“If you can't find a suitable opponent, fight with your own self" - A Kung-Fu saying.

13, జూన్ 2015, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-13 (ఆధ్యాత్మిక లోకంలో ప్రమాదాలు-పాకుడు రాళ్ళు)

మాటల మధ్యన అప్పారావన్నయ్య ఇంకో కొన్ని విషయాలు చెప్పారు.అవి ఆ పోస్ట్ లో అప్రస్తుతాలు గనుకా, ఆ పోస్ట్ స్ఫూర్తిని అవి నీరుగారుస్తాయి గనుకా వాటిని అందులో వ్రాయలేదు. కానీ ఈ పోస్ట్ లో వాటిని ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది.

ఎందుకంటే ఇప్పుడు నేను వ్రాయబోయే నిజానిజాలు తెలియక ఎంతోమంది అమాయకులు నేటి సమాజంలో మోసపోతూ ఉన్నారు.కొందరు కుహనా గురువులు వారికి లేనిపోని అబద్దాలు చెప్పి మాయ చేస్తున్నారు గనుక,ఆ మాయనుంచి వారిని బయట పడవెయ్యడానికి,సత్యమేమిటో తేటతెల్లం చెయ్యడానికి  ఈ విషయాలు వ్రాస్తున్నాను.

అప్పారావన్నయ్య ఒక పుస్తకాన్ని వ్రాశారు.ఆ పుస్తకం ఎలా వచ్చిందీ అన్న విషయాన్ని మాటల సందర్భంలో ఆయన చెప్పుకొచ్చారు.అసలు ఆ పుస్తకాన్ని వ్రాయాలని ఆయన ముందుగా అనుకోలేదట.

'నేను అప్పుడప్పుతూ షిరిడీ వెళుతూ ఉంటాను.' అని ఆయన మొదలు పెట్టారు.

ఆయనామాట అనడంతోనే, వినడం మీద నా ధ్యాస సన్నగిల్లింది.

ఎందుకంటే-- భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది.

చతుర్విధా భజంతేమాం జనాః సుకృతినోర్జునా
ఆర్తో జిజ్ఞాసు రర్దార్దీ జ్ఞానీచ భరతర్షభ

ఆర్తుడు-- ఆపదలో ఉన్నవాడు
అర్దార్ది--ధనాన్ని కోరేవాడు, లేదా, పనులు కావడాన్ని ఆశించేవాడు.
జిజ్ఞాసువు - అసలు విషయాన్ని తెలుసుకోగోరేవాడు
జ్ఞాని - జ్ఞానాన్ని పొందినవాడు

ఈ నాలుగు రకాలైన వ్యక్తులు నన్ను పూజిస్తారు అని భగవంతుడే గీతలో అన్నాడు.

ఈ నాలుగు రకాలలో కూడా -- ఆర్తులు, అర్దార్దులూ మాత్రమే షిరిడీ భక్తులలో నేను పరిశీలించిన నలభై ఏళ్ళలోనూ నాకు కనిపిస్తున్నారు.నిజమైన జిజ్ఞాసువులు వారిలో ఎక్కడా కనిపించరు.ఇక జ్ఞానుల మాట చెప్పనే అక్కర్లేదు.వారు ఇలాంటి సమూహాలలో ఉంటారని ఆశించడం ఒక పెద్ద పొరపాటు అవుతుంది.

అంటే--షిరిడీ వెళ్ళడం తప్పని నా ఉద్దేశ్యం కాదు.వెళ్ళకూడదనీ కాదు.ఒక మామూలు మనిషి అక్కడకు వెళ్ళవచ్చు.కానీ జిల్లెళ్ళమూడి అమ్మగారి వంటి వారివద్ద ఒక అత్యున్నతమైన సత్యాన్ని రుచిచూచిన తదుపరి,ఇంక అక్కడికీ ఇక్కడికీ తిరగాల్సిన పని లేదనేదే నా అభిప్రాయం.ఒకవేళ అలా పరుగెత్తితే ఆ సత్యం మనకు సరిగ్గా అందలేదనేగా అర్ధం.

ఒక విచిత్రాన్ని నేను చాలాసార్లు గమనించాను.

జిల్లెళ్ళమూడిలో అమ్మ దగ్గర ఉన్న అనేకులు,అమ్మ యొక్క అత్యున్నతమైన తత్త్వాన్ని అర్ధం చేసుకోలేక,షిరిడీ అని,పుట్టపర్తి అని, అరుణాచలం అనీ, ఆనందమాయీ మా అనీ అటూఇటూ పరుగులు పెట్టిన వాళ్ళున్నారు.మళ్ళీ వీరందరూ అమ్మను ప్రత్యక్షంగా చూస్తూ ఆమెతో ఇరవైముప్ఫై ఏళ్ళు కలసి ఉన్నవారే.అయితే, జిల్లెళ్ళమూడిలో ఉన్న అందరూ అలాంటివారు కారు.అమ్మంటే అచంచలమైన విశ్వాసంతో, తిరుగులేని నమ్మకంతో, అమ్మ చూపిన దారిలో నడుస్తూ తమతమ జీవితాలను గడిపిన చరిత్రకు అందని అనామకులు కూడా చాలామంది ఉన్నారు.కానీ ఇంకొంతమంది దీనికి పూర్తి వ్యతిరేకంగా,అమ్మతో ఏళ్ళకేళ్ళు దగ్గరగా ఉండికూడా అమ్మ తత్త్వాన్ని అర్ధం చేసుకోలేని వారుకూడా ఉన్నారు. వారిలో బాగా ప్రముఖవ్యక్తులూ గురువులూ కూడా ఉన్నారు.

మళ్ళీ వీరందరూ అమ్మ మాటల్ని గొప్పగా కోట్ చేసేవారే.అమ్మ చెప్పిన, ఆచరించి చూపిన తత్త్వం ప్రపంచపు ఆధ్యాత్మిక చరిత్రలోనే అత్యున్నతమైనదన్న విషయాన్ని వీరు కూడా స్టేజీలెక్కి ఉపన్యాసాలలో గొప్పగా చెబుతారు.మరి అలాంటప్పుడు ఇంకొక చోటికి పోవడం ఎందుకు? ఒకచోట నిజంగా నీ కడుపు నిండితే ఇంకొక భోజనశాలతో నీకు పనేమున్నది? నీకు నిజంగా ఆకలి ఉంటే, మంచి భోజనం ఒకచోట నీకు దొరికితే--చక్కగా తిను.దానిని వదలి ఇంకొకచోటికి,సగం తిని అది వదిలేసి అక్కడనుంచి ఇంకొక చోటకీ,ఆ తర్వాత మళ్ళీ ఇంకొకచోటకీ పోవడం ఎందుకు?నా సందేహం ఏమంటే -- అమ్మ దగ్గర అంత అత్యున్నతమైన జ్ఞానం దొరుకుతున్నపుడు ఇంకొక చోటికి మీరు వెళ్ళవలసిన పనేముంది?

దీనికి లాజికల్ గా రెండే సమాధానాలున్నాయి.

ఒకటి - పైపైకి అమ్మ తత్త్వం అత్యున్నతం అత్యుత్తమం -- అంటూ మాటలు చెప్పినప్పటికీ,లోలోపల ఆ మాటలమీద వీరికే పరిపూర్ణ నమ్మకం లేదు.

లేదా,

రెండు - వీరికి మహిమలమీదా, మహత్యాల మీదా, అప్పనంగా అయ్యే పనుల మీదా ఇంకా ఆశ చావలేదు.అలాంటి గారడీలను అమ్మ హర్షించదు గనుక, ఆయా చోట్ల గారడీలు ఉంటాయి గనుకా వీళ్ళు అటు పోతూ ఉంటారు.

ఎవరో ఒకాయన గాల్లోంచి హస్తలాఘవంతో బూడిద తీస్తే కళ్ళు తిరిగి పడిపోయేవారికి, లేదా ఇంకొక సమాధి దగ్గర ఏదో పనికిమాలిన మొక్కు మొక్కుకుని,ఆ తర్వాత ఆ పని జరిగితే అదేదో పెద్ద గొప్పలాగా పుస్తకాల్లో వ్రాసుకునే వారికీ-- 'నీవు చూచే ప్రతిదీ మహత్యం కాదా నాన్నా? ' అనే అమ్మ మాట ఎలా ఎక్కుతుంది?అసలు అమ్మ స్థాయి ఏమిటో ఇలాంటి మనుషులకు ఎలా అర్ధమౌతుంది?

అసలు సంగతేమంటే -- వీరికి సరియైన ఆకలి లేదు.పైగా తిన్నది కాస్తా సరిగ్గా వంటబట్టని అజీర్ణరోగం కూడా తోడైంది.అందుకే ఇలాంటి ఉరుకులు పరుగులు.

నా దృష్టిలో ఇలాంటి భక్తులందరూ మతాలు మారే అజ్ఞాన హిందువుల వంటివారే.హిందూమతంలో లేనిది ఇతర మతాలలో ఎక్కడా ఏమీలేదు.అన్ని మతాలనూ కూలంకషంగా స్టడీ చేసిన మీదట నేను ఈ మాటను చెబుతున్నాను.కానీ నేటికీ అనేకమంది హిందూమతం నుంచి ఇతర మతాలలోకి మారుతున్నారు.వారు ఎందుకు మారుతున్నారో,అలా మారటానికి వారిని ఏవేవి ప్రేరేపిస్తున్నాయో అందరికీ తెలుసు.అలా మారే వారికి కావలసింది జ్ఞానంకాదు.డబ్బు.అప్పనంగా కోరికలు తీరడం వారి గమ్యం. దానికి ఒక ఆధ్యాత్మిక ముసుగు వేస్తారు.అంతే. 

అలాగే - ఒక అత్యున్నతమైన వేదాంతాన్నీ, అత్యున్నతమైన జీవన విధానాన్నీ అమ్మ దగ్గర చవిచూచిన తర్వాత కూడా,ఇంకా షిరిడీ అనీ, పుట్టపర్తి అనీ,అరుణాచలం అనీ ఇంకేదో అనీ అక్కడకూ ఇక్కడకూ పరుగెత్తుతూ ఉన్నారంటే--అలాంటి వారిలో ఆశలూ కోరికలూ ఇంకా చావలేదనీ,అసలు తత్త్వం వారికి ఇంకా అర్ధం కాలేదనీ,నిజమైన గమ్యానికి అలాంటివారు ఇంకా చాలా చాలా దూరంగానే ఉన్నారనీ నేను భావిస్తాను.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని చెప్పుకునే వారిని నేను అంచనా వేసే తీరు చాలా విలక్షణంగా, చాలా సూక్ష్మంగా ఉంటుంది.ఈ గీటురాయి పరీక్షలో పాసవడం చాలా కష్టం.

అన్నయ్య చెప్పడం సాగించారు.

'వచ్చే నెల 26 తేదీన షిరిడీ'- అని ఒకరోజున నాచెవిలో ఒకమాట వినిపించింది.అంటే ఆరోజున నేను అక్కడ ఉండాలేమో అని ఆరోజుకు అక్కడుండేలా రాఘవరావు అనే ఒక స్నేహితుని తీసుకుని బయల్దేరాను.సరే షిరిడీ చేరాక ఒక రూము తీసుకున్నాము.

రూములో ఉండగా--'మీ అనుభవాలను ఒక పుస్తకంగా ఎందుకు తేకూడదు?' అని రాఘవరావు అన్నాడు.

'నేనేంటి? పుస్తకం వ్రాయడం ఏంటి?'- అన్నాను.

'కాదు మీరు వ్రాయవలసిందే'- అని ఆయన అన్నాడు.

'అయితే ఒక పని చేద్దాం.నేను చెబుతూ ఉంటాను.మీరు వ్రాయండి' అన్నాను.

ఆయన -'సరే' అని అప్పటికప్పుడు కాగితం కలం తీసుకుని కొన్ని అనుభవాలను నేను చెబుతుంటే చిత్తుప్రతిగా వ్రాశాడు.

ఆ తర్వాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన సమాధికి నేను ఒక చద్దర్ సమర్పించాను. అప్పుడు మళ్ళీ --' ఆ చద్దర్ ను నీ స్నేహితునికి కప్పు' -- అన్న మాటలు నాకు వినిపించాయి.గదికి తిరిగి వచ్చాక ఆ చద్దర్ ను రాఘవరావుకు కప్పాను.ఎందుకంటే, పుస్తకం వ్రాయమన్న ఆలోచనను కలిగించింది రాఘవరావే.అందుకని బాబా ఆయనకు చద్దర్ను కప్పించారు. అలా ఆ పుస్తకం రూపు దిద్దుకున్నది.' అన్నారాయన.

ఈ మాటలు వింటున్నప్పుడే నాకు చిరాకు మొదలైంది.ఇలాంటి కధలు చాలామంది చెప్పగా నేను విన్నాను.వాటిల్లో నూటికి 99% వీరి భ్రమలే గాని ఇంకేమీ ఉండవు.

'జడివాన మనమీద కురిసినా అందులో ఒక్క బొట్టుకూడా మనలోకి ఇంకదు. ఆ నీరు మన శరీరం మీదనుంచి జారి నేలమీద పడి బురదలో కలవాల్సిందే కదా'-- అనిపించింది.

అయితే నేనేమీ జవాబు చెప్పలేదు.మౌనంగా వింటున్నాను.

'షిరిడీబాబా లాగే అమ్మ కూడా మూడురోజులు సమాధిలోకి వెళ్ళారు.అసలు వీళ్ళు ఇలా సమాధిలోకి వెళ్లి ఎక్కడకు పోతారు? ఆ సమయంలో వీరి ఆత్మలు ఎక్కడుంటాయి?' అని నేను ఆలోచించాను.దానికి జవాబు నాకు మెహెర్ బాబా గారి పుస్తకాలలో దొరికింది.'-- అన్నారాయన.

నాకు లోపల్లోపల పొట్ట చెక్కలయ్యే నవ్వు వస్తూ ఉన్నది.అయినా తమాయించుకుని వింటున్నాను.ఎందుకంటే నేను మెహర్ బాబా గారి సాహిత్యం మొత్తం చదివాను.కనుక అన్నయ్య ఏమి చెప్పబోతున్నారో నాకు ముందే అర్ధమైపోయింది.

'ఈ ప్రపంచపు administration నడపడానికి ఏ సమయంలోనైనా సరే, అయిదుగురు సిద్ధపురుషులు ఉంటారు.ప్రపంచం మొత్తం వీరి కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది.వారిలో ఒక్కొక్కరి క్రింద మళ్ళీ  11 మంది ఉప సిద్ధపురుషులు ఉంటారు.అంటే మొత్తం 55 మంది ఉంటారు.మళ్ళీ వీరిలో ఒక్కొక్కరికి 11 మంది అసిస్టెంట్లు ఉంటారు.అప్పుడు ఆ సంఖ్య 555 అవుతుంది.' అన్నారు అప్పారావన్నయ్య.

'అదేంటి 55x11=605 కదా ఈయన 555 అంటారేమిటి?' అని నాకు వెంటనే సందేహం వచ్చింది -- 'సర్లే,వారెంతమంది ఉంటే మనకెందుకులే'-అని మాట్లాడకుండా వింటున్నాను..

'ఈ విధంగా వీరందరూ కలసి ప్రపంచపు వ్యవహారాలు చూస్తుంటారు.అంటే అది U.N.O లాంటి యూనివర్సల్ బాడీ అన్నమాట.వీరికి అప్పుడప్పుడూ మీటింగులు జరుగుతూ ఉంటాయి.ఆ మీటింగులు మన కాలపు లెక్కలో మూడురోజుల పాటు జరుగుతాయి.బాబాగారూ అమ్మగారూ మొదలైనవాళ్ళు సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆ మీటింగు అటెండ్ కావడానికి అలా వెళుతూ ఉంటారు.' అని ముక్తాయింపు ఇచ్చారు అన్నయ్య.

'ఇంకాసేపు ఉంటె,వాళ్ళందరూ 555 సిగిరెట్లే ఆ మీటింగులో త్రాగుతారు.అసలా కంపెనీని పెట్టింది వాళ్ళే అనికూడా వినవలసి వస్తుందేమో భగవంతుడా?అని లోలోపల అనుకుంటూ --'అదేంటి? బాబాగారు మూడ్రోజుల సమాధిలో కెళ్ళినపుడు దేహం చాలిస్తున్న రామకృష్ణులకు సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళారని ఇంకొక ప్రసిద్ధ గురువుగారు తనే పక్కనుండి చూచినట్లుగా ఒక పుస్తకంలో వ్రాశారు కదా?' వెంటనే అడిగాను.

'అదేమో నాకు తెలియదు.నాకు అర్ధమైనది ఇది.' - అని అన్నయ్య అన్నారు.

ఈ మాటలు వింటుంటే నాకు ఇంకొక డౌటు కూడా వచ్చింది.

'ఈ సమాఖ్య 555 తోనే ఆగిందా? లేక ఆ అసిస్టెంట్ షిప్పులు అలా 5555 గా, ఆ తర్వాత 55555 గా, అలా పెరిగి పెరిగి ప్రపంచ జనాభా అంత అయ్యిందా? ఎందుకంటే, ప్రపంచంలో ఎవరి కర్మకు వాడే బాధ్యుడు కదా.అంటే ప్రపంచ వ్యవహారాలలో ప్రతివాడికీ కొద్దో గొప్పో పాత్ర ఉండే ఉంటుంది.కనుక ఈ మీటింగ్ లో ప్రతివాడూ తెలిసో తెలియకో భాగస్వామే అన్నమాట? మరి ఆ మీటింగ్ లో పాస్ అయిన రిజోల్యూషన్స్ అందరికీ సర్కులర్ పంపిస్తారా? లేక వాళ్ళలో వాళ్ళే గుప్తంగా సీక్రెట్ అజెండా లాగా ఉంచుకుంటారా?'- అందామని నోటిదాకా వచ్చింది.అడిగే సందర్భం కాదని ఆ మాటను లోలోపలే ఉంచేశాను.

ఈలోపల అన్నయ్య ఇంకొక పిడుగులాంటి మాటను అన్నారు.

'షిరిడీ సాయిబాబా ఆంజనేయస్వామి అవతారం అని ఒక వాదన ఉన్నది.ఈ మధ్యన దానికి బాగా ప్రచారం వస్తున్నది'

ఈ మాట వింటూనే--విన్నది చాల్లే--ఇక లేచి బయల్దేరదామని నాకు అనిపించింది.

'ఎందుకంటే - ఇలాంటి వాదనలు నేను చాలా వినివిని విసుగెత్తి ఉన్నాను.అదే నిజం అయితే దానికి వాదనలెందుకు?వాదనతో ఎవరికి దీనిని నిరూపించాలి? అలాంటి అవసరం అసలు ఎందుకు? అలా నిరూపించడం వల్ల లాభపడేది ఎవరు? నిరూపించేవారా? నిరూపింపబడేవారా? లేక లోకులా?'--అనే ప్రశ్నలు నానుంచి వెంటనే వస్తాయి.

నా ప్రశ్నలు అడగడం మొదలుపెడితే పెద్దాయన పాపం బాధ పడతారని ఓపికగా మౌనంగా ఊరుకున్నాను.

అక్కడనుంచి సంభాషణ వేరే దారి తీసుకుని ఎండ్ అయిపోయింది.ఆ తర్వాత సెలవు తీసుకుని మేము గుంటూరుకు బయల్దేరాము.అదంతా పాత పోస్ట్ లో మీరు చదివారు.

దారిలో మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను గాని, నాలో ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి.

ఆధ్యాత్మిక అనుభవాలు ఒకటో రెండో కలిగినంత మాత్రాన మనిషికి సంపూర్ణ పరిపక్వత రాదని నాకు తెలుసు.అలాంటి పరిపూర్ణమైన పరిపక్వత రావాలంటే ఎంతో సాధన ఉండాలనీ, అదంత ఆషామాషీ వ్యవహారం కాదన్న విషయం కూడా నాకు తెలుసు.ఎందుకంటే అలాంటి సాధన ఒకటి రెండు ఏళ్ళలో అయిపోయేది కాదు.చాలాసార్లు జన్మలకు జన్మలే ఆ సాధనలో ఆహుతి అయిపోతాయి.

కానీ అమ్మలాంటి వారి దగ్గర అన్నన్ని ఏళ్ళు ఉన్నవారిలో కూడా ఇలాంటి అనవసరమైన ఆధ్యాత్మిక కబుర్లు ఎందుకుంటాయి?వీరికి నిజమైన అంతరిక స్థాయిలు అందినట్లా? లేదా? అన్న ప్రశ్నకు 'లేదు' అనే సమాధానమే నాలోనుంచి వస్తున్నది.ఒకవేళ అందినా అది తాత్కాలికమే గాని శాశ్వతం కాదు అని ఇంకొక సమాధానం వస్తున్నది.

షిరిడీబాబా గానీ,అమ్మగారు గానీ సమాధిలో మూడురోజులు ఉంటే, ఆ సమయంలో వాళ్ళు ఎక్కడకు పోయారు? ఏం చేశారు? అన్న విషయాలు తెలుసుకోవాలని కుతూహలం మనకెందుకు? వాళ్ళు చెప్పినవి మనం అనుసరించి మన నిత్యజీవితంలో వాటిని ఆచరిస్తే చాలదా? ఈ అనవసర విషయాలతో మనకేమిటి పని?వాళ్ళు ఎక్కడికి పోతే మనకెందుకు?అనవసర పాండిత్య ప్రకర్ష తప్ప ఇందులో ఏమున్నది?

ఇలాంటి సూడో ఆధ్యాత్మికత వల్ల సమాజంలో గొప్ప కీడు జరుగుతున్నది. ముఖ్యంగా ఇలాంటి అనవసర ప్రచారాలకు షిరిడీబాబాను చక్కగా వాడుకుంటున్నారు.ఎందుకంటే ఆయనకు కాపీ రైట్ లేదుకదా.ఎవరైనా ఆయన గురించి ఏ కధైనా అల్లి చెప్పవచ్చు.పిచ్చిజనం తేలిగ్గా నమ్మేస్తారు. ఎందుకంటే - అసలు సత్యం ఏదైనా కానీ, జనానికి కావలసింది వారివారి పనులు తేరగా కావడమేగా?

షిరిడీబాబా పరమశివుని అవతారం అనే ఒక పచ్చి అబద్దం ఈ మధ్యన కొన్ని వర్గాలలో ప్రచారం కాబడుతున్నది.నేటివరకూ ఆయన్ను దత్తాత్రేయస్వామి అవతారం అని మహారాష్ట్రులు నమ్ముతున్నారు.నిజానికి అది కూడా సత్యంకాదు.దత్తాత్రేయునికీ షిరిడీబాబాకూ ఎలాంటి సంబంధమూ నిజానికి లేనేలేదు.కబీర్ మార్గానికి చెందిన ఒక సెయింట్ అయిన బాబాకు హిందూ ప్రతిపత్తి అంటగట్టే ప్రయత్నంలో భాగంగా  ఆయనకు దత్తాత్రేయునితో లింక్ పెట్టారు.కానీ అది నిజంకాదు.

నిజానికి ఆ దత్తాత్రేయుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.ఆయన ఆకాశం లాంటి వాడు.ఎవరికీ దొరకడు.ఆయనకూ కాపీ రైట్ లేదు.కనుక most unpredictable Avadhuta అయిన దత్తాత్రేయుడిని ఇలా వాడుకుని బాబా ఆయన ఆవతారమే అంటూ మొదటితరంలో వారు పుస్తకాలు వ్రాశారు. రెండోతరంలో ఇంకొంతమంది గురువులు,ముఖ్యంగా ఆంధ్రాలో తలెత్తిన సోకాల్డ్ గురువులు,తమకు తోచిన ఇంకొన్ని కధలను అల్లి ఇంకొన్ని పుస్తకాలు వ్రాసి జనం మీద రుద్దేశారు.మూడుతరాలు గడిచేసరికి అదే నిజమై కూచున్నది.ఆ గ్రంధాలన్నీ పనులు కావడం కోసం చదివే పారాయణ గ్రంథాలై కూచున్నాయి.

అవస్థాత్రయ సాక్షిగా నిరంతరం భాసిల్లుతూ ఉండే పరమజ్ఞానమూర్తి అయిన దత్తాత్రేయుడెక్కడ? పెళ్లి కావాలంటే ఈ అధ్యాయం చదువు.పిల్లలు పుట్టాలంటే ఈ అధ్యాయం చదువు,చదవకపోతే నువ్వు నాశనం అవుతావు అని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేసే పుస్తకాలెక్కడ?ఆయనెక్కడో మేఘాల పైన సూర్యుడిలా వెలుగుతూ ఉంటే,ఈ పుస్తకాలేమో చీకటితో నిండిన పాతాళంలోకి జనాన్ని తీసుకుపోతున్నాయి.ఆయనకూ ఈ పుస్తకాలకూ అసలేమిటి సంబంధం?ఎంత అసంబద్ధం?

ఈ అబద్దపు నిజాన్ని నమ్మేవారు నేడు సమాజంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు.ఈ అబద్ధం మీద ఆధారపడి ఎన్నో వ్యాపారాలు నిరాఘాటంగా నేడు నడుస్తున్నాయి.కలిప్రభావం ఇది కాకపోతే ఇంకేంటి?

ఈ మధ్యనే ఒక పెద్దాయన నాకు మెయిల్ ఇచ్చారు.

'నేను షిరిడీబాబాతో డైరెక్ట్ గా మాట్లాడతాను.ఆయనే ఒక గురువును నాకు చూపించి 'నీవు ఈయన్ను అనుసరించు' అని చెప్పాడు.అప్పటినుంచీ ఆ గురువునే నేను అనుసరిస్తున్నాను.కానీ ఈ మధ్యన ఆ గురువు కమర్షియల్ గా మారిపోతున్నాడు.అందుకని ఆయన్ను వదిలేసి మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను.మీ సలహా ఏంటి?'--అనేది ఆ మెయిల్ సారాంశం.

నేను ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగాను.

'మీరు షిరిడీబాబాతో మాట్లాడటం అసలు నిజమేనా? లేక మీ భ్రమా? అది నిజమే అయితే,ఒక దొంగ గురువు దగ్గరకు మిమ్మల్ని ఆయనెందుకు డైరెక్ట్ చేస్తాడు?పోనీ మీరు బాబాతో మాట్లాడటం నిజమే అనుకుందాం. అలాంటప్పుడు,బాబా చూపిన గురువును,మీ సొంత నిర్ణయంతో వదిలెయ్యడం ద్వారా బాబా ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తున్నట్లే కదా?అసలు బాబానే ఒక సద్గురువు కదా?మళ్ళీ ఇంకొక మానవగురువు దగ్గరకు వెళ్ళమని ఆయన మీకెందుకు చెబుతాడు? బాబాతోనే డైరెక్ట్ గా మాట్లాడే మీకు మానవగురువు యొక్క అవసరం ఏమిటి?'

దానికి మళ్ళీ మెయిల్ వచ్చింది.

'బాబా నన్ను మానవగురువు దగ్గరకు వెళ్ళమని చెప్పిన సమయంలో ఈ గురువు బాగానే ఉన్నాడు.ఈ మధ్యనే ఆయనలో పెడబుద్దులు పుడుతున్నాయి.డబ్బాశతో చెడిపోతున్నాడు.బాబా పరమశివుని అవతారం. ఆయన ఒక మానవగురువు ద్వారానే పనిచేస్తాడు.కనుక ఈ మానవగురువు వద్దకు నన్ను డైరెక్ట్ చేశాడు.'

నా సమాధానం.

'అయితే ముందుముందు ఈ గురువు ఇలా చెడిపోతాడని త్రికాలవేది అయిన బాబాకు తెలియదా? లేక తెలిసినా మీతో చెప్పడం మర్చిపోయాడా? బాబా పరమశివుని అవతారం అని ఎక్కడా లేదే? ఈ కొత్త కాన్సెప్ట్ మీ క్రియేషనా?'

ఈ విధంగా అనేకమంది అనేక రకాలైన భ్రమల్లో కాలాన్ని వెళ్ళదీస్తూ, ఆ భ్రమలు నిజాలే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు.ఇలాంటివారికి - 'బాబూ ఇదీ సత్యం' - అని చెప్పినా వారు దానిని ఎన్నటికీ నమ్మలేరు.సత్యాన్ని స్వీకరించలేరు.ఎందుకంటే సత్యాన్ని యధాతధంగా స్వీకరించాలంటే దానికి చాలా ధైర్యం ఉండాలి.

ఈ విషయంలో రమణమహర్షి చాలా అదృష్టవంతుడు.ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో పుట్టలేదు గనుక.ఒకవేళ ఆయనే గనుక అక్కడ పుట్టిఉంటే, ఆయనను కూడా దత్తాత్రేయుని అవతారంగా ప్రచారం చేసేవారు.ఆయన తమిళనాడులో పుట్టడంవల్ల పిచ్చిజనం చేతిలోనుంచి రక్షింపబడ్డాడు.కానీ ఆయన్ను కూడా జనం వదలలేదు.తమిళనాడులో మురుగన్ భక్తి ఎక్కువ గనుక ఆయన్ను మురుగన్ అవతారం చేసి కూచోబెట్టారు.

మహారాష్ట్రులేమో దత్తావతారమే షిరిడీబాబా అంటున్నారు.ఆంధ్రాలో కొందరేమో ఆయన పరమశివుని అవతారం అంటున్నారు.ఇంకొందరు ఆయన అంజనేయస్వామి అవతారం అంటున్నారు.ఎవరి వ్యాపారం వారిది. ఎవరి యాడ్స్ వారివి.ఎవరి సేల్స్ వారివి.జనంలో ఉన్న ఈ పాపులారిటీని ఆధారంగా తీసుకుని సినిమావారు వారి పని వారు చేసుకుంటున్నారు.ఈ మొత్తం వ్యాపారంలో సమిధలయ్యేది మాత్రం పాపం అమాయకులైన బాబా, దత్తాత్రేయుడూ మాత్రమే.ఈ అబద్దపు ప్రచారంలో ఎన్ని లక్షలమంది ఇప్పటిదాకా మోసగింపబడ్డారో?ఇంకా మోసగింపబడుతున్నారో?ఎంత ఘోరం !!

మనుషులు తమతమ బ్రతుకుతెరువు కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతారు. కానీ విచిత్రం ఏమంటే -- ఈ అబద్దపు గేం లో మహనీయులకూ దేవుళ్ళకూ కూడా రకరకాలైన వేషాలు వెయ్యడం,మన స్క్రిప్ట్ లో వాళ్ళనూ పాత్రధారులను చెయ్యడం,నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి లోకాన్ని నమ్మించడం, మనమే వాళ్లకు బొడ్డుకోసి పేరు పెట్టినట్లు--వారి అవతారం వీరని, వీరి అవతారం వారని--ఎవరికి తోచిన కధలు వాళ్ళు అల్లి ప్రచారాలు చేస్తున్నారు. ఈ లోకంలో అబద్దాలే నిజాలుగా చెలామణీ అవుతాయి.నిజమైన నిజం ఎవరికీ అక్కర్లేదు.

అబద్దపు వగలాడిని అందరూ ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు.కానీ నిజపు ముసలమ్మను మాత్రం ఎవరూ ఇంటి చాయలకు కూడా రానివ్వరు.ఈ సమాజం గతి ఇంతే.

ఆధ్యాత్మిక అనుభవాలు అవి ఎంతటి గొప్ప స్థాయివైనా సరే, ఒక్కసారి కలిగితే ఏమీ ఉపయోగం లేదు.అవి నిరంతరం మన సొత్తుగా మారాలి.అనుకున్న క్షణంలో మనం ఆ స్థితిని అందుకోవాలి.నిరంతరం ఊర్ధ్వముఖంగా మన ప్రయాణం సాగాలి. అప్పుడే మనం నిత్యమూ సత్యంవైపు ప్రయాణం చేస్తూ ఉంటాం.ఏ కారణం చేతనైనా ఊర్ధ్వముఖంగా సాగే ఈ ప్రయాణం ఆపామా? ఇక పిట్ట కధలూ, సొట్టకధలూ మనల్ని పట్టుకుంటాయి.

మొక్కులు మొక్కుకోడాలు,ఒక దణ్ణం పడేస్తే అప్పనంగా పనులు కావడాలు, ఎవరి అవతారం ఎవరు అనే మీమాంసలు,చర్చలు, అనవసర సంభాషణలు, సూడో ఆద్యాత్మికతలు,సూడో గురువులు,సూడో సిద్ధాంతాలు ఇవన్నీ మనల్ని మింగేస్తాయి.

అందుకే ఆధ్యాత్మిక లోకంలో నిరంతర జాగరూకత ఎంతో అవసరం.సత్యాన్ని చేరుకోవాలంటే అతికష్టం అని అందుకే ప్రాచీనులందరూ అన్నారు. నిజమైన ఆధ్యాత్మికప్రయాణం అనేది కత్తిమీద నడక అని ఉపనిషత్తులే అన్నాయి. సత్యసాధకునికి నిత్యశోధన ఎంతో అవసరం.అది ఆగిన మరుక్షణం ఇలాంటి లోకబూటకాలలో ఏదో ఒకదానికి మనం వశమై పోతాం.

మనలోపల స్వచ్చత ఉండవలసినంత ఉండకపోతే బయట కూడా అలాంటి ఏదో ఒక సూడో స్కూల్లోనే మనం చేరవలసి వస్తుందన్నది పచ్చినిజం.దీనికి ఎంతటివారైనా అతీతులు ఏమాత్రం కారు. కాలేరు.

అందుకేనేమో--"ఎవరినీ నమ్మవద్దు నీ సత్యశోధనాకాంక్షను తప్ప"-- అని జిడ్డు కృష్ణమూర్తి అన్నారు.కానీ ఐరనీ ఏమంటే--ఏ గురువునూ నమ్మవద్దు అని చెప్పిన ఆయన్నే ఒక గురువును చేసి కూచోబెట్టారు జనం.ఇంకొక విచిత్రమేమంటే -- ఈ విషయంకూడా ఆయనకు అనేకమంది గురువుల శిష్యరికం తర్వాతనే అర్ధమైంది.ఆయనకే అంత కష్టం అయితే --ఇక మనకూ ఈ సంగతి అనుభవం ద్వారా అర్ధం కావాలంటే ఎన్ని యుగాలు పడుతుందో?

నా ఆలోచనలను ఆపుతూ పక్క సీట్లోంచి మా అబ్బాయి మాధవ్ ఇలా అన్నాడు.

'నాన్నా. ఇదేమీ నాకు అర్ధం కావడంలేదు.ఒకపక్క అమ్మను జగన్మాత అంటున్నారు.ఇంకొక పక్కన మళ్ళీ వేరే మహాత్ములకోసం పరిగెడుతున్నారు. ఇదేంటి?అమ్మ జగన్మాత అని వీరికి నమ్మకం నిజంగా ఉందా?సాక్షాత్తూ జగన్మాతే పక్కన ఉన్నప్పుడు వేరేవారి అవసరం ఏముంది? అమ్మను చూడలేకపోయామే అని మేము ఎంతో బాధపడుతున్నాం.కానీ, చూచినవారికి మాత్రం ఒరిగినదేమిటి? అమ్మ చెప్పిన బోధలు ఆచరణలోకి రానప్పుడు ఉపయోగం ఏముంది?'

నేను మౌనంగా నవ్వాను.

జారుడుమెట్లూ, పాకుడురాళ్ళూ లౌకికజీవితంలో కంటే, ఆధ్యాత్మికజీవితం లోనే ఎక్కువ.లౌకికజీవితంలో అజాగ్రత్తగా ఉంటే,కొద్ది నష్టమే జరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటే జరిగే నష్టం చాలా ఘోరంగా ఉంటుంది.అదేమంటే -- ఇలాంటి అబద్దపు భావాలలో ఏదో ఒకదానికి మనం తేలికగా లోబడిపోయి, మనం సత్యాన్నే అనుసరిస్తున్నాం అనే భ్రమలో,అసత్యపు ఛాయలో బ్రతుకుతూ ఉంటాం.దీనిని మించిన పెద్ద ప్రమాదం ఇంకెక్కడుంది?

An inch of difference and heaven and hell fall apart - అంటాడు చైనీస్ తత్త్వవేత్త లావోజు.

నిజమే. మన ఆలోచనలలో ఉన్న ఒక చిన్న అసంబద్ధత కూడా అతి పెద్ద ట్రాప్ లో మనల్ని ఇరికిస్తుంది.అది ట్రాప్ అని తెలిసేసరికే మన జీవితం అయిపోను కూడా అయిపోతుంది.

ఓ సత్యమా !!
ఎంత కష్టం నిన్ను అనుసరించడం !!
ఎంత జాగరూకత అవసరం !!
ఎంత ఓర్పు అవసరం !!

నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.గుంటూరు రానే వచ్చింది.అర్ధరాత్రికి ఇంటికి చేరి, ఆలోచననలు పక్కకు పెట్టి నిద్రకు ఉపక్రమించాను.