“Most difficult thing in the world is to find people who are truly genuine"

23, ఆగస్టు 2015, ఆదివారం

Real Martial Art

నిజమైన మార్షల్ ఆర్ట్ ఎలా ఉంటుంది?

జిమ్ముల్లో పడి రోజుకు పది గంటలు కసరత్తులు చేసి, 8 ప్యాక్ పెంచి,నానా మాంసాలూ తిని కండలు పెంచి చూడటానికి రాక్షసులలాగా కనిపించే భీకరాకారులతో నిండి ఉంటుందా?

అలా ఉండదు.

నిజమైన మార్షల్ ఆర్ట్ అలా ఉండదు.అది సినిమాలు కలిగించే భ్రమ.

సినిమా అనేది వ్యాపారం.వ్యాపారంలో లాభం ప్రధానం.దానికోసం వాళ్ళు ఉన్నవీ లేనివీ చూపిస్తూ ఉంటారు.అది నిజం అనుకోని - తెలియనివాళ్ళు భ్రమపడుతూ ఉంటారు.నిజమైన మార్షల్ ఆర్ట్ సినిమాలలో చూపించే స్టంట్స్ లా ఉండదు.

లోకం ఎంతో గొప్ప ఫైటర్ అని భావించే బ్రూస్ లీ, ధాయిలాండ్ లో తన సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక అనామకవ్యక్తి చేతిలో అందరి ఎదురుగా చిత్తుగా ఓడిపోయాడని చాలామందికి తెలియదు.

ఎద్దుని కూడా తన గుద్దుతో మట్టి కరిపించిన క్యోకుశిన్ కాయ్ కరాటే గ్రాండ్ మాస్టర్ 'మసుతత్సు ఒయామా' - సన్నగా బక్కపలచగా ఉన్న ఒక అనామక చైనీస్ తాయ్ ఛీ మాస్టర్ చేతిలో తేలికగా ఓడిపోయాడని కూడా చాలామందికి తెలియదు.

చెప్పినా చాలామంది ఈ విషయాలను నమ్మలేరు కూడా.

కానీ ఇవి పచ్చి నిజాలు.

లోకానికి తెలియని నిజమైన మహనీయులు ఎందఱో ఉన్నట్లే, లోకం దృష్టిలోకి రాని నిజమైన మార్షల్ ఆర్ట్ మాస్టర్లూ అజ్ఞాతంగా చాలామంది ఉన్నారు.వాళ్ళలో కొద్దిమంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

అలాంటి వారిలో ఒకడే టిబెటన్ లామా - దొంద్రుప్ దొర్జే.

నిజమైన మార్షల్ ఆర్ట్ అంటే కండలు పెంచడం కాదు.మజిల్ పవర్ కాదు.తన దేహంలోనూ విశ్వంలోనూ ఉన్న 'కి' శక్తిని స్వాధీనం చేసుకోవడమే నిజమైన మార్షల్ ఆర్ట్.యోగాభ్యాసంలో ఉన్నత స్థాయిలకు ఎదగడమే నిజమైన మార్షల్ ఆర్ట్.

ఈ విషయం తెలియని ఎందఱో మార్షల్ ఆర్ట్ అభ్యాసకులు కండలు పెంచడమే పరమావధిగా పెట్టుకుని, వయసు మీరిన తర్వాత ఆ కండల్ని మెయింటెయిన్ చెయ్యలేక నానా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.వాళ్లకు ప్రాణశక్తి పట్టుబడదు.

బ్రూస్లీ కూడా మితిమీరి చేసిన ఫిజికల్ వ్యాయామాల వల్లే అర్ధాంతరంగా చనిపోయాడని ఒక పుకారున్నది.వ్యాయామాలు మితిమీరి చెయ్యకూడదు. దానివల్ల మంచి కంటే  చెడే ఎక్కువ జరుగుతుంది.శరీరానికి ఒక లిమిట్ ఉంటుంది.ఆ లిమిట్ ను హటాత్తుగా దాటాలని ఎప్పుడూ అనుకోకూడదు.

శరీరానికి ఫిట్నెస్ అవసరమే.అది కొంతవరకే.ఆ తర్వాత ప్రాణశక్తి ప్రపంచంలోకి అడుగుపెట్టాలి.అది సరియైన మార్గం.

మనం 'ప్రాణశక్తి' అన్నదానినే చైనీయులు 'ఛి' అన్నారు. జపనీయులు దీనినే 'కి' అన్నారు.టిబెటన్ భాషలో దీనిని 'రులుంగ్' అంటారు.ఈ ప్రాణశక్తిని స్వాధీనం చేసుకుని దానిని తన దేహంలోని మెరిడియన్స్ లో తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పడం అభ్యాసం చేసి దానిని దేహంలోనుంచి బయటకు ప్రోజెక్ట్ చెయ్యగల శక్తి ఉన్నవాడే నిజమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్.

ప్రాణశక్తిని స్వాధీనం చేసుకోగలిగితే అద్భుతాలు చెయ్యవచ్చు.వంటి వేడితో అగ్నిని సృష్టించవచ్చు.పంచభూతాలను కంట్రోల్ చెయ్యవచ్చు.జంతువులను కంట్రోల్ చెయ్యవచ్చు.ఇంకా ఎన్నో అద్భుతాలను చెయ్యవచ్చు.దానికి సాధన చెయ్యాలి.అనవసరమైన మాటలు చేతలను కట్టిపెట్టి పట్టుదలగా ఏకాంతంలో సాధన చెయ్యాలి.అప్పుడే ఈ శక్తి స్వాధీనం అవుతుంది.యోగులు ఈ శక్తి వల్లనే అద్భుతాలు చేస్తారు.

తెలివిలేని నాస్తికులూ హేతువాదులూ వీటిని నమ్మరు.కానీ - ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాలు నిజాలే. వాస్తవాలే.ఈ రంగంలోకి దిగితే దీని లోతులేమిటో తెలుస్తాయి.

కేరళ కలారిపాయట్టు విద్యలో దీనిని "మర్మవిద్య" అంటారు.అంటే రహస్యమైన విద్య అని అర్ధం.నేడు కరాటే కుంగ్ ఫూ  స్కూల్స్ నడుపుతున్న అనేకమంది మాస్టర్లలో ఎవరికీ ఈ విద్య రాదు.ఎందుకంటే ఇది ఒకటి రెండేళ్ళ సాధనతో వచ్చేది కాదు.

నిజమైన మార్షల్ ఆర్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.ఈ వీడియోలో లామా దొంద్రుప్ దొర్జే చేస్తున్నది కనికట్టు కాదు.అదే అసలైన ప్రాణవిద్య.అదే అసలైన మార్షల్ ఆర్ట్.ఆయన కండలు తిరిగి 8 ప్యాక్ పెంచిన బాడీ బిల్డర్ కాదు.కానీ ఇరవైమందిని కూడా తన చేతి చిన్న కదలికతో ఇరవై అడుగుల దూరం చెల్లాచెదరు చెయ్యగలడు. అదే అసలైన మార్షల్ ఆర్ట్.

ఈ వీడియోలో లామా - సంకల్ప మాత్రంతో తన ప్రాణశక్తిని తన చుట్టూ ఉన్న ఆరాలోకి ప్రాజెక్ట్ చేస్తున్నాడు.ఆ ప్రాణశక్తి ఆయన చుట్టూ ఒక పెద్ద ఎనెర్జీ బబుల్ ను సృష్టిస్తోంది.ఆ ఎనెర్జీ బబుల్ ధాటికి వాళ్ళందరూ అలా చెల్లాచెదురై పోతున్నారు.అంతేగాని ఆయన ఫిజికల్ గా అక్కడవాళ్ళను కిక్స్ పంచెస్ తో కొట్టడం లేదు.

కిక్స్,పంచెస్,బాడీ త్రోస్,లాక్స్ వాడి చేసేది భౌతిక విద్య.దానికి పరిమితులున్నాయి.అవి వాడితే నీవు కొంతమందిని మాత్రమె ఎదుర్కోగలవు.

కానీ ఇది ప్రాణవిద్య.దీనికి పరిమితులు లేవు.ఇది అజేయమైన శక్తినిస్తుంది.కానీ చూడటానికి సింపుల్ గా ఉంటుంది.

"లామా దొంద్రుప్ దొర్జే" అసలైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. ఈయన ముందు వందమంది బ్రూస్లీలు కూడా నిలబడలేరు.ఎందుకంటే ప్రాణశక్తి ముందు భౌతికశక్తి నిలబడలేదు.ప్రాణమే భౌతికాన్ని నడిపిస్తుంది.భౌతికం ప్రాణాన్ని శాసించలేదు.అదే ఇందులోని రహస్యం.

ఈయన ప్రస్తుతం మన ఇండియాలోనే ఉన్నాడు. 2006 లో 'కాలచక్ర సెరెమోనీ' మన గుంటూరు జిల్లా అమరావతిలో జరిగినప్పుడు అక్కడకు వచ్చాడు కూడా.కాకుంటే సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయాడు.ఇలాంటివాళ్ళు ప్రచారాన్ని కోరుకోరు.

తిలకించండి మరి.