“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఆగస్టు 2012, బుధవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -3 (మట్టి మనిషి)

ఒమర్ ఖయ్యాం జాతకంలోని ఇంకొన్ని విశేషాలను గమనిద్దాం.

ఇతని జాతకంలో కోణార్గళం ఉన్నది. అది కూడా భూతత్వరాశులైన వృషభం, కన్యా, మకరాలలో ఉన్నది. ఈ మూడూ శనివర్గరాశులు. కనుక ఇతని జీవితం ఎప్పుడూ ఏదో ఒక చింతలోనే గడిచింది. అన్నీ ఉన్నా ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉండటం శనివర్గ లక్షణం. వీరికి ఏ బాధా లేకపోతే ఏదో ఒక బాధను సృష్టించుకొని మరీ బాధపడతారు. ఇలాంటి మనుషులు లోకంలో చాలామంది ఉంటారు. వారిమీద శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉంటూ బాధపడటం వీరి స్వభావం. 'బాధే సౌఖ్యమనే భావన' వీరి సొంతంగా ఉంటుంది. ఖయ్యాంకు కవితా ధోరణి బాగా ఎక్కువ అవడంతో కవిత్వం చెప్పి మరీ బాధపడేవాడు. 

భూతత్వరాశులు బలంగా ఉన్న జాతకాలు మట్టితో సంబంధం కలిగి ఉంటాయి. వీళ్ళు నేలమీద నడిచే వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే నేల విడిచి సాము చెయ్యడాన్ని వీరు ఇష్టపడరు. ఆకాశంలో చూపు వీరికి ఉండదు. భౌతికాన్ని దాటి వారి దృష్టి పైకిపోదు. ఎప్పుడూ భౌతిక ప్రయోజనాలనే వారు ఆశిస్తారు. ఒక మహనీయుని దగ్గరగా వారున్నప్పటికీ, అతనినుంచి భౌతిక ప్రయోజనాలనే వారు కోరుకుంటారు. ఎక్కువగా భౌతికసుఖాలను కోరుకునే వారి జాతకాలలో భూతత్వరాశుల ప్రాబల్యం బలంగా ఉండటం గమనించవచ్చు.వీరి కాంక్షలు కూడా భౌతిక భూమికలోనే కేంద్రీకృతమై ఉండటాన్ని చూడవచ్చు. అందుకే, ఖయ్యాం ఎంతసేపూ తనకు అందుబాటులో ఉన్న మధువునే నమ్ముకున్నాడు.ఎప్పుడూ ప్రియురాలైన 'సాకి' సాంగత్యంలోనే పొద్దు పుచ్చేవాడు. ఆధ్యాత్మికతను కూడా మట్టిలోనే వీరు దర్శిస్తారు. వీరి వ్యక్తిత్వం అంతా మట్టివాసన నిండి ఉంటుంది. ఇది భూతత్వరాశుల బలమైన ప్రభావం.

ఖయ్యాం కవితలు కూడా 'మట్టి' చుట్టూ పరిభ్రమిస్తాయి. అన్నీ చివరికి మట్టిలో కలవక తప్పదు అంటాడు. ఇలాంటి సృష్టిని ఎందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఇంతకంటే మంచిగా సృష్టించడం నీకు చేతకాలేదా అని సృష్టికర్తను నిలదీస్తాడు.తనకే గనుక అధికారం ఉంటే ఇంతకంటే మంచి సృష్టిని నిర్మించి చూపిస్తాను అని అనుకుంటాడు. 

ఈ లోకంలో మంచివారికి కష్టాలు, దుర్మార్గులకు సుఖాలా? ఇదేమి విచిత్ర సృష్టి? అని దేవుని ప్రశ్నిస్తూ -దుష్టులకు సుఖంబు సంపదలు చొప్పడు, నింపగు నీకు బాపముల్- 'నీకు పాపాలు చేసేవారంటేనే ఇష్టంలా ఉందే, అందుకేనా వాళ్ళకే అన్ని సుఖాలూ సమకూరుస్తున్నావు?' అని దేవుని అడుగుతాడు. 

'నెలతా, దేవునికట్లు నాకును జగన్నిర్మాణ మర్మక్రియల్ 
గలవేని,దుర్విషమ ప్రచారియగు లోకంబున్ యదేచ్చామతిన్ 
జేలువంబౌనటు సంస్కరించి నవసృష్టిం గూర్తు సన్మార్గవ
ర్తులు ప్రాజ్నుల్ భువి సర్వసంపదల సంతోషంబుగన్ వర్దిలన్'

అనే పద్యంలో ఎందఱో సాధకుల మదిలో కలిగే భావాన్ని పొందుపరుస్తూ, 'ప్రేయసీ, నాకే గనక సృష్టి చేసే అధికారం ఉంటేనా ఈ లోకాన్ని మార్చి, మంచివాళ్ళకు సర్వసౌఖ్యాలు కలిగేలా చేసేవాడిని కదా?' అనుకుంటాడు. 'ఈ విషవృక్ష లోకమును నింకొక రీతిం పునః సృజింపు మంచే వినతిన్ వచింతు' నంటూ దేవునికి విన్నవిస్తాడు.
       
ఇవన్నీ కూడా, ఏమీ చెయ్యలేని నిస్సహాయతలోనుంచి ఉద్భవించిన భావాలు. తన మిత్రులు నెచ్చెలులు అందరూ ఒక్కొక్కరే తన కళ్ళెదుటే నిష్క్రమిస్తుంటే ఏమీ చెయ్యలేక ఖయ్యాం కుమిలిపోయేవాడు. సృష్టి తీరుకు ఖిన్నుడయ్యేవాడు. సున్నిత హృదయులు ఇలాగే బాధపడతారు. కవులందరూ సహజ సున్నితస్వభావులే కదా.  ప్రపంచపు బాధలను తన బాధలుగా భావించడం శని కారకత్వాలలో ఒకటి. అది ఖయ్యాం మీద కూడా అమితంగా ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి లోకూడా ఈ పోకడను చూడవచ్చు.

'మనమున కెక్కినట్టి యభిమానులు మిత్రులు జెల్లినారు' అనే పద్యంలో  తన ఇష్టులూ మిత్రులూ గతించారని బాధబడతాడు.'యౌవన మధుమాసమున్ కుసుమభారము రాలిచి గడచిపోయే' యౌవనం అనే మధుమాసం గతించింది. తన పూలను రాల్చి వెళ్ళిపోయింది' అని చింతిస్తూ 'జీవితంబను సరకంబునందు నడుగంటే మధూళియు' జీవితమనే పాత్రలో మధువు అడుగంటింది అని, ఆ స్త్తితిలో కూడా ప్రాణశక్తిని మధువుతో పోలుస్తూ పద్యం చెబుతాడు. 

'యే దినంబు వచ్చెనో మరి ఎప్పుడేగెనో దిసింపదు హర్ష విహంగమిప్పుడున్' ఏ రోజు వస్తున్నదో ఎప్పుడు పోతున్నదో తెలీకుండా ఉన్నది. సంతోషం అనే పక్షి ఇప్పుడు ఎగరడం మానుకున్నది కదా? అని చింతిస్తాడు. ఖయ్యాం స్నేహప్రియుడు. మనసుకు నచ్చిన స్నేహితులతో సరస సంభాషణలే కదా ఈ లోకమనే ఎడారిలో సెలయేళ్ళు? అవే లేనప్పుడు లోకం రసహీనంగా తోచక ఇంకేముంటుంది? తన మిత్రులందరూ తన కళ్ళముందే గతిస్తుంటే చూచి మౌనంగా బాధపడతాడు. అశాశ్వతమైన ఈ లోకరీతిని తలచి కుమిలిపోతాడు.   

'గతము గతంబె యన్నటికిన్ కన్నులగట్టదు, సంశయాంధ సం
వృతము భవిష్యదర్ధము, ఓ వివేకవతీ ! ఒక వర్తమానమే 
సతత మవశ్య భోగ్యమగు సంపద రమ్ము విషాదపాత్ర కీ 
మతంబున తావు లేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్'

అంటూ 'గతాన్ని మర్చిపో, భవిష్యత్తును ఆలోచించకు, వర్తమానాన్ని ఉపయోగించుకో, నీవు వివేకవతివి కదా, ఆనందాన్ని చేజారనివ్వకు సఖీ, మన మతంలో విషాదానికి తావులేదు. ఒక్కక్షణంపాటు పానపాత్రను చేతబట్టు' అంటాడు. 'మధువానుము మానుము తక్కుచింతలన్' అంటూ 'మధువును సేవించు ఆనందంగా ఉండు ఇతర చింతలు మాను' అని ఉద్బోదిస్తాడు.   

"దక్కని యారేపటి మాటలేటి కనుభోగ్యంబైన నేడుండగన్" - 'రేపటి చింత నీకెందుకు. నేడు నీ చేతిలో ఉన్నది. దానిని అనుభవించు'- అంటాడు.

మధువు అనేది బ్రహ్మానుభూతిలో కలిగే ఆనందానికి సూచన అని పరమహంస యోగానంద మొదలైన యోగులు వ్యాఖ్యానించారు. అది నిజమే అయినప్పటికీ, ఖయ్యాం ఈ పదాన్ని ఆ అర్ధంలో వాడినాడా అన్నది సందేహమే. ఎందుకంటే ఖయ్యాం ఎన్నడూ ధ్యానాన్ని గురించి, యోగాన్ని గురించి స్పష్టంగా చెప్పలేదు. అతని చింత అంతా 'మధువు-సాకి' ఈ రెంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్నికొన్ని పద్యాలలో ఆధ్యాత్మిక అర్ధాలు గోచరించినప్పటికీ, ఎక్కువ పద్యాలు పూర్తిగా భౌతికమైన అర్ధాన్నే సూచిస్తూ  ఉన్నాయి. కనుక, ఖయ్యాం చెప్పినది లోకానికి చెందని అతీతాధ్యాత్మికమా?అన్నది సందేహాస్పదమే అని నా భావన.

'ఎరుగవే కాలవల్లి మన ఇద్దరి మృత్యువు లల్లుగోయ్యగా బెరుగు' అంటూ- 'కాలమనే లత మన ఇరువురి మృత్యువులనే గుంజలను ఆధారంగా చేసుకొని పెరుగుతుంది చెలీ గమనించు' అని ఒక గూఢమైన అర్ధాన్ని ప్రతిపాదిస్తాడు. మృత్యువు లేనిదే కాలానికి ఉనికి లేదు అనే గొప్ప సత్యం ఇక్కడ ధ్వనిస్తుంది. ఒక్కొక్క క్షణమూ కరిగిపోవడమే మృత్యువు. కళ్ళుతెరిచి దానిని చూడు అంటాడు.'జంటగాగరముల వారుణీభరిత కాంచనపాత్రిక లద్దికొన్న నద్దిర, మన చేత చిక్కువడదె చిరకాలపుసత్య మంగనా' అనే పద్యపాదంలో 'ఇద్దరం కలిసి మధుసేవలో మునిగితే అమరత్వమనే సత్యం మన చేతికి చిక్కక ఏమౌతుంది సఖీ ?' అని ప్రశ్నిస్తాడు.   

'నీవూ నేనను తారతమ్య మిహమందే గాని భూగర్భ రత్నావాసంబున లేదు' - అని చెబుతూ, 'నీవూ నేనూ అన్న భేదాలు ఈలోకంలోనే గాని భూగర్భంలో మనం విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ భేదాలు ఏమీ ఉండవు' అంటాడు. ఆలోకంలో 'దుర్జనుఁడు పుణ్యాత్ముండు భిక్షార్దియున్ శ్రీవాల్లభ్య దురంధరుండు నొకటే శ్రేణిన్ సుఖాసీనులై యావిందున్ భుజియింతు రంతగనలే మా మృత్తికన్ భేదముల్' అని వక్కాణిస్తూ- 'మట్టిలో భేదం లేదు. మట్టిలో కలిసినప్పుడు చెడ్డవాడూ మంచివాడూ, బిచ్చగాడూ ధనికుడూ అందరూ అక్కడ ఒకటే వరుసలో కూచుని ఆ చాపకూడు భుజించాలి. ఇది తెలుసుకో'- అంటాడు.   

'జీవితము వాతూలంబులో దివ్వె, చెచ్చెర గానిమ్ము గతించు ప్రాయంబదిగో శీఘ్రంబుగం బ్రేయసీ', మన జీవితము సుడిగాలిలో దీపంలాంటిది. ఏ క్షణానైనా ఆరిపోవచ్చు. ఆయువు త్వరగా తరుగుతున్నది. కనుక 'పరిశుష్కంబగు జీవనంబు రససంపంన్నంబు గావించు నిర్జర పానీయము వారుణీరసము బాత్రన్నింపి యందిమ్మ యాతురదీరం జవిగొందు' శుష్కమైన ఈ జీవితాన్ని రససంపన్నం చెయ్యడానికి ఆ మధువును పాత్రలో నింపి నాకు అందివ్వవా ?ఆత్రంగా తాగి నా దాహాన్ని చల్లర్చుకొంటాను.' అని సాకిని అర్దిస్తాడు.

ఖయ్యాం తన కవితలలో తాను చెప్పాలనుకున్న భావాలను స్పష్టంగా చెప్పాడు. అతని దగ్గర నటన లేదు. సమాజంకోసం మంచివాడిలా నటించే కుళ్ళు అతనిలో లేదు. ఈ లక్షణమే అతన్ని ఉన్నతంగా నిలబెడుతుంది. లోకానికి తాను చెప్పేది నచ్చదని తెలిసి కూడా, తన భావాలను తాను చెబుతాడు.మార్మికుల ధోరణి ఇలాగె ఉంటుంది. వాళ్ళు లోకాన్ని లేక్కచేయ్యరు. లోకం ఏమనుకుంటుందో అని ఊరుకుంటే సిద్ధార్ధుడు ఇల్లు  వదలి పోయేవాడా? లోకానికి జడిస్తే నరేంద్రుడు వివేకానందుడిగా మారేవాడా?  

అసలు లోకుల తీరే విచిత్రమైనది. వాళ్ళు చేసేవేవీ కూడా లోకంకోసం ఆపుకోరు. కాని ఒక మార్మికుడు తన భావాలను వెల్లడిస్తే వాడికి తాటాకులు కడతారు. లోకులు పచ్చి స్వార్ధపరులు. లోకం అంతా దొంగలగుంపు. ఒకరినొకరు దోచుకోవాలని ఎదురుచూస్తూ మళ్లీ అందరూ కలిసి జీవించే దొంగలు వీళ్ళు. లోకాన్ని దాటి ఆలోచించేవారు వారికి నచ్చరు. మార్మికులు లోకతీరును మెచ్చరు గనుక లోకులకు మార్మికులు నచ్చరు. వీరి ఆలోచనలు వేర్వేరు లోకాలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒకే లోకంలో ఉంటూ రెండు భిన్నమైన లోకాలలో బ్రతికే జీవులు వీరు. 

ఖయ్యాం ఒకరోజు కుమ్మరివీధిలో నడుస్తున్నాడు. అక్కడ ఒక కుమ్మరి కుండలు చేస్తూ ఉండగా ఖయాం చూచాడు. ఆ కుండలు మానవభాషలో అతనితో మాట్లాడాయి. వాటివాటి చరిత్రను చెప్పుకోన్నాయి. రసస్ఫూర్తితో నిండిన కవి హృదయానికి జడం కూడా చైతన్యవంతంగానే తోస్తుంది. మట్టి అతనికి ఎన్నో ఊసులు చెబుతుంది. రాళ్ళూ రప్పలూ కూడా అతనికి తత్వబోధ గావిస్తాయి. చూచే దృష్టి ఉంటే ప్రపంచంలో సమస్తమూ చైతన్యవంతంగానే కనిపిస్తుంది. మనిషిని మనిషిగా చూడలేని నేటి జడమానవులకు,వస్తువులు మాట్లాడటం అంటే ఏమిటో అర్ధంకాదు. అలాంటి వారికి ఖయాం వంటి మార్మికకవి జల్సారాయుడిగా కనిపించడం వింతేముంది? 

కుమ్మరి ఒక మట్టిముద్దను కాళ్ళకింద వేసి తొక్కుతూ ఉండగా ఖయాం చూచాడు. అప్పుడా మట్టి కుమ్మరితో ఇలా అన్నదట.  

'మెల్లగ నల్ల దోక్కుమోయన్న, ఎరుంగవె నను, నొకప్పుడు నీవలె నందగాడనే' ఓయీ కుమ్మరి. మెల్లగా తొక్కు. నేనెవరో గుర్తించలేదా? బతికున్న రోజులలో నేను కూడా నీవలె అందగాడినే సుమా -- అంటూ ఆ మట్టి ఒక గొప్ప సత్యాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. మన కాళ్ళక్రింది మట్టిలో ఎందరెందరు మహారాజులు ఉన్నారో ఎవరికి తెలుసు?

ఖయాం ఇంకా ఇలా అంటాడు.'ఓయీ కుమ్మరి. ఎంతకాలం ఇలా మానవ మృత్తికను తెచ్చి కుండలు ముంతలు చేస్తావయ్యా? నీకు తెలియక నిజాన్ని చూడలేకపోతున్నావు. ఆ మట్టిలో దరిబెసి చెయ్యి దగ్గరే ఫరీదూను శిరస్సు కనిపిస్తున్నది చూడవయ్యా.' అంటాడు. దరిబెసి అనేవాడు ఒక నిరుపేద. ఫరీదూన్ అనేవాడు ఒక సంపన్నుడు. ఇప్పుడు ఇద్దరూ ఒకే మట్టిలో కలిసి ముంతలు కుండలుగా మారారు. అని గొప్ప సత్యాన్ని చెబుతాడు. 'ఫరీదూను శిరంబు గాంచును యదో దరిబెసి కరంబు దగ్గరన్' అన్న చక్కని పదాన్ని పలుకుతాడు.

కుమ్మరి ఇంటిలోనుండి కొన్ని కుండలు ఖయ్యాంను ఇలా ప్రశ్నిస్తాయి.' మమ్మల్ని తయారుచేసి బజారులో అమ్మిన కుమ్మరులు, ఇప్పుడు ఎక్కడున్నారయ్యా ఖయ్యాం? నీకేదైనా వార్త తెలిస్తే చెప్పవా?' ఈ పద్యంలో మనిషి అహంకారానికి చావు దెబ్బను మర్మగర్భంగా కొడతాడు. ప్రతి మనిషి ఎంతో విర్రవీగుతాడు. కానీ అతని జీవితం క్షణికం. అశాశ్వతం. అతను తయారు చేసిన వస్తువులు ఉంటాయి, అతను వాడిన వస్తువులు అతని తర్వాత వందల ఏళ్లు ఉంటాయి. కాని అతను ఉండడు. అయినా సరే, తాను శాశ్వతం అన్నట్లు ప్రతివాడూ విర్ర వీగుతాడు. అదే ఈ లోకపు విచిత్రాలలో ఒకటి. 

బాగులేనని తనను కొనకుండా పోతున్న ఒకణ్ణిచూచి ఒక ముంత ఇలా అన్నదట ' ఏమయ్యా నన్ను కొనకుండా పోతున్నావు? తప్పు నాది కాదు. నన్నిలా చేసిన కుమ్మరి ఉన్నాడే అతనిది తప్పు. నన్ను తీరుస్తున్న సమయంలో తాగినమత్తులో కుమ్మరి చెయ్యి వణికి ఉంటుంది. అందుకే నేను ఇలా తయారయ్యాను. తప్పు నాదేలా అవుతుంది? ' 

మనుషుల తప్పులకు వారు బాధ్యులు కారనీ, దైవానిదే ఆ బాధ్యత అనీ గొప్ప వేదాంతాన్ని ఆ ముంత ఖయాంకు బోధిస్తుంది. జన్మకు కర్మ కారణం అని వాదించే వేదాంతులు కూడా మొదటి జన్మకు కారణం ఏమిటి? అంటే జవాబు చెప్పలేరు. ఆ జన్మకు దైవ సంకల్పమేగా కారణం? కనుక నేనిలా ఉంటే తప్పు నాది కాదు. ఆ దైవానిదే అంటుంది ముంత. ఒక ప్రాణం లేని ముంత చేత మనిషి మనస్సులోని నిగూఢమైన ఆలోచనను ఖయాం పలికిస్తాడు.

కుమ్మరి సృష్టికర్త. కుండలూ ముంతలూ మానవులు. మానవునిలో లోపం ఉంటే ఆదోషం ఎవరిదీ? సృష్టికర్తదేగా? ఎందుకంటే, కుండలకు ఏమి స్వాతంత్ర్యం ఉన్నది గనుక? కుమ్మరి ఎలా చేస్తే అలా అవి తయారవుతాయి. కనుక సృష్టిలోని లోపాలకు బాధ్యత దేవునిదే గాని మానవునిది కాదని ఖయ్యాం భావిస్తాడు. ఇవన్నీ ఇస్లాంమతానికి మహాపాపాలుగా తోచే విప్లవభావాలు. ఈ కవితలు వినికూడా, మూర్ఖులైన ముస్లిం చాందసులు ఖయ్యాంను ఎలా బ్రతుకనిచ్చారో ఆ దేవునికే ఎరుక.

తన చివరిక్షణాలలో కూడా ఖయాం సరస సంభాషణను మానలేదు. 'నాకు పిలుపు వచ్చిందయ్యా. పోతున్నాను. నా మట్టితో పానపాత్రలు కూజాలు జాడీలు చేసి పానశాల వద్ద వాటిని అమ్మవయ్యా. మధుస్పర్శతో మళ్లీ జీవించి సత్యాన్ని లోకులకు బోధిస్తాను' అని కుమ్మరితో తన చివరి కోరికను చెబుతాడు. అద్భుతమైన ఒక పద్యాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు.

ఓరీ కుమ్మరి, పిల్పు వచ్చే, వినుమా యొక్కింత నా కోర్కె. నా 
గోరీ మృత్తిక బానపాత్ర లిటికల్ కూజాలు జాడీలు సొం
పారం దీరిచి యమ్మవోయి మదిరాపణ్యంబులం గోస్తనీ 
సార స్పర్శన్ బునః ప్రబోదితుండనై సత్యంబు జాటించెదన్     

తాను అమరత్వాన్ని ఎలా పొందబోతున్నదీ కూడా ఖయ్యాం ముందే చెబుతాడు.

కడుగుడు నా శవంబు దడిగా మధుధారల, ద్రాక్షపుల్లలుం 
బుడకలు పెట్టె యల్లి నను బూడిచి పెట్టుడు శీదుబిందులన్
వడిసెడి నాదు మృత్తికల వాసన గుర్తగు మీకు, రేపు నన్
బడయుదు రాసవాలయము వాకిటనో చెలి కాలిధూళినో.

అనే పద్యంలో హృదయాన్ని కదిలించే ఒక భావాన్ని మన ముందు నిల్పుతాడు. తనను ఎలా సాగనంపాలో చెబుతూ, 'నా శవాన్ని మధుధారలలో బాగా కడిగి,ద్రాక్ష కొమ్మలతో అల్లిన పెట్టెలో ఉంచి పూడ్చి పెట్టండి. మరణించిన తర్వాత నేను మీకు రెండుచోట్ల మాత్రమే కనిపిస్తాను. ఒకటి పానశాల వాకిట్లో మట్టిగానో, లేక నా చెలి కాలికి ఉన్న ధూళిగానో ఉంటాను. ఈ రెండుచోట్ల మాత్రమె మీరు నన్ను చూడవచ్చు. ఆ మట్టి వెదజల్లే మధువాసన బట్టి నన్ను మీరు గుర్తించవచ్చు.' అంటాడు. మరణం తర్వాత కూడా  మధువునూ ప్రియురాలినీ వదలలేనని అంటూ ఒక రసస్ఫూర్తితో కూడిన అమరభావాన్ని మనకు అందిస్తాడు. 

అమరత్వాన్ని పొందడం కూడా, ఆత్మగా కాక, మట్టిగా పొందాలని తపిస్తాడు. అందుకే ఖయ్యాంను మట్టిమనిషి అంటే చాలా సమంజసంగా ఉంటుంది. అతనూ సంతోషిస్తాడు. అడుగో ! ఈ మాటన్నందుకు నా ఎదురుగా ఎలా నవ్వుతున్నాడో !!