The secret of spiritual life lies in living it every minute of your life

26, ఏప్రిల్ 2011, మంగళవారం

గొర్రెల మంద

అందరికున్నట్లే, నాకూ చాలా కాలం క్రితం కొన్ని అభిప్రాయాలుండేవి. తెల్లనివన్నీ పాలనీ నల్లనివన్నీ నీళ్ళనీ అనుకునేవాణ్ణి. కాని కాలక్రమేణా కలిగిన అనుభవాలూ, తగిలిన ఎదురుదెబ్బలూ నా అభిప్రాయాలను మార్చేశాయి. అలా నాకున్న అభిప్రాయాలలో ఒకటి-- తెలివైనవాడు ప్రతివిషయం లోనూ తెలివిగానే ఉంటాడు-- అని. అది సాధ్యం కాదు అని అతి త్వరలోనే నాకు తెలిసొచ్చింది.

ఎన్ని రంగాలలో ఎంత గొప్పవాళ్లైనా వాళ్ళకూ మానవ బలహీనతలు మామూలు గానే ఉంటాయనీ, కొండొకచో వారి బలహీనతల పాళ్ళు ఒక పిసరు ఎక్కువగానే ఉంటుందనీ అనుభవం నాకు నేర్పింది. చిన్న వాళ్ళు వేసే పల్టీలకూ, పెద్ద వాళ్ళు వేసే పల్టీలకూ పెద్ద తేడా ఉండదు. పైగా పెద్దవాళ్ళ పల్టీలు పెద్దగా ఉండొచ్చు కూడా. అందునా మనది పుణ్యభూమి కర్మభూమి కదా మరి. మహిమలనూ మహాత్యాలనూ నమ్మకపొతే ఎలా? అందుకే బాబాలూ మహత్యాల విషయంలో తల్లకిందులుగా పడిపోవటంలో తెలివైన వారికీ తెలివితక్కువవారికీ భేదం లేదు. ఇంకొందరు తెలివైన వాళ్ళు అలా పడిపోవటంలో కూడా లాభపడతారు.

మన దేశంలో విపరీత పోకడలు ఎక్కువ. ఏదీ బాలెన్స్ గా ఉండదు. నమ్మినా గుడ్డిగా నమ్ముతారు. విమర్శించినా గుడ్డిగా విమర్శిస్తారు. దేనిలోనూ తార్కికతా, పరిశీలనా దృష్టీ ఉండవు. అలాటివి ఉన్న కొద్ది మందిని నాస్తికులనీ, పెడవాదులనీ ముద్ర వేస్తారు. అలాటి పెడవాదులు కూడా, చాలాసార్లు తమకు చిన్న స్వార్ధపరమైన ప్రయోజనం ఒనగూడితే బిళ్ళబీటుగా పడిపోయి దాసోహం అంటారు.

బాబా గారి విషయంలో కూడా అదే జరిగిందని నా అభిప్రాయం. ఆయన చేసిన మహిమలన్నీ హస్తలాఘవాలే అన్నది స్లో మోషన్ కెమెరాలు కనిపెట్టాయి. అవన్నీ ఇంద్రజాలంలో చిన్న చిన్న చీప్ ట్రిక్స్ అని చాలా మంది చాలా కాలంగా మొత్తుకున్నారు. అయినా మన మూఢ భక్తులు ఇవేవీ నమ్మరు. మహనీయులు అయినవాళ్ళు ఇలాటి చీప్ ట్రిక్స్ ప్రదర్శించాల్సిన పని లేదు. మనుషుల్ని ఆకర్షించడానికి అలా చెయ్యవలసి వచ్చింది, అది చిన్న పిల్లలకి చాక్లెట్ ఇవ్వటం లాటిది అని చెప్పి సమర్ధించుకున్నా, అసలు మోసపూరితమైన ట్రిక్కులు ఉపయోగించి దివ్యబోధల వైపు ఆకర్షించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అలా ఆకర్షించినా, దానిలో స్వచ్చత ఎంత అన్నది సమాధానం లేని ప్రశ్న. విత్తనం ఓటిదై నప్పుడు, మొక్క మంచిదేలా అవుతుంది? అక్షరాభ్యాసమే మోసంతో కూడుకున్నప్పుడు, విద్యాభ్యాసం ఉన్నతమైనది ఎలా అవగలదు?

సేవా కార్యక్రమాలు చేసారు కదా అని కొందరు సమర్ధిస్తారు. వాటికీ, అవతార తత్వానికీ సంబంధం ఏమిటో నాకు అర్ధం కాదు. నా చేతిలో లక్ష రూపాయలుంటే, వాటిలో ఒక వంద దానం చెయ్యటం గొప్ప ఎలా అవుతుంది? వారెన్ బఫేట్టూ, బిల్ గేట్సూ కూడా వారి సంపదలో సింహభాగం సేవాకార్యక్రమాలకు దానాలు చేసారు. దానికీ దివ్యత్వానికీ సంబంధం ఏమిటి?

తెచ్చిపెట్టుకున్న నటనా పూరిత డిసిప్లినూ, వ్యక్తిగత జీవితాల్లో ఔన్నత్యం లేని భజనలూ, భక్తీ ఎందుకూ కొరగానివి. సేవ ప్రేమ అన్న పెద్ద పదాలు వినడానికి బాగానే ఉంటాయి. కాని ఎదుటి మనిషిలో ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది అన్న అనుభవ పూర్వక జ్ఞానం లేనంత వరకూ పదాల అసలు అర్ధం ఎవరికీ తెలియదు. అది తెలియనంత వరకూ మనం చేసే సేవ బూటకమే అవుతుంది. చాలా సార్లు పదాల వెనుక ఉండేది స్వార్ధమే. స్వార్ధం అనేది అనేక షేడ్స్ లో ఉండొచ్చు.

పది మందిని మోసం చెయ్యొచ్చు. కాని కోట్లాది మందిని ఎలా మోసం చెయ్యగలరు? అని నా మిత్రుడు ప్రశ్నించాడు. ఒక మనిషిని చేసినట్లే అందర్నీ చెయ్యవచ్చు. ఆ ఒకడు పదిమందిని తెస్తాడు. పది గొర్రెలు నడిచినా లక్ష గొర్రెలు నడిచినా ఒకే తీరులో పోతుంటాయి. తల పక్కకు కూడా తిప్పవు. వాటి నమ్మకం వాటిది. ఇదీ అంతే. పైగా మనం మనుషులం అని చెప్పుకునే అర్హత మనకెక్కడిది. మనకు తార్కికత లేదు, పరిశీలన లేదు, మార్పును స్వాగతించే ధైర్యం లేదు, సత్యాన్ని తరచి చూచే తెగువ లేదు, సత్యాన్ని ఒప్పుకునే సత్తా లేదు, దాన్ని అనుసరించే సాహసం అసలే లేదు. మనకు తెలిసింది ఒక్కటే. మన స్వార్ధం మనం చూసుకోవటం, ఎదుటి మనిషికేమో నీతులు చెప్పటం. మనం మనుషులం ఎలా అవుతాము?

నా మిత్రుడికి ఇంకొక్క మాట కూడా చెప్పాను. పది మందిని మోసం చెయ్యటం సులభం. ఒక్కణ్ణి మోసం చెయ్యటమే కష్టం. మాబ్ సైకాలజీ తెలిస్తే, తెలివైన అనుచరుల గుంపు ఉంటే, పదిమందినేం ఖర్మ, లక్షలాది మందిని మోసం చెయ్యటం చాలా తేలిక అని చెప్పాను.

పొద్దున్న ఒక ముసలాయన ఒక షాపు బయట అరుగు మీద కూచొని ఏడుస్తున్నాడు. ఏంటని అడిగితె--- చిన్నప్పటి నుంచి బాబా భక్తుణ్ణి, రెండేళ్ళ క్రితం రిటైర్ అయ్యాను. శవంగా బాబాను చూడలేక, నా కుటుంబం అందర్నీ చివరి చూపుకు పంపించాను. నేను వెళ్ళలేదు. బాబా ఇంక కనిపించరు అని ఏడుస్తున్నాడు. నేను ఒకే ప్రశ్న అడిగాను. చిన్నప్పటినుంచీ అక్కడికి వెళ్తూ ఇదా మీరు నేర్చుకున్నది? బాబా అయినా ఇంకెవరైనా శరీరంతో ఎన్నాళ్ళు ఉండాలనీ, ఉండగలరనీ మీ ఉద్దేశం? అన్నాను. సమాధానం లేదు.

జీవితమంతా
భజనలు చేస్తే వచ్చిన పరిపక్వత అదీ. పైగా నా వైపు కోపంగా చూశాడు. నాకు నవ్వొచ్చింది. చాలా మందికి నేను చెప్పే విషయాలు నచ్చవు. "యదార్ధవాదీ లోకవిరోధి" అన్న సామెత ఊరకే రాలేదు. నేను హిందువునై ఉండి హిందుత్వాన్ని విమర్శిస్తానని కొందరి విమర్శ. మౌలిక హిందూత్వాన్ని నేను ఎప్పుడూ విమర్శించను. మన మతం అత్యద్భుతమైనదనీ, అది ఒక జీవనవిధానమనీ నాకు తెలుసు. దానిని నేను ఆచరిస్తాను కూడా. కాని దాని పేరుతొ జరిగే ప్రతి తంతునూ, మూడత్వాన్నీ, అనవసర ఆచారాల్నీ, బూటకపు వ్యవహారాల్నీ నేను ఒప్పుకోను. ఒక బాబాను విమర్శించినంత మాత్రానా, అయ్యప్ప మకరజ్యోతి బూటకం అని చెప్పినంత మాత్రానా, నేను హిందువును కాకపోను. ఇందులో నా హిందుత్వానికి భంగం ఏమీ లేదు. నాకు ఎవరి సర్టిఫికేట్టూ అవసరం లేదు.మోసమనే పునాది మీద కట్టినది గొప్ప భవంతి అయినా, అది అందంగా ఏమీ ఉండదు.