The secret of spiritual life lies in living it every minute of your life

25, మార్చి 2019, సోమవారం

గుడ్డి గురువులు - 1

లోకంలో గురువులకు తక్కువ లేదు. ఎక్కడ చూచినా వాళ్ళే. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చాలు. ప్రతివాడూ గురువే. లేదా నుదుట రకరకాల బొట్లు, చెవులకు కుండలాలు, మెడలో రుద్రాక్షలు వేసి, వీలైతే రంగు గుడ్డలు ధరిస్తే చాలు, ఎదుటివాడు దిమ్మతిరిగి పోవాల్సిందే. దానికి తోడు, కాలసర్ప యోగం, కుజదోషం, రాహుకేతు దోషం, ఏలినాటి శని లాంటి నాలుగు పడికట్టు పదాలు వల్లించడం నేర్చుకుంటే ఇక తిరుగే లేదు. ఎదుటి మనిషి బలహీనతలనూ దురాశలనూ కనిపెట్టి వాటిమీద చక్కగా ఆడుకోవచ్చు.

ఈ మధ్యన ఒక ఫంక్షన్ లో ఇలాంటి గుడ్డి గురువులు కొంతమంది నాకు పరిచయం చెయ్యబడ్డారు. ఆ సోకాల్డ్ గురువులనూ, వాళ్ళను మహాభక్తితో పరిచయం చేసినవాళ్ళనూ ఇద్దరినీ చూస్తె నాకు భలే నవ్వొచ్చింది, జాలేసింది. "గురువు శిష్యుడనుట గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినుర వేమా" అనే పద్యం గుర్తొచ్చింది.

ఈ ముగ్గురు మూర్ఖగురువుల గురించీ వరుసగా మాట్లాడుకుందాం.

'ఈయన మా గురువుగారు' అంటూ ఒకాయన నాకు పరిచయం చెయ్యబడ్డాడు.

ఆయనవైపు క్యాజువల్ గా ఒకచూపు చూచాను.

'నేనింకా నమస్కారం పెట్టడం లేదేమిటా' అని నావైపు ఆశగా చూస్తున్నాడాయన. నేనదేమీ పట్టించుకోకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఇక తప్పదన్నట్లు ఆయనే చేతులు జోడించి 'నమస్కారం' అన్నాడు లేని నవ్వు ముఖాన పులుముకుంటూ. నేనూ చేతులు జోడించి 'నమస్తే' అన్నాను.

'ఈయన చాలా గొప్ప గురువుగారు. ఈయనకు వందలాదిమంది శిష్యులున్నారు' అన్నాడు పరిచయం చేసినాయన.

ట్రంప్ కూడా తన శిష్యుడే అని పాలుగారు చెప్పుకుంటూ ఉండటం గుర్తొచ్చి నాకు మళ్ళీ నవ్వొచ్చింది. అయినా బయటపడకుండా 'అవునా' అన్నాను.

ఇదంతా గురువుగారు అసహనంగా వింటున్నారు. ఈ పొగడ్తల డోసు ఆయనకు చాల్లేదులా ఉంది. ఇలా కాదు మనమే రంగంలోకి దిగాలని అనుకుని - ' గత పదేళ్లుగా ఫలానా టీవీ చానల్ లో నేను ఉదయమే ఒక గంట కనిపించి ఒక ప్రోగ్రాం చేశాను' అన్నాడు.

'ఏంటి డాన్స్ ప్రోగ్రామా?' అందామని నోటిదాకా వచ్చినా తమాయించుకుని - 'నేను టీవీ చూడను. అందులోనూ భక్తి చానల్స్ అంటే నాకు పరమ చిరాకు' అన్నాను.

'అవునా' అంటూ బిత్తరపోయిన ఆయన తేరుకుని, 'ఎవరు బడితే వాళ్ళు జ్యోతిష్కులమంటూ, న్యూమరాజిస్టులమంటూ వస్తూ ఉంటె చిరాకేసి ప్రోగ్రాం చెయ్యడం మానేశాను' అన్నాడు.

'పదేళ్ళ తర్వాత ఇక సబ్జెక్ట్ ఏముంటుంది టీవీలో చెప్పడానికి? అన్నేళ్ళు విన్నారంటే ప్రేక్షకుల ఓపిక గొప్పది' అనుకున్నా మనసులో.

'ఏం నువ్వు రాయడం లేదా పదేళ్ళనుంచీ ఒకటే సోది నీ బ్లాగులో? అతనూ అంతే' అని ఎవరో చెవులో అన్నట్లు వినపడి అటువైపు చూశా. ఆడవాళ్ళ మధ్యలో ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూచుని నన్నే కోపంగా చూస్తున్న కర్ణపిశాచి కనిపించింది.

'ఓహో ! నువ్వు ఫంక్షన్స్ కి కూడా వస్తున్నావా?' అనుకున్నా మనసులో తననే చూస్తూ.

'నిన్ను టార్గెట్ చెయ్యడానికి ఎక్కడికైనా వస్తా' అంది అది నవ్వుతూ.

ఎక్కువసేపు ఆడాళ్ళవైపు చూస్తుంటే మళ్ళీ వీళ్ళు అపార్ధం చేసుకునే అవకాశం ఉందని గుర్తొచ్చి తలతిప్పి వీళ్ళవైపు చూస్తూ - ' ఏ రకంగా మీరు గురుత్వం వహిస్తూ ఉంటారు?' అనడిగా సాధ్యమైనంత సౌమ్యంగా.

'అయ్యప్ప దీక్షలు ఇస్తూ ఉంటాను' అన్నాడాయన.

అకస్మాత్తుగా అక్కణ్ణించి మాయమై పోయె శక్తి ఏదైనా ఉంటె బాగుండునని అనిపించింది. ఇంతలోనే కిసుక్కుమని నవ్వు వినిపించి, ఒకసారి తలతిప్పి కర్ణపిశాచి వైపు చూశా. అక్కడ కుర్చీ ఖాళీగా కనిపించింది.

'అక్కడ కాదు. ఇక్కడ' అంటూ ఇంకో వైపు నుంచి దాని గొంతు వినిపించి అటువైపు తల తిప్పా. డాబా పక్కనే ఉన్న మామిడిచెట్టు కొమ్మ మీద కూచుని కాలు ఊపుతూ నవ్వుతోంది అది.

'నీకు బాగా దొరికాడులే బ్లాక్ క్యాట్ గురువు' అంది మళ్ళీ నవ్వుతూ.

'ఏంటో మాటమాటకీ అటూఇటూ చూస్తున్నాడు' అనుకుంటారేమో మన ఇమేజి దెబ్బ తింటుందేమోనని డౌటొచ్చి మళ్ళీ తలతిప్పుకుని వీళ్ళవైపు చూస్తూ ' ఐ సీ' అన్నా భావరహితంగా చూస్తూ.

నా కోల్డ్ రెస్పాన్స్ చూచి వాళ్లకు చిరాకేసినట్లుంది. ఇదేదో కుదిరే బేరంలా లేదని ఆయనకనిపించి 'సరేనండి వస్తా' అంటూ ఆ గురువు ఇంకోవైపుకు వెళ్ళిపోయాడు. పరిచయం చేసినాయన్ను ఎవరో పిలిస్తే ఆయన ఇంకో వైపు వెళ్ళిపోయాడు.

మామిడి చెట్టువైపు చూశా. కొమ్మ ఖాళీగా కనిపించింది.

'దీని దుంపతెగ. ఇష్టం వచ్చినట్లు ఏడిపిస్తోంది' అనుకుంటూ ఒక ఖాళీ కుర్చీలో కూలబడ్డా.

చాలామంది సోకాల్డ్ గురువులు ఇంతే. ఏవో నాలుగు జ్యోతిష్యం ముక్కలు నేర్చుకుని అయ్యప్ప దీక్షలిస్తూ ఉంటె చాలు, అజ్ఞానుల దగ్గర పెద్ద గురువులుగా చలామణీ అవ్వచ్చు. భుక్తికి లోటుండదు. మర్యాదా దక్కుతూ ఉంటుంది. కానీ అసలైన దారి మాత్రం వాళ్లకు దొరకదు. లోకాన్ని మోసం చేస్తూ వాళ్ళూ మోసపోతూ ఉంటారు. కానీ తాము పెద్ద జ్ఞానులమని భావించుకుంటూ ఉంటారు.

అజ్ఞానంతో నిండిన ఈ లోకపు పరిధిని దాటించి సత్యసాక్షాత్కారం అయ్యే వైపుగా దారి చూపి, అందులో చెయ్యిపట్టి నడిపించేవాడే 'గురువు' అన్న పదానికి అర్హుడు. అంతేగాని లోకులు వాడే అర్ధంలో, ప్రతివాడినీ 'గురువు, గురువు' అంటూ పిలవకూడదు. దురదృష్టవశాత్తూ, మనకు ఓనమాలు నేర్పినవాడినుంచీ, ముహూర్తాలు పెట్టే పురోహితుడి వరకూ అందరూ మనకు 'గురువులే'.

మనలో తెలివి లేకపోతే ప్రతి గన్నయ్య గాడూ గురువుగానే కనిపిస్తాడు మరి !

(ఇంకా ఉంది)