“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

17, మార్చి 2017, శుక్రవారం

ధ్యాన లింగం

నా మిత్రులలో జగ్గీ వాసుదేవ్ గారి వీరశిష్యుడు ఒకాయన ఉన్నాడు. మొన్నీ మధ్యనే కోయంబత్తూరు నుంచి తిరిగి వఛ్చిన ఈయన ఖర్మకాలి నాకు ఎదురయ్యాడు. పోనీ ఎదురైనవాడు ఎదురైనట్లు ఊరుకోకుండా మాటలు కదిపాడు. అక్కడే పెద్ద తప్పు చేశాడు.

'మీరూ ఆధ్యాత్మికతేగా? ఒకసారి మా స్వామి ఆశ్రమానికి రాకూడదూ?' అడిగాడు - ఏదో సినిమాకి పోదామా అన్నట్లు తేలికగా.

తెలిసినా తెలీనట్లు -'ఎవరు మీ స్వామి?' అడిగాను.

'అదే జగ్గి వాసుదేవ్ గారు' అన్నాడు.

'ఆయన స్వామెలా అవుతాడు? దశనామీ సంప్రదాయంలో ఎవరిదగ్గరా ఆయన సన్యాసం తీసుకోలేదుగా? సన్యాసం తీసుకుంటే ఆ పేరెందుకు అలా ఉంటుంది?' అడిగాను.

దశనామీ సంప్రదాయం అంటే ఏమిటో ఈయనకు తెలీదు. బిక్కమొహం వేసి - 'అదంతా మాకు తెలీదు. మేము స్వామి అని పిలుచుకుంటాము' అన్నాడు.

'అంటే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అని అన్నట్లా?' అడిగాను.

అవునంటే మళ్ళీ నాతో ఏ తంటా వస్తుందని అనుకున్నాడో ఏమో - ' ఆ సెన్స్ లో కాదు. వేరే రకంగా' - అన్నాడు.

ఈ అర్భకుణ్ణి ఇంకా ఎందుకు టార్చర్ చెయ్యడం అనుకుని జాలేసి - 'సరే మీ ఆశ్రమంలో ఏముంది స్పెషల్?' అడిగాను.

'ధ్యానలింగం అని ఒక పెద్ద లింగం ఉంది. చాలా పవర్ ఫుల్' అన్నాడు.

ఆ మాట వింటూనే నాకు చచ్చే నవ్వొచ్చింది.

'ధ్యాన లింగమా? అంటే ధ్యానానికి లింగమా? లేక లింగానికి ధ్యానమా? ' అడిగాను అమాయకంగా.

నేను ఆట పట్టిస్తున్నానని ఆయనకు  అర్ధమై నామీద పిచ్ఛ కోపం వచ్చింది.

'ఏంటి సార్ శివుడిని అలా అంటారు?' అన్నాడు కోపంగా.

'శివుడిని నేనెందుకంటాను? ఆయనతో నాకేమీ తగాదా లేదు. ధ్యానలింగం అంటే నాకొచ్చిన డౌటు చెప్పాను.అంతే' - అన్నాను. 

'మా స్వామి దానిని చాలా కష్టపడి తయారు చేయించారు. అంతేకాదు దానికి చాలా శక్తి ధారపోశారు' అన్నాడు ఆవేశంలో.

దొరికిపోయావ్ రా బిడ్డా అని మనసులో అనుకుని - 'ఏంటీ శివలింగానికి మీ స్వామి శక్తిని ధారపోశాడా?' అడిగాను.

మనవాడు ఆవేశంలో - 'అవునండి. లేకుంటే దానికి శక్తి ఎక్కడనుంచి వస్తుంది?' అన్నాడు.

'ఇక ఆపు నాయనా ! నేనేదో డౌటు అడిగితేనేమో శివుడిని ఇన్సల్ట్ చేస్తున్నానంటివి. మరి ఒక్క క్షణం కూడా కాక ముందే, శివుడికి మా స్వామి శక్తిని ఇచ్ఛాడని అంటుంటివి? శివుడిని ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారు నువ్వా నేనా?' అడిగాను.

మనవాడు దిమ్మరపోయాడు.

'ఇంతకీ ఒక విషయం చెప్పు. శివుడు మీ స్వామిని సృష్టించాడా లేక మీ స్వామి శివుడిని సృష్టించాడా?' అడిగాను.

ఊరకే గుడ్లప్పగించి చూస్తున్నాడు.పోనీలే కొంచం ఆలోచించుకోనీ అని  నేనూ మౌనంగానే ఉన్నాను.

'అలా కాదు.మీరు ఒక్కసారి వఛ్చి అక్కడ ధ్యానలింగం ఎదురుగా కూచోండి. మీకు శివదర్శనం తప్పకుండా అవుతుంది.' అన్నాడు మాట మారుస్తూ.

ఇలాంటి వాళ్ళందరూ ఇంతే. సమాధానం చెప్పలేనప్పుడు మాట మార్చేస్తూ ఉంటారు.

'నీకయిందా? నిజం చెప్పు' అన్నాను అతని కళ్ళలోకి చూస్తూ.

'మేమంటే మామూలు మనుషులం, మీరు ఆధ్యాత్మికులు కదా?' అన్నాడు వెటకారంగా.

'అవునా? అలాగైతే అంతదూరం రావాల్సిన పని నాకేముంది? ఇక్కడ కళ్ళు మూసుకుంటే శివుడు కనిపించడా? ఇంకా చెప్పాలంటే కళ్ళు మూసుకుంటేనే ధ్యానమా? కళ్ళు తెరిచి ధ్యానం చేయలేమా? చేయకూడదా? లేక మీకు అలాంటివి ఏమీ నేర్పలేదా మీ స్వామి?' అడిగాను నేనూ సీరియస్ గానే.

ఏమీ సమాధానం లేదు.

'లింగం ఎదురుగా కూచుంటేనే ధ్యానం వస్తుందా? ఆ లింగానికి మీ స్వామి తన శక్తిని ఇచ్చాడా? ఏమీ తెలియని వెర్రి వెంగళప్పలు ఉంటారు వాళ్లకు చెప్పు పోయి'. అన్నాను

'మా స్వామి ఫిలాసఫీ మీకు తెలుసా అసలు?' అన్నాడు కోపంగా మళ్ళీ మాట మార్చేస్తూ.

నేను నవ్వుకుంటూ 'మీ స్వామి గురించి నీకంటే నాకు బాగానే తెలుసు. ఆయనకు ఏ ఫిలాసఫీ లేదని కూడా తెలుసు. ఆయన చెప్పేదంతా ఓషో రజనీష్ భావాలకు పక్కా కాపీ అని కూడా తెలుసు. ఇంకా చెప్తా విను. ఈ వేషం వెయ్యక ముందు ఆయన కోళ్లఫారం నడిపేవాడు. అందులో కూచుని ఏమీ తోచక రజనీష్ పుస్తకాలు బాగా చదివేవాడు. వాటిని తమిళంలోకి అనువాదాలు కూడా చేశాడు. తను మీకిప్పుడు చెప్పేదంతా రజనీష్ నించి కాపీ కొట్టిన సరుకే. కావాలంటే ఓషోను బాగా చదివి అప్పుడు మీ స్వామి చెప్పే కబుర్లు విను నేను చెప్పేది నిజమో కాదో నీకే అర్ధమౌతుంది.' అన్నాను.

'అవునా' అంటూ ఆశ్చర్యపోయాడు.

'ఇంకా విను. ఆ కోళ్లఫారం నడిపే సమయంలో కోడిగుడ్ల కోసం పాములు వచ్చేవి. ఆ పాములను పట్టుకోవడం కోసం ఒక పాములోడిని పిలిపించేవారు. ఆ తమిళతంబి దగ్గరే పాముల్ని ఆడించే విద్య నేర్చుకున్నాడు. అది మీకిప్పుడు ప్రదర్శిస్తున్నాడు.అది చూచి మీరంతా ఫ్లాట్ అయిపోతున్నారు.అంతే.' అన్నాను.

'అవునా' అంటూ ఇంకా ఆశ్చర్యపోయాడు.

'అవును. ఆయన భార్య విజయకుమారి ఎలా చనిపోయిందో నీకు తెలుసా? ఆమె మహాసమాధి చెందిందని ఆయన అంటాడు. మహాసమాధి అనే పదం ఎవరికి వాడాలో ఆయనకసలు తెలుసా? మామూలు మనుషుల చావుకు అలాంటి పదం వాడవచ్చా?ఆమెది సహజ మరణం కాదని మొన్న మొన్నటి దాకా కేసు నడిచింది. పోనీ ఈ విషయమైనా నీకు తెలుసా?' అడిగాను.

నోరెళ్లబెట్టాడు. చివరకు తేరుకుని -'నాకివన్నీ తెలియవు. మీకెలా తెలుసు?' అడిగాడు.

రహస్యం చెబుతున్నట్లుగా ముందుకు వంగి -'నా దగ్గర కర్ణపిశాచి మంత్రం ఉన్నది. అదే ఇదంతా చెప్పింది' అన్నాను.

అతని కళ్ళల్లో భయం తొంగి చూచింది.

'నిజంగానా?' అడిగాడు భయంగా.

'నీమీదొట్టు' అన్నా అతని తలమీద నా ఎడమచెయ్యిని పెట్టబోతూ. 

ఏమనుకున్నాడో ఏమో నా చెయ్యి తనకు తగలకుండా దూరంగా జరిగాడు.

'పోనీ ఇదైనా చెప్పు. తన కూతుర్నేమో చక్కగా ఆర్కిటెక్చర్ చదివించి అట్టహాసంగా పెళ్లి చేశాడు.మరి ఊర్లోవాళ్ళ కూతుళ్ళనేమో గుండు గొరిగించి సన్యాసినులను చేస్తున్నాడు.పైగా వాళ్ళకు సన్యాసం ఇవ్వడానికి తనే ముందు సన్యాసి కాడు. ఇది న్యాయమేనంటావా?' అడిగాను. 

'వాళ్లకిష్టమై వాళ్ళు అలా తయారయ్యారు. అది ఆయన తప్పెలా అవుతుంది?' అన్నాడు.   

'ఏ ఆడపిల్లా తనంతట తను గుండు చేయించుకుని నాకు పెళ్ళొద్దని అలా తయారవ్వదు. నేనొక విషయం సీరియస్ గా అడుగుతా చెప్పు. నీ కూతురేమో చక్కగా ఇంజనీరింగ్ చదివి మంచి  MNC లో ఉద్యోగం చేస్తూ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో బాగా స్థిరపడాలి. కానీ ఎవరో అమ్మ కన్న ఆడపిల్లలు 'ఇన్నర్ ఇంజినీరింగ్' చదివి గుండు గీసుకుని రోడ్లమ్మట తిరగాలి. అంతేనా? వాళ్ళ ప్లేస్ లో నీ కూతురుంటే నువ్వు ఒప్పుకుంటావా?' అన్నాను.

'ఆనందంగా ఒప్పుకుంటాను' అన్నాడు.

'ఈ నాటకాలు నా దగ్గరొద్దు. ఒప్పుకునే పనైతే మీ అమ్మాయిని కూడా అలా చేసి ఆ తర్వాత చెప్పు అప్పుడు నీ మాట నమ్ముతాను.' అన్నాను.

'దానికిష్టం లేదు. అది పెళ్లి చేసుకుంటానంటోంది' అన్నాడు.

'అమ్మాయి చదువు మానిపించి 'ఇన్నర్ ఇంజనీరింగ్' చదివించు అప్పుడు ఒప్పుకుని తనూ గుండు గీసుకుంటుంది' అన్నాను.

అతనికి పిచ్చి కోపం వచ్చింది.

'ఏంటి సార్ ఇందాకటి నుంచీ చూస్తున్నాను? నేనేదో మంచి చెబుదామని వస్తే ఇదంతా ఏంటి? మా పర్సనల్స్ తో మీకేం పని?' అన్నాడు.

'నువ్వు మంచి చెప్పకపోతే నాకు తెలీదని నీ ఉద్దేశ్యమా?నాకు మంచి చెప్పాల్సిన పని నీకేంటి? నా పర్సనల్ లైఫ్ తో నీకేంటి పని? నన్ను కోయంబత్తూర్ రమ్మని పిలవడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? అది నా పర్శనల్ లైఫ్ లో నువ్వు జోక్యం చేసుకోవడం కాదా? నేను ధ్యానలింగం చూస్తే నీకెందుకు చూడకపోతే నీకెందుకు? నువ్వు సలహా ఇస్తేనేమో నేను వెర్రి వెధవలాగా వినాలా? నేను లాజికల్ గా నాకొచ్చిన డౌట్స్ అడిగితేనేమో అది నీ పర్శనల్ లైఫ్ లో జోక్యం చేసుకోడమా? ఏంటి నువ్వు మాట్లాడేది?' నేనూ గట్టిగానే అడిగాను.

'అసలు మీతో మాట్లాడటమే నా బుద్ధి తక్కువ' అన్నాడు కోపంగా.

'అర్ధం చేసుకున్నావు కదా? పోయి ఆ లింగం ముందు కళ్ళు మూసుకుని కూచో పో. కొన్ని వేల జన్మలకు కూడా నీకు ఆ శివుని దర్శనం అవుతుందని నాకైతే నమ్మకం లేదు.' అన్నాను

అతను కోపంగా వెళ్ళిపోయాడు.

నేను జాలిగా నవ్వుకుంటూ నా పనిలో పడ్డాను.

చాలామంది ఇంతే ! వాళ్ళ అజ్ఞానంతో ఎవరో ఒక ఆధ్యాత్మిక సూడో గురువు వలలో పడతారు. ఇక అదే సర్వస్వం అనుకుంటూ ఇతరులను కూడా వాళ్ళ ఫోల్డ్ లోకి కన్వర్ట్ చేసే పనిలో ఉంటారు. నిజాలు మాత్రం ఎవరూ పట్టించుకోరు.

మొన్న మొన్నటిదాకా ఒక ఏభై ఏళ్ళ పాటు ఒక బాబా తనే దేవుడినని అబద్దాలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేశాడు. 'అదంతా మోసంరా బాబూ నమ్మద్దు' అని ఎంతమంది చెప్పినా ఎవరూ వినలేదు. ఆ బాబా చివరిదశలో అతనొక చీప్ మెజీషియన్ అని అందరికీ తెలిసిపోయింది. చివరకు ఆయనే ఎవరూ కోరుకోకూడని చావు చనిపోయాడు. ఆయన నిష్క్రమణం తర్వాత చాలామంది ఆ గ్యాప్ ను ఫిలప్ చెయ్యాలని చూస్తున్నారు. వారిలో కొందరు బాగానే సక్సెస్ కూడా అవుతున్నారు.వీరికి రాజకీయుల అండదండలు కూడా బాగానే ఉంటున్నాయి. ఇదంతా ఒక పెద్ద మాఫియా వ్యవహారం. కొన్నేళ్ళ తర్వాతో కొన్ని దశాబ్దాల తర్వాతో ఇదీ మోసమేనని తెలుస్తుంది. అప్పుడిక చేసేదేమీ ఉండదు.

ఏం చేస్తాం ! మన ధర్మం ఏంటో మనకు తెలీనప్పుడు ఎవడేమి చెప్పినా అదే నిజమని నమ్మక తప్పదుగా ఈ మాయ ప్రపంచంలో !!