“Self service is the best service”

20, ఆగస్టు 2012, సోమవారం

ఒమర్ ఖయ్యాం జాతకం - ప్రేమతత్త్వం

ఒమర్ ఖయ్యాం 'రుబాయత్' నేను బాగా ఇష్టపడే కవితలలో ఒకటి. దీనిలోని కొన్ని మంచి పద్యాలను 'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డి గారు 'పానశాల' పేరుతో అనువాదం చేశారు. అందులో బట్టీ పట్టదగిన పద్యాలు చాలా ఉన్నాయి.చాలా పద్యాలు నాకు నోటికి వొచ్చు. దానికి కారకులు నా మిత్రుడు వెంకటాద్రిగారు. ఆయన మా నాన్న సమకాలికుడు. కాని నాకు మంచి మిత్రుడు. ప్రస్తుతం ఆయన గతించాడు. 'పానశాల' పుస్తకాన్ని ఆయనే నాకు బహూకరించాడు. ఒమర్ ఖయ్యాం తత్వాన్ని మేము గంటలు గంటలు చర్చించేవాళ్ళం. ఆయన కూడా అందులోంచి అనేక పద్యాలు గడగడా చెప్పగలిగేవాడు. ఆయన్ని చూచి నేను కూడా కొన్ని మంచిపద్యాలను కంఠస్తం చేసాను.  

పరమహంస యోగానందగారు 'రుబాయత్' కు క్రియాయోగపరంగా చేసిన వ్యాఖ్యానం కూడా ఆయనదగ్గర ఉండేది. అమెరికాలో ఉన్న తన సోదరునితో చెప్పి అక్కణ్ణించి దాన్నితెప్పించాడు. చదవమని నాకూ ఇచ్చాడు. కాని అది నాకు నచ్చలేదు.యోగానందగారు ఉమర్ ఖయ్యాం పద్యాలను చీల్చి చెండాడి క్రియాయోగానికి వాటిని అతకాలని ప్రయత్నం చెయ్యడం అందులో నాకు స్పష్టంగా కనిపించింది. కొందరు భావించినట్లుగా ఒమర్ ఖయ్యాం మార్మిక సూఫీ కావచ్చు. కాని 'రుబాయత్' లో ప్రతి పదాన్నీ క్రియాయోగానికి అతకాలని యోగానందగారు చేసిన ప్రయత్నం మాత్రం సఫలీకృతం కాలేదు. అదే మాట వెంకటాద్రిగారితో చెప్పాను. ఆయనకూ ఆ పుస్తకం చదివితే అదే అభిప్రాయం కలిగింది. ఇదంతా పదేళ్ళ క్రితం జరిగింది. సరే ఆ విషయాన్ని అలా ఉంచుదాం.

ఒమర్ ఖయ్యాం మీద ఫిట్జెరాల్డ్ నుంచి ఇప్పటిదాకా చాలామంది రీసెర్చి చేసారు. వారు చెప్పిన ప్రకారం ఆయన 18-5-1048 న ఉదయం 4-41 కి ఇరాన్ లోని నిషాపూర్ లో పుట్టాడు. ఆయన జాతకచక్రం పైన ఇచ్చాను. దానిని బట్టి ఆయన జీవిత వివరాలు చూద్దాం.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. చాలామంది నాతో అంటుంటారు. 'మీరెంతసేపూ చచ్చినవాళ్ళ జాతకాలే చూస్తున్నారు. దానికి బదులు బతికున్నవారివి చూడొచ్చు కదా, వాళ్ళకూ కొంచం ఉపయోగం ఉంటుంది' అని. బతికున్నవారి జాతకాలు కూడా నేను చూస్తాను. కాని అందరివీ చూడను. నాకిష్టమొచ్చిన జాతకాలే నేను చూస్తాను. జాతకాలు చెప్పి లోకులని ఉద్ధరించాలని, స్వార్ధపరుల కర్మ నా నెత్తికెత్తుకోవాలని నాకేమీ తపన లేదు. ప్రతిదాన్నీ బిజినెస్ ధోరణిలో చూడటం నా పద్దతి కాదు.

మహనీయుల జాతకాలు చూస్తే, వాళ్ళ జీవితాలు అధ్యయనం చేస్తే, వాళ్ళ  భావపరంపర మనలో ప్రవేశిస్తుంది. భావౌన్నత్యం కలుగుతుంది. దానికి విరుద్ధంగా స్వార్ధపరులైన మామూలు మనుషుల జాతకాలు చూస్తే వాళ్ళ కుళ్ళు మనకంటుకుంటుంది. ప్రతిదీ ఒకరకమైన ధ్యానమే. దాని ఫలితం అదిస్తుంది. అందుకే నేను అందరి జాతకాలూ చూడను. వారి గురించి ఆలోచించను. విశ్వాత్మగారు కూడా ఇదేమాట అనేవారు. ఇది నిజం కూడా. 

లోకులు చేసుకున్న ఖర్మను మనం ఎందుకు తొలగించాలి? అందరి కర్మనూ తీరుద్దామని జ్యోతిష్యజ్ఞానం ఉన్నవారు ప్రయత్నించరాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి ఆశించేవారు ఆ పని ఎన్నటికీ చెయ్యకూడదు. నిజంగా పశ్చాత్తాపం ఉండి కర్మను బాగుచేసుకుందాం అనుకున్న వారికి 'మాత్రమే'  సాయం చెయ్యొచ్చు. అంతేగాని అందరి జాతకాలూ చెప్పకూడదు. వారెలాంటివారో మీకెలా తెలుస్తుంది? అని అనుమానం రావచ్చు. ఆ మాత్రం తెలియకపోతే ఇక జాతకాన్ని దానిలోని లోతుల్ని ఎలా అర్ధం చేసుకోగలం? మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందీ లేనిదీ ఇట్టే తెలిసిపోతుంది. అందుకే కాలక్షేపానికో, సరదాగానో, లేకపోతే వీడేమి చెబుతాడో చూద్దాం అనో, అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరాదని జ్యోతిష్యశాస్త్రం నిర్దేశించింది.అహంకారులకూ స్వార్ధపరులకూ జ్యోతిశ్శాస్త్రం సాయం చెయ్యదు.

ఇక విషయంలోకొద్దాం.

ఉమర్ ఖయ్యాం జాతకంలో ముఖ్యంగా కనిపించేది లగ్నంలో బుధశుక్రుల డిగ్రీ కంజంక్షన్. దానివల్ల ఇతర విషయాలకు తోడూ, ఆయనలో కవితాశక్తి ఎక్కువగా ఉంది. బుధుని వక్రతవల్లా పంచమాదిపత్యం వల్లా అది ఆధ్యాత్మికత వైపు దారితీసింది. అయితే శుక్రుని వక్రత తోడవడంవల్లా, పంచమంలో రాహువుస్తితివల్లా అది సూటిగా కాకుండా మార్మికభాషలో చెప్పబడింది. 

పంచమరాహువు వల్ల ఆయన ఇస్లాంని కూడా చాందసంగా పాటించేవాడు కాదు. అప్పటి సమాజానికి పొసగని ఆధునికధోరణి ఆయనలో ఉండేది. సామాన్యంగా ముస్లిములకుండే మతపిచ్చి ఆయనకుండేది కాదు. ఇందువల్ల ఆయన చాందస ముస్లిములకు విరోధి అయ్యాడు. ఒకసారి ఆయన సరదాగా మసీదుకు పోయాడు. ఎప్పుడూ రాని వ్యక్తీ, అందులో ఖయాం వంటి ప్రసిద్ధవ్యక్తి అక్కడకు వచ్చేసరికి వారికి ఆనందం కలిగింది.కాని ఆయన తానెందుకోచ్చినదీ చెప్పినది విన్నతర్వాత, వారికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.

మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతి బ్రాతవై 
చినిగెను, నేడునున్ మరల జెప్పుల కోసము వచ్చినాడ, నె
మ్మనము సెడగ నియ్యెడ నమాజొనరింపగరాదు, నీవు చ 
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులు వోలె నమాజు సైతమున్ 

'మునుపెన్నడో చెప్పులు దొంగతనంచెయ్యడం కోసం మసీదుకు వచ్చాను. ఇప్పుడవి పాతబడి చినిగిపోయాయి. అందుకే ఇంకో జతకోసం మళ్ళీ ఇప్పుడొచ్చాను. ఇక్కడ నమాజు చెయ్యడం ఎందుకు దండగ? మసీదు బయట చెప్పులు వదలినట్లే, నీవు చచ్చినపుడు నీ కపట ప్రార్ధనలు కూడా నిన్ను వదిలిపోతాయి'- అంటూ ఒక నిగూడార్ధాన్ని ఈ పద్యంలో పొందుపరచాడు. కపట మతాచారాలను ఖయ్యాం నిరసించాడు. నిత్యజీవితంలో ఆచరణలేని ఉత్తసూక్తులను ఆయన అసహ్యించుకున్నాడు. పటాటోపంతో కూడిన మతవేషాలను, ప్రేమరాహిత్య మతాచారాలను ఆయన అనుసరించేవాడు కాదు.

అందుకే 

'దేవ ! నీవు లేని గుడిని ప్రార్ధించుకంటె 
పానశాలను సత్యము పలుక మేలు' అంటాడు.

'దేవాలయంలో చేరి గొప్ప భక్తులలాగా అబద్దపువేషాలు వేసి నటించడం కంటే, సారాయికొట్టులో కూర్చొని సత్యాన్ని చెప్పడం మేలుకదా' అన్న విప్లవాత్మక భావాన్ని ఈ పంక్తులలో నిక్షేపించాడు.

ప్రత్యర్ధులైన తీవ్రవాదుల బాధ తట్టుకోలేక, ఇష్టం లేకున్నప్పటికీ, ఆయన ఒకసారి మక్కాయాత్ర చేసి వచ్చాడు. హాజీ అనిపించుకుంటే ప్రత్యర్ధులు కొంచం శాంతంగా బతకనిస్తారేమో అని. కాని మక్కాలో ఆయనకు ఏమీ దైవానుభూతి కలుగలేదు. అందుకే ఆ యాత్ర తరువాత ఈ పద్యం చెప్పాడు.

కలపయు మట్టి రాల నిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవ యేని కామినిన్ 
వలవుము ప్రాణహీనమగు బండలు వేయిటి కన్న శ్రేష్టమై 
యలరు గదా మనుష్య హృదయము ప్రతి ప్రణయానురక్తులన్  

'మట్టి, చెక్క, బండలు- వీటితో కట్టిన గుడిలో ఏముంది? నీవు ప్రేమను  కోరుకుంటే నీ ప్రేయసిని ప్రేమించు. ప్రాణంలేని బండ నీతో మాట్లాడదు. దానిబదులు నీ ప్రేమకు బదులిచ్చే మనుష్యహృదయం రాయికంటే వేయిరేట్లు మేలైనది  కదా' అంటాడు.

సూఫీలు ప్రేమాన్వేషకులు. దైవాన్ని ప్రేమగా వారు భావిస్తారు. వారు ప్రేమపూజారులు. భక్తి మార్గంలో ఉండే మాధుర్యభావం వారి మార్గం. దైవం అంటే ప్రేమయే అని వారి మతం. మనుష్యహృదయంలో ప్రేమగా దైవం ఈలోకంలో ఉన్నాడని వారి విశ్వాసం. ప్రేమే దైవం అని వారు నమ్ముతారు.

వివేకానందుడు కూడా ఇదే భావాన్ని చెబుతూ 'If you want to worship God, worship him in man. Where can you find a better temple to worship God, other than a human being? అంటాడు.

(సశేషం)