“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, జూన్ 2009, మంగళవారం

రమణ మహర్షి జాతకం-3


మహర్షి జాతకమునగల గ్రహదృష్టులు, ఇతర కొన్ని వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. మూడవ ఇంటినుండి శుక్రబుదుల దృష్టి తొమ్మిదోస్థానం మీద ఉంది.దీనివల్ల ఆయన శుష్కజ్ఞాని కాదని, భక్తీజ్ఞానముల కలబోత అని తెలుస్తూంది

ఎందుకనగా శుక్రుడు జలగ్రహము. భక్తి అనునది రసస్వరూపము. పైగా నవమాదిపతి మిత్రగ్రహముతో కూడి నవమస్థానమును చూచుటతో ఆధ్యాత్మిక స్తానమగు నవమం బలీయం అయినది. నవమస్థానం మీద శనిద్రుష్టి కూడా ఉన్నది. కనుక తీవ్ర ఏకాంత మౌనధ్యానం మహర్షి విధానంగా ఉండింది. జనుల మధ్యలో కూర్చుని ఉన్నా ఆయన ఎక్కడో శూన్యంలోకి గంటల తరబడి చూస్తూ ఉండేవారు. 

ఇంకా చెప్పాలంటే,ఈయన నవీన వేదాంతి కాదు. అనగా సంఘసంస్కరణ కోసం,ఇతర సమస్యల కోసం పోరాడిన, కనీసం వ్యాఖ్యానించిన ఇతర ప్రవక్తల వలె ఆయన చెయ్యలేదు. కనుక ఆయనొక ప్రాచీన అద్వైతవేదాంతి అని తెలుస్తున్నది. అందుకనే మహర్షి సామాజికసమస్యల పైన, ఇతర అనవసర విషయాల పైన వ్యాఖ్యానం చెయ్యలేదు. అటువంటి చర్చలు వచ్చినపుడు మౌనం వహించేవారు. ముందు 'నిన్ను నువ్వు తెలుసుకో తరువాత ప్రపంచాన్ని బాగు చేద్దువుగాని' అనేవారు. లేకపోతే, 'ప్రపంచాన్ని నడిపే శక్తి ఒకటుంది. ప్రపంచం బాగు అది చూచుకుంటుంది. నీ సంగతి నువ్వు చూచుకో' అనేవారు. ఇదంతా కూడా బలమైన నవమ స్థానం వల్ల, దానిపైన శుక్ర, శని, బుదుల దృష్టి వల్ల కలిగింది. ఓషో రజనీష్ కూడా, మహర్షి ఒక ప్రాచీన ఆత్మ అని అన్నారు. 

మహర్షి జాతకంలో ఇంకొక బలీయమైన గ్రహ స్థితి ఏమిటంటే, అష్టమంలో స్వస్తానంలో కుజుని స్థితి దానిపైన రాహు ద్రుష్టి. ఇదే రాహు ద్రుష్టి ద్వాదశం మీద కూడా ఉంది. 4,8,12 స్థానాలను మోక్ష త్రికోణం అంటారు. వీటిలో నాలుగింట రవిరాహువుల స్థితితో నీచాహ నిర్మూలనం జరిగింది. ఎనిమిందింట కుజ స్థితి, రాహు ద్రుష్టి తో బలీయమైన ఆంతరిక శక్తి, తీవ్రమైన సంకల్ప బలం, సాధనకు కావలసిన తీవ్ర మైన పట్టు కలిగాయి. 

అలాగే ద్వాదశ స్థానం పైన రాహు ద్రుష్టి బాహ్య లోకానికి కనపడని లోతైన ఆత్మిక అనుభవాలను ఇచ్చింది. దశమస్థానం పైన గురుద్రుష్టి వల్ల లోక గురుత్వం వహించటం జరిగింది. అక్కడే ఉన్న చంద్ర కేతువుల పైన గురుదృష్టి  వల్ల ఆధ్యాత్మిక సంబంధమైన అనుభవాలు సూచిమ్పబడుతూ ఉన్నవి. తన పూర్వకర్మక్షాళన కోసం మహర్షి తీవ్రతపస్సు చెయ్యవలసి ఉన్నదని కూడా ఈ గ్రహయోగం సూచన ఇస్తుంది. ద్వితీయం పైన గురుద్రుష్టివల్ల చల్లని కరుణాపూరితమైన చూపు,ప్రసన్నమైన ధార్మికవాక్కు కలిగాయి.గురువు యొక్క సప్తమ ద్రుష్టి ద్వాదశ స్థానం పైన ఉన్నది. అనగా ద్వాదశ స్థానం గురు రాహువుల మిశ్రమ దృష్టికి లోనయింది. దీనివల్ల కలిగిన లౌకిక ఫలితాలు ఆస్తి పాస్తులు లేకపోవుట, లోక దృష్టిలో వృధా జీవి వలె అనిపించుట కాగా ఆధ్యాత్మిక పరంగా ఇది గొప్ప జ్ఞానాన్ని చూపిస్తుంది. 

ఇకపోతే అస్తమిస్తున్న శనిద్రుష్టి రాహురవులపైన ఉన్నది. దీనివల్ల ఏకాంత మౌనధ్యానం ద్వారా ఆత్మజ్ఞానప్రాప్తి సూచితం అవుతున్నది.చంద్రునితో కేతువు కలయిక యోగసిద్ధికి, అతిమానస అనుభవాలకు,జ్ఞానప్రాప్తికి సూచిక. రవిచంద్రుల సమసప్తకస్థితి వల్ల ఆయన ద్రుష్టి ఎల్లప్పుడూ మూలతత్వమైన ఆత్మ మీదే ఉండటం కనబడుతుంది. ఇదంతా రాశి చక్రములోని గ్రహ స్థితులు. 

ఇక D-20 విమ్శాంశ చక్రములోని గ్రహ దృష్టులను పరిశీలిస్తే వీటికే బలాన్ని చేకూర్చే ఇంకొన్ని పరిస్తితులు కనిపిస్తాయి. దశమంలో గురుస్థితి వల్ల జగద్గురుత్వం, రెండింట ఉన్న చంద్రుని మీద గురు ద్రుష్టి వల్ల ఆధ్యాత్మికంగా ఔన్నత్యం మాత్రమేగాక, వీరి వంశంలో పాత కాలంలో ఋషులు మహా పురుషులు ఉన్నారన్న మార్మిక సత్యం కనిపిస్తుంది. అనగా వీరిది సిద్ధ పురుషుల వంశం అన్న సంగతి తెలుస్తూంది.

చతుర్థ మోక్ష కేంద్రం పైన గురు శనుల ద్రుష్టి ఉన్నది. దీని గురించి మళ్ళీ చెప్పవలసిన పని లేదు. గురుని నవమ దృష్తి రవి కుజుల మీద, తిరిగి కుజుని చతుర్థ ద్రుష్టి నవమ స్థానం పైన ఉన్నది. దీనివల్ల కూడా నవమ కోణం బలీయం అయినది. రవి కుజుల మిశ్రమ ద్రుష్టి ఇంకొక మోక్ష త్రికోణం అయిన ద్వాదశం లో ఉన్న శుక్రుని పైన ఉన్నది. దీనివల్ల కోరికలు, ఆకర్షణల సంపూర్ణ నాశనం, తద్వారా ఆత్మ సాక్షాత్కారం సూచింప బడుతున్నాయి. నవమ స్థానం మీద, లగ్నం మీద శని ద్రుష్టి ఉన్నది. దీనితో ఆధ్యాత్మిక బలం ఏర్పడింది. 

ఏతావాతా, రాశిచక్ర ఫలితములనే విమ్శాంశచక్ర ఫలితములు కూడా బలపరుస్తున్నాయి. ఆధ్యాత్మికపరంగా మహర్షి జాతకం ఇంత బలంగా ఉండబట్టే ఆయన యుగయుగాలకూ లోకానికి ఆరాధ్యుడైన మహాజ్ఞానిగా వెలుగొందుతున్నాడు. 'బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి' అన్నట్లు బ్రహ్మ విదుడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మము కంటికి కనిపించదు. కనిపించే రూపము గల మహర్షి వంటి బ్రహ్మవేత్తలను పూజిస్తే పరమాత్ముని పూజించినట్లే అవుతుంది. అయితే,ముఖ్యమైన విషయం వారిని గౌరవించడమూ పూజించడమూ కాదు.వారిని అనుసరించడం,వారు చూపిన మార్గంలో నడవడం ముఖ్యం. ఆ పని చేసేవారు మాత్రం అతి తక్కువమంది ఉంటారు. మిగతావాళ్ళు,ఇలాంటి వారిని ప్రార్ధించి వారి కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. కోరకలు వద్దని చెప్పిన మహనీయుల చుట్టూ కోరికలు తీరాలని ప్రార్ధించే చవకబారు మనుషులు చేరడం ఈ లోకపు దౌర్భాగ్యం అనే చెప్పక తప్పదు.