Everything is real, because the seer is real

16, అక్టోబర్ 2017, సోమవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 9

సెప్టెంబర్ 03 BC నుండి నవంబర్ 03 BC వరకూ మళ్ళీ మార్చ్ 02 BC నుండి ఏప్రిల్ 02 BC వరకూ శనిచంద్ర యోగాలున్న దాదాపు పన్నెండు జాతకాలను పరిశీలించడం జరిగింది.

వాటిల్లో మచ్చుకు కొన్ని తేదీలు ఇక్కడ ఇస్తున్నాను.

30-10-03 BC, 4-11-03 BC, 9-11-03 BC, 18-11-03 BC, 17-3-02 BC, 21-3-02 BC, 27-3-02 BC, 18-4-02 BC

ఈ జాతకాలలో దేనికీ జీసస్ జీవితంలోని ఘట్టాలతో దశలు సరిపోవడం లేదు. కనుక వీటన్నిటినీ తిరస్కరించాను. ఆ విశ్లేషణ అంతా ఇక్కడ ఇచ్చి జ్యోతిష్యం రానివారికి బోరు కొట్టించడం భావ్యం కాదు గనుక అదంతా ఇక్కడ వ్రాయడం లేదు.

ఇకపోతే, ఒకవేళ లూకా సువార్త వ్రాయడంలో సెయింట్ లూకా అనేవాడు పొరపాటు పడ్డాడేమో అనే సందేహం కూడా మనకు కలగవచ్చు. కనుక లోకం నమ్ముతున్నట్లుగా డిసెంబర్ 25 అనేదే జీసస్ జనన తేదీనా? అనే సందేహ నివృత్తి కోసం 03 BC నుంచి 01 BC వరకూ మూడేళ్ళూ ఆ తేదీనాటి జాతకాలను జల్లెడ పట్టడం జరిగింది. ఎందుకంటే - ఒక విషయాన్ని నిర్ధారించే ముందు అన్ని కోణాలనుంచీ దానిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది గనుక.

మొదటగా 25-12-03 BC నాటి జాతకాన్ని గమనిద్దాం. ఈ జాతకంలో పన్నెండేళ్ళకు రాహు/రాహు దశ నడిచింది. రాహువు పంచమంలో స్థిరరాశిలో ఉన్నది గనుక missing years సరిపోవడం లేదు.  ముప్పై ఏళ్ళ వయస్సులో గురు/శని దశ నడిచింది. వీరి స్థితిని బట్టి గమనిస్తే స్వదేశానికి తిరిగివచ్చే సూచనలేమీ కనిపించడం లేదు. అలాగే ముప్పై మూడేళ్ళ వయస్సులో నడిచిన గురు/బుధ దశలో కూడా శిలువ శిక్షకు గురయ్యే సూచనలు లేవు. కనుక ఈ సమయం కరెక్ట్ కాదు.

తర్వాత 25-12-02 BC నాటి జాతకాన్ని గమనిద్దాం. ఈ జాతకంలో గురువు సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చేశాడు. కనుక Star of Bethlehem ఆకాశంలో ఉండదు. పైగా, ఈ జాతకంలో పన్నెండేళ్ళ ప్రాంతంలో రాహు/రాహు దశ నడచినప్పటికీ, దూరదేశ ప్రయాణాన్ని సూచించడం లేదు గనుక సరిపోలేదు. ముప్పై మూడేళ్ళ వయసులో గురు/శని దశ నడిచింది. శిలువ శిక్ష కనిపించడం లేదు. కనుక ఈ జాతకం కూడా సరిపోలేదు. ఇకపోతే, 25-12-01 BC నాటి జాతకాన్ని చూడనవసరం లేదు. ఎందుకంటే గురువుగారు అప్పటికి తులా రాశిలోకి వచ్చేస్తున్నాడు గనుక అసలు చూడనవసరం లేదు.

కనుక ఇప్పటిదాకా జల్లెడ పట్టిన జాతకాలలో 22-10-03 BC తేదీనాటి జాతకమే జీసస్ జీవిత ఘట్టాలతో సరిపోతున్నందున ఇదే జీసస్ అసలైన తేదీగా ప్రస్తుతానికి అనుకుందాం..

అయితే ఇక్కడ ఒక విషయం ధ్రువీకరించబడుతున్నది. అదేమంటే - 03 BC నుంచి 01 BC వరకూ మనం జల్లెడ పట్టిన అనేక జాతకాలలో ఎక్కడా కూడా ఒక అవతార పురుషునికి ఉండవలసిన దివ్య లక్షణాలున్న జాతకం దొరకడం లేదు. ఒక అవతార పురుషుని జాతకం ఎలా ఉంటుందో మనకు తెలుసు. దానికి రుజువులుగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీరామకృష్ణుల జాతకాలు మనకు ఉన్నాయి. వాటిల్లో ఉండే గ్రహస్థితులు మనకు తెలుసు.


అవేంటి?

జాతకంలోని ఎక్కువ గ్రహాలు ఉచ్ఛస్థితులలో బలంగా ఉండాలి. రాహుకేతువులు మంచి స్థానాలలో ఉండాలి. తిధి వార నక్షత్రాలు శుభప్రదాలై ఉండాలి. మహత్తరమైన దివ్యశక్తులను సూచించే ఆధ్యాత్మిక యోగాలు ఆ జాతకాలలో కనిపించాలి. అప్పుడే అది ఒక దివ్యపురుషుని జాతకమని మనకు నిర్ధారణ అవుతుంది. ఈ నిర్ధారణకు లోకం ఒప్పుదలతో లోకం మెప్పుతో సంబంధం లేదు. ఎందుకంటే, లోకం నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు అబద్దాలు చెప్పవు గనుక.

కానీ 03 BC నుంచి 01 BC లోపల అలాంటి గ్రహస్థితులు - star of bethlehem అనేది సింహరాశిలో ఏర్పడిన సంవత్సర కాలంలో - ఎక్కడా కనిపించడం లేదు. కనుక జీసస్ కు, మతబోధకులూ, వారిని గుడ్డిగా నమ్ముతున్న లోకమూ ఆపాదించిన దైవత్వమే తప్ప నిజానికి ఆయనకు అంతటి స్థాయి లేదని ఈ ఎనాలిసిస్ చెబుతున్నది.

ఆయన మహా అయితే ఒక సెయింట్ అయి ఉండవచ్చు గాక, కానీ క్రైస్తవం చెబుతున్న స్థాయిలో ఏకైక లోకరక్షకుడని, ఏకైక దైవకుమారుడని చెప్పేంత స్థాయిలో మాత్రం ఆయన జాతకం లేదు.అయితే - Star of Bethlehem అనేది మనం అనుకుంటున్నట్లుగా సింహరాశిలో గురువుగారున్నపుడు ఏర్పడిన గ్రహస్థితి కాకపోతే మాత్రం, BC 3 నుంచి BC 1 లోపల ఉన్న 36 నెలలలో ఒకేఒక్క నెలలో అలాంటి ఒక మంచి గ్రహస్థితి వస్తుంది. దానిగురించి తర్వాతి పోస్ట్ లో వ్రాస్తాను.

ఇప్పుడు జ్యోతిష్య విద్యార్ధులకు కొన్ని అనుమానాలు రావచ్చు. నా శిష్యులే కొందరు ఈ అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. వాటికి సమాధానాలు ఇక్కడ ఇస్తున్నాను.


జీసస్ - సింహలగ్నం 

---------------------------
చర్చి బోధకులు మనల్ని నమ్మిస్తున్న విషయాలను బట్టి, జీసస్ చాలా అమాయకుడనీ, చాలా మెతక స్వభావుడనీ, గంగిగోవు లాంటి వాడనీ చెబుతుంటారు. ఇలాంటి మనస్తత్వంతో ఏ కర్కాటక లగ్నమో, ఏ మీనలగ్నమో సరిపోతుందిగాని, దూకుడుగా ఉండే సింహలగ్నం ఎలా సరిపోతుంది? అన్నది మొదటి ప్రశ్న.

దీనికి నా జవాబు

----------------------
లోకం నేడు నమ్ముతున్నట్లుగా జీసస్ అంత మృదుస్వభావి ఏమీ కాడు. దీనికి రుజువులు బైబిల్లోనే ఉన్నాయి. పదకొండు పన్నెండు ఏళ్ళ చిన్న వయసులోనే యెహోవా ఆలయంలో మత బోధకులతో ఆయన గొడవపడి వాళ్ళకు ఎదురుతిరిగి ప్రశ్నించినట్లు బైబిల్ చెబుతుంది. అంటే చిన్న వయస్సు నుంచే ఆయనలో ఒక నిరసనకారుడూ ఒక తిరుగుబాటు దారుడూ ఉన్నాడని తెలుస్తున్నది. పది పన్నెండేళ్ళ చిన్నపిల్లవాడు అలా పెద్దవాళ్ళకు నలుగురిలో ఎదురుతిరిగి గొడవపెట్టుకోవడం అనేది మృదుస్వభావానికి సూచన కాదు.

అదే విధంగా - 18 missing years తర్వాత తిరిగి ముప్పై ఏళ్ళ వయస్సులో తన దేశానికి వచ్చినపుడు, ఒక కొరడానో లేకపోతే ఒక కర్రనో తీసుకుని, అదే యెహోవా ఆలయంలో ఉన్న దుకాణదారులనూ, వస్తువులు అమ్ముకునే వాళ్ళనూ, కొట్టుకుంటూ అక్కడనుంచి బయటకు తరిమినట్లు బైబిలే చెబుతున్నది.కనుక ఆయనలో కొన్ని తీవ్రవాద లక్షణాలున్నట్లు మనకు బైబుల్ నుంచే తెలుస్తున్నది. ఎందుకంటే - దాదాపు ఇరవైఏళ్ళ తర్వాత కూడా ఆయనలో కోపం తగ్గలేదని, అక్కడ యూదు సమాజంలో ఎప్పటినుంచో ఉన్న సిస్టంను మార్చాలని ఆయన తీవ్రంగా ప్రయత్నించాడని ఈ సంఘటన నిరూపిస్తున్నది.

పైగా, తను చెబుతున్న విషయాలను అర్ధం చేసుకోలేక పోతున్న తన శిష్యులను దద్దమ్మలని, మట్టిబుర్రలని, పనికిమాలిన వారని ఆయన తిట్టినట్లు బైబిలే చెబుతున్నది. ఇంకా మనం గమనిస్తే - తనను రోమన్ సైనికులకు పట్టిచ్చిన జూడాస్ ఇస్కారియేట్ అనే తన శిష్యుడిని ఉద్దేశించి - 'వాడసలు ఎందుకు పుట్టాడు? అలాంటి వెధవ అసలు పుట్టకపోయి ఉంటే ఎంతో బాగుండేది.' అని ఆయన తిట్టినట్లు బైబిలే చెబుతున్నది.

కనుక లోకం నేడు నమ్ముతున్నట్లు ఆయనది సాఫ్ట్ నేచర్ ఏమీ కాదు. ఇలాంటి తిట్లు తిట్టే ఆయన, కర్రతో జనాన్ని తరిమి కొట్టే ఆయన, శాంతస్వభావి అంటే ఎలా నమ్మడం??

ఆయనది సాఫ్ట్ నేచరే అయితే, యూదులు అప్పటిదాకా నమ్ముతున్న యెహోవా మతానికి పూర్తిగా విరుద్ధములైన బోధలను వాళ్లకు చేసి, వారితో గొడవ పడి, శిలువ వరకూ తెచ్చుకునేవాడే కాడు. శాంతిగా మౌనంగా ఉండి అదే సమాజంలో తన జీవితాన్ని గడిపేవాడు. కాని జీసస్ అలా చెయ్యలేదు గనుకా, ఒక విప్లవకారుడి ముద్ర వేయించుకుని, తన చుట్టూ ఒక గ్రూపును తయారు చేసుకుని, మతాధికారులకు రాజుకు కూడా 'ఇక్కడేదో విప్లవం రాబోతున్నది' అన్న అనుమానం కలిగే స్థాయివరకూ విషయాన్ని తీసుకెళ్ళాడు గనుకా, ఆయనది సాఫ్ట్ నేచర్ కాదని మనకు అర్ధమౌతున్నది.


పైగా, ఆయన ఎప్పుడు చూచినా గడ్డం పెంచుకుని ఉన్నట్లు మనం అనేక చిత్రాలలో చూస్తాము. గడ్డం పెంచేవారి జాతకాలలో సింహరాశికి గానీ, మేషరాశికి గానీ తప్పకుండా సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రెంటికీ గడ్డాలు ఉంటాయి గనుక. 


ఇంకో విషయం ఏమంటే - జీసస్ నవ్వగా ఎప్పుడూ ఎవరూ చూడలేదని బైబిల్ చెబుతున్నది. ఆయన ఎప్పుడు చూచినా గంభీరంగా, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆలోచిస్తూ ఉండేవాడు. అసలు నవ్వేవాడు కాదు. ఇది సింహరాశి లక్షణమే గనుక ఈయనది సింహలగ్నం కావడానికి అభ్యంతరం  ఏమీ ఉండకూడదు.


పైగా, Lion of Judah (యూదు సింహం) అనే సింబల్ తో ఉన్న లింక్ ప్రకారం ఈయనది సింహలగ్నం కావడానికే ఎక్కువ అవకాశం ఉన్నది. అంతేగాని BV Raman గారితో సహా ఎందఱో జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెప్పినట్లు ఈయనది మకరలగ్నమో లేదా మీనలగ్నమో కాకపోవచ్చని అదే జ్యోతిష్యశాస్త్రాన్ని బట్టి నేననుకుంటున్నాను.


మరి మీరు చెప్పినట్లు సెప్టెంబర్ లో జీసస్ పుడితే, డిసెంబర్ 25 అనేది జీసస్ జననతేదీగా ఎలా ప్రచారంలోకి వచ్చింది? అని ఇంకో సందేహం రావచ్చు.


జీసస్ చనిపోయాక దాదాపు మూడు వందల సంవత్సరాల వరకూ అతనెవరో ఎవరికీ తెలీదు. ఇంతకు ముందే చెప్పినట్లుగా, ఆయన బ్రతికున్న సమయంలో ఆయనేమీ ప్రస్తిద్ధ వ్యక్తి కాడు. బానిసలైన యూదులలో పుట్టిన ఒక అనామకుడు మాత్రమే. మూడో శతాబ్దంలో మాత్రమే క్రైస్తవం అనేది ఒక మతంగా అంగీకరించబడి డిసెంబర్ 25 అనేది ఆయన పుట్టినరోజుగా జరుపుకోవడం మొదలైంది. దీనికి కారణం ఏమంటే - డిసెంబర్లో వచ్చే Festival of Lights అనే దానినే రోమన్లు జీసస్ తో ముడి పెట్టి క్రిస్మస్ గా జరుపుకోవడం మొదలుపెట్టారు.


అంటే - జీసస్ కంటే ఎంతో ముందే ఈ డిసెంబర్ 25 ప్రాంతంలో వచ్చే festival of lights అనబడే ఈ పండుగ రోమన్ కల్చర్ లో ఉన్నది. దీనిని వాళ్ళు రోమన్ కల్చర్ కంటే ఎంతో ముందటిదైన వైదిక సంస్కృతి నుంచి స్వీకరించి వాడుతున్నారు. దీనినే మన పండుగలలో "వైకుంఠ ఏకాదశి" అని పిలుస్తాము. ఈ వైకుంఠ ఏకాదశికీ మకర సంక్రాంతికీ సంబంధం ఉన్నది. ఈ సబ్జెక్ట్ మీద గతంలో వివరంగా ఒక పోస్ట్ వ్రాశాను. ఈనాటికీ మనకు డిసెంబర్లో అదే సమయంలో "వైకుంఠ ఏకాదశి" అనేది వస్తుంది. జనవరిలో 'మకర సంక్రాంతి' వస్తుంది. దీనినే రోమన్లు మొదలైన పాశ్చాత్య జాతులు Festival of Lights అనే పేరుతో జరుపుకునేవారు.


ఈ పండుగకూ ఖగోళ శాస్త్రానికీ అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే - ప్రాచీన కాలపు పండుగలకూ సూర్యుని గమనం ఆధారంగా ప్రకృతిలో వచ్చే మార్పులకూ లేదా కొన్ని ప్రత్యేక సంఘటనలకూ సంబంధం ఉండేది. కారణం ఏమంటే - పాతకాలంలో అన్ని దేశాలలోనూ సూర్యుడే దైవంగా కొలవబడేవాడు. కనుక సూర్యగమనం ఆధారంగా వచ్చే ప్రత్యేకమైన ప్రకృతి ఘట్టాలున్న రోజులనే ప్రాచీనులు పండుగలుగా జరుపుకునేవారు. అంతేగాని నేటి మనలాగా, కొందరు వ్యక్తుల జన్మదినాలను పండుగలుగా జరుపుకునేవారు కారు. ఆరోజులలో ప్రకృతికే విలువగాని మనుషులకు కాదు. గమనించండి.

కాబట్టి డిసెంబర్ 25 అనేది జీసస్ అసలు జనన తేదీకాదు. ఈ విషయాన్ని పాశ్చాత్యులు కూడా ఈనాడు నమ్ముతూ Pagan culture నుంచి ఈ తేదీ దిగుమతి చేసుకోబడిందని, ఇది జీసస్ పుట్టిన తేదీ కాదని అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని జ్యోతిష్యం శాస్త్రం కూడా నిరూపిస్తున్నది. ఎలాగో ఈ సీరీస్ లో నేను వివరించాను.


కనుక జీసస్ అసలు జనన తేదీ సెప్టెంబర్ 22 - 03 BC అని ప్రస్తుతానికి నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి వెనుక ఉన్న లాజిక్ నూ రీజన్ నూ ఈ సీరీస్ లో ఉంచాను. కానీ మరి లోకమంతా డిసెంబర్ 25 న ఆ పండుగను జరుపుకుంటున్నది. ఇదేంటి?


మాయ అంటే ఇదేగా మరి !! ఇంకో విధంగా చెప్పాలంటే సైతాన్ ప్రభావం అంటే ఇదే !! ఎందుకంటే మాయకే మరోపేరు సైతాన్ కనుక !!


అయినా, క్రిస్మస్ పేరుతో లోకానికి కావలసింది పార్టీలూ, సరదాలూ, తాగుళ్ళూ తందనాలూ, ఆ పేరుతో జరిగే మిలియన్ల డాలర్ల వ్యాపారాలే గానీ, అసలు జీసస్ ఎవరికి కావాలి? ఆయన చెప్పిన అసలైన బోధలెవరికి కావాలి? అన్ని పెడసరి మతాల లాగే, క్రైస్తవం కూడా మనుషుల అజ్ఞానం మీదా  అమాయకత్వం మీదా జరిగే ఒక పెద్ద బిజినెస్. అంతే !!


(ఇంకా ఉంది)