“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, మార్చి 2020, సోమవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 6 (రామకృష్ణ వివేకానందుల ప్రభావం)

అరవిందుల జీవితంలో రామకృష్ణ వివేకానందుల పాత్ర చాలా ఉంది. కానీ ఆయన భక్తులు దానిని బాగా తగ్గించి చూపుతారు. దానికి కారణం, అలా చేస్తే, అరవిందులను ఏదో తక్కువ చేసినట్టు అవుతుందని వారి భావన కావచ్చు. కొందరేమో దానిని మరీ ఎక్కువచేసి చూపుతారు. దీనికి రామకృష్ణుల మీద వారికున్న విపరీత భక్తి కారణం కావచ్చు. దీనిని కూడా అరవిందులు ఖండించారు. రెండూ తప్పే. ఉన్నదానిని ఉన్నట్లు చూడాలి, అనుకోవాలి. అప్పుడే సత్యమైన దారిని మనం అనుసరించినట్లు అవుతుంది.

ఉదాహరణకు, Mar 31 1910 రోజున అరవిందులు Dupleix అనే ఓడలో కలకత్తాను వదలి పాండిచేరికి బయలుదేరే ముందు, అదే వీధిలో కొన్ని ఇళ్ళ అవతల ఉన్న శ్రీ శారదామాతను దర్శించారనీ, ఆమె ఆశీస్సులు తీసుకున్నారనీ, ఆ ఓడలో ఆయనను ఎక్కించడానికి రామకృష్ణామిషన్ బ్రహ్మచారి ఒకాయన ఆయనను అనుసరించారనీ ఒక కట్టుకధ ప్రదారంలో ఉంది. దీనిని అరవిందులు ఖండించారు. అలాంటి సంఘటన ఏమీ జరుగలేదని ఆయన తరువాతి రోజులలో వ్రాశారు. ఇలాంటి కధలను రామకృష్ణుల భక్తులు ఎవరో తర్వాతి కాలంలో అల్లారు. కానీ అవి నిజం కాదు.

1905 ప్రాంతంలో బరోడాలో ఉన్నపుడు అరవిందులు తన తమ్ముడైన బరీన్ ఇంకా కొంతమంది అనుచరులతో కలసి Spirit writing, Automatic writing మొదలైన మార్మిక సాధనలను అభ్యాసం చేసేవారు. దీనిలో విధానం ఏంటంటే - ఒక్కరు కాని కొందరు కాని ఒక చడీచప్పుడు లేని ఏకాంతమైన గదిలో కూచుని, ముందుగా వారి మనస్సులను నిశ్చలం చెయ్యాలి. అంటే thoughtless state ను అందుకోవాలి. ఆ తరువాత వారు అనుకుంటున్న ఆత్మను ఆహ్వానించాలి. తనను ఆవహించి తనద్వారా కాగితం మీద వ్రాయమని ఆ ఆత్మను కోరుతూ సంకల్పించి కాగితాలు, కలం సిద్ధంగా పట్టుకుని వ్రాయడం మొదలుపెట్టాలి.

కానీ ఆ సమయంలో తన మనసు నిశ్చలంగా ఉందిగనుక తనకేమీ ఆలోచనలు ఉండవు. ఏదో ఒక బయట శక్తి తన చెయ్యి పట్టుకుని వ్రాయించిన ఫీలింగ్ కొందరికి కలుగుతుంది. అప్పుడు వారు వ్రాస్తారు. చాలాసార్లు ఇలా వ్రాయబడే విషయాలు ఆ వ్యక్తికే తెలీనివి అయి ఉంటాయి. లేదా భవిష్యత్తును సూచించేవి అయి ఉంటాయి.

మొత్తం మీద ఆ రోజులలో యూరోప్ లో అమెరికాలో ఈ ఆత్మల పిచ్చి చాలా ఎక్కువగా ఉండేది. Ouza board, Automatic writing మొదలైన పద్ధతులు ఉపయోగించి ఆత్మలతో సంభాషించాలని, అవి ఉన్న లోకాలను తాకాలని కొందరు ప్రయత్నాలు చేసేవారు. వీటిలో కొన్నింటిలో చాలా మంచి ఫలితాలు వచ్చేవి. కానీ కొన్ని వికటించేవి. అరవిందుల చుట్టూ ఉన్న గ్రూపుకు ఇవన్నీ తెలుసు గనుక వాటితో ప్రయోగాలు చేసేవారు.

ఆ విధంగా వాళ్ళు బరోడాలో ఉన్న ఒక సమయంలో మూడురోజులపాటు ఒక గదిలో కూచుని అదే పనిగా Automatic writing ను ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. అరవిందుల తమ్ముడు బరీన్ Automatic writing ప్రయత్నిస్తూ శ్రీ రామకృష్ణుల ఆత్మను ఆహ్వానించాడు.

ఆ ఆత్మ తన పిలుపుకు స్పందించిందని అనిపించాక, దానిని ఇలా ప్రశ్నించారు

'భారతదేశాన్ని ప్రస్తుతపు స్థితి నుంచి ఉద్ధరించాలంటే ఏం చెయ్యాలి?'.

దానికా ఆత్మ 'Arobindo, Mandir karo, Mandir karo, Mandir karo  (అరవిందా! మందిరాన్ని నిర్మించు, మందిరాన్ని నిర్మించు, మందిరాన్ని నిర్మించు) అని మూడుసార్లు చెప్పింది.

దానిని జగజ్జనని ఆదేశంగా భావించిన వారు, కొద్ది రోజులు బాగా ఆలోచించి, 'భవానీ మందిర్' అనే ఒక బ్రహత్తరమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

నగరాలకు దూరంగా కొండల్లో ఈ మందిరాన్ని కట్టాలి. అక్కడ నిస్వార్ధపరులూ, దేశభక్తులూ అయిన యువకులు సంసార జీవితాన్ని త్యజించి సన్యాసులుగా మారి వారి బ్రతుకులను స్వాతంత్రం కోసం వెచ్చించాలి. అక్కడ తయారయ్యే వీరసన్యాసులు దేశంలోని నలుమూలలకూ వెళ్లి భావప్రచారం చేసి జనాన్ని ఉత్తేజితులను చెయ్యాలి. విప్లవాన్ని రేకెత్తించాలి. అలాంటి సివిల్ పోరాటం ద్వారా బ్రిటిష్ వారి పాలననుంచి విముక్తిని సాధించాలి. అన్న ప్లాన్ వాళ్ళు వేశారు. దీనికోసం కొంత సాహిత్యం కావాలని, దానిని కూడా అరవిందులే వ్రాయాలని వారు నిశ్చయించారు. ఆయనకు ఈశోపనిషత్తు అంటే బాగా ఇష్టం గనుక, దాని అనువాదంతో ఆ ప్రాజెక్ట్ కు అవసరమైన మొదటి సాహిత్యం మొదలుపెట్టాలని వారు అనుకున్నారు. ఉపనిషత్తులలో కెల్లా ఈశోపనిషత్తు అంటే అరవిందులకు బాగా ఇష్టం. ఆయన యోగమార్గానికి మూలాలను ఆయన ఆ ఉపనిషత్తు నుంచే తీసుకున్నారు.

కానీ అరవిందులకు ఈ ప్లాన్ అంతగా నచ్చలేదు. 'మందిర్ కరో' అన్న రామకృష్ణుల బోధను ఆయన ఒక భౌతికమైన గుడిగా తీసుకోలేదు. 'మీలోనే ఒక మందిరాన్ని నిర్మించుకోండి. మీరే దైవానికి ఒక మందిరంగా మారండి' అని రామకృష్ణులు చెప్పారని ఆయన భావించాడు. ఏదేమైనా, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే తన ఉత్సాహాన్ని కోల్పోయి మూలపడింది.

అసలలాంటి ప్రయత్నమే తప్పని నేనంటాను. ఎందుకంటే, అలాంటి భావాలతో కూడిన 'రామకృష్ణా మిషన్' అప్పటికే ఉన్నది. దానిని స్థాపించినది వివేకానందులే. అయితే దాని ఉద్దేశ్యం - అరవిందుల గ్రూపువారు భావించినట్లు సాయుధ విప్లవపోరాటం కాదు. సేవ, త్యాగం అనే రెండు అత్యున్నతమైన ఆదర్శాల పైన వివేకానందులు ఆ సంస్థను నిర్మాణం చేశారు. కానీ అరవిందుల ఉద్దేశ్యం సాయుధ పోరాటం గనుక, రామకృష్ణా మిషన్ వంటి ఒక సంస్థను నిర్మిద్దామనీ, అయితే 'సేవ - త్యాగం' అనే భావాలతో కాకుండా, విప్లవ సాయుధపోరాటం అనే భావంతొ ఆ పనిని చేద్దామనీ ఆయన అనుకున్నాడు.

తరువాతి రోజులలో, అరవిందులు ఇలా అనేవారు.

ఆటోమేటిక్ రైటింగ్ అనేది చాలాసార్లు ఉత్త ఫార్స్ గా ముగుస్తుంది. చాలాసార్లు అందులోకి ఏ ఆత్మా రాదు. జవాబివ్వదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ఆత్మలు రావచ్చు, జవాబివ్వవచ్చు. కానీ సాధారణంగా, వ్రాసేవాని అంతచ్చేతనే (Sub conscious mind) అలా జవాబులిస్తుంది. తన మనసే అలా వ్రాయిస్తున్నదని అతనికీ తెలీదు. అది బయటనుంచి వచ్చిన ఒక ఆత్మే అని అతడు భ్రమిస్తాడు. ఈ అభ్యాసం నుంచి ఉన్నతమైన ఫలితం ఏమీ రాదు'.

అరవిందులు చెప్పిన ఈ విషయం నిజమే. ఎందుకంటే, నా కాలేజి రోజులలో నేను కూడా ఇవన్నీ అభ్యాసం చేశాను. కానీ త్వరలోనే నేనూ ఇదే అవగాహనకు వచ్చాను. ఇలాంటి ప్రయోగాలు ఎందుకూ పనికిరాని పనులనిపించి నేను అతిత్వరలోనే వాటిని వదలివేశాను.

దానికి కారణాలున్నాయి. మనం ఒక ప్రఖ్యాతవ్యక్తి ఆత్మను పిలిస్తే, 'ఇదుగో నేనే వచ్చాను' అంటూ ఒక పనికిరాని ఆత్మ ముందుకు వస్తుంది. ఆ ప్రఖ్యాతవ్యక్తిలాగే జవాబులిస్తుంది. కానీ అది ఆయన ఆత్మ అవదు. ఇదెందుకు జరుగుతుందంటే, నిమ్నలోకాలలో ఉండే ఆత్మలు, ఎందుకూ పనికిరాని మనుషుల ఆత్మలై ఉంటాయి. Ouja board, Automatic writing మొదలైన పనులు చేసేవాళ్ళు సాధారణంగా సాధకులై ఉండరు గనుకా, వారికి ఆధ్యాత్మికశక్తి ఉండదు గనుకా, ఉత్త కుతూహలంతో ఇలాంటి పనులను వారు చేస్తారు గనుకా, అలాంటి తక్కువస్థాయి ఆత్మలే వారికి స్పందిస్తాయి. ఉన్నతమైన ఆత్మలు వారికి పలకవు. అవి అసలిలాంటి గోల దరిదాపులకే రావు. కనుక వాళ్ళు ఇలాంటి మోసపూరిత ఆత్మల చేతిలో మోసపోతూ ఉంటారు. అవి వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాయి. అబద్దాలు చెబుతూ ఉంటాయి. వాటికి అదొక ఆట ! వీళ్లేమో అది నిజమని అనుకుంటూ ఉంటారు.

ఇంకో కారణమేంటంటే, ఇలా ఆత్మలను తనమీదకు ఆవహింప చేసుకోవడం అలవాటైతే, కొంతకాలానికి మనం పిలవకపోయినా, అవి వచ్చేసి మనలో ఉంటుంటాయి. ఇక పోవు. అప్పుడా మీడియం చాలా ఘోరమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. పిచ్చెక్కుతుంది. రోడ్లమీద గుడ్డలు చించుకుంటూ పరుగెత్తుతూ ఉంటాడు. చివరకు ఏదో ఒక యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతాడు. తనుకూడా ఒక ప్రేతాత్మ అవుతాడు.

శ్రీరామకృష్ణుల అంతరంగభక్తులలో స్వామి నిరంజనానంద ఒకరు. ఆయన యువకునిగా కాలేజీ చదువులో ఉన్న రోజులలో ఆయనకు కూడా కలకత్తాలోని ఒక 'మార్మిక గ్రూప్' తొ సంబంధాలుండేవి. ఆ గ్రూపు లోని వాళ్ళు, ఇంకా విచిత్రమైన పనులు అభ్యాసం చేసేవారు. అదృశ్యశక్తులకు మంచి 'మీడియం' అయ్యే లక్షణాలు కొంతమంది మనుషులకు స్వతహాగా ఉంటాయి. వారు ఆత్మలతో తేలికగా కాంటాక్ట్ అవ్వగలరు. అలాంటి వారిని వెదికిపట్టి, వారిమీదకు ఆత్మలను ఆవహింపజేసి వాటిలో మాట్లాడేవారు ఆ గ్రూపు సభ్యులు. యువకుడైన నిరంజన్ కు అలాంటి శక్తి పుట్టుకతో ఉండేది. కనుక వారు నిరంజన్ ని కూచోబెట్టి అతని మీదకు రకరకాల ఆత్మలను ఆహ్వానించి వాటితో మాట్లాడుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచాక, శ్రీ రామకృష్ణులు నిరంజన్ ను బాగా చీవాట్లు పెట్టారు.

'చూడు ! నువ్వు ఎప్పుడూ దయ్యాలు భూతాల గురించి ఆలోచిస్తూ వాటిని ఆవాహన చేస్తూ ఉంటె చివరకు నువ్వూ ఒక ప్రేతాత్మగా మిగిలిపోతావు. కానీ నిరంతరం దైవధ్యానంలో నువ్వుంటే నువ్వే ఒక దేవత వౌతావు. నీకేం కావాలో బాగా ఆలోచించుకుని ఆ పనిని చెయ్యి' అని ఆయన నిరంజన్ తో అన్నారు. ఆ రోజునుంచీ నిరంజన్ ఆ మార్మిక గ్రూపు వైపు పోవడం మానివేశాడు.

కనుక ఏ విధంగా చూచినా ప్రేతాత్మలను కాంటాక్ట్ చెయ్యాలని చూడటం మంచిపని కాదు. అలా చెయ్యడం వల్ల, ఆ చేసే మనుషుల మనసులు ఎప్పుడూ అవే తక్కువలోకాలలో తిరుగుతూ ఉండటానికి అలవాటు పడతాయి. క్రమేణా ఆ మనుషులు కూడా ప్రేతాత్మల లాగా తయారౌతారు. చివరకు చనిపోయాక వారు కూడా ప్రేతాత్మలౌతారు.

అసలు అరవిందుల గ్రూపు వారు చేసిన ప్రయోగమే తప్పని నేనంటాను. ఎందుకంటే - అలాంటి పిలుపుల వల్ల, భూవాతావరణంలో తిరుగుతున్న ప్రేతాత్మలు మాత్రమే స్పందిస్తాయి గాని, కొంచం ఉన్నతలోకాలలో ఉన్న ఆత్మలు స్పందించవు. శ్రీ రామకృష్ణులు ఒక ప్రేతాత్మ కాదు అలాంటి ప్రయోగాలలోకి రావడానికి ! ఆయన ఒక ఉన్నతాత్మ కూడా కాదు. సాక్షాత్తూ భగవంతుని యొక్క ఒక అవతారమే ఆయన. కనుక ఆటోమేటిక్ రైటింగ్ లోకి ఆయన్ను పిలవడం అనేది ఒక హాస్యాస్పదమైన పని. ఫసిఫిక్ మహా సముద్రాన్ని ఒక చిన్న ఉగ్గుగిన్నెలోకి రమ్మని పిలవడం లాంటిదే ఆ చర్య. అదెన్నటికీ జరిగే పని కాదు.

ఆ సమయంలో బరీన్ అంతచ్చేతనే అలా పనిచేసింది. అతని మనసు లోతులలో ఉన్న ఆలోచనే 'భవానీ మందిర్' గా బయటకు వచ్చింది. ఆ రోజులలో శ్రీ రామకృష్ణులంటే బెంగాల్లో ఉన్న అమితమైన భక్తీ గౌరవాలతో, ఆయనే అలా చెప్పారని వారు భావించారు. కానీ అది నిజం కాదు.

ఆ సమయంలో అరవిందుల జాతకంలో చంద్ర - రాహుదశ జరిగింది. సాధారణంగా ఈ దశలో భూతప్రేత పిశాచాలతో సంబంధాలు, తంత్రమంత్ర విద్యలు, విప్లవాత్మక కార్యక్రమాలు, విధ్వంసరచనలు, రహస్యకలాపాలు ఇత్యాది జరుగుతాయి. ఖచ్చితంగా అరవిందుల జీవితంలో అవే సంఘటనలు ఆ సమయంలో జరిగాయి.

రెండవసారి ఆయన శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని పాండిచేరి వచ్చిన తర్వాత శంకర్ చెట్టియార్ ఇంటిలో ఉన్నపుడు విన్నారు. అది దాదాపు 1910 వ సంవత్సరం. ఆ సమయంలో ఆయన జాతకంలో చంద్ర - కేతుదశ జరిగింది. మూలానక్షత్ర చంద్రుడు, ఉచ్చ కేతువూ కలసి ఆయనకు ఇలాంటి ఉన్నతమైన అనుభవాలను ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, ఆ మాటలు కాలగర్భంలో కలసి పోయాయి. కానీ వాటి సారాంశం ఇది

'నీ నిమ్నచేతనలో దివ్యచేతనను అవతరింప చెయ్యి. నీ సాధనదశ చివరలో మళ్ళీ ఇంకోసారి నీతో మాట్లాడతాను'.

ఈ ఆదేశం రామకృష్ణుల నుంచి నిజంగానే వచ్చిందని అరవిందులు నమ్మారు. అది నిజం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కూడా. ఎందుకంటే, అటువంటి దివ్యాదేశాన్ని వినాలంటే, చాలా నిష్టతో కూడిన సాధనను చేసి ఉండాలి. మనస్సు చాలా పవిత్రంగా మారి ఏకాగ్ర ధ్యాన స్థితులను అందుకునే విధంగా సిద్ధమై ఉండాలి. అప్పుడే రామకృష్ణుల వంటి మహనీయుల వాణిని వినగలుగుతాము. పాండిచేరికి చేరిన కొత్తల్లో అరవిందులు తన సాధనను తీవ్రస్థాయిలో చేసేవారు గనుక అప్పుడు ఆయనకు అలాంటి ఆదేశం వచ్చిందంటే అది నిజమేనని మనం అర్ధం చేసుకోవచ్చు.

మూడవసారి ఆయనకు వచ్చిన శ్రీ రామకృష్ణుల ఆదేశం 18 Oct 1912 న వచ్చింది. అది ఇలా ఉంది.

Make complete sannyasa of Karma.
Make complete sannyasa of thought.
Make complete sannyasa of feeling.
This is my last utterance

కర్మను పూర్తిగా వదలిపెట్టు
ఆలోచనను పూర్తిగా వదలిపెట్టు
స్పందనను పూర్తిగా వదలిపెట్టు
ఇదే నీకు నా ఆఖరి ఆదేశం

తరువాతి రోజులలో తన శిష్యులతో చేసిన సంభాషణలలో, శ్రీ రామకృష్ణులతో తనకు కలిగిన సూక్ష్మబంధంవల్ల తన యోగసాధన ఎలా ముందుకు ప్రయాణించిందో అరవిందులు మాట్లాడేవారు

మోతీలాల్ రాయ్ కి ఆగస్ట్ 1912 లో వ్రాసిన ఉత్తరంలో అరవిందులు ఇలా వ్రాస్తారు.

“రామకృష్ణుల నుంచి మనం ఎంతో పొందామని మరువకు. నా వరకు చూస్తె, శ్రీరామకృష్ణులు తానే స్వయంగా వచ్చి నన్ను మొదటగా యోగసాదనలో ప్రవేశపెట్టారు. ఆలీపూర్ జైల్లో ఉన్నప్పుడు మన సాధనా మార్గానికి మొదటి పునాదులు వేసిన జ్ఞానాన్ని ఇచ్చినది వివేకానందుల అదృశ్యస్వరమే సుమా !'

కానీ 1930 ప్రాంతాలలో ఆయన అభిప్రాయాలు మారాయి. ఆలీపూర్ జైల్లో తానున్నపుడు తనకు వినిపించినది వివేకానందుని స్వరం కాదేమో నని, అది తన అంతచ్చేతనా స్వరమే అయి ఉండవచ్చని ఆయన అన్నారు. తన ఉన్నతమనస్సే తనతో ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా జరగడం సాధ్యమే కూడా ! ఈ విధంగా, అంతరికలోకంలో ఏది ఏది అన్న విషయం స్పష్టంగా తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది, సాధకుడు ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నదానిని ఉన్నట్టు చూచే శక్తి సంపాదించే వరకూ !

రామకృష్ణుల మూడవ ఆదేశం ఆయనకు వినిపించినప్పుడు అరవిందుల జాతకంలో చంద్ర - సూర్య - బుధదశ జరిగింది. వీరందరూ ఒకరికొకరు కోణస్థితిలో ఉండటమూ, సూర్యుడు కూడా కేతువుదైన మఖా నక్షత్రంలో ఉండటమూ మనం గమనిస్తే ఈ ఆదేశం కూడా నిజమైనదే అని అర్ధమౌతుంది.

(ఇంకా ఉంది)