నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

6, జనవరి 2012, శుక్రవారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -4

రజనీష్ జాతకంలో కొన్ని విచిత్ర గ్రహస్తితులున్నాయి. పంచమ స్థానంలో కేతువువల్ల ఆయనకు ధ్యానంలో గట్టి అభ్యాసం ఉందన్న విషయం విదితం అవుతున్నది. కేతువు బుధుని సూచకుడుగా ఉచ్చస్తితిలో ఉన్న బుధుని సూచిస్తున్నాడు. ఆ బుధుడు అష్టమంలో ఉంటూ మార్మిక విషయాలను సూచిస్తున్నాడు.

ఈ జాతకానికి యోగకారకుడూ వైరాగ్యకారకుడూ అయిన శనికూడా అష్టమంలో ఉంటూ ఈయనకు గల బలమైన ఆధ్యాత్మికచింతనను సూచిస్తున్నాడు. ఇకపోతే రజనీష్ జాతకంలో గ్రహదశలు  ఎలా జరిగాయో ఒక్కసారి చూద్దాం. రజనీష్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించాడు కనుక జనకాలదశ శుక్రదశ అవుతుంది.

1931 లో పుట్టినప్పటి నుంచి 1938  వరకూ  శుక్రదశ.
అక్కణ్ణించి 1944 వరకూ రవిదశ.
అక్కణ్ణించి 1954 వరకూ చంద్రదశ.
అక్కణ్ణించి 1961 వరకూ కుజదశ.
అక్కణ్ణించి 1979 వరకూ రాహుదశ.
అక్కణ్ణించి 1990 లో చనిపోయేవరకూ గురుదశ.

1944 నుంచి 1954 వరకూ నడిచిన చంద్ర దశలోనే రజనీష్ సాధన అంతా సాగింది. చంద్రుడు అష్టమంలో ఉండటమే కాక శనిబుధులతో కూడి ఉండటమే దీనికి కారణం. 1948  నుంచి 1950 వరకూ చంద్ర దశలో శని అంతర్దశ జరిగింది. చంద్రశనులకలయిక ఆశాభంగాలనూ, వైరాగ్యాన్నీ, జీవితంలో మరిచిపోలేని చేదుఅనుభవాలనూ ఇస్తుంది. ఈ సమయంలోనే స్నేహితురాలు శశి మరణం ఆయనకు ఇంకొక షాక్ లాగా తగిలింది. ఏడేళ్ళ వయసులో తాతగారి మరణం ఆయనకు మొదటి షాక్ గా పనిచేసి జిజ్ఞాసాపరుణ్ణి  చేసింది. పదిహేడేళ్ళ వయసులో శశి మరణం జీవితపు ఆశాశ్వతత్వాన్ని మళ్ళీ ఆయన కళ్ళముందు నిలిపింది.  1953 లో తనకు కలిగిన "జ్ఞానోదయం" కూడా ఈ చంద్ర దశలోనే కలిగింది. తరువాత జరిగిన ఏడేళ్ళ కుజదశలో ఆయన తత్వశాస్త్ర ఆచార్యునిగా పనిచేశాడు. 1961 నుంచి 1979 వరకూ జరిగిన రాహుదశ ప్రారంభంలోనే ఆయనకు విదేశీ శిష్యులు రావడం మొదలైంది. రాహువు స్నేహితులను సూచించే ఏకాదశంలో ఉంటూ మంత్రస్థానమైన పంచమాన్ని చూస్తున్నాడు. అందుకే ఈ సమయంలో రజనీష్ పేరు దేశదేశాల్లో మార్మోగిపోయింది. రాహుప్రభావంవల్ల విదేశాలనుంచి తండోపతండాలుగా శిష్యులు రావడం మొదలుపెట్టారు.

అంతేకాక ఇదేసమయంలో,వివాదాస్పదమైన వామాచార తంత్రవిధానాలకు నవీనరంగు పులిమి తన ఆశ్రమంలో "తంత్ర గ్రూప్స్" పేరిట గ్రూప్ సెక్స్ మొదలు పెట్టించాడు. పోనీ తంత్రమన్నా సక్రమంగా అభ్యాసం చేసారా అంటే, అదీ లేదు. వామాచార సాధనను సక్రమంగా నేర్పించే గురువులు రజనీష్ ఆశ్రమంలో ఎవ్వరూలేరు.ఈ తంత్రాగ్రూప్స్ కు లీడర్స్ అందరూ విదేశీశిష్యులే. వారికి వామాచారతంత్రం  ఏమి తెలుస్తుంది? అది తంత్రంలోనే అతిరహస్యమైన విధానం. గురుముఖతా నేర్చుకోనిదే దాని రహస్యాలు ఎవరికీ అంతుబట్టవు. దానిని నేర్పించే గురువులు దొరకడం దుర్లభం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాటి గురువులు ఎక్కడా దొరకరు. కనుక విచ్చలవిడి సెక్స్ నే వారు తంత్రం అనుకున్నారు. ఇది అతిపెద్ద పొరపాటు. ఈమొత్తం వ్యవహారమంతా రాహుదశలోనే జరిగింది. శుక్రునికి ఉచ్చస్తితి అయిన మీనంలో రాహువు ఉన్నాడనీ,క్షేత్రాదిపతిగా గురువును సూచిస్తున్నాడనీ, రాహు శుక్రులిరువురూ కలిసి ఈయన నవాంశలో కన్యలో ఉన్నారనీ,శుక్రునికి కన్య నీచస్తితి అనీ మనం గుర్తుంచుకుంటే ఈవిషయం మొత్తం చక్కగా అర్ధం అవుతుంది. ఈ సమయంలోనే ఆయనకు "సెక్స్ గురు" అన్న పేరు ఖాయంగా మారింది. ఇదంతా రాహుశుక్రుల ప్రభావమే.

1980 ప్రాంతాలలో ఈయనకి గురుదశ మొదలైంది. ఇది ఈయన జీవితంలో కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. సామాన్యంగా రాహువులో గురువు గాని లేదా గురువులో రాహువుగాని మనిషికి చుక్కలు చూపిస్తుంది. జీవితంలో వెనక్కు తీసుకోలేని తప్పుడునిర్ణయాలు తీసుకోవడం లేదా భయంకరంగా మోసగించబడటం ఆదశలలో ఖచ్చితంగా జరుగుతాయి. అటువంటి దశాసమయంలోనే ఆయన భారతదేశం వదిలి అమెరికాలో స్థిరపడాలన్న తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఇక అక్కణ్ణించి ఆయనకు దుర్దశ మొదలైంది.తన రాశిలో ఉన్న గ్రహాల అన్నింటిదశలలో గురువు మంచిఫలితాలే ఇచ్చాడు. కాని తనదశ రావడంతోనే వక్రించిన తన లక్షణాలను చూపించడం మొదలుపెట్టాడు. అందుకే గురుదశలో రజనీష్ నానాబాధలూ పడ్డాడు. ఒరేగాన్లోని రాంచ్ లో పెట్టిన రజనీష్ ఆశ్రమం అనేక వివాదాలకూ నేరాలకూ కేంద్రబిందువుగా మారింది. చివరికి అరెస్ట్ కాబడ్డాడు. అమెరికానుంచి వెళ్ళగొట్టబడ్డాడు.ఏదేశంలోనూ దిక్కుతోచక ఆశ్రయందొరక్క తిరిగితిరిగి చివరికి భరతమాత ఒడిలోకే చేరాడు. మాతృదేశం విలువ ఆయనకు అప్పుడు తెలిసివచ్చి ఉంటుంది.కాని అప్పటికే సమయం మించిపోయింది. ఏదో తెలియని రోగం ఆయన్ను పీల్చి పిప్పి చేసింది. చివరికి హార్ట్ ఎటాక్ తో 1990 లో  మరణించాడు.

ఒక బానిసదేశం నుంచి వెళ్లి పరాయిదేశాలలో  వారికి కొత్తదైన వేదాంతప్రచారం చేసి ఏప్రమాదానికీ లోనుకాకుండా తనదేశానికి తిరిగివచ్చిన ఘనత ఒక్క వివేకానందస్వామికే మొదటిసారి దక్కుతుంది. విదేశాలలో ఉన్నపుడు ఆయన మీదకూడా హత్యాప్రయత్నాలు జరిగాయి.ఈసంగతి చాలామందికి తెలీదు. అయితే శ్రీ రామకృష్ణులు నీడలా వెనుకే ఉండి ఆయన్ను అనుక్షణం కాపాడారు. కనుకే క్రైస్తవమిషనరీల విషప్రయోగంనుంచి ఆయన తప్పించుకొని మళ్ళీ ఇండియాకు రాగలిగాడు.సెమెటిక్ మతాలైన జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాములు ఇతరమతాల విషయంలో చాలాక్రూరంగా వ్యవహరిస్తాయి. సమాజపరంగా వారుచెప్పే ఉదారవాదమూ, సమానత్వవాదమూ,స్వేచ్చావాదమూ,మొదలైనవి మతం విషయంలో ఏమాత్రం పనిచెయ్యవు.ఇతర మతాలను వారు క్రూరంగా అణగదొక్కుతారు.భగవద్గీతను నిషేధించాలన్న నేటి క్రైస్తవుల ప్రయత్నమూ దీనికి ఒక ఉదాహరణే. వారు చెప్పే నీతులు ఆచరణలో కనిపించవు. ఈప్రమాదాన్ని పరమహంసయోగానంద ఒక్కడే తెలివిగా అధిగమించాడు. క్రియాయోగగురువులలో జీసస్ ను కూడా ఉంచడం ద్వారా ఆయన క్రైస్తవుల ద్వేషపూరిత కుట్రలనుంచి తెలివిగా తప్పుకున్నాడు. ప్రస్తుతానికి ఆ  విషయాలు అలా ఉంచుదాం. 

నీతిగా నిజాయితీగా నిజమైన దివ్యజీవనాన్నీ యోగవేదాంతాల సందేశాన్నీ బోధించిన వివేకానందాది మహనీయ గురువులకే విదేశాలలో బాధలు తప్పలేదు. ఇక తిక్కతిక్క బోధలు చేసిన రజనీష్ను వారు ఊరికే వదులుతారా? పైగా క్రిస్టియానిటీని రజనీష్ విమర్శించినంత తీవ్రస్థాయిలో ఇంకెవ్వరూ విమర్శించలేదు. ఇంకాపైగా మతబోధలకు  పరిమితం కాకుండా, అక్కడి లోకల్ రాజకీయాలలో కల్పించుకోవాలని రజనీష్ శిష్యులు  ప్రయత్నించారు. ఆ క్రమంలో అనేక కుట్రలు కుతంత్రాలూ విషప్రయోగాలూ హత్యాయత్నాలూ  చేశారు. ఇవన్నీ రజనీష్ కి తెలిసే జరిగాయో, తెలీక జరిగాయో మనకు అనవసరం.తెలిసే జరిగాయని ఆధారాలున్నాయని కొందరు అంటారు.పరాయి దేశానికి పోయి ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? కనుక అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. రజనీష్ ను వెంటాడి వేటాడింది. అయితే, దానివెనుక బలమైన క్రైస్తవ లాబీ ఉందన్న సంగతి జగద్విదితం.

అయితే అసలంటూ రజనీష్ చేసిన తప్పులు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు కనిపిస్తాయి. విచ్చలవిడిగా సెక్స్ ను ప్రోత్సహించడం మొదటి తప్పు. నువ్వు ఏలాగైనాజీవించు,ఏమైనాచెయ్యి,కాని ధ్యానంకూడా చెయ్యి అని చెప్పడం రెండవ తప్పు. తననే నమ్మివచ్చిన వేలాదిశిష్యుల జీవితాలతో అమెరికాలోని ఒరెగాన్ స్టేట్లో చెలగాటం ఆడటం మూడోతప్పు.నీతియుత జీవితాన్ని ప్రోత్సహించకుండా ఆశ్రమంలో జరుగుతున్న స్మగ్లింగ్నూ వ్యభిచారాన్నీ(దీనికి తంత్రం అని పేరుపెట్టారు) చూచీ చూడనట్లు ఊరుకోవడమే గాక ప్రోత్సహించడం నాలుగో తప్పు. ఇష్టం వచ్చినట్లు తన ఫిలాసఫీని మారుస్తూ పోవడం ఐదో తప్పు. తన మాటలు నమ్మి ఆశ్రమం ఒక స్వర్గం అని ఆశించి వచ్చినవారిని తన ఇన్నర్ సర్కిల్ చేతిలో నానాబాధలూ అవమానాలూ పెట్టించడం ఆరో తప్పు. మతంలోనూ రాజకీయంలోనూ  తాను దేన్నయితే విమర్శించాడో అవే నియంతృత్వ పోకడలు తన ఆశ్రమంలో తలెత్తుతుంటే ఖండించకుండా వాటిని ప్రోత్సహించడం ఏడో తప్పు. తనకు లేని స్థాయిని శిష్యులు తనకు ఆపాదిస్తుంటే ఆమోదించడం ఎనిమిదో తప్పు. సరియైనగమ్యాన్ని వారికి చూపించకుండా సగం దారిలో వారిఖర్మకు వారిని వదిలెయ్యడం తొమ్మిదో తప్పు.ఆధ్యాత్మికగురువై ఉండీ డబ్బుకు అత్యంతప్రాధాన్యత ఇవ్వడం పదోతప్పు. అప్పనంగావచ్చిన శిష్యులడబ్బుతో విలాసజీవితం గడపడం పదకొండోతప్పు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈలిస్టు కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంటుంది.

"నేర్పరి అయిన నాట్యగాడు ఏనాటికీ తప్పటడుగు వెయ్యడు"-- అని శ్రీ రామకృష్ణులన్నారు. రజనీష్ బోలెడన్ని తప్పటడుగులు వేశాడు.జ్ఞాని ఏనాటికీ పొరపాటు చెయ్యడు.  అతను నిజమైన జ్ఞాని అయితే అతని ద్వారా తప్పు అనేది ఎప్పటికీ జరుగనే జరుగదు. ఒకవేళ జరిగితే అతనికి జ్ఞానం ఇంకా చాలాదూరంలో ఉంది అనే అర్ధం చేసుకోవాలి. అతనింకా పరమగమ్యాన్ని చేరలేదు అనే తెలుసుకోవాలి. ధర్మంతో ఏకత్వానుభూతి పొందినవాడు వేసే ప్రతిఅడుగూ ధర్మమయంగానే ఉంటుంది.కాని రజనీష్ దీనికి వ్యతిరేకార్ధం చెప్పాడు. జ్ఞాని ఏమిచేసినా అది కరెక్టే అని రజనీష్ అన్నాడు.  అంటే జ్ఞాని అయినవాడు తప్పుపని చేసినా అది తప్పు కాదు ఒప్పే అని ఆయన అన్నాడు. ఇతరుల అజ్ఞానంవల్ల  వారికి అది తప్పుగా తోచవచ్చు. కాని అతను చేసింది ఒప్పే అని రజనీష్ వాదించాడు. అసలు తప్పొప్పులనేవి లేనే లేవనీ అవి చూచే వ్యక్తినిబట్టి ఉంటాయనీ వాదించాడు. ఇది వితండవాదమే.

రజనీష్ చెప్పిన కొన్ని సిద్ధాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సంపూర్ణ మనస్సుతో చేసినపని ఏదైనాసరే అది సరైనదే అని ఒక విచిత్రసిద్ధాంతాన్ని ఆయన చెప్పాడు. అంటే ఊగిసలాట లేకుండా ఒక పనిని స్థిరచిత్తంతో చేస్తే అది ధర్మమే అన్నాడు. ఇది చదివినప్పుడు నాకు చచ్చే నవ్వొచ్చింది.రజనీష్ మూమెంట్ ఎందుకు విఫలం అయిందో నాకు అర్ధమైంది.ఇది పూర్తిగా తప్పుడుభావన. రేపులూ హత్యలూ దొంగతనాలూ చేసే క్రిమినల్స్ కూడా సంపూర్ణ స్థిరచిత్తంతోనే, నిమగ్నతతోనే, తమ సర్వశక్తులూ ఉపయోగించి  ఆ పని చేస్తారు. అంతమాత్రాన ఆ తప్పుడు పనులన్నీ యోగం అయిపోవు. అలా చేసేవాళ్ళు అందరూ  జ్ఞానులూ అవరు. ఇలాటి తప్పుడుభావనలు బోధించి ఆయన చాలామందిని పెడత్రోవ పట్టించాడు.

మనసుపెట్టి, త్రికరణ ఏకత్వంతో చేస్తే ఏపనైనా యోగం అవుతుంది అన్నభావన ఆయన బోధించిన వాటిలో ఒకటి. ఇక్కడ ఒక్కవిషయం స్పష్టం చేయ్యదలుచు కున్నాను. మనిషికి కావలసింది త్రికరణ ఏకత్వం కాదు. త్రికరణశుద్ధి కావాలి.ఒక రాక్షసుడిలో కూడా త్రికరణఏకత్వం ఉంటుంది.కాని త్రికరణశుద్ధి ఉండదు. అందుకే అతను యోగి కాలేడు. దివ్యాత్ముడు కాలేడు. కనుకనే మన మతం ఎప్పుడూ త్రికరణశుద్ధిని నొక్కిచెప్పింది కాని త్రికరణఏకత్వాన్ని కాదు.

రావణుడూ దుర్యోధనుడూ కీచకుడూ మొదలైన పౌరాణిక విలన్లు కూడా వాళ్ళుచేసే దుర్మార్గాలు అన్నింటినీ త్రికరణఏకత్వంతో చేసారు, కాని త్రికరణశుద్ధితో చెయ్యలేదు. ఆలోచన,మాట,చేతలనే త్రికరణాలు అంటారు. ఈ మూడూ ఒకేత్రాటిమీద ఉండే త్రికరణఏకత్వం వల్ల సంకల్పశక్తి వస్తుంది. కాని ఆశక్తి ధర్మమార్గంలో ఉండాలని రూలేమీ లేదు.అది ధర్మమార్గంలో ఉండాలంటే ఆ త్రికరణాలలో శుద్ధి ఉండాలి. అప్పుడు విశ్వవ్యాప్తమైన ధర్మంతో ఆవ్యక్తికి  అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు అతని చర్యల్లో ధర్మం ప్రతిఫలిస్తుంది. క్రిమినల్స్ అందరూ త్రికరణఏకత్వం ఉన్నవారే. కనీసం వాళ్ళు నేరం చేస్తున్న క్షణంలోనైనా వాళ్ళ సంకల్పమూ క్రియా ఒకే తాటిమీద ఉంటాయి. అంతమాత్రం చేత వాళ్ళు యోగులూ సిద్ధులూ కాలేరు. వాళ్ళు చేసినపని ధర్మం అనీ చెప్పలేము.

ఒక కష్టసాధ్యమైన పనిని సాధించిన ప్రతివాడూ త్రికరణ ఏకత్వం ఉన్నప్పుడే దానిని సాధించాడు. అది ఒక రోగి ప్రాణం కాపాడటానికి గంటలుగంటలుపట్టే ఒక క్లిష్టమైన మెడికల్ ఆపరేషన్ కావచ్చు లేదా బాంక్ లూటీ కావచ్చు లేదా ట్విన్ టవర్స్ పేల్చివేత కావచ్చు. మాఫియాదొంగలు, తీవ్రవాదులూ, రాజకీయనాయకులూ కూడా గొప్ప సంకల్పబలంతోనూ త్రికరణఏకత్వంతోనూ వాళ్ళ పనులు  నెరవేరుస్తారు. అంతమాత్రాన వాళ్ళందరూ జ్ఞానులు కారు. వాళ్ళు చేసేపనులన్నీ ధర్మపరమైనవీ కావు.

సంపూర్ణమనస్సుతో చేసిన ప్రతిపనీ యోగం కాదు, కాలేదు. శుద్ధమనస్సుతో చేసినపని మాత్రమే యోగం అవుతుంది. ఒక పనిని ఏదోరకంగా సాధించడానికి త్రికరణఏకత్వం ఉంటె సరిపోతుంది. కాని ధర్మపరంగా ఒక పనిని చెయ్యాలంటే త్రికరణశుద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఈ సున్నితమైన తేడాను మనం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
(మిగతా ఐదో భాగంలో)