Human ignorance is incurable

5, డిసెంబర్ 2016, సోమవారం

నా కల - నల్లపిల్లులు - తెల్లపిల్లులు

చందోలు శాస్త్రి గారి పుస్తకం ఒకటుంది. దానిపేరు - 'మత్స్వప్న:' అంటే "నా కల" అని అర్ధం.ఆయనకు వచ్చిన ఒక కల గురించి అందులో వ్రాశారు.మనం ఆయనంత గొప్పవాళ్ళం కాకున్నా మనకూ పిచ్చివో మంచివో  ఏవో కలలు వస్తూ ఉంటాయి కదా !!

సామాన్యంగా నాకైతే అస్సలు కలలు రావు.చిన్నప్పుడు వచ్చేవి. కానీ క్రమేణా అవి పూర్తిగా తగ్గిపోయి, ఒకానొక స్టేజిలో అస్సలు కలలే లేని పరిస్తితి వచ్చేసింది.అలాంటి నాకే - ఈమధ్యలో ఒక రోజున కల వచ్చింది.

అందులో భారతదేశం కనిపించింది. విచిత్రంగా - దానినిండా నల్లపిల్లులే ఉన్నాయి.వికృతంగా అరుస్తూ, లుకలుకమంటూ తిరుగుతున్న కోట్లాది నల్లపిల్లులతో దేశమంతా దెయ్యాల నరకంలా కన్పిస్తోంది. వాటి మధ్యలో అక్కడక్కడా మాత్రం కొన్ని తెల్ల పిల్లులున్నాయి.అవి బిక్కముఖాలు వేసుకుని మౌనంగా చూస్తున్నాయి.

ఇదీ నాకొచ్చిన కల !

ఏంటోలే పిచ్చి కల అనుకుని వదిలేశా !!

ఈ కల వచ్చిన కొన్నాళ్ళకు - మహా అయితే ఒక వారంలోపల అనుకుంటా - నోట్ల రద్దు అని వార్త వచ్చింది.అప్పుడు విషయమేంటో నాకర్ధం అయింది.

మోడీ పెట్టిన ఒక్క సంతకంతో దేశమంతా నల్లపిల్లులు తెల్లపిల్లులుగా విడిపోయింది.మనుషుల వ్యాపారాలే గాక దేవుళ్ళ వ్యాపారాలు కూడా మూతపడ్డాయ్ !!

కొన్ని ఉదాహరణలు చెప్తే బాగా అర్ధమౌతుంది.

మా ఇంటి పక్కనే అయ్యప్ప గుడి ఒకటుంది.ఈ సీజన్లో చాలామంది బ్లాక్ క్యాట్స్ అక్కడ కనిపిస్తూ ఉంటారు. నల్లడ్రస్సు వారిని అలా సరదాగా పిలవడం నా అలవాటు.ఎందుకలా పిలుస్తానంటే,వీళ్ళలో చాలామంది అవినీతి పరులూ బ్లాక్ మనీ గాళ్ళూ ఉంటారన్నదీ, వాళ్ళు ఏడాది పొడుగునా చేసిన అవినీతి పనులను కడుక్కునే క్రమంలో భాగంగా ఈ పార్టు టైం దీక్షలు స్వీకరిస్తారన్నదీ గత కొన్నేళ్ళ నా పరిశీలనలో తేలిన నిజం.కొండొకచో వీళ్ళలో కూడా మంచివాళ్ళు ఉండవచ్చు.కానీ ఎక్కువమంది నల్లపిల్లులే అన్నది వాస్తవం.

ఈ పార్ట్ టైం దీక్షలంటే నాకేమాత్రం సదభిప్రాయం లేదన్నదీ, వీటికి నేను దమ్మిడీ విలువ కూడా ఇవ్వనన్నదీ నిజం !!

సరే ఆ విషయం అలా ఉంచుదాం. ఎవరెలా పోతే మనకెందుకు?ఎవడి ఖర్మ వాడిది !!

మొన్నీ మధ్యన నల్లపిల్లుల లీడర్ - అదే - నల్లగురుపిల్లితో ఏదో మాట్లాడుతుంటే -'నోట్లరద్దు అయినదగ్గరనుంచీ మా గుడికి ఆదాయం తగ్గింది.' అన్నాడు.

'ఏం పాపం ! మీ నల్లపిల్లుల డ్రస్సూ మనసూ రెండూ నలుపేనని ఇన్నాళ్ళూ అనుకున్నాను. వాళ్ళ డబ్బు కూడా నలుపేనన్నమాట.' అన్నాను.

'ఏం చెప్పమంటారు? మోడీ దెబ్బతో మాకోచ్చే డొనేషన్స్ ఆగిపోయాయి.అందుకని ఎక్కువ జోరుగా ఈ ఏడాది భజనలు చెయ్యలేకపోతున్నాం' అంది గురుపిల్లి.

'అంటే ఇన్నేళ్ళుగా మీరు చేస్తున్నదంతా నల్లడబ్బుతోనా? అలాంటి ఉత్సవాలు చేస్తేనేం? చెయ్యకపోతేనేం?' అన్నాను.

'అయ్యో ! అదేంటండీ అలాగంటారు? దేవుడి కార్యం ! అలా అనకండి చాలా తప్పు.' - అంది గురుపిల్లి మళ్ళీ.

'దేవుడి "కార్యం" ఏంట్రా నీ బొంద !! ఏ పదం ఎక్కడ వాడాలో తెలియని నువ్వు గురుపిల్లివా? అంతేలే ! అలాంటి బ్లాక్ మనీ గాళ్ళకి నీలాంటోళ్ళే సరైనోళ్ళు. నీ పాపం పండేదాకా ఎంజాయ్ చెయ్! " అన్నా.

వస్తూవస్తూ అయ్యప్ప విగ్రహం వైపు చూస్తె - ఇన్నాళ్ళూ ఏదో నల్లరంగు పూసుకున్నట్లుగా ఉన్న ఆయన ముఖం తెల్లగా నవ్వుతూ కనిపించింది. నాకూ నవ్వొచ్చింది.

'బీ హ్యాపీ బ్రదర్ ! ఇన్నాళ్ళకు నీకు తెల్లడబ్బుతో స్వచ్చమైన పూజ జరుగుతోంది. థాంక్స్ టు మోడీ' అనుకున్నా.

అయ్యప్పస్వామిని నేను "బ్రదర్" అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే ఒకానొక గతజన్మలో నేనూ ఆయనా కేరళలో ఒకే గురువు దగ్గర కలారిపయత్ నేర్చుకున్నాం.అయితే మా గురుకులం మొత్తానికీ ఆయన గొప్ప వీరుడు. మా గురుకులం లోనే కాదు మొత్తం చేరరాజ్యం అంతటికీ కలారి యుద్దవిద్యలో అంతటి వీరుడు లేడు.ఆయన యుద్ధవిద్యా నైపుణ్యం నేను ప్రత్యక్షంగా చూచాను.నిజానికి ఆయన దేవుడు కాదు.మనలాంటి మామూలు మనిషే.ఒక లోకల్ ట్రైబల్ ప్రిన్స్. అంతే.కాకపోతే మంచి ధర్మపరుడు. సవతి తల్లి చేతిలో బాధలు పడ్డాడు.అంతవరకూ నిజమే. కానీ - శివకేశవులకు పుట్టాడని చెప్పే కధ అంతా ట్రాష్. అది నిజం కాదు.కానీ పిచ్చిజనం నమ్ముతున్నారు.పూజిస్తున్నారు.ఈలోకంలో నిజాలు ఎవడిక్కావాలి? ఇవన్నీ చెప్పినా ఇప్పుడు ఎవరూ నమ్మరు.అది వేరే విషయం !!

అయినా ఒకళ్ళు నమ్మితే నాకేంటి? నమ్మకపోతే నాకేంటి? నేను సత్యాన్ని మాట్లాడతాను.సత్యాన్ని అనుసరిస్తాను. అంతే !!

ఇంకో ఉదాహరణ !! 

ఈ రోజే మా కొలీగ్ మూర్తి తిరుపతి నుంచి గుండుతో వచ్చాడు.

"ఎలా జరిగింది? దర్శనం?" - అడిగాను.

'బ్రహ్మాండంగా జరిగింది. నేను తిరుపతి వెళ్ళిన ఇన్నిసార్లలో ఇంత ప్రశాంతంగా దర్శనం ఎప్పుడూ జరగలేదు.మొట్టమొదటి సారి - పిలిచి మరీ రూములిస్తున్నారు.ఇన్నాళ్ళూ రూములకోసం మనం వెయిట్ చెయ్యవలసి వచ్చేది.ఇప్పుడు వాళ్ళే యాత్రికుల కోసం వెయిట్ చేస్తున్నారు.జనం కూడా పెద్దగా లేరు.' అన్నాడు.

'అంటే తిరుపతిలో కూడా నల్లడబ్బు గాళ్ళంతా ఫిల్టర్ అయిపోయారన్నమాట.వెంకటేశ్వరస్వామి ముఖం తెల్లగా నవ్వుతూ కనిపించిందా?' అడిగాను.

ఈ రకంగా ప్రతి చోటా నోట్లరద్దు ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. అనవసర ఖర్చులూ విందులూ వినోదాలూ తగ్గాయి. క్రైం రేట్ పడిపోయింది. ఊరకే కొంతమంది మనుషులూ కొన్ని పేపర్లూ గోల చేస్తున్నాయిగాని నీతిపరుడు ప్రస్తుతం హాయిగా బ్రతుకుతున్నాడు.వచ్చిన బాధంతా బ్లాక్ మనీ గాళ్ళకే. ఈ 70 ఏళ్ళుగా మన దేశం ఎంత దోపిడీకి గురయిందో తలుచుకుంటే స్పృహ తప్పెట్లు ఉన్నది.

మొన్న నోట్లు రద్దయిన రోజు రాత్రి రెండే రెండు గంటల్లో హైదరాబాద్ లోని ఒక బంగారు నగల దుకాణంలో అక్షరాలా 200 కోట్ల రూపాయల విలువైన బంగారం అమ్ముడు అయిందంటే - జనాల దగ్గర ఎంత నల్లడబ్బు ఉన్నదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక హైదరాబాద్ లో ఒక షాపులో జరిగిన అమ్మకం.ఇక దేశం మొత్తం మీద ఎంత జరిగిందో ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఈ దేశంలో బిచ్చగాడి నుంచీ రాజు వరకూ అందరూ దొంగలే. అయితే ప్రతి దొంగా ఇలా అంటున్నాడు.

'ఏం నేనేనా దొంగని? నాకంటే పెద్ద దొంగలు చాలా మంది ఉన్నారు.అరుగో చూడండి.వాడు దొంగ కాదా? వీడు దొంగ కాదా? ' అని అన్నివైపులకీ వేళ్ళు చూపిస్తున్నాడు.

నిజమే.అందరూ దొంగలే.కానీ ప్రతివాడూ ఇదొక సాకుగా తీసుకుని దొంగతనం చేస్తూ ఉంటె ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో? ఏదో ఒక రోజున ఎలాంటి ప్రళయమో ఏ ఆర్ధిక సంక్షోభమో వస్తుందో? అలాంటి ప్రళయం రాకుండా మనల్ని కాపాడటానికే మోడీ వంటి నిజాయితీ పరుడు నాయకుడిగా మనకు ఈరోజున వచ్చాడు.

ఆయనన్న ఒక మాట నాకు బాగా నచ్చింది.

'నా ప్రత్యర్ధులు వాళ్ళ దుష్ప్రచారంతో నన్నేం చెయ్యగలరు? నేనొక ఫకీర్ ని. నాకు ఆస్తి పాస్తులే లేవు. నా కొద్దిపాటి చెంబూ తప్పేలా సర్దుకుని ఏ క్షణమైనా నేను హిమాలయాలకు వెళ్ళిపోగలను.'

శభాష్ మోడీ !!

ఈ దేశాన్ని పాలించే అర్హత ఒక్క సర్వసంగ పరిత్యాగికే ఉంటుంది.ఎందుకంటే ఇది ప్రాధమికంగా ఒక ఆధ్యాత్మిక దేశం. భోగులకు ఈ దేశాన్ని పాలించే అర్హత లేదు. రాదు.

ఒకానొక ప్రాచీన కాలంలో జ్ఞాని అయిన జనక మహారాజు ఈ దేశంలో ఒక ప్రాంతమైన కోసల రాజ్యాన్ని పాలించాడు. మళ్ళీ ఈనాడు మోడీ ఈ దేశాన్ని పాలిస్తున్నాడు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనకు మళ్ళీ మంచిరోజులొచ్చాయన్న మాట.

"యధా రాజా తధా ప్రజా" - అని ఎవడన్నాడో గాని అది పూర్తిగా నిజం కాదు. ధర్మంగా ఉన్న పాత యుగాలలో అది నిజం కావచ్చు.రాజు నిజాయితీ పరుడైతే ప్రజలు కూడా నిజాయితీగా ఉంటారని సామాన్యంగా అనుకునే మాట. కానీ నేడు రాజు నిజాయితీ పరుడైనా సరే ప్రజలు విమర్శిస్తున్నారు. అంటే దానర్ధం ఏమిటి? వారంతా అవినీతి పరులనేగా??

నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారందరూ నల్ల పిల్లులే. సో కాల్డ్ భక్తులేమో పావురం వేషంలో ఉన్న నల్ల పిల్లులు. అంతే తేడా !!

నల్లపిల్లులు గోల చేస్తున్నాయి.తెల్లపిల్లులేమో హాయిగానే ఉన్నాయి. మరికొన్ని అతితెలివి నల్లపిల్లులేమో - "మోదీగారి ఉద్దేశ్యం మంచిదే.కానీ అమలు విధానమే లోపభూయిష్టంగా ఉంది" అంటున్నాయి. అంటే - అదేదో సినిమాలో - "మేం వస్తున్నాం దాక్కోండి" - అని దొంగలకి ముందే చెప్పేసిన పోలీసులు విజిల్స్ ఊదుకుంటూ వచ్చి హడావుడి చేసినట్లుగా - ముందే అందరికీ చెప్పేసి వాళ్ళ బ్లాక్ మనీ అంతా సేఫ్ గా మార్చుకునే అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే అప్పుడు "అమలు విధానం చాలా బాగుంది" అని అందరూ తెగ మెచ్చుకునేవాళ్ళు.కానీ బ్లాక్ మనీ అలాగే ఉండేది.కాకపోతే రూపం మారేది. అంతే !!

అసలూ - మన ఇంటినే మనం సరిగ్గా సర్డుకోలేం. మన ఇంట్లో వస్తువులు ఏవి ఎక్కడుండాలో మనమే సరిగ్గా పెట్టుకోలేం. కరెంట్ పోతే, ఏ వస్తువు ఎక్కడుందో మనకే తెలీదు.ఏ శనివారమో ఆదివారమో ఇల్లు సర్దడం మొదలు పెడితే సాయంత్రానికి ఒళ్ళు హూనం అవుతుంది గాని ఇల్లు మాత్రం పూరిగా ప్రక్షాళన అవ్వదు. అలాటిది, ఇంత పెద్ద దేశాన్ని ప్రక్షాళన చెయ్యాలంటే కొంత ఇబ్బంది తప్పదుగా మరి ??

మొత్తం మీద మనదేశంలో ప్రస్తుతం రెండే జాతులు మిగిలాయి -- నల్ల పిల్లులు తెల్ల పిల్లులు.

ఇంత వైవిధ్యం ఉన్న మన దేశంలోని కులాలూ మతాలూ జాతులూ తెగలూ అన్నీ రాత్రికి రాత్రి ఒకే జాతిగా - పిల్లి జాతిగా - మారిపోయాయి.విఠలాచార్య సినిమాలో గనక 'హాం ఫట్' అంటూనే హీరో పిల్లిగా, హీరోయిన్ కుక్కగా మారిపోయినట్లన్న మాట!! అది విఠలాచార్య మహత్యం. ఇది మోడీ మహత్యం. బహుశా మోడీ ఆ సినిమాలు బాగా చూసేవాడేమో !

అదీ నాకల.

"మత్స్వప్నః"