“My Yogic realization is higher than the sky, yet my insight into Karma is finer than the grains" -- Guru Padma Sambhava

21, సెప్టెంబర్ 2016, బుధవారం

సాధనా సమ్మేళనం- 2016








ఈ నెల 10,11,12 తేదీలలో గుంటూరులో సాధనా సమ్మేళనం జరిగింది. నా శిష్యులలో సెకండ్ లెవల్ దీక్షలో బాగా ముందుకు వచ్చి సాధన గట్టిగా చేస్తున్న నలుగురిని మాత్రమే దీనికి ఎంపికచేసి - నాతో ధ్యానం చేస్తూ మూడురోజులు మా ఇంట్లో నాతో బాటు ఉండటానికి ఆహ్వానించాను.

ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం, రాత్రి - ఇలా రోజుకు నాలుగుసార్లు ధ్యానసాధన జరిగింది. కూచున్న ప్రతిసారీ గంటన్నరకు తక్కువ కాకుండా మూడు గంటలకు ఎక్కువ కాకుండా సాధన చెయ్యడం జరిగింది. అంటే సరాసరి రోజుకు 6 నుంచి 10 గంటలపాటు ధ్యానంలో ఉండటం జరిగింది.ఈ మూడురోజుల్లో వీరికి అనేక అంతరిక అనుభవాలు కలిగాయి.

మిగిలిన సమయంలో - నిత్యజీవితంలో ఆధ్యాత్మికతను ఎలా పాటించాలి?ధ్యాని అయినవాడు రోజువారీ జీవితంలో, మిగిలిన మనుషులకంటే విభిన్నంగా ఎలా ఉండాలి? ఏ విధంగా ఆలోచించాలి?ఏ విధంగా ప్రవర్తించాలి? చుట్టూ ఉన్న కుళ్ళు సమాజంలో ఏ విధంగా స్వచ్చంగా బ్రతకాలి? అన్న అంశంపైన ఆచరణీయ సూత్రాలను వీరికి చెప్పడం జరిగింది.

చిన్నవయసులోనే ధ్యానసాధనలో ఇంత లోతైన తృష్ణ ఉన్నందుకు వీరిని అభినందిస్తున్నాను.అయితే - ఎంత పైకి ఎదిగితే -హటాత్తుగా క్రిందకు పడిపోయే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది గనుక - అనుక్షణం జాగ్రత్తగా ఉండమనీ, దారి తప్పవద్దనీ, ఇప్పుడు కలిగిన స్థితిని నిలుపుకోమనీ - వారికి గట్టిగా చెప్పాను.

ఆధ్యాత్మికమంటే టీవీలో ప్రవచనాలు వినడం,కబుర్లు చెప్పుకోవడం, గుళ్ళూ గోపురాలూ తిరగడం,ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, వాటిమీద పనికిమాలిన పాండిత్యచర్చలు - ఇవి కానే కాదు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ధ్యానసాధనలో నిష్ణాతులు కావడం - మనలోకి మనం మునిగి - మనమెవరమో - దేవుడంటే ఏమిటో - అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మాత్రమే. ఈ ఒక్కటి చేతకానంత వరకూ మనం ఇతరత్రా చేసే పనులన్నీ - అవి మన దృష్టిలోనూ  లోకం దృష్టిలోనూ ఎంత గొప్ప పనులైనా సరే - పిల్లిమొగ్గలు మాత్రమే.

నేను నా చిన్నప్పటి నుంచీ ఇదే మార్గంలో నడిచాను.ఇప్పుడు నా శిష్యులను కూడా ఇదే మార్గంలో నడిపిస్తున్నాను.మాటలు తగ్గించి, వారి సాధనను చేతలలో చూపగలిగే నిజమైన ధ్యాన సాధకులు మాత్రమే నా శిష్యులు కాగలరు.నాతో నిలబడగలరు. ఇది చెయ్యలేని వారికి నాతో నడవడం సాధ్యం కాదు.

ఆ మూడురోజులూ మబ్బులు పట్టి సన్నని జల్లు పడుతూ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉన్నది.ప్రపంచం గురించి ఏమీ పట్టించుకోని తీవ్ర ధ్యానసాధనలో ఈ సాధనా సమ్మేళనం మూడు రోజులపాటు నడిచింది.