“భగవంతుని పట్ల దిగులే జిజ్ఞాస"- జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

6, జనవరి 2019, ఆదివారం

మందబుద్ధి రాకుమారి - మందుబుడ్డి గురువుగారు

మన లోతైన ఆధ్యాత్మిక పోస్టులు చదివి మనమంటే ఏదో ఎక్కువగా కొంతమంది ఊహించుకునే ప్రమాదం ఉంది గనుక, ఆ ఇమేజిని వెంటనే డ్యామేజి చెయ్యాలంటే ఇలాంటి పోస్టు ఒకటి వ్రాయక తప్పదు. చదవండి మరి !
-------------------------------------------

అనగనగా ఒక రాకుమారి
ఆమెకు కాస్త మందబుద్ధి
అనగనగా ఒక గురువుగారు
ఆయన చేతిలో మందుబుడ్డి

రాకుమారికి మందబుద్దేంటో
గురువుగారికి మందుబుడ్డేంటో
వాళ్ళనలా సృష్టించిన
ఆ పిచ్చి దేవుడికే తెలియాలి

రాకుమారికి మందబుద్ధి
చిన్నప్పటినుంచీ ఉంది
గురువుగారికి మందుబుడ్డి
ఈ మధ్యనే అలవాటైంది

రాకుమారికి మందం ఎక్కువైతే
మత్తుగా పడుకుంటుంది
గురువుగారికి మందెక్కువైతే
చెత్తగా పోస్టులు రాస్తుంటాడు

పాటలు వింటూ పరవశించడం
రాకుమారికిష్టం
పాటలు పాడుతూ జనాన్ని హింసించడం
గురువుగారికిష్టం

రాకుమారిగా పుట్టాలంటే
అదృష్టం ఉండాలి
గురువుగారిగా అవ్వాలంటే
అర్హతలుండాలి

ఆమెకేమో అదృష్టం దండిగా ఉంది
ఈయనకేమో అర్హతలంటూ అస్సల్లేవు
కానీ రాకుమారి గురువుగారి శిష్యురాలైంది
గురువుగారికేమో మందు మరీ ఎక్కువైంది

ప్రతి అమావాస్యకీ
రాకుమారి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది
ప్రతి పౌర్ణమికీ
గురువుగారు పిచ్చి పిచ్చిగా ఆలపిస్తాడు

రాకుమారికి మందబుద్దీ తగ్గదు
గురువుగారికి మందుబుడ్డీ వదలదు
పిచ్చిగురువుని నమ్మడం రాకుమారి మానదు
పిచ్చిపాటలు పాడటం గురువుగారు ఆపడు

ఇదంతా చూచి చిన్నరాకుమారికి
వెర్రిగా చిర్రెత్తుకొచ్చింది
ఆమెకు చిన్నప్పటినుంచీ ఉన్న
వేపకాయంత వెర్రి
గుమ్మడికాయంత అయికూచుంది
చిన్నరాకుమారి కాస్తా ఛీకుమారిగా మారింది

తనను తానే తిట్టుకునే పిచ్చిగురువు
ఇతరులు తిడితే నవ్వుకోడా?
తనను తానే తక్కువ చేసుకునే గురువు
ఇతరులు విమర్శిస్తే తగ్గుతాడా?

గాలిలోకి రాళ్ళేస్తే గాలికేం నష్టం?
ఆకాశాన్ని కాలితో తంతే దానికేం కష్టం?
కానీ అలాంటివారిని కూడా
ఆదరించడమే వాటికిష్టం !

నిజానికి రాకుమారీ లేదు
గురువుగారూ లేడు
ఇద్దరికీ లోపలుంది ఆకాశమే
ఇద్దరివీ బయటచూస్తే గాలిచేష్టలే

ప్రకృతి నిజంగా పిచ్చిదే
కాకుంటే ఈ పిచ్చి జనాన్ని
ఇంత పిచ్చిగా ప్రేమించి
ఇంతలా ఆదరిస్తుందా?

బహుశా దానిక్కూడా
మందు అలవాటుందేమో?
లేదా అదికూడా
పెద్ద మందబుద్దేమో? 

సర్లే ఏదో ఒకటి !
అసలేంటీ పిచ్చిగోల?
అర్ధంకాని చచ్చు పోస్టు?
ఓహో అమావాస్య ఎఫెక్ట్ కదా?

ఇమేజి పెంచుకునేదీ తనే
డ్యామేజి చేసుకునేదీ తనే
హోమేజి ఇచ్చుకునేదీ తనే
ఏంటో ఈ పిచ్చిగురువు?

డామిట్ !
గురువుగారికి పూర్తిగా పిచ్చెక్కింది !
లేదా మందెక్కువైందా?
పాపం రాకుమారీ, ఛీకుమారీ
ఎలా ఉన్నారో మరి?