“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, మార్చి 2015, శనివారం

సూపర్ సింగర్ శరత్ చంద్రతో...

సూపర్ సింగర్ ఫేం 'శరత్ చంద్ర' ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి ఆ మధ్యన ఒకరోజు గుంటూరుకు వచ్చాడు.

వాళ్ళు మాకు ఫేమిలీ ఫ్రెండ్సే గనుక, ఎలాగూ గుంటూరుకు వచ్చాడు కదా అని మా ఇంటికి ఆహ్వానించాను. వాళ్ళ అన్నయ్య డా||కృష్ణతేజతో కలసి మా ఇంటికి వచ్చాడు.ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది.

మాటల సందర్భంలో--'అంకుల్.మీ పాటలు వింటుంటాను.బాగుంటాయి.' అన్నాడు.

'ఆ! నాదేముందిలే బాబూ.నేనెక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నానా పాడా? ఏదో బాత్రూం భాగవతార్ని.నాదంతా వినికిడి సంగీతం.కాకపోతే ఇదంతా మా అమ్మగారి నుంచి వచ్చింది.ఆమె చాలా బాగా పాడేవారు.పీ.సుశీలా, భానుమతులతో సమానంగా పాడగలిగేవారు.అంత మంచి వాయిస్ ఆమెది. అదే నాకూ కొద్దిగా వచ్చింది.అంతే.' అన్నాను.

'నేను నీ అభిమానిని బాబూ'- అని చెప్పాను.

శరత్ చాలా బాగా పాడుతాడు.కొన్నేళ్లుగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు.అతనికి ప్రస్తుతం 18 లేదా 19 ఏళ్ళు మాత్రమె ఉంటాయి.కానీ వాయిస్ లో చాలా మెచూరిటీ ఉన్నది.మంచి స్వరజ్ఞానం లయజ్ఞానం రాగజ్ఞానం ఉన్న పిల్లవాడు.అంతా వాళ్ళమ్మగారి ట్రైనింగ్ అని చెప్పాడు.వాళ్ళమ్మగారు మ్యూజిక్ లో డిప్లొమా చేశారు.

అతని ప్రోగ్రామ్స్ కొన్ని మాత్రమె నేను చూచాను.చాలా చిన్నప్పటి నుంచీ టీవీలో కనిపిస్తాడు.చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు 'మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం...' అని అభినయం చేస్తూ పాడి కడుపుబ్బ నవ్వించాడు.ఆ ఎపిసోడ్ చూచాను.ఆ తర్వాత 'శివశంకరీ శివానంద లహరీ...' అంటూ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో పాడి మెప్పించాడు.ఆ పాటను ఘంటసాల మాస్టారే రెండోసారి పాడమంటే యధాతధంగా పాడలేకపోయారని అంటారు.అలాంటిది, పిల్లలు ధైర్యంగా ఆ గమకాలూ అవీ సునాయాసంగా పాడేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.

ఆ తర్వాత టీనేజిలోకి అడుగుపెట్టే సమయంలో, అమ్మాయి వాయిస్ పోయి అబ్బాయి వాయిస్ వచ్చే సమయంలో, కొంత ఇబ్బందిపడ్డాడు.కొన్ని ప్రైజులు కూడా మిస్ అయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే మేల్ వాయిస్ వస్తున్నది.ఇది స్టెబిలైజ్ అయితే ముందుముందు చాలా మంచి గాయకుడు అవుతాడు.

శరత్ చంద్రకు మంచి భవిష్యత్తు ఉండాలనీ,ముందుముందు అతను అద్భుతమైన గాయకుడుగా రూపొంది మనకు ఎన్నో మంచిపాటలను అందించాలనీ అతన్ని ఆశీర్వదిస్తున్నాను.