“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, డిసెంబర్ 2011, గురువారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -1

రజనీష్ చంద్రమోహన్ జైన్ అనేది ఓషో అసలు పేరు. ఈయన 11-12-1931  రోజున మధ్యప్రదేశ్ లోని కచ్వారా అనే ఊరిలో పుట్టాడు. జనన సమయం సాయంత్రం 5.00 నుంచి 5.45 లోపు అని అంటారు. ఈయన జాతకంలో ముఖ్య సంఘటనలు మనకు తెలుసు. కనుక ఆయా సంఘటనల ఆధారంగా ఈ జాతకాన్ని రెక్టిఫై చేద్దాం. అదే సమయంలో ఈయన భావజాలాన్నీ పరిశీలిద్దాం.

రజనీష్ చెప్పిన విషయాలలో చాలా నిజాలు ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో ఆయన బోధనలు అనుసరించినవారిలో జ్ఞానులైనవారు ఎక్కడా కనిపించరు. నాకు తెలిసినవారిలో రజనీష్ బోధలు ఆచరించిన వారందరూ దారితప్పారు. రజనీష్ శిష్యులలో ఒక్కరంటే ఒక్కరు జ్ఞానులైన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగినవాళ్ళు నాకు కనిపించలేదు. 

ఇతరులను ఏఏ కోణాలలో అయితే విమర్శించాడో అవే లోపాలు ఆయన దగ్గరా ఉన్నాయి. ఇతర మతాలలో ఏఏ లోపాలను ఎత్తి చూపాడో అంతకు మించిన లోపాలు ఆయన సంస్థలోనూ బోలెడన్ని ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే మామూలు లోపాలు కాదు, భయంకరమైన లోపాలు  ఉన్నాయి. కనుక ఆచరణలేని బోధలవల్ల ఉపయోగం ఏమిటి అని కొందరంటారు. ఓషో మూవ్ మెంట్ కూడా ఒక వెల్లువలాగా పెరిగి, పెద్దకెరటంలాగా విరిగి పతనమై పోయింది. దానికి అనేక కారణాలున్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం. ఆయన నిజమైన మహాత్ముడు అని కొందరంటారు. అదేమీ లేదు ఆయనొక మహాతెలివైన మతవ్యాపారి మాత్రమె, ఆయన చెప్పింది ఎక్కువ, ఆచరించింది తక్కువ అని కొందరంటారు.

ఏదైనా ఒకవిషయాన్ని ఓషో చెప్పేవిధానం చాలా బాగుంటుంది, కాని ఆయన చెప్పినదానిని ఆయనే పూర్తిగా ఆచరించలేకపోయాడు. ఎదుటివారినిమాత్రం తన బోధలతో ఎగదోశాడు. వాటిని ఆచరించినవాళ్ళు అందరూ  భ్రష్టుపట్టారు అని కొందరంటారు. ఏది ఏమైనా ఆయనవల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనుషుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి అన్నది నిజం. చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి అన్నదికూడా నిజం. అదే సమయంలో ఎంతోమందికి మెరుగైన ఉన్నతమైన అంతరిక జీవితం సాధ్యం అయింది అన్నదికూడా నిజం. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే దానికి కారణాలలో ఒకటి -- విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఓషో లక్షణం. అలాగే లోకానికి ఒక విలక్షణమైన ఆధ్యాత్మికకోణం ఈయన అందించగలిగాడు అన్నదీ నిజమే. దాన్ని ఆయన ఎంతవరకూ ఆచరించాడు అన్నది మళ్ళీ వేరే సంగతి.

ఇప్పుడు, మనకు తెలిసిన ఓషో జీవిత సంఘటనలను బట్టి ఆయన జనన సమయాన్ని రెక్టిఫై చేద్దాం. ఒక జాతకాన్ని ఎన్నో రకాలుగా రెక్టిఫై చెయ్యవచ్చు. భారతీయజ్యోతిష్యం ఎన్నోరకాలైన విధానాలను ఇందుకోసం ఇచ్చింది. ప్రస్తుతానికి వర్గచక్రాలు మరియు దశల సాయంతో ఈ పని చేద్దాం.

తన తల్లిదండ్రులకు కలిగిన 11మంది సంతానంలో ఈయన పెద్దవాడు. తనయొక్క సోదరులను ద్రేక్కాణ చక్రం చూపిస్తుంది. ఓషో జనన సమయాన్ని (వివాదాస్పద నలభైఅయిదునిముషాలను) కనుక ద్రేక్కాణచక్రంలో చూస్తే మనకు మూడుభాగాలుగా  కనిపిస్తాయి. 5.03 వరకూ కన్య, 5.04 నుంచి 5.45 వరకూ మకరం, 5.46  తర్వాత మిథునం ద్రేక్కాణలగ్నాలౌతాయి. కన్యాలగ్నంలో కేతువుండి, సహోదరదోషాన్ని చూపిస్తున్నాడు. ఏకాదశంలో రవి ఉంటూ తనకుపైన అన్నలు ఉన్నారని సూచిస్తాడు. కనుక మొదటిద్రేక్కాణంలో జన్మ జరగలేదు. ఇక రెండవ ద్రేక్కాణంలో, లగ్నంలో ఏ గ్రహమూ లేదు. ఏకాదశాధిపతి కుజుడు ద్వాదశంలో ఉంటూ తనపైన ఎవరూ అన్నలు అక్కలు లేరని సూచిస్తున్నాడు. తృతీయం గురురాహువులతో కూడి చాలామంది కనిష్టులు ఉన్నారన్న సూచన ఇస్తోంది. ఇక మిధునద్రేక్కాణం బట్టి చూస్తే, ఇక్కడ కూడా  జ్యేష్టులూ కనిష్టులూ ఉన్నారని సూచిస్తోంది. కనుక తృతీయద్రేక్కాణంలో జన్మ జరుగలేదు. జననసమయం రెండవ ద్రేక్కాణంలో ఉంది. అంటే జననసమయం 5.04  నుంచి 5.45  మధ్యలో ఉంది.


సమయాన్ని మరికొంత ఫైన్ ట్యూన్ చేద్దాం. ఓషోరజనీష్ జీవితమంతా ఆస్త్మాతో బాధ పడ్డాడు. చివరిదశలో ఏమిటో తెలియని అనేక రోగాలు ఈయన్ని చుట్టుముట్టాయి. కాని జీవితమంతా వదలకుండా  ఈయన్ని బాధపెట్టింది మాత్రం ఒక్క ఆస్త్మానే. దీనికోసం, రోగాలను సూచించే షష్ఠఅంశ చక్రాన్ని పరిశీలిద్దాం. ఇందులో మూడు లగ్నాలు వస్తాయి. 5.03  వరకూ మకరం.అక్కణ్ణించి 5.24  వరకూ కుంభం. అక్కణ్ణించి 5.45 వరకూ మీనం. మకర లగ్నాధిపతి శని నవమంలో మిత్రస్థానంలో కొలువై ఉన్నాడు. మకరం ఆస్తమాను సూచించదు. ఇక కుంభలగ్నాన్ని చూస్తే, శని దీర్ఘరోగాలకు సూచిక అయిన అష్టమంలో ఉంటాడు. ఊపిరితిత్తులకు సూచిక అయిన మిథునం కుంభానికి త్రికోణరాశి అవుతుంది. కనుక కుంభషష్ఠఅంశ సరిపోతుంది. ఇక మిగిలిన మీనరాశి ఇతరకారణాల వల్ల సరిపోదు. కనుక 5.04 నుంచి 5.24 వరకూ జనన సమయం కుదించబడింది.


ఈ ఇరవైనిముషాలను ఇప్పుడు మరింతగా ఫైన్ ట్యూన్ చేయడం కోసం నవాంశం చూద్దాం. రజనీష్ తన జీవితమంతా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. కాని తాను బ్రహ్మచారిని మాత్రం కానని చాలాసార్లు చెప్పాడు. ఈయనకు చాలామంది స్వదేశీ విదేశీ శిష్యురాళ్ళతో సంబంధాలున్నాయని ఆయన శిష్యులే చెప్తారు. ఓషో అనుసరించినమార్గంలో ఈ పద్దతి తప్పుకాదు. ఓషో యొక్క ఈ భావజాలం ఎంతవరకూ కరెక్టో ముందుముందు పరిశీలిద్దాం. ప్రస్తుతానికి ఈకోణంలో నవాంశను పరిశీలిద్దాం. ఇందులో నాలుగు నవాంశలు వస్తాయి. 5.03  వరకూ మిథున నవాంశ. ఇది ద్రేక్కాణ పరిశీలనలో తొలగించబడింది. అక్కణ్ణించి 5.17 వరకూ  కటక నవాంశ. సప్తమాధిపతి శని ఆరింట ఉండి, ద్వాదశం నుంచి కుజునిచే చూడబడుతున్నాడు. సుఖస్థానాధిపతి శుక్రుడు నీచలో ఉండి నవమంనుంచి ధార్మికగ్రహాలైన గురు కేతువులచేత చూడబడుతున్నాడు. కనుక ఈయన మతజీవితం గడపడంకోసం, పెళ్లి చేసుకోకుండ అలా ఉండిపోయాడు అని తెలుస్తోంది.  కాని రాహువుతో శుక్రుడు కలిసిఉన్నందున చాలామందితో సంబంధాలున్నాయని సూచిస్తోంది. అక్కణ్ణించి 17.31  వరకూ సింహ లగ్నం. రవి సప్తమంలో ఉన్నాడు. సుఖస్థానాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కనుక ఈ సమయంలో పుట్టినవాళ్లకు వివాహం జరుగుతుంది. ఓషో జీవితంలో అలా జరగలేదు గనుక ఈ టైంస్లాట్ పనికిరాదు. 17.45  వరకూ కన్యాలగ్నం ఉంది. ఇందులో రాహుశుక్రులు, సప్తమంలో గురుకేతువులు ఉన్నారు. కనుక రెండు పెళ్ళిళ్ళు అంతకు మించి రహస్యసంబంధాలు ఉండాలి. పెళ్లి జరుగలేదు కనుక ఈ టైంస్లాట్ కూడా కరెక్ట్ కాదు. కనుక ఈ విశ్లేషణ  ప్రకారం 5.04 నుంచి 5.17 లోపు కర్కాటకనవాంశలో జననం జరిగింది అని తెలుస్తోంది.


ఇప్పుడు పదమూడు నిముషాల ఈ జననసమయాన్ని ఇంకా కుదించడానికి విమ్శాంశకుండలి చూద్దాం. ఆధ్యాత్మికవేత్తలకు ఈ వర్గచక్రం చాలా ముఖ్యమైనది. ఇందులో 5.03 వరకూ మకర లగ్నం అవుతుంది. ఇది చరరాశి. కుజుడు రాహుకేతువులూ ఇందులో ఉన్నారు. లగ్నాధిపతి శని కమ్యూనికేషన్ ను సూచించే మూడింట ఉన్నాడు. నాలుగింట తెలివినీ తర్కాన్నీ సూచించే బుధుడు ఉన్నాడు. అయిదింట ఆత్మజ్ఞానకారకుడైన సూర్యుడున్నాడు. ఇది బాగానే సరిపోతుంది. ఇక్కన్నించి 5.14 వరకూ కుంభలగ్నం అయింది. ఇది లోకానికి సహాయపడే రాశి. లగ్నాధిపతి వాక్స్తానంలో ఉన్నాడు. కుజ,రాహు,కేతువులు ద్వాదశంలోకి వస్తారు. తెలివిని సూచించే గ్రహం బుధుడు మూడింటికి వస్తాడు. పైగా శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. అందుకే ఈయన ఇచ్చిన చాలా ఉపన్యాసాలలో బూతుజోకులూ , సెక్స్ టాపిక్సూ చాలా మామూలుగా తడుముకోకుండా చెప్పేవాడు. ఈయన బోధనలలో సెక్స్ అనేది మిళితమై ఉంటుంది. కనుక  ఈ శుక్రప్రభావాన్ని కుంభవిమ్శాంశ మాత్రమే సరిగ్గా చూపిస్తున్నది. అదే మకర లగ్నం అయితే సప్తమం ఖాళీగా ఉంది. అదీగాక చంద్రస్థానం అయింది. అప్పుడు ఈయన సిద్ధాంతంలో ఉన్న సెక్స్ కోణం జాతకంలో ఉండదు. కనుక ఈయన జాతకానికి కుంభవిమ్శాంశ బాగా సరిపోయేటట్లు కనిపిస్తున్నది. అంటే విమ్శాంశ ప్రకారం 5.04 నించి 5.14 లోపల జననం జరిగింది. 

ఈ పదినిముషాల సమయాన్ని కూడా ఇంకా సూక్ష్మీకరించడానికి  చతుర్విమ్శాంశ(సిద్ధాంశ) చక్రాన్ని చూద్దాం. ఇది విద్యను సూచిస్తుంది. రజనీష్ తత్వశాస్త్రంలో PG చేసాడని మనకు తెలుసు. సిద్ధాంశ కుండలిలో 5.09 నుంచి 5.13 వరకూ ధనుర్లగ్నం అవుతుంది. గురు, బుధ, శనులు సప్తమంలో ఉండి   లగ్నాన్ని చూస్తుండటం వల్ల ఈయన విద్యాభ్యాసం అంతా తత్వశాస్త్రం మీదే సాగింది అని సూచన ఈ వర్గచక్రంలో ఉంది. మిగతా సమయపు విభాగాలను లెక్కించవలసిన పని లేదు. కనుక జననసమయం 5.09 నుంచి 5.13  లోపు ఉంది.

ఈ నాలుగునిముషాలను కూడా ఇంకొంచం ఫైన్ ట్యూన్ చెయ్యడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే త్రింశాంశ కుండలిని చూద్దాం. ఇందులో పై నాలుగునిముషాల సమయమూ మకర లగ్నమే అవుతుంది. మకరం పట్టుదలకు సూచన. రజనీష్ మహా మొండివాడని మనకు తెలుసు. లగ్నానికి వెనుకా ముందూ ఉన్న బుధకుజుల వల్ల, తెలివీ పట్టుదలలు ఈయన వ్యక్తిత్వానికి పునాదులు అన్న విషయం తెలుస్తుంది. అంతే గాక ఒక ముఖ్య విషయం ఈ వర్గ చక్రం పట్టిస్తుంది. లగ్నాధిపతి దశమంలో ఉచ్ఛస్తితిలో ఉండటం చూస్తే ఈయన యొక్క అంతిమఉద్దేశ్యాలు బోధనలూ మంచివే అని, అవి  ఆధ్యాత్మికతపైన ఆధారపడి ఉన్నాయన్నది సత్యమే అనీ, అందరూ అనుకునేటట్లు విచ్చలవిడి ఎంజాయ్మెంట్ ను అతను బోధించలేదనీ తెలుస్తుంది.

మరికొంత ఫైన్ ట్యూన్ చెయ్యడం కోసం ఇంతకంటే బాగా సూక్ష్మమైన షష్ట్యంశను చూద్దాం. సామాన్యంగా ఈ వర్గ చక్రంలో ప్రతి రెండు నిముషాలకూ లగ్నం మారిపోతుంది. అక్షాంశ రేఖాంశాలను బట్టి ఒక్కొక్కసారి ప్రతి నిముషానికీ కూడా మారుతుంది. ఇందులో 5.09 కి వృశ్చికలగ్నమూ 5.10 కి ధనుర్లగ్నమూ అవుతాయి. వృశ్చికం లగ్నం అయితే నవమాదిపతి చంద్రుడు దశమంలో ఉంటూ ధార్మికపరమైన వృత్తిని సూచిస్తున్నాడు. నాలుగింట రవిబుధశుక్రులు ఉంటూ ఉన్నతవిద్యనూ విస్తృతజ్ఞానాన్నీ సూచిస్తున్నారు. లాభస్థానం నుంచి శని లగ్నాన్ని చూస్తూ విద్యవల్ల తనకు కలిగిన మేలును సూచిస్తున్నాడు. రజనీష్ కొన్నివేల పుస్తకాలను చదివాడని అంటారు. వాళ్ళ శిష్యులు చెప్పేదాన్ని బట్టి ఆయన లక్షా ఏభైవేల గ్రంధాలను చదివి వాటిలోని సారాన్ని జీర్నించుకున్నాడు. ఇది నిజమో లేక కొంత ఎక్కువగా చెప్పారో తెలీదు కాని, ఓషో రజనీష్ చిన్నప్పటినుంచీ పుస్తకాలపురుగు అనేది నిజమే. 

1998 లో నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో ఉన్నప్పుడు విస్తృతమైన ఆయన పర్సనల్ లైబ్రరీని చూచి చాలా ఆశ్చర్యపోయాను. అందులో లక్షకు పైన పుస్తకాలు ఉన్నమాట వాస్తవమే. ఇక మన ఎనాలిసిస్ కు వస్తే, ఈ కుండలిలో మూడింట కేతువుఉండి ఆధ్యాత్మికపరమైన కమ్యూనికేషన్ ను సూచిస్తున్నాడు. అదే ధనుస్సు లగ్నం అయితే వాక్స్తానంలో కేతువువల్ల వాక్చాతుర్యం ఉండదు. కానీ ఓషో రజనీష్ గొప్ప ఉపన్యాసకుడనీ, యూనివర్సిటీ స్థాయిలో ఆల్ ఇండియా డిబేటింగ్ చాంపియన్ అనీ మనకు తెలుసు. కాని మిగతా ఇతర జీవితవిషయాలు ఈ లగ్నానికి కూడా చూచాయగా సరిపోతాయి. కనుక అంతిమంగా సాయంత్రం 5.09 లేదా 5.10 అనే సమయాలు ఈయన జాతకానికి సరిపోతున్నాయి. ఇప్పుడు దశలను పోల్చిచూచి, ఈరెండు సమయాలలో ఏది సరియైన జన్మ సమయమో చూద్దాం.

(మిగతా రెండవ భాగంలో)