“Self service is the best service”

24, ఆగస్టు 2012, శుక్రవారం

ఒమర్ ఖయ్యాం జాతకం-2 (జీవితపు అనిత్యత్వం)

ఒమర్ ఖయ్యాం జాతకంలో కొన్ని విచిత్రాలున్నాయి. అవేమిటో,వాటివల్ల అతని మనస్తితి, పరస్పర విరుద్ధ విషయాలతో, ఎలా విచిత్రంగా ఉండేదో చూద్దాం.

లగ్న పంచమ నవమాలలో వరుసగా రవిబుధశుక్రులు, రాహువు, శనిగురువులు ఉండటం ఒక నిగూఢమైన గ్రహయోగం. మంత్ర స్థానంలో ఉన్న రాహుద్రుష్టి నీచగురువు మీద ఉండి, ఆ గురువు మళ్లీ లగ్నంలో ఉన్న మూడు గ్రహాలను చూస్తున్నాడు. గురుద్రుష్టికి, శనిద్రుష్టి కూడా తోడైంది.దీనివల్ల అతనిలో రకరకాల భావాలు కలిసిన మార్మికచింతన కలిగింది.ఉద్యోగాన్ని నిరసించి,తన సమయాన్ని గ్రంధావలోకనంలోనూ, సాఖీ సాంగత్యంలోనూ, ఏకాంతలోకంలో మార్మికకవితా వ్యాసంగంలోనూ, మిత్రగోష్టులలోనూ గడిపే అభిరుచిని ఈ యోగం ఇచ్చింది. 

అంతేగాక, సాంప్రదాయానికి భిన్నమైన ఆలోచనాధోరణినీ, నిర్మొహమాటంగా మాట్లాడే తత్వాన్నీ,రసికప్రియత్వాన్నీ, సాకీ సాంగత్యాన్నీ  కూడా ఇదే యోగం ఇచ్చింది. అదే సమయంలో అతనిలో తీవ్రమైన వైరాగ్యమూ కనిపిస్తుంది. ఇదొక విచిత్రమైన మనస్తత్వం. అందుకే ఖయ్యాం కవితలలో ఎక్కువగా ఒకవిధమైన నిరాశావాదం ఉంటుంది. దానిని నిరాశావాదం అని ఖచ్చితంగా అనలేము. జీవితం క్షణభంగురం కనుక ఆలస్యం చెయ్యకుండా ఆనందాన్ని అనుభవించమన్న సందేశం ఖయ్యాం కవితలలో అనుస్యూతంగా కనిపిస్తుంది.

ప్రపంచం మూన్నాళ్ళముచ్చట అన్న విషయం ప్రతిపంక్తిలోనూ ఖయ్యాం నొక్కి చెప్తాడు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదనీ, ప్రతి క్షణమూ జీవితం నీ చేతిలోనుంచి జారిపోతున్నదనీ గుర్తు చేస్తాడు. ఒకరోజు గడిస్తే చావుకి మనం దగ్గరౌతున్నామన్న సత్యాన్ని మాటిమాటికీ వదలకుండా చెబుతాడు. ఇక్కడెవరూ శాశ్వతం కాదనీ, మహారాజులూ, చక్రవర్తులే దిక్కులేకుండా పోయారనీ ఇక మనమెంత అంటూ అనవసర కాలక్షేపాలు మానమని ఉద్బోదిస్తాడు.

అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల, వి 
శ్రాంతి గృహమ్ము, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా 
క్రాన్తులు పాదుషాలు బహారాం జమిషీడులు వేనవేలుగా 
గొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటోసంగుచున్      

ఈ ప్రపంచం ఒక పురాతన విశ్రాంతిగృహం. ఇది నీకు ఎన్నటికీ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ. ఇరుసంజలూ రెండు వాకిళ్ళు. వీటిలోనుంచి ఎందఱో రాజులు చక్రవర్తుల వేలాదిమంది వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ సుఖాలు పొంది ఎక్కడికో వెళ్ళిపోయారు. వారి స్థానంలో ఎవరెవరో మళ్లీ కొత్తవారొచ్చారు. రాజులే పోతే ఇక సామాన్యుల సంగతి చెప్పేందుకు ఏముంది? ప్రతి సంధ్యా వచ్చిపోతూ నీ జీవితాన్ని నిత్యమూ హరిస్తున్నదని సూచనాత్మకంగా చెప్పాడు. 

ఈ లోకంలో, రంగస్థల నేపధ్యం మారవచ్చు, పాత్రధారులు మారవచ్చు, కాని పాత్రలు మాత్రం అవేఅవే ఉంటాయి. సన్నివేశాలూ అవే ఉంటాయి. ఇక్కడ కొత్త నాటకం ఎప్పుడూ జరగదు. ఎప్పుడూ 'జీవితము-మృత్యువు' అనే పాతబడిన నాటకమే ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఈ రంగస్థలానికి ఇరుసంజెలు అనే రెండు వాకిళ్ళున్నాయి. ఒకటి రాక,ఒకటి పోక. ఎందఱో నటులు ఈ రంగస్థలం మీదకు ఒకవాకిలి గుండా వచ్చి వారివారి పాత్రలు నటించి ఇంకొక వాకిలిగుండా నిష్క్రమించారు. నీకూ ఒకరోజు నిష్క్రమణ తప్పదు సుమా. దీనిని మరువబోకు.

చెలులను బంధులన్ మధురశీధువు నామని తోట వీడి యూ 
హలు నెగబ్రాక జాలని రహస్యపు జోటికి బోదువీవు, నే
బలికెద తెల్పరాని యొకభావము, సంధ్యలం దూళి రాలు పూ       
వులు కృశియించుగాని విరబూయవు క్రమ్మర, నమ్ముమో సఖీ 

నీ చెలులను బంధువులనూ,మధువునూ,పూలతోటలనూ వదలి, అన్నింటికీ అందరికీ దూరంగా, నీవు ఊహించలేని ఒక రహస్యమైన చోటికి నీవు పోవలసి వస్తుంది. ఒక్క మాట విను. రాలిన పూలు వాడి నశిస్తాయి గాని, తిరిగి విరబూయవు. మనిషి జీవితంకూడా ఇంతే సఖీ, ఈ సత్యాన్ని తెలుసుకో -- అంటాడు.

మనిషి జీవితం కూడా రాలిన సుమం వంటిదే. అది క్షణక్షణమూ వాడిపోతూ ఉంటుంది గాని వికసించదు. క్షణక్షణం ఆయుస్సు తరగడం అంటే వాడిపోవటం కాక వికసించడం ఎలా అవుతుంది?

కవుల ఊహల్లో తమదైన ఒక స్వప్నసుందరి ఎప్పుడూ ఉంటుంది. కవులు స్వప్నాలలో విహరిస్తారు. ఊహల్లో జీవిస్తారు. పరమ సాంప్రదాయవాది అయిన విశ్వనాధ సత్యనారాయణగారే, 'కిన్నెరసాని' అంటూ కలవరించాడు. నండూరివారి 'ఎంకి', బాపిరాజుగారి 'శశికళ'  తెలియనిదెవరికి? ఇక నిరంతర స్వాప్నికుడూ సుఖప్రియుడూ అయిన ఒమర్ ఖయ్యాం మాట చెప్పాలా? ఆయన 'సాకి' అన్న తన ప్రియురాలిని ఉద్దేశించి అనేక పద్యాలు చెప్పాడు. ఈ పదమే తెలుగులో 'సఖి' అయి ఉండవచ్చు. 

ఈ 'సాకి' అనేక సందర్భాలలో చిన్తాక్రాంతుడైన ఖయ్యాంకు మదిరాపాత్రను అందిస్తుంది. ప్రపంచపు అనిత్యత్వాన్ని ధ్యానిస్తూ బాధపడే అతన్ని ఓదారుస్తుంది. బాధను మరచి మధుసేవలో తరించమని పిలుస్తుంది. తన ప్రేమమయ పరిష్వంగంలో అతన్ని సేదదీరుస్తుంది. ఒక్కొక్కసారి 'సాకి' అన్యమనస్కంగా విచారంగా ఉంటే ఖయ్యాం ఆమెను ఓదార్చడమూ మనం చూస్తాం.

కాలమహర్నిశంబనేడు కత్తెరతో భవదాయురంబర 
శ్రీల హరించు, మోముపయి జిల్కును దుమ్ముదుమార, మేలోకో 
జాలి పడంగ? నీ క్షణము సంతసమందుము నీవు వోదు, వీ 
రేలుబవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్   

కాలమనేది తన చేతనున్న 'రేయి-పగలు' అనే కత్తెరతో నిరంతరమూ నీ ఆయువును కత్తిరిస్తున్నది. చివరకు నీ ముఖాన దుమ్ము జల్లుతుంది. దీనికి జాలిపడాలా? ఈ క్షణం నీది. సంతోషంగా ఉండు. ఒకరోజు నీవు పోక తప్పదు. కాని ఆ తరువాత కూడా ఈ రేయిపగళ్ళు నిరంతరమూ చక్రంలా నడుస్తూనే ఉంటాయి -- అంటాడు. ఖయ్యాం వృత్తిరీత్యా గుడారాలు కుట్టే కుటుంబంలో పుట్టాడు. అందుకే ఇలా ఒక పద్యం చెప్పాడు.        

అల బహరాము గోరి మధువానిన సుందర భోగమందిరం 
బుల మృగరాజు నేడు భయమున్విడి క్రుమ్మరు, జంబుకంబు పి
ల్లల గను, వన్యరాసభముల మృగయారతి బట్టినట్టి భూ 
తలపతి గోరి పట్టువడే దానొక గోరి, నెరుంగుదే చెలీ

ఒకనాడు బహారాం అనే రాజు చక్కగా తాగి తందనాలాడిన రాజభవనం ఉన్న స్థానంలో నేడు సింహాలు పులులూ తిరుగుతున్నాయి. అదే చోట నక్క పిల్లలను కంటున్నది.అంటే ఒకనాటి రాజభవనం ఈనాడు అడవిగా మారిపోయింది అని అర్ధం. వేటలో వినోదంగా మృగాలను పట్టిన రాజు ఈరోజు తానె ఒక సమాధిలో పట్టుబడ్డాడు. ఆ సమాధి చుట్టూ అవే మృగాలు తిరుగుతున్నాయి. చూడు చెలీ -- అంటూ ఒక చిత్రాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు.

ఒకనాడు మహారాజు తిరిగినచోట నేడు మృగరాజు తిరుగుతున్నది. ఒకనాడు కుట్రలు కుతంత్రాలతో మంత్రాంగాలు చేసిన చోట నేడు కుయుక్తులకు పేరుగన్న నక్కలు నివసిస్తున్నాయి. అంటే రాజులు సింహాలుగానూ మంత్రులు నక్కలుగానూ పుడతారని ఖయ్యాం భావమా? కాకపోవచ్చు.ఎందుకంటే అతనికి పునర్జన్మ మీద నమ్మకాలు లేవు. కాకుంటే సింహం రాజనీ, నక్క మంత్రనీ కధలున్నాయి దానికి అనుగుణంగా ఈ పద్యం చెప్పి ఉండవచ్చు.       

'నేడు విహారభూమి శోభామయమైన ఈ గరిక పచ్చగిలుంగద రేపు నీపయిన్' - అంటూ నీవు హాయిగా ఏ పచ్చిక మీద అయితే ఈరోజు విహరిస్తున్నావో, రేపు అదే పచ్చిక నీ సమాదిమీదో, లేక నీవు బూడిదగా మారి మట్టిలో కలిస్తే ఆ మట్టిమీదో, మొలకలేత్తుతుంది కదా అంటాడు.

ఖయ్యాం కు ఆత్మమీద నమ్మకం లేదు. అందుకే పునర్జన్మను నమ్మలేదు. కాని మట్టిలోనుంచి పుట్టిన జీవులు మళ్లీ మట్టిలో కలుస్తాయని నమ్మాడు. అదే మట్టి మళ్లీ అనేక రూపాలు ధరిస్తుందని తెలుసు గనుక ఈ రకమైన  భౌతిక చక్రభ్రమణాన్ని ఊహించాడు. ఒక నిరంతర వలయాన్ని ప్రకృతిలో అతను దర్శించాడు. ఈరోజు మన కాళ్ళక్రింద నలిగే పచ్చిక రేపు మనమీద మొలవవచ్చు. ఈ రోజు నీవు ద్వేషించిన మనిషి చేతుల్లోని కూజాగా రేపు నీవే ఉండవచ్చు. లేదా అతని కాలిక్రింది మట్టిగా నీవే మారవచ్చు. చెప్పలేం.

సాధారణంగా మనం అశుభం అంటూ ఆలోచించటానికి కూడా ఇష్టపడని విషయాలను ఖయ్యాం మాటమాటకీ గుర్తుచేసి ప్రపంచపు అనిత్యత్వాన్ని కళ్ళ ముందు అనుక్షణమూ సాక్షాత్కరింప చేస్తాడు. ప్రపంచం అనిత్యం కాదు. అదెప్పుడూ ఉంటుంది. నీవే దీనిని వీడి పోవలసి వస్తుంది, నీవే అనిత్యం అన్న సత్యాన్ని గ్రహించు -- అంటాడు.   

బౌద్ధంలో కూడా ఇలాంటి అశుభవిషయాల మీద ధ్యానం నిర్దేశింపబడింది. ఈ అభ్యాసంవల్ల మనిషికి సహజమైన మోహం నశిస్తుంది.అహం అడుగంటుతుంది. కాని ఖయ్యాం ఒకవైపు ప్రపంచపు అనిత్యత్వాన్ని గురించి బాధపడుతూనే, ఇంకొకవైపు సాధ్యమైనంత ఎక్కువ సుఖాన్ని పొందమని ఉద్బోదిస్తాడు. సాంప్రదాయ యోగులలో ఉండే విషయ విముఖత్వమూ, వైరాగ్యమూ ఇతనిలో కనిపించవు. మధుసేవనమూ, సాకి సాంగత్యాలే ఇతని యోగసాధనలు. అవిచ్చే ఆనందమే ఇతని సర్వస్వం. వాటికోసం అనిత్యమైన ప్రపంచాన్ని తృణీకరిస్తాడు. అనిత్యంలో నిత్యాన్ని వెదకడమే ఇతని మతం.    

ద్వాదశ చంద్రుడు కేతునక్షత్రంలో ఉండటమూ. మీనంలోని కేతువుమీద వక్రశనిదృష్టి ఉండటమూ అతనికి తీవ్రవైరాగ్యాన్ని ఇచ్చింది. అందుకే మరణాన్ని నిరంతరం ధ్యానించాడు. సుఖవిలాస లాలసను ఇచ్చే వృషభరాశి లగ్నం కావడమూ అందులో రవి బుధ శుక్రులూ, పైగా బుధ శుక్రులు ఒకే డిగ్రీ పైన ఉండటమూ ఇతనికి ఈ కులాసా పోకడలను ఇచ్చాయి. అందుకే ఈవిధమైన పరస్పర విరుద్ధభావనలు ఇతనిలో మనకు కనిపిస్తాయి.

(సశేషం)