Everything is real, because the seer is real

19, అక్టోబర్ 2017, గురువారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 11

27-4-03 BC నాటి జాతకాన్ని పరిశీలిద్దాం. ఆ రోజున వైశాఖపౌర్ణమి అయింది. ఇది బౌద్ధంలో చాలా ముఖ్యమైన రోజు. బుద్ధమతాన్ని అధ్యయనం చేసిన జీసస్ కు ఈ తిధితో సంబంధం ఉండటం సమంజసమే. పైగా ఇది చాలా పర్వదినం కూడా. కనుక ఈ రోజున జీసస్ పుట్టే అవకాశాలున్నాయేమో గమనిద్దాం.

బైబిల్లో గనుక మనం చూస్తే, జీసస్ పుట్టిన రోజున పౌర్ణమి అనిగానీ అమావాస్య అనిగానీ లేదా ఇంకో తిధి అనిగానీ ఎక్కడా వ్రాసి లేదు. ఎందుకంటే వారికి అంతటి ఖగోళ పరిజ్ఞానం లేదు. కనుక జీసస్ జీవిత ఘట్టాలు దశలమీదే మనం ఆధారపడాలి.

ఈ జాతకంలో పన్నెండేళ్ళ వయసులో శని - కుజదశ నడిచింది. దూరదేశ సంచార సూచన లేదు. ముప్పై ఏళ్ళ వయసులో బుధ - గురుదశ నడిచింది. స్వదేశానికి తిరిగి వచ్చే సూచనా లేదు. ముప్పై మూడేళ్ళ వయసులో బుధ-శని-శుక్రదశ నడిచింది. శిలువశిక్షకు ఆస్కారం లేదు.కనుక ఈ జాతకాన్ని తిరస్కరించడం జరిగింది.


28-4-03 BC నాటి జాతకాన్ని గమనిద్దాం. ఆ రోజుకూడా పౌర్ణమే అయింది. కానీ నక్షత్రం మారి జ్యేష్టానక్షత్రం అయింది. పన్నెండేళ్ళ వయస్సులో బుధ - గురుదశ నడుస్తూ దూరదేశ సంచారాన్ని సూచిస్తున్నది. ముప్పై ఏళ్ళ వయసులో కుజ- శుక్రదశ నడుస్తూ స్వదేశాగమనాన్ని చూచాయగా సూచిస్తున్నది. శిలువశిక్ష సమయంలో శుక్ర-రాహు -కేతుదశ నడిచింది. ఇది సరిపోవడం లేదు. కనుక ఈ జాతకాన్ని కూడా తిరస్కరించడం జరిగింది.

2-5-03 BC నాటి జాతకాన్ని గమనిద్దాం. ఈ రోజుకు శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ తన ఉచ్చత్వానికి దూరం అవుతున్నాడు గనుక ఇక్కడనుంచీ ముందుకు మనం లెక్కించనవసరం లేదు.

కనుక ఇప్పటివరకూ మనం చూచిన అనేక జాతకాలలో మనకు మూడే మూడు జాతకాలు జీసస్ జీవితంతో దగ్గరగా సరిపోతున్నాయి. వాటిని తులనాత్మక పరిశీలన గావిద్దాం.

1. 17-6-02 BC నాడు నవీన ఖగోళ పరిశోధకుల ప్రకారం సింహరాశిలో వెలుగు కనిపించింది. ఆనాటి జాతకం కూడా జీసస్ జీవిత ఘట్టాలతో సరిపోతున్నది. అయితే - ఈ జాతకంలో కొన్ని లోపాలున్నాయి. అవేంటంటే -

a) ఇది గొప్ప దైవశక్తి ఉన్న జాతకం కాదు.
b) వేసవి కాల జననం అయింది.

2. 22-10-03 BC నాటి జాతకం జీసస్ జనన వివరాలతో చాలా దగ్గరగా సరిపోతున్నది. కానీ ఈ జాతకంలో లోకులు జీసస్ కి ఉన్నదని నమ్ముతున్నంత దైవశక్తి కనిపించడం లేదు. ఒక సాధువు జాతకంలాగా మాత్రమే కనిపిస్తున్నది. ఇది చలికాలానికి దగ్గరలోనే ఉన్నది.

3. 23-4-03 BC ఈ జాతకంలో మాత్రం ఒక దైవశక్తితో నిండి ఉన్న మహనీయుని లక్షణాలు కన్పిస్తున్నాయి. దశలు కూడా జీసస్ జీవిత ఘట్టాలతో సరిపోతున్నాయి. కానీ ఈ జాతకంలో గురువు సింహరాశిలో ఉండడు గనుక Star of Bethlehem ఏర్పడదు. పైగా ఈ జాతకం వేసవి కాలానికి దగ్గరలో ఉన్నది గాని చలికాలానికి దగ్గరలో లేదు.

ఈ విధంగా సరిపోతున్న ఒక్కొక్క జాతకానికీ ఒక్కొక్క లోపం ఉన్నది. కొన్నింటిలో ఒకటిని మించి లోపాలున్నాయి. అన్నింటిలోకీ కలిసిన ఒకే ఒక్క పాయింట్ ఏమంటే - ఇవన్నీ డిసెంబర్ 25 కు దూరంగా ఉన్నాయి.

మనం ఇప్పటివరకూ అనేక కోణాలలో ఈ విషయాన్ని పరిశోధన చేశాం. చారిత్రక పరిశోధకుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. జీసస్ జీవిత సంఘటనలనూ లెక్కలోకి తీసుకున్నాం. ఖగోళ అంశాలనూ గమనించాం. జ్యోతిష్య పరమైన విషయాలనూ చర్చించాం. కానీ ఇవేవీ కూడా ఇదమిద్ధమైన సమాచారాన్ని మనకు అందించడం లేదు. కనుక ఇప్పుడు ఇంకొక పద్ధతిని మనం అనుసరిద్దాం.

ప్రశ్నశాస్త్ర సహాయం
-----------------------------
Prasna Chart 
19-10-2017; 17-09 hours;
Guntur
మనకు చివరకు తేలిన ఈ మూడు జాతకాలూ కూడా జాతకపరంగా ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నతంగా కన్పిస్తున్నాయి.కానీ ఈ మూడింటిలో ఒకటి మాత్రమే సరియైనది అవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రశ్నశాస్త్ర సహాయాన్ని మనం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చిక్కుముడులను ఒక్క ప్రశ్నశాస్త్రమే విప్పగలదు. ఈ పని ఇంక దేనివల్లా కాదు. కనుక ఈ మూడు జాతకాలలో ఏది సరియైనదో తెలుసుకోవడానికి ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం.

లగ్నాన్ని బట్టి చూస్తే మొదటి జాతకపు లగ్నంతో ప్రశ్నలగ్నం సరిపోతున్నందున మొదటిదే సరియైనదని అనిపించవచ్చు కానీ విషయం అంత తేలికగా అర్ధమయ్యేది కాదు. కొంచెం లోతుగా పరిశీలిద్దాం.

1.కాలస్వరూపులైన రాహుకేతువులు మకర కర్కాటక రాశుల ఇరుసులో ఉంటూ ఈ రెంటికీ జీసస్ జాతకంలో ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తున్నారు. కనుక ఈ రెంటిలో ఏదో ఒకటి జీసస్ జాతకంలో లగ్నమై ఉండాలి. మూడో జాతకంలో మాత్రమే మకర లగ్నం అవుతున్నది.

2.శనీశ్వరుడు వృశ్చికరాశిలో ఉండి వృషభరాశిని చూస్తున్నందువల్ల  జీసస్ జాతకంలో ఆయన వృషభరాశిలోగాని వృశ్చికరాశిలోగాని ఉండాలి. వృశ్చికరాశిలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అలాంటప్పుడు జీసస్ జననం ఇంకొక పదిహేనేళ్ళు వెనక్కు పోతుంది. ఇది సాధ్యం కాదు గనుక శనీశ్వరుడు వృషభంలోనే ఉన్నాడని తెలుస్తున్నది. మూడు జాతకాలలోనూ ఇది సరిపోతున్నది.

3. గురువుగారు రాహువుదైన స్వాతీ నక్షత్రంలో ఉన్నందువల్ల ఆ రాహువు కర్కాటకంలో ఉన్నందువల్ల, జీసస్ జాతకంలో గురువుగారు కర్కాటకరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారని తెలుస్తున్నది. కనుక గురువు సింహరాశిలో ఉండాలి అని ఖగోళ పరిశోధకులు అనుకున్న విషయం సరికాదు. ఇది మూడో జాతకంలో మాత్రమే సరిపోతున్నది.

4.శుక్రుడు కన్యారాశిలో నీచలో ఉండి, మీనరాశిని చూస్తున్నందువల్ల జీసస్ జాతకంలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడని తెలుస్తున్నది. ఇదికూడా మూడో జాతకంలోనే సరిపోతుంది. అంతేగాక జీసస్ జననం అందరూ అనుకునేటట్లు డిసెంబర్లో కాకుండా మార్చి - ఏప్రిల్ ప్రాంతాలలో జరిగిందని ఈ యోగం చెబుతున్నది.

5.చంద్రుడు కన్యారాశిలో ఉన్నందువల్ల జీసస్ జాతకంలో కూడా కన్యారాశి అని తెలుస్తున్నది. చంద్రుడు చంద్ర నక్షత్రాలైన రోహిణి, హస్తా, శ్రవణాలలో ఉంటేనే కుజదశ తర్వాత వచ్చే రాహుదశ 18 ఏళ్ళు missing years తో సరిపోయే ప్రక్రియ జరుగుతుంది. కానీ చంద్రుడు వృషభరాశిలో ఉన్న జాతకం మనం పరిశీలించాం. అది సరిపోలేదు. మకరరాశిలో ఉన్న జాతకం కూడా పరిశీలించాం అదీ సరిపోలేదు.  ఈ యోగం కూడా మూడో జాతకంలోనే సరిపోతున్నది. 

6.బుధుడు తులారాశిలో ఉంటూ మేషరాశిని చూస్తున్నందువల్ల జీసస్ జాతకంలో బుధుడు మేషరాశిలో ఉన్నాడని తెలుస్తున్నది. తను చెప్పేదే సరియైనదని మొండిగా వాదిస్తూ అవసరమైతే చావువరకూ కూడా తెచ్చుకునే లక్షణానికి ఈ యోగం సూచిక. ఇది కూడా మూడో జాతకంలోనే సరిపోతున్నది.

7.ప్రశ్నకాల కుజునితో (కన్య) జీసస్ జననకాల కుజుడు (మకరం) కోణస్థితిలో ఉండటం మూడో జాతకంలోనే సరిపోతున్నది. 'కుజవత్ కేతు:' అనే సూత్రం ప్రకారం కూడా జీసస్ జాతకంలో కుజుడు మకరంలోనే ఉండటం సరిపోతున్నది.

8.ప్రశ్నకాల సూర్యుడు, జీసస్ జాతకంలో కూడా అదే శుక్రుని ఇంకొక రాశి అయిన వృషభంలో ఉండటం కూడా మూడో జాతకంలోనే సరిపోతున్నది.

9.ఇవన్నీ గాక, ఒక మహనీయుని జాతకంలో ఉండవలసిన శుభస్థితులు మూడో జాతకంలోనే ఉన్నందువల్లా, మిగతా రెండు జాతకాలలో అవి లేనందువల్లా, ఇన్ని పాయింట్స్ తో కలుస్తూ ప్రశ్నకుండలి మూడో జాతకాన్నే సూచిస్తూ ఉన్నందువల్లా, జీసస్ అసలైన జననతేదీ 23-4-03 BC గా మనం నిర్ధారించుకోవచ్చు.

కనుక 23-4-03 BC వైశాఖ శుక్ల ఏకాదశి నాడు జీసస్ జననం జరిగిందని, ఇదే సత్యమని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచం నమ్మకంతో నాకు పని లేదు. నా నమ్మకం నాది. నా లాజిక్ నాది. చారిత్రిక వాస్తవాలు కూడా నా ఈ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాయి.

శాస్త్రీయంగా తర్కబద్ధంగా ఆలోచించే జ్యోతిశ్శాస్త్ర పరిశోధకులు మూఢనమ్మకాలకు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు దూరంగా ఉండాలి. అప్పుడే సత్యం వారికి దర్సనమిస్తుంది. కానీ ఆ సత్యదర్శనం జరగాలంటే, personal preferences ను పక్కనపెట్టి శాస్త్రం దేనిని సూచిస్తే దానిని ఆమోదించవలసి ఉంటుంది.

ఇన్ని కోణాలలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ, ప్రతిదానినీ అవునా కాదా అని శల్యపరీక్షకు గురిచేస్తూ, నమ్ముతూ, తిరస్కరిస్తూ, ఇప్పటిదాకా మనం చేసిన పని అదేగా మరి !!

(ఇంకా ఉంది)