Human ignorance is incurable

25, జనవరి 2011, మంగళవారం

గుళ్ళూ గోపురాలూ దీక్షలూ


సామాన్యంగా గుళ్ళూ గోపురాలూ అంటూ తిరిగే వాళ్ళలో 'సోకాల్డ్ భక్తి' ఎక్కువైతే కావచ్చు. కాని మానవత్వం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.ఇది నేను చాలా సార్లు గమనించాను. వాళ్ళు ఎక్కడో కనిపించని దైవంతో కనెక్ట్ కావచ్చునేమో గాని ( అది కూడా వాళ్ల స్వార్ధం కోసమే), ఎదురుగా కనిపిస్తున్న మనుషులతో మాత్రం కనెక్ట్ కాలేరు. ఎందుకంటే ఆ పని చెయ్యాలంటే వాళ్ల స్వార్ధాన్ని కొంత వదిలిపెట్టాల్సి వస్తుంది.

నేను చెప్తున్నది నిజం అనడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. తిరుపతిలో ప్రధాన దేవాలయంలోకి వెళ్ళే చోట మానవత్వం మరిచి చిన్నా పెద్దా, పిల్లా పాపా అని చూడకుండా
ఒకరినొకరు తోసిపడేస్తారు. ఎగబడి దేవుణ్ణి చూడాలన్నధ్యాసలో పక్కవాణ్ని మోచేత్తో కుళ్ళ బొడుస్తారు. ఇది భక్తి ఎలా అవుతుంది? మానవత్వాన్ని మరిచిపోయేవాడు దైవత్వానికెలా చేరువ కాగలడు?

ఒకామెను గర్భవతి అనికూడా చూడకుండా ఒక మూలకు తోసిపడేయ్యటం నేను కళ్ళారా చూశాను. ఇలాటి దృశ్యాలనే అన్ని దేవాలయాలలో చూడవచ్చు. భక్తులలో డిసిప్లిన్ ఉండదు, మానవత్వం ఉండదు అనేదానికి ఎన్నో రుజువులున్నాయి.

గుళ్ళకు గోపురాలకు తిరిగేవారు చాలావరకు పక్కా స్వార్ధపరులు అయిఉంటారు అనేది నా పరిశీలన. అందరు రాజకీయులూ , బ్లాక్ మార్కెట్ గాళ్ళూ , అవినీతి పరులూ ఏదో ఒక దేవుడికి, స్వామీజీకి, బాబాకి పరమ భక్తులే అన్నది జగమెరిగిన సత్యం. కాని వారి నిత్యజీవితాలలో మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు.

మొన్న జరిగిన శబరిమల తొక్కిసలాటలో భక్తుల్ని తొక్కి చంపేసింది సాటిభక్తులే అన్నది ఇంకా నగ్నసత్యం. చనిపోయిన నూరుమందిని కొన్నివేలమంది తొక్కేసి ఉంటారు. అంటే తన ప్రాణం కోసం పక్కవాణ్ని తొక్కి చంపటానికి వెనుదియ్యని వాళ్ళు భక్తులా? అంత మాత్రం నిగ్రహం లేనివాళ్ళు భక్తులా? చావంటే అంత భయం ఉన్నవాళ్ళకు ఇక దేవుడిమీద నమ్మకం ఎక్కణ్ణించి వస్తుంది? వీళ్ళు చేసేవి దీక్షలెలా అవుతాయి?

ఏదో ఒక నెలరోజులో, నలభై రోజులో, దీక్షలు చేసినంత మాత్రాన ఏదో క్రమశిక్షణ జీవితంలో వస్తుంది అనుకోటం పెద్దభ్రమ. వాళ్ళలో ఏ మార్పూ రాదు. మానసిక పరివర్తన అసలే రాదు. అసలు వాళ్ళక్కావాల్సింది ఆధ్యాత్మిక ఔన్నత్యం కాదు. అప్పనంగా దేవుడిస్తాడనుకునే వరాలు మాత్రమే వాళ్లక్కావాలి. వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీరటమే వాళ్ళక్కావాలి. ఈ దీక్షలన్నీ అందుకోసం దేవుడితో చేసే బేరాలూ, వ్యాపారాలూ మాత్రమే. ఇటువంటి వాళ్లకి ప్రత్యెక గౌరవాలు ఇవ్వటం, నమస్కారాలు పెట్టటం శుద్ధ దండగమారి పని. అందుకే నేను ఏ అయ్యప్ప వేషధారినైనా అతని మామూలు పేరుతోనే పిలుస్తాను గాని "స్వామీ" అని పొరపాటున కూడా పిలవను.

ఒక అయ్యప్ప వేషధారిని నేను పేరుతో పిలిస్తే అతనికి కోపం వచ్చింది. "అలా పిలవకూడదు. నన్ను స్వామీ అనాలి." అని చెప్పాడు.

"నువ్వు స్వామివి ఎప్పుడయ్యావు?" అని నేనడిగాను. నేను ఏ భావంతో అన్నానో అతనికి అర్ధం కాలేదు.

"స్వామి" అన్న పదానికి గొప్ప విలువ ఉంది. స్వామీ రంగనాధానందగారు హైద్రాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులుగా చాలాకాలం ఉన్నారు. హైద్రాబాద్ వాసులకు ఆయన సుపరిచితులే. ఆయనకు ఒకసారి ప్రభుత్వం " పద్మశ్రీ" బిరుదు ఇస్తానని కబురు చేసింది. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. కారణం అడిగితే ఆయన "నా పేరులోని స్వామి అన్న బిరుదు నాకుచాలు. స్వామి అంటే తనపై తనకు నియంత్రణ ఉన్నవాడు. ఆత్మనిగ్రహం ఉన్నవాడు అని అర్ధం. దానిని మించిన బిరుదు ఇంకెందుకు?" అని చెప్పారు.


కాషాయ వస్త్రాలు ఎవరు బడితే వారు కట్టకూడదు. స్వామి అని ఎవరు బడితే వారు పిలిపించుకోకూడదు. వాటికి కొంత విలువ ఉన్నది. ఆ స్థాయికి ఎదిగినవారు మాత్రమే ఆ దుస్తులు ధరించాలి. ఆ పదాన్ని ఉపయోగించాలి. మనదేశంలో ప్రతి భిక్షుకుడూ ఆ దుస్తులు వెయ్యడంతో వాటి విలువే పోయింది. మనం ఇంతే. ప్రతి ఉన్నతమైన దానినీ ఇలాగే దిగజారుస్తాము. మనకు తెలిసింది ఇంతే.

రెండువేల ఏళ్ళ క్రితం అశోకుడు వేయించిన శిలాశాసనాలలో (Ashokan Rock Edicts )
తొమ్మిదవ శాసనంలో ఆయన ఇదే మొత్తుకున్నాడు. ప్రజలందరూ పనికిమాలిన దీక్షలూ వ్రతాలూ చేస్తూ సత్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన తన శిలాశాసనంలో ఆవేదన చెందాడు. ఆ శాసనం వేయించి ఇప్పటికి రెండువేల ఏళ్ళు గడిచాయి. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజల్లో మార్పు రాలేదు. అప్పటికీ ఇప్పటికీ ఇంకా పరిస్తితి దిగజారింది. ప్రజాజీవితంలో సౌకర్యాలు పెరిగి ఉండవచ్చు. కాని స్వార్ధం కూడా అదే స్థాయిలో పెరిగింది. అజ్జానమూ అలాగే పెరిగింది.

ఆ శాసనం మాత్రం మనల్ని వెక్కిరిస్తూ ఇప్పటికీ అలాగే ఉంది.

9th Rock Edict of Emperor Ashoka
-----------------------------------------------
" Thus speaks the Beloved of the Gods, the king Piyadassi. People practise various ceremonies. In illness, at the marriage of sons and daughters, at the birth of children, when going on a journey- on these and on other similar occasions people perform many ceremonies. Women especially perform a variety of ceremonies, which are trivial and useless. If such ceremonies must be performed they have but small results. But the one ceremony which has great value is that of Dhamma. This ceremony includes, regard for slaves and servants, respect for teachers, restrained behaviour towards living beings and donations to sramanas and brahmans -- these and similar practices are called the ceremony of Dhamma. So, father, son, brother, master, friend, acquaintance,and neighbour should think, 'This is virtuous, this is the ceremony I should practice, until my object is achieved."