“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఆగస్టు 2020, బుధవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 6 (కాలసర్ప యోగం - పుత్రదోషం)

యూజీగారి జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపించే ఇంకొక యోగం కాలసర్పయోగం. పైగా రాహుకేతువులు నీచస్థితిలో ఉండటం దీనిలో ఇంకొక మలుపు. ఇలాంటి  జాతకులకు ఈ క్రింది ఫలితాలు జరుగుతాయి.

  • 40 ఏళ్లు వచ్చేవరకూ వీరి జీవితాలలో స్థిరత్వం రాదు.
  • మొదట్లో మంచి సంపన్నులుగా ఉన్నప్పటికీ అదంతా  కోల్పోయి దారిద్య్రాన్ని అనుభవిస్తారు.
  • 40 తర్వాత నిదానంగా వీరి జీవితంలో వెలుగు కనిపిస్తూ వస్తుంది.
  • సామాన్యంగా,  వీరికి కాలం కలసిరాదు. వీరి ప్రణాళికలు ఫలించవు.  అందుకని, వీరు  జీవితం గురించి ఏ విధమైన గొప్పగొప్ప ప్లానులూ వెయ్యకుండా సాధారణజీవితం గడపడం మేలు.
ఇప్పుడు కాలసర్పయోగం యూజీగారి జీవితంలో ఎలా పనిచేసిందో గమనిద్దాం.

తల్లిగారు ఊహించినట్లుగా, నాడీజ్యోతిష్యం చెప్పినట్లుగా యూజీగారు గతజన్మలో ఒక యోగభ్రష్టుడే. యోగభ్రష్టుడనే పదం అమర్యాదపూర్వకమైనదేమీ కాదు. సాధారణంగా, మనుషులకు యోగంలో సిద్ధికంటే భ్రష్టత్వమే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ పదానికి అర్థమేమిటో నిజమైన సాధన చేస్తున్నవారికేగాని మామూలు మనుషులకు, కాలక్షేపం చదువరులకు అస్సలు అర్ధం కాదు. నిజానికి ప్రతిసాధకుడూ, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక స్థాయిలో, యోగభ్రష్టుడే.

అయితే, యోగపరంగా ఈ పదం చివరిజన్మకు ముందుజన్మను మాత్రమే సూచిస్తుంది. జ్ఞానసిద్ధి అనేది కొద్దిలో తప్పిపోయినవాడిని యోగభ్రష్టుడని అంటారు. తరువాతి జన్మలో అతడు జ్ఞాని అవుతాడు, బుద్ధుడౌతాడు, యోగసిద్ధిని అందుకుంటాడు. అదే అతనికి చివరిజన్మ అవుతుంది - అతను మళ్ళీ పుట్టాలనుకోకపోతే !

అయితే, కొందరు ఊహిస్తున్నట్లు యూజీగారు ఒక అవతారపురుషుడు మాత్రం కాదు. అవతారానికి ఉండవలసిన గ్రహయోగాలు ఆయన జాతకంలో లేవు. గతజన్మలో గొప్ప సాధనాపరులైనప్పటికీ, మోక్షం కొద్దిలో తప్పిపోయిన ఇలాంటివాళ్లు తరువాత జన్మలలో ఎలాంటి చోట్ల పుడతారో ఆరవ అధ్యాయంలో భగవద్గీత చెప్పింది.

శ్లో || ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ: సమా:
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ||     (6. 41)

శ్లో || అధవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ 
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||           (6. 42) 

"(తన పుణ్యకర్మవల్ల కలిగిన) పుణ్యలోకాలలో ఎన్నో ఏండ్లు నివసించిన తరువాత, శుచీశుభ్రతా కలిగిన సంపన్న కుటుంబాలలో యోగభ్రష్టుడు పుడతాడు.

లేదా, ధీమంతులైన యోగుల కుటుంబాలలోనైనా పుడతాడు. అయితే, ఇలాంటి జన్మ ఈ లోకంలో అంత తేలికగా లభించేది కాదు".

నూరేళ్లక్రితం యూజీగారి  కుటుంబం చాలా సంపన్నమైనదే. డబ్బుకు ఆయనకెలాంటి లోటూ ఉండేది కాదు. 1940 ప్రాంతాలలోనే ఒక లక్షరూపాయలకు చెక్కు వ్రాసి ఇవ్వగలిగేటంత స్తోమత ఆయనకుండేది. అప్పట్లో లక్ష అంటే ఇన్ఫ్లేషన్ రేటునుబట్టి  ఈరోజు 75 లక్షలు. అప్పట్లోనే ఆయన కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాడు. కనుక 'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' అనిన గీతావాక్యం ఆయన విషయంలో  అక్షరాలా నిజమైంది.

యూజీగారి తాతగారైన తుమ్మలపల్లి కృష్ణమూర్తిగారు మచిలీపట్నంలో నివసించేవారు. ఆయన సదాచారాన్ని పాటించే సనాతనబ్రాహ్మణుడే అయినా, సాధనాపరంగా అనుభవ జ్ఞానమంటూ లేని తెల్లవాళ్ళచేత విదేశాలలో మొదలుపెట్టబడిన 'దివ్యజ్ఞానసమాజం' ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఒక ప్రముఖమైన స్థానంలో ఆయన ఉండేవాడు. యూజీగారి చిన్నపుడే వారింటికి  దివ్యజ్ఞానసమాజపు ప్రముఖులు వస్తూ పోతూ ఉండేవారు.  దివ్యజ్ఞాన సమాజమనేది ఆధ్యాత్మికపథంలో సరియైన పునాదులు లేని అనుభవశూన్యులు తయారుచేసిన ఒక కలగూరగంప అయినప్పటికీ, ఒక విధమైన హైబ్రిడ్ ఆధ్యాత్మికతను యూజీగారు తనయొక్క చిన్నతనంలోనే అందిపుచ్చుకోడానికి, యూజీగారికి జిడ్డు పరిచయం అవడానికీ మాత్రం అది ఉపయోగపడింది.

అంత సంపన్నులైన కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన యూజీగారి ఆస్తంతా ఎలా ఖర్చయిపోయిందో చదివితే మనకు ఎంతో వింతనిపిస్తుంది. పూర్వకర్మ మనిషిని ఎలా వెంటాడుతుందో, జాతకంలోని యోగాల రూపంలో అది మనిషిని ఎంత బాధపెడుతుందో గమనిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది.

జాతకంలోని పంచమం పుత్రభావం. యూజీగారి జాతకంలో పంచమానికి పాపార్గళం పట్టింది. పంచమాధిపతి శుక్రుడు ఖర్చును సూచించే ద్వాదశంలో నీచకేతువుతో కూడి ఉన్నాడు. బాధకుడూ పుత్రకారకుడూ అయిన గురువు పుత్రస్థానాన్ని చూస్తున్నాడు. ఈ యోగం దేనిని సూచిస్తున్నది? సంతానం కోసం ఆస్తంతా ఆవిరైపోవడాన్ని సూచిస్తున్నది. సంతానంకోసం పడరానిపాట్లు పడటాన్ని సూచిస్తున్నది. చంద్రలగ్నం నుంచి చూస్తే పంచమంలో నీచరాహువున్నాడు. ఇది కూడా సంతానదోషమే. సంతానంవల్ల తీవ్రంగా నష్టపోవడాన్ని, తనవల్ల సంతానం బాధలు పడటాన్ని, ఈ యోగం సూచిస్తున్నది. యూజీగారి జాతకంలో ఇదెలా జరిగిందో గమనిద్దాం.

ఇండియాలో ఉన్నపుడు వారికి ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి వసంత్ కు చిన్నప్పుడే పోలియో సోకింది. దానికి ఇండియాలో ట్రీట్మెంట్ లేదు. అమెరికాలో మాత్రమే ఉంది. దానికి 90,000 డాలర్లు ఖర్చు అవుతుంది. అప్పట్లో డాలర్ విలువ 3 రూపాయలు మాత్రమే. ఆయన ఆస్తంతా కలిపితే అంతే ఉంది. అయినా సరే, దానిని మొత్తం ఖర్చుపెట్టి పిల్లవాడికి కాళ్ళు బాగు చేయించాలని ఆయన సంకల్పించి కుటుంబంతో అమెరికాకు వెళ్ళాడు. చాలా ఖరీదైన ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చికాగోలో నాలుగైదేళ్ళపాటు  ఉన్నాడు. ఆ విధంగా ఆ డబ్బంతా ఆవిరైపోయింది. చివరకు చేతిలో చిల్లిగవ్వలేని అడుక్కుండే వాడిగా యూరప్ లో మూడేళ్లపాటు రోడ్లమీద తిరగవలసిన పరిస్థితి పట్టించింది. అయితేనేమి? వసంత్ నడవగలిగాడు.

యూజీగారు అమెరికాకు బయల్దేరింది 1955 లో. ఆయనక్కడ 1960 దాకా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు బుధమహర్దశలో చివరధైన శనిఅంతర్దశ నుంచి కేతుమహర్దశలో రాహుఅంతర్దశ వరకూ దశలు జరిగాయి. బుధుడు లగ్నాధిపతిగా తననే సూచిస్తున్నాడు. శని అష్టమాధిపతిగా నష్టాన్ని, నవమాధిపతిగా దూరదేశనివాసాన్ని సూచిస్తున్నాడు. మరి బుధ-శనిదశలో విదేశాలకు వెళ్లాడంటే వెళ్ళడూ మరి? ఆ రోజులలో కొడుకు ట్రీట్మెంట్ కోసం తన ఆస్తి మొత్తాన్నీ ఆయన ఖర్చుచేశాడంటే, ఆయనదెంత సుతిమెత్తని మనసో మరి? తల్లిదండ్రులు తమ పిల్లలకు గాని, పిల్లలు తమ తల్లిదండ్రులకు గాని, ఖర్చుపెట్టే ప్రతిపైసాకీ లెక్కచూసుకునే నేటి దగుల్బాజీ తరానికి ఈ ప్రేమ అసలెలా అర్ధమౌతుంది?

కుటుంబసభ్యుల విషయంలో కూడా 'ఎవరెలా పోతే నాకెందుకు? నా పొట్ట చల్లగా ఉంటే చాలు' అనుకునే నీచపుమనుషులు ఈనాటికీ కోట్లసంఖ్యలో ఈ భూమ్మీద ఉన్నారు. యూజీగారి మానసికస్థాయి ఇలాంటివాళ్లకు ఎలా అర్ధమౌతుంది? అప్పట్లో 90,000 డాలర్లంటే నేటి లెక్కల్లో దాదాపు 40 కోట్లు. పిల్లవాడికి కాళ్ళు తిరిగిరావడానికి తన ఆస్తంతా ఆ విధంగా ఖర్చుపెట్టాడాయన.

ఆ తరువాత, అమెరికాలో బ్రతకడానికి ఆయన ఒక లెక్చరర్ గా ఉపన్యాసాలిస్తూ పర్యటనలు చెయ్యడమూ, కుకింగ్ క్లాసులు చెప్పడమూ, చివరకు ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉంటే,  భార్యయైన కుసుమకుమారి గారు అమెరికాలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడమూ ఇదంతా 1955 నుంచి 1959 మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఆమె, పిల్లలను తీసుకుని ఇండియాకు వెళ్లిపోవడమూ, అమెరికానుంచి యూరప్ చేరిన యూజీగారు 1964 వరకూ దిక్కులేనివాడిగా మూడేళ్లపాటు పారిస్, లండన్ వీధులలో తిరగడమూ ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఇంకొక పోస్టులో చదువుకుందాం.

చివరగా జెనీవాలో వాలెంటైన్ డి కెర్వాన్ పరిచయంతో ఆయనకొక ఆశ్రయం దొరికి, ఒక స్థిరత్వం ఏర్పడింది. అప్పటికాయనకు 47 ఏళ్ళు వచ్చాయి.

కాలసర్పయోగం ఉన్న జాతకాలలో 40 ఏళ్లవరకూ స్థిరత్వం ఉండదన్నదీ, మొదట్లో బాగా బ్రతికినవాళ్లు కూడా డబ్బులేక ఇబ్బంది పడతారన్నదీ - ఈ జ్యోతిష్యసూత్రాలన్నీ ఈ విధంగా యూజీగారి జాతకంలో కూడా నిజమైనాయి. కాకపోతే ఆయనకు ఒకమాదిరి స్థిరత్వం రావడానికి 47 ఏళ్ళు పట్టింది. కాలసర్పయోగం ఖచ్చితంగా 40 ఏళ్లకే వదలిపోదు. ఆ తరువాత మెల్లిమెల్లిగా వదలడం మొదలౌతుంది. యూజీగారి విషయంలో అయితే, ఉన్న ఆస్తంతా అప్పటికి కరిగిపోయింది. అమిత సంపన్నుడు ఏమీలేని వాడయ్యాడు.

జాతకయోగాలు ఇలా పనిచేస్తాయి మరి !

(ఇంకా ఉంది)