Learn to live mindfully and meaningfully!

9, అక్టోబర్ 2019, బుధవారం

సాంప్రదాయమూ - చట్టుబండలూ - 1

హిందూమతంలో అనవసరమైన గోల  చాలా ఎక్కువగా ఉంటుంది. 'విషయం తక్కువ, గోల ఎక్కువ' అనే మాట నేటి హిందూమతానికి సరిగ్గా సరిపోతుంది. అందులోనూ, సాంప్రదాయం పేరుతో నాశనమయ్యే ధోరణి బ్రాహ్మలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా కులాలలో ఇది ఉండదు. వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. బ్రాహ్మలు మాత్రం, పాత ఆచారాలను వదుల్చుకోలేక, నవీనతను అందిపుచ్చుకోలేక చూరుకు వేళ్ళాడుతున్న గబ్బిలాల్లా అఘోరిస్తూ ఉంటారు. అతి సాంప్రదాయం అతి చాదస్తం - ఇవే బ్రాహ్మల పతనానికి కారణాలని నా అభిప్రాయం. జీవితంలో ఏదైనా సరే, 'అతి' అయితే అది నాశనానికి దారి తీస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణకుటుంబాలలో ఈ 'అతి' అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అతి చాదస్తానికి కారణం చాలావరకూ నేటి టీవీ ఉపన్యాసకులు. వీరు నూరిపోస్తున్న అతి సాంప్రదాయమూ అతి చాదస్తమూ కలసి ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. నేటి పెళ్ళిళ్ళలో ఈ రెండు పోకడలూ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 'పెళ్లిళ్ల ఖర్చు' అనేది నేటి రోజులలో కొన్ని కుటుంబాలను పూర్తిగా నేలమట్టం చేసేస్తోంది.

మొన్నీ మధ్యన ఒకామె ఇలా చెప్పింది. 'మా అమ్మాయి పెళ్ళికి దాదాపు ముప్పై లక్షలు నాకు ఖర్చు అవుతోంది'. ఈ మాట విని నాకు మతి పోయినంత పని అయింది. పోనీ, వాళ్ళేమన్నా, కోట్లు మూలుగుతున్న వాళ్ళా అంటే అదీ కాదు. మామూలు మధ్యతరగతి మనుషులే. మరి వాళ్ళ శక్తికి మించి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారూ అంటే, లోకుల గొప్ప కోసం, బంధువులలో మెప్పు కోసం, వారి తాహతుకు మించి బట్టలూ, నగలూ, ఆర్భాటాలూ అప్పులూ చేసుకుంటూ, పెళ్లి అయిన తర్వాత లెక్కలు చూసుకుని భోరున ఏడుస్తున్నారు.

అసలు హిందూ వివాహాలలో జరిగే దుబారాని చూసీ చూసీ నాకు 'హిందూ వివాహం' అంటేనే చీదర పుట్టేసింది. ప్రస్తుతం జరుగుతున్నవేవీ హిందూ సాంప్రదాయ వివాహాలు కావని, ఆ పేరుతో జరుగుతున్న డొల్ల తంతులు మాత్రమేననీ నా ఖచ్చితమైన అభిప్రాయం.

ముప్పై ఏళ్ల క్రితం నా పెళ్లప్పుడు మా అత్తగారితో మామగారితో నేనిలా చెప్పాను. 'పెళ్ళంటూ దుబారా చెయ్యకండి. సింపుల్ గా రిజిస్టర్ మేరేజి చెయ్యండి. నాకు బంగారం, బట్టలూ వీటిమీద ఇంట్రస్ట్ లేదు. ఇన్ని రోజుల తంతులూ, గోలా నాకిష్టం ఉండదు. ఎంత సింపుల్ గా, క్లుప్తంగా చెయ్యగలిగితే అంతే చెయ్యండి.'

'అదెలా కుదురుతుంది నాయనా? మాకున్నది ఒక్కగానొక్క పిల్ల. పెళ్లి ఘనంగా చేస్తాము' అన్నారు వాళ్ళు.

'అంత ఘనం నాకవసరం లేదు. సింపుల్ గా చెయ్యండి చాలు' అన్నాను.

వాళ్ళు వినలేదు. నోరు మూసుకున్నాను.

నా పెళ్ళిలో నేను కట్నం తీసుకోలేదు. మా మామగారు ఏమి పెడతారో అడగలేదు. ఎంతిస్తారో అడగలేదు. అసలు వాళ్ళు ఏమి పెట్టారో కూడా నాకిప్పుడు గుర్తులేదు. పెళ్లి అయిన తర్వాత పండుగకు బట్టలు పెడతామంటే కూడా నేను వద్దన్నాను.

ఇదంతా చూచి మా అత్తగారు ఇలా అన్నారు 'ఇదేంటి నాయనా? ఇలాంటి అల్లుడివి దొరికావు. అందరూనేమో, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అని అడిగి మరీ తీసుకుంటుంటే నువ్వెంటి 'నాకేమీ వద్దు' అంటావు. కనీసం పండుగకు బట్టలు కూడా వద్దంటే ఎలా?'

ఆమెతో నేనిలా అన్నాను.

'అత్తయ్యగారు. నా కష్టార్జితం నాకు చాలు. ఒకరి సొమ్ము నాకొద్దు. అది మీదైనా సరే, నేను తీసుకోను. అందుకని మీరు పెట్టేవేవీ నాకొద్దు'.

ఆమె ఇలా అన్నారు.

'మేము ఉన్నంతవరకే మేము పెడతాము నాయనా! మేము పోయాక మీకెవరు పెడతారు? అందుకని ఇచ్చినవి కాదనకు. తీసుకో'. 

'అందరికీ ఇచ్చేది భగవంతుడే. ఆయనే నాకిస్తాడు. నాకొద్దు' అని నేను ఖచ్చితంగా చెప్పేశాను.

నా పెళ్లి ఎలాగూ నా ఇష్టప్రకారం జరగలేదు. కనీసం, నా పిల్లల పెళ్లిళ్లన్నా నాకిష్టం వచ్చినట్లు చేద్దామని అనుకున్నాను. అదీ కుదరడం లేదు. ఇప్పుడు చూస్తుంటే, ముప్పై ఏళ్ల క్రితం కంటే చాదస్తాలు వందరెట్లు ఎక్కువయ్యాయి. అనవసరపు గోలా, తంతూ విపరీతంగా ఎక్కువైంది. చెబితే వినేవారు ఎవరూ లేరు. పాతకాలంలో మునులు అందర్నీ వదిలిపెట్టి కొండల్లోకి అడవుల్లోకి ఎందుకు పారిపోయారో నాకిప్పుడు బాగా అర్ధమౌతోంది.

మనకు మనస్ఫూర్తిగా నచ్చే మనుషులు మన కుటుంబాలలో, బంధువులలో, స్నేహితులలో, చివరకు 'నా' అనుకునే వారిలో కూడా ఎవరూ ఉండరన్న విషయం నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మన డొల్ల ఆచారాలు సాంప్రదాయాలు అంటే అసహ్యం కలుగుతోంది.

'(నోర్మూసుకుని) ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖమూ లేదు' అన్న సామెతలో ఎంత నిజముందో ! మనకు రెండూ ఉన్నాయిగా మరి !

ముప్పైఏళ్ల తర్వాత ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళూ, వాటికి అవుతున్న గోలా చూస్తుంటే నాకు చచ్చే నవ్వూ, అసహ్యమూ రెండూ ఒకేసారి  కలుగుతున్నాయి. మనుషులంటే నాకిప్పటికే ఉన్న అసహ్యం కొన్ని లక్షల రెట్లు పెరిగిపోతోంది.

చీర అంచు ఎలా ఉండాలి, దారంలో ఎన్ని పోగులుండాలి, , పెళ్లి కార్డు ఏ రంగులో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఏ డిజైన్ లో ఉండాలి, కళ్యాణమంటపం స్టేజి ఎత్తెంత ఉండాలి, లోతెంత ఉండాలి, ఎన్ని గంటలకి ఇంట్లో బయలుదేరాలి, బయలుదేరే కారుకు ఎన్ని పూలు అతికించాలి, ఏవి ఏ రంగులో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, బాయినేట్ మీద ఎంత దూరంలో వాటిని అతికించాలి, మధ్యలో అవి ఊడిపోతే మళ్ళీ ఎలా అతికించాలి, అలా అతికించడానికి ఏ కంపెనీ ఫెవికాల్ వాడాలి, క్యాటరింగ్ లో ఏయే పదార్ధాలు ఉండాలి, అవి ఎలా తయారు చెయ్యాలి, వాటిల్లో నూనె, నెయ్యీ ఎంతెంత వెయ్యాలి, ఎలా వడ్డించాలి, వడ్డించేవారు ఏయే బట్టలు వేసుకోవాలి, శ్వీట్లో ఎంత చక్కెర ఉండాలి, బాత్రూమ్ లో ఉండే సబ్బు ఏ కంపెనీది అయి ఉండాలి, బక్కెట్టు ఏ మూలన ఉండాలి, మగ్గు ఏ రంగులో ఉండాలి, అంట్లు తోమే పీచులో ఎన్ని వైర్లుండాలి?  -- ఈ విధంగా ప్రతి విషయాన్నీ శల్యపరీక్ష చేస్తూ, రోజులకు రోజులు ఈ చర్చలమీద కాలం గడిపేవాళ్లు ఎంతోమంది నాకు కనిపిస్తున్నారు. ఎంతసేపూ ఎదుటివారి మెప్పు కోసం, ఎదుటివారి దృష్టిలో గొప్పకోసం బ్రతుకుతున్న వీరి మానసికస్థితి చూస్తుంటే 'అయ్యో పాపం' అని నాకు విపరీతమైన జాలి కలుగుతోంది. నాకు తెలిసిన మానసిక రోగాల పేర్లన్నీ గుర్తొస్తున్నాయి.

ఇకపోతే ఇంకొక రకం మనుషులున్నారు.

'చీర కట్టుకునేటప్పుడు గోచీ పోసి కట్టాలా, వద్దా? వల్లెవాటు వెయ్యాలా వద్దా? నమస్కారం చేసేటప్పుడు వంగి చేస్తే చాలా, లేక సాష్టాంగం చెయ్యాలా, కుడిపక్కనించి నమస్కారం చెయ్యాలా ఎడమ పక్కనించి చెయ్యాలా, నమస్కారం పెట్టె సమయంలో కుడిచేత్తో కుడికాలికి పెట్టొచ్చా? లేక చేతులు క్రాస్ చేసి కుడిచేత్తో ఎడమకాలు, ఎడమచేత్తో కుడికాలూ తాకాలా? టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు కూడా ముహూర్తం చూచే వెళ్ళాలా? దుర్ముహూర్తం ఉందని బిగబట్టుకోవాలా? శాస్త్రప్రకారం వంటల్లో ఎన్ని శ్వీట్లు ఉండాలి, ఎన్ని హాట్లు ఉండాలి? మంగళసూత్రంలో ఎన్ని దారాలుండాలి? వాటికి పసుపు పైనించి కిందికి పుయ్యాలా? లేక కిందినుంచి పైకి పుయ్యాలా? మారేడు చెట్టు ఇంట్లో ఉంటె, అది గుమ్మానికి కుడివైపే ఉండాలా? ఎడమవైపు కూడా ఉండొచ్చా? గులాబీ చెట్టైతే ఇంటి ముందుండాలా, పెరట్లో ఉండాలా? పిల్లి మనకు కుడినుంచి ఎడమవైపు వెళ్ళాలి. రివర్స్ లో వెళితే, మనం వెనక్కు నడుస్తూ ఇంట్లోకి పారిపోవాలి. ఇక ఆరోజున ఏ పనీ చెయ్యకూడదు.' -  ఇలాంటి గోలతో సతమతమౌతూ చాగంటిని, గరికపాటిని పరమప్రమాణంగా తీసుకుంటూ 'చాగపాటి' గా తయారౌతున్న వాళ్ళు మరికొందరు. ఇలాంటి వారిని చూచినా నాకు జాలీ నవ్వూ తెగ పుడుతున్నాయి. వీళ్ళని చూస్తుంటే మరికొన్ని మానసిక రోగాల పేర్లు గుర్తొస్తున్నాయి.

ఫేస్ బుక్ లోనేమో అమ్మాయి చెడ్డీతో ఉన్న ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. పెళ్ళిలోనేమో తొంభై గజాల పట్టు చీరె నిండుగా కప్పుకుని ఫోటోలకు పూజిస్తూ ఉంటుంది. అబ్బాయి ఫేస్ బుక్ లోనేమో పబ్బుల్లో ఫ్రెండ్స్ తో సీసాలు పట్టుకుని ఫోటోలుంటాయి. పెళ్ళిలో పట్టుపంచె, లాల్ఛీ వేసుకుని ముఖాన పదిహేను బొట్లు పెట్టుకుని భక్తిగా ఫోజిస్తాడు. ఎంత డొల్ల బ్రతుకులో మనవి !

మన పెళ్ళిళ్ళల్లో జరిగే తంతులలో 95% శుద్ధ వేస్ట్ తంతులు. అదేమంటే, వేదప్రమాణం అంటారు. ఆ వేదాలలో ఏముందో ఎవడికీ తెలీదు. లోకల్ అలవాట్లన్నీ వేదప్రమాణం అనే ముసుగులో చలామణీ అవుతున్నాయి. వారివారి గోత్రఋషులు ఎందరున్నారో, వారి చరిత్రలేమిటో తెలియని మనుషులు సాంప్రదాయం అంటూ మాట్లాడుతుంటే తన్నాలన్నంత కోపం వస్తోంది నాకు.

మన దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పెళ్లి తంతు ఉంటుంది.  మళ్ళీ అన్నీ హిందూ వివాహాలే. అన్నీ వేదం ప్రకారం జరిగేవే.  మరి, ఇన్ని తేడాలెందుకు? ఒక రాష్ట్రానికీ ఒక రాష్ట్రానికే కాదు. ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికీ మరో ప్రాంతానికీ ఈ సాంప్రదాయాలలో ఎంతో భేదం ఉంటుంది. ఈ భేదాలు ఎలా పుట్టాయి? ఈ నానారకాల లోకల్ ఆచారాలకు వేదప్రామాణికత ఎక్కడుంది? ఇది ఎవరి సాంప్రదాయం? అసలు సాంప్రదాయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు ఎవడూ జవాబు చెప్పలేడు.

సౌత్ లో మంగళ సూత్రానికి విలువ. నార్త్ లో నల్లపూసలకు విలువ. నార్త్ లో మంగళసూత్రమే వేసుకోరు. అక్కడ పాపిట్లో సిందూరం పెట్టుకుంటారు. సౌత్ లో అలా పెట్టుకుంటే కేరెక్టర్ లేని మనిషిగా భావిస్తారు. ఒకే ఆచారం నార్త్ లో మహామంచిది, సౌత్ లో అదే ఆచారం మహా చెడ్డది. ఇదంతా ఏంటసలు? ఏంటీ నాటకాలు? ఇలాంటి ఉదాహరణలు తొంభై ఆరు ఇవ్వగలను నేను.

ఈ గోలంతా చూచి, విసుగు పుట్టిన దయానందసరస్వతి స్వామి, నూట యాభై ఏళ్ల క్రితమే, ఈ చెత్తనంతా తీసిపారేసి, హిందూ వివాహాన్ని వేదాల ప్రకారం స్టాండర్డైజ్ చేసి పెట్టాడు. అదే ఆర్యసమాజపు హిందూ వివాహం. అతి సింపుల్ గా ఉన్న ఈ తంతు మాత్రమే వేదాలలో ఉన్న అసలైన తంతు. ఇక మిగతా చెత్తనంతా మనం పోగేసుకుని, మన చుట్టూ అల్లుకుని, అది సాంప్రదాయం అంటూ, ఆచారం అంటూ చస్తున్నాం. అప్పులు చేసి పెళ్లిళ్లకు తగలేస్తూ నాశనమౌతున్నాం. మనం పాటిస్తున్నది వైదిక సాంప్రదాయం ఏమాత్రమూ కాదు. దానిపేరుతో మనిష్టప్రకారం చేస్తున్న చెత్తతంతు మాత్రమే. ఈ తంతంతా వద్దన్నాడని దయానంద సరస్వతీస్వామినే మనం తిరస్కరించాం. ఆయన చెప్పినవి 'ఆర్యసమాజం' వరకే పరిమితం, మనకు వర్తించదు అని తీర్పిచ్చేశాం. ఇదీ మన హిందూమతపు ఘనత !

మనకున్న 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని వందల పద్ధతులలో హిందూ వివాహాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అన్నీ హిందూ సాంప్రదాయాలే. అన్నీ వేదప్రమాణం అని చెప్పేవే. ఇదేంటి? వీటిల్లో ఏది కరెక్ట్ సాంప్రదాయం? ఏది తప్పు ఏది ఒప్పు? మనం చేసేవన్నీ కరెక్ట్ ఎలా అవుతాయి? అని ఎవడికీ సందేహం మాత్రం రాదు. ఇదే హిందూమతపు ఆచారాల డొల్లతనం.

ఈ అన్ని హిందూ పెళ్ళిళ్ళలోనూ కామన్ గా ఉండేది ఒక్కటే. అగ్ని చుట్టూ ఏడడుగులు వెయ్యడం ! అదొక్కటే కామన్ తంతు. అదే అసలైన వేదవివాహం. ఆ పైని తంతులన్నీ మన సరదాలకోసం, డబ్బులు ఎక్కువై, కొవ్వెక్కి,  మనం కల్పించుకున్నవే. ఇవన్నీ హిందూ సాంప్రదాయం కాదు. ఈ విషయాన్ని ముందు హిందువులు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.

అగ్ని చుట్టూ ఏడడుగులు వెయ్యడాన్ని సప్తపది అంటారు. ఇదొక్కటే హిందూ వివాహంలో most essential ritual. దయానంద సరస్వతి స్వామి దీనినే స్థిరపరచారు. కానీ మనం వినం కదా !

హిందువులలో ఉన్న పెద్ద రోగం ఏంటంటే - తాము చేస్తున్న ప్రతిదీ సాంప్రదాయం అనుకోవడమే. ప్రతిదీ వైదికం అనుకోవడమే. కానీ నేడు మనం చేస్తున్న అనేక తంతులకు వైదికప్రమాణం లేనేలేదు. ఈ సంగతి మనం చెప్పినా ఎవడూ వినడానికి సిద్ధంగా లేడు. చాగంటీ, గరికపాటీ మొదలైనవారు ఇవి చెప్పకుండా, పిలకలు పెట్టుకోండి, పంచెలు కట్టుకోండి, నమ్మకాలు పెంచుకోండి అంటూ ఇంకా ఇంకా జనాన్ని చీకటి యుగాల చాదస్తాలలోకి తీసుకుపోతున్నారు.

ఆధారరహితాలైన చాదస్తాలూ, గొప్పకోసం అప్పులు చేసి ఆర్భాటంగా పెళ్లిళ్లు చెయ్యడాలూ - ఈ రెండే నేడు ముఖ్యంగా బ్రాహ్మణులు సర్వనాశనం కావడానికి కారణాలు. హిందూ సమాజంలో ప్రధానంగా ఈ ధోరణి పోవాలి. హిందూవివాహం అనేది సాధ్యమైనంత సింపుల్ గా ఉండాలి.

నా వేదం ప్రకారం హిందూ వివాహం ఇలా జరగాలి.

1. అమ్మాయివైపు వారు, అబ్బాయి వైపు వారు ఒకచోట కూచోవాలి. అమ్మాయీ అబ్బాయీ అక్కడే ఉండాలి. అందరూ కలసి టీనో, కాఫీనో త్రాగాలి.

2. ఒక కాగితం మీద ' మేమిద్దరం ఒకరి మనసును మరొకరు నొప్పించకుండా కలసి బ్రతుకుతాం' అని వ్రాసి అబ్బాయీ అమ్మాయీ సంతకాలు చెయ్యాలి.

3. ఒక గిన్నెలో అగ్నిని వెలిగించి, దానిచుట్టూ అబ్బాయి అమ్మాయి ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి.

4. వారి వారి పెద్దలను తలచుకుని నమస్కరించాలి.

5. సింపుల్ గా భోజనాలు ముగించాలి.

పెళ్లి అయిపోయింది. అంతే !

దీనికి పట్టే సమయం అరగంట. అయ్యే ఖర్చు మహా అయితే పదివేలు. ఎవరికీ ఏవీ ఇచ్చేది లేదు, తీసుకునేదీ లేదు. కళ్యాణమంటపాలూ, బట్టలూ, నగలూ, షాపింగూ, నసా, గోలా ఏవీ ఉండవు. ఫినిష్ !

నాకే గనుక అధికారం ఉంటే, హిందూ వివాహాలను ఈ విధంగా మార్చేస్తాను. ప్రస్తుతం జరుగుతున్న చెత్త గోలా, అలుగుళ్ళూ, విసుగులూ, కోపాలూ, తాపాలూ, అలసిపోయి సిక్ అయిపోవడాలూ, అప్పులు చేసి ఆర్భాటంగా పెళ్లి చేయడాలూ, ఆ తర్వాత ఏడాదికే తిట్టుకుని కొట్టుకుని విడిపోవడాలూ, ఏడుస్తూ బ్రతకడాలూ, ఏవీ ఉండవు.

ఒక ఆడా, ఒక మగా కలసి బ్రతకడానికి ఇంత గోల అవసరమా? దానికి సాంప్రదాయం, చట్టుబండలు అని పేర్లు పెట్టడం అవసరమా? అసలెవడు ఇవన్నీ పెట్టింది? వేదాలలో అతి సింపుల్ గా చెప్పబడిన హిందూ వివాహాన్ని ఇంత కాంప్లెక్స్ గా మార్చి, ఇంత గందరగోళాన్ని సృష్టించినవాళ్లెవరు? వాడిని ముందు ఉరి తియ్యాలి. ఆ పని చెయ్యలేం. ఎందుకంటే, ఇలా మార్చుకుంది మనమే గాబట్టి. మనల్ని మనమే ఉరి తీసుకోవాలి. ప్రతి చాదస్తపు బ్రాహ్మణుడూ ముందు వాడిని వాడు ఉరేసుకోవాలి. ఇదే నా తీర్పు.

ఇంత అనవసరమైన చెత్తని మన చుట్టూ పోగేసుకుని ఇదేదో పెద్ద సాంప్రదాయంగా అనుకుంటూ అఘోరిస్తున్న మనకు - నూరేళ్ల క్రితం వివేకానంద స్వామి చెప్పిన  - 'మన మతం వంటింట్లో మాత్రమే ఉంది. వంటపాత్రలలో అంట్లగిన్నెలలో అఘోరిస్తోంది. 'నన్ను ముట్టుకోకు, నేను పవిత్రుడిని. నువ్వు అపవిత్రుడివి' అనేదే దాని మంత్రం. ఈ ధోరణి పోనంతవరకూ హిందూమతానికి నిష్కృతి లేదు' - అన్న ఋషివాక్కులు ఎలా గుర్తుంటాయి? ఎలా అర్ధమౌతాయి? ఎప్పుడు మనం నిజంగా ఎదుగుతాం? మనుషులుగా బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటాం? 

దయానంద సరస్వతి స్వామి, వివేకానందస్వామి, కందుకూరి వీరేశలింగం వంటి వేదపండితులు చెప్పినా మన చెత్త ధోరణులు మనం మార్చుకోము  కదా ! నేటి టీవీ ఉపన్యాసకులు నేర్పించే డొల్ల ఆచారాలే మన మతం అయిపాయె ! ఇదే విధంగా బ్రతుకుతూ ఉంటే, మన హిందూ సమాజానికి, ముఖ్యంగా బ్రాహ్మణజాతికి నిష్కృతి ఎప్పటికి వస్తుంది మరి?