ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 5 (అరవిందుల పూర్ణయోగం - మాతృమందిర్)

ఆ అడవిలో కొంచం దూరం నడవగానే నెట్ సిగ్నల్ దొరికింది. గూగుల్ మాప్స్ లో చూసుకుంటూ టౌన్ హాల్ కి దారి వెదికాను. టౌన్ హాల్లోనే ఎడ్మిన్ ఆఫీసులన్నీ ఉంటాయి. మ్యాప్ రెండు దారులు చూపింది. ఒకటేమో దగ్గర దారి. దానికి 15 నిముషాల నడక సరిపోతుంది. మెయిన్ రోడ్ మీదనుంచి ఉంది. రెండోది 45 నిముషాలు పడుతుంది. అడవిలోనుంచి చుట్టూ తిరిగి పోవాలి. తేలికదారి మనకు నచ్చదు కదా ! అందుకని, రెండోదారిని సెలక్ట్ చేసుకుని అడవిలో నడక ప్రారంభించాను.

దట్టమైన అడవిలోనుంచి మెలికలు మెలికలు తిరుగుతూ పోతోంది ఆ దారి. మధ్యమధ్యలో ఎవరో ఒక ఫారెనర్ సైకిల్లోనో మోటార్ బైక్ లోనో ఎదురొస్తున్నాడు. ఎర్రమట్టి రోడ్డు. ఆరోవిల్ అంతా ఎర్రనేల. చీకటి పడితే ఆ దారిలో ఎలా పోతారో మరి? వీధి లైట్లే లేవు. కానీ అక్కడివాళ్లు అవే దారుల్లో చీకట్లో కూడా అలా నడుస్తూ పోతూనే ఉంటారని విన్నాను. ఆశ్చర్యం వేసింది.

ఈ లోపల రవి నుంచి ఫోనొచ్చింది. కాసేపు మాట్లాడి పెట్టేశాను. ఇంతలో అమెరికా నుంచి శిష్యురాళ్ళు కొందరు ఫోన్ చేశారు. ఇంతలో సిగ్నల్ కట్ అయిపొయింది. అలాగే నడుస్తూ ఒక గంట తర్వాత దట్టమైన చెట్ల మధ్యలో ఉన్న పెద్ద ఆఫీస్ బిల్డింగ్ దగ్గరలోకి చేరుకున్నాను. ఇంతలో ఒక కారు నా వెనుకనుంచి వచ్చి నాకు అడ్డంగా ఆగింది. అందులోనుంచి మూర్తిగారు దిగి 'ఎక్కండి' అన్నారు నవ్వుతూ.

'వచ్చేశాం కదా ఇంకెంత వంద గజాలు' అన్నాను.

'పర్లేదు ఎక్కండి' అన్నారాయన. ఆ కొద్ది దూరం కారులో వెళ్లి ఆయన ఆఫీసుకు చేరుకున్నాం. మోస్ట్ మోడరన్ లుక్ తొ ఆ బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఆయన ఆఫీసు. అంత దట్టమైన అడివిలో అంత మోడరన్ ఫెసిలిటీస్ తొ అలాంటి ఆఫీసు. ఆశ్చర్యం వేసింది. Best of both the worlds అంటే ఇదేనేమో అనుకున్నా.

'రవి నాకు ఫోన్ చేశాడు. మీరు అడవిలో నడుచుకుంటూ వస్తున్నారని చెప్పాడు. మధ్యలో సిగ్నల్ పోయిందని అన్నాడు. అమెరికాలోని మీ శిష్యులూ, ఇండియా లోని మీ శ్రీమతీ కంగారు పడుతున్నారట. అందుకే నేను కారులో వచ్చాను వెదుక్కుంటూ' అన్నాడాయన.

నవ్వాను.

'వాళ్ళకు నామీద ప్రేమ చాలా ఎక్కువలెండి. కాసేపు కనిపించకపోతే కూడా తట్టుకోలేరు. అయినా నేనేమై పోతాను? ఒకవేళ దారితప్పితే రాత్రంతా ఏ చెట్టో ఎక్కి కూచుంటాను. పొద్దున్నే దిగి వస్తాను. కంపెనీ ఇవ్వడానికి ఏ ఎలుగుబంటో ఉండకపోదు చెట్టుమీద' అన్నాను.

ఆయన నవ్వేశాడు.

ఇక్కడ ఎలుగులు లేవండి. కానీ విషపు పాములున్నాయి చాలా రకాలు' అన్నాడు. ఇలా అంటూ తనతో ఉన్న ఒక డేనిష్ వ్యక్తిని పరిచయం చేశాడు.

ఇంతలో టీ వచ్చింది. త్రాగుతూ ఉండగా, ఒక అమెరికన్ వచ్చి మాతో కలిశాడు. ఆయన పేరు 'స్వాన్' అని పరిచయం చేసారు మూర్తిగారు. గత నలభై ఏళ్ళనుంచీ ఇక్కడే ఉన్నారని అన్నారు. ఈయన పోటో చూసిన మదర్, 'ఇతన్ని ఇక్కడ ఉండనివ్వండి' అన్నారట అప్పట్లో. డాక్టర్ మీనాక్షి గారనే ఇండియన్ను పెళ్లి చేసుకుని ఆయన ఇక్కడే స్థిరపడిపోయాడు. తమిళ్ అనర్గళంగా మాట్లాడగలడు.

స్వాన్ గారు మంచి స్నేహశీలి. పాండిచేరి ప్రభుత్వానికి ఆయన సోలార్ ప్రాజెక్టుల సలహాదారని చెప్పారు. ఈ మధ్యనే వచ్చిన బడ్జెట్ గురించి, రైల్వేల గురించి ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆయన ఆరా చాలా బాగా అనిపించింది. తరువాత స్వాన్ గారూ, ఆ డేనిష్ ఆయనా ఇద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. నేనూ మూర్తిగారూ ఇద్దరమే మిగిలాం.

మూర్తిగారు చూడవలసిన ఫైల్స్ చాలా ఉన్నాయి టేబుల్ మీద. 'నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదుకదా?' అన్నాను మర్యాదగా.

'అబ్బే లేదండి. కూర్చోండి. ఈ పని నాకెప్పుడూ ఉంటుంది. ఇంతకీ ఎన్నాళ్ళు ఉండబోతున్నారు మీరిక్కడ?' అడిగాడాయన.

'చెప్పలేనండి. రేపు పొద్దునే బయలుదేరదామని అనుకుంటున్నాను. లేదా ఇంకో నాలుగురోజులు కూడా ఉండవచ్చు. ఏ విషయం ఇప్పుడే చెప్పలేను.' అన్నాను.

ఆయన గడియారం వైపు చూశారు.

'అయితే ఒక పని చేద్దాం. రేపు మంగళవారం. మాతృమందిర్ తెరవరు. అందుకని ఇప్పుడే మనం అక్కడకు వెళదాం' అంటూ, 'మీతో వచ్చిన ఆమె ఎక్కడ?' అడిగారు.

'ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు' అని చెప్పాను.

'సరే. ఆమెకు కారు పంపిస్తాను. అందులో ఆమె వస్తారు. మనం నడుచుకుంటూ మాతృమందిర్ కు వెళదాం ఈ లోపు' అన్నాడాయన.

'సరే' అన్నాను.

కాసేపు ఆయన ఫైల్స్ అవీ చూచాక ' ఇక్కడ మీరేమేం చూడాలని అనుకుంటున్నారు?' అన్నారు.

'నాకు పెద్దగా ఏవీ చూడాలని లేదండి. ఎక్కడైనా ఒకచోట కాసేపు ధ్యానంలో కూర్చుంటాను. అంతే' అంటూ 'అరవిందుల పూర్ణయోగంలో ఉన్నతస్థాయిలు అందుకున్న మనుషులు ఇప్పుడెవరైనా ఉన్నారా? ఉంటే, వారిని మాత్రం కలుద్దామని ఉంది' అన్నాను.

ఆయన సాలోచనగా చూచారు.

'పెద్దగా లేరండి. కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా బాగా పెద్దవాళ్లై  పోయారు.దాదాపు నలభై ఏభై ఏళ్లనుంచీ ఇక్కడ ఉంటున్న ఫారినర్స్ లో కొందరున్నారు. మనవాళ్ళలో కూడా కొందరున్నారు' అన్నారాయన.

నేను మౌనంగా వింటున్నాను.

'అరవిందుల యోగం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయనిలా అనేవారు - Where the traditional Yogas end....' అని ఆయన చెప్పబోతూ ఉండగా, నేనందుకుని 'my Yoga begins' అనేవారు' - అన్నాను.

'అవును' అన్నారాయన.

As far as I could understand, transformation of the physical body along with its cells into Divine light and power and bliss is the ultimate aim of Sri Aurobindo's Yoga' అన్నాను నేను.

'అవునండి. మదర్ చివరి రోజులలో కొందరు చూచారు. ఆమె తన కాళ్ళకున్న సాక్స్ విప్పితే, లోపల పాదాలు లేవట. కాంతి మాత్రమే ఉందని చెప్పారు. అంటే, transformation of physical body into light body అనేది పాదాలనుంచి మొదలై పైపైకి వస్తుందన్నమాట. ఇది విన్నప్పుడు నాకనిపించింది. అందుకేనేమో పెద్దవాళ్ళ కాళ్ళకు మనం నమస్కారం పట్టేది అని' అన్నారు మూర్తిగారు.

'అవును. అరవిందులు వదలి వెళ్ళిన సాధనను ఆమె కొనసాగించారని, చాలావరకూ సాధించారని కూడా చదివాను' అన్నాను.

'అవునండి. ఇతర మార్గాలలో అయితే ఆత్మసాక్షాత్కారం అనేది  సాధనలో చివరిమెట్టుగా ఉంటుంది. కానీ అరవిందుల యోగం అక్కడనుంచి మొదలౌతుంది. Soul అనేది వేరు, psychic being అనేది వేరని అరవిందులు అన్నారు. ఎన్ని జన్మలెత్తినా soul అనేది మారదు. కానీ psychic being మాత్రం జన్మజన్మకూ evolve అవుతూ ఉంటుందని ఆయన చెప్పారు.' అన్నారు మూర్తిగారు.

ఆయనకు అరవిందుల తత్త్వం బాగా తెలుసని నాకర్ధమైంది.

'అవును. Heart center లో వెనుకగా Caitya Purusha లేదా Soul ఉంటుందని, అదే స్థానంలో ముందువైపుగా psychic being ఉంటుందని ఆయన వ్రాశారు. Soul is the spark of the Divine అని కూడా ఆయనన్నారు' - అన్నాను.

నేనూ కొద్దో గొప్పో అరవిందులను చదివానని ఆయనకు అర్ధమైంది.

అలా మాట్లాడుకుంటూ, మాతృమందిర్ కు దారితీశాము. మేము అక్కడకు వెళ్లేసరికి అక్కడి కౌంటర్లో ఒక మధ్యవయసు అమెరికన్ ఒకామె మౌనంగా కూచుని ఉంది. ఆమె ఆధ్యాత్మిక ఆరా చాలా బలంగా ఉంది. ఆమెను ఒకసారి చూస్తూనే నేనది గమనించి నవ్వుతూ ఆమెకు 'నమస్తే' చెప్పాను. ఆమె ఆరాను నేను గుర్తించిన సంగతి ఆమె గమనించి, నవ్వుతూ నాకూ నమస్తే చెప్పింది. మేము లోపలకు నడిచాం.

ఒక పెద్ద పచ్చిక మైదానం మధ్యలో ఉన్న బ్రహ్మాండమైన టెన్నిస్ బాల్ ఆకారమే మాతృమందిర్. ఆ మైదానంలోకి అడుగు పెడుతూనే బలమైన ఎనర్జీ తరంగాలు నన్ను తాకాయి. మౌనంగా వాటిని సహిస్తూ, ముందుకు నడిచాను. కొద్దిదూరం వెళ్ళాక ' ప్రస్తుతం మాతృమందిర్ లోపలకు వెళ్ళడానికి కుదరదు. పక్కనే ఉన్న వందల ఏళ్ళనాటి మర్రిచెట్టు క్రింద కూచోండి. లేదా ఈ లాన్ లో ఎక్కడైనా కూచోవచ్చు. మీరుంటానంటే, బుధవారం మిమ్మల్ని మాతృమందిర్ ఇన్నర్ చాంబర్లో మార్నింగ్ మెడిటేషన్ కు తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తాను' అన్నారు మూర్తిగారు.

'పరవాలేదండి. ఎక్కడైనా నాకు ఒకటే. కాసేపు ఇక్కడే కూచుంటాను. నో ప్రాబ్లం! బుధవారం దాకా నేనుంటే, అలాగే మీరు చెప్పిన పని చేస్తాను' అన్నాను.

ఇంతలో శిష్యురాలు కార్లో వచ్చి అక్కడకు చేరుకుంది.

'ఈయన డాక్టర్ అగర్వాల్ గారు. మీ ధ్యానం అయిపోయేవరకూ ఈయన మీకోసం వెయిట్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని 'నీం ట్రీ' అనే హోటల్ దగ్గర దిగబెడతారు. ఈ అడవిలో చీకటి పడ్డాక, మీరా హోటల్ ఎక్కడుందో కనుక్కోలేరు. అందుకే ఈయన మీతో ఉంటారు' అని అగర్వాల్ గారిని మాకప్పజెప్పి వెళ్ళిపోయారు మూర్తిగారు.

నేను మౌనంగా నడుస్తూ వెళ్లి ఆ మర్రిచెట్టు క్రింద కూచున్నాను. అనేక ఊడలతో కూడిన చాలా పెద్ద మర్రిచెట్టు అది. దాని క్రింద సిమెంట్ బెంచీలున్నాయి. ఒకదానిమీద కూచుని ధ్యానంలో మునిగాను. పక్కనే ఇంకో బెంచీమీద శిష్యురాలు కూచున్నట్టు అనిపించింది. నేను సరిగా గమనించలేదు. దాదాపు ఒక గంట ధ్యానంలో ఉన్నాక, లేచి చూస్తె, ఆమె లేదు. 'సరే, ఎక్కడో ఉంటుందిలే' అనుకుంటూ, మాతృమందిర్ చుట్టూ తిరుగుతుంటే, ఇందాకటి అగర్వాల్ గారే మళ్ళీ కనిపించి,  'క్రిందికి వెళ్ళే మెట్ల దారిగుండా బాల్  క్రిందికి వెళ్లి చూడండి. పరవాలేదు' అని చెప్పాడు. ఆ దారిలో బాల్ క్రిందికి దిగాను. అక్కడ ఒక పెద్ద తామరపువ్వు ఆకారం భూమిమీద చెక్కబడి ఉంది. అందులో గలగలా పారుతూ పడుతున్న నీరు భూమిలో ఇంకిపోతోంది. చాలా బలమైన ఎనర్జీ అక్కడ ఉన్నట్టు నేను ఫీల్ అయ్యాను. ఆ బాల్ ఆకారం, అక్కడ ఉన్న తామరపువ్వు, పారుతున్న నీరు, పైన ఇన్నర్ చాంబర్లో ఉన్న క్రిస్టల్, ఆ బాల్ కున్న నాలుగు తలుపులు, వాటి అంతరార్దాలన్నీ క్షణంలో నాకు అర్ధమయ్యాయి.

బ్రహ్మాండమైన ఆ బాల్ క్రింద గలగలా పారుతున్న నీటి శబ్దం వింటూ మౌనంగా నించున్న నాకు ట్రాన్స్ లాంటి ఒక స్థితి కలిగింది. ఆ ట్రాన్స్ లో - వందల ఏళ్ళనాడు అక్కడున్న అడవీ, ఆ మర్రిచెట్టూ, అప్పటిలో ఇక్కడ ఇంకా ఎవరెవరు ఉండేవారు? అరవిందులు, మదర్లకు ఈ ప్రదేశంతో ఉన్న అనుబంధమూ, అప్పట్లో వాళ్ళు చేసిన సాధనా, పూర్ణయోగానికి అప్పట్లోనే పడిన బీజాలూ, దీని వెనుక ఉన్న సిద్ధసాంప్రదాయపు మూలాలూ, ఇంకా కొన్ని వేల ఏళ్ళనాడు వేదకాలంలో ఇక్కడేం ఉండేది? అన్న విషయమూ గాయత్రీమంత్రంతోనూ, వేదసాంప్రదాయంతోనూ, సూర్యశక్తితోనూ ఈ ప్రదేశానికి ఉన్న సంబంధమూ - ఈ వివరాలన్నీ flashes లాగా చకచకా నా లోలోపల కనిపించాయి. కాసేపు అక్కడే ఉంటే. చాలా deep trance కలిగేలాగా అనిపించింది. కానీ బయట అగర్వాల్ గారు మాకోసం వెయిట్ చేస్తున్నారు. అది గుర్తొచ్చి తమాయించుకున్నాను.

అదే ట్రాన్స్ లో మెల్లిగా నడుచుకుంటూ బాల్ క్రిందనుంచి బయటకు వచ్చి, పచ్చిక మైదానంలో నడుస్తూ బయటకు వచ్చాను. శిష్యురాలి జాడ లేదు. అగర్వాల్ గారు కౌంటర్లో మాకోసం వేచిచూస్తూ కనిపించారు.

'వెళదామా?' అన్నారాయన.

'ఆమె ఎక్కడుందో తెలీదు. ఇంకా టైం పడుతుందేమో? మీరు వెళ్ళండి. మేము ఏదో విధంగా వస్తాం' అన్నాను.

'పరవాలేదు. ఇంకో పది నిముషాలు చూస్తాను. ఆమె రాకపోతే అలాగే వెళతాను. నాకు కొంచం పనుంది.' అన్నాడాయన నొచ్చుకుంటూ.

'అయ్యో పరవాలేదండి. ఇప్పటిదాకా మాకోసం వేచి చూచిందే ఎక్కువ' - అన్నాను. ఆయన చెప్పినట్లే పది నిముషాలు వెయిట్ చేశాము. ఆమె రాలేదు. అగర్వాల్ గారు తన కారు తీసుకుని నాకు టాటా చెప్పి వెళ్ళిపోయారు. నేను కౌంటర్లోనే నిలబడి వెయిట్ చేస్తున్నాను. కాసేపటికి చీకట్లోనుంచి నడుచుకుంటూ శిష్యురాలు ఆ మైదానం లోనుంచి బయటకు వచ్చింది.

'అగర్వాల్ గారు ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు' అన్నాను.

'నేను ఇక్కడే ఉన్నాను. మీకోసం వెయిట్ చేస్తున్నాను' అందామె. ఇలా అంటూ ఏదో మరచిపోయినట్టు మళ్ళీ పచ్చికమైదానం లోకి పరుగెత్తి వెళ్ళిపోయింది. 'ఏదో మరిచి పోయి ఉంటుందిలే' అనుకుంటూ నేను చీకట్లోకి చూస్తున్నాను. కాసేపటికి మళ్ళీ బయటకు వచ్చిందామె.

'ఏమైంది?' అడిగాను.

'కళ్ళజోడు మర్చిపోయాను' అందామె.

నాకు చిరాకేసింది. వస్తువులు మరచిపోవడమూ, ముందుకూ వెనక్కూ పరిగెత్తడమూ, పక్కవాళ్ళను వెయిటింగ్ లో పెట్టడమూ, టైం సెన్స్ లేకుండా ఉండటమూ నాకు చాలా చిరాకును కలిగిస్తాయి. ఒక ధ్యానికి ఉండవలసిన లక్షణాలు కావవి. నాతో ఉండేవారు ఇలా ఉంటే నాకు చిరాకొస్తుంది.

ఒక deep meditation తర్వాత ఇలాంటి చిరాకు కలిగించే సంఘటనలు జరగడం నా జీవితంలో కొన్ని వందలసార్లు గమనించాను. ఇది మామూలే. ఎందుకంటే శిఖరం పక్కనే లోయకూడా ఉంటుంది. అది ప్రకృతి న్యాయం. నా మనస్సు చెదిరిపోకుండా ఉంచుకుంటూ, ఇలాంటి situations ఎలా హ్యాండిల్ చెయ్యాలో నేను చాలా ఏళ్ల అనుభవం మీద నేర్చుకున్నాను. బాల్ క్రింద వచ్చిన ట్రాన్స్ తో చాలా ఎత్తులో ఉన్న నా మనస్సును క్రిందకు లాగడానికి నిమ్నప్రకృతి నుండి ఇప్పుడు ఏయే సీన్లు ఎదురవ్వబోతున్నాయో నాకర్ధమై పోయింది.

మనసులో తలెత్తిన చిరాకును క్షణంలో ధ్వంసం చేసి దాన్ని మామూలు స్థితికి తెస్తూ, 'సరే, నడుద్దామా?' అన్నాను. మాతృమందిర్ చుట్టూ ఉన్న కంచె వెంబడి ఆ చీకట్లో మేము నడుస్తూ ఉందోలేదో తెలియని 'నీం ట్రీ' అనే హోటల్ను వెదుక్కుంటూ ఆ అడవిలో పోతున్నాము.

ఇద్దరం అలా నడుస్తూ పోతూ ఉండగా - 'అలా పక్కవారిని ఇబ్బందిపెట్టడం ఆధ్యాత్మిక లక్షణం కాదు' అన్నాను.

'నా దృష్టి ఎప్పుడూ 'పైకే' ఉంటుంది. అందుకే చిన్నచిన్న విషయాలు నేను మరచిపోతూ ఉంటాను' అందామె.

నాకు నవ్వొచ్చింది. నవ్వు రావడమే కాదు. శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

ఒకసారి శ్రీరామకృష్ణులు పడవలో ఎక్కడికో పోయి దక్షినేశ్వరానికి తిరిగి వచ్చారు. ఆయనకు తోడుగా లాటూ మహారాజ్ (స్వామి అద్భుతానంద) ఉన్నారు. శ్రీ రామకృష్ణుల తువ్వాలును లాటూ మహారాజ్ పడవలో మరచిపోయాడు. తన గదికి తిరిగి వచ్చాక ఆ సంగతి గమనించి శ్రీ రామకృష్ణులు లాటూను చీవాట్లు పెట్టారు.

'నా మనస్సు ఎప్పుడు ప్రపంచాతీతంగా పరబ్రహ్మంలో లీనమై ఉంటుంది. కానీ నేనెప్పుడూ ఏ వస్తువునూ మరచిపోను. నీకెందుకింత పరధ్యానం? ఎక్కడుంటుంది నీ ధ్యాస? చేస్తున్న పని మీద ఉండదా?' అని మందలించారు ఆయన.

ఈ సంఘటన గుర్తొచ్చి లోలోపల నవ్వుకున్నాను. సమాధిలో ఉంటూ కూడా లౌకిక వ్యవహారంలో పర్ఫెక్ట్ గా ఉండటమే అసలైన సిద్ధలక్షణం. సాధనాపరంగా ఈ అమ్మాయి చాలా ప్రాధమిక స్థాయిలో ఉంది, కానీ, తన దృష్టి ఎప్పుడూ 'పైకే' ఉంటుందని అనుకుంటోంది. అది నిజం కాదు. కానీ నిజం అని భ్రమిస్తోంది.

నా ఆలోచనను కట్ చేస్తూ 'ఇప్పుడు సినిమాకి వెళితే ఎలా ఉంటుంది?' అందామె సడన్ గా.

నేను బిత్తరపోయాను.

'ఈ అడవిలోనా? సినిమానా?' అన్నాను.

'అవును. ఇక్కడ సినిమా హాలుంది. అన్నిదేశాల సినిమాలూ ఇక్కడ రోజుకొకటి వేస్తూ ఉంటారు. వెళ్తాను' అందామె.

'సరే, నువ్వెళ్ళి రా. నేను టిఫిన్ చేసి గెస్ట్ హౌస్ కి వెళతాను. పరవాలేదు.' అన్నాను.

సినిమా అయిపోయాక ఆ చీకట్లో గెస్ట్ హౌస్ కి ఎలా చేరాలో ఏమో అనుకుందో ఏమో, 'ఒద్దులే' అందామె.

'ఇప్పుడే కదా, నా దృష్టి ఎప్పుడూ 'పైకే' ఉంటుంది అన్నావు. మరుక్షణమే 'సినిమాకి పోతాను' అంటున్నావు. ఇదేంటి? అంత పైకి ఉన్న దృష్టి ఉన్నట్టుండి సినిమా మీదకి ఎలా మళ్ళింది?' అన్నాను.

ఆమేం మాట్లాడలేదు. నేనలా అడగడం ఆమెకు కోపం తెప్పించిందని తెలుస్తోంది.

పదేళ్ళక్రితం వాళ్లిక్కడ ఉన్నపుడు, అప్పుడప్పుడు అలా సినిమాలు చూడటం ఆమెకు అలవాటనీ, ఇక్కడకు రావడంతో ఆ పాత సంస్కారాలు మళ్ళీ తలెత్తుతున్నాయనీ నాకర్ధమైంది. మనసు చేసే మాయలు నాకు బాగా తెలుసు గనుక మౌనంగా నడుస్తున్నాను.

'అవునూ ! మీ శిష్యులంతా ఏంటి? మీకు ఒక గ్లాసు మంచినీళ్ళు అందించినా ఎంతో గొప్పగా పొంగిపోతూ ఉంటారు. మీకు 'టీ' చేసి ఇవ్వడం కూడా ఒక ధన్యతలాగా భావిస్తారు. ఎందుకంత అతి చేస్తారు వాళ్ళు?' అడిగిందామె.

'ఏమో నాకేం తెలుసు? నాలో వాళ్ళకేం కనిపించిందో? వాళ్ళ కళ్ళతో చూడు నీకూ కనిపించవచ్చు' అన్నాను.

ఆమె మాట్లాడలేదు.

అలా నడుస్తూ, నడుస్తూ అనుకున్నట్టుగానే అడవిలో దారి తప్పాం. ఒకచోటకు వచ్చాక  సడన్ గా 'నేను దారి మర్చిపోయాను' అంది శిష్యురాలు.

'అదేంటి? ఇక్కడ రెండేళ్ళు ఉన్నామని చెప్పావ్ కదా?' అడిగాను.

'ఎప్పుడో పదేళ్ళక్రితం ఉన్నాం, ఈ లోపల చాలా మారింది ఇక్కడ' అందామె.

'దేవుడా?!!' అనుకున్నా లోలోపల.

ఆ చీకట్లో, అడవిలో అటూఇటూ తిరుగుతున్నాం కాని, ఆ 'నీం ట్రీ' ఎక్కడుందో కనిపించడం లేదు. గూగుల్ మ్యాప్ చూస్తె, ఏదో తప్పు దారులు చూపిస్తోంది. అది చూపించినట్లు వెళితే చెట్లలోకి పోతున్నాం గాని ఏమీ రావడం లేదు.

ఇంతలో ఎవరో ఒక ఫారెన్ వనిత అటుగా పోతుంటే, ఈమె వెళ్లి ఆమెను దారి అడిగింది. ఎలా వెళ్ళాలో ఆ తెల్లామె దారి చూపించి, 'మీరు నన్ను నమ్మచ్చు. ఎందుకంటే నేను ఆరోవిల్లియన్ ని కనుక' అంది నవ్వుతూ.

నాకు నవ్వొచ్చింది. ఇండియాలో దారితప్పి ఒక తెల్లామెను దారి అడుగుతున్నాం మేము. 'భలే కామెడీరా దేవుడా!' అనిపించింది. 

ఆమె వెళ్ళిపోయాక, 'ఆరోవిల్లియన్ అంట ! ప్రతివాళ్ళూ మేము ఆరోవిల్లియన్ అంటారు. నేను కానట్టు ! నేనూ ఇక్కడ రెండేళ్ళు ఉన్నాను. నాకేమో సిటిజెన్ షిప్ ఇవ్వలేదు. వీళ్ళంతా సిటిజెన్స్ అయిపోయారు' అంది శిష్యురాలు కొంచం కోపంగా.

'ఆమె అలా అందని నీకు అసూయగా ఉందా?' అడిగాను.

'అవును. మండిపోతోంది' అంది శిష్యురాలు.

'ఒకపని చెయ్యి' అన్నాను.

'ఏంటి?' అన్నది.

'నా దగ్గర కత్తుంది, ఇస్తాను. ఆ తెల్లదాన్ని పొడిచెయ్' అన్నాను.

'ఛీ ! ఏంటండి ఆ మాటలు?' అంది శిష్యురాలు కోపంగా.

'పోనీ నిన్ను నువ్వు పొడుచుకో. నన్నిలా చీకట్లో అడవిలో తిప్పుతున్నందుకు' అన్నాను.

'మీరింత nasty గా ఎలా మాట్లాడగలరు?' అడిగిందామె కోపంగా.

'నేను కాబట్టే, nasty గా మాట్లాడగలను. నేను మీ అంత civilized animal ని కాను. I am a savage beast and I would like to remain so forever' అన్నాను.

ఆమె షాకైంది నా మాటలకు.

ఆ తెల్లదేవత చెప్పిన దారిలో పోతే, చిట్టచివరకు చెట్లు, గుడ్డి లైట్ల మధ్యలో 'నీం ట్రీ' అనే పాకా హోటల్ కనిపించింది. చెట్లమధ్యన ఒక రేకుల షెడ్డు వేసి, దాని ముందు నాలుగు కుర్చీలు వేసి, దానిని హోటల్ అంటున్నారు వాళ్ళు.

'వార్నీ ఇదా హోటల్ అంటే?' అనుకున్నా దాని అవతారం చూసి.

అక్కడంతా తెల్లవాళ్ళు చాలామంది కూచుని ఏవేవో తింటూ కనిపించారు. మేమూ ఏదో ఆర్డర్ ఇచ్చాం. కూచుని వెయిట్ చేస్తున్నాం.

మా పక్కనే కొంతమంది తెల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకమ్మాయి గుండు చేయించుకుని ఉంది. దాన్ని చూసి శిష్యురాలు - 'ఈ అమ్మాయి నన్ ఏమో?' అంది.

నేను సీరియస్ గా - 'గుండు చేయించుకున్న ప్రతిదీ నన్నూ కాదు. పట్టుచీర కట్టిన ప్రతిదీ పతివ్రతా కాదు' అన్నాను.

శిష్యురాలికి కోపం నషాళానికి పెరిగింది.

ఇంకోపక్కన ఇరవైలలో ఉన్న కొంతమంది తెల్లవాళ్ళూ మనవాళ్ళూ కూచుని ఏదో వాగుతూ కేరింతలు కొడుతూ కనిపించారు. వాళ్ళలో ఒకమ్మాయి చాలా లావుగా ఉంది. వయసేమో పాపం పదహారో ఏమో ఉంటాయి అంతే. 'ఎనర్జీ లెవల్స్ , ఎనర్జీ బాడీ' అంటూ ఏదో వాగుతోంది ఆ అమ్మాయి.

అది విన్న శిష్యురాలు సంభ్రమంగా - 'చూశారా ! ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎనర్జీ బాడీ గురించి మాట్లాడుతున్నారు' అంది.

వాళ్ళవైపు ఒకసారి చూసిన నేను పెదవి విరుస్తూ - 'దానిమొహం ! దాని బాడీ సంగతి దానికి తెలీదుగాని, ఎనర్జీ బాడీ గురించి చెబుతోందా? ముందు దాని ఊబకాయం తగ్గించుకోమను. ఆ అమ్మాయికి identity crisis ఉంది. తను obese అని గిల్టీ ఫీలింగ్ ఉంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో వాగుతోంది. అంతే ! అక్కడంత సీన్ లేదు' అన్నాను.

'మీకు దమ్ముంటే ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి ఇవే మాటలు చెప్పగలరా?' అంది శిష్యురాలు కోపంగా.

'నాకు దమ్ముందో లేదో ఈ పిల్లకాకుల దగ్గరా, నీ దగ్గరా ప్రూవ్ చేసుకోవలసిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేనెళ్లి  వాళ్ళతో ఇవే మాటలు చెప్పాననుకో. పెద్ద గొడవౌతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్లకు సపోర్ట్ వస్తారు. అందరూ కలసి నన్ను తంతారు. అది చూద్దామని నీ ఆశ. అంతేనా?' అడిగాను.

'అవును' అంది శిష్యురాలు శాడిస్టిక్ గా నవ్వుతూ.

'అలా జరగదు. ఏం జరుగుతుందో నేను చెప్తా విను. వాళ్ళు నన్ను తన్నడం వరకూ సరే. నేను తిరగబడి వాళ్ళను కొట్టడం ప్రారంభిస్తే, అప్పుడు జరిగే ఫైట్లో వాళ్ళందరూ చస్తారు. పదేపది నిముషాలలో ఆ ఆరుగురినీ చంపగలను నేను. తమాషాకి చెప్పడం లేదు. ఆ సామర్ధ్యం నాకుంది. ఆ తర్వాత ఈ పది కిలోమీటర్లూ అడివిలో పరిగెత్తి దొరక్కుండా పారిపోనూ గలను. నువ్వు పరిగెత్తలేవు. వీళ్ళకు దొరికిపోతావు. నిన్ను మూస్తారు. ఇదే జరిగేది. నీకు ఓకే అయితే అలాగే చేస్తా' అన్నాను.

'ఒక గురువై ఉండి ఇంత వల్గర్ గా ఎలా మాట్లాడగలరు మీరు? అందామె మళ్ళీ.

'రెండు విషయాలు విను. ఒకటి - నేను నీకు గురువును కాను. రెండు - నేను కాబట్టే ఇలా మాట్లాడగలను. నాకు మాస్కులు లేవు. నాకు స్టేజిమీద నటన బాగా వచ్చు కాని జీవితంలో నటించను. లోపల బూతులు తిట్టుకుంటూ బయటకు ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకుని నంగినంగిగా మాట్లాడటం మర్యాదగా ప్రవర్తించడం నాకసహ్యం. స్నేహమైతే స్నేహమే. గొడవొస్తే గొడవే' అన్నాను.

'అయినా సరే. మీరిలా మాట్లాడటం నాకు బాలేదు' అందామె.

'అది నీ హెడేక్. నాది కాదు. అయినా నువ్వడిగావని చెప్తా విను. ఏ మాస్కులూ లేకుండా ఉండేవాడే ఆధ్యాత్మికంగా ఎదగగలడు. పూర్తి జంతువే పూర్తి దేవతగా మారగలదు. మధ్యలోని వాళ్ళు అలా చెయ్యలేరు. చాలా కష్టం.' అన్నాను.

'ఏదేమైనా, మీరు ప్రతివాళ్ళనీ జడ్జ్ చేస్తారు. ఇది మంచి అలవాటు కాదు' అందామె.

నేను మౌనంగా ఊరుకున్నాను.

కాసేపాగి, మళ్ళీ తనే - 'ఈ హోటల్ వాడికి దురాశ బాగా ఎక్కువ. నాసిరకం టిఫిన్స్ పెట్టి డబ్బులు బాగా గుంజుతాడు. వీడు మేమున్నప్పటినుంచీ ఇక్కడున్నాడు. బాగా సంపాదించాడు' అంది.

'నువ్వెందుకు వాడిని జడ్జ్ చేస్తున్నావ్?' అడిగాను.

జవాబు లేదు.

'వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే తిను. లేకుంటే లేచిపో. లేదా, నువ్వుకూడా ఈ అడివిలో ఒక హోటల్ పెట్టి బాగా సంపాదించు. ఈ ఏడుపు ఎందుకు? దీన్ని జడ్జ్ మెంట్ అనరా?' అడిగాను.

మౌనం.

ఇలాంటి చెత్త సంభాషణతో, హోటల్ వాడు పెట్టిన చెత్తతిండి తినడం అయిపోయింది. అదృష్టవశాత్తూ, అక్కడనుంచి గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి తనకు బాగానే దారి తెలుసు. కానీ వీధిలైట్లు కూడా లేవు. క్రింద పాములున్నాయో ఇంకేమున్నాయో కూడా తెలీనంత చీకటి. చుట్టూ అడవి. సెల్ ఫోన్ లైటులో దారి చూసుకుంటూ చిన్నగా నడచి గెస్ట్ హౌస్ కి వచ్చి నిద్రకు ఉపక్రమించాం.

పొద్దుటనుంచీ కనీసం ఒక పదిహేను కిలోమీటర్లు నడిచి ఉంటాను. ఒళ్లంతా తుక్కైపోయింది. నేనున్న రూముకి నాలుగు పక్కలా గ్లాస్ విండోలున్నాయి. వాటిల్లోనుంచి చుట్టూ ఉన్న అడవీ, వెన్నెలా బాగా కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఏవేవో జంతువులు అరుస్తున్నాయి. రూములో ఉన్న విషయం కాసేపు గనుక మరచిపోతే, అడవిలో చెట్లకింద పడుకున్నట్టే ఉంది.

'రేప్పొద్దున్నే లేచి ముందీ అడవిలోంచి బయటపడాలి' అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

క్షణాల్లో నిద్రపట్టేసింది.

(ఇంకా ఉంది)