Pages - Menu

Pages

23, జూన్ 2018, శనివారం

ఆధ్యాత్మికం అంటే ఏమిటి?

ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
అని నన్నడిగింది ఒకమ్మాయి
"ప్రేమించడం, ప్రేమలో మునిగి మరణించడం"
అన్నాను.

లోకంలో అందరూ ప్రేమిస్తున్నారుగా?
మరి వాళ్ళంతా ఆధ్యాత్మికులేనా?
అడిగింది తను.

లోకంలో కనిపించే ప్రేమ, ప్రేమ కాదు
ఆ పేరుకు అది తగదు 
నేను చెప్పే ప్రేమకు అదొక సుదూరపు ఛాయ
నేను చెప్పే ప్రేమ సత్యం. లోకప్రేమ మాయ
అన్నాను.

దానిని పొందాలంటే ఏం చెయ్యాలి?
అడిగింది.
నిన్ను బంధించిన సంకెళ్ళను త్రెంచుకోవాలి
దానిలోకి అడుగుపెట్టాలి.
దానిలో కరిగిపోవాలి.
చెప్పాను.

నా వాళ్ళను నేను వదలలేను.
నా జీవితాన్ని నేను వదలలేను.
అన్నది.
వదలమని ఎవరు చెప్పారు?
అన్నాను.

మరి బంధాలను త్రెంచాలన్నావుగా?
అడిగింది అమాయకంగా.
బంధాలంటే నీ బయట నిన్ను పట్టుకున్నవి కావు.
నిన్ను నువ్వే కట్టుకున్నవి.
నీలోపల నువ్వే అల్లుకున్నవి.
అన్నాను.

'పూజలు సరిపోవా?' అడిగింది.
'పూజలకూ దీనికీ సంబంధం లేదు.
పూజలు చేస్తుంటే పుచ్చిపోతావు గాని పండవు.'
అన్నాను.

'అర్ధం కాలేదు' అంది.
'ఇది అర్ధం చేసుకునేది కాదు. అనుభవించేది' అన్నాను.
'ఎలా?' అంది.
'ముందుకు అడుగెయ్యి తెలుస్తుంది' అన్నాను.
'వెయ్యలేను.' అంది.
'నీ ఖర్మ! పడు.' అన్నాను.

20, జూన్ 2018, బుధవారం

మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాం !

మనుషులలో స్వార్ధం పెరిగిపోతోంది - అనే మాటను చాలా ఏళ్ళ నుంచీ వింటున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ మాటను నా చిన్నప్పటినుంచీ వింటున్నా. కానీ గత పదేళ్ళలో గమనిస్తుంటే, ఇది చాలా వాస్తవం అని అర్ధమౌతోంది. ప్రస్తుతం మాత్రం మనుషుల్లో స్వార్ధం అనేది తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. ఎవర్ని చూచినా స్వార్ధం, అహం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అయితే ఈ రెంటికీ షుగర్ కోటింగ్ గా అనేక నాటకాలు మనుషులలో కనిపిస్తున్నాయి. అవసరం ఉంటే ఎంతో ఆప్యాయంగా నటిస్తున్నారు. అవసరం తీరాక 'నువ్వెవరు?' అన్నట్లు మాట్లాడుతున్నారు. అందుకే మనుషుల్ని చూస్తుంటే నాకీమధ్య చాలా అసహ్యంగా ఉంటోంది.

ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం నా జీవితంలో నడుస్తున్న ఒకే ఒక ఘట్టం - 'స్వచ్చమైన మనుషులకోసం వెదుకులాట'. అంతే !

నా చిన్నప్పుడు మనుషులు ఇంత దారుణంగా ఉండేవారు కారు. అప్పట్లో కూడా మనుషులలో స్వార్ధం ఉన్నప్పటికీ కొంచమైనా మంచితనం, జాలీ, కరుణా, దయా, నెమ్మదితనం, ముక్కుసూటితనం లాంటివి చాలామందిలో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ ఎక్కడా కనిపించడం లేదు. చాలామంది మనుషులు చాలా అసహ్యకరంగా, పచ్చిస్వార్ధపరులుగా, తెలివిగా మాట్లాడే గుంటనక్కలుగా తయారౌతున్నారు. ఇది వాస్తవం. దీనిని నిరూపించే సంఘటన ఒకటి ఈ మధ్యనే జరిగింది.

మొన్నీ మధ్యన ఒక ఫోనొచ్చింది.

'గురువుగారూ బాగున్నారా !' అంది ఒక మగగొంతు.

ఇంతకు ముందు మనుషుల్ని చూసి వాళ్ళతో మాట్లాడితే నాకు వాళ్ళ మనస్తత్వాలు అర్ధమౌతూ ఉండేవి. ఈమధ్య కాలంలో వాళ్ళ గొంతు వింటే చాలు, అర్ధమైపోతున్నాయి. ఆ స్వరమూ, దాన్ని పలికే తీరూ, వాళ్ళు సహజంగా మాట్లాడుతున్నారా, లేక కృతకంగా తెచ్చి పెట్టుకుని నటిస్తున్నారా, వాళ్ళ మనసులో అసలేముంది వగైరాలన్నీ అర్ధమౌతున్నాయి.

'ఎవరబ్బా ఈయన నన్ను ఇంత చనువుగా 'గురువుగారు' అంటున్నాడు?' - అనుకుంటూ 'ఎవరండి?' అన్నాను.

'నేను మీకు పరిచయం లేను. హైదరాబాద్ లో ఉంటాం. కానీ మిమ్మల్ని మా కుటుంబం అంతా గురువుగా భావిస్తూ ఉంటాం' అన్నాడు.

ఇలాంటి బిస్కెట్స్ చాలా చూచాను ఈ పదేళ్ళలో. ఈ బిస్కెట్లు తినీ తినీ విసుగెత్తింది.

'అవునా? ఎందుకలా?' అనడిగాను.

'మీరు మాకు చాలా చేశారు గతంలో' అన్నాడాయన.

ఈ పదేళ్ళలో ఎన్నో వందలమందికి ఎన్నో రెమేడీలు చెప్పాను గాని అవేమిటో వారంతా ఎవరో నాకేమీ గుర్తు లేవు.

'అలాగా?' అన్నాను నిరాసక్తంగా.

'అవును. మా అబ్బాయికి జాబ్ రాకపోతుంటే మీరు వాడి జాతకం చూచి రెమెడీ చెప్పారు. దానిని చేసిన రెండు నెలల్లో జాబొచ్చింది. తర్వాత మేరేజ్ మాచెస్ కుదరకపోతుంటే మళ్ళీ రెమెడీ చెప్పారు. మంచి సంబంధం కుదిరింది. చార్ట్ మేచింగ్ కూడా మీరే చేశారు.' అన్నాడాయన.

'ఓకే. సరే' అన్నాను.

'ఇది జరిగి దాదాపు ఏడేళ్ళు అయింది. మీకు గుర్తుందో లేదో?' అన్నాడు.

'లేదండి. నాకు గుర్తు లేదు. వందల జాతకాలలో అలా గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు.' అన్నాను.

'మళ్ళీ ఇప్పుడు మీతో పని పడింది.' అన్నాడు.

అంతేకదా ! పని పడితే గాని మనం ఎవరికీ గుర్తురాము కదా మరి ! - అనుకుని 'ఏంటో చెప్పండి?' అన్నాను.

'మా వాడికి ఇద్దరు పిల్లలిప్పుడు. కానీ అబ్బాయికీ కోడలికీ పడటం లేదు. చాలా గొడవలౌతూ ఉన్నాయి. కలిసి ఉండేలా లేరు. విడాకులకు వెళుతున్నారు. దీన్ని మీరు ఆపాలి. మీ మీద మాకు చాలా గురుభావం' అన్నాడు మళ్ళీ.

మాటమాటకీ 'గురుభావం' అంటుంటే అసహ్యం అనిపించింది. ఆ పదానికి అర్ధం కూడా తెలీకుండా అలా తేలికగా ఎలా వాడేస్తూ ఉంటారో జనం ?

'ఎవరైనా ఫేమిలీ కౌన్సెలింగ్ వాళ్లకు చూపించండి. లేదా హోమాలు చేతబడులు చేసే స్వామీజీలుంటారు. వాళ్ళను కలవండి మీకు వదిలించుకునే యోగం ఉంటే ' అన్నాను.

'మీరేం అనుకోనంటే ఒక మాట. అవన్నీ అయ్యాయి సార్. మీ గుంటూరాయనే ఒక స్వామీజీ ఏదో ఉగ్రదేవతా హోమం చేసి విభూది ఇచ్చాడు. అదికూడా పని చెయ్యలేదు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం' అన్నాడు అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు.

'ఓహో అన్నీ అయ్యాక చివర్లో నేను గుర్తొచ్చానా?' అని మనసులో అనుకుని ' మీకు నేనంటే అంత గురుభావం ఉందా?' అన్నాను.

'అయ్యో. చాలా ఉండండి. రోజూ మిమ్మల్ని అనుకుంటూ ఉంటాం నేనూ మా ఆవిడా. ఏడేళ్ళ క్రితం మాకెంత సాయం చేశారో ఎలా మర్చిపోగలం?' అన్నాడాయన టీవీ సీరియల్ డైలాగులు వాడుతూ.

'అవునా? నాకు యాక్సిడెంట్ అయిన సంగతి మీకు తెలుసా?' అడిగాను.

'తెలుసండి. మీ బ్లాగులోనే చదివాను.' అన్నాడాయన.

'మరి తెలిస్తే, మీకంత గురుభావం ఉంటే నన్నెందుకు చూడటానికి రాలేదు? కనీసం ఈ మూడు నెలల్లో ఫోన్ ఎందుకు చెయ్యలేదు?' అడిగాను డైరెక్ట్ గా.

అవతలివైపు నుంచి నిశ్శబ్దం.

కాసేపయ్యాక ' అదీ... అదీ... ఎండలు కదండీ తిరగలేకపోతున్నాం. అదీగాక పెద్దవాళ్ళం అయ్యాం కదా' అన్నాడు.

ఈ నాటకాలంటేనే నాకు చిర్రెత్తుకొచ్చేది. ఫోన్ చెయ్యడానికీ ఎండలకూ పెద్దవయసుకూ సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు.

'సరే నీ పని ఇలా ఉందా?' అనుకుని ఇలా అడిగాను.

'మీ నక్షత్రం ఏంటో చెప్పండి'

ఆయనకు సంతోషం వేసింది. సబ్జెక్ట్ లోకి వస్తున్నా అని.

'కృత్తిక ఒకటో పాదం' అన్నాడు ఉత్సాహంగా.

'నాలుగు గంటల దూరంలో ఉన్న గుంటూరుకు రావడానికి మీకు కుదరలేదు. కానీ యాత్రలు చెయ్యడానికి కుదిరిందా?' అడిగాను సున్నితంగా.

మళ్ళీ అటువైపు నుంచి నిశ్శబ్దం.

'అంటే... మా గ్రూప్ అంతా బలవంతపెడుతుంటే మొన్న 'మే' లో నార్త్ ఇండియా, హిమాలయయాత్ర అంతా చేసొచ్చాం. కొన్నికొన్ని తప్పవు కదా. అయినా అద్భుతం సార్! ఒక్క నక్షత్రంతోనే మేము యాత్రలు చేసిన విషయం ఎలా చెప్పగలిగారు మీరు? మీకింత నాలెడ్జ్ ఉంది గనుకనే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం' అన్నాడాయన మళ్ళీ తెలివిగా ఇంకో రెండు బిస్కెట్లు వేస్తూ.

నవ్వొచ్చింది.

మేషరాశి నుంచి ద్విస్వభావ రాశి అయి దూరదేశాలను సూచించే ధనుస్సులో నవమస్థానంలో కర్మకారకుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్న విషయమూ, నవమాధిపతి గురువు దూరదేశాలను సూచించే సప్తమంలో చరరాశిలో ఉన్న విషయమూ తెలిస్తే ఈయన దూరప్రాంతాలకు యాత్రలు చేశాడన్న విషయం జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకునే వాళ్లకు కూడా అర్ధమౌతుంది. దీనికేదో పెద్ద నాలెడ్జి అవసరం లేదు. ఈ విషయం ఈయనకు వివరించి చెప్పడం ఎందుకనిపించి ఇలా అన్నాను.

'ఒకపని చెయ్యండి. మీ అబ్బాయికి విడాకులు త్వరగా ఇప్పించెయ్యండి. మీకూ వాళ్ళకూ కూడా పీడా వదుల్తుంది.'

ఆయన బిత్తరపోయాడు.

'అదేంటి సార్ ! వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు'

'వాళ్ళను మీరు పెంచుకోండి. చిన్నప్పుడు మీ అబ్బాయిని కాన్వెంట్ చదువులతో సరిగ్గా చూసుకోలేక పోయుంటారు. ఇప్పుడు వీళ్ళను మంచిగా పెంచుకోండి. ఆ భ్రమ తీరుతుంది.' అన్నాను.

ఆయనకు కోపం వచ్చింది.

'ఏంటి సార్ ! మేం అడిగేదేంటి? మీరు చెప్పేదేంటి? ఇష్టమైతే చెప్పండి. లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇలాంటి సలహాలు ఇస్తారని కాదు మీకు ఫోన్ చేసింది' అన్నాడు కోపంగా.

ఆయన గురుభక్తి అంతా ఒక్క నిముషంలో ఏమై పోయిందో నాకర్ధం కాలేదు.

'సలహాలు ఇవ్వడం నాకిష్టమే. కానీ మీకు నచ్చిన సలహాలు నేనివ్వలేను. అసలు మీ అబ్బాయికీ మీ కోడలికీ కలిసి ఉండాలని లేదు. వాళ్ళు విడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు విడిపోవడం మీకిష్టం లేదు. వాళ్ళ మనసులు కలిసినా కలవకపోయినా మీ పరువుకోసం వాళ్ళు జీవితాంతం శత్రువులలగా ఒకే కప్పుక్రింద ఇష్టంలేని సంసారం చెయ్యాలి. మీకోసం ! అంతేనా మీ ఉద్దేశ్యం?' అన్నాను.

జవాబు లేదు.

'అదలా ఉంచండి.సమ్మర్లో నార్త్ ఇండియా అంతా తిరిగి రావడానికి మీకు టైం ఉందిగాని, గుంటూరు వచ్చి మీ సోకాల్డ్ 'గురువు'ను పలకరించడానికి మీకు తీరిక లేదు. కనీసం ఫోన్ చెయ్యడానికి మీకు మనసు రాలేదు. ఇప్పుడు మీకు అవసరం వచ్చింది గనుక, మీ సమస్య ఎక్కడా తీరడంలేదు గనుక నేను గుర్తొచ్చాను. అందుకని ఇప్పుడు నన్ను అప్రోచ్ అవుతున్నారు. గతంలో మీ దగ్గర ఏమీ ఆశించకుండా మీకు పెద్ద పెద్ద సమస్యలు తీర్చానని మీరే చెబుతున్నారు. తీరని సమస్య మీ నెత్తిన కూచుంటే ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చానన్నమాట. 'మీరంటే మాకు గురుభావం' ఇలాంటి సోది మాటలు మీరు చెప్పకుండా డైరెక్ట్ గా మీ సమస్యను అడిగి ఉంటే, అప్పుడు చేసేవాడినేమో చెప్పలేను. ఇప్పుడు మాత్రం నేను మీకేమీ సాయం చెయ్యను. మీలాంటి స్వార్ధపరులతో ఇంతసేపు మాట్లాడటమే నాకు టైం వేస్ట్. సారీ !' అన్నాను.

'మీకు కోపం ఎక్కువని అందరూ అనేమాట నిజమే అన్నమాట !' అన్నాడు ఎగతాళిగా.

మళ్ళీ నవ్వొచ్చింది.

"అందితే జుట్టు అందకపోతే కాళ్ళు' అంటే ఇదేగా" - అనుకున్నా మనసులో.   

'అవును. నాకు కోపం ఒక్కటే కాదు. అన్నీ ఎక్కువే. నేను పూర్వజన్మలో దూర్వాసమహర్షిని. ఈ జన్మలో ఇలా పుట్టాను. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యకండి. ఈసారి నా నోట్లోంచి ఏం మాటలొస్తాయో నాకే తెలీదు. మరొక్క విషయం! మీరు ఎన్ని రెమెడీలు చేసినా మీ అబ్బాయి విడాకులను ఆపలేరు. వాళ్ళు విడిపోయిన తర్వాత మీరేం చెయ్యాలో ఆలోచించుకుని దానికి ప్రిపేర్ అవ్వండి.' అని ఫోన్ కట్ చేశాను.

అదెలా తెలిసిందా? అని డౌటొస్తోంది కదూ? ఆ అబ్బాయి వాళ్ళ నాన్న నక్షత్రం 'కృత్తిక' అన్నీ చెప్పింది. ఎలా చెప్పిందో ఊహించండి చూద్దాం !

17, జూన్ 2018, ఆదివారం

మీ వ్రాతలు అందరికీ నచ్చవు

'లలితా సహస్రనామాలమీద మీ లేటెస్ట్ బుక్ చదివాను. బాగానే వ్రాశారు. కానీ మీ వ్యాఖ్యానం అందరికీ నచ్చదు. జనాలకి మీ భావాలు ఎక్కడం కష్టం.' అన్నాడొకాయన.

'అందరికీ అన్నీ ఎలా నచ్చుతాయి? అలా నచ్చేపనైతే ఇన్ని అవతారాలెందుకు? ఇంతమంది గురువులెందుకు? ఇన్ని దేవుళ్ళెందుకు? ఇన్ని గ్రంధాలెందుకు? అందరి సంగతీ అలా ఉంచండి. మీకు నచ్చిందా లేదా?' అన్నా నేను.

'బానే ఉంది. మీరు హైయెస్ట్ లెవల్లో వ్రాశారు. కానీ..ఏయే మంత్రాలు ఎలా చదివితే ఏయే పనులౌతాయో చెబితే ఇంకా బాగుండేది.' అన్నాడు.

నవ్వొచ్చింది.

'మీలాంటివాడు రామాయణం అంతా విని వాల్మీకికి శూర్పణఖ ఏమౌతుందని అడిగాట్ట చివరికి' అన్నా నేను.

'అదేంటి?' అన్నాడాయన.

'లలితా సహస్రనామాల అసలు ప్రయోజనం పనులు కావడం కాదని ముందుమాటలో వ్రాశాను. అది చదవలేదా?' అడిగాను.

'అవుననుకోండి. కానీ...కాస్త మామూలు మనుషులను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు వ్రాయాలి కదా?' అన్నాడు.

'అవసరం లేదు. మామూలు మనుషులతో నాకు పని లేదు. నా స్థాయిలో ఆలోచించి నాతో ట్యూన్ అయ్యేవారికోసమే ఈ పుస్తకం గాని పనులు కావడం కోసం పారాయణాలు చేసే వారి కోసం కాదు.' అన్నాను.

'అంటే పనులు కావడం కోసం దేవుణ్ణి వేడుకోవడం తప్పంటారా?' అన్నాడు.

'తప్పు కాదు. కానీ జీవితమంతా అలా వేడుకుంటూనే ఉండకూడదని నేను చెబుతున్నాను. అడుక్కోవడం తప్పనిసరైనప్పుడు ఈరోజు ఉండి రేపు మాయమయ్యే చెత్తకోసం కాకుండా విలువైన వాటికోసం అడుక్కోమని చెబుతున్నాను. అంతే' అన్నాను నవ్వుతూ.

'కష్టం అండి. సామాన్యులకు ఎక్కదు' అన్నాడు.

'సామాన్యులను ఉద్ధరించడం కోసం, వారి కోరికలు తీరే మార్గాలు చెప్పడం కోసం నేను పుట్టలేదు. సామాన్యులకు అన్నీ అర్ధమయ్యేలా చెయ్యాలని నాకేమీ తపన లేదు. సామాన్యుడు ఎప్పటికీ సామాన్యుడు గానే ఉండాలని కోరుకుంటే అది వాడి ఖర్మ. నాకేంటి? ఎక్కడైనా ఒకరో ఇద్దరో అసామాన్యులుగా ఎదగాలని అనుకుంటే అలాంటివారికి మాత్రమే నా పుస్తకాలు నచ్చుతాయి. నేను వ్రాసేది కూడా అలాంటి వారికోసమే' అన్నాను.

అతనికి ఇంకా ఇలా చెప్పాను.

'చూడు. వివేకానందస్వామి ఒక మాటన్నారు. నువ్వు చదివావో లేదో? సత్యాన్ని సత్యంగానే మనం ఉంచాలి. దానిని దిగజార్చాలని చూడకూడదు. మనం దానిని అందుకోలేకపోవచ్చు. అది మనకు అందనంత ఎత్తులో ఉండవచ్చు. దానిని చేరుకునే శక్తి మనకు లేకపోవచ్చు. కానీ ఆ సత్యాన్ని దిగజార్చి మన స్థాయికి దించాలని మనం ప్రయత్నించరాదు. అలా చెయ్యడం వల్లే హిందూమతం భ్రష్టత్వానికి గురౌతోంది.

సత్యం అంటే ఏమిటి? దైవమే సత్యం. దైవాన్ని మనం చేరుకునే ప్రయత్నం చెయ్యాలిగాని, మనం ఉన్న బురదలోకి దానిని కూడా దించాలని చూడకూడదు. లలితా సహస్రనామాలకు ఉన్నట్టి అసలైన అర్ధాలను నేను వివరించాను. అవి అలా ఉంటే మాకిష్టం లేదు, మాక్కావాల్సినట్టు ఉండాలి అని మీరంటే అది మీ ఖర్మ. అది మీ ఎదగలేనితనానికి నిదర్శనం.' అన్నాను.

ఆయన ఇంకా అయిష్టంగానే ముఖం పెట్టాడు.

ఈ మాట చెప్పి ముగించాను.

'మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని మీరెలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండటం గొప్ప కాదు. అది ఎవరైనా చేస్తారు. జంతువులు కూడా అదే పని చేస్తాయి. ఏ విధంగా ఉంటే, పరిణామ క్రమంలో మనం అత్యున్నత స్థాయికి ఎదగగలమో ఆ విధంగా ఉండాలి. కనీసం ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని, మన కోరికలు తీర్చే పనివాడుగా దైవాన్ని వాడుకోకూడదు.

పరిణామక్రమంలో అత్యున్నత స్థాయికి మనిషిని చేర్చే మార్గాలను నేను నా పుస్తకంలో వివరించాను. అవి మీకు నచ్చకపోతే మీకు దైవికంగా ఎదిగే సమయం ఇంకా రాలేదని అర్ధం. మళ్ళీ చెబుతున్నాను. సత్యాన్ని మనం అందుకునే ప్రయత్నం చెయ్యాలిగాని దానిని మన స్థాయికి దిగలాగే ప్రయత్నం చెయ్యకూడదు. కానీ దురదృష్టవశాత్తూ మన గుళ్ళల్లో, మన పూజల్లో, మన పారాయణాలలో మనం చేస్తున్నది అదే. దేనిని చెయ్యాలో దానిని చెయ్యకుండా దేనిని చెయ్యకూడదో దానిని చెయ్యడమే మన పతనావస్థకు కారణం.

నా పుస్తకం లోకంలో అందరికీ నచ్చాలనీ నచ్చుతుందనీ నేను భావించడం లేదు. నన్ను సరిగ్గా అర్ధం చేసుకునే కొందరికి నచ్చితే చాలనేదే నా నమ్మకం. ఆ కొందరికైనా అది సక్రమమైన దారిని చూపగలిగితే అంతే చాలని నా విశ్వాసం.' అంటూ ముగించాను.

4, జూన్ 2018, సోమవారం

ప్లీజ్ నాకోసం ఒక ప్రశ్న చూడవా?

ఈరోజు మా కొలీగూ, ఫ్రెండూ అయిన ఒకడు మా ఇంటికొచ్చాడు. నేను ఆఫీసుకెళ్ళి చాలారోజులైంది కదా పలకరిద్దామని వచ్చానన్నాడు. సరే ఆ మాటా ఈ మాటా అయింతర్వాత, తీరిగ్గా కూచుని మా శ్రీమతి చేసిచ్చిన మసాలా చాయ్  త్రాగుతూ ఉండగా, ఇలా అడిగాడు.

'నాకోసం ఒక ప్రశ్నచార్ట్ చూడవా ప్లీజ్?'

అతనెప్పుడూ అలా అడగలేదు. ఏంటి? ఇలా అడుగుతున్నాడని అనుమానం వచ్చింది.

'ఏంటి సంగతి? ఎవరిది జాతకం?' అన్నాను.

'ఆ సంగతి తర్వాత చెప్తా' అన్నాడు.

'నీదా?' అడిగాను.

'కాదు. నాదైతే చెబుతాను కదా' అన్నాడు.

'అది సరే! కరెక్ట్ గా జనన వివరాలు ఉంటే ఇవ్వు. ప్రశ్న చార్ట్ ఎందుకు?' అడిగాను.

'అవి లేకే కదా ప్రశ్న చూడమని అడుగుతోంది?' అన్నాడు చనువుగా.

సామాన్యంగా నేను ఇలాంటి రిక్వెస్ట్ లు ఒప్పుకోను. కానీ కొన్నిసార్లు నాకు కూడా చూద్దామని అనిపిస్తుంది. అది అడిగిన ప్రశ్నను బట్టి, అడిగిన వ్యక్తిని బట్టి, నా ఖర్మను బట్టి రకరకాలుగా ఉంటుంది. ఎందుకో నాకూ చూద్దామని అనిపించింది. సర్లే అని, యధావిధిగా మనస్సులో చెయ్యవలసినవి చేసి, ప్రశ్నచార్ట్ వేసి చూచాను. ప్రశ్నచార్ట్ చూచాక విషయాలు అర్ధయయ్యాయి.

'ఊ ! ఏం కావాలి? చెప్పు?' అడిగాను.

'ఈ జాతకుని మనస్తత్వం ఎలాంటిది?' అడిగాడు.

'చాలా ఇంపల్సివ్ నేచర్. మొండి మనిషి. ఎమోషనల్ వ్యక్తిత్వం' - చెప్పాను.

'ఎలా చెబుతున్నావు? నాక్కూడా కొంచం వివరించి చెప్పవా ప్లీజ్' - అడిగాడు.

అతనిక్కూడా కొద్దో గొప్పో జ్యోతిష్యం తెలుసు. ఆ కుతూహలంతో అలా అడిగాడని అర్ధమైంది. జ్యోతిష్యంలో ప్రవేశం ఉన్నవారికి ఈ రకమైన 'దురద' ఉంటుంది. చార్ట్ ను వీళ్ళు ఎలా చదువుతున్నారు? అనేది తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది.

అది గమనించి నవ్వుకుంటూ ఇలా వివరించాను.

'కర్కాటక లగ్నం అయింది గమనించు. అందులో రాహువున్నాడు. అంటే, స్తిరత్వం లేని మనస్తత్వం అని అర్ధం. వేవరింగ్ మైండ్ అన్నమాట. లగ్నాధిపతి చంద్రుడు సప్తమంలో ఉచ్ఛకుజుడు, కేతువులతో కూడి ఉన్నాడు. కేతువు శనీశ్వరుని సూచిస్తున్నాడు. అంటే, చంద్రుడు, కుజ శనులతో కలసి ఉన్నాడన్నమాట. కుజుడు మహాతీవ్రమైన మొండి గ్రహం, శని చాలా నీరసంగా ఉండే గ్రహం. అంటే, ఏమిటి? ఈ జాతకుడికి నిలకడ ఉండదు. ఏదైనా ఎక్స్ ట్రీమ్ గానే ఉంటుంది. చంద్రుడు మనస్సును సూచిస్తాడు గనుక, ఈ జాతకుడి మనస్సుకు నిలకడ ఉండదు. తీసుకునే నిర్ణయాలు ఇంపల్సివ్ గా, మొండిగా ఉంటాయి. కుజ శనుల యోగం మంచిది కాదు. ఇది యాక్సిడెంట్స్ ను సూచిస్తుంది. అంటే, ఈ జాతకుడు తను తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితంలో చాలా నష్టపోతాడు.' అన్నాను.

అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేదు.

నేనూ మౌనంగానే ఉన్నాను.

కాసేపయ్యాక - ' ఈ జాతకుడి జీవిత భాగస్వామితో సంబంధం ఎలా ఉంటుంది?' అన్నాడు మాటల్ని ఆచితూచి ఉపయోగిస్తూ.

'సింపుల్. సప్తమాధిపతి శనీశ్వరుడు జీవిత భాగస్వామిని సూచిస్తాడు. శని వక్రస్థితిలో ఉన్నాడు. అంటే, ఇతను జీవిత భాగస్వామితో కలసి ఉండడు. అంతేగాక శని, ఈ జాతకంలో శత్రుత్వాన్ని సూచించే ఆరో ఇంట్లో ఉన్నాడు గమనించు. పైగా, ఆరో అధిపతి గురువు సుఖస్థానంలో ఉండి దాన్ని చెడగొడుతున్నాడు. అంటే, వీళ్ళిద్దరి మధ్యనా గొడవలుంటాయి. సఖ్యత తక్కువ. ఇంట్లో శాంతి ఉండదు.' అన్నాను.

'ఆ గొడవలు ఎవరి వల్ల వచ్చుంటాయి?' అన్నాడు.

'ఓహో ! అంటే, గొడవలున్నది కరెక్టే అన్నమాట !' అని మనస్సులో అనుకుని ఇలా చెప్పాను.

'ఈ జాతకుడు చంద్రుడు. జీవిత భాగస్వామి శని. వీళ్ళిద్దరిలో ఎమోషనల్ గ్రహం చంద్రుడే. పైగా చంద్రుడు రెండు పరస్పర విరుద్ధ గ్రహాల మధ్యలో చిక్కుకుని ఉన్నాడు. కనుక బాగా అన్ బేలన్స్ అయ్యాడు. దీనికి విరుద్ధంగా జీవిత భాగస్వామిని సూచించే శని స్థిరంగానే ఉన్నాడు. కాకుంటే వక్రించాడు. అంటే, ఇతనికి దూరంగా వెళతాడు. అంతేగాని గొడవలు సృష్టించడు. కనుక, ఈ రెండుగ్రహాలలో చంద్రుడే దోషి. కాబట్టి, ఈ జాతకుని వల్లనే వీళ్ళ సంసారంలో గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామి పాత్ర తక్కువ.' అన్నాను.

మళ్ళీ కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

'జీవిత భాగస్వామి ఎలాంటి వ్యక్తి అయి ఉండవచ్చు?' అడిగాడు.

'ఎందుకు ఇదంతా అడుగుతున్నావ్? ఎవరీ వ్యక్తి? ముందది చెప్పు' అన్నాను.

ఎందుకిలా అడిగానంటే -  చాలామంది ఇలాంటి వ్యక్తిగత విషయాలు అడిగి ఆ తర్వాత ఆ వ్యక్తులను హింసకు, బ్లాక్ మెయిల్ కూ గురిచేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు. నా ప్రిన్సిపుల్స్ అతనికి బాగా తెలుసు. అయినా నా అనుమాన నివృత్తి కోసం అలా అడిగాను.

'అబ్బే. అదేం లేదు. నా సంగతి నీకు తెలుసు. నీ సంగతి నాకు తెలుసు. ఈ వివరాలు నేను దుర్వినియోగం చెయ్యను గాక చెయ్యను. నన్ను నమ్ము. ప్లీజ్ కంటిన్యూ.' అన్నాడు వాడు.

అప్పుడిలా చెప్పాను.

'సప్తమాధిపతి శని వక్రి. పన్నెండో ఇంట్లో ఉన్నాడు. అంటే, ఇతని జీవిత భాగస్వామి ఇతన్ని బాగానే సపోర్ట్ చేస్తుంది. కానీ కొంచం బయటనుంచి చేస్తుంది. అంటీ ముట్టనట్లుగా వీరి బంధం ఉంటుంది.' అంటూ జాతకంలో కొన్ని యోగాలను గమనించి టక్కున ఆగిపోయాను.

'ఏంటి ఆగిపోయావ్?' అన్నాడు.

'నేను చెప్పే విషయాలు నువ్వు ఇంకెక్కడా డిస్కస్ చెయ్యకూడదు. ఆ కండిషన్ కు నువ్వు ఒప్పుకుంటే నేను ముందుకు వెళతాను. లేదంటే ఇంతటితో ఆపుతాను' అన్నాను.

'అలాగే. ప్రామిస్. ఎక్కడా చెప్పను. ప్రొసీడ్' అన్నాడు నమ్మకంగా.

'శని ద్విస్వభావ రాశిలో ఉన్నాడు. అక్కడనుంచి ఇంకో ద్విస్వభావ రాశీ, అంతకంటే ముఖ్యంగా సోషల్ రాశీ అయిన మిధునంలో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు. అంటే, ఇతని భార్యకు ఇంకా కొంతమందితో సంబంధాలు ఉంటాయి' అన్నాను.

'ఆ సంగతి ఇతనికి తెలుసా?' అడిగాడు.

చార్ట్ మళ్ళీ గమనించాను. చంద్రుడికి శని చాలా దగ్గరగానే, వెనుకగానే, ఉన్నాడు. వివాహేతర సంబంధాలను సూచించే శుక్రుడు కూడా లగ్నం అయిన కర్కాటకానికి వెనకే ఉన్నాడు. అది గమనించి ఇలా చెప్పాను.

'ఇతనికి తెలుసు. అంతేకాదు. ఇతనికి వాళ్ళు పరిచయస్తులే అయి ఉంటారు'.

'ఈ జీవిత భాగస్వామి మనస్తత్వం ఎలాంటిది?' అడిగాడు.

చార్ట్ వైపు మళ్ళీ చూచాను. కుజుడు దారాకారకుడయ్యాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు.

'జీవిత భాగస్వామి చాలా మొండిమనిషి. పట్టుదల ఉన్న వ్యక్తి. అంతేకాదు. సొసైటీలో మంచి స్టేటస్ లో ఉన్న పలుకుబడి గల వ్యక్తి.' చెప్పాను.

'ఈ జాతకుడి ప్రొఫెషన్ ఏమిటి?' అడిగాడు.

'దశమాధిపతి కూడా కుజుడే అయ్యాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు. కనుక ఈ వ్యక్తి కూడా మామూలు మనిషి కాడు. జీవితంలో సక్సెస్ ను బాగా అందుకున్న వ్యక్తే. కానీ ఆ సక్సెస్ నిలబడదు. కేతుస్పర్శ వల్ల కొన్నాళ్ళ తర్వాత సడెన్ గా సక్సెస్ చేజారి పోతుంది.' అన్నాను.

అతను ఇంకేదో అడగబోతుండగా - 'ఇప్పటిదాకా చాలా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు నా ప్రశ్నకు నువ్వు చెప్పు. ఇంతకీ ఎవరీయన?' అడిగాను.

'ఈయన కాదు. ఈమె.' అన్నాడు తను నవ్వుతూ.

వాడు అడిగే ప్రశ్నలను బట్టి ఇది ఎవరో అమ్మాయి జాతకం అని నాకు అనుమానం వచ్చినా, మనకెందుకులే అని ఇంతసేపూ కొనసాగించాను. కానీ వాడే చెప్పడంతో నేనూ అడగక తప్పింది కాదు.

'ఎవరీమె?' అడిగాను.

'సినీ నటి సావిత్రి' అన్నాడు నవ్వుతూ.

'ఓహో అదా సంగతి.అంటే ఈ జాతకురాలు సావిత్రీ, ఆమె జీవిత భాగస్వామి జెమినీ గణేశన్ అన్నమాట! ఏంటి? ఆమె గురించి ప్రశ్న అడుగుతున్నావ్? మీ బంధువా ఏంటి?' అన్నా నేనూ నవ్వుతూ.

'ఏం లేదు. మొన్నీ మధ్య 'మహానటి' సినిమా చూచాను. నువ్వు చూచావా?' అడిగాడు.

'లేదు నేను మెట్లు దిగి రెండు నెలలైంది. మధ్యలో ఒకటో రెండో సార్లు ఆస్పత్రికి వెళ్ళడం కోసం అతి కష్టం మీద ఒక్కొక్క మెట్టూ దిగాను. అరగంట పట్టింది క్రిందకు దిగేసరికి. ఇలాంటి స్థితిలో, సినిమాలు ఎక్కడ చూసేది? ఇంతకీ ఎలా ఉంది సినిమా?' అన్నాను.

'సినిమా బానే ఉంది. కాకపోతే, పత్రికలలో రకరకాలుగా వ్రాస్తున్నారు. ఆ సినిమాలో చూపించింది అంతా అబద్దాలే అని ఇప్పుడు చాలామంది అంటున్నారు?' అన్నాడు.

'సర్లే. సినిమా కదా. డబ్బుకోసం ఏదేదో మార్చి పారేసి తీస్తారు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు' అన్నా.

'ఏం లేదు. సావిత్రికి త్రాగుడు అలవాటు చేసింది జెమినీ అని అందులో చూపించారు. అంతేకాదు, ఆమెను ఒక హీరోగా చూపించి, జేమినీని విలన్ని చేశారు. అతనొక దుర్మార్గుడని చూపించారు. అంతేగాక ఆమె జీవితంలో జరిగిన సంఘటనలను ఎన్నింటినో మార్చి పారేసి చూపించారు. ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి. అందుకని నీ దగ్గరకు ఎలాగూ వస్తున్నా కదా ప్రశ్న ద్వారా తెలుసుకుందాం అని అనిపించి అడిగా. సారీ. ఏమీ అనుకోకు.' అన్నాడు వాడు సిన్సియర్ గా.

నాకు నవ్వొచ్చింది.

'అదా సంగతి? ఏం పర్లేదులే. అప్పుడప్పుడూ సరదాకి కూడా జ్యోతిష్యాన్ని వాడుకోవచ్చు. మనం ఒకరికి హాని చెయ్యనంత వరకూ పరవాలేదు. నువ్వు అడిగేటప్పుదే ఇదొక అమ్మాయి జాతకం అని అర్ధమైంది. ఎందుకంటే మొగాడి కేరెక్టర్ ఎలాంటిది అని ఎవరూ అడగరు. అమ్మాయిదైతేనే అడుగుతారు. అది సగటు మొగాడి మనస్తత్వం. తను ఎక్కడ తిరిగినా తన భార్య మాత్రం నిప్పులా ఉండాలని వాడనుకుంటాడు. ఇది చాలాసార్లు గమనించాను.' అన్నాను.

'సరే. ఇంతవరకూ ప్రశ్న శాస్త్రం చాలా కరెక్ట్ గా జవాబులు చెప్పింది. మరి నా మిగిలిన ప్రశ్నలకు జవాబులు చెప్పు' అన్నాడు.

'ఏంటవి?' అన్నా నేనూ ఇంటరెస్టింగ్ గా.

'ఏం లేదు. సావిత్రికి త్రాగుడు అలవాటు జెమినీ చేశాడా?' అన్నాడు.

'లేదు. తనే చేసుకుంది. త్రాగుడు మానుకోమని జెమినీ ఎన్నోసార్లు చెప్పాడు. కానీ తను వినలేదు. ఆమె మహా మొండి మనిషి' అన్నాను.

'ఎలా చెబుతున్నావ్?' అడిగాడు.

'ఇక్కడ చూడు. త్రాగుడుకు నెప్ట్యూన్ కారకుడు. రాహువూ కారకుడే. ఈ చార్ట్ లో రాహువు లగ్నంలో ఉన్నాడు. అంటే, ఇది ఈమె స్వయంకృతాపరాధమే. పోతే, నెప్ట్యూన్ 22 డిగ్రీలలో కుంభంలో ఉన్నాడు. అంటే, చంద్రునికి ఇది చాలా దగ్గర. అంతేగాక చంద్రుని నుంచి కుటుంబస్థానంలో ఉంది. కనుక ఈమె కుటుంబంలోనే ఈ పోకడలున్నాయి. సావిత్రి చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నా ఒకేచోట కూచుని త్రాగేవాళ్ళని కొందరు చెబుతున్నారు. చిన్నప్పుడు అలాంటి సీన్లు చూచిన పిల్ల మనసు ఎలా తయారౌతుంది? ఆలోచిందు. ప్రాక్టికల్ గా చూడు. నేను చెప్పినది నిజం అని నీకూ తెలుస్తుంది. సావిత్రి 1981 లో చనిపోయింది. అప్పటికి ఆమెకు 45 ఏళ్ళు. జెమినీ 2005 లొ పోయాడు. చనిపోయేనాటికి అతనికి 85 ఏళ్ళు. అతనేమీ సావిత్రిలాగా తాగితాగి చనిపోలేదు. ఓల్డ్ఏజి ప్రాబ్లంస్ తోనే పోయాడు. అతనేమీ త్రాగుబోతై చనిపోలేదు. కనుక సావిత్రికి అతను త్రాగుడును అలవాటు చేశాడని చెప్పడం కరెక్ట్ కాదు.' అన్నాను.

'సావిత్రి అలా అయిపోవడానికి జెమినీ పూర్తిగా కారణం కాదని నాకూ అనిపిస్తోంది. రమాప్రభా, జమునా తదితర పాత నటీమణులు కూడా అదే చెబుతున్నారు. జెమినీ అనేవాడు ఈ సినిమాలో చూపినంత విలన్ కాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటే ఉండచ్చు గాక. ఊరకే అతని పేరు బయట పడింది. అప్పటి హీరోలలో ఎవరు పత్తిత్తులున్నారు? జెమినీ దొరికాడు. మిగతావాళ్ళు దొరకలేదు. అంతే. దొరికితే దొంగ. దొరక్కపోతే దొరా?' అన్నాడు.

'అవును. కనీసం జెమినీ రాయల్ గా అందరినీ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మిగతా హీరోలు వాడుకుని ఒదిలేశారు. ఆ విధంగా చూస్తే, మిగతా హీరోలకన్నా జెమినీ నిజాయితీపరుడే. పైగా, అతని మొదటి భార్య పిల్లలు ఏమంటున్నారో చూడు? వాళ్ళ నాన్న మంచివాడే అని వాళ్ళంతా అంటున్నారు. ఇదేంటి మరి?' అన్నాను నేను.

'ఏదేమైనా ఈ పిక్చర్ తో జనాలలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ఎన్నెన్నో రాంగ్ నోషన్స్ తయారయ్యాయి.' అన్నాడు.

'అవును. సావిత్రి జెమినీని పెళ్లి చేసుకునే నాటికే అతనికి ఇద్దరు భార్యలున్నారు. ఆ సంగతి ఆమెకూ తెలుసు. తెలిసీ ఎందుకు చేసుకుంది? అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని ఆమెకు తెలుసు. అప్పట్లో ఏ హీరోకి అమ్మాయిల పిచ్చి లేదో చెప్పు. అందరూ దొంగలే. కొందరు ఓపన్ గా దొరికారు. కొందరు లోపల్లోపల గుట్టుగా చేశారు. అంతే తేడా. పోనీ. ఇప్పటి హీరోలేమన్నా పత్తిత్తులా? అప్పుడైనా ఇప్పుడైనా మనిషి తీరు ఒకలాగానే ఉంటుంది. అవకాశం దొరికితే ఎవడూ వదలడు. దొరికినవాడు ఎంజాయ్ చేస్తాడు. దొరకనివాడు నీతులు చెబుతూ ఏడుస్తూ ఉంటాడు. అంతే తేడా !' అన్నాను.

'ఎంత నకిలీ లోకంలో బ్రతుకుతున్నామో ఆలోచిస్తే అసహ్యం వేస్తోంది' అన్నాడు.

'అంతే పిచ్చి గోల ! మనవాళ్ళు తీసిన రామాయణాలూ, భారతాలూ చూచావు కదా. అసలు కధంతా మార్చిపారేసి వాళ్ళిష్టం వచ్చినట్లు తీసేశారు. రామారావు రావణుడి వేషం వేస్తే రావణుడే హీరో. దుర్యోధనుడి వేషం వేస్తె వాడే హీరో. కర్ణుడి వేషం వేస్తె కర్ణుడే హీరో. ఈ రకంగా పురాణపాత్రలనే మనవాళ్ళు ఇష్టం వచ్చినట్లు డబ్బుకోసం మార్చి పారేశారు. ఇక ఒక నటి జీవితం ఒక లెక్కా? అంతా డబ్బు మాయ. డబ్బుకోసం ఏదైనా చేస్తారు. డబ్బు దగ్గర నీతీ నియమాలు ఏవీ ఉండవు. వాల్మీకో వ్యాసుడో వచ్చి వీళ్ళు తీసిన పురాణసినిమాలు చూస్తే, గుండెలు బాదుకుంటారు.' అన్నాను నవ్వుతూ.

'సరే. నీకిష్టం లేకపోయినా నేనడిగినందుకు ప్రశ్న చూశావు. థాంక్స్. మరి సినిమా చూడవా?' అడిగాడు నవ్వుతూ.

'నేను తెలుగు సినిమా చూచి ఏడాదో రెండేళ్లో అయింది. ఏ సినిమా చూచానో, ఎప్పుడు చూచానో కూడా గుర్తు లేదు. 'మహానటి' సినిమా మాత్రం చూడను. నువ్వు ఇంతగా చెప్పాక, అన్ని అవకతవకలున్న సినిమాని నేనెందుకు చూస్తాను?' అన్నాను.

'మరేం సినిమా చూస్తావు?' అడిగాడు వాడు.

'జెమినీ మొదటి భార్య అలమేలు నా దృష్టిలో అసలైన మహాతల్లి. జెమినీకి ఇతర భార్యలకూ పుట్టినవారిని కూడా ఆమె సొంత తల్లిలాగా ప్రేమగా ఆదరించింది. పెంచింది. జెమినీ ఆగడాలన్నీ మౌనంగా భరించింది. ఆమె జీవితాన్ని 'మహాతల్లి' అని పేరు పెట్టి సినిమా తీస్తే అప్పుడు చూస్తాను.' అన్నాను నవ్వుతూ.

'ఆ ! నీకోసం తీస్తారు. కోట్లు ఖర్చు పెట్టి?' అన్నాడు వాడూ నవ్వుతూ.

'అంత అదృష్టం వాళ్లకు ఉందని నేను భావించడం లేదులే. సావిత్రి జీవితం సినిమా తీస్తారుగాని అలమేలు జీవితం ఎవరు తీస్తారు? తీసినా ఎవరు చూస్తారు? ఆమెకు గ్లామర్ లేదుగా! ఆమె జీవితంలో మసాలా లేదు. మనవాళ్ళకు కావలసింది మసాలానే. మాయలోకం. మాయ మనుషులు. మనమేం చెయ్యలేం. ఈ కుళ్ళు లోకం ఇంతే. ఇక్కడ నిజం అబద్దం అయిపోతుంది. అబద్దం నిజంగా చెలామణీ అవుతుంది. ఇదింతే. ఈ చెత్త లోకాన్ని మనం మార్చలేం.' అన్నా విసుగ్గా.

టాపిక్ డైవర్ట్ అవుతున్న విషయాన్ని వాడు కనిపెట్టి తెలివిగా - 'సరే. వస్తా.' అంటూ బయల్దేరాడు.

'ఓకె. బై' అన్నా నేను ఆవులిస్తూ.

2, జూన్ 2018, శనివారం

శవసాధన ఎలా చెయ్యాలి?

ప్రపంచంలో రకరకాలైన మనుషులుంటారు. వాళ్లకు వింతవింత కోరికలుంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నిజం చెప్పాలంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నన్ని వెర్రిపోకడలు మామూలు ప్రపంచంలో కూడా ఉండవు. ఇంకో నిజం ఏంటంటే, ఆధ్యాత్మికంలోకి అడుగుపెట్టినవారిలో ఎక్కువమంది 'మెంటల్ పేషంట్లు' ఉంటారు. అంటే, మానసిక స్థిరత్వం లేనివాళ్ళే ఉంటారు. వీరిలో చాలామంది హిస్టీరియాతో బాధపడేవాళ్ళు ఉంటారు. అలాగే, మాయలు మంత్రాలూ మహిమలు ఆశించేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళు నమ్మినదే నిజమని ఇలాంటి వాళ్ళు భ్రమిస్తారు గాని, మనం నిజం చెబితే వీళ్ళకు రుచించదు.

అలాంటి వాళ్ళలో ఒకాయన నాకీ మధ్యన ఫోన్ చేశాడు.

పరిచయాలయ్యాక అసలు విషయం మీద సంభాషణ మొదలైంది.

'మీ 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం నేను చదివాను. అందులో ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది. దాని గురించి వివరాలు నాకు కావాలి.' అన్నాడు.

'చెప్పండి' అన్నాను.

'అందులో ఒకచోట మీరు ' శివరాత్రి సమయంలో శవసాధన చేశానని వ్రాశారు'. గుర్తుందా?' అన్నాడు.

'నేను వ్రాసినవి నేనే మర్చిపోయే స్థితికి ఇంకా రాలేదు. ఇకముందు వస్తానేమో చెప్పలేను' అన్నాను.

'అదే అడుగుతున్నాను. శవసాధన ఎలా చెయ్యాలో ఆ వివరాలు నాకు కావాలి.' అన్నాడు.

'ఆ పుస్తకం మొత్తం మీద మీకు నచ్చింది అదొక్కటేనా?' అడిగాను.

'అంటే, మిగిలినవి కూడా నచ్చాయి. కానీ అది నేను చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను' అన్నాడు.

'ఎందుకో?' అన్నాను.

'నాకు శక్తులు కావాలి. ఆ సాధనతో శక్తులు త్వరగా వస్తాయని విన్నాను.' అన్నాడు.

'మీకింతకు ముందు ఏదైనా మంత్రసాధన అలవాటుందా?' అడిగాను.

'ఉంది. కొన్ని కోయమంత్రాలు కొంతమంది దగ్గర నేర్చుకున్నాను.' అన్నాడు.

హైదరాబాద్ లో, తెలంగాణాలో ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. సమ్మక్క సారలక్క కోయలు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరిని నమ్మి కొంతమంది ఇలా తయారౌతూ ఉంటారు.  వీళ్ళకు చీప్ ట్రిక్స్ కావాలిగాని జీవితంలో ఔన్నత్యాన్ని ఇచ్చే నిజమైన మంత్రసాధనను వీళ్ళు ఆచరించలేరు.

'సరే ! నేర్పిస్తాను. కానీ ఒక్క కండిషన్'. అన్నాను.

'ఏంటో చెప్పండి'.

'శవాన్ని మీరే తెచ్చుకోవాలి' అన్నాను.

'అదే సమస్యగా ఉంది. బయటకు తెలిస్తే పోలీస్ కేసౌతుంది. అందుకే భయపడుతున్నాం' అన్నాడు.

'మరెలా చేద్దామని మీ ఉద్దేశ్యం?' అన్నాను.

'మీరే అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా? డబ్బు మేం ఇచ్చేస్తాం' అన్నాడు.

'ఓకె అలాగే. ఇరవై లక్షలౌతుంది.' అన్నా.

'అమ్మో. అంతా? అంతెందుకు? ఇక్కడ మాకు తెల్సిన మెడికల్ కాలేజివాళ్ళున్నారు. ఒక లక్షలో పని అయిపోతుందని వాళ్ళు చెప్పారు' అన్నాడు.

'మరైతే అక్కడే చేసుకోండి. నా దగ్గరకు రావడం ఎందుకు?' అన్నా.

'అంటే. వాళ్ళ ల్యాబ్ కు మనం వెళ్ళాలి. బయటకు ఇవ్వరు. సాధన ఎలా చెయ్యాలో మాకు తెలియదు కదా? పోనీ మీరు హైదరాబాద్ వస్తారా? ఖర్చులన్నీ మేం పెట్టుకుంటాం?' అన్నాడు.

'సాధన అనేది ల్యాబుల్లో, హోటళ్ళలో, సినిమా హాళ్ళల్లో చేసేది కాదు. దానికి కొన్ని కొన్ని స్థలాలుంటాయి. వాటిల్లోనే చెయ్యాలి' అన్నాను.

'పోనీ మీరెలా చేసారో చెప్పండి. అదే పద్ధతిలో మేమూ వెళతాం' అన్నాడు.

'నేను చేసినట్లు మీరు చెయ్యలేరు. పైగా, నేనెలా చేశానో మీకు చెప్పవలసిన పని నాకు లేదు. అది మీకనవసరం.' అన్నాను.

'పోనీ ఎలా చెయ్యాలో మమ్మల్ని గైడ్ చెయ్యండి. ప్లీజ్. మీరు శవాన్ని ఎక్కడనుంచి తెచ్చుకున్నారు? చెప్పండి. మేమూ అక్కడే ట్రై చేస్తాం.' అడిగాడు.

'నేనే పెద్ద శవాన్ని. ఇంకో శవం నాకెందుకు?' అన్నాను.

అతను షాకయ్యాడు.

'అదేంటి సార్. అలాగంటారు. మాకు తెలీకే కదా అడుగుతున్నాం. దయచేసి మాకర్ధంయ్యేలా చెప్పండి ప్లీజ్' - మళ్ళీ అడిగాడు.

పాపం ఇంతగా భంగపడుతున్నాడని ఇలా వివరించి చెప్పాను.

'చూడండి. శవసాధన అంటే అదేదో బూచి కాదు. చాలా సింపుల్. చెప్తా వినండి. మనమందరమూ శవాలమే. ప్రాణం లేని మనుషులే శవాలు కారు. మనమూ శవాలమే. మనం బ్రతికున్న శవాలం. వాళ్ళు చచ్చిన శవాలు అంతే తేడా. కనుక మీరు చేసే ఏ రకమైన సాధనైనా శవసాధన క్రిందకే వస్తుంది. మీరు రోజూ చేసే పూజ కూడా శవపూజే. అంటే శవానికి చేస్తున్న పూజ కాదు. శవం చేస్తున్న పూజ. ఎందుకంటే మనలో ఎవరిలోనూ నిజమైన దైవచైతన్యం ఉండదు కనుక మనం జీవంలేని కట్టెలతో సమానమే.మనం చేసేది శవపూజే. శివపూజ కాదు. ఈ ప్రపంచంలో ఒక్క జ్ఞాని మాత్రమే జీవంతో ఉన్నవాడు. మిగతా అందరూ శవాలే. ఎందుకంటే అతనిలో మాత్రమే దివ్యచైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. మనందరిలో కుళ్ళూ కుత్సితాలూ కోరికలూ తప్ప ఇంకేం ఉండవు. కనుక మనం శవాలమే. మనం చేసే ఏ సాధనైనా శవసాధనే.

కనుక ఇంతమాత్రం దానికోసం, అర్ధరాత్రి పూట మెడికల్ ల్యాబ్ లకు వెళ్లి, శవాలను తెచ్చుకోవడం, ఆ క్రమంలో పోలీసులకు దొరికిపోవడం ఇలాంటి చెత్త పనులు చెయ్యకండి. అవి నేరాలు. సాధకులు నేరస్తులుగా మారకూడదు. నీతిగా బ్రతకాలి.

శవసాధన కోసం వేరే శవం అక్కర్లేదు. నువ్వే ఒక శవానివి. నువ్వు చేసే ఏ సాధనైనా శవసాధనే. ఇదే నా మార్గం. కనుక మీరు నా దగ్గరకు రానవసరం లేదు. శవాన్ని తెచ్చుకోనవసరం లేదు. మీరున్నచోటే శవంలా కళ్ళుమూసుకుని కూచోండి. మీ మనస్సుకూ, మీ రాగద్వేషాలకూ, మీ అసూయకూ, మీ భయాలకూ, మీ కుళ్ళు మనస్తత్వాలకూ అతీతంగా వెళ్ళండి. చలనం లేని ఒక శవంగా మారండి. అదే శవసాధన.' అన్నాను నవ్వుతూ.

'అదేంటి సార్. కొత్తగా ఉండే ఈ కాన్సెప్ట్?' అన్నాడు.

'కొత్తదేమీ కాదు. పాతదే. మీకు తెలియదు అంతే. ఇదే అసలైన తంత్రం. నువ్వే శవంలా మారాలి. అంటే నీ ఆలోచనలు ఆగిపోవాలి. నీ శ్వాస ఆగిపోవాలి. నీ గుండె కొట్టుకోవడం ఆగిపోవాలి. నువ్వు సమాధి స్థితిలోకి ప్రవేశించాలి. అంటే ఏమిటి? నువ్వే ఒక శవంలా మారాలి. అదే నిజమైన శవసాధన' అన్నాను.

'మాక్కావాల్సింది ఇది కాదు సార్. శవంతో చేసే సాధన మాక్కావాలి' అన్నాడతను.

'సరే అలాగే. వెతుక్కోండి. తెలంగాణా అడవుల్లో మీక్కావాల్సిన అనాగరిక కొండజాతి మంత్రగాళ్ళు దొరుకుతారు. మీకు బాగా డబ్బులు వదిలిస్తారు. వదిలించుకుని మోసపోయే ఖర్మ మీకుంటే నేనేం చెయ్యగలను. గో అహెడ్'. అన్నాను.

'ధాంక్స్' అని పోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి.

మంచి చెబితే ఎవరు వింటారు? భ్రమల్లో బ్రతికేవారికి సత్యం ఎలా అర్ధమౌతుంది? ఏవో సినిమాలు చూచి, లేదా ఏవో పుస్తకాలు చదివి. లేదా ఎవరో చెప్పిన మాయమాటలు విని ఇలాంటివాళ్ళు ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. సత్యం చెబితే మాత్రం ఎవరూ నమ్మరు. ఈ లోకం ఇంతే.

ఇలాంటి వాళ్ళతో మనకనవసరం. మన దారిలో నడిచే వాళ్ళే మనకు కావాలిగాని ఇలాంటి చవకబారు 'మాస్' గాళ్ళు మనకక్కర్లేదు.

'గుడ్ రిడెన్స్' అనుకున్నా.

1, జూన్ 2018, శుక్రవారం

ప్రేమకోసం...

జీవితం నాకెంతో మందిని
పరిచయం చేసింది
ఎన్నో ముంగిళ్ళలో నాచేత
కాలు మోపించింది

ప్రతి కళ్ళలోనూ కళ్ళు కలిపాను
ప్రతి ముఖంలోకీ తొంగిచూచాను
ప్రతి హృదయంలోకీ అడుగుపెట్టాను
పిచ్చిగా ఒకేదానికోసం జీవితమంతా వెదికాను
దేనికోసమో తెలుసా? ప్రేమకోసం !

కానీ ఏమైందో తెలుసా?

ప్రతిచోటా స్వార్ధమే పలకరించింది
ఎక్కడైనా వ్యాపారమే ఎదురొచ్చింది
కొన్ని చోట్ల కోరిక చెయ్యిసాచింది
కొన్ని చోట్ల మోసం కొలువుదీరింది
కానీ, ఎక్కడైనా చీకటే వెక్కిరించింది
ప్రేమవెలుగు మాత్రం ఎక్కడా దొరకలేదు

ప్రతి పుష్కరిణీ
ఒక వైతరణే అని అర్ధమైంది
ప్రతి కోవెలా
ఒక వెలయాలి లోగిలే అనిపించింది
ప్రతి బంధమూ
ఒక ప్రతిబంధకమే అని తెలిసింది
ప్రతి స్నేహమూ
ఒక మోసంతోనే ముగిసింది

అమృతభాండం అనుకున్నది
విషపు కుండని అర్ధమైంది
అమాయకులనుకున్నవారు
అమానుషంగా ప్రవర్తించారు

నేను నమ్మిన ప్రతివారూ
నన్ను వెన్నుపోటు పొడిచారు
నా ప్రేమను రుచి చూచిన ప్రతివారూ
నా ముఖాన తుపుక్కున ఉమిశారు

అయినా నా ఆశ చావలేదు
అయినా నా అన్వేషణ ఆగలేదు
అయినా నా నమ్మకం సడలిపోలేదు
అయినా నా విశ్వాసం వీగిపోలేదు

ప్రపంచంపైనా ప్రకృతిపైనా
నా ప్రేమ సడలిపోలేదు
మనిషి మీదా దైవం మీదా
నా నమ్మకం వడలిపోలేదు

ఏదో ఒక గుండెలోనైనా
ఆ జీవం ఉండకపోతుందా?
ఏదో ఒక ఇంటిలోనైనా
ఆ వెలుగు కన్పించకపోతుందా?
ఏదో ఒక మనిషిలోనైనా
ఆ మానవత్వం మెరవకపోతుందా?
ఏదో ఒక ఆత్మలోంచైనా
ఆ సౌందర్యం కురవకపోతుందా?

అని ఇంటింటికీ తిరుగుతున్నాను
వీధి వీధీ గాలిస్తున్నాను
మనిషి మనిషినీ జల్లెడ పడుతున్నాను
లోకపు శూన్యనగరాలలో
ఒంటరిగా వెదుకుతున్నాను

ఈ ప్రయత్నంలో కూలిపోతాను గాని
మురికి లోగిళ్ళలో విశ్రాంతి కోరను
ఈ వేదనలో కాలిపోతాను గాని
వెకిలి కౌగిళ్ళలో సేదతీరను

ఇలా తిరుగుతూనే ఉంటాను
నేను కోరుతున్నది నాకు దొరికేదాకా
ఇలా మరిగిపోతూనే ఉంటాను
నా గుండె వెలుగు ప్రతిబింబం
ఒక్కరిలోనైనా నాకు కన్పించేదాకా...