Our Ashram - A beacon light to the world

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 3

విదేశాలలో కూడా జీసస్ అసలైన జనన తేదీని కనుక్కోవాలని చాలామంది ప్రయత్నించారు. వీరిలో బైబిల్ స్కాలర్స్ కూడా చాలామంది ఉన్నారు. వీరు బైబిల్ ను చాలా మధించి వారికి తోచిన లాజిక్ ఉపయోగించి 'జీసస్ జనన తేదీ' అంటూ కొన్ని తేదీలను రాబట్టారు. అలాంటి ఒక విశ్లేషణను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. ఈ ప్రయత్నంలో, వాళ్ళు చేసిన విశ్లేషణ మొత్తం స్పష్టంగా ఉన్నది గనుక అదంతా నేను మళ్ళీ ఇక్కడ వ్రాయదలుచుకోలేదు. వివరాలకు ఈ లింక్ ను చూడండి.ఈ పోస్ట్ ప్రకారం జీసస్ 29-9-02 BC లో పుట్టాడని వాళ్ళు ఒక థియరీని రాబట్టారు. అయితే 2 BC అనే సంవత్సరం వరకూ వీళ్ళ లాజిక్ కరెక్ట్ గానే పనిచేసింది. అయితే నెలా, తేదీ దగ్గరే వీళ్ళు తప్పుదోవ పట్టారు. దానికి కారణం వాళ్ళు బైబిల్లోని కొన్ని వాక్యాలను, ముఖ్యంగా జక్రయా, ఎలిజబెత్ ల ఉదంతాన్నీ, జాన్ జన్మకూ జీసస్ జన్మకూ మధ్యన ఆర్నెల్లు సమయం ఉందన్న భావననూ యధాతధంగా తీసుకోవడమే కావచ్చు. కానీ ఇంకొందరు మాత్రం జాన్ మరియు జీసస్ ఇద్దరూ దగ్గర దగ్గరగానే పుట్టారు వీరి మధ్య ఆర్నెల్లు తేడా లేదని నమ్ముతున్నారు. అలాంటి క్రైస్తవ వర్గం కూడా ఒకటున్నది. కనుక జాన్ ద బాప్టిస్ట్ అనేవాడు ఏప్రిల్, మే ప్రాంతంలో పుట్టి ఉంటే, జీసస్ జూన్లో పుట్టడానికి అభ్యంతరం ఏమీ ఉండకూడదు. అయితే కాసేపు ఈ థియరీని పక్కన ఉంచి మనం ప్రస్తుతం చూస్తున్న ఈ తేదీని మాత్రమే మన పరిశోధనకు గురిచేద్దాం.

ఇప్పుడు నేను వ్రాస్తున్న ఈ సీరీస్ లో నేనేమీ కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించడం లేదు. ఇప్పటికే కొందరు విదేశీయులు రీసెర్చ్ చేసి ప్రతిపాదించిన కొన్ని తేదీలలో ఏది మన భారతీయ జ్యోతిష్యపరంగా ఒక ఉన్నత దైవాత్ముడైన వ్యక్తి జాతకాన్ని ప్రతిబింబిస్తున్నదో మాత్రమే నేను విశ్లేషణ చెయ్యబోతున్నాను.

ఈ ప్రయత్నాలు చేసిన విదేశీయులు ఎవరికి వారే చాలా చక్కగా విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ లాజిక్కులు మొత్తాన్నీ పరీక్షించే గీటురాయి వారి వద్ద లేదు. అద్భుతమైన ఆ గీటురాయే భారతీయ జ్యోతిష్యశాస్త్రం. ఇది వారికి తెలీక పోవడంతో, వారికి తోచిన విధంగా బైబుల్ లోని వివిధ సందర్భాలలో చెప్పబడిన మాటలను బట్టి వాళ్ళు తమ తమ విశ్లేషణలను చేశారు. రకరకాల తేదీలను జీసస్ జనన తేదీలుగా అనుకున్నారు. అయితే, జీసస్ అంటే వీరికున్న అమితభక్తి వల్ల వాళ్లకు తెలీకుండానే ఈ విశ్లేషణలో అనేక తప్పులు దొర్లాయి. బైబిల్ ను గుడ్డిగా నమ్మే ప్రక్రియలో వాళ్లకు తెలీకుండానే వాళ్ళు అనేక విషయాలలో కాంప్రమైజ్ అయ్యారు. ఈ తప్పులను అన్నింటినీ సరిచెయ్యగల జ్యోతిష్యవిద్య వీరికి తెలీకపోవడం వల్ల, ఈ తియరీలలో ఏది నిజం? ఏది ఉత్త ఊహ? అనేది తేల్చడం వారికి అసాధ్యం అయింది. సరిగ్గా ఈ పనినే నేనిప్పుడు చేస్తున్నాను.

సరే, ఈ నేపధ్యంలో, ప్రస్తుతం 29-9-02 BC తేదీ జాతకం జీసస్ వ్యక్తిత్వంతో, ఆయన జీవిత ఘట్టాలతో సరిపోతుందా లేదా అనేది పరిశీలిద్దాం.

ఈ చార్ట్ లో అర్ధరాత్రి సమయానికి కర్కాటక లగ్నం ఉదయిస్తున్నది. సింహరాశిలో శుక్రుడు ఒక్కడే ఉన్నాడు గాని గురువు కన్యారాశికి వెళ్ళిపోయాడు. కనుక star of Bethlehem సింహరాశిలో కనిపించే అవకాశం లేదు. ఒకవేళ గురువు లేకుండా శుక్రుడు ఒక్కడే సింహరాశిలో ఉన్నా కూడా ఈ star of Bethlehem అనేది అక్కడ ఏర్పడవచ్చు కదా? ఎందుకంటే గురువు కంటే శుక్రుడే కదా బాగా వెలుగుతో మెరిసే గ్రహం? అని వాదన రావచ్చు. అదే నిజమైతే. శుక్రుడు ఏడాదిలో ఒక నెలపాటు సింహరాశిలో ఉంటూనే ఉంటాడు. కనుక ప్రతి ఏడాదీ సింహరాశిలో ఈ star of Bethlehem ఏర్పడుతూనే ఉండాలి. అలా జరగదు గనుక గురువు కూడా సింహరాశిలో ఉన్నాడని మనం భావించవచ్చు. కానీ, గురువు సింహరాశిలో లేడు గనుక ఈ చార్ట్ కు మార్కులు తగ్గిపోతున్నాయి.

అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ వస్తుంది. ప్రతి పన్నెండేళ్ళకూ గురువు సింహరాశిలో ఒక ఏడాదిపాటు ఉంటాడు. ఆ ఏడాదిలో ఒక నెలపాటు శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు గనుక star of Bethlehem అనేది ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కనిపిస్తుందా? అని అనుమానం రావచ్చు. కానీ ప్రతిసారీ గురువూ శుక్రుడూ సింహరాశిలో అదే లాంగిట్యూడ్ మీద ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ star of Bethlehem అనేది సరిగ్గా ఒక star shape లో ఏర్పడక పోవచ్చు. బహుశా జీసస్ పుట్టిన సంవత్సరంలోనే ఇది సరిగ్గా సింహరాశిలో ఉన్న నక్షత్రాలతో ఎలైన్ అయ్యి కరెక్ట్ గా star గా ఏర్పడి ఉండవచ్చు అని మనం ఊహించవచ్చు.

ఈ చార్ట్ ను చూడగానే తెలిసే విషయం ఏమంటే ఇందులో గొప్ప దైవాంశసంభూతుని సూచించే చెప్పుకోదగ్గ యోగాలు ఏవీ లేవు. దీనితో పోలిస్తే మొదటి జాతకమే కాస్త నయంగా ఉన్నది. ఇలా అనిపించడానికి కారణాలు ఇవి ---

1. రాహుకేతువుల చేత లగ్నం కొట్టబడింది. ఇది మంచి సూచన కాదు.

2. తల్లిదండ్రులను సూచించే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ నీచస్థితులలో ఉన్నారు. ఇదీ మంచి సూచన కాదు. జోసెఫ్ మేరీలిద్దరూ ఒక రహస్యాన్ని దాచి ఉండవచ్చు గాక, కానీ వాళ్ళు దుర్మార్గులూ చెడ్డవాళ్ళూ కారు. ఒక మహనీయునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్పకుండా మంచివాళ్లై ఉంటారు. కనుక ఈ జాతకం జీసస్ ది అయ్యే అవకాశం లేదు.

3. పంచమంలో నీచ చంద్రుడూ, పంచమాధిపతి కుజుడు నవాంశలో నీచ స్థితిలో ఉండటమూ ఒక మాంత్రికుడిని సూచిస్తుంది గాని ఒక దైవత్వం ఉన్న వ్యక్తిని సూచించదు.నిజానికి జీసస్ ను యూదులు ఒక మాంత్రికుడిగానే భావించారు. ఇతను ఈజిప్ట్ నుంచి మాయమంత్రాలు నేర్చుకుని తమ మధ్యకు వచ్చి దయ్యాలను వదలించడం, మిరకిల్స్ చెయ్యడం మొదలైన పనులు చేస్తున్నాడని వాళ్ళు నమ్మారు. ఇతని వెనుక ఉన్న శక్తి బెల్జేబూబ్ (సైతాన్) అని వాళ్ళు బాహాటంగానే ఆయన్ను ప్రశ్నించారు. ఈ చార్ట్ లో చంద్రుడు కుజుల పరిస్థితి అలాంటి ఒక మాంత్రికుడిని నిజంగానే సూచిస్తోంది. కానీ జీసస్ ఇలాంటి మాంత్రికుడు కాడు గనుక ఇది జీసస్ జాతకం అయ్యి ఉండదు.

ఇకపోతే దశలను పరిశీలిద్దాం.

పన్నెండేళ్ళ సమయంలో ఈయనకు బుధ - శని దశ జరిగింది. బుధుడు ద్వాదశాధిపతి అయిన మాట వాస్తవమే అయినప్పటికీ అతను నీచసూర్యునితో కలసి స్వంతదేశాన్ని సూచించే చతుర్దంలో ఉండటంతో దూరదేశానికి పోవడమనే సూచన లేదు. అలాగే శని పన్నెండులో ఉన్నప్పటికీ, ఆయనకు నవమస్థానంతో సంబంధం లేదు. కనుక missing years మొదలు కావడం సూచింపబడటం లేదు.

తర్వాత 18 ఏళ్ళూ కేతు దశ, శుక్ర దశలో కొంత భాగం నడిచాయి. ఈ రెండు దశలూ దూరదేశ నివాసాన్ని సూచించడం లేదు. అదే, మొదటి చార్ట్ లో అయితే ఈ సమయంలో రాహుదశ నడిచింది గనుక కరెక్ట్ గా సరిపోతున్నది. కాబట్టి ఈ చార్ట్ missing years ను సరిగ్గా చూపడం లేదు.

ఆ తర్వాత శుక్ర-రాహువులో 30 ఏళ్ళ వయసులో తిరిగి స్వదేశానికి వచ్చినట్లూ శుక్ర - గురువులో శిలువ వెయ్యబడినట్లూ దశలు చూపిస్తున్నాయి. కానీ ఈ శుక్రుడు రెండింట ఉన్నాడు. రాహువు సప్తమంలో ఉంటూ దూరదేశాన్ని సూచిస్తున్నాడు. అలాగే గురువు ఈ లగ్నానికి మంచివాడే కాని మారకుడు కాదు. మరొక యోగకారకుడైన కుజునితో కలసి ఆయుస్థానంలో ఉన్నాడు కనుక శిలువ వెయ్యబడేటంత ఘోరమైన దశను చూపడం లేదు. కనుక ఈ ఈవెంట్స్ ఏవీ ఈ దశలతో సరిపోలేదు.

కనుక ఈ జాతకంలో --

1. దైవత్వ సూచనా లేదు.
2. దశలూ జీవితంలోని ఈవెంట్స్ తో సరిపోవడం లేదు.
3. తల్లిదండ్రుల సూచకులైన సూర్య చంద్రుల పరిస్థితీ బాగా లేదు.
4. మాంత్రిక యోగాలు కనిపిస్తున్నాయి.
పై కారణాలను బట్టి ఇది జీసస్ జాతకం అయ్యే సూచనలు లేవు గనుక ఈ తేదీని తిరస్కరించడం జరుగుతున్నది.

(ఇంకా ఉంది)