'None can reach Heaven, who had not passed through hell' - Sri Aurobindo in 'Savitri'

9, అక్టోబర్ 2019, బుధవారం

సాంప్రదాయమూ - చట్టుబండలూ - 2

ఇంటర్ నెట్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందులో ఒకటి, ప్రపంచం ఏ మూలన ఉన్నవాళ్ళైనా సరే, మనలాటి భావాలే ఉన్నవాళ్లు మనకు తేలికగా పరిచయం అవుతారు. మంచి స్నేహితులూ అవుతారు. ఇంతకు మునుపు ఇంత చాయిస్ మనకు ఉండేది కాదు. బావిలో కప్పలాగా మన పరిధిలోనే, అంటే, మన ఊళ్ళోనో, మన కాలేజీలోనో, మనం ఉద్యోగం చేసిన ఆఫీసులోనో, స్నేహితులను వెదుక్కోవలసి వచ్ఛేది. ఇప్పుడలా కాదు. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. భూమి నలుమూలనుంచీ మనకు నచ్చిన స్నేహితులను వెదుక్కోవడం ఇప్పుడు చాలా తేలిక.

నా భావాలు నచ్చేవాళ్ళు నా పాఠకులలో చాలామంది ఉన్నారు. వాళ్లలో చాలామంది నాకు మంచి స్నేహితులయ్యారు. అలాంటి వారిలో ఒకమ్మాయి, సాంప్రదాయాలు చట్టబండలు టాపిక్ మీద ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది.

'నా మాంగల్యం ఎప్పుడూ చల్లగా ఉంటుంది' 

'ఎలా?' అడిగాను.

'ఎలా అంటే, పెళ్ళవగానే దాన్ని తీసి ఫ్రిజ్ లో పెట్టేసాను కాబట్టి' - అందామె.

'అదేంటి? మీరు తాళి మెడలో ఉంచుకోరా?' అడిగాను భయం భయంగా.

'ఎందుకు? అదొక బోర్' అందామె.

'మరి మీ ఆయన ఏమీ అనడా?' అడిగాను.

'ఆయన మనంత నేరో మైండెడ్ కాదు. అర్ధం చేసుకుంటాడు' అందామె కూల్ గా.

సంతోషం వేసింది - ఆచారాలతో సంబంధం లేని నిజమైన బాంధవ్యాన్ని అర్ధం చేసుకుని ఆచరిస్తున్నందుకు.

ఇదే మాటను మొన్న ఒక బంధువుతో అంటే, ఆమె సూర్యకాంతం టైపులో దీర్ఘాలు తీస్తూ ' అయ్యో అయ్యో అదేం పోయే కాలం? పెళ్లైన పిల్ల, తాళి తీసి ఫ్రిజ్ లో పెట్టిందా అనాచారం ! కలికాలం !' అంటూ బుగ్గలు నొక్కుకుంది.

'నాచారమూ లేదు బొలారమూ లేదుగాని ఎక్కువ నొక్కుకోకండి. హోలు పడుతుంది. ఒక సంగతి చెప్పండి. మీ అమ్మాయి ఎక్కడుంది?' అడిగాను, ఎప్పుడో ఆమె చెప్పిన విషయం గుర్తుచేసుకుంటూ. 

'యూ ఎస్ లో ఉంది' అందామె గర్వంగా.

'పెళ్లయింది కదా?' అడిగాను.

'అయింది. అయ్యాకే అల్లుడితో కలసి అక్కడికి వెళ్ళింది?' అందామె.

'సముద్రాలు దాటి మ్లేచ్చదేశాలకు వెళ్లడం వల్ల కులభ్రష్టత్వమూ ధర్మభ్రష్టత్వమూ వస్తుందని మన ధర్మశాస్త్రాలలో వ్రాసుంది. మీకు తెలుసా?' అడిగాను.

ఆమె మాట్లాడలేదు.

'దానికి ప్రాయశ్చిత్తంగా, తిరిగి మన దేశానికి వచ్చినపుడు, నాలుకను నిప్పుతో కాల్చాలనీ, నలభై రోజులపాటు, ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ, గాయత్రిని జపించాలనీ, అప్పుడే ఆ దోషం పోతుందనీ కూడా వ్రాసుంది. పోనీ ఇదైనా తెలుసా?' అడిగాను.

ఆమె మళ్ళీ మాట్లాడలేదు.

'ఒక్కసారి మీ అమ్మాయికి వీడియో కాల్ చెయ్యండి. నేను చూస్తాను' అడిగాను.

వీడియో కాల్ కలిసింది.

వాళ్ళమ్మాయి ఎక్కడో బయట షాపింగ్ లో ఉంది. మెడలో తాళి లేకపోగా, మోస్ట్ మోడర్న్ డ్రెస్సులో ఉంది. మొహాన బొట్టు లేదు. పొడుగాటి జుట్టూ లేదు. కత్తిరించుకుంది. కాసేపు అదీఇదీ మాట్లాడాక, 'ఏమ్మా? బొట్టు లేదు. తాళీ లేదు? జుట్టు కత్తిరించావ్?' అన్నాను.

'అవన్నీ ఇక్కడ కుదరవు అంకుల్. తాళి తీసి లాకర్లో పెట్టాను. బొట్టు పర్సులో ఉంది. ఇంటికెళ్ళాక పెట్టుకుంటా. వర్కింగ్ వుమెన్ కి జడ కష్టం అంకుల్. ఇదే హాయి' అంది నవ్వుతూ.

' అంతేలే. అక్కడకు తగ్గట్టు అక్కడ ఉండాలి మరి. ఓకే మా. బై' అంటూ ఫోన్ పెట్టేశా.

ఇటు తిరిగి 'ఏంటమ్మా ఇది?' అన్నా.

ఆమె ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు.

'ఇండియాలో ఉన్న మా ఫ్రెండ్ తాళి తీసి ఫ్రిజ్ లో పెడితేనేమో, తప్పా? అనాచారమా? మరి అమెరికాలో ఉన్న మీ అమ్మాయి తాళి తీసి లాకర్లో పెడితేనేమో అది తప్పు కాదా? దాన్ని సాంప్రదాయం అంటారా?' అడిగాను.

'అంటే, అక్కడ నల్లవాళ్ళకు మన ఇండియన్స్ కి ఉన్న బంగారం పిచ్చి గురించి బాగా తెలుసు.  ఇక్కడలాగా, అక్కడ బంగారం వేసుకుని రోడ్డుమీద తిరిగితే ప్రాణాలకే ప్రమాదం' అందామె.

'ఓహో. ప్రాణం మీదకు వస్తే ఏదీ తప్పు కాదన్నమాట! మరి మన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవచ్చా? అలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుమీద తిరగొచ్చా?' అన్నాను పాతసామెతను ఒకదాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.

'అదీ. అదీ....' అంటూ నీళ్లు నమిలింది ఆమె.

'నార్త్ ఇండియాలో హిందూస్త్రీలు తాళి వేసుకోరు. మరి వాళ్ళు హిందువులు కారా? అని నువ్వు అడగాలమ్మా నన్ను' అన్నాను.

ఆ హింట్ కూడా ఆమెకు అర్ధం కాలేదు.

'అవన్నీ నాకు తెలీవండి, మా పెద్దవాళ్ళు చెప్పినంతవరకే నేను పాటిస్తాను. లోకంలో ఉన్న అన్ని సాంప్రదాయాలూ మనం పాటించలేం కదా?' అంటూ లాజిక్ తెచ్చింది ఆమె.

'అవున్లే. మనకు నచ్చినవి వీలైనవి పాటిద్దాం. నచ్చనివి, వీలుకానివి, చక్కగా వదిలేద్దాం. ఎదుటివాళ్ళకు మాత్రం నీతులు చెబుదాం. వాళ్లకు నచ్చనివీ వీలుకానివీ వాళ్ళు కూడా మనలాగే వదిలేస్తారు కదా అని మాత్రం ఆలోచించం. ఇదేకదా మన సాంప్రదాయం?' అడిగాను.

జవాబు లేదు.

ఇక ఎక్కువగా ఆమెతో మాట్లాడాలనిపించలేదు. వదిలేశాను.

ఆ సంభాషణ అంతటితో ముగిసింది.

మన సాంప్రదాయాలూ, ఆచారాలూ అన్నీ ఇంతే. ఏదైనా మనకు వీలైనంతవరకే పాటిస్తాం. కానీ ఇదే రూలు ఎదుటివారికి కూడా వర్తిస్తుందన్న విషయం మర్చిపోతాం. వారికి మాత్రం ఎక్కడలేని నీతులూ చెప్పబోతాం. హిందూమతంలో ఉన్న ఇంకో డొల్ల కోణం ఇది.

'సాంప్రదాయాలు ఎలా పుట్టాయి? వాటికున్న చారిత్రక నేపధ్యం ఏమిటి? ప్రాంతీయంగా వీటిలో ఇన్ని తేడాలు ఎందుకున్నాయి? మళ్ళీ అన్నీ హిందూ సాంప్రదాయంగానే ఎందుకు ఎలా ఆమోదింపబడుతున్నాయి? అసలు సాంప్రదాయం ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి?' ఇవేవీ తెలీకుండా టీవీలు చూచి, వినేవాళ్ళు వెర్రి వెంగళప్పలనుకుని, వారికి చాగపాటి కబుర్లు చెప్పబోవడం వల్లనే హిందూమతం భ్రష్టు పడుతోంది.

అందుకే 'ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్' అంటూ ఘంటసాల తాగి ఎప్పుడో ఒక పాట పాడాడు.

కాదంటారా?