Pages - Menu

Pages

31, జనవరి 2016, ఆదివారం

ఈరోజు వివేకానందస్వామి జన్మదినం

ఈరోజు పుష్య బహుళ సప్తమి.అంటే ఈరోజు వివేకానంద స్వామి జన్మదినం. నేటికి ఆయన జన్మించి 153 సంవత్సరాలు గడిచాయి.ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించడం మన కర్తవ్యం.

స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన్ను స్మరిస్తే చాలు నా హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రపంచాన్నీ అందులోని మనుషులనూ ఏమాత్రం లెక్కచెయ్యని దివ్యాత్ముడైన శ్రీరామకృష్ణుడు,నరేన్ కనిపించకపోతే మాత్రం తల్లడిల్లి పోయేవాడు.అమ్మదగ్గర ఏడ్చేవాడు.నరేన్ కనిపిస్తే తన దగ్గరగా కూచోబెట్టుకుని తనచేతితో నరేన్ కు ముద్దుగా తినుబండారాలు తినిపించేవాడు.శ్రీరామక్రిష్ణుని దివ్యస్పర్శకు, ఆయన కరుణకు నోచుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో ఆలోచిస్తే వివేకానందస్వామి ఎంతటి మహనీయుడో మనం తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

ఆయన లక్షణాలను,ఆయన చేసిన పనులను, చెప్పిన బోధనలను ఒక్కసారి మననం చేసుకుందాం.

పోల్చలేని ధీశక్తి

అసాధారణమైన ధీశక్తి ఆయన సొంతం.చిన్నవయస్సులోనే భారతీయ వేదాంతాన్ని ఔపోసన పట్టాడు.అంతేగాక పాశ్చాత్య దార్శనికులనూ ఆయన క్షుణ్ణంగా చదివాడు.ఒక్కసారి విన్నా చూచినా చదివినా ఇక ఎప్పటికీ మరువని ఫొటోగ్రాఫిక్ మెమరీ ఆయనకు ఉండేది.వాదాలలో ఆయనను ఓడించినవారు లేరు. నిశితమైన పరిశీలనా,తర్కబద్ధమైన ఆలోచనా, వాదనాపటిమా ఆయనలో ఉండేవి.అటువంటి మేధస్సును ఆదిశంకరులలో మాత్రమే మనం మళ్ళీ గమనిస్తాం. 

ఆశ్చర్యపరిచే ధ్యానశక్తి

అతి చిన్నతనం నుంచే స్వామికి ధ్యానం సహజంగా అలవడింది.రెండు మూడేళ్ళ వయస్సునుంచే స్వామి అచంచలమైన ధ్యానంలో ఉండేవాడు. తన గదిలోకి పాము వచ్చినా, పక్కవాళ్ళు గోలగోలగా అరుస్తున్నా కూడా వినిపించనంత గాఢమైన ధ్యానంలో ఆయన అంత చిన్నవయస్సులోనే ఉండగలిగేవాడు.అది ఆయనకు సహజంగా పుట్టుకతో వచ్చింది.

అబ్బురపరిచే దయాస్వభావం

చిన్నతనంలో తన పుట్టినరోజున తల్లిదండ్రులు కొనిచ్చిన కొత్త బట్టలను ఏమాత్రం ఆలోచించకుండా పేదవారికి ఇచ్చేసేవాడు.ఇతరుల బాధలు చూచి చలించి వాటితో మమేకం చెంది బాధపడే గుణం ఆయనకు పుట్టుకతోనే వచ్చింది.

బహురంగాలలో ప్రావీణ్యం

స్వామికి అనేక రంగాలలో సహజమైన ప్రావీణ్యం ఉండేది.ఆయన అద్భుతంగా గానం చేసేవాడు.శ్రీరామకృష్ణుల మధురస్వరం తర్వాత అంతటి మధురమైన స్వరం స్వామిదే అని,వాటిని ఏ గాయకులతోనూ పోల్చలేమని,అవి ఈ లోకానికి చెందిన స్వరాలు కావని, రెండూ విన్నవారు వ్రాశారు.అంతేగాక ఆయన డోలక్,తబలా, వీణ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించేవాడు. మల్లయుద్ధంలో మెళకువలు ఆయనకు తెలుసు.పెయింటింగ్స్ చక్కగా వెయ్యగలిగేవాడు.ఆయన మంచి వక్త మాత్రమె గాక మంచి కవి కూడా.అనేక కవితలను ఆయన చిన్నతనంలోనే వ్రాశాడు.

నిశిత పరిశీలనా శక్తి

జీవితాన్ని చాలా నిశితంగా ఆయన చిన్నతనంలోనే పరిశీలించాడు.జీవితం అందరూ గడుపుతున్నట్లు డబ్బుకోసం, తిండి కోసం,విలాసాలకోసం కాదనీ, దానికి ఒక ఉన్నతమైన అర్ధమూ గమ్యమూ ఉన్నాయన్న విషయాన్ని ఆయన అతిచిన్న వయస్సులోనే గ్రహించాడు.జీవితం అంటే ఒక గమ్యం లేకుండా భోగాల కోసం,సరదాలకోసం,డబ్బుకోసం వృధా చేసుకునేది కాదని ఆయనకు అతి చిన్నప్పుడే స్పృహ ఉండేది.

ఆశ్చర్యపరచే వైరాగ్యం

అందరినీ రకరకాలైన వ్యామోహాలకు గురిచేసే యవ్వనప్రాయంలో స్వామి అమితమైన వైరాగ్యసంపన్నుడై మండుతున్న అగ్నిలాగా ఉండేవాడు.ఆయన చుట్టూ ఉన్న ఆరా ఎంత బలంగా ఉండేదంటే,ఆయన సమక్షంలో ఉన్నవారుకూడా అనవసరమైన చెత్త సంభాషణలను ఏమాత్రం చెయ్యలేకపోయేవారు.వారి మనస్సులు కూడా అసంకల్పితంగా ఉన్నతములైన విషయాలవైపు మళ్లేవి.

అద్భుతమైన సాధనాబలం

శ్రీరామకృష్ణులను స్వామి దర్శించేనాటికి స్వామికి 19 ఏళ్ళు. గురుదేవుని మార్గదర్శనంలో నాలుగేళ్ళు గడిచేసరికి తన 23 వ ఏట,యోగంలో అత్యంత ఉన్నతస్థితి అయిన నిర్వికల్ప సమాధిని స్వామి చేరుకోగలిగాడు.వెనక్కు తిరిగి చూడనటువంటి అలాంటి గొప్ప సాధనాబలం ఆయనకుండేది.

భారతీయ వేదాంతానికి కొత్త గమనం

అప్పటివరకూ కొండల్లో గుహలలో అడవుల్లో ఉన్న వేదాంతాన్ని స్వామి సమాజంలోకి తెచ్చాడు.సాధువులకు ఉన్న సంఘబాధ్యతలను ఆయన గుర్తుచేశాడు.కర్మకు యోగస్థాయిని కట్టబెట్టి కర్మయోగానికి పూర్వవైభవాన్ని తెచ్చాడు. తన మోక్షం ఒక్కటే ప్రధానం కాదు, నలుగురికీ కూడా ఆధ్యాత్మికంగా సాయపడాలన్న ఉన్నతమైన సాంప్రదాయానికి మళ్ళీ ఊపిరి పోశాడు.సన్యాస సాంప్రదాయానికి కొత్త భాష్యం చెప్పాడు.

మూడు మతాల సమన్వయం

అప్పటివరకూ మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని కొట్టుకు చస్తున్న ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాల గొడవకు తన గురుదేవులైన శ్రీరామకృష్ణుల బోధనల మార్గంలో చక్కగా సులువుగా పరిష్కారం చూపించాడు. "మనిషి దైవాన్ని చేరుకునే మార్గంలో ఈ మూడూ మూడు మెట్లు మాత్రమే, అనవసరంగా కొట్టుకోవద్దని" చెప్పి మధ్వ,శంకర,రామానుజ సాంప్రదాయాల మధ్యన ఎప్పటినుంచో ఉన్న ఈ వైరుధ్యాన్ని ఎంతో చక్కగా సమన్వయం చేశాడు.

అన్ని మతాల సారం హిందూమతం

ప్రపంచంలోని అన్ని మతాల భావాలూ హిందూమతంలో ఉన్నాయి.నిజానికి ఈ మతాలన్నీ ఒకే దైవాన్ని చేరుకునే రకరకాలైన దారులన్న తన గురుదేవుల బోధనను విశ్వవ్యాప్తం గావించి మనుషుల మధ్యా మతాల మధ్యా ఉన్న ద్వేషాలను పోగొట్టే ప్రయత్నం చేశాడు.

జాతికి శక్తిపాతం

అప్పట్లో బ్రిటిష్ పాలనలో బానిసత్వంతో కృంగిపోతున్న మన దేశానికి అమృతం లాంటి తన బోధల ద్వారా తిరిగి జీవాన్ని ప్రసాదించాడు.నిరాశనూ, నిరుత్సాహాన్నీ, దైన్యాన్నీ వీడమనీ, స్వశక్తిని ఆత్మశక్తిని గ్రహించమనీ ఉద్బోధించాడు.మనలో ప్రవహిస్తున్న ఋషి రక్తం యొక్క శక్తిని తెలుసుకొమ్మని మేల్కొలిపాడు.

మహత్తరమైన యోగశక్తి

చాలామంది యోగశక్తిని గురించి మాటలు మాత్రమే చెబుతారు.కానీ స్వామి మాత్రం, లోకంలో తను వచ్చిన పని అయిపోయిందని అనుకున్న మరుక్షణం స్వచ్చందంగా ప్రాణం వదిలేసి యోగమార్గంలో తనలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయనకు 39 ఏళ్ళు మాత్రమే.ఇటువంటి యోగశక్తిని మనం చాలా తక్కువమంది ప్రవక్తలలో మాత్రమే గమనిస్తాం.

తను శరీరాన్ని వదిలేసే కొద్ది నెలల ముందు తన సోదర శిష్యుడైన అభేదానంద స్వామితో ఆయన ఇలా అన్నారు.(సన్యాసం స్వీకరించడానికి ముందు అభేదానంద స్వామి పేరు కాళీప్రసాద్ చంద్ర.వాళ్ళు మాట్లాడుకునే సమయంలో పాత పేర్లతోనే పిలుచుకునే వారు) 

'కాళీ ! నేను ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఈ శరీరంలో ఉంటాను.'

దానికి అభేదానంద స్వామి ఇలా అన్నారు.

'అదేంటి నరేన్? ఇప్పుడు నీ వయసెంత? నీవు మాట్లాడే మాటలేమిటి?అప్పుడే ఏమైంది? నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో ఉంది?'

దానికి వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'అదికాదు కాళీ! నీకు తెలీదు.నా ఆత్మ బాగా ఎక్కువగా వికాసం చెందుతున్నది.అది ఎంతగా వికసిస్తోందంటే ఈ శరీరాన్ని దాటి విశ్వం మొత్తాన్నీ అది నిండిపోతున్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువగా కలుగుతున్నది.ఈ చిన్నశరీరం ఇక ఎంతమాత్రం నన్ను భరించలేదు.కనుక త్వరలో నేను శరీరాన్ని వదలక తప్పదు.'

ఆ తర్వాత మూడు నాలుగు నెలలకే ఆయన శరీరాన్ని వదిలేశారు.

ఈ సంభాషణ వినడానికే మనకు భయం వేస్తున్నది కదూ? అలాంటిది స్వామి యొక్క ఆధ్యాత్మిక స్థాయి !!

నవీనకాలపు మహా ప్రవక్త

భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఎప్పటికీ కావలసిన మహత్తరమైన దివ్యమార్గాన్ని తన బోధలద్వారా సూచించి ప్రపంచానికి మార్గనిర్దేశం గావించాడు.

ఇప్పటి వరకూ వచ్చిన అనేకమంది ప్రవక్తలు -బుద్ధుడు,మహావీరుడు, జీసస్, మహమ్మద్, జోరాస్టర్ - వీరందరి కంటే వివేకానందస్వామి ఉత్తమమైన ప్రవక్త అని నేను విశ్వసిస్తాను. నా దృష్టిలో వీరందరికంటే ఉన్నతమైన స్థానం వివేకానంద స్వామిది.

దీనికి కారణాలు కొన్ని చెప్తాను.

మహమ్మద్ బోధలవల్ల ఈనాటికీ ప్రపంచంలో ఎంతో రక్తపాతం జరుగుతున్నది.అమాయకులు వేలాదిమంది ఈయన బోధల కారణంగా చంపబడుతున్నారు.మతహింస అనేది ఇస్లాంలో అతిపెద్ద లోపం.

క్రీస్తు బోధలవల్ల ప్రపంచంలో ఈనాటికీ ఎంతో ద్వేషం ప్రచారం కాబడుతున్నది.మతమార్పిడి జరుగుతున్నది.ఇది క్రైస్తవంలోని అతి పెద్ద లోపం.

ఇస్లాం ద్వారా భౌతిక హింస జరుగుతుంటే క్రైస్తవం ద్వారా మానసిక హింస జరుగుతున్నది.

శాంతిని బోధిస్తున్నామని చెప్పుకునే ఈ రెండు మతాలవల్లా భూమిమీద ప్రవహించినంత మానవరక్తం ఇంకే మతం వల్లా ఇప్పటివరకూ ప్రవహించలేదు.ఇది చరిత్ర చెబుతున్న నిజం మాత్రమే కాదు నేటికీ కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.

కానీ వివేకానందస్వామి విశ్వజనీనమైన, హింసకు అతీతమైన, వేదాంత మార్గాన్ని బోధించాడు.అందరిలో ఉన్న ఆత్మ నిజానికి ఒక్కటే అనీ, ఆ ఆత్మకు మూలమైన పరమాత్మ కూడా ఒక్కటే అనీ,ఎవరూ ఎవర్నీ ద్వేషించనవసరం లేదనీ, మతాలు మారవలసిన అవసరం కూడా లేదనీ ఆయన బోధించాడు.దీనికి మూలాలను మన వేదాలనుంచి ఉపనిషత్తుల నుంచి ఆయన ఉటంకించాడు.

బుద్ధుడు అనాత్మవాది.బౌద్ధంలో మిగతా అన్ని లక్షణాలూ మంచివే అయినప్పటికీ ఈ అనాత్మవాదం వల్లనే ఈ మతం మన దేశం నుంచి అదృశ్యం అయిపోయింది.కానీ వివేకానందస్వామి బుద్ధుని బోధలకు సరియైన అర్ధాన్ని వివరించాడు.ఆత్మవాదం ద్వారా కూడా బుద్ధుడు సూచించిన నిర్వాణస్థితిని పొందవచ్చని స్వానుభవంతో ఆయన అన్నాడు.కనుక బుద్ధుని కంటే వివేకానందుని స్థాయి ఉన్నతమైనదని నేను విశ్వసిస్తాను.

జీసస్,మొహమ్మద్ వంటి ప్రవక్తల కంటే బుద్ధుడు ఎంతో ఉన్నతమైన వాడు.ఎందుకంటే బుద్ధుని బోధనలలో హింసకు తావు లేదు.కాకపోతే బుద్ధుని మార్గంలో కొన్ని మౌలిక లోపాలున్నాయి.వివేకానందస్వామి వాటిని కూడా అధిగమించాడు.కనుక బుద్ధుని కంటే కూడా వివేకానందస్వామి ఇంకా ఉన్నతమైన ప్రవక్త అని నా భావన.

మరి ఇన్ని ఉత్తమ లక్షణాలున్న వివేకానందుని వంటి మహాప్రవక్త మన దేశంలో జన్మిస్తే ఆయన జన్మదినం ఈరోజు అయితే ఆయన్ను స్మరించకుండా ఉండటం ఎంత ఘోరమైన పాపమో ఆలోచించండి.

విచిత్రమేమంటే అలాంటి గొప్ప ప్రవక్త పుట్టి నేటికి 153 సంవత్సరాలు అయినప్పటికీ, ఈరోజుకి కూడా మన దేశంలో ఆయన బోధనలను సరిగ్గా అర్ధం చేసుకున్న వారూ ఆచరిస్తున్న వారూ అతి తక్కువమందే ఉన్నారు.గారడీవిద్యలు ప్రదర్శిస్తూ,నల్లధనమూ బంగారమూ పోగేసుకుంటూ,కుహనా వేదాంతం చెప్తూ కోరికలు తీరుస్తామంటూ పిచ్చిపిచ్చి దీక్షలిస్తున్న నకిలీ స్వాములకూ, నకిలీ బాబాలకూ నేడుకూడా మన దేశంలో కొదవ లేదు.అలాంటి వారి వెంట వేలంవెర్రిగా పరుగులు తీసే వెర్రిగొర్రెలకూ కొదవ లేదు.అదే మన దేశ ప్రజల ఆధ్యాత్మిక దౌర్భాగ్యం, కలిప్రభావం.

అసలుని వదిలేసి నకిలీల వెంట పరిగెత్తడమే మన దేశ ప్రజల దురదృష్టం.శుద్ధమైన వేదాంత బోధలను వదిలేసి గారడీ విద్యల వెంటపడి పరుగులు తియ్యడమే నేటి ప్రజల చవకబారు మనస్తత్వాలకు నిదర్శనం.

శ్రీరామకృష్ణ వివేకానందుల బోధనలను అనుసరించడం ద్వారా మాత్రమే మానవజాతి సరియైన మార్గంలో దైవం వైపు ప్రయాణం చెయ్యగలుగుతుంది.వీరిద్దరి బోధనలకు అనుగుణంగా ఇంకెవరైనా బోధిస్తే అంతవరకూ మాత్రమే ఆ బోధకులుగాని ఆ ప్రవక్తలుగాని సరియైన మార్గంలో ఉన్నట్లు లెక్క. అలా లేనప్పుడు, వారు కూడా కుహనా బోధకులే. అలాంటి వారిని అనుసరించినంత వరకూ మానవజాతికి, అజ్ఞానం నుంచీ, ద్వేషం నుంచీ, హింస నుంచీ,ఆధ్యాత్మిక దరిద్రం నుంచీ నిష్కృతి లేదు. రాదు.

కనీసం ఈరోజైనా ఆ మహనీయుని స్మరిద్దాం.ఆయన బోధనలను నిత్యజీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా చెయ్యడం ద్వారా మాత్రమే మనం కూడా దివ్యత్వం వైపు శరవేగంతో పయనించగలుగుతాం.సత్యమైన వేదధర్మానికీ సనాతనధర్మానికీ వారసులం కాగలుగుతాం. అప్పుడే మనం నిజమైన భారతీయులమని అనిపించుకో గలుగుతాం.

29, జనవరి 2016, శుక్రవారం

రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్

రేపు రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.వారి ప్రభావాల గురించి నిన్న వ్రాశాను.ఈ రోజు వార్తల్లో అంతా ' జికా ' వైరస్ గురించే చర్చ జరుగుతున్నది.

ప్రపంచాన్ని కొత్తగా భయపెడుతున్న వైరస్ ' జికా ' రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే సమయంలో హటాత్తుగా తెరమీదకు వచ్చింది. మామూలుగా చూచేవారికి ఈ సంబంధం అర్ధం కాకపోవచ్చు.కాకతాళీయంగా అనిపించవచ్చు.కానీ మానవజీవితం పైన గ్రహప్రభావాలను నిశితంగా గమనించేవారికి మాత్రం హటాత్తుగా విజ్రుంభిస్తున్న ఈ వైరస్ వెనుక ఉన్న రాహుకేతువులు తప్పకుండా దర్శనం ఇస్తారు.

రాహుకేతువులనే వాళ్ళు భూమిచుట్టూ ఆవరించి ఉన్న అయస్కాంత శక్తులు.సూర్యుని చుట్టూ తిరిగే భూకక్ష్యా చంద్రుని కక్ష్యా పరస్పరం ఖండించుకునే ఖగోళస్థానాలనే మన ప్రాచీనులు రాహువు కేతువు అని పిలిచారు.ఇవి అయస్కాంత శక్తి గలిగిన రోదసీ బిందువులు.వీటి ప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది.అలాగే భూమ్మీద నివసిస్తున్న మనమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది.ఈ కక్ష్యలలో మార్పులు వచ్చిన ప్రతిసారీ భూమి మీద కొన్ని కొన్ని మార్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి.ఇది తిరుగులేని నిజం.

ఈ ఖగోళ సత్యాలు తెలియని అజ్ఞానులు 'రాహుకేతువులు అనేవాళ్ళు ఆకాశంలో అసలు లేనే లేరు.లేనివాళ్ళు గ్రహాలెలా అవుతారు?అంతా మూఢనమ్మకాలు' అని గుడ్డిగా వాదిస్తూ మనల్ని నవ్విస్తూ ఉంటారు.వారి అజ్ఞానానికి వారిని అలా వదిలేద్దాం.

ప్రస్తుతం మానవాళిని భయపెడుతున్న ' జికా ' వైరస్ రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే తేదీలలో ఖచ్చితంగా ప్రత్యక్షం కావడం వింతగా లేదూ? అర్ధం చేసుకోనంత వరకూ వింతగానే ఉంటుంది.సరిగా అర్ధం చేసుకుంటే అందులో వింత కనిపించదు.విశ్వనాటకంలోని ఒక అంకంలో విశ్వశక్తులు ఎలా పనిచేస్తున్నాయో అప్పుడు అర్ధం అవుతుంది. 

ఈ వైరస్ బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తోంది.అక్కడనుంచి మిగతా దేశాలకు ప్రాకుతున్నది.లక్షలాది మంది దీని బారిన బడుతున్నారని అంచనాలు చెబుతున్నాయి.ఇది 'ఏడిస్' జాతికి చెందిన దోమద్వారా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. దోమలు మొదలైన ఎగిరే కీటకాలు రాహుకేతువుల అధీనంలో ఉంటాయని జ్యోతిశ్శాస్త్రంలో ఓనమాలు వచ్చిన ప్రతివారికీ తెలిసిన విషయమే.

రాహుకేతువులు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. సరిగ్గా 18 ఏళ్ళ క్రితం 1997 లో రాహుకేతువులు ఇదే స్థానాలలో ఉన్నారు.

అప్పుడేమైందో చూద్దామా?

ఆ సమయంలో హాంక్ కాంగ్ చైనాలలో 'ఏవియన్ ఫ్లూ' అనబడే బర్డ్ ఫ్లూ వ్యాధి విజ్రుంభించి లక్షలాది కోళ్ళను బలితీసుకుంది.కోళ్ళనుంచి మనుషులకు కూడా ఇది పాకింది.దీనివల్ల అప్పట్లో అంతర్జాతీయ రవాణారంగమూ, ఆర్దికరంగమూ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.దేశాలకు దేశాలే హడలెత్తి పోయాయి.ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళుతున్న మనుషులను ఎయిర్ పోర్టులలో ఆపి మెడికల్ చెకప్స్ చేసే పరిస్థితులు అప్పుడు తలెత్తాయి.

ఎగిరే పక్షులకు కారకుడు రాహువన్న సంగతి తెలిసిన విషయమే.అలాగే ఇప్పుడు ఎగిరే దోమలు రంగంలోకి వచ్చాయి.జాగ్రత్తగా గమనిస్తే నేటి జికా వైరస్ కూ, 18 ఏళ్ళ నాటి బర్డ్ ఫ్లూ వ్యాధికీ వెనుక ఉన్న శక్తులెవరో జ్యోతిశ్శాస్త్ర విద్యార్ధులకు తేలికగా అర్ధమౌతుంది.

మానవ జీవితం మీద ఉన్న రాహుకేతువుల ప్రభావానికి ఇలాంటి సంఘటనలే తిరుగులేని సాక్ష్యాలు.స్టాటిస్టికల్ గా ఇలాంటి రుజువులు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నా కూడా జ్యోతిశ్శాస్త్రం అబద్దం అని వాదించే వారిది అజ్ఞానం కాకపోతే ఇంకేమనుకోవాలి?

27, జనవరి 2016, బుధవారం

2016 లో రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

భూమిమీది మనుషుల జీవితాలను శాసించడంలో రాహుకేతువుల పాత్ర ఎంతో ఉంటుంది.మానవుడనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వీరి ప్రభావాన్ని ఎన్నటికీ తప్పుకోలేడు. ఆ రాహుకేతువులు జనవరి 30 న రాశులు మారుతున్నారు. ఏడాదిన్నర నుంచీ వారున్న స్థానాలు మారి - రాహువు సింహరాశి లోకీ,కేతువు కుంభరాశి లోకీ వస్తున్నారు.ఈ స్థానాలలో వారు ఒకటిన్నర ఏడాది పాటు ఉంటారు.స్థూలంగా చూచినప్పుడు ఈ మార్పు యొక్క ఫలితాలు మానవాళి మీద ఎలా ఉండబోతున్నాయో గమనిద్దాం.

సామూహిక ఫలితాలు
  • ప్రపంచ రాజకీయ చిత్రపటంలో మార్పులు వస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరుగుతుంది.దీనివల్ల కొన్ని దేశాలమధ్య యుద్ధవాతావరణం ఏర్పడుతుంది.
  • దేశాలమధ్య అణుబాంబుల సమీకరణం మారిపోతుంది.ఇప్పుడున్న వాటికంటే ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలు కొత్తగా కనుక్కోబడతాయి.
  • అనేక కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. దీనివల్ల అనేకమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి.ముఖ్యంగా రవాణా,టెలికాం,కంప్యూటర్ రంగాలలో ఈ మార్పులు ఉంటాయి. 
  • రకరకాలైన మోసాలు కుంభకోణాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి.
  • అంతుబట్టని కొత్తరోగాలు మానవాళిని పీడిస్తాయి.సామూహిక మరణాలు జరుగుతాయి.
  • అగ్నిప్రమాదాలు, రవాణా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
  • ప్రమాదాలలో గాని, ఉగ్రవాద దాడులలో గాని ప్రముఖులు మరణిస్తారు.
  • మనుషులలో నక్కజిత్తులు మోసపు తెలివితేటలు బాగా ఎక్కువౌతాయి.
  • వాతావరణంలో మార్పులవల్ల మానవాళికి చేటు వాటిల్లుతుంది.

ఈ నేపధ్యంలో పన్నెండు రాశులవారికి ఈ గ్రహస్థితి ఏయే ఫలితాలనిస్తుందో చూద్దాం.

మేషరాశి
తెలివితేటలు వికసిస్తాయి.చొరవ పెరుగుతుంది.విదేశీ అవకాశాలు కలిసొస్తాయి.పిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడతారు.మంత్రతంత్రాది సాధనలలో శ్రద్ద్ద పెరుగుతుంది.ప్రేమ వ్యవహారాలు ఎక్కువౌతాయి. అనుకోకుండా లాభాలు వస్తాయి.సోదరులు దెబ్బతింటారు.

వృషభరాశి
మానసిక చింత ఎక్కువగా ఉంటుంది.కొంత సేపు ఆశ కొంతసేపు నిరాశ వెంటాడతాయి.ఇంటిలో పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. తల్లిదండ్రులకు ప్రమాదకాలం.చదువులో ఆటంకాలు ఎదురౌతాయి.వృత్తిలో అనుకోని హటాత్తు మార్పులు కలుగుతాయి. 

మిధునరాశి
ధైర్యం చొరవ కలుపుగోలుతనం పెరుగుతాయి.ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.తీర్ధయాత్రలు చేస్తారు.దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో పుణ్యకార్యాలు జరుగుతాయి.సోదరులకు కష్టకాలం.

కర్కాటకరాశి
కళ్ళకు జబ్బులోస్తాయి.చదువులో ఆటంకాలు కలుగుతాయి.ఇంటిలో అశాంతి పెరుగుతుంది.మాటలో దురుసుతనం పెరగడం వల్ల హటాత్తుగా గొడవలు జరిగి నష్టపోతూ ఉంటారు.తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది.రహస్యాలు దాస్తూ ఉంటారు.

సింహరాశి
ఆరోగ్యం దెబ్బతింటుంది.మోసపోతారు.సాహసకార్యాలు చేసి నష్టాలు చవిచూస్తారు.త్రిప్పట ఎక్కువౌతుంది. రకరకాలుగా మనసు చెదిరిపోతూ ఉంటుంది.తనవల్ల జీవితభాగస్వామికి కష్టాలు కలుగుతాయి.

కన్యారాశి
రహస్య ఒప్పందాలు, రహస్య కార్యకలాపాలు ఎక్కువౌతాయి.ఆస్పత్రిని దర్శించవలసి వస్తుంది.అవినీతి డబ్బు అనవసర ఖర్చులకు ఆవిరై పోతుంది.అనారోగ్యభయం పీడిస్తుంది.దీర్ఘరోగాలు తలెత్తుతాయి.అనుకోని శత్రుత్వాలు కలుగుతాయి.

తులారాశి
జీవితం లాభదాయకంగా ఉంటుంది.వ్యాపారంలో నల్లధనం కూడబెడతారు. సోదరులకు ప్రమాదం కలుగుతుంది.గుడులూ గోపురాలూ సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికరాశి
విద్యా,ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.తీరిక కరువౌతుంది.త్రిప్పట విసుగు ఎక్కువౌతాయి.గృహసౌఖ్యం లోపిస్తుంది. మానసిక చింత పీడిస్తుంది.

ధనూరాశి
ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.దూరపు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. మానసికంగా మొండితనం పెరుగుతుంది. తండ్రికి కష్టకాలం.ఇతర మతాల గురించి అధ్యయనం చేస్తారు.మతాలు మారుతారు.

మకరరాశి
కుటుంబ సౌఖ్యం కరువౌతుంది.మాట దురుసుగా వస్తుంది.తద్వారా శత్రువులు పెరుగుతారు.దీర్ఘరోగాలు పీడిస్తాయి.రహస్య వ్యవహారాలు ఎక్కువౌతాయి.అధికారులతో అవినీతి ఒప్పందాలు కలుగుతాయి.

కుంభరాశి
జీవిత భాగస్వామి నుంచి,వ్యాపార భాగస్తుల నుంచి కష్టాలు ఎదుర్కొంటారు. కొందరికి వివాహ జీవితం విచ్చిన్నం అవుతుంది.వివాహేతర సంబంధాలు కలుగుతాయి.ఆరోగ్యం దెబ్బతింటుంది.మానసిక చింత వెంటాడుతుంది.

మీనరాశి
శత్రువులపైన విజయం సాధిస్తారు.మాట దురుసు అవుతుంది.మనసులో ఉద్రేకం పెరుగుతుంది.పనులలో దూకుడు ఎక్కువౌతుంది.మొండిధైర్యం పుట్టుకొస్తుంది.అనుకోనివిధంగా పెద్ద పెద్ద ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.

ఇవి రాహుకేతువుల గోచార ఫలితాలు మాత్రమే.వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ ఫలితాలలో మార్పులు ఉంటాయి.వ్యక్తిగత జాతకాన్నీ గోచార ఫలితాలనూ కలిపి చూచుకుంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు అర్ధమౌతాయి.దాని ప్రకారం సరియైన రెమెడీలు చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు.

26, జనవరి 2016, మంగళవారం

Yogasanas - Sports and Cultural Meet 2016

Sports and Cultural Meet లో ఈ ఏడాది నుంచీ యోగాసన పోటీలు కూడా పెట్టారు.ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే యోగా చేస్తున్న వాళ్ళకే గాక కొత్తగా చెయ్యాలని అనుకుంటున్న వారికి కూడా శ్రద్ధ కలుగుతుంది.మోటివేషన్ వస్తుంది.

బద్దకాన్ని వదలించుకుని ప్రతిరోజూ యోగా చెయ్యడం చాలా మంచిది.దీనివల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి.షుగరూ బీపీ మన దరిదాపులకు కూడా రావు.బాడీ ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంటుంది.మన పిల్లలకు ఏది నేర్పినా నేర్పకపోయినా యోగా చెయ్యడం నేర్పితే చాలు.మిగతా క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.

మొత్తం మీద యోగా పోటీలలో ఒక 25 మంది దాకా పోటీ పడ్డారు. 50+ కేటగరీ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు ఈ ప్రైజులు ఇష్టం ఉండదు.నేను వాటికోసం చెయ్యను.చెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను.ఫలితాన్ని ఏమాత్రం ఆశించకుండా నా మనస్సును కట్టుదిట్టం చేస్తాను.చెయ్యడంలో కలిగే ఆనందం నాకు చాలు.అలాగే ఈ ఆసనాలు చేశాను."నమస్తే స్కూల్ ఆఫ్ యోగా" నుంచి ముగ్గురు జడ్జీలు వచ్చారు.చివరలో చూస్తే నాకు ప్రైజు వచ్చింది.

ఈ పోటీలలో నేను చేసిన ఆసనాలు ఏవంటే --

వీరభద్రాసనం
పాదహస్తాసనం
సేతుబంధాసనం
మస్త్యాసనం
చక్రాసనం
సర్వాంగాసనం
శీర్షాసనం
ధనురాసనం
భద్రాసనం
ఉష్ట్రాసనం.

వచ్చే ఏడాది పోటీలలో బాగా కష్టమైన ఆసనాలను - అంటే - 

నటరాజాసనం
త్రిభువనాసనం
మయూరాసనం
గర్భాసనం
పూర్ణ చక్రాసనం
పూర్ణ మస్త్యెంద్రాసనం
నిరాలంబ శీర్షాసనం
వృశ్చికాసనం,
కౌండిన్యాసనం
వ్యాఘ్రాసనం
కుక్కుటాసనం

మొదలైన కష్టమైన ఆసనాలు వేసి చూపిస్తానని ఆర్గనైజర్ మూర్తిగారికి చెప్పాను. ఆ దిశగా ప్రయత్నాలను ఈరోజునుంచే మొదలు పెట్టాను.

మొన్న వేసిన ఆసనాల ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

భద్రాసనం

చక్రాసనం

ధనురాసనం

మస్త్యాసనం

పాదహస్తాసనం

సర్వాంగాసనం

సేతుబందాసనం

శీర్షాసనం

ఉష్ట్రాసనం

వీరభద్రాసనం


బహుమతి అందుకుంటూ...




12, జనవరి 2016, మంగళవారం

త్వరలో రాబోతున్న కాలసర్పయోగం - గురుచండాల యోగాలు

అనంత కాలగమనంలో గ్రహాల పరిభ్రమణంలో అనేక గ్రహయోగాలు కలుగుతూ కొన్నాళ్ళ తర్వాత విడిపోతూ ఉంటాయి. ఆయా సమయాలలో దేశాలకూ,వ్యక్తులకూ కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.ఇది నిజమే.భూమ్మీద జరిగే సంఘటనలకూ గ్రహయోగాలకూ గల ఈ సంబంధాన్ని అతి ప్రాచీనకాలంలోనే గుర్తించారు.

ఈ నేపధ్యంలో మనకు త్వరలో కొన్ని యోగాలు రాశిచక్రంలో కలగబోతున్నాయి.వాటిలో గురుచండాల యోగం,కాలసర్ప యోగం అనేవి ఉన్నాయని టీవీ జ్యోతిష్కులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.చాలామంది నిజంగానే భయపడుతున్నారని నా దృష్టికి వచ్చింది.కొంతమంది మహిళలు నాకు ఫోన్ చేసి ఏం చెయ్యాలని అడుగుతున్నారు. ఆ భయాలు అర్ధం లేనివనీ, టీవీలు చూచి అనవసరంగా అలా వణికిపోవద్దనీ చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం.

జనవరి 30 న రాహుకేతువులు రాశిమారుతున్నారు.అప్పుడు రాహువు సింహరాశిలోకి ప్రవేశించి గురువుతో కలుస్తాడు. అప్పటినుంచీ ఆగస్టు 12 న గురువు కన్యారాశిలో ప్రవేశించే వరకూ ఉన్న 7 నెలల కాలం గురుచండాల యోగం పరిధిలో ఉంటుంది.

ఈ సమయంలో దొంగ గురువుల బండారాలు బయట పడతాయి.దొంగశిష్యులు దొంగ గురువుల దగ్గరకు చేరతారు. అంతేగాని నిజమైన గురువులకు మాత్రం ఏమీకాదు.వారికి మంచే జరుగుతుంది.అంతేగాక ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద స్కాములు బయటపడే సూచన ఈ సమయంలో ఉన్నది. ఈ సమయంలో ముస్లిం ఉగ్రవాదం బాగా పెచ్చుమీరి కొన్ని దేశాలమధ్యన యుద్ధవాతావరణానికి దారితీసే ప్రమాదమూ ఉన్నది.అంతేగాని వ్యక్తిగత జీవితాలలో మీరు అతిగా భయపడుతున్నంత భయంకర ఫలితాలు ఏమీ ఉండవు.

ఇప్పుడు గర్భవతులుగా ఉండి ఆ సమయంలో డెలివరీ అయ్యే కొంతమంది స్త్రీలు బాగా భయపడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది.ఇంతకు ముందు అయితే, ఈ గ్రహాలూ ఈ యోగాలూ పెద్దగా జనానికి తెలిసేవి కావు.ఇప్పుడు టీవీల పుణ్యమా అని పల్లెటూళ్ళో చదువురాని వారికి కూడా గ్రహయోగాలు తెలుస్తున్నాయి.తెలిస్తే తప్పులేదు.అనవసరంగా ప్రతిదానికీ భయపడటమే తప్పు.ఈ యోగాల బూచిని చూపించి జనాన్ని భయపెడుతున్నారు కుహనా జ్యోతిష్కులు.మంచికంటే చెడు ఎక్కువగా ప్రచారం కాబడుతున్నది.అదే అసలైన పొరపాటు.

ఒక పదిమంది జాతకాలలో గురుచండాల యోగం ఉంటే అందరికీ అది ఒకే ఫలితాన్నివ్వదు. వారి వారి పూర్వకర్మ బేలెన్స్ ను బట్టి అది ఈ జన్మలో ఈ సమయంలో ఇచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి.యోగాలవల్ల అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు.

టీవీలు,జ్యోతిష్య బ్లాగులు బాగా చూసే కొందరు మహిళలు, రాబోతున్న ఈ రెండుయోగాల గురించి ఎక్కువగా తెలుసుకుని అనవసరంగా భయాందోళనలకు గురౌతున్నారు. కొందరైతే -ఇలాంటి సమయంలో మనం పిల్లని కనడం ఎందుకు? అబార్షన్ చేయించుకుందామని ప్లాన్ చేసుకుని - ఏం చెయ్యమంటారని నన్ను అడుగుతున్నారు.ఒకామె అయితే - ఏకంగా సూయిసైడ్ చేసుకుందామని అనుకున్నాను - అని ఫోన్లో నాకే చెప్పింది. స్త్రీలలో ఇంత అమాయకులు ఉండబట్టే నకిలీ గురువులు నకిలీ జ్యోతిష్కులు సమాజంలో విచ్చలవిడిగా చెలామణీ అవుతున్నారు.

మరీ అంత జ్యోతిష్యపిచ్చి పనికిరాదు.ఏదైనా సరే వాస్తవిక దృక్పధం ఉండాలి.

పొరపాటున కూడా అబార్షన్ జోలికి పోవద్దని స్త్రీలకు నా సూచన. ఎందుకంటే అబార్షన్ అనేది మహా ఘోరమైన పాపం. అమాయకంగా ఊపిరి పోసుకుంటున్న ఒక చిన్నిప్రాణిని,అలా చెయ్యడం ద్వారా మీ చేతులతో మీరు హత్య చేస్తున్నారు.మీకు ఘోరమైన హత్యాదోషం చుట్టుకుంటుంది.దానిని కడుక్కోవడం మీ వల్ల కాదు.ఈ లోకపు కోర్టుల దృష్టిలో అది నేరం అయినా కాకపోయినా పైవాడి దృష్టిలో అది మహా ఘోరమైన పాపం. దానివల్ల ఆ కుటుంబానికి చాలా దారుణమైన పాపఖర్మ అంటుకుని,కాలక్రమంలో ఆ కుటుంబం అనేక దురదృష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.అబార్షన్ చేయించుకున్నవారూ చేసిన డాక్టర్లూ కూడా ఆ తదుపరి చాలా చెడుకర్మను ఎదుర్కొంటారు.

కేవలం అబార్షన్లు మాత్రమె చేసే ఒక లేడీ డాక్టరు ఫేమిలీ మొత్తం మూడే మూడేళ్ళలో సర్వనాశనం అయిన సంఘటన నేను కళ్ళారా చూశాను.జాగ్రత్తగా గమనిస్తే ఆ లింకులు అర్ధమౌతాయి.ఆ తర్వాత మీరు ఏ విధమైన రెమెడీలు చేసినా ఆ పాపం పోదు.తరతరాలకు ఆ పాపం వెంటాడుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి.

ఇంకో విషయం ఏమంటే - ఈ విధంగా భయాందోళనకు గురవ్వడం వల్ల,మీ భయం కడుపులో ఉన్న పిండం మీద పడుతుంది.పుట్టిన తర్వాత ఆ పిల్లలకు కూడా అనవసరమైన భయాలు, చీటికీ మాటికీ ఆందోళన పడటం, చిన్నప్పుడే B.P, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. పొట్టలో ఉన్న పిల్లను కనీసం ఆ 9 నెలలైనా ప్రశాంతంగా ఉండనివ్వండి.మీ టీవీల గోలను,టీవీ జ్యోతిష్కుల ఊదరను, వారు పెడుతున్న భయాలను ఆ పొట్టలోని బిడ్డ దగ్గరకు చేరనివ్వకండి.

రాబోతున్న ఈ యోగాలకు రెమెడీలు ఏం చెయ్యాలని చాలామంది నన్ను అడుగుతున్నారు.

ముందు మీరు భయపడకుండా ప్రశాంతంగా ఉండటమే అతి ముఖ్యమైన రెమెడీ.మీరు చేస్తున్న రకరకాల నూనెల దీపారాధనలకూ,రకరకాల పిండ్లు కలిపి చేస్తున్న ఏవేవో జిమ్మిక్కులకూ,గుళ్ళూ గోపురాలూ తిరిగినంత మాత్రానా,ప్రదక్షిణాలు చేసినంత మాత్రానా - గ్రహాలు ఏమాత్రం లొంగవన్న వాస్తవాన్ని ముందుగా గమనించండి.

స్వచ్చమైన జీవితాన్ని గడపడం,చేతనైనంతలో ఇతరులకు సాయం చెయ్యడం,దైవాన్ని ప్రార్దించడాలే అత్యుత్తమైన రెమేడీలు.దైవానుగ్రహం ఉంటే గ్రహయోగాలు ఏమీ చెయ్యవు.

జీవితంలో బాగా రాణించిన వ్యక్తుల జీవితాలలో కాలసర్పయోగం ఉండటం గమనించండి.ఉదాహరణకు జవహర్ లాల్ నెహ్రూ జాతకంలో కాలసర్పయోగం లాంటిది ఉన్నది. గురుచండాల యోగం కూడా అంతే. అనేకమంది రాజకీయ నాయకుల జాతకాలలో,సమాజంలో రాణిస్తున్న అనేకమంది కుహనా గురువుల జాతకాలలో ఈ యోగం ఉంటుంది.కాబట్టి వీటి గురించి బాధపడవద్దు. భయపడవద్దు.శిశువుల డెలివరీలకు జ్యోతిష్య ముహూర్తాలు పెట్టుకునే పని చెయ్యవద్దు.ఇలాంటి పిచ్చి పనులతో మీరు కర్మను ఓడించలేరు.కర్మను మార్చలేరు.మీకు ఒకటి తెలిస్తే, కర్మకు వంద ఉపాయాలు తెలుసు. గుర్తుంచుకోండి.

మంచి జీవితాలు గడుపుతూ, దైవాన్ని నిష్కల్మషమైన హృదయంతో ప్రార్ధిస్తూ ఉంటే, ఆ బిడ్డ పుట్టిన సమయానికి జాతకంలో ఉన్న చెడు దోషాలను కూడా మంచి స్థానాలలో ఉంచేపని దైవం చూసుకుంటుంది.అది జ్యోతిష్కుల వల్ల జరిగే పని కాదు. జ్యోతిష్కులు రాశిచక్రం వరకూ మంచి ముహూర్తాలు పెట్టవచ్చు. సూక్ష్మచక్రాలలో ఏం జరుగుతుందో వారు చూడలేరు.అది వారి అధీనంలో ఉండదు.కనుక కర్మఫలం ఎలా ఉందో అలాగే జరుగుతుంది.టీవీ రెమెడీలతో అది మారదని గ్రహించండి.

ఇకపోతే కాలసర్పయోగం గురించి.

రాబోతున్నది కాలసర్పయోగం కాదు.కొంతమంది రివర్స్ కాలసర్పయోగం అని అంటూ ఉంటారు.నిజానికి అలాంటి రివర్స్ యోగం ప్రామాణిక గ్రంధాలలో ఎక్కడా చెప్పబడి లేదు.కానీ అలాంటి ఒక గ్రహస్థితి త్వరలో రాశిచక్రంలో రాబోతున్నది.దాని ఫలితాలు అసలైన కాలసర్ప యోగమంత భయంకరంగా ఏమీ ఉండవు.కొద్దో గొప్పో ఉంటే అవి దేశాల మీద ఉంటాయి.కనుక భయం లేదు.

అనవసర భయాలు పెట్టుకుని ఆరోగ్యాలూ మనసులూ పాడు చేసుకోకండి. ప్రశాంతంగా ఉండి మీమీ ఇష్టదైవాలను మనస్పూర్తిగా ధ్యానించండి.ఎవరికీ హాని చేసే పనులు చెయ్యకండి.నిజంగా ఆపదలో అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంతలో సహాయం చెయ్యండి.దీనిని మించిన రెమెడీ ఇంకేమీ లేదు.ఈ వాస్తవాన్ని గ్రహించి టీవీ జ్యోతిష్కులకు దూరంగా ఉండండి.

గ్రహాలను సృష్టించింది దైవమే.ఆ దైవాన్ని సక్రమంగా పట్టుకుంటే గ్రహాల నుంచి,గ్రహదోషాల నుంచి ఆ దైవమే మనల్ని కాపాడుతుంది. ఇది అసలైన నిజం.గమనించండి.

7, జనవరి 2016, గురువారం

నేటి గతం...

చిన్నప్పటినుంచీ - నాలో నేనుగా ఉన్న క్షణాలలో - నన్ను నేను మరచిపోయి ప్రకృతిలో ఒక భాగంగా మిగిలిన సమయాలలో - అకస్మాత్తుగా సహజంగా spontaneous గా నాలో కలిగిన అనుభవాలను ఈ కవితలలో అక్షరబద్ధం గావించే ప్రయత్నం చేశాను.అంతేగాక - పడిన బాధలనూ,ఎదురైన వంచనలనూ, గురైన మోసాలనూ,దిగమ్రింగిన అవమానాలనూ కూడా కలగా పులగంగా వ్రాసే ప్రయత్నం చేశాను.

అనుభవం ఎన్నటికీ పూర్తిగా అక్షరంగా మారదు.కానీ నావంతుగా కొంత ప్రయత్నం చేశాను.ఇవన్నీ అంతరికానుభవాలు. అందుకోగలిగిన వారికే ఇవి అర్ధమౌతాయి.అలాంటి వారికోసమే ఈ గతస్మృతుల కవితావల్లరి.
------------------------------------
ఏ లోకపువో తెలియక
వినిపించిన శబ్దాలు
గుర్తొచ్చీ రాకుండా
విసిగించిన స్వప్నాలు

మాసిపోని గతకాలపు  మాయలు
జ్ఞాపకాల కలల మేని ఛాయలు
వర్తమానపు ఏకాంతసౌధం లోకి
మౌనంగా అడుగేసిన గతకాలపు నీరెండ

సూర్యుని కిరణాలపైన
ఏనాటివో గాలి ఊసులు
సుతారంగా జారి దిగిన
అర్దమవని మౌనభాషలు

గాలీ నీరూ ఎండా వానా
చెప్పాయి ఏవేవో మాటలు
అర్ధం చేసుకునే ప్రయత్నంలో
ఎదురొచ్చాయి గతపు బాటలు

తెలియని గమ్యపు పిలుపులు
తెలిసీ తెలియని అడుగులు
దిగంతాల అంచులలో
దేన్నో వెదికిన చూపులు

కొత్త కొత్త మనుషులు
అవే అవే పాత్రలు
మరపురాక మరువలేక
రోదించిన వేదనలు
--------------------------

మంత్రసాధనలు ఇచ్చిన
మరపురాని అనుభవాలు
అలుపులేక అరిగిపోక
అరుదెంచిన జ్ఞాపకాలు

నడకలలో పాదాలకు
గుచ్చుకున్న కోసురాళ్ళు
దాహాలను తీర్చలేక
దైన్యంగా రాతిగుళ్ళు

దారీ తెన్నూ తెలియక
తిరిగిన తొలి జ్ఞాపకాలు
ప్రతిచోటా వెంటాడిన
ఎన్నెన్నో వ్యాపకాలు

మంత్రకట్టు మాయ నెరిగి
నవ్వుకున్న వైనాలు
మనసు గుట్టు లోయలలో
రివ్వుమన్న యానాలు
--------------------------

చెరువుగట్టు స్నేహంలో
తెరచుకున్న లోకాలు
ఒంటరి రోజులు నేర్పిన
ఓపలేని పరవశాలు

మండువేసవుల రోజుల
మహామౌన స్థావరాలు
చలిరాతురు లందించిన
తొలిజన్మల జ్ఞాపకాలు

తొలకరి ముసురులు తెచ్చిన
తీపి వేదనల జల్లులు
ఒంటరిగా నడయాడిన
అంతులేని పంటచేలు

మల్లియలై మదిదోచిన
చెలియ మేని సుగంధాలు
వెల్లువలై ఉబికొచ్చిన
గతకాలపు అనుభవాలు

అన్నీ గుర్తుకు తెచ్చిన
అందమైన పరిసరాలు
ఆప్తులెవరు కానరాక
విలపించిన వత్సరాలు
-----------------------------

చెదరిన గుండెకు తోడై
దరిచేరిన ప్రియురాలు
ఎడబాటును తలచితలచి
ఎగసిపడిన హృదయాలు

ఎవరూ పలకని శూన్యం
దారే తెలియని దైన్యం
మాకు మేము దీపాలం
మాటరాని శోకాలం


అనుకోకుండా ముగిసిన
ఆరోజుల బంధాలు
అనుకోడానికి మిగలని
నేటి ఓటి బంధుత్వాలు

వెల్లడైన వాస్తవాలు
అర్ధమైన మానసాలు
కళ్ళు తెరుచుకున్న రోజు
కనిపించిన కల్మషాలు
------------------------------

ఏం చెయ్యాలో ఎరుగక
తెగ ఏడ్చిన నిశిరాత్రులు
ఎలా కడగాలో తెలియక
వగ మిగిలిన మసిపాత్రలు

ఎన్నో జన్మల నుంచి
ఎగిరొచ్చిన వలపు విరులు
ఎవరికి చెప్పాలో తోచక
దిగమింగిన తలపు తెరలు

మందు లేని రోజులలో
మనసుకైన గాయాలు
విందులేవి లేకుండా
గడచినట్టి ప్రాయాలు

ఉప్పొంగిన ఆవేశం
ఓదార్చిన ఆకాశం
కన్నీరార్పిన ఆకలి
చెయ్యందించిన జాబిలి
---------------------------------

ధ్యానమిదని నేర్పించిన
చీకటి చుక్కల రాత్రులు
మౌనం విలువను తెలిపిన
ఒంటరి రోజుల యాత్రలు

ఒకరోజున స్పందించిన
తెలతెల్లని మేఘాలు
ఒక్కసారి స్తంభించిన
వెయ్యి కాలగమనాలు

ఏకాంతపు పరుగులలో
ఎగిరొచ్చిన అతీతాలు
అప్పటికపుడే మెరిసిన
అంతులేని అనుభవాలు

నన్ను ఒదిలి అడుగేసిన
ఇంకొక నేను
అన్ని మరచి నిలిచి ఉన్న
నాలో నేను
----------------------------

బరువునంత కడిగింది
మాటరాని చెరువు
మదిని తట్టి లేపింది
మనిషి కాని చెట్టు

ఆనందం నేర్పించిన
అంతులేని ఆకాశం
ఒంటరితనమే తానొక
అందమైన అవకాశం

మహామంత్రమై ఎగసిన
చెరువు నీటి గలగలలు
నీటిగాలిలో సోకిన
చెలియ మేని మిలమిలలు

చిరుగాలికి కదలాడిన
ఆకాశపు చిరుగంటలు
ఆ శబ్దంలో మెరిసిన
ఓంకారపు వింత ధ్వనులు

మనసు లయం అందించిన
సాయంకాలపు సంజెలు
వయసు పరుగు లాపించిన
ప్రాణమధన విద్యలు

భయమేలని ఓదార్చిన
చీకటిలో మర్రిచెట్టు
అర్ధరాత్రి అద్భుతాన
విడిపోయిన కనికట్టు

ప్రత్యాహారం నేర్పిన
పల్లెటూరి చెరువు గట్టు
మనసు మాయమైపోగా
జారిన లోకపు పట్టు

కృత్రిమ ధ్యానాల తోటి
కుదరనట్టి ఏకాగ్రత
స్వచ్చమైన ప్రకృతి ఒడి
అందించిన తాదాత్మ్యత

చీకటి రాత్రులు పలికిన
కీచురాళ్ళ శబ్దాలు
ఒంటరైన చెరువు నీరు
చూపించిన చిత్రాలు

మినుకు మినుకుమని మెరిసిన
చీకటిలో చిరు వెలుగులు
తేలియాడుతూ తాకిన
మధురమైన రాగాలు

నిశీధిలో ఎదురొచ్చిన
ఒక ఒంటరి యువతీ
ఈ లోకపు ధ్యాస లేని
ఏవో చూపుల పడతి

దేని కోసమో తెలియని
నిర్లిప్తపు ఎదురుచూపు
ఎదుట మనిషి నిలుచున్నా
గుర్తించని చింతతోపు

ఆత్మలతో ప్రయోగాలు
ఆ లోకపు అనుభవాలు
చీకటింట నడయాడిన
చీర చెంగు రెపరెపలు

అనుభవాలు పంచుకున్న
అశరీరుల ఆక్రందన
విసుగుపుట్టి చాలించిన
విగత జీవ విశ్లేషణ

కుప్ప నూర్చినట్టి చేలు
అస్తమించు వెలుగుతెరలు
అనంత లోకాల నుంచి
అలలు అలలుగా పిలుపులు
-----------------------------

ముసురున మునిగిన రోజులు
ఎదురొచ్చిన పాతగతం
చీకటి రాత్రుల మెరుపులు
కనుల ముందు చివరి నిజం

సడి చెయ్యని నడిరాతిరి
పెనుగాలై దరిచేరింది
భయమే భయపడి భయపడి
వీపు వెనుక దాక్కుంది

చుక్కల పందిరి క్రింద
చుట్టూ చీకటి ముసుగు
మధ్యలోన మాటలేని
మౌనంగా ఒక చూపు

నిశ్శబ్దపు పగటిపూట
నిర్ణిద్రపు మౌనంలో
సుదూరాల దిగంతాల
ఎలుగెత్తిన పొలికేక

మధ్యాహ్నపు మౌనంలో
మలిగిపోని చైతన్యం
నిద్రించే లోకంలో
నిద్రించని నిర్దుష్టం

ఉందోలేదో తెలియని
ఉట్టిమీది లోకంలో
ఉన్నా లేనట్టున్న
ఉలుకులేని ఒక్క ఉనికి

మౌన సముద్రపు అడుగున
ఒక శబ్దపు నాట్యం
గందరగోళపు మడుగున
నిశ్శబ్దపు లాస్యం

చలనంలో అచలత్వం
శబ్దంలో నిశ్శబ్దం
మాట చాటునే మౌనం
నిత్యం నడిచే ధ్యానం
----------------------------

ఉదయాన్నే ఉత్సాహం
మధ్యాహ్నపు ఏకాంతం
సాయంత్రపు వైరాగ్యం
రాత్రి మౌన చైతన్యం

మాటల ఎల్లలు దాటిన
మత్తుకళ్ళ చిన్నదాన్ని
మనసు అందిపుచ్చుకోని
మౌనపు జత కట్టింది

మనసు పడిన చిన్నదాని
సహవాసపు సంయోగం
మరపురాని అనుభవాలు
అందించిన ఉపదేశం

నిశిరాత్రుల మౌనంలో
వర్షపు చినుకుల శబ్దం
నిద్రను దూరం చేస్తూ
నన్నే నాకందించింది

ఎటూ ఎవరూలేని ఏకాంతం
సృష్టినే శూన్యంగా మార్చి
ఎప్పటినుంచో ఉన్న నేనును
నా ఎదుటే నిలిపింది
-----------------------------

ప్రయత్నాలెన్ని చేసినా కానిది
ప్రయాసలెన్ని పడినా రానిది
ప్రతిక్షణం నేనున్నానంటూ
ఒక్క క్షణంలో నాకందింది

ఎందఱో పిలిచినా పలకనిది
ఎందరు చేయిసాచినా దక్కనిది
ఒక్కడినే ఉన్న నా మదిలో
ఒక్కసారిగా తానై ఉబికింది

ఎన్నో చదవడమెందుకు
ఎచటో వెదకడమెందుకు
నీతోనే ఉన్నానని
తనే ఎదుట నిలిచింది

అన్ని ప్రశ్నలాగిపోయి
మనసు పొరలు జారిపోయి
చెప్పలేని దేదో ఒకటి
చెంతకు నను చేర్చుకుంది
-----------------------------

త్యాగధనుల చెంత నిలిచి
నేర్చుకున్న పాఠాలు
తిరుగుబోతు స్నేహితులే
నేర్పించిన వేదాలు

గురువర్యులు గావించిన
అద్వితీయ ఆత్మబోధ 
జీవితమంతా వదలక
వెంటాడే దివ్యగాథ

జీవితమంటే నేర్పిన
మహనీయుని వాక్కులు
వేదాలను వదలిపెట్టి
ఎగిరొచ్చిన ఋక్కులు

ప్రేమలేని లోకంలో
ప్రేమకొరకు వెదుకులాట
మరువలేని మనుషులకై
పాడినట్టి లాలిపాట

మనసును గమనించలేని
పిచ్చి మొద్దు మనసులు
మనిషిని గుర్తించలేని
మహా పెద్దమనుషులు

ప్రేమ ముసుగు వేసుకున్న
పచ్చి స్వార్ధ పిశాచాలు
ఆశల వలలో చిక్కిన
ఆధ్యాత్మిక నమూనాలు

లోకం మెప్పును కోరే
సాంప్రదాయ వేషాలు
కోరికలను దాటలేని
చాపక్రింద మోసాలు

పిల్లవాడిననుకున్న
పెద్దవారి దర్పాలు
హద్దులేని ప్రశ్నలతో
సర్దుకున్న సర్పాలు

ఇల్లు చక్క దిద్దలేని
ఇరు సంధ్యల వందనాలు
మనసులోన మార్పు తేని
గ్రంధపఠన బంధనాలు
----------------------------- 

ఆడవారి సావాసాలు
అడ్డదారి సాహసాలు
ఆధ్యాత్మిక ప్రహసనాలు
అందించిన అనుభవాలు

సాధనలో శాంతి కోరి
ఆహుతైన జీవితాలు
బ్రతుకంతా పణమైనా
అందరాని విజయాలు

పతివ్రతల జీవితాల
పరారైన ఔన్నత్యం
పతితల బ్రతుకుల మాటున
పరమ హృదయ వైశాల్యం

ఔన్నత్యపు తెరచాటున

నిమ్నత్వపు నీచత్వం
నేలబారు నడకలలో
నింగి వెలుగు నిత్యత్వం

అర్దమవని చాదస్తం
అచ్చిరాని వైదీకం
అసలు సిసలు వైరాగ్యం
అందించిన ఆనందం

నచ్చని పూజల తంతులు
పచ్చిక బయళ్ళ రాత్రులు
వెచ్చని నెచ్చెలి కౌగిలి
మెచ్చిన వేల్పుల లోగిలి

ఆలయాల గదులలోన
కానరాని దివ్యత్వం
ప్రతి ఊహకు స్పందించిన
ప్రకృతిమాత నవ్యత్వం
-----------------------------

పుస్తకాలు చదివి చదివి
నమ్మినట్టి రోజులు
అనుభవాల గీటురాయి
నవ్వుకున్న నవ్వులు

చీకాకును రప్పించిన
అల్పత్వపు బ్రతుకు వెతలు
చిన్ని చిన్ని మాటలలో
చిగురించిన వెలుగు లతలు

ఏనాడూ బోధపడని
జీవితాల ప్రహసనాలు
ఎందుకోసమో తెలియక
బ్రతుకొక్కటి బుగ్గిపాలు

బ్రతుకు మీద ఆశ చచ్చి
సిద్ధపడిన క్షణాలు
ముద్దు మాటలే నేర్పిన
ముఖ్యమైన నిజాలు

ప్రేయసి కౌగిలి నేర్పిన
అచ్చమైన శరణాగతి
తంతులన్ని వదిలించిన
అసలు సిసలు పై తరగతి

విలయ విలువ బోధించని
తొలి గురువుల సమూహాలు
చెలియ కలువ నేర్పించిన
హృదయ లయల సరాగాలు 
-----------------------------

బ్రతుకులనే నడిపించే

స్వార్ధపు సందర్శనాలు
మెతుకులు కూడా దొరకని
రోజుల నీ దర్శనాలు

కరగినట్టి మది ఆశలు
తరిగినట్టి తుది శ్వాసలు
మలిగిన ఒక హృదయంలో
వడలినట్టి కడచూపులు

నమ్మకాల సుడుల మధ్య
మునిగిందొక జీవితం
జన్మరహస్యం తెలియక
ముగిసిందొక జీవితం

ఆశల బంధాల మధ్య
నలిగిందొక జీవితం
ఆకలిదప్పుల బరిలో
ఆవిరొక్క జీవితం

అంతులేని పయనంలో
నావ ఒక్క జీవితం
ఎంత మింగినా తీరని
ఆకలొక్క జీవితం

సొంతవారి చేర్పు కోరి
వెదికిందొక జీవితం
పంతపు పట్టింపులలో
ముగిసిందొక జీవితం
--------------------------------

కనులముందు కదలాడిన
ఒక్కనాటి పాపాలు
ఆశలుడిగి మసిబారిన
లెక్కలేని దీపాలు

కపట ప్రేమలలో చిక్కి
కరిగిందొక కాలం
అన్నీ తెలిసే నాటికి
ఆవిరైందొక ప్రాణం

చేజారిన మధుపాత్రలు
చేయివిడిన మదవతులు
చెంత నిలిచినా కూడా
చేరలేని అభాగినులు

భయపు బరువుతో కొందరు
పొగరు మరుగునే కొందరు
స్వార్ధ పరులు ఇంకొందరు
దరికి రారు వీరెవ్వరు
-----------------------------

నువ్వు కోరుకున్నవారు
ఈ రోజున మిగిలిలేరు
నిన్ను కోరుకున్నవారు
ఏనాడో మలిగినారు

అన్నీ తెలిసే నాటికి
దేనిపైనా ఆశుండదు
అన్నీ అమరేనాటికి
ఆకలంటూ అసలుండదు

ఆశించినవన్నీ అందిన
అందమైన ఒక రోజున
ఎందుకివన్నీ అంటూ
నీ మనసే అడుగుతుంది

ఎందుకిలా జీవితాన్ని
వృధగా గడిపావంటూ
చరమాంకంలో నిన్ను
నీ ఆత్మే కడుగుతుంది

అన్నీ ఉన్నా ఏమీ లేకుండా
ఏదీ లేకున్నా ఏమీ కాకుండా
ఉండే విద్య తెలిసినపుడు
జీవితంలో భయమేముంటుంది?
--------------------------------

ఎన్నిలోకాలు తిరిగినా
నీలోకే నువ్వు తిరిగి రావాలి
ఎన్ని యుగాలు గడచినా
ఇక్కడే ఇంకొక జన్మనెత్తాలి

ఎన్నిసార్లు ఆడమన్నా
ఆడుతాను ఈ ఆటని
ఎన్నిసార్లు పాడమన్నా
పాడుతాను ఈ పాటని

చావే తావైనప్పుడు
చావంటే భయమెందుకు?
నీవే తానైనప్పుడు
నావై తేలడమెందుకు?

ఓటమి నెరుగని వాడికి
ఆటంటే భయమెందుకు?
నాటకమే తనదైనప్పుడు
నటనంటే విసుగెందుకు?

బంధమే లేనప్పుడు
మోక్షాన్ని కోరడమెందుకు?
అంతమే తానైనప్పుడు
అన్యంగా మారడమెందుకు?
--------------------------------

6, జనవరి 2016, బుధవారం

ఈ పచ్చని పల్లెచేలు...

ఈ కాలపు పిల్లలు కోల్పోతున్నవి ఎన్నో ఉన్నాయి.వారికి పుట్టుకతోనే మొబైలూ,కంప్యూటరూ, అంతర్జాలమూ, మేసేజిలూ, సమాచార బదిలీలూ తెలిసి ఉండవచ్చు.కానీ ఇవేవీ తెలియని పాత తరాల పల్లెటూళ్ళలో ఎంత అందమైన జీవితం ఉండేదో వారికి తెలియదు.

డబ్బూ,భవనాలూ,హంగులూ,కార్లూ,హోటళ్ళ చుట్టూ షికార్లూ ఇవేవీ తెలియకపోయినా ఎంత ఆనందంగా ఆనాటి జీవితాలు గడిచేవో వారు ఊహించలేరు.గుడిసెలలో,మట్టిమిద్దెలలో, కుగ్రామాలలో ఉన్నా,ఆరోజుల ఆత్మీయతలు, అనుబంధాలు ఎంత మధురంగా ఉండేవో,గంజినీళ్ళు మాత్రమే త్రాగినా ఆ జీవితాలు ఎంత తృప్తిగా గడిచేవో  ఈనాటి తరానికి అర్ధం కాదు.

అందుకే - ఆనాటి పల్లెటూళ్ళ జీవితాలను గుర్తు తెచ్చుకుంటూ, ఆరోజులలోకి ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి వ్రాస్తున్న ఈ కవిత.
-----------------------------------

ఈ పచ్చని పల్లెచేలు
ఈ గాలుల పరిమళాలు
ముసినవ్వుల గడ్డిపూలు
గలగలమను నీటివాలు

పల్లెపడుచు సోయగాలు
మచ్చలేని మానసాలు
నశ్వరమౌ లోకంలో
భగవంతుని చేతివ్రాలు

మిద్దె ఇళ్ళ సౌందర్యం
మనసులలో ఐశ్వర్యం
మంచితనపు మల్లెపూలు
మరపురాని మురిపాలు

సద్దులేని సంతసాలు
ముద్దులొలుకు జీవితాలు
గతితప్పిన లోకానికి
అందరాని సుదూరాలు

అమ్మచేతి చిరుముద్దలు
కమ్మనైన తొలిప్రేమలు
చెట్టుపుట్ట స్నేహాలు
మట్టిమనసు మోహాలు

తొలియవ్వన పరిమళాలు
నిదురించని జ్ఞాపకాలు
వెన్నెల రాత్రుల మాటున
వెంటాడే అనుభవాలు

మట్టివాసనలు మోసే
మధురమైన చల్లగాలి
మనసు విప్పి చెప్పలేక
ఒదిగిపోవు చెలి కౌగిలి

చెలిచూపుల విరితూపులు
అరవిరిసిన మరుమాలలు
కల్మషమెరుగని వలపులు
కలల తేలియాడు తలపులు

మాయమర్మమెరుగనట్టి
మరపురాని వదనాలు
చెట్లనీడలను మెట్టిన
స్వర్గతుల్య సదనాలు

పట్నవాస మసిసోకని
పల్లెవాటు జీవితాలు
ప్రకృతిమాత లాలనలో
పరవశించు పావురాలు

నాగరికతలే ఎరుగని
నాణ్యమైన మనసులు
సోమరితనమే తెలియని
స్వచ్చమైన మనుషులు

భూమిమీద స్వర్గమంటె
ఎక్కడనో లేదంటా
గతకాలపు పల్లెటూళ్ళ
ముంగిటనే ఉందంటా...