“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, జనవరి 2012, ఆదివారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -3

ఆధ్యాత్మికలోకంలో చాలా గందరగోళం ఉంటుంది. ఆధ్యాత్మికపరిభాష కూడా స్పష్టతాలోపంతో కూడి ఉంటుంది. చాలాసార్లు మనంవాడే పదాలకు సరైన అర్ధాలు మనకే తెలియవు. ఏదో అలా వాడేస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక లోకంలో అయితే ఇది చాలా సర్వసాధారణం.ఉదాహరణకు ఒకటి రెండు చిన్నచిన్న విషయాలు చూద్దాం.

"జ్ఞానోదయం" అనేమాట మనం తరచుగా వింటూ ఉంటాం. దీన్ని అతిమామూలు అర్ధంనుంచి అత్యున్నత అర్ధం వరకూ అనేక రకాలుగా వాడవచ్చు. "నాకు బుద్ధొచ్చింది" అన్న మామూలు అర్ధంలో కూడా "నాకు జ్ఞానోదయం అయింది" అని అనొచ్చు. నాకు "అత్యున్నత జ్ఞానప్రాప్తి కలిగింది" అనే అర్ధంలో కూడా ఈ పదం వాడొచ్చు.

బుద్ధునికీ జ్ఞానోదయం కలిగింది. మహావీరునికీ జ్ఞానోదయం కలిగింది, జీసెస్ కీ జ్ఞానోదయం కలిగింది, రమణమహర్షికీ జ్ఞానోదయం కలిగింది, జిడ్డుకృష్ణమూర్తికీ జ్ఞానోదయం కలిగింది, UG కృష్ణమూర్తికీ జ్ఞానోదయం కలిగింది,రజనీష్ కీ జ్ఞానోదయం కలిగింది. ఇంకా కొన్నివందలమందికి జ్ఞానోదయం కలిగింది. వీరందరికీ కలిగిన జ్ఞానం ఒకటేనా? లేక వేరువేరా? అని ఆలోచిస్తే ఒక్క విషయం అర్ధమౌతుంది. వీళ్ళందరికీ కలిగిన జ్ఞానం ఒక్కటిమాత్రం కాదు. అనుభవం కూడా ఒకటి కాదు. ఎవరి అనుభవం వారిదే. ఆ అనుభవాలలో కూడా తేడాలున్నాయి. కానీ మనం అందర్నీ ఒకేకోణంలో చూస్తూ "జ్ఞానోదయం" అన్న పదాన్ని అందరికీ ఒకేలా వాడుతున్నాం. అందరూ ఒకేస్థాయిని అందుకున్నారని అనుకుంటున్నాం. ఇది మన అవగాహనా లోపం.

బుద్ధుని వద్దకుకూడా ఒకవ్యక్తి వచ్చి ఇదేప్రశ్న వేశాడు. దానికి బుద్ధుడుకూడా ఇదే సమాధానం చెప్పాడు. బుద్దుడూ మహావీరుడూ సమకాలికులు. అదీగాక వారికంటే ముందే వైదికభావనలు ఉన్నాయి. వైదిక వాజ్మయంలో కూడా జ్ఞానులూ ఋషులూ ఉన్నారు. కనుక మీరందరూ పొందిన జ్ఞానం ఒకటేనా? లేక వేరువేరా అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. దానికి బుద్ధుడు సమాధానమిస్తూ -- "వేరువేరు వ్యక్తులకు కలిగిన జ్ఞానం వేరువేరుగా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన జ్ఞానోదయం కలగలేదు"-- అని చెప్పాడు. ఇది వినడానికి కొంచంవింతగా అనిపిస్తుంది. దానికి కారణం మనం పుస్తకాలు చదివి ఏర్పరచుకున్న భావనలే. చాలాసార్లు గ్రంధాలుచదివి మనం ఏర్పరచుకునే భావనలే మనకు సత్యాన్ని దూరం చేస్తాయి. ఆత్మఒకటే కనుక అందరికీ కలిగే ఆత్మానుభవం ఒకటే అయిఉండాలని మనం ఊహిస్తాం. కాని అందరికీ మనం అనుకుంటున్న ఆత్మానుభవం కలిగిందా లేక ఇంకేదైనా అనుభవం కలిగిందా అన్నవిషయం మనం ఆలోచించం. ఏదో అనుభవం కలిగినంత మాత్రాన అదే  ఆత్మానుభవం అనుకునే ప్రమాదంకూడా లేకపోలేదు. ఇది చాలాజాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. అసలు ఆత్మ అనేది ఉందాలేదా అనే వాదన కూడా ఒకటి ఉంది. మనం ప్రస్తుతం దానిజోలికి పోవడం లేదు. అదలా ఉంచుదాం.

అందరికీ ఒకేవిధమైన జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానం ఆధారంగా వారు ప్రవర్తించే తీరుకూడా ఒకరకంగానే ఉండాలి. కాని మనం పైన చెప్పుకున్న మహాపురుషులు అందరూ ఒకరికొకరు భిన్నంగానే బోధించారు, ప్రవర్తించారు. కనుక వారికి కలిగిన అనుభవమూ, జ్ఞానమూ వేరువేరుగా ఉన్నాయి అని మనము అర్ధం చేసుకోవచ్చు. కాని లోకులు మాత్రం "జ్ఞానోదయం" అన్నపదాన్ని ఒకేఅర్ధంలో వాడుతూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు.

ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఆధ్యాత్మికలోకంలో ఒక గొప్పవ్యక్తిని గురించి చెప్పాలంటే మహనీయుడు, మహానుభావుడు,మహాపురుషుడు,యోగి,సిద్ధపురుషుడు,జ్ఞాని,ద్రష్ట,ఋషి మొదలైన పదాలు వాడుతూ ఉంటాం.ఇవన్నీ సమానార్ధకాలని మనం భావిస్తాం. ఇదీ పూర్తిగా పొరబాటే. ఈ పదాలన్నీ వేరువేరు అర్ధాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఒకే స్థాయిని సూచించే పదాలు కావు. అవన్నీ వేరువేరు స్తాయిలనూ అనుభవాలనూ సూచించే పదాలు. కాని లోకులు పొరపాటుగా వీటిని ఒకే అర్ధంలో వాడుతూ ఉంటారు.

ఇంకొంచం విస్తృతార్ధంలో పరిశీలిద్దాం. సిద్ధుడు అని ఒకవ్యక్తిని సంబోధిస్తే, అతనికి సిద్ధి కలిగింది అన్న అర్ధంలో మనం ఆ మాట అంటాం. కాని అతనికి ఏ రకమైన సిద్ధి కలిగిందో మనకు తెలియదు. "సిద్ధి" అన్న పదంలో లక్షరకాల భేదాలున్నాయి. సిద్దులలో అనేక రకాలున్నారు. మామూలు మంత్రసిద్ధి నుంచి పరిపూర్ణసిద్ధి కలిగినవారి వరకూ వీరిమధ్యన  అనేక అంతస్తులూ అంతరాలూ ఉన్నాయి. అందరినీ సిద్ధుడు అనే మాటతోనే మనం సంబోధిస్తాం. కాని వీరందరూ ఒకే స్థాయిలో ఉన్న మనుషులు అని అనుకోవడమే మనం చేస్తున్న పెద్ద పొరపాటు.ఈ లోకంలో మనుషుల మధ్యన ఎన్ని తేడాలున్నాయో ఆధ్యాత్మికలోకంలో మహనీయుల మధ్య కూడా అన్నితేడాలున్నాయి. వారందరూ ఒకే స్తితిలో ఉన్నవారు కారు. ఈ విషయాన్ని ముందుగా స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. అలాటి స్పష్టమైన అవగాహన ఉన్నపుడే, లోకం గొప్పవారుగా పరిగణిస్తూ పూజించే  మహావ్యక్తులు ఎందుకు తప్పులుచేసారో మనకు అర్ధం అవుతుంది.

వరాహ మిహిరాచార్యుని పుత్రుడైన పృధుయశస్సు తన హోరాసారమనే గ్రంధంలో ఇలా అంటాడు.

శ్లో || చతురాదైర్విహగైన్ద్రేరేకర్క్షగతైస్తు మిశ్రఫలభోక్తా
తేషాందశాసు నియతం ఫలం విపాకే శుభాశుభం తుల్యం

(నాలుగు లేక ఎక్కువ గ్రహములు ఒక గృహంలో ఉన్నపుడు మిశ్రఫలములు కలుగుతాయి. వాటి యొక్క శుభాశుభ స్తితులను బట్టి ఆయా దశలలో నియతములైన ఫలములు కలుగుతాయి).

ఈ శ్లోకం రజనీష్ జాతకానికి సరిగ్గా సరిపోతుంది. రజనీష్ జాతకంలో అష్టమభావంలో అయిదుగ్రహాల కూటమి ఉంది. కనుక ఈయన జాతకాన్ని చదవడం అంతతేలికేమీ కాదు. అష్టమభావం మోక్షత్రికోణాలలో ఒకటి. సప్తగ్రహాలలో రవి గురువులు తప్ప మిగిలిన అయిదుగ్రహాలూ ఇందులో ఉన్నాయి. ఈ భావాదిపతి అయిన గురువు ఉచ్చస్తితిలో మూడింట ఉన్నాడు. కాని వక్రించి ఉన్నాడు. కనుక రజనీష్  లోతైన ఉన్నతమైన ఆధ్యాత్మికచింతన కలిగినవాడేనని తెలుస్తున్నది. కాని గురువుయొక్క వక్రతవల్ల ఈ ఆధ్యాత్మికచింతనాబోధనా కొంతకాలం తర్వాత వక్రిస్తాయని సూచన ఉంది. గురువుకున్న అష్టమ లాభాదిపత్యాల వల్ల ఇది పూర్వజన్మనుంచి ఉన్న కర్మశేషం అని సూచిస్తోంది.

విమ్సోత్తరీ దశా ప్రకారం 21-3-1953 రాత్రి రజనీష్ కు చంద్ర/శుక్ర/గురు/శని/చంద్రదశలో గురు దేహదశ జరిగింది. శుక్రుడు లగ్నాధిపతిగా తనకు తానే సూచకుడు. చంద్రుడు మనస్సుకూ, గురువు ధర్మభావనకూ, శని వైరాగ్యానికీ ఆధ్యాత్మికతకూ సూచకులు. కనుక ఆరోజు రాత్రి రజనీష్ కు  ఒక అతీతవిశ్వానుభావం కలిగినమాట వాస్తవమే అని చెప్పాలి.కాని అంతమాత్రం చేత ఆయన ఒక అవతారపురుషుని స్థాయికి చేరాడు అనుకోవడం పెద్ద పొరపాటు అవుతుంది.

ఆధ్యాత్మిక సాధకులకు అనేక అనుభవాలు కలుగుతాయి. కొందరికి జ్యోతిదర్శనం అవుతుంది. కొందరికి ఇతర లోకాలదర్శనం అవుతుంది.కొందరికి దేవీదేవతల తేజోమయ స్వరూపాల దర్శనం అవుతుంది.కొందరికి అతీత నాదాలు వినిపిస్తాయి. ఇంకొందరికి దివ్యసుగంధపరిమళాలు అనుభూతిలోకి వస్తాయి. కొందరికి,వారిశరీరం మాయమైన అనుభూతి కలుగుతుంది. కొందరికి విశ్వమంతా తానే నిండిఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకొందరికి శూన్యస్థితి అనుభవం లోకి వస్తుంది. ఇంకొందరు ఓంకారనాదాన్ని వింటారు. ఇంకొందరు సూక్ష్మ శరీరానుభవాలను పొందుతారు.మరి కొందరు ఎప్పుడో గతించిన సిద్ధపురుషులను చూచి వారితో మాట్లాడుతారు. ఇలాంటి అనుభవాలు లెక్కకు మిక్కిలిగా వారివారి సాధనాస్థాయిలను బట్టి కలుగుతాయి. అంతమాత్రం చేత సాధన అయిపోయిందని భావించరాదు. అలా భావిస్తే పప్పులో కాలేసినట్లే. 

రజనీష్ కి కూడా ఇలాటి అనుభవమే ఒకటి ఆనాటి రాత్రి కలిగింది. నిజంగా జరిగిఉంటే మాత్రం తప్పకుండా అదిఎంతో గొప్ప విషయమే. కాదనడానికి వీల్లేదు. కాని  దానిని పరిపూర్ణబుద్ధత్వం అనుకోవడానికి కూడా వీలులేదు.  రజనీష్ కు బలమైన వాక్చాతుర్యమూ, విస్తృతగ్రంధపరిజ్ఞానమూ ఉన్నాయి.దానికితోడు ఆయనకు ఆధ్యాత్మికంగా స్వానుభవం ఉన్నమాటా వాస్తవమే. ఈ మూడింటి కలయికవల్ల ఆయన తనశ్రోతలను ఒక ఉన్నతస్థాయిలోకి తేలికగా ప్రవేశపెట్టగలిగేవాడు. తమ గురువులను ఉన్నతంగా భావించడం శిష్యులకు పరిపాటి. కనుక  రజనీష్ కు దూరశ్రవణమూ  దూరదర్శనమూ వంటి సిద్దులు  కూడా ఉన్నాయని ఆయన శిష్యులు చాలాకాలం నమ్మేవారు.కాని అది అబద్దం అని తర్వాతతర్వాత తేలిపోయింది. అమెరికాలో ఒరెగాన్ స్టేట్ లోని రాంచ్ లో రజనీష్ ఆశ్రమం లో జరిగిన అనేక నేరాలకూ ఘోరాలకూ ఆయన సెక్రెటరీ "మా ఆనంద్ షీలా" మాత్రమే కారణం అని, ఆయనదేమీ తప్పు లేదనీ అనుకోడం వీలుకాదు. ఎందుకంటే షీలా ఎటువంటి వ్యక్తో తెలుసుకోలేకపోవడమూ,అటువంటి వ్యక్తికి తనసంస్థ పగ్గాలు అప్పగించడమూ  రజనీష్ చేసిన అతిపెద్ద తప్పు.

తన సెక్రెటరీ ఎలాటిదో, ఆమెయొక్క ఆలోచనలూ భావాలూ ఎలాటివో ఒక సిద్ధపురుషుడు తెలుసుకోలేకపోయాడంటే అది చాలా హాస్యాస్పదంగా తోస్తుంది. ఒరేగాన్లో రజనీష్ ఆశ్రమం కుప్పకూలిన  తర్వాత విలేఖరులు ఆయన్ని ఇలా అడిగారు.  "మీ సెక్రెటరీ వ్యక్తిత్వం ఎలాటిదో మీరు తెలుసుకోలేకపోతే ఇక మీరు పొందిన జ్ఞానం యొక్క విలువ ఏముంది?". దానికి రజనీష్ ఇలా చెప్పాడు --" జ్ఞానం పొందటం అంటే నన్ను నేను తెలుసుకోవడం. కాని నా రూం అంతా వైర్లతో బగ్ చెయ్యబడిందని నాకెలా తెలుస్తుంది?". ఒక సిద్ధపురుషుని నోటివెంట ఇంత చచ్చు సమాధానం నేను ఎక్కడా వినలేదు. తన గదిలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోలేని వ్యక్తి ఇంద్రియాతీత విశ్వానుభవాన్ని పొందాడనటం ఎలా ఉందంటే, చిన్నగ్లాసు నీళ్ళు తాగలేనివాడు, సముద్రంలోని నీళ్లన్నీ ఒక్కగుక్కలో తాగాడని చెప్పడంలా ఉంటుంది.సైకాలజీ కొద్దిగా తెలిసినవారికీ, మామూలు మనుషులకే కొద్దిసేపు మాట్లాడితే చాలు ఎదుటి మనిషివ్యక్తిత్వం ఎలాటిదో తెలిసిపోతుంది. అలాంటిది ఒక సిద్ధగురువుగా  నీరాజనాలు అందుకుంటున్న వారికి తన సెక్రెటరీ మనస్సులో ఉన్న భయంకరదురుద్దేశ్యాలు తెలీలేదంటే అది నమ్మశక్యం కాదు.  కనుక తన స్నేహితురాలైన వివేక్ వంటి ఇతరుల పూర్వజన్మలను ఆయన గ్రహించగలగడమూ అబద్దమేనని చెప్పాలి.

అయితే మరొక్కవిషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. జ్ఞానులుతమచుట్టూ జరుగుతున్న దేనిలోనూ కల్పించుకోరు అనేది సత్యమే. ఒకసారి తన ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాల గురించి ఒకరు రమణమహర్షికి ఫిర్యాదు చేసారు. దానికాయన ఇలా అన్నారు -- "నీక్కావాలంటే నువ్వూ ఆ గుంపులో చేరు. నీకూ భాగం దక్కుతుంది." అంటే, జరుగుతున్న అక్రమాలను ఆపేశక్తి వారికి ఉండదా? లేక ఆపేఇచ్చ వారికి ఉండదా? అని ఆలోచిస్తే, రెండవదే నిజం అని తోస్తుంది. శక్తికూడా అందరికీ ఉండదు అనేది కూడా నిజమే.ఎక్కడా ఏవిధమైన పొరబాట్లూ అక్రమాలూ జరుగరాదు అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటే అసలు దేవుడు సృష్టినే చెయ్యకూడదు.ఎందుకంటే సృష్టిమొత్తం పరస్పర విరుద్దాలతోనూ,అసంబద్దవిషయాలతోనూ,అపరిపక్వతతోనూ నిండి ఉంది. కనుక ఎవరి ఖర్మప్రకారం వారుపోతారు అని జ్ఞానులు దేనిలోనూ కల్పించుకోకుండా అలాచూస్తూ ఉంటారు. జిల్లెళ్ళమూడి అమ్మగారు అందుకే ఇలా అనేవారు -- "అన్నీ నువ్వే చేస్తున్నావనైనా అనుకో లేదా అన్నీ వాడే చేయిస్తున్నాడనైనా   అనుకో". అన్నీ నేనే చేస్తున్నాను అనుకునేవాడూ మౌనంగా ఉండాలి. అన్నీ వాడే చేస్తున్నాడు అనుకున్నా మౌనంగానే ఉండాలి.

అంటే  తన ఆశ్రమంలో జరుగుతున్న ఘోరాలు అన్నీతెలిసే రజనీష్ మౌనంగా ఊరుకున్నాడా? అంటే, అదీ నిజమని మనం చెప్పలేం. ఎందుకంటే, పరిపూర్ణజ్ఞాని అయినవాడికి అసలు లోకాన్ని ఉద్దరించాలన్న కోరిక ఉండరాదు. దేశాలు తిరుగుదామనీ ధర్మప్రచారం చేద్దామనీ వానికి ఉండరాదు. రమణమహర్షినికూడా ఎవరో ఇలాగే లోకోద్ధరణ  గురించి అడిగితే, "లోకాన్ని సృష్టించినవాడు దాని సంగతి చూసుకుంటాడు. నీ సంగతి నువ్వు చూసుకో" అని సమాధానం చెప్పాడు. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు చెప్పినదీ ఆచరించినదీ అత్యుత్తమంగా తోస్తుంది. "పువ్వు వికసిస్తే తుమ్మెదలు అవే వస్తాయి"- అని ఆయన అనేవారు. తన జీవితం మొత్తంమీద లోకోద్ధరణ కోసం ఆయన ప్లానులు వేసిందీ లేదు, దేశాలు పట్టుకొని తిరిగిందీ లేదు. తన జీవితాన్ని తానుగడిపి వచ్చినపని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన గురువులూ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన శిష్యులూ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనమాత్రం ఉన్న చోటే ఉన్నాడు.

ఈ సందర్భంగా కొన్నేళ్ళ క్రితం నేను వ్రాసుకున్న ఒకపద్యం గుర్తొస్తోంది.

|| గురువగు వాడేనాటికి 
మరుగునగల మణిభంగిని మట్టుగ నుండున్  
త్వరపడి లోకము దిరుగడు
అరయంగా సిద్ధగురుల తెరగిది సత్యా || 

మరి లోకంఅంతా తిరిగి ప్రచారంచేసే గురువులందరూ  మోసగాళ్ళా అంటే అదీ నిజమని చెప్పలేం.ఎందుకంటే వివేకానందస్వామికూడా ఎన్నో దేశాలు తిరిగి వేదాంత ప్రచారం చేశాడు. అంతమాత్రం చేత ఆయన జ్ఞాని కాడా? అని అనుమానం రావచ్చు. ఆయన నిస్సందేహంగా జ్ఞానే. అలా దేశాలుతిరిగి ధర్మప్రచారం చెయ్యవలసిన పనిమీదే ఆయన భూమికి తీసుకొని రాబడ్డాడు.కనుక ఆయన వచ్చినపని ఆయన చేసాడు.మరి రజనీష్ కూడా అలాగే చేసాడేమో?అదికూడా ఆయన విహితధర్మమేమో అని అనుమానం రావచ్చు.ఇక్కడ బుద్ధుడుచెప్పిన ఒకమాట గుర్తొస్తోంది. "ఫలాలరుచిని బట్టి చెట్టుయొక్క విలువ తెలుస్తుంది" అని ఆయన అన్నాడు. దీన్నే జీసస్ కూడా బౌద్ధంనుంచి సంగ్రహించి తనబోధలలో వాడుకున్నాడు. ఎవరు ఏమిచేసినా, ఏమిచెప్పినా అంతిమంగా వారిబోధనలు అనుసరించిన మనుషులస్థాయీ వారు పొందేస్తితీ, వారి ప్రవర్తనా అన్నింటినీ రుజువు చేస్తాయి.రజనీష్ శిష్యులలో జ్ఞానులైనవారు అతికొద్దిమందితప్ప ఎక్కడా ఎవరూలేరు. పైగా,తనఆశ్రమంలో జరుగుతున్న ఘోరాలు తెలిసీ రజనీష్ ఊరుకోవడమే కాదు.కొన్నింటిని ఆయన ప్రోత్సహించాడని చెప్పడానికి ఆధారాలున్నాయి.అంతేకాదు ఆయన విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పాడనీ ఆధారాలున్నాయి. కనుక ఆయన పొందాడని చెప్పబడుతున్న స్తితికీ ఆయన ఆశ్రమంలోఉన్నపరిస్తితులకీ,ఆయనశిష్యుల పరిపక్వతలకీ పొంతన కనపడదు.కనుక ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో ఏదో తేడాఉందన్న అనుమానం సహజంగానే తలెత్తుతుంది.

కాని రజనీష్ పూర్తిగామోసగాడు అనిచెప్పలేం.ఆయన సమక్షంలో ఒకశక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందన్న మాట వాస్తవం.ఆయన జాతకంకూడా ఇదేవాస్తవాన్ని చెబుతోంది.ఆయన ఒకవిధమైన అతీతసిద్ధిని పొందిన మాట వాస్తవమే.కాని ఆయన శిష్య్లులనుకున్నట్లు ఆయన ఒక perfect enlightened master మాత్రం కాదు.ఆ పదాన్ని అందుకోడానికి ఆయనఇంకాచాలాదూరం ప్రయాణించవలసి ఉంటుంది.బోధలకూ ప్రవర్తనకూ మధ్యతేడాఉంటే అట్టివారిని తృణప్రాయంగా విసర్జించమని శ్రీరామకృష్ణులు  అనేక చోట్ల చెప్పారు. 

ఇంతకు ముందే చాలా సార్లు మనం అనుకున్నట్లు -- దీపం వెలిగించి గడప మీద ఉంచితే దానివెలుగు ఇంటి లోపలికీ బయటకీ ప్రసరించాలి కదా.అలా జరగడంలేదు అంటే దీపంలోనో ఇంటిలోనో లోపాలు ఉన్నట్లే కదామరి.


(మిగతాది నాలుగో భాగంలో)