Human ignorance is incurable

22, జనవరి 2011, శనివారం

సత్యాధార నమ్మకం

మన నమ్మకాలకు సత్యం ఆధారం అవడం ఉత్తమం. లేకపోతే నమ్మకం గుడ్డి నమ్మకం అనిపించుకుంటుంది.

ప్రతివారూ
తాము నమ్ముతున్నదే సత్యం అనుకుంటారు. ఒకవేళ అది అసత్యం అని తెలిసినా ఏదో రకంగా దాన్నిసమర్ధించుకుంటారు. ఎన్నో ఏళ్ళుగా తాము నమ్ముతున్నది అబద్దం అన్న నిజాన్ని భరించలేకపోవటమే సమర్ధనకుకారణం తప్ప ఇంకేమీ కాదు. అంతరాంతరాలలో ఏది నిజమో ఏది అబద్దమో మనకు బాగా తెలుసు. కాని దాన్నిఒప్పుకోలేం. ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తలదూర్చి హాయిగా ఉన్నామన్న భ్రమలో ఉంటాం.

శబరిమలపైన కనిపించే మకరజ్యోతి మానవకల్పితం అన్న సంగతి కనీసం ఇరవై ఏళ్ళుగా నేను చెబుతూనే ఉన్నాను. సంగతి నా స్నేహితులకూ దగ్గరి బంధువులకూ అనేకసార్లు చెప్పాను. ఇప్పుడు అదే సంగతి బయటపడేసరికి అనేకమందిఒక వింత వాదాన్ని ఎత్తుతున్నారు. " మానవ కల్పితం అయినా సరే అది మా నమ్మకానికి సంబంధించిన విషయం. అదిమోసం అయినా సరే దాన్ని మేము ఏళ్లతరబడిగా నమ్ముతున్నాం గనుక మా వరకు అది సత్యమే. ఇప్పుడు నమ్మకాన్ని ఒదులుకోం". వాదన చాలా బాగుంది. అది వీళ్ళ దివాళాకోరుతనాన్ని చక్కగా నిరూపిస్తున్నది.

ఇంకొంతమంది చెప్పేది ఇంకా వింతగా ఉంది. మకరసంక్రమణ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంకనిపిస్తుందిట. అది మానవ కల్పితం కాదుట. దూరంగా సిమెంటు ప్లాట్పారం మీద వెలిగించే పెద్దకర్పూరం మంటమానవులే వెలిగిస్తారు అనేది ఒప్పుకుంటారుట, కాని ఆకాశంలో కనిపించే నక్షత్రం మాత్రం నిజమేట. ఎక్కడుంది నక్షత్రం? సూర్యునికి దగ్గరగా ఉండే శుక్రగ్రహం సూర్యాస్తమయం తర్వాత ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపించవచ్చు. అది నక్షత్రం కాదు.మకరజ్యోతి అసలే కాదు.

అసలు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో నక్షత్రమూ ఆకాశంలో ప్రత్యక్షం కాదు. అది అసాధ్యం. మకరసంక్రమణానికీ నక్షత్రానికీ ఎటువంటి సంబంధం లేదు. నక్షత్రాలు ప్రతి ఏడాదీ ఒకే సమయానికి అలా పుట్టి క్షణంపాటుకనిపించవు. తరువాత మాయమూ కావు. అసలు అటువంటి నక్షత్రం ఆకాశంలో ఉండే అవకాశం ఎంతమాత్రం లేదుగాకలేదు. మహా అయితే అది శుక్రగ్రహం కావచ్చు.

అసలు ముప్పై ఏళ్లక్రితం, తిరుపతి వెంకటేశ్వర స్వామిద్వారా ఆంధ్రాప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని గమనించినకేరళ రాష్ట్రం పకడ్బందీగా ప్లాన్ వేసి ఏళ్ల తరబడి అమలుచేస్తున్న తంతు తప్ప ఇదంతా ఇంకేమీ కాదు. వెర్రి వెర్రి అంటేవేలంవెర్రి అని అందరూ అయ్యప్ప దీక్షలకు ఎగబడటానికి వెనుక కొన్ని సైకలాజికల్ కారణాలున్నాయి.

>>కులాల పట్టింపులు అయ్యప్ప దీక్షలో లేకపోవటం,
>> ఏడాదిగా తాము చేస్తున్న పాపాలు పోతాయన్న భ్రమా,
>>మళ్లీ కొత్త పాపాలు చెయ్యొచ్చన్న ఉత్సాహమూ,
>>నల్ల గుడ్డలు వేసుకుందే తడవుగా అప్పటివరకూ నానాతిట్లూ తిట్టినవాళ్ళుకూడా మర్యాదగా "స్వామీ" అని పిలిచిగౌరవించడం ద్వారా కాళ్లకు నమస్కారాలు పెట్టటం ద్వారా వచ్చే ఈగో శాటిస్ఫాక్షనూ,
>>ఏడాదికోసారి పిక్నిక్ లాగా దేశమంతా తిరిగి హాయిగా రిలాక్స్ కావడమూ,
>>అన్నిటికీ మించి దీక్షాహింస ద్వారా తాము ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నామనీ ఇతరులకన్నా అధికులమనీకలిగే డొల్ల ఆత్మతృప్తీ

ఇవన్నీ అయ్యప్పదీక్షలంటే జనాలు వేలంవెర్రిగా ఎగబడటానికి గల సైకలాజికల్ కారణాలు. ఇప్పుడు మకరజ్యోతి బూటకం అని రుజువైనా కూడా దాన్ని ఒప్పుకునే ధైర్యం లేకపోవడానికి కూడా ఇవే కారణాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి.

సత్యాన్ని ఒప్పుకోటానికి చాలా నిజాయితీ కావాలి. ధైర్యమూ కావాలి. ఒకవేళ తాను ఇప్పటివరకూ నమ్మినదంతా అబద్దం అని తెలిస్తే ఏమాత్రం సంకోచించకుండా తత్క్షణమే నమ్మకాలను ఒదిలిపెట్టి మళ్లీ తిరిగి వైపు చూడకుండా ఉండగలిగే మానసికధైర్యం ఉన్నవారే సత్యాన్ని అనుసరించగలరు. మిగిలిన మందలో గోవిందాగాళ్ల పని "స్వామియే శరణంఅయ్యప్ప" మాత్రమే.

అసలు మనుషుల్లో ఇటువంటి పిచ్చినమ్మకాలు భలే వింతగా ఉంటాయి. గణేశ విగ్రహాలు పాలు తాగాయంటే ఎగబడిపాలు పట్టిస్తారు. పక్కన పసిపిల్లలు ఆకలితో ఉన్నా పట్టించుకోరు. బ్రహ్మంగారి విగ్రహం కన్నీరు కారుస్తున్నదంటే పొలోమంటూ కొబ్బరికాయలు కొడతారు. కానీ ఆకలితో ఉన్నవాడికి ఒక కొబ్బరిముక్క కూడా ఇవ్వరు. అదేఇంట్లో తండ్రిజబ్బుతో ఉంటే కొడుకు పట్టించుకోడు. తల్లితండ్రుల్ని హింసపెట్టె అయ్యప్పభక్తులు ఎంతోమంది ఉన్నారు. మేరీమాతవిగ్రహం కళ్లవెంట రక్తపురంగులో ద్రవం కారుతున్నదంటే వందలమైళ్లనుంచి వచ్చి గొర్రెల్లాగా మతం మార్చుకుంటారు. కాని తల్లికి ఒంట్లో బాగలేకపోతే పక్కవీధిలోని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలంటే మాత్రం కుదరదు. ఉంచుకున్నదాన్ని మాత్రం పిక్నిక్ కు తీసుకెళ్ళి వేలకు వేలు ఖర్చుపెడతారు . సాయిబాబా పటంలోనుంచి విభూతి వస్తున్నదంటే క్యూకట్టి మరీ బూడిద గీక్కుని తెచ్చుకుంటారు. అదే వీధిలో ఆకలితో మన కళ్లముందే చచ్చిపోతూ ఈగలు ముసురుతున్న దిక్కులేని ముసిలిదాన్ని చూస్తూ పట్టనట్టు పోతుంటారు. వీళ్ళు భక్తులుట? చెప్పుకోటానికి సిగ్గెట్లా ఉండదో వీళ్ళకి? మానవత్వం లేనివాళ్లు భక్తులెలా అవుతారు? నా దృష్టిలో వీళ్ళంతా కరుడు గట్టిన స్వార్థ పరులూ, దొంగలూ తప్ప భక్తులు ఎంతమాత్రం కాదు.

భక్తి అన్న పదానికి నారద భక్తి సూత్రాలలోనూ, శాండిల్య భక్తి సూత్రాలలోనూ, చైతన్య మహాప్రభు విరచిత స్తోత్రాలలోనూ నిర్వచనాలున్నాయి. ముందుగా అవి చదివి అర్ధం చేసుకుని ఆచరిస్తే అప్పుడు ఒక్క ఇసుక
రేణువంతన్నా భక్తి మనకు అంటుకోవచ్చు.అంతేగాని మన ఇష్టం వచ్చిన తిక్క పనులు, పిచ్చి దీక్షలూ చేస్తూ, ఎవరిదో పటం పెట్టుకుని రెండు అగరుబత్తీలు వెలిగించి బొట్టుపెట్టుకున్నంతమాత్రాన అదే భక్తి అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ఇటువంటి పిచ్చినమ్మకాలకు మతమూ అతీతం కాదు. మక్కాలో రాతి స్థంభాన్ని రాళ్లతో కొట్టి సైతాన్నిచంపుతున్నాం అని ఆనందించే ముస్లిమ్ ఇంటికొచ్చిన తర్వాత ఒక హిందువుని ప్రేమించిన కూతుర్నో చెల్లెల్నో రెండోఆలోచన లేకుండా నరికి చంపుతాడు. దేవుడి పేరుతొ సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపగలడు. ఇది భక్తి ఎలా అవుతుంది? మోసాన్ని అసహ్యించుకున్న జీసస్ ని నమ్ముతున్న క్రిస్టియన్ ఎవడో పంపిన డబ్బూ వస్తువులూ ఆశచూపి
సాటి మనిషిని మతం మారుస్తాడు. డబ్బులో చాలాభాగం కమీషన్ గా కొట్టేస్తాడు. అదొక బిజినెస్స్ గా మార్చి నాలుగైదేళ్ళలో కోట్లు వెనకేస్తాడు. ఇవన్నీఏమిటో, అసలు ఎలా చేస్తారో, ఇంత ఆత్మవంచనతో ఎలా బతుకుతారో భగవంతుడికే తెలియాలి. ఇది భక్తి ఎలా అవుతుందో నాకు మాత్రం ఎప్పటికీ అర్ధంకాదు. ఇది భక్తి కాదు. దేవుణ్ణి రోడ్డు మీద నిలబెట్టి పావలాకి అమ్ముకోటమే.

ప్రతి ఏడాదీ గుళ్ళూ గోపురాలూ దీక్షలూ అని ఖర్చుపెట్టే డబ్బుతో-- ఆకలితో చచ్చిపోతున్న దిక్కులేనివాళ్ళకూ, డబ్బుల్లేక చదువుకోలేక పదేళ్లకే కూలీలుగా మారి పేవ్ మెంట్లమీద దోమల్తో కుట్టించుకుంటూ నిద్రపోయేవాళ్లకూ, బీదరికంతో మందులు కొనలేక రోగాన్ని ముదరబెట్టుకుని చచ్చిపోతున్నవాళ్లకూ, తినడానికి నాలుగుమెతుకుల్లేక పడుపువృత్తిలో రోగాలతో మగ్గిపోతున్నవాళ్లకూ, స్వతంత్రంగా బతికే ఆర్ధికస్తోమతలేక తాగుబోతు తిరుగుబోతు మొగుళ్లచేతుల్లో తిట్లూతన్నులూ తింటూ ఇష్టంలేని కాపురాలు చేస్తూ ఏడుస్తూ నరకంలో బతుకులు వెళ్లదీస్తున్నవాళ్లకూ-- ఏదైనా సాయం చేస్తే భగవంతుడు అమితంగా సంతోషిస్తాడు. అంతేకాని ఇలాటి పనికిమాలినదీక్షలు అనవసరం. చెత్తపూజలు అంతకంటే నిరర్ధకం. మనసులో స్వార్ధం ఉన్నంతకాలం భక్తి అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఒకవేళ వచ్చింది అని మనం అనుకుంటే అది ఆత్మవంచన తప్ప ఇంకేమీ కాదు.

ఏడాదికోసారి వేసే రంగురంగుల వేషాలు,
ఏడాదిపొడుగూతా చేసే పచ్చిమోసాలు
నీతిలేని కపట జీవితాలు,
మైకుల్లో మాత్రం హోరున భజనలు
తినేవి పొంగళ్ళూ గారెలూ పరమాన్నాలూ,
గుడిబయట చెత్తకుండీలలో
ఎంగిలాకులు
నాక్కుని తింటున్న సాటిమనుషులు,
మైకుల్లో చెప్పేవి మహోపన్యాసాలు,
జాలీదయా ఏమాత్రం లేని పాషాణహృదయాలు
ఇవీ మన జీవితాల్లోని కఠోరవాస్తవాలు.

ఎవడిక్కావాలి బోడి భక్తి? దేవుడు మెచ్చుతాడు ఇటువంటి దీక్షలని? ఇదంతా దేవుడిపేరుతో చేస్తున్న వ్యాపారం తప్ప ఇంకేమీ కాదు. మతం కోసం ఖర్చుపెడుతున్న డబ్బుని మానవతకోసం ఖర్చుపెడితే అప్పుడు భగవంతుడు నిజంగా మెచ్చుతాడు. తానే మనకోసం దిగివస్తాడు. అలాకాకుండా-- "మా పిచ్చినమ్మకాలు మావి, అవి సత్యదూరాలైనా సరే వాటిని ఏమాత్రం వదులుకోం. నువ్వు మాకు అనవసరం. నీ వరాలు మాత్రం కావాలి. నువ్వు మేం చెప్పినరీతిలోనే డాన్స్ చెయ్యాలి, మేం కోరిన వరాలు ఇవ్వాలి. రమ్మన్నపుడు రావాలి పొమ్మన్నపుడు పోవాలి. మేం మాత్రంమా ఇష్టం వచ్చినట్లే ఉంటాం." అని దేవుణ్ణే శాసిస్తుంన్నంతకాలం దేవుడు ఉలకడు పలకడు. నవ్వుతూ విగ్రహంగానే చూస్తూ ఉంటాడు. మనం మాత్రం నడిచే దెయ్యాలుగా బ్రతుకుతూ ఉంటాం.

"బుద్ధి కర్మానుసారిణి"-- మూర్ఖ లోకాన్ని ఎవడు మార్చగలడు?