Human ignorance is incurable

14, డిసెంబర్ 2010, మంగళవారం

కాదేదీ కులాని కతీతం

"కాదేదీ కవితకనర్హం" అన్నాడు శ్రీ శ్రీ.

మన సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలంటే "కాదేదీ కులాని కతీతం" అనాలేమో.

మన
సమాజంలో ఏదీ కులానికి అతీతం కాదు. చివరకు అన్నింటికీ అతీతులైన మహాపురుషులకూ కుల సంఘాల బెడద తప్పలేదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దేవుణ్ణి కూడా కులాలవారీగా విభజించుకున్న మహా ఆదర్శ సమాజం మనది.

ఒక విధంగా చెప్పాలంటే, అయ్యప్ప దీక్షలు అనేవి కులాలకు అతీతమైనవి. ఎందుకంటే కులం వారైనా దీక్ష తీసుకున్నపుడు అందరూ సమానమే అన్న భావనలో ఉండాలని అది తీసుకున్న నా మిత్రులు చెప్పేవారు. నేనూ నిజమే కాబోలని అనుకునే వాణ్ని. కానీ ఇప్పుడో కొత్త విషయం తెలిసింది.

అయ్యప్ప ఆలయాలు కూడా కులాల వారీగా ఉన్నాయిట. బ్రాహ్మణుల అయ్యప్ప గుళ్ళో ఇతరులకు దీక్షలివ్వరుట. ఒకవేళ ఇచ్చినా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారుట. చొక్కాలు విప్పినపుడు జంద్యం కనిపించక పొతే వారి ట్రీట్మెంట్ తేడాగా ఉంటుందిట. మానసిక హింస భరించలేక ఇతరులు గుడికి రారు. అలాగే కాపులకు, కమ్మవారికి ఇలా ప్రతి కులానికీ ప్రత్యెక గురువు, గుడీ, దీక్షా ఉన్నాయిట. ఇది విని నాకు భలే నవ్వొచ్చింది. అంటే కాదేదీ కులాని కతీతం అన్నమాట. బ్రాహ్మణ అయ్యప్ప, వైశ్య అయ్యప్ప, కమ్మ అయ్యప్ప, కాపు అయ్యప్ప ఇలా అయ్యప్పలలో కూడా తేడాలున్నాయిట. ఇదేం ఖర్మో నాకర్ధం కాలేదు.

కానీ
కోణం లో పరిశీలిస్తే ఇదంతా నిజమే అని అర్ధమైంది. గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయాలు మూడో నాలుగో ఉన్నాయి. అక్కడ కూడా ఇదే తంతుట. ఒకాయన వెంకటేశ్వర చౌదరి, ఒకాయన వెంకటేశ్వర శ్రేష్టి, ఇంకొకాయన వెంకటేశ్వర నాయుడు, ఇంకొకాయన వెంకటేశ్వర శాస్త్రి. అంటే ఎక్కడ చూచినా కులాలే గాని అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడా లేడన్నమాట. అలాగే అయ్యప్ప దేవాలయాల్లోనూ ఇదే వరస. ఎక్కడ చూచినా ఇదే కులపిచ్చి.

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. గురువులలో కూడా ఇదే తంతు కొనసాగుతుందిట. ఒక మంచి ఉపన్యాసకుడైన గురువుగారు వైశ్యుడు, అందుకని ఆయన శిష్య వర్గం లో చాలా మంది వైశ్యులేట. అరవింద యోగి నాన్ బ్రాహ్మిన్ కనుక ఆయన శిష్యులు చాలా మంది వారే ఉన్నారట. ఒక రెడ్డిగారు సిద్దపురుషుడైతే ఇక వర్గం వారు ఆయన చుట్టూ ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేస్తుండటం ఇప్పుడు చూస్తున్నాం.

వ్యాధి సాయిబాబా భక్తులకూ సోకింది. వారిలో బ్రాహ్మణ గురువు గారి చుట్టూ కులం వారే ఉంటారుట. ఇతర కులాల గురువుల చుట్టూ ఆయా కులాల వారే ఎక్కువగా ఉంటారుట. ముస్లిమో హిందువో తెలియని సాయిబాబా భక్తుల్లో కూడా కులవిభజన ఉందని, కులాల వారీగా అక్కడ కూడా గురువులు, ఆలయాలు ఉన్నాయని తెలిసి ఆశ్చర్య పోయాను.

నిన్న ఒక వైశ్య ప్రముఖుడు నా దగ్గరకు ఏదో పని మీద వచ్చి, పోతూ పోతూ, " మా గుడికి ఒకసారి రండి సార్ " అని ఆహ్వానించాడు.

నాకర్ధం గాక " మీదే గుడి" అని అడిగాను.

మాత్రం కూడా తెలీదా అన్నట్లు చూచి "
ఫలానా గుడి" అని చెప్పాడు.

"
ఒకటి రెండుసార్లు అదే దారిన పోతూ అక్కడకు వచ్చాను" అని చెప్పాను.

"
అలా కాదు. ముందుగా నాకొక ఫోన్ చేసి రండి. ప్రత్యెక దర్శనం చేయిస్తాను" అన్నాడు.

నేను నవ్వాను. "సారీ. నేను గుళ్ళకు పోయేదే తక్కువ. ఎప్పుడైనా వెళితే మామూలు మనిషిగా రావటమే నాకిష్టం. దేవుని దగ్గర ప్రత్యేకతలేముంటాయి ?" అన్నాను.

ఆయన అదో రకంగా ముఖం పెట్టి వెళ్ళిపోయాడు.

మాల కులానికి చెందిన ఒక మంచి మిత్రుడు నాకున్నాడు. మేం ఫామిలీ ఫ్రెండ్స్. ప్రతీ క్రిస్మస్ రోజున అర్ధరాత్రి ఏదో ఒక చర్చికి వెళ్లి కొద్దిసేపు ప్రార్ధించి రావటం నాకలవాటు.అలా మొదటిసారి ఒక చర్చిలో అనుకోకుండా కలిశాము. నన్ను అక్కడ చూచి అతను ఆశ్చర్య పోయాడు. నా భావాలు తెలుసుకున్న తర్వాత నాకు మంచి మిత్రుడైనాడు. మరుసటి ఏడాది నేను ఇంకొక చోటికి వెళ్లాను. ఆ తర్వాత ఆయనకు ఆ విషయం చెప్పి ఆ రెండవ చర్చిలో వాతావరణం బాగుంటుంది. అక్కడికి వెళ్ళండి అని చెప్పాను. అతను నవ్వాడు.

"అది వేరే వాళ్ళ చర్చి అక్కడకు మేము వెళ్ళము" అన్నాడు. ఆ తరువాత ఇంకా అబ్బురపరిచే విషయాలు తెలిసాయి. ఒక ఊళ్ళో కమ్మవారందరూ క్రైస్తవ మతం తీసుకున్నారు. వారికి ఒక చర్చి కట్టుకున్నారు. అదే ఊళ్ళోని ఎస్సీ ఎస్టీలకు వేరే చర్చి ఉన్నది. కమ్మవారు ఎస్సీల చర్చికి పోరు. వారు వీరి చర్చికి రారు. అంటే మతం మార్చుకున్నా కులం వీరిని వెంటాడుతూనే ఉందన్నమాట.

"
భక్తేర్ జాతి నోయ్" అని శ్రీ రామకృష్ణులు అనేవారు. భక్తులలో జాతులు కులాలు ఉండవు అని ఆయన భావం. అది వాస్తవమే. కానీ, అన్ని మహోన్నత ఆదర్శాల లాగే ఇది కూడా సంఘంలో సార్వజనీనికంగా ఎన్నటికీ ఆమోద యోగ్యం కాబోదు. నిజమైన భక్తి అనేది కులాలకూ మతాలకూ అతీతమైనదే. అందులో ఏమీ అనుమానమూ సందేహమూ లేదు.

నాగ
మహాశయునిగా పిలువబడిన దుర్గాచరణ నాగ్, శ్రీ రామకృష్ణుని మహాభక్తుడు. అత్యున్నత ఆధ్యాత్మికశిఖరాలను అందుకున్నవాడు. శూద్ర కులం లో పుట్టిన నాగమహాశయునికి శ్రోత్రియ బ్రాహ్మణ కులంలో పుట్టిన భక్తులు ఎందఱో పాదాభివందనం చేసేవారు. అదీ కులాలపట్టింపులు గట్టిగా ఉన్న నూరేళ్ళ క్రితం. నిజమైన భక్తి కులాన్ని మతాన్ని లెక్కచెయ్యదు. భక్తులకు కుల పట్టింపులు ఉండరాదు.

ఉన్నత ఆదర్శాలను ఎక్కువ శాతం ప్రజానీకం ఎన్నటికీ అందుకోలేదని నా భావన. అవి కొందరు వ్యక్తుల కోసమే. మామూలు పూలు ఎక్కడైనా దొరుకుతాయి. బ్రహ్మ కమలాలు మాత్రం ఎక్కడో మాత్రమె ఉంటాయి.


కులానికి
అతీతంగా ఎదగలేని మనుషులు భగవంతుని ఎలా చేరుకుంటారో నాకెప్పటికీ అర్ధం కాదు. సామాన్య మానవ పరిమితులు దాటలేనివారికి గుళ్ళూ పూజలూ ఏం మేలు చేస్తున్నట్లో కూడా నాకర్ధం కాదు.

నిజమైన ఆధ్యాత్మికత మాత్రమె మనిషిని సంకుచిత పరిదులనుంచి విముక్తి చెయ్యగలదు.