Pages - Menu

Pages

31, అక్టోబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర - 2 (Spiritual City)










 హోటల్ కు చేరుకొని ఫ్రెష్ అయ్యి, కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాను.

నాందేడ్ గురించి మా కొలీగ్స్ ద్వారా నేను చాలా విన్నాను. అదొక నరకమనీ, అక్కడ తిండి, భాష, మనుషుల ప్రవర్తనా అన్నీ వేరనీ, మహారాష్ట్ర కల్చర్ అనీ, అక్కడ మనం ఉండలేమనీ నాకు చాలామంది చెప్పారు. కానీ నాకలా ఏమీ అనిపించలేదు. అక్కడి వైబ్రేషన్స్ ను బట్టి అదొక ఆధ్యాత్మిక నగరం అని నాకనిపించింది.

మా కొలీగ్ ఒకాయనతో ఫోన్లో ఈ మాట అంటే -' టూరిస్ట్ గా అక్కడకు వెళితే బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఉండి ఉద్యోగం చెయ్యవలసి వస్తే అప్పుడు నరకం కనిపిస్తుంది' అన్నాడు.

ఏ ఊరైనా సరే, అక్కడున్న గొర్రెల్లాంటి మనుషుల వల్ల దానికి విలువ రాదు. ఎక్కడైనా మనుషులు ఒకే విధంగా పశువుల్లా బ్రతుకుతూ ఉంటారు. వాళ్లకు కావలసింది డబ్బు, తిండి, సెక్స్, సరదాలు, ఆస్తులు అంతే. ప్రపంచం మొత్తం ఈ ఊబిలోనే ఉంది. వీటివల్ల ఒక ఊరికిగాని మనిషికిగాని విలువ ఎప్పటికీ రాదు. అక్కడున్న కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాల వల్ల, అక్కడ బ్రతికిన ప్రత్యెక వ్యక్తులవల్ల ఆ ఊరికి విలువ వస్తుంది. అతని ఉన్నతమైన జీవనవిధానం వల్ల మనిషికి విలువ వస్తుంది. నేను ఏ ఊరినైనా ఏ మనిషినైనా ఇదే దృష్టితో చూస్తాను.

నేను మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ తిండినే తినడానికి చూస్తాను, అక్కడి కల్చర్ ను అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాను గాని మన ఆంధ్రా హోటల్ ఎక్కడుందా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళను. అందుకని, ఇతర రాష్ట్రాల గురించి మామూలుగా మన తెలుగుజనం మాట్లాడుకుండే సోదిమాటలు నాకు రుచించవు. 

ఇంతలో టిఫిన్ వచ్చింది. తినేసి స్టేషన్ కు బయలుదేరాను. అక్కడకు చేరాక, పొద్దున్న నేనేదైతే స్టేషన్ లో రెండుగంటల పైగా రైల్లో వేచి ఉన్నానో, అదే మాల్ టేక్డి స్టేషన్ లో నాకు నైట్ డ్యూటీ అని తెలిసింది.  రోజంతా చేసేదేమీ లేదు. కాసేపు ఆఫీస్ లోనే కూర్చుని అక్కడ మనుషుల పనితీరును గమనిస్తూ ఉన్నాను.

ఇంతలో మా ఇన్స్పెక్టర్ ఒకాయన వచ్చి - 'సార్. ఇక్కడ గురుద్వారాలు చాలా ఫేమస్. మిమ్మల్ని అక్కడకు తీసుకు వెడతాను. వెహికిల్ రెడీగా ఉంది. మీరు సిద్ధమైతే మనం వెళదాం' అన్నాడు.

'ఏ గురుద్వారాకు వెళదాం?' అన్నాను.

'ఇక్కడ దాదాపు 14 గురుద్వారాలున్నాయి. కానీ వాటిల్లో ముఖ్యమైనది 'సచ్ ఖండ్ గురుద్వారా'. దానిపేరు మీదనే అమృత్ సర్ నుంచి ఇక్కడకు 'సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్' ఉన్నది.' అన్నాడు.

'ఓహో అదా సంగతి' అనుకున్నాను.

'సచ్ ఖండ్' అంటే సత్యస్వరూపమని సత్యలోకమని అర్ధం. నిత్యసత్య స్వరూపమైన బ్రహ్మమునే గురునానక్ 'సచ్ ఖండ్' అన్నాడు. కనుక ఆ గురుద్వారాకు అదే పేరు వచ్చింది.

నాందేడ్ చాలా ఓల్డ్ టౌన్. ఫక్తు నార్త్ ఇండియా కల్చర్ అక్కడ కనిపిస్తున్నది. నవీనకాలపు పోకడలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మంచి రిచ్ టౌన్ అని కొద్ది సేపట్లోనే అర్ధమైంది. కొద్దిసేపట్లో సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నాం. అది చాలా పెద్దది. ఎంతో విశాలమైన ప్రాంగణంలో కట్టబడింది. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ ఇక్కడే చనిపోయాడని అంటారు.

మమ్మల్ని సరాసరి గర్భాలయంలోకి తీసుకెళ్ళిన మా ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న ప్రధాన పూజారికి మమ్మల్ని పరిచయం చేశాడు. ఆయన ఆదేశం మేరకు అక్కడున్న ఒక సిఖ్ ముందుకొచ్చి మా భుజాల చుట్టూ శాలువలు కప్పి సత్కరించాడు. చాలా సంతోషం కలిగింది. కొద్దిసేపు అక్కడ ఉండి, కొన్ని ఫోటోలు తీసుకుని, బయట హోటల్లో భోజనం చేసి మళ్ళీ హోటల్ కు చేరుకున్నాం. రాత్రికి డ్యూటీ ఉంది కనుక మధ్యాన్నం కొద్దిసేపు నిద్రపోయాను.

(ఇంకా ఉంది)

నాందేడ్ యాత్ర - 1 (అనుక్షణం జరిగేదే అనుష్ఠానం)

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ కు రాత్రి పదకొండున్నరకి చేరింది. రైల్వేలో ఉన్న నాకే విసుగు పుట్టింది. సమయానికి సరిగ్గా నడపడం చేతకానప్పుడు ఎందుకు కొత్తకొత్త రైళ్ళు ప్రవేశపెడతారో అర్ధం కాదు. మంత్రిత్వశాఖ నుంచి ఒత్తిడి ఉంటుంది. అందుకని ప్రవేశపెడతారు. కానీ సమయానికి నడపడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. కనుక నడపలేరు. అలాంటప్పుడు కొత్త రైళ్ళు ప్రవేశ పెట్ట కూడదు. కానీ ఇదంతా ఎవడికి పట్టింది?

జపాన్ లో అయితే, నూరు రైళ్ళు కరెక్ట్ గా నడపడానికి వీలున్న ఒక లైన్ లో డెబ్భై రైళ్ళు నడుస్తున్నపుడే కొత్త లైన్ వేసుకుంటారు. పాత లైన్లో ఇంకో రైలును అనుమతించరు. ఈ విషయం అమరావతిని సందర్శించిన జపాన్ రైల్వే బృందం చెప్పింది. కానీ మన భారతీయ రైల్వేలలో అదే లైన్ మీద నూట డెబ్భై రైళ్ళను కుక్కి కుక్కి నడుపుతున్నాం. ఇండియాలో రైల్వే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా రాజకీయ నాయకుల నిర్వాహకమే. మన రైల్వేలో ప్రస్తుతం కావలసింది కొత్త లైన్లు మాత్రమే. కానీ అవి వెయ్యకుండా కొత్త రైళ్ళు మాత్రం వేస్తున్నారు. అందుకే రైళ్లన్నీ లేట్ గా నడుస్తూ ఉంటాయి. ఇదీ లోగుట్టు !!

నాందేడ్ పాసింజర్ ఉందో వదిలిందో తెలీదు. మొత్తం మీద ఒకటో నంబరు ప్లాట్ ఫాం మీద దిగాక అది ఏడో నంబర్ నుంచి కదలడానికి సిద్ధంగా ఉందని ఎనౌన్స్ మెంట్ వినిపించింది. పరుగు అందుకుని బ్రిడ్జి ఎక్కి చూస్తే, 7A ఉంది 7B ఉందిగాని ప్లాట్ ఫాం 7 మాత్రం కనిపించలేదు. భలే చిరాకనిపించింది. రైల్వేలో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న నాకే ఇలా ఉంటే ఇక ఒక మామూలు ప్రయాణీకుడి పరిస్థితి ఏమిటా అని ఆ హడావుడిలో కూడా ఒక ఆలోచన వచ్చింది. రైల్వేని జనం తిడుతున్నారంటే తిట్టరూ మరి !

సరే ఏదైతే అది అవుతుందిలే అని 7A లోకి దిగాను. అక్కడే కదలడానికి సిద్ధంగా ఉంది ఈ పాసింజర్. దానికి ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ ఉంటుంది. కానీ అదెక్కడో ముందు ఉంది. నేనేమో గార్డు పెట్టె దగ్గర ఉన్నాను. ఈలోపల బండి కదిలింది. ఇక పరుగు లంకించుకున్నాను. యాక్సిడెంట్ లో దెబ్బతిన్న కుడిమోకాలు కలుక్కుమంది. అయినాసరే, దాన్ని లెక్కచెయ్యకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి కోచ్ లో ఎక్కాను. నాందేడ్ లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు అందులో కనిపించారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి నా బెర్తులో సెటిలై నిద్రకు ఉపక్రమించాను.

ఉదయం 6 కు నాందేడ్ చేరవలసిన బండి 9.30 కి చేరింది. నేను లేచి చూస్తే మాల్ టేక్ది అనే స్టేషన్లో ఆగి ఉంది. అక్కడే దాదాపు రెండు గంటలు ఆగిపోయింది. పక్క స్టేషనే నాందేడ్. చాలామంది జనం దిగి లగేజి తీసుకుని పట్టాల మీద నడుస్తూ రైల్వేని తిట్టుకుంటూ పోతున్నారు. లేచి చూస్తె మా పెట్టె మొత్తం ఖాళీ అయి ఉంది. అందరూ దిగిపోయారు. నేనే మాత్రం చలించకుండా, చేరినప్పుడే చేరుతుందిలే అనుకుంటూ ఆ పెట్టెలో ఒక్కడినే ప్రశాంతంగా కూర్చుని రెండు గంటలు మౌనంగా కాలక్షేపం చేశాను. చివరకు ఉదయం 9.30 కు నాందేడ్ చేరుకున్నాను.

స్టేషన్లోనే ఉన్న మా ఆఫీసుకు వెళ్లి వాకబు చెయ్యగా అక్కడ శర్మగారని మా కొలీగ్ ఆఫీసర్ కనిపించాడు. హోటలుకు వెళ్ళడానికి వెహికిల్ రెడీగా ఉందని అన్నాడు. లేటైనందుకు నొచ్చుకుంటూ, 'టీ కోసం మనిషిని పంపాను. వస్తుంది. కొంచంసేపు కూర్చోండి' అన్నాడు. మళ్ళీ ఆయనకేం అనుమానం వచ్చిందో, 'హోటల్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి, అనుష్ఠానం అయ్యాక టీ త్రాగుతారా? లేక పరవాలేదా?' అని అనుమానంగా అడిగాడు.

నా ముఖం చూస్తే పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసేవాడిలాగా కనిపిస్తున్నానో ఏమో అనుకుంటూ - 'అబ్బే అలాంటిదేం లేదు. నేనింకా ముఖమే కడగలేదు. కానీ మీరిచ్చే టీ త్రాగే హోటల్ కి వెడతాను' అన్నాను సోఫాలో సెటిలౌతూ.

'మరి అనుష్ఠానమో?' అన్నాడు. పాపం చాలామంది సర్వీసులో ఉంటూ కూడా ఆ మడీ, పూజలూ చేసుకుంటూ ఏదో విధంగా మానేజ్ చేస్తూ ఉంటారు. అలాంటివారిలో ఈయనా ఒకడన్నమాట ! 

ఆయన వైపు చూచి నవ్వుతూ 'అనుక్షణం జరిగేదే అనుష్ఠానం' అన్నాను.

ఆయనకా మాట అర్ధం కాలేదు. అదీగాక ఆయన విపరీతమైన పని హడావుడిలో ఉన్నాడు. అందుకని - 'అలాగా ఓకే సార్' అన్నాడు.

ఈ లోపల టీ వచ్చింది. తాపీగా దానిని సేవించి, కారెక్కి హోటల్ కి బయలుదేరాను.

(ఇంకా ఉంది)

26, అక్టోబర్ 2018, శుక్రవారం

Details of Gosewa at Jillellamudi

నా పోస్ట్ చదివిన చాలామంది జిల్లెళ్ళమూడి గోశాలకు విరాళాలు పంపిస్తాం అని నన్ను మెయిల్ లొ అడుగుతున్నారు. నేను పెట్టిన ఫోటోలలొ వివరాలు ఉన్నాయి. అవి క్లియర్ గా కనిపించని  వారికోసం ఈ క్రింది వివరాలు ఇస్తున్నాను.

జిల్లెళ్ళమూడి అమ్మగారి గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వెబ్ సైట్లు చూడండి.



గోశాల విరాళాలు పంపాలి అనుకునే వారు ఈ క్రింది వివరాలు ఉపయోగించుకోండి.

Gow Poshana Padhakam
--------------------------------
Those interested in meeting the cost of feed and fodder for the cows may contribute

Annually -- Rs 6,000/-
Half Yearly -- Rs 3000/-
Monthly -- Rs 500/-

All the contributions to Sree Viswajanani Parishat, Matrusri Gow Shala are exempted from income tax under section 80G.

Funds may be remitted online to the Bank account. The name and addresss of contributors may be sent by mail to svjp.amma@gmail.com or by post.

Matrusri Gow Shala
SVJP
Bank --State Bank of India
Branch:--Jillellamudi
SBI account number: 34831629442
IFS code: SBIN0003120

Cheques/Drafts favoring Matrusri Gow Shala, SVJP may be sent to Sree Viswajanani Parishat, Jillellamudi 522113.
Bapatla Mandal, Guntur District, Andhra Pradesh.
Tel:08643 227492, 08643 227324/

For details contact:
Chakka Srimannarayana
Cell:9963385818

25, అక్టోబర్ 2018, గురువారం

జిల్లెళ్లమూడి స్మృతులు - 24 (గోశాల)






అదే రోజు సాయంత్రం జిల్లెళ్లమూడిలో మేం కొనాలనుకున్న పొలాలను చూద్దామని అందరం కలసి నడుచుకుంటూ ఓరియంటల్ కాలేజి దగ్గరకు వెళ్లి అక్కడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చాం. దారి పొడుగునా శ్రీమన్నారాయణగారు అమ్మగురించి అనేక విషయాలు చెబుతూనే ఉన్నారు.

అమ్మ చాలా తేలికమాటల్లో అత్యున్నతమైన వేదాంతాన్ని ఇమిడ్చి చెప్పేవారు. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు, శారదామాత పాటించిన పద్ధతినే అమ్మ కూడా పాటించారు. మచ్చుకు ఒక విషయం !

ఒక రోజున అమ్మను ఎవరో ఇలా అడిగారట.

'అమ్మా ! మనిషికి ప్రాణం పోయిన  తర్వాత అది ఎక్కడికి పోతుంది?'

స్వర్గానికో నరకానికో లేదా ఇంకా ఎక్కడికో పోతుందని, లేదా మళ్ళీ జన్మ ఎత్తుతుందని అమ్మ చెబుతుందని అడిగినవారు భావించి ఉండవచ్చు. కానీ అమ్మ ఇలా చెప్పింది.

'ఎక్కడికీ పోదు. చుట్టూ ఉన్నదాంట్లో కలుస్తుంది'

'అదేంటమ్మా? అర్ధం కాలేదు' అన్నారు అడిగినవారు.

'ఒక టైరులోనుంచి గాలి పోయిందనుకో నాన్నా. అది ఎక్కడికి పోతుంది? చుట్టూ ఉన్న గాలిలో కలుస్తుంది కదా ! ఇదీ అంతే' అని అమ్మ తేలికగా చెప్పేసింది.

ప్రాణానికి ఆధారం గాలే. మన లోపలి గాలీ బయట గాలీ రీసైకిల్ అవుతూ ఉండటం వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. చనిపోయినప్పుడు ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. అప్పుడు లోపలిగాలి బయట గాలిలో కలుస్తుంది. అంతే ! దీనికి స్వర్గమనీ నరకమనీ పునర్జన్మనీ ఇంత గోల ఎందుకు?

కానీ, మనిషికి ఇంత సింపుల్ ఆన్సర్ నచ్చదు. ఏదో అర్ధంకాని భాష ఉపయోగించి, వేదాంతం రంగరించి, స్వర్గనరకాలను మధ్యలోకి తెచ్చి, గంటలు గంటలు పురాణం చెబితే  మనకు నచ్చుతుంది. ఇదే మన ఖర్మ ! ప్రకృతి చాలా సింపుల్ గా ఉంది. ప్రపంచం కూడా చాలా సింపుల్ గానే ఉంది. మన మనస్సులు మాత్రం చాలా  బూజు పట్టి ఉన్నాయి. అందుకనే దేన్నైనా సరే సింపుల్ గా, ఏ పటాటోపమూ లేకుండా, ఉన్నదున్నట్లుగా చెబితే మనకు నచ్చదు.

మాటల్లో ఉండగానే గోశాల  దగ్గరకు వచ్చాం.

'ఈ గోశాల కూడా అమ్మ మొదలుపెట్టినదే.  అమ్మ దగ్గర మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఎంతో  ప్రేమగా లాలింపును పొందేవి. అమ్మ  పోయిన ఇన్నేళ్ళకు దీన్ని ఒక ఆకారానికి తేగలిగాం.' అంటూ శ్రీమన్నారాయణగారు మమ్మల్ని గోశాల లోపలకు తీసుకువెళ్ళారు.

అక్కడ ఒక ఏభైదాకా గోవులున్నట్లు నాకనిపించింది. గుంటూర్ లో గోశాల నాకు తెలుసు. కొద్ది స్థలంలో ఎక్కువ ఆవుల్ని కుక్కేసి ఉంచుతారు. వాటికి మూవింగ్ స్పేస్ ఉండదు. సరియైన పోషణ ఉండదు. తిండి ఉండదు. రాత్రిళ్ళు దోమలు కుడుతూ ఉంటాయి. చలినుంచీ ఎండనుంచీ వాటికి రక్షణ ఉండదు. కొందరు జైన సోదరులు మాత్రం వాటికి రెగ్యులర్  గా గడ్డి పంపుతూ ఉంటారు.

కానీ ఇక్కడ గోశాలను చూస్తె, ముచ్చటేసింది. మేం అక్కడకు వెళ్లేసరికి చీకటి పడింది. దోమలు కుట్టకుండా గోశాల మొత్తం దోమతెరతో కప్పేసి ఉన్నది. ఒక్కొక్క ఆవుకూ గాలికోసం విడివిడిగా ఫ్యాన్లు ఉన్నాయి. దోమతెరలలో ఆవులు హాయిగా నిలబడి ఉన్నాయి.

'వీటికి ఆహారం కూడా  చాలా మంచిగా పెడతాం. పురుగు మందులు వేసిన ఆకుకూరలు వీటికి పెట్టం. ఒక సోదరుడు వీటికోసం తన రెండెకరాల పొలంలో పురుగుమందులు వాడకుండా తోటకూర  మొదలైన కూరలు పెంచుతున్నాడు. ఆ కూరల్నే రోజూ వీటికి పెడతాం. మంచి తవుడు, ధాన్యాలు, పచ్చి గడ్డి, ఇలా మంచి తిండి వీటికి పెడుతూ ఉంటాం. పశువుల లాగా కాకుండా వీటిని మా పిల్లలలాగా చూసుకుంటాం. వీటి యూరిన్, పేడలను సేకరించి ఎరువుగా మార్చే ప్లాంట్ ఇక్కడ ఉంది. ఆ కనిపించే కాలువల గుండా వీటి యూరిన్ ఆ ప్లాంట్ లోకి పోతుంది. అక్కడ ఎరువుగా మారుతుంది. ఇవి ఉండేచోట కూడా ఎప్పటి కప్పుడు క్లీన్ చేసి చాలా శుభ్రంగా ఉంచుతాం.   ఈ పనిని కూడా అందరూ చెయ్యలేరు. శ్రద్దగా చేసే పనివాళ్ళు మాకున్నారు. అందుకని వీటిని ఇంత మంచిగా సంరక్షణ చెయ్యగలుగుతున్నాం.

నూట ఎనిమిది మంది ఏడాదికి  ఒక్కొక్కరు 6000/- ఇవ్వగలిగితే వీటిని, మేము అనుకున్నట్లుగా సాకగలుగుతాం. ప్రస్తుతానికి డెబ్భైమంది అయ్యారు. మిగతా వాళ్ళు కలిస్తే బాగుంటుంది. నెలకు అయిదొందలు అయితే ఎవరికీ కష్టం ఉండదని ఇలా పెట్టాం' - అన్నాడాయన.

"ఒకరి దగ్గర లక్షరూపాయలు తీసుకోకండి. లక్షమంది దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకోండి. అప్పుడు  ఎవరికీ ఇబ్బంది ఉండదు. పని జరుగుతుంది. అందరికోసం అందరూ కలసి మంచిపనులు చెయ్యండి" - అని అమ్మ అనేవారు.

ఈ గోశాలలో సేవ చెయ్యడానికి ఒక భర్తా భార్యా ముందుకొచ్చారు. వారికి పెళ్లై ఏడేళ్ళు అయినా పిల్లలు లేరు. కానీ ఈ ఆవులను చక్కగా చూసుకోవడం మొదలు పెట్టిన ఏడాదిలో వారికి సంతానం కలిగింది.' అన్నారు శ్రీమన్నారాయణ గారు.

అంటే వారికున్న గురుదోషం పోయి ఉంటుంది అనుకున్నాను నేను. గురువు సంతాన కారకుడు. సంతాన దోషాలున్నాయంటే ఆ జాతకంలో గురుదోషం తప్పకుండా ఉంటుంది. గోసేవ వల్ల అది పోయి ఉంటుంది. అందుకని వీళ్ళకు సంతానం కలిగింది. జీతం తీసుకుంటూ చేసినా కూడా శ్రద్దగా ఆవులను చూసుకోవడం వాళ్ళ జాతకాన్ని బాగుచేసింది.

గోశాలను నడుపుతున్న విధానం మాకెంతగానో నచ్చేసింది.

మా సంస్థనుంచి మిగతాది మేము పూర్తి చేస్తామని ఆయనతో చెప్పాను. గోవును సంరక్షించడం అనేది జాతకంలోని గురుదోషాలను సమూలంగా పోగొడుతుంది. అంతేకాదు, రాహుకేతు దోషాలను కూడా నిర్మూలిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ప్రస్తుతం ఈ రెండు దోషాలు లేని మనుషులు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. వారికి ఈ రెమేడీని మించిన రెమెడీ కూడా ఇంకేమీ లేదు.  కనుక 'పంచవటి' నుంచి ఈ ప్రాజెక్ట్ కు మేము తప్పకుండా ఉడతాభక్తిగా తోడ్పడతామని ఆయనతో చెప్పాను. దీనికి విరాళం అందించమని నా శిష్యులందరికీ అక్కడే చెప్పేశాను.

తిరిగి వచ్చేస్తూ ఉండగా ఆయన్ను ఒక మాట అడిగాను.

'ముసలి గోవులను  ఏం చేస్తారు?'

నా ప్రశ్నను ఆయన అర్ధం  చేసుకున్నాడు.

'మాకు ఆ భేదం లేదన్నయ్యా ! పాలిచ్చేటప్పుడు బాగా చూసుకుని వట్టిపోయినప్పుడు వాటి ఖర్మకు వాటిని ఎప్పటికీ వదిలెయ్యము. ముసలి ఆవులను కూడా ఏ లోటూ లేకుండా చక్కగా చూసుకుంటాము. అవి పోయేంతవరకూ వాటి బాధ్యత మాదే. ఎందుకంటే, మా దృష్టిలో అవి ఆవులు కావు. మా పిల్లలే.' అన్నాడాయన.

వింటున్న మాకందరికీ కళ్ళు  చెమర్చాయి. అమ్మ ఆశయాలను ఎంత చక్కగా నెరవేరుస్తున్నారో కదా వీళ్ళు ! అనిపించింది.

(ఇంకా ఉంది)

20, అక్టోబర్ 2018, శనివారం

నిజమౌతున్న జ్యోతిష్యం - కౌంట్ డౌన్ మొదలైంది

ఆగస్ట్ 26 న నేను ఒక పోస్ట్ వ్రాస్తూ, 'అక్టోబర్ 19 నుండి 26 వరకూ ప్రమాద సమయం - జాగ్రత్త వహించండి' అని హెచ్చరించాను. ఆ ప్రిడిక్షన్ నిజమౌతోంది.

నిన్న సాయంత్రం అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 60 మంది చనిపోయారు. దాదాపు ఇంకో వందమంది గాయాల పాలయ్యారు. విచిత్రమేమంటే ఇది రైలు ప్రమాదం కాదు. రైలుపట్టాల మీద అడ్డదిడ్డంగా నిలబడి దసరా సందర్భంగా జరుగుతున్న రావణ దహనాన్ని వీడియోలు తీస్తూ రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదట జనం ! వినడానికి కూడా విడ్డూరంగా ఉంది !!

It happens only in India అనే సీరీస్ లో దీన్ని కూడా తీసుకోవచ్చు.

ఇండియాలో ప్రజలకు డిసిప్లిన్ లేదని, సివిక్ సెన్స్ లేదని, కనీసం కామన్ సెన్స్ కూడా లేదని, నేను ఎప్పుడూ చెబుతున్నది అక్షరాలా నిజం అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తున్నది.

ఇలాంటివి చెదురు మదురుగా అక్కడక్కడా జరిగితే సరిపోదు. ప్రతిచోటా జరగాలి. ప్రతిరోజూ జరగాలి. ఇంకా పెద్దపెద్ద ప్రమాదాలు జరగాలి. అప్పుడే ఇండియాకు పట్టిన పనికిమాలిన జనాభా దరిద్రం వదులుతుంది !

19, అక్టోబర్ 2018, శుక్రవారం

జిల్లెళ్లమూడి స్మృతులు - 23 (కార్యక్రమం శాస్త్రోక్తమేగా?)

రవన్నయ్య వచ్చి వెళ్ళాక, మేమంతా లేచి, ఒకసారి వసుంధర అక్కయ్య దగ్గరకు పోయి వద్దామని క్రిందకు దిగడం మొదలు పెట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకాయన ఎదురయ్యాడు.

'మీ క్రింది ఫ్లాట్ లో ఈయన ఉంటారు.' అని శ్రీమన్నారాయణగారు ఆయన్ని నాకు పరిచయం చేసాడు.

నేను నమస్కారం చేస్తూ ఆయనవైపు చూచాను. చాదస్తపు బ్రాహ్మడిలా కనిపించాడు.

'కార్యక్రమం శాస్త్రోక్తంగానే జరిగిందిగా?' అని అనుమానంగా ఆయన శ్రీమన్నారాయణగారిని అడిగాడు.

నేను ప్రక్కనే ఉండటంతో జవాబు చెప్పడానికి ఆయన మొహమాటపడి ఊరకే నవ్వి ఊరుకున్నాడు.

ఆయన నన్నడక్క పోయినా, నేను కల్పించుకుని - 'అవును. శాస్త్రోక్తంగానే జరిగింది. కానీ మా శాస్త్రం వేరు.' అని జవాబిచ్చాను.

'అదే ! మంత్రాలూ అవీ వినపడకపోతే అలా అడిగాన్లెండి' అన్నాడాయన మళ్ళీ అనుమానంగా.

'మా మంత్రాలు పైకి వినపడవు లెండి' అని చెప్పి, 'ఈ పుస్తకం ఈ మధ్యనే వ్రాశాను. చదవండి.' అంటూ 'జాబాల దర్శనోపనిషత్' పుస్తకాన్ని ఆయన చేతిలో ఉంచాను.

'ఓ ! ఉపనిషత్తు కదా? ఎక్కడనుంచి తీసుకున్నారు?' అడిగాడాయన.

'ఉపనిషత్తుల్లోంచే తీసుకున్నాను' అన్నా నేను నవ్వుతూ.

నా ధోరణి ఆయనకర్ధం కాలేదు లాగుంది కొంచం ముఖం చిట్లించాడు.

ఇలాంటి వాళ్ళను కొన్ని వందలమందిని చూచీచూచీ విసిగి పోయి ఉండటంతో - 'సరే. పోదాం పదండి' అని అందరితో చెబుతూ నేను రోడ్డుమీదకు వచ్చాను.

చాలామంది ఇంతే ! వాళ్లకు తెలిసినదే శాస్త్రం అనుకుంటూ ఉంటారు. శాస్త్రంలొ ఎన్నో లెవల్స్ ఉన్నాయని పాపం వారికి తెలీదు. అమ్మగారి తత్త్వం వీళ్ళకు ఎప్పుడు వంటపడుతుందా అని జాలి కలిగింది.

అమ్మ అనేమాట ఒకటి గుర్తొచ్చింది.

'మీరు చెప్పేది మంత్రం. నేను చేసేది తంత్రం' అని అమ్మ కొంతమంది పురోహిత బ్రాహ్మలతో అన్నది.

అంటే, మంత్రాలతో పని లేకుండా అమ్మ సూటిగా ఆ పనిని చేసేస్తుంది. మంత్రాలనేవి ఒక వయా మీడియా లాంటివి. నిశ్చలం కాలేని మనస్సుకు అవి ఒక సపోర్ట్ లాంటివి. డైరెక్ట్ గా మూలానికి వెళ్లేవారికి మంత్రాలు అవసరం లేదు. చెయ్యగలిగితే, మంత్రం చెయ్యలేని పనిని తంత్రం ద్వారా డైరెక్ట్ గా చెయ్యవచ్చు.

'ఎలాంటి మనుషులతో వేగుతున్నావమ్మా?' అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. మనసులోనే నవ్వుకుంటూ అక్కయ్య ఇంటికి నడక సాగించాం.

7, అక్టోబర్ 2018, ఆదివారం

మహానంది ఆలయ దర్శనం

మనం కోరకుండా జరిగేదే అసలైన దైవదర్శనం ! 'నువ్వు కోరితే కోరినదే ఇస్తాను, కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అన్నారు కదా !

జీవితంలో ఏదైనా సరే, అనుకోకుండా జరిగినదే అసలైనది. మనం ప్లాన్ చేసి చేసేది అసలైనది కాదు. అది మన సంకల్పం. అనుకోకుండా జరిగేది దైవసంకల్పం.

మొన్నొక రోజున ఆఫీస్ పనిమీద నంద్యాల వెళ్ళవలసి వచ్చింది. ఆఫీస్ పని అయిపోయాక సాయంత్రం అనుకోకుండా మహానందికి వెళ్లాం. ముందుగా ప్లాన్ చెయ్యలేదు ఏమీ లేదు. అప్పటికప్పుడు మా బాస్ తో కలసి వెళ్ళవలసి వచ్చింది.

నేను ఇంతకుముందు చాలాసార్లు మహానంది వెళ్లాను. కానీ ఈరోజు మాకు జరిగిన మర్యాదా, దర్శనమూ ఎప్పుడూ లేదు. ఆలయ మర్యాదలతో స్వాగతమూ, ప్రత్యేకంగా గర్భగుడిలోకి తీసుకువెళ్ళి శివలింగాన్ని తాకించి అభిషేక జలాన్ని మనపైన చల్లడమూ, ప్రత్యేక హారతీ, అమ్మవారి గుడిలో కూడా శ్రీచక్రమేరుప్రస్తారం ప్రక్కనే కూర్చోబెట్టి మహాహారతి ఇవ్వడమూ, తరువాత వేదపండితుల చేత ఆశీర్వచనమూ - ఇదంతా చూస్తుంటే అమ్మ ఏదో పెట్టుకున్నట్లే అనిపించింది మనసులో. పైగా ఇక్కడి అమ్మవారి పేరు మా అమ్మ పేరే ! - కామేశ్వరీ దేవి.

'ఏంటమ్మా ఇదంతా ? ఇక్కడకి రావాలని నేను అనుకోలేదు. రూమ్ లో పడుకుని ఉన్నవాడిని ఇక్కడకు తీసుకొచ్చి, ఇదంతా చేయిస్తున్నావు?' అనుకున్నా మనసులో.

చరణ్ అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు. 'అమ్మ గనుక ఇవ్వడం మొదలుపెడితే మనం తట్టుకోలేం అన్నగారు ! ఉక్కిరిబిక్కిరై పోతాం !' అని. బహుశా అలాంటిదేదో మొదలైనట్లుంది !

ప్రక్కనే ఉన్న మా బాస్ కూడా అదే మాట అన్నారు.

'మనం చూడాలి అనుకుంటే ఇలాంటి దర్శనం జరగదు. ఆయన మనల్ని పిలిపించుకున్నప్పుడే ఇలాంటి అనుగ్రహం దక్కుతుంది' అన్నాడాయన.

నిజమే కదా అనుకున్నాను !

మనం దైవం వంక చూడటం ఏముంది? అది ఎవరైనా చేస్తారు. దైవం మనవంక చూడటమే కదా అసలైన విషయం ! అలా చూచేటట్లు మనం ఉండటం ఇంకా ముఖ్యమైన విషయం ! మనం ఆయన దగ్గరకు వెళ్ళడం ఏముంది? అందరూ అదేపని చేస్తారు. కానీ మనల్ని ఆయన పిలిపించుకోవడం అసలైన అనుగ్రహానికి సూచన !

గమనించే చూపు గనుక మనకుంటే, మన జీవితంలోని చిన్నచిన్న విషయాలలో కూడా దైవస్పర్శ మనకు అందుతూనే ఉంటుంది మరి !

6, అక్టోబర్ 2018, శనివారం

గురువుగారి రాశి మార్పు - ఫలితములు

ఈ నెల పదకొండున సాయంత్రం 5.30 ప్రాంతంలో గురువుగారు రాశి మారబోతున్నారు. ఏడాదినుంచీ తులారాశిలో ఉన్న ఆయన రాశిమారి వృశ్చికరాశిలోకి రాబోతున్నారు. ఈ మార్పు వల్ల అందరూ అనేక మార్పులను చూస్తారు. ఇప్పటికే చాలామంది జీవితాలలో ఆయా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గమనించుకోండి. దీనికి కారణం Twilight (Orb) Effect లేదా ఆయనాంశ ప్రభావం.

ఈ రాశి మార్పు ఒక ఏడాది పాటు ఉంటుంది. అయితే ప్రతి నలభై రోజులకు ఒక్కొక్క నవాంశ మార్పును బట్టి, మళ్ళీ ఈ ఫలితాలలో మార్పులు ఉంటూ ఉంటాయి. కానీ స్థూలంగా ఏడాది మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుందని గమనించాలి.

--------------------------------------------
మేషరాశి

జీర్ణక్రియ మందగిస్తుంది. కొందరిలో దీర్ఘరోగాలు బయట పడతాయి. లివర్ జబ్బులు కలుగుతాయి. కొందరికి మాత్రం ఆరోగ్యం బాగుపడుతుంది. కొందరిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మానసిక చింత ఎక్కువౌతుంది. కొందరికి ఆస్తి కలసి వస్తుంది. మరికొందరికి యాక్సిడెంట్లు అవుతాయి.

వృషభరాశి

విదేశాలకు వెళతారు. అజ్ఞాతవాసం మొదలౌతుంది. పెళ్లి అవుతుంది. వ్యాపారం కలసి వస్తుంది. పెద్దలతో విభేదాలు వస్తాయి.

మిథున రాశి

గురువులతో గొడవలు మనస్పర్ధలు మొదలౌతాయి. జీర్ణక్రియ లోపిస్తుంది. పనిలో చికాకులు ఎక్కువౌతాయి. అనారోగ్యాలు బాధపెడతాయి.

కర్కాటక రాశి

రహస్య ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. దూరమైన ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి. దురాలోచనలు ఎక్కువౌతాయి. పనిలో కుట్రలు కుతంత్రాలు ఎదురౌతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. దేవాలయాలు దర్శిస్తారు. స్తోత్రాలు చదువుతారు. సంతానానికి మంచి సమయం మొదలౌతుంది.

సింహరాశి

చదువులో రాణిస్తారు. ఇంట్లో వాతావరణం తేలిక పడుతుంది. భూములు వాహనాలు కొంటారు. ఇల్లు కడతారు.

కన్యారాశి

ధైర్యం పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. సోదరులకు మంచి జరుగుతుంది. పూర్వకర్మ ఫలితాలు వేగంగా అనుభవిస్తారు.

తులారాశి

మాటకు విలువ పెరుగుతుంది. డబ్బు సంపాదిస్తారు. ఇంట్లో వాతావరణం బాగుపడుతుంది. చదువులో రాణిస్తారు.

వృశ్చికరాశి

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో పడతారు. ఉన్నత చదువులకు వెడతారు. సంతానానికి మంచి కాలం. షేర్ మార్కెట్ లో లాభిస్తారు.

ధనూరాశి

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆస్పత్రి సందర్శిస్తారు. ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతారు. జీవితం జైలులా తోస్తుంది. యాక్సిడెంట్లు అవుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

మకరరాశి

లాభం కలుగుతుంది. ఆస్తులు కొంటారు. క్రొత్త స్నేహితులు ఏర్పడతారు. సోదరులకు మంచి జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

కుంభరాశి

ఉద్యోగంలో రాణిస్తారు. ఇంట్లో వాతావరణం తేలికపడుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. తల్లిదండ్రులకు మనసు శాంతిస్తుంది.

మీనరాశి

ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పెద్దల మెప్పును పొందే పనులు చేస్తారు. ధనలాభం ఉంటుంది. అన్నింటా కలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవడం చూస్తారు.

గురువుగారి అనుగ్రహం పొందే పనులు చేస్తే ఇవి తప్పకుండా జరుగుతాయి. దానిని చెడగొట్టుకుంటే ఈ ఫలితాలకు భిన్నంగా జరుగుతాయి. గమనించుకుని జాగ్రత్త పడండి.

ప్రేమ మైకం

ఈరోజు తెల్లవారక ముందే
ఎందుకో మెలకువొచ్చింది
ఇంకా కళ్ళు తెరవక ముందే
ప్రేమ నాలో కన్ను విచ్చింది

నీ ప్రేమను తలచుకొంటూ
విలపిస్తూ నిద్ర లేచాను
ఇంత ప్రేమకు నేనర్హుడినా?
అనుకుంటూ నిద్ర లేచాను

ఉదయిస్తున్న సూర్యుడిని చూచాను
ఆ బింబంలో నీ ప్రేమే నాకు కనిపించింది
ఒంటికి తాకుతున్న చల్లని గాలిలో
నీ ప్రేమే నన్ను సుతారంగా స్పృశించింది

మనోజ్ఞమైన ఉదయసంధ్యలో
నీ ప్రేమవెలుగే నన్ను పలకరించింది
ఏ దిక్కుకు తిరిగి చూచినా
నీ చిరునవ్వే నాకు దర్శనమిచ్చింది

పంచభూతాలుగా ఈ లోకంలో 
నన్ను పోషిస్తున్నది నీ ప్రేమే
ఇక్కడి నా ప్రయాణం ముగిశాక 
నే చేరే ఆఖరి మజిలీ నీ ప్రేమే

మా అమ్మ లాలింపుగా
నన్ను పెంచింది నీ ప్రేమే
నా పిల్లలపై ప్రేమగా
నాలో పొంగింది నీ ప్రేమే

నన్ను ప్రేమిస్తున్న వారిద్వారా
హర్షంగా నాపై కురుస్తోంది నీ ప్రేమే
నన్ను ద్వేషిస్తున్న వారిలో
శీర్షాసనం వేస్తున్నది నీ ప్రేమే

నన్ను చూచే నా ప్రేయసి కళ్ళలో
తళుక్కుమన్నది నీ ప్రేమే
నన్ను చంపే నా శత్రువు చేతిలో
చురుక్కుమన్నది నీ ప్రేమే

జీవితపు ప్రతి మజిలీలోనూ
ఎన్నో వేషాలలో ఎదురైంది నీ ప్రేమే
కాగితపు పూలల్లో కూడా
కళకళలాడింది నీ ప్రేమే

నేను గ్రహించినా గ్రహించలేకున్నా
నన్ను నడిపింది నీ ప్రేమే
నేను చూచినా చూడకపోయినా
కన్ను కలిపింది నీ ప్రేమే

జగత్తును నడుపుతున్నది ప్రేమే
జ్వలిస్తూ కరుగుతున్నది ప్రేమే
జీవితాన్ని మలుపుతున్నది ప్రేమే
చావులేక వెలుగుతున్నదీ ప్రేమే

చరణామృతం

జిల్లెళ్లమూడిలో మేము ఇల్లు కొనడం తమ్ముడు చరణ్ ను మహదానందపరచింది. రిజిస్ట్రేషన్ రోజున తను కూడా మాతో బాపట్ల రావలసి ఉన్నది. కానీ ఆఫీసులో పనుండి రాలేకపోయాడు. రాలేకపోయినా తన మనసంతా మాతోనే ఉంది. జిల్లెళ్లమూడిలో అమ్మ పాదాల దగ్గరే ఉంది. ఆనందంతో తబ్బిబ్బై పోయింది. ఆ ఆనందం కవితగా మారింది. ఆ కవిత అక్షరాల రూపంలో దూకింది. నాకు పంపించాడు. హృదయంలోనుంచి పుట్టిన ఇలాంటి కవితలు కలకాలం భద్రపరుచవలసినవి. బంగారంలో వ్రాసి ఉంచుకోదగ్గవి. మనకు అంత స్తోమత లేదు గనుక బ్లాగులో భద్రపరుస్తున్నాను.
----------------------------
'అందరికీ సుగతే' నన్నది అమ్మ వాక్కు
అర్కపురి జేరయది త్వరగ జిక్కు
'పంచవటీయుల' కిదే హక్కు; భుక్కు; 
మాతృ శ్రీచరణుడిదే భవిష్యవాక్కు 
---------------------------

'జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి'

Note:-- జిల్లెళ్లమూడి మరోపేరు అర్కపురి. జిల్లేడుచెట్టు సూర్యునకు ఇష్టమైనది. పూర్వకాలంలో జిల్లెళ్లమూడిలో జిల్లేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే ఆ పేరు వచ్చింది. జిల్లేడాకును అర్కపత్రం అని పిలుస్తాము. అందుకే జిల్లెళ్లమూడి అర్కపురి అయింది. అంటే, సూర్యనిలయం అని అర్ధం. అజ్ఞానపు చీకటిని తన అమేయమైన ప్రేమవెలుగుతో చెల్లాచెదరు చేసిపారేసే అమ్మ నివసించిన చోటు సూర్యనిలయం కాక మరేమౌతుంది?

3, అక్టోబర్ 2018, బుధవారం

జిల్లెళ్లమూడిలో మాకొక స్థానం దొరికింది

పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు మాదంటూ ఒక ఆశ్రమంతో బాటు, మూడు ప్రదేశాలలో మా గెస్ట్ హౌస్ లు ఉండాలనేది నా స్వప్నం. ఆ ప్రదేశాలు జిల్లెళ్ళమూడి, అరుణాచలం, దక్షిణేశ్వరం. ఈ స్వప్నం సాకారం అయ్యే దిశగా ఈరోజు ఒక ముందడుగు పడింది. మాదంటూ ఒక ప్రాపర్టీని ఈరోజున జిల్లెళ్ళమూడిలో కొనడం జరిగింది. అమ్మ తన ఒడిలో మాకు చోటిచ్చింది.

ఈ భూమ్మీద ఇప్పటివరకూ పుట్టిన మహనీయులలో జిల్లెళ్లమూడి అమ్మగారిది అత్యున్నతమైన స్థానం. అమ్మ చూపిన మాతృప్రేమ గానీ, తాత్విక చింతన గానీ, ఆచరణలో చూపిన ఆధ్యాత్మికత గానీ ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము. ప్రపంచం మొత్తం మీదనే అంతటి దివ్యమూర్తి ఇప్పటివరకూ లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.

అలాంటి అమ్మ నడయాడిన జిల్లెళ్ళమూడి గ్రామంలో మిత్రులు చక్కా శ్రీమన్నారాయణ గారు కట్టించిన 'శ్రీ చక్రరాజ అపార్ట్ మెంట్స్' లో ఒక ఫ్లాట్ ను ఈరోజున మా ఫౌండేషన్ కొనుగోలు చేసింది. ఈరోజు ఉదయమే బాపట్ల వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చాము. అమ్మ పాదాల దగ్గర మాకంటూ ఒక నీడ ఈరోజున ఏర్పడింది.

నా శిష్యులు, పంచవటి సభ్యులు ఎవరైనా సరే, ఇప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్లి కొన్నాళ్ళు సాధన చేసుకోవాలంటే, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇప్పుడు మన ఇంట్లోనే ఉండవచ్చు. అమ్మ తిరిగిన పవిత్ర వాతావరణంలో హాయిగా సాధన చేసుకోవచ్చు.

అమ్మ అనుగ్రహంతో త్వరలో మా ఆశ్రమ స్థాపన దిశగా మిగతా అడుగులు కూడా పడతాయని మాకు నమ్మకం బలపడింది. మేము అనుకున్నది సాధిస్తామని విశ్వాసం గట్టిపడింది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.






















2, అక్టోబర్ 2018, మంగళవారం

'Sri Jabala Darsana Upanishad' - English E Book ఈ రోజు విడుదలైంది.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుంచి ఈరోజు విడుదలౌతున్న మరో ఈ - బుక్ 'Sri Jabala Darsana Upanishad'. దీని తెలుగు వెర్షన్ ఇంతకు ముందే విడుదలైంది. ఇప్పుడు దీని ఇంగ్లీష్ వెర్షన్ విడుదల చేస్తున్నాను. తెలుగు పుస్తకం చాలా బాగుందని చదివినవారి నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి. తెలుగురాని అంతర్జాతీయ పాఠకుల కోసం ఈ ఇంగ్లీష్ బుక్ ను ఇప్పుడు విడుదల చెయ్యడం జరుగుతున్నది.

ఈ పుస్తకాన్ని ఇంత త్వరగా వ్రాయగలగడంలో ఎంతో సహకరించిన నా అమెరికా శిష్యురాళ్ళకు కృతజ్ఞతలు, ఆశీస్సులు.

పదిరోజులలో ఈ రెండూ ప్రింట్ పుస్తకములుగా విడుదల అవుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.