Human ignorance is incurable

10, నవంబర్ 2010, బుధవారం

పార్ట్ టైం దీక్షలు

కార్తీక మాసం వచ్చింది. ఇక పార్ట్ టైం దీక్షలు మొదలౌతున్నాయి. నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు ఇలా రకరకాల రంగుల్లో మనుషులు కొన్నాళ్ళ పాటు కనిపిస్తారు. మైకులు, భజనలు, తంతులు జోరుగా సాగుతాయి. మనుషుల్లో, మనసుల్లో, అలవాట్లలో, మాత్రం మార్పు రాదు. అదే విచిత్రం.

మొన్నీ మధ్య కాలింగ్ బెల్ మోగితే ఎవరో అని చూచాను. అయ్యప్ప డ్రస్ లో ఉన్న ఒక ఇరవై పాతిక మధ్యకుర్రాడు. ఏంకావాలని అడిగాను. అయ్యప్ప భజన తర్వాత సంతర్పణ చేద్దామని చందాలు వసూలు చేస్తున్నాము. ఎంతో కొంతఇవ్వండి అని అభ్యర్ధించాడు. మా మధ్య సంభాషణ ఇలా జరిగింది.

"బాగానే ఉంది. ఒక్క సంగతి చెప్పు. నీవు ఈ దీక్షను ఎందుకు తీసుకున్నావు? నీ కోరికలు తీరడం కోసమా? లేక లోకంకోసమా?"

పాపం ఏ గుణాన ఉన్నాడో నెమ్మదిగానే జవాబు చెప్పాడు.

"నాకే మంచి జరుగుతుందని తీసుకున్నాను."

"మరి ఇతరుల చందాలతో సంతర్పణలు ఎందుకు? ఇలా చెయ్యమని అయ్యప్ప దీక్షలో ఉందా?"

జవాబు లేదు.

" నీ సంపాదనలో నీవు ఖర్చు పెట్టగలిగినంత డబ్బుతో నిజంగా ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టొచ్చుగదా? ఊరందరి చందాలతో మీరందరూ కలిసి కూచుని భోజనాలు చేస్తే అదేమి దీక్ష అవుతుంది?"

అతను కొంచం బాధ పడినట్లుగా కనిపించాడు.

"సారీ బాబు. నేనిలాటి వాటికి డబ్బులివ్వను. ఏమనుకోకు." అని చెప్పి పంపాను.

ఏ ఆధారం లేనివాడికి ఏదో ఒక గడ్డిపోచ దొరికితే అదే పెద్ద ఆధారం అనుకోవటం సహజం. అలాగే, మత విషయాలలో మన సమాజానికి సరియైన దిశానిర్దేశం కరువయ్యే సరికి ప్రతి కొత్త విషయమూ ఒక వింతగానే కనిపిస్తున్నది. మన అడ్రస్ మర్చిపోతే ప్రతి ఇల్లూ మన ఇల్లులాగే కనిపిస్తుంది. కేరళ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప దీక్షను ఒక పెద్ద సీజనల్ బిజినెస్ గామార్చి దానిమీద మాలలేసి, టూర్లు ఆర్గనైజ్ చేసి, గుళ్ళు కట్టి బాగా సంపాదించిన వాళ్ళు నాకు తెలుసు. అయ్యప్ప దీక్షకు పెరుగుతున్న పాపులారిటీని ఆసరాగా తీసుకుని ఇతర దేవుళ్ల దీక్షలు తయారు చేసి,దానికి డ్రస్ కోడ్ పెట్టి, గురువులవేషాలేసి, బిజినెస్ చేసుకునేవారి సంఖ్యా బాగానే పెరుగుతున్నది. ఇతర మతాలలోకి మారకుండా ఈ దీక్షలు సామాన్యజనాన్ని ఆపుతున్నాయి అని కొందరి భావన. అది నిజమే కావచ్చు. ఇది హిందూమత సంరక్షణ అని కొందరు అనుకుంటున్నారు. అది మాత్రం పూర్తిగా తప్పు భావన.

ఒక పెళ్ళిలో ఒకాయన్ని గొప్పగా పరిచయం చేస్తూ "ఈయన గత ముప్పై ఏళ్ళుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు. మా గురుస్వామి" అని పరిచయం చేసాడు నా మిత్రుడు.

నేను ఆయన వైపు చూచేసరికి, ఆయన ముఖంలో ఏమీ పరిణతి గాని, పరిపక్వత గాని కనిపించకపోగా, మరీ జేబులుకొట్టేవాడి ముఖంలో ఉండే క్రూడ్ నెస్ అతనిలో నాకు కనిపించింది. కళ్ళలో గౌరవం కోసం ఆరాటం ఆత్రంగా కనిపించింది. నేను కనీసం "నమస్కారం" అనికూడ అనకుండా, ఆయన వైపు చూచి కేర్ లెస్ గా నవ్వి ఊరుకున్నాను. ఆయన అఫెండ్ అయ్యాడు.

" శబరిమల వెళ్ళారా?" అడిగాడు గురుస్వామి.

"ఒక్కసారి కూడా వెళ్లలేదు" అన్నాను నేను.

"మాల ధరించి వెళ్లండి. బాగుంటుంది." అన్నాడు.

"ఏడాదిలో నలభై రోజులు బాగుంటే మరి మిగిలిన 325 రోజుల సంగతేంటి" అడిగాను.

"ఉండగలిగితే అలాకూడా ఉండొచ్చు" గురుస్వామి.

"అలా ఉండాలి అనుకోకపోతే అలా ఉన్నట్లేగా" అన్నాన్నేను.

ఆ మాట ఆయనకు అర్ధం కాలేదు. అయోమయంగా చూస్తున్నాడు.

పరిస్తితి గమనించి మావాడు నన్ను పరిచయం చేస్తూ " మాఫ్రెండుకు అస్ట్రాలజీ బాగా తెలుసు" అన్నాడు.

గురుస్వామి కళ్ళలో వెలుగు కనిపించింది. నన్ను ఆడుకుందాం అనుకున్నట్లున్నాడు.

"పుష్యమీ నక్షత్రంలో పుట్టినవాళ్ళకు ఈ ఏడాది ఎలా ఉంటుందో?" అన్నాడు నా వైపు చూస్తూ వెటకారంగా.

నాతో వాదన పెట్టుకొని నన్ను ఫూల్ చేసి ఆయన్ను విష్ చెయ్యనందుకు రివెంజ్ తీర్చుకోవాలన్న ఆయన తపన నాకర్ధమైంది.

కొంచెం కేర్ లెస్ గా అతన్ని చూస్తూ "మనుషులు ఇంట్లోనో హాస్పటల్లోనో పుడతారు కాని నక్షత్రంలో ఎలా పుడతారు?" అనడిగాను ఏమీ తెలీనట్లు.

అతను ఖంగు తిన్నాడు. మేము ఇవతలకు వచ్చేశాము.

"ఏంట్రా కనీసం మర్యాదగా పలకరించలేదే" అన్నాడు మిత్రుడు.

"ఎందుకు రా? అదేమీ గొప్ప విషయం కాదు. అతని దగ్గర లేని గౌరవం నటించి అతని అహంకారాన్ని ఇంకా పెంచాల్సిన పని నాకెందుకురా? రాయి కూడా గంగానదిలో ఎన్నో సంవత్సరాలుంటుంది. అంతమాత్రాన అది పవిత్రం అవుతుందా? తన జీవితంలో ముప్పై ఏళ్ళు అతను వృధాగా గడిపాడు. దానికి చింతించాల్సింది పోయి అదేదో గొప్పగా చెప్పుకోటం ఎందుకు?" అన్నాను నేను.

"అతనికి జీవితంలో బాగా కలిసొచ్చింది" అన్నాడు మావాడు.

"నువ్వు మాట్లాడుతున్నది నీకేమైనా అర్ధం అవుతున్నదా అసలు" అన్నాన్నేను.

" నేనన్నదాంట్లో తప్పేముంది రా"

"అతనికి లైఫ్ లో కలిసొస్తే దానికి నేనెందుకు గౌరవించాలి? కలిసిరావటం ఆధ్యాత్మిక లక్షణమెలా అవుతుందిరా బాబు? అదే నిజమైతే, మహనీయులలో చాలామంది పేదవాళ్ళే కదా? దీనికేమంటావు? ఆయన తాతలూ మీ తాతలూ అయ్యప్పమాల వేసుకోలేదుకదా. మరి వాళ్ళు పనికిరానివాళ్ళా? మీ గోత్ర ఋషులకు ఈ దీక్షలు తెలీదుగా. మరి వాళ్ల సంగతేంటి? " నేనడిగాను.

" నీతో కష్టంరా బాబు. సరేలే ఇక ఊరుకో" అని మావాడు టాపిక్ డైవర్ట్ చేశాడు. గురుస్వామి ఇదంతా వింటూనే ఉన్నాడు. నామీద బాగా కోపం వచ్చినట్లు అతని వాలకాన్ని బట్టి అర్ధమైంది.

భోజనాల తర్వాత చేతులు కడుక్కునే పంపుల దగ్గర మేమిద్దరం ఎదురయ్యాము. గురుస్వామి నా వైపు కోపంగా చూచాడు. నేను మళ్ళీ అదే నవ్వు నవ్వి నా దారిని నేనొచ్చేశాను.