నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

12, ఫిబ్రవరి 2020, బుధవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 1 (ఉపోద్ఘాతం)

భారతదేశంలో పుట్టిన మహనీయుల లిస్టులో అరవిందుల పేరు లేకపోతే అది అసమగ్రం అవుతుంది. ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ నిజమైనవైనా కాకపోయినా, ఆచరణలో సాధ్యమైనవైనా కాకపోయినా, భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆయన స్థానం మాత్రం గొప్పదే.

ఈ సీరీస్ లో, ఆయన జాతకాన్నీ, ఆయన ఫిలాసఫీనీ, యోగమార్గాన్నీ వివరిస్తాను.

15 ఆగస్ట్ 1872 న సూర్యోదయానికి 24 నిముషాల ముందు కలకత్తాలో ఆరవిందులు జన్మించారని నళినీకాంతగుప్తా వ్రాశారు. ఆ రోజున సూర్యోదయం 5.40 కి జరిగింది. కనుక ఆయన పుట్టినది 5.16 నిముషాలకు అయ్యి ఉండాలి. ఆ సమయానికి వేసిన జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

లగ్నం కర్కాటకం అయింది. అందులో నీచ కుజుడూ, ఉచ్చగురువూ ఉన్నారు. కానీ గురువు నవాంశలో నీచలో ఉన్నాడు. దీనర్ధం ఏంటో తెలుసా?

గురువు నవమాదిపతిగా ఆధ్యాత్మిక రంగాన్ని సూచిస్తున్నాడు. రాశి - నవాంశలలో గురువుకు వచ్చిన ఈ స్థితుల వల్ల, మొదట్లో ఆయన సాధన బాగా జరిగినప్పటికీ, చివరకు ఏమీ ఫలితం ఉండదనీ, ఆయన యోగమార్గాన్ని అనుసరించేవారు పెద్దగా ఉండరనీ తేలుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఆయన ఉద్దేశ్యాలు, గమ్యాలు ఫెయిల్ అవక తప్పదని దీని అర్ధం.

సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలోనే ఉన్నాడు. అందుకే ఆయనకు ఒక ఆధ్యాత్మిక వారసత్వం అంటూ లేకుండా పోయింది. అంతిమంగా ఆయన ఆశయాలన్నీ కుప్పకూలాయి. ఆయన చేసిన సోకాల్డ్ మహిమలన్నీ గారడీ హస్తలాఘవాలే నని నిరూపితమైనాయి. చివరకు అదొక హవాలా గుంపని లోకానికి అర్ధమైపోయింది. దీనిని మనం స్పష్టంగా గమనించవచ్చు.

అదేవిధంగా కాకపోయినా, దాదాపు ఇంకోరకంగా అరవిందులకు కూడా  ఇలాగే జరిగింది. ఈనాడు ఆయన ఆశ్రమం పాండిచేరిలో ఉండవచ్చుగాక, అనేక ఊర్లలో దేశాలో ఆయన ఆశ్రమాల శాఖలు ఉండవచ్చుగాక. ఆయన యోగమార్గాన్ని సాధనచేసి బాగా ఎదిగిన వాళ్ళు, ఆ మార్గంలో బాగా ముందుకు పోయినవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు. ఇక ఆయన ఊహించిన గమ్యాన్ని అందుకున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరుకూడా లేరు. మొన్న ఆరోవిల్ వెళ్ళినప్పుడు కూడా నేను మూర్తిగారిని ఇదే అడిగాను. ఆయన కూడా ఇదే మాట చెప్పారు.

అంతేకాదు, అరవిందులు చివరి దశలో అసంతృప్తితో చనిపోయారని నేను వ్రాస్తే చాలామందికి మింగుడు పడకపోవచ్చు. తన శిష్యులే తనను సరిగా అర్ధం చేసుకోవడం లేదన్న బాధతోనూ, తన సాధన పూర్తి కాలేదన్న ఆవేదనతోనూ, తన గమ్యాన్ని తానే చేరుకోలేకపోయానన్న బాధతోనూ ఆయన చనిపోయాడు. ఆయన శిష్యులేమో, కొరియాలో మూడవ ప్రపంచయుద్ధాన్ని ఆపడానికి ఆయన తన దేహాన్ని ఒక సమిధలాగా త్యాగం చేసాడని అంటారు. ఇది చాలా హాస్యాస్పదంగా తోస్తుంది. ఇలాంటి హాస్యాస్పదమైన మాటలు ఆయన కూడా చాలా చెప్పారు. మొదటి ప్రపంచయుద్ధంలో తాను జోక్యం చేసుకున్నాననీ, దాని తీరును పాండిచేరిలో కూచుని తానే మార్చాననీ, ఏ దేశాలు గెలవాలో ఏవి ఓడిపోవాలో తానే నిర్ణయించాననీ ఆయన అనేవాడు. ఆయన శిష్యులు కూడా ఇవే కాకమ్మకబుర్లు చెబుతారు. పుస్తకాలలో కూడా ఇదే వ్రాసి ఉంటుంది. కానీ ఇది నమ్మదగ్గ విషయం కాదు.

ఎందుకంటే, ఎక్కడో జరుగుతున్న మొదటి ప్రపంచయుద్ధాన్ని (1914-1918) తాను పాండిచేరిలో కూచుని కంట్రోల్ చెయ్యగలిగినప్పుడు, తను ఏ దేశంలోనైతే ఉన్నాడో ఆ దేశానికి బ్రిటిష్ వారి నుండి విముక్తిని కలిగించి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించవచ్చు కదా ! ఆ పనిని ఆయనెందుకు చెయ్యలేకపోయాడు మరి?  ఫ్రెంచికాలనీ అయిన పాండిచేరిలో కూచుని ఈ కబుర్లన్నీ చెప్పడం ఎందుకు? ఇలాంటి సూటిప్రశ్నలు అడిగితే వారి శిష్యులకు మహాకోపం వస్తుంది ! ఎందుకంటే వీటికి జవాబులు ఉండవు గనుక !

ఇలాంటి హాస్యపుపోకడలు, గురువు చెప్పినది శిష్యులు అర్ధం చేసుకోకపోవడాలు, చివరకు ఆ గురువు అసంతృప్తితో చనిపోవడం, ఆయనకు సరియైన ఆధ్యాత్మిక వారసత్వం అంటూ మిగలకుండా పోవడం, ఆ శిష్యులేమో కాకమ్మకబుర్లు అల్లి చెబుతూ ఉండటం - వగైరాలన్నీ జాతకంలోని నీచగురువు వల్ల సంప్రాప్తిస్తాయి. అరవిందుల జాతకంలో ఈ యోగాన్ని స్పష్టంగా చూడవచ్చు.

మహనీయుల జాతకాలలో ఉండే శనిచంద్రయోగాన్ని ఈయన జాతకంలో కూడా చూడవచ్చు. కనుక అరవిందులు మహనీయుడే అని ఇది చెబుతోంది. ఆయన చెప్పినవి అబద్దాలు కావు. కానీ అవి ఆయన ఊహలు కావచ్చు. ఆచరణయోగ్యంకాని ఆదర్శాలు కావచ్చు. ఆయన ఊహించిన గమ్యాన్ని ఆయనే అందుకోలేక పోయాడు. ఈ విషయం ఆయనే చివర్లో స్పష్టంగా చెప్పాడు. మదర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అరవిందులు చనిపోయినప్పుడు ఆమె - 'దివ్యచైతన్యాన్ని భూమి స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లా, తన శిష్యుల తక్కువస్థాయి ప్రవర్తన వల్లా ఆయన దేహాన్ని వదిలేశారు' అని అన్నారు. తరువాత అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రకటనలో మాత్రం 'తన శిష్యుల తక్కువస్థాయి ప్రవర్తనవల్లా' అని ఆమె అన్నమాటను డిలీట్ చేసి రిలీజ్ చేశారు. ఈ విషయం 'సత్ ప్రేమ్' ఫైల్స్ చదివితే తెలుస్తుంది.

'దివ్యచైతన్యాన్ని భూమి స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే, ఆయన చనిపోవడం ఎందుకు? ఆ చైతన్యాన్ని తన దేహంలోకి దించి తీసుకురావడమే కదా ఆయన సాధనాపరమార్ధం? ఆ పనిని ఆయన దేహంతో ఉంటేనే చెయ్యగలరు. మరి దేహం ఒదిలెయ్యడం ఏంటి? ఒకరైనా ఆ పనిని సాధిస్తే, అప్పుడు అతీత ద్వారాలు తెరుచుకుంటాయనీ, మిగతావారికి ఆ పని సులభం అవుతుందనీ ఆయనే అనేవారు. మరి ఆ పనిని పూర్తి చెయ్యకుండా, శిష్యులందరినీ చీకట్లో వదిలేసి, ఆయనే వెళ్ళిపోవడం ఏంటి?' అని అరవిందుల ప్రముఖశిష్యుడిని ఒకాయనను నేను డైరెక్ట్ గా అడిగాను. ఆయన జవాబు చెప్పలేదు సరికదా నాతో మాట్లాడటం మానేశాడు. ఇక నేనెవర్ని అడగాలి?

శనిచంద్ర సంబంధం అనేది పంచవిధ సంబంధాలలో ఏదో ఒక విధంగా ఉంటుంది. పంచవిధ సంబందాలంటే ఏమిటో ఇంతకు ముందు పోస్టులలో వ్రాశాను. ఈ యోగం ఉన్న పోకడని బట్టి, దాని బలాన్ని బట్టి ఆ జాతకంలోని ఆధ్యాత్మికత ఉంటుంది.

శనీశ్వరుడు ఈ జాతకంలో చంద్రునితో కలసి ఉన్నప్పటికీ, వక్రించి ఉన్నాడు. కనుక ఈయన సాధన ఒక దశనుంచీ పూర్తిగా మార్పుకు లోనౌతుందని తెలుస్తున్నది. అలాగే జరిగింది, ఇదెప్పుడు జరిగిందో ముందుముందు పోస్టులలో వ్రాస్తాను. పైగా వీరిద్దరూ ఆరవ ఇంటిలో ఉండటంతో, అది కూడా ఉన్నత ఆశయాలకు సూచిక అయిన ధనుస్సు అయి ఉండటంతో, ఈయన సాధనాఆశయం చాలా ఉన్నతమైనదే అయినప్పటికీ, ఈ జన్మలో అది నెరవేరదని, దానికి చాలా అడ్డంకులు ఏర్పడతాయనీ, దానివల్ల ఆయన నిరాశకు లోనౌతాడనీ స్పష్టంగా కనిపిస్తున్నది. శనిచంద్ర సంబంధం డిప్రెషన్ నూ, విరక్తినీ సమంగా సూచిస్తుంది మరి !

శని వక్రస్థితిలో ఉండటం వల్ల వృశ్చికంలోకి వచ్చి కేతువుతో కలుస్తాడు. ఈ జాతకంలో రాహుకేతువులు సహజ ద్వితీయ అష్టమ స్థానాలలో ఉచ్చస్థితిలో ఉన్నారు. నవాంశలో కూడా అలాగే ఉంటూ కాలం యొక్క అనుగ్రహాన్ని సూచిస్తున్నారు. రాహుకేతువులు ఏ జాతకంలో ఉచ్చస్థితిలో ఉంటారో అది అదృష్టజాతకం అనబడుతుంది. కాలం వారికి సునాయాసంగా కలసి వస్తుంది. అంటే, తను చేపట్టిన పనిని చాలావరకూ సాధించడం జరుగుతుంది అని సూచన ఉన్నది. అయితే అది బాహ్యంగా మాత్రమే. ఆయన అంతరిక సాధన మాత్రం పరిపూర్ణం కాలేదు. దానికి ఇతర గ్రహస్థితులు కారణం అయినాయి. అందుకే ఆయన సాహిత్యం కుప్పలు తెప్పలుగా ఉన్నప్పటికీ, ఆశ్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ఆయన చెప్పిన పూర్ణయోగాన్ని సాధించినవారు, కనీసం అందులో ఉన్నతస్థాయిలను అందుకున్నవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు  !

పంచమంలోని ఉచ్చకేతువు వల్ల, గొప్పదైన మార్మికసాధన ఆయన జాతకంలో సూచితం అవుతున్నది. అయితే ఆ కేతువు కుజుని సూచించడమూ, ఆ కుజునితో శని కలవడం వల్ల విస్ఫోటయోగం ఏర్పడుతున్నది. ఇది ఆశాభంగాన్నీ, ఓటమినీ సూచించే యోగం. కనుకనే ఆయన సాధనాప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది.

(ఇంకా ఉంది)