“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జులై 2020, మంగళవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 2 (నిజమైన మహనీయులు - కుహనాగురువులు)

తెలుగువారికి ఉన్న అనేక దరిద్రాలలో ఒక పెద్ద దరిద్రమేమంటే, వారిలో పుట్టిన నిజమైన మహనీయులను వారస్సలు గుర్తించరు. ఎంతసేపూ ప్రక్కవారినో, లేదా ఎక్కడో పుట్టినవారినో తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. లేదా, దొంగ గురువులను, బూడిదబాబాలను, రాజకీయ బ్లాక్ మనీ స్వామీజీలను, మాయమాటలు చెప్పి మోసాలు చేసే కుహనాగురువులను కొలుస్తారు. అంతేగాని, నిజమైన యోగులను, మహానీయులను వారు ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు. ఇది తెలుగుజాతికున్న పెద్ద శాపం.

మనం ఎన్నో పుస్తకాలను చదువుతాం. ఎన్నో లెక్చర్లిస్తాం. ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి, జీవన్ముక్తి గురించి, అవధూత స్థితి గురించి, కుండలిని గురించి ఊకదంపుడుగా ఎన్నో ఉపన్యాసాలిస్తాం. ఇండియాలో ఎవరిని కదిలించినా వేదాంతమే చెబుతారు. అన్నీ మన దగ్గరే ఉన్నాయంటారు. మనకు తెలియనిది ఏమీ లేదంటారు. కానీ, నిజంగా కుండలినీ జాగృతి కలిగినవాడు గాని, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు గానీ, జీవన్ముక్తుడైనవాడు గానీ మన ఎదురుగా వస్తే, ఛస్తే వాడిని ఒప్పుకోము. ఇది పరమసత్యం. దీనికి ఉదాహరణలుగా చరిత్రనుంచి ఎందరినో చూపించవచ్చు.

వేమనయోగి పొందిన జీవన్ముక్తస్థితి ఎవరికీ అక్కర్లేదు. ఆయనకు తెలిసిన బంగారం చేసే విద్య మాత్రం కావాలి. రమణ మహర్షి పొందిన జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ఆయన సమక్షంలో దొరికే శాంతి మాత్రం అప్పనంగా కావాలి, అదికూడా కాసేపు మాత్రమే. 'అదే శాంతి ఎల్లప్పుడూ నీతో ఉంటుందం'టే, బాబోయ్ నాకొద్దంటూ పారిపోతాం. శ్రీరామకృష్ణులు అవతారమని కొద్దిమందే నమ్ముతారు. ఎందుకంటే, ఆయన మనం కోరే గొంతెమ్మ కోరికలను వరాలుగా ఎప్పుడూ ఇవ్వడు గనుక. జిల్లెళ్ళమూడి అమ్మగారు పాపులర్ కాకపోవడానికి కారణం 'దురదృష్టం కూడా దైవానుగ్రహమే' అనిన సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పడమే. అరవిందుల యోగాన్ని ఎవరూ పాటించకపోవడానికి కారణం కూడా అదే. ఆయన సూచించిన సాధనాస్థాయి కలలోకూడా ఎవరికీ అందదు గనుక, ఆయన భక్తులు కూడా ఆయన ఫోటోలకు దండాలు పెట్టి వరాలు కోరుకోవడం తప్ప ఆయన చెప్పిన సాధన మాత్రం ఎవ్వరూ చెయ్యడం లేదు.

నా దృష్టిలో సోకాల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచమంతా మోసమే. అంతా దొంగలమయమే. భక్తులూ దొంగలే, వారి చవకబారు భక్తిని తమ స్వలాభంకోసం ప్రోత్సహిస్తున్న సోకాల్డ్ స్వామీజీలూ, గురువులూ అందరూ దొంగలే. మనకు గాల్లోంచి బూడిద తీసే బాబాలూ, హోమాలూ యజ్ఞాలూ వ్రతాలూ చేయించే దొంగస్వాములూ, 'ఈ మంత్రం జపించు ఈ కోరిక తీరుతుంది' అని చెప్పే కుహనా గురువులూ, తాయెత్తులు మొలత్రాళ్లు కట్టేవాళ్లూ, నెత్తిన చెయ్యిపెట్టి, వారికే లేని శక్తిని మీకు పాతం చేస్తామని డబ్బులు తీసుకునేవాళ్లూ, అవతారాలమని చెబుతూ డప్పు కొట్టుకునేవాళ్లూ, బ్రతికుండగానే పిరమిడ్లో పడుకోబెట్టి లేని పూర్వజన్మలను గుర్తుచేసేవాళ్ళూ  - ఇలాంటివాళ్లే నచ్చుతారు. మనం చవకబారు మనుషులం గనుక చవకబారు గురువులే మనకు నచ్చుతారు, దొరుకుతారు కూడా. తప్పేం లేదు. మనకు తగినవాళ్ళే మనకు దొరకడం ప్రకృతి నియమమే.

అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకేం కావాలో మనకే తెలియదు. దురాశతో, అడ్డమైన వరాలను కనిపించిన ప్రతివాడిదగ్గరా అప్పనంగా అడుక్కోవడం మాత్రమే మనకు తెలిసింది. భక్తులు అడుక్కుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే అడుక్కోవడమే భక్తుల లక్షణం. కానీ ఈ సోకాల్డ్ స్వామీజీలూ గురువులూ అందరూ చేసే పనులు చూస్తుంటే చీదరాతిచీదర పుడుతోంది. వీళ్లంతా 'అడుక్కుండేవాడి దగ్గర గీక్కుండే రకాలు'. ఉన్న సత్యాన్ని ఉన్నట్లు చెప్పకుండా, భక్తుల చవకబారు కోరికలను, చవకబారు మనస్తత్వాలను పోషిస్తూ, కాకమ్మ కధలు చెబుతూ, పబ్బం గడుపుకుంటున్న నేటి గురువుల కంటే ఓషో లాంటి వాళ్లే బెటర్ అని నాకనిపిస్తుంది.

ఆధ్యాత్మికాన్ని కూడా లౌకికానికి ఉపయోగించుకునే నీచపుబుద్ధి పోనంతవరకూ, దేవుడిని అడ్డం పెట్టుకుని సాటి మానవుడిని మోసం చేసే దరిద్రపు బుద్ధి పోనంతవరకూ, మానవజాతికి ఈ దౌర్భాగ్యం తప్పదు. అంతవరకూ మనకు మొక్కుబడిపూజలూ, సామూహిక పారాయణాలూ, షిరిడీయాత్రలూ, అయ్యప్పదీక్షలే గతి. నిజమైన ఆధ్యాత్మికత మనకు ఎప్పటికీ అందదు గాక అందదు. ఈ డ్రామా అంతా ఎప్పటికీ ఇలాగే నడుస్తూ ఉంటుంది !

సరే, ఈ అరణ్యరోదన ఎప్పుడూ ఉండేదేలే  గాని, మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

కుండలినీయోగం మీద వేలాది పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడబడితే అక్కడ ప్రతివాడూ కుండలినీ యోగం గురించి మాట్లాడేవాడే. చక్రాల గురించి, కుండలిని గురించి, యోగం గురించి దారినపోయే దానయ్య కూడా మాట్లాడే నీచస్థితి నేడు మన దేశంలోనే గాక ఇతరదేశాలలో కూడా ఉంది. కానీ, వీరిలో ఎవడికీ కూడా కుండలిని అంటే ప్రత్యక్షమైన అనుభవం లేదు. కానీ ఉందంటారు. అదే అసలైన వింత. కుండలిని గురించి పుస్తకాలలో ఉన్నదంతా నకిలీ సమాచారమేగాని నిజం కాదు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఆన్లైన్ క్లాసులు కోకొల్లలు. ఇంతా చేస్తే, చెప్పేవాడికీ అది తెలీదు, చేసేవాడికీ తెలీదు. ఇలాంటి పనికిమాలిన గోల చూచేనేమో, లైబ్రరీలకు లైబ్రరీలనే తగలబెట్టించాడు మాలిక్ కాఫర్.

ప్రపంచచరిత్రలో మనకు తెలిసి కుండలిని నిజంగా జాగృతమైన వాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. బయటకు రాకుండా అజ్ఞాతంగా ఉన్నవాళ్లు ఇంకా ఉండవచ్చు గాని, బయటకు వచ్చి సమాజానికి తెలిసింది అతి కొద్దిమందే.  వారు - శ్రీరామకృష్ణులు, వాసిష్ఠ గణపతిముని, పండిట్ గోపీకృష్ణ, యూజీ మాత్రమే. ఎందుకంటే వారి అనుభవాలు సత్యమైనవి. పుస్తకాలను చూచి వాళ్ళు, మాటలు చెప్పలేదు. ముందుగా అనుభవాలను పొంది, తరువాత వాటిని పుస్తకాలలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకుని నిజమే అని గ్రహించారు. మిగిలిన లోకమంతా ఎవరో వ్రాసిన పుస్తకాలు చదువుకుంటూ, వాటిలో ఉన్నదానిని ప్రచారం చేసి సాటి మనుషులతో వ్యాపారం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ బ్రతుకుతున్నది. అదే నిజమైన యోగులకూ, మోసగాళ్ళకూ ఉన్న భేదం. 

విచిత్రమేమంటే, ఈ నలుగురూ ఇప్పటికీ అనామకంగానే మిగిలిపోయారు. వారి దారిని నిజంగా అనుసరిస్తున్న వారు లేరు. శ్రీరామకృష్ణులకు కోట్లాదిమంది భక్తులు ఉండవచ్చు. కానీ ఆయన నడచిన దారిలో నడిచినవారు ఇంకొకరు లేరు. మిగిలిన ముగ్గురికీ అయితే అనుచరులు కూడా లేరు. నిజమైన జ్ఞానుల, సిద్ధుల, యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారిని అనుసరించేవారంటూ ఎక్కడా ఉండరు. వారిది చవకబారు లోకులకు అందే స్థాయీ కాదు, వాళ్ళు అబద్ధాలు చెప్పి బ్రతకనూ బ్రతకరు. అందుకే జనం వారిని అర్ధం చేసుకోలేరు, అనుసరించలేరు. అదంతే !

యూజీ గారికి కుండలినీ జాగృతి కలిగినమాట వాస్తవం. ఆయన ఆత్మజ్ఞాని యన్నదీ వాస్తవమే. కానీ ఆయన ఆ పదాలను ఒప్పుకోలేదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినన్నది తెలియదు. తెలుస్తున్నంతవరకూ అతడు ఆత్మజ్ఞాని కాడు. అలాగే జీవన్ముక్తునికి తాను జీవన్ముక్తుడనని తెలియదు. తెలుస్తుంటే అతడింకా ఆ స్థితికి రాలేదని అర్ధం.

యూజీ వంటి గొప్ప యోగి తెలుగునేలలో పుట్టినా తెలుగువారికి నేటికీ ఆయనెవరో తెలీకపోవడం, ఆయన ఎక్కడో ఇటలీలో చనిపోవడం, అనామకంగా అలాంటి జీవన్ముక్తునికి అంతిమ సంస్కారం జరగడం, అదికూడా హిందీవాడైన మహేష్ భట్ చేతులమీదుగా జరగడం, 90 ఏళ్లపాటు ఈ నేలమీద మనందరి మధ్యనే ఆయన బ్రతికినప్పటికీ, ఈనాటికీ ఆయనేం చెప్పాడో, ఆయనకేం జరిగిందో మనకెవరికీ తెలీకపోవడం తెలుగుజాతి దౌర్భాగ్యం కాదూ మరి ?

అందుకేనేమో, 'I don't want even to fly over Andhra (ఆంధ్రా మీదనుంచి విమానంలో పోవడం కూడా నాకిష్టం లేదు) ' అనేవారు యూజీ. తెలుగువాడైన ఒక నిజమైన యోగి తెలుగువారిని అంతగా అసహ్యించుకున్నాడంటే అర్ధం చేసుకోండి, మన తెలుగువారి  ఆధ్యాత్మిక స్థాయి ఎంతటిదో?

(ఇంకా ఉంది)