేవాడు. ఇవన్నీ సినిమాలో చూపించలేదు. బహుశా అవన్నీ చూపిస్తే బాబా ఇమేజ్ దెబ్బతింటుందని,బాబా భక్తులు నొచ్చుకుంటారనీ,సినిమా ప్లాప్ అయితే డబ్బులు రావనీ భయపడినట్లున్నారు.

అందుకే నేనంటాను. లోకులు నిజమైన ఆధ్యాత్మికతను ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు.తీపిగా ఉన్న అసత్యం నచ్చినట్లు వారికి చేదునిజం నచ్చదు. ఆధ్యాత్మికతను కూడా వారికి నచ్చిన కోణంలోనే వారు స్వీకరిస్తారు గాని ఉన్నదానిని ఉన్నట్లు వారు చూడలేరు.దానికి ధైర్యం కావాలి. స్వార్ధపరులైన లోకులకు అదేక్కడనుంచి వస్తుంది? నేలబారున నడిచే చీమ, ఆకాశంలో విహరించే హంసను ఎలా అర్ధం చేసుకోగలదు? డబ్బుమీద దృష్టి ఉన్న ఈ దర్శకులూ నటులూ రచయితలూ బాబా నిజతత్వాన్ని ఎలా అర్ధం చేసుకోగలరు? తమకే అర్ధంకాని దానిని సమాజానికి ఎలా చెప్పగలరు?బాబా కూడా తనిష్టమొచ్చినట్లు తానుండకూడదు. వీరిష్ట ప్రకారం ఉండాలి. లేకుంటే ఆ కోణాలు వదిలేస్తారు. 

కలెక్టర్ తో బాబా ఇంగ్లీషులో మాట్లాడటం అంతగా అతకలేదు. అసలు బాబాకు చదువు వచ్చారాదా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అలాంటిది ఒక ఆంగ్లేయ అధికారితో బాబా గడగడా ఇంగ్లీషులో మాట్లాడినట్లు చూపడం,అదీగాక దేశభక్తి మీద ఉపన్యాసం ఇప్పించడం అసహజంగా ఉన్నది. బాబా యువకునిగా ఉన్నపుడు ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో కొన్నాళ్ళు పని చేశాడని కొందరంటారు. బహుశా ఆ కోణంలో ఆయనచేత దేశభక్తి మాటలు చెప్పించి ఉండవచ్చు.

చివరిలో పాట పాడిస్తూ బాబా దేహత్యాగం చేసినట్లు చూపడం అస్సలు బాలేదు. అదీగాక మామూలుగా చనిపోయినట్లు చూపిస్తే ఏదన్నా తక్కువ అనుకున్నారో ఏమో, ఎకాఎకిని సింహాసనం ఎక్కి కూచుని ప్రస్తుత విగ్రహం ఉన్న భంగిమలో దేహత్యాగం చేసినట్లు చూపడం నవ్వు తెప్పించింది. అదీగాక చనిపోయే సమయంలో కదలలేని స్తితిలో కూడా పాక్కుంటూ కుర్చీ ఎక్కి కూచుని చనిపోయినట్లు చూపించారు.చాలా అసహ్యంగా హాస్యాస్పదంగా ఉన్నది. బాబా మామూలుగా అందరిలాగానే దేహత్యాగం చేశారు. మహనీయుల మహాసమాధి చాలా విలక్షణంగా ఉంటుంది. వారు సమాధి స్తితిలో దేహాన్ని వదిలేస్తారు. దానిని సామాన్య జనానికి అర్ధమయ్యేలా తీయడం అసంభవం. ఇదే సీన్ ఇంకా బాగా నేచురల్ గా చూపి ఉండవచ్చు. కానీ, అక్కడ బాబాకంటే హీరోగారి ఇమేజ్ ఎక్కువైనట్లు కనిపిస్తుంది. హీరో చచ్చిపోతే తెలుగు సినిమా ప్రేక్షకులు భరించలేరు. కనుక సినిమా కోసం ఇలా మార్చారులే అని దీనికీ సరిపెట్టుకోవలసి వచ్చింది.ఇలా ప్రతిదానికీ సరిపెట్టుకుంటూ ఈ సినిమా చూడాల్సి వచ్చింది. బాగా రీసెర్చ్ చేసి మరీ ఈ సినిమా తీశామని అన్నారు. ఆ రీసెర్చ్ ఏమిటో ఎక్కడా అగుపడలేదు.

కీరవాణి సంగీతం పరవాలేదు అనిపించింది. 'ఒక్కడే దేవుడు,రామనవమి చెప్పింది, పరమయోగీంద్రులకు'అన్న మూడేపాటలు బాగున్నాయి. వీటిలో కీరవాణి పాడిన 'పరమయోగీంద్రులకు పరమపదమందించు పరమపావన విష్ణుపాదం' పాట అద్భుతంగా ఉండి ఆనందబాష్పాలను రప్పించి మంచి అనుభూతిని కలిగించింది. ఎంతో భావస్ఫోరకంగా పాడినందుకు కీరవాణిని అభినందించాలి. 

మొత్తం మీద బాబా మహిమలకంటే కూడా, బాబా తత్వాన్ని జనంలోకి తీసుకెళ్ళడంలో సఫలమైతే మాత్రం ఈ సినిమా నిజమైన విజయాన్ని సాధించినట్లేనని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అతివేగంగా కుళ్ళిపోతున్న సమాజానికి అర్జెంటుగా కావలసింది అదే.