Pages - Menu

Pages

29, ఫిబ్రవరి 2016, సోమవారం

ఊహ

సాయంత్రం వచ్చింది
చీకటి పడింది
నీ జ్ఞాపకాలు
నన్నావరించాయి

వెలుగుతో కూడిన

పగటి కంటే
చిమ్మ చీకటి
రాత్రే ఆనందం

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
ఆమోదం

చెంత చేరినా
అర్ధం చేసుకోని నీకంటే
నిజం కాకున్నా అలరించే
నీ జ్ఞాపకమే మనోజ్ఞం

చేదు వాస్తవం కంటే
తియ్యని స్వప్నమే ఉత్తమం
ఏడిపించే నిజం కంటే
అలరించే అబద్ధమే ఉన్నతం

అందుకే
నాకెప్పుడూ కనిపించకు
అలా కనిపించి
నా ఊహలలోని నిన్ను దిగజార్చకు

మధురమైన నీ ఊహను
మలినమైన నీ స్పర్శతో
మట్టిలో కలపకు

నీ ఊహలతో మత్తెక్కిన
నా అంతరంగంలో
వాస్తవపు అల్పత్వాన్ని ఆవిష్కరించకు

నా మానసాలయంలో
నీ అడుగుల బురదను మోపి
నీ విగ్రహాన్ని నీవే మలినం చేసి
నిరాశకు నన్ను గురిచెయ్యకు

నిన్ను ఊహిస్తూ
నిర్మించుకున్న నా స్వప్నాన్ని
నిద్రలేపి నాశనం చెయ్యకు

నిన్ను స్మరిస్తూ
ఆనందంగా ఉన్న నన్ను
నీ రాక ద్వారా ఏడిపించకు

ఎందుకంటే...

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
మధురం

ఊపిరి తీసే నీకంటే
ఊపిరితో ఊసులు చెప్పే
నీ ఊహే నా నేస్తం

ఎదురుపడి
ఏడిపించే నీ కంటే
అదృశ్యంగా ప్రేమించే
నీ ఊహే ఉన్నతం

అందుకే...

ఎప్పటికీ ఇలాగే 
నాకు దూరంగానే ఉండిపో
నాలోనే నాతోనే
నా ఊహగానే ఎప్పటికీ నిలిచిపో...

27, ఫిబ్రవరి 2016, శనివారం

ఆరాటం

ప్రియుని కోసం ఆరాటపడుతున్నావు
అతడు నీ ఎదుట నిలిస్తే
గుర్తించలేకున్నావు

సముద్రాన్ని త్రాగాలని ఆశిస్తున్నావు
నీ దాహమెంతో దాని తాహతెంతో
తెలుసుకోలేకున్నావు

ఆకసాన్ని అరచేతిలో పట్టుకుంటానంటావు
నీ అరచెయ్యి వైశాల్యమెంతో
నీవే గ్రహించలేకున్నావు

బండెడు అన్నం తిందామని ఊగుతున్నావు
నీ ఆకలి తీరడానికి ఒక్కముద్ద చాలని
అర్ధం చేసుకోలేకున్నావు

నిజంగా నీలో అంత ప్రేమే ఉంటే
నిన్ను ఆపగలవారెవ్వరు?
నిజంగా నీకంత ఆకలే ఉంటే
నిన్ను ఒద్దనేవారెవ్వరు?

నిజంగా నీ గొంతెండి పోతుంటే
నీకడ్డుగా వచ్చేవారెవ్వరు?
నిజంగా నీకంత తపనే ఉంటే
నీ హద్దుగా నిలిచేవారెవ్వరు?

అతనిని చూడకుండా
బ్రతకలేనంటే
నీకెదురు చెప్పేవారెవ్వరు? 

అతనిలో కలవకుండా
ఉండలేనంటే
కుదరదనే వారెవ్వరు?

నీ ప్రేమ నిజమైనదే అయితే
నిన్ను బంధించగల వారెవ్వరు?
నీ దీక్ష స్వచ్చమైనదే అయితే
దాన్ని విరమింపజేసే వారెవ్వరు?

అసలు విషయం అది కాదు
నీ ప్రేమలో బలమే లేదు 
నీ ఆశకు నువ్వొక బందీవి
నీ మనసుకు నువ్వొక అంగీవి

నీ తాహతును మించి
ఎక్కువగా ఆశిస్తున్నావు
నీ శక్తిని మించి
ఎక్కువగా కోరుతున్నావు

ప్రియుని నీవు కోరడం కాదు
అతనిలో నీవు కరగిపోవాలి
సముద్రాన్ని నీవు త్రాగడం కాదు
దానిలోనే నువ్వు మునిగిపోవాలి

ఆకసాన్ని అందుకోవడం కాదు
నీ పిడికిలిని నీవే విప్పాలి
అన్నాన్ని నీవు తినడం కాదు
నువ్వే ఆహారంగా మారాలి

ఆశించడం ఆపాలి
నువ్వే ఆహుతి కావాలి
ఆక్రోశం అణగాలి
ఆత్మార్పణ చెయ్యాలి

ఆ ధైర్యం నీకుందా?
ఆ స్థైర్యం నీకుందా?
ఏ ముగింపుకూ వెరవని
తెగింపు నీలో ఉందా?

ఉంటే --

అడుగో నీ ప్రియుడు
నీ ఎదుటే..
నీలోనే...
నువ్వే...