నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

22, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగసిద్ధాంతం-7(వ్యావహారిక యుగములు-ఉపయుగములు)

హిందువులలోని పండితులలో,ముఖ్యంగా తెలుగువారిలో,పండితమ్మన్యత చాలా ఎక్కువ.అంటే పండితాహంకారం అన్నమాట.తమకు తెలియని ఒక కొత్త విషయాన్ని ఎవరైనా పరిశోధనాత్మకంగా కనుక్కొని చెబితే దానిని వారు వెంటనే ఒప్పుకోలేరు.అలా ఒప్పుకోడానికి వారివారి అహంకారాలు చాలా తీవ్రంగా అడ్డొచ్చేస్తాయి.ఎదుటివారు ఏదైనా పరిశోధన చేస్తే దానిలో వారికొచ్చే నష్టమేమిటో నాకెప్పటికీ అర్ధంకాదు.దీనినే పీతపధ్ధతి అంటారు.వారు ఎదగలేరు.ఎదుటివారు ఎదిగితే సహించలేరు.ఇదీ తెలుగువాడి తెగులు.

వారు చెయ్యలేని పనిని ఇంకొకరు చేస్తే దానిని అభినందించే పెద్దమనసు వారిలో ఎక్కడా ఉండదు.వారు పెద్దమాటలు చెబుతారు.కానీ వారి హృదయాలలో పెద్దతనం ఎక్కడా ఉండదు.అక్కడ మాత్రం అసూయే ఉంటుంది.అది వారి మాటలలో అల్పత్వంగా ప్రతిధ్వనిస్తుంది.ఇలాంటి వారిని చూస్తె నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది.

ఇకపోతే పాండిత్యజ్ఞానం లేని తెలుగు సామాన్యులకు ఇంకొక రకమైన హీనమైన ప్రవృత్తులుంటాయి.ప్రతిదానినీ పనున్నా లేకున్నా ఎగతాళి చెయ్యడమే ఆ నీచప్రవృత్తి.ఇలాంటి వారినిచూస్తే వారి హీనత్వానికి నాలో జాలి కలుగుతుంది.ఇలాంటి మెయిల్స్ చూచినప్పుడు అయితే నవ్వు లేకుంటే జాలి-ఈ రెండు భావాలే నాలో కలుగుతాయి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుత యుగసిద్దాంతం సీరీస్ వ్రాస్తుంటే ఈ రెండురకాల మనుషులనుంచి నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. తెలుగువారిలో ఇంతకంటే ఉన్నతమైన మనుషులను ఆశించడమే ఒక పెద్ద పొరపాటు గనుక వారి ఖర్మకు వారిని ఒదిలేస్తున్నాను.

నేను ఈ సీరీస్ వ్రాస్తున్నది సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన ఉన్న ఋజుహృదయుల కోసంగాని పై రెండురకాల మనుషుల కోసం కాదు.ఈ రెండు రకాల మనుషులకు అసలు జవాబు ఇవ్వడమే పెద్ద టైం వేస్టుగా నేను భావిస్తాను.

ఇక ప్రస్తుతం లోకి వద్దాం.

యుగధర్మాలు

యుగధర్మాలు ఎలా ఉంటాయి.మేక్రో మైక్రో యుగాలలో ఇవి ఎలా సర్దుబాటు అవుతాయి?అని కొందరు నన్ను అడుగుతున్నారు.వారికోసం ఈ సమాధానం ఇస్తున్నాను.జ్యోతిష్యశాస్త్రంలోని దశా అంతర్దశల వలెనే ఇవి ఉంటాయి.

జ్యోతిశ్శాస్త్రంలోని దశలలో కొన్ని విచిత్రములైన దశలున్నాయి.వాటిని చాలా కొద్దిమంది మాత్రమె వాడుతూ ఉంటారు.వాటిలో "కాలచక్ర దశ" ఒకటి.సాధారణంగా అందరూ విమ్శోత్తరీ దశనే వాడుతారు.కొందరు మాత్రం ఇలాంటి ఇతర దశలను కూడా ఉపయోగిస్తారు.ఈ కాలచక్రదశకూ యుగచక్రానికీ దగ్గర సంబంధం ఉన్నది.యుగసిద్దాంతం యొక్క చక్రభ్రమణానికీ జాతకచక్రంలో గ్రహాల చక్రభ్రమణానికీ దగ్గర సంబంధం ఉన్నది.

దశావతారాలు కూడా యుగనిష్పత్తి అయిన 4:3:2:1 ను పాటించడం మనం గమనించవచ్చు.

కృతయుగంలో నాలుగు అవతారాలు వచ్చాయి.అవి-మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ అవతారాలు.

త్రేతాయుగంలో మూడు అవతారాలు వచ్చాయి.అవి వామన, పరశురామ, రామ అవతారాలు.

ద్వాపరయుగంలో రెండు అవతారాలు వచ్చాయి.అవి బలరామ,కృష్ణ అవతారాలు.నవీనకాలంలో బలరాముని తీసి బుద్ధుడిని చేర్చారు.కాని మొదట్లో దశావతారాలలో బుద్ధుడు లేడు.బలరాముడు ఉన్నాడు.

కలియుగంలో కల్కి అవతారం ఒక్కటే ఉన్నది.

కనుక ఇక్కడ కూడా 4:3:2:1 నిష్పత్తి ఉన్నట్లు మనం చూడవచ్చు.

సత్యయుగం(కృతయుగం)లో సత్యమూ ధర్మమూ నాలుగుపాదాలతో ఉంటాయని సామాన్యంగా మనం అనుకుంటాం.కానీ అది నిజంకాదు. ఎందుకంటే,ప్రతి యుగమూ మళ్ళీ నాలుగు భాగాలుగా ఉంటుంది.అలా లేకుంటే సృష్టి నడవదు.శుద్ధ బంగారంతో ఆభరణం తయారు కాదు.కొంత రాగో ఇత్తడో కలిస్తేనే ఆభరణం తయారు చెయ్యడానికి కావలసిన గట్టిదనం దానిని వస్తుంది.అలాగే యుగాలు కూడా ఉంటాయి.

ఉదాహరణకు వ్యావహారిక కృతయుగం-4800 సంవత్సరాలని మనకు తెలుసు.

దీనిలో ఉపయుగాలు:-

కృతయుగం-1920
త్రేతాయుగం-1440
ద్వాపరయుగం-960
కలియుగం-480
మొత్తం =4800 అవుతుంది.

అవరోహణా కృత/కృతయుగం లో ధర్మం నాలుగు పాదాలతో ఉంటుంది.కానీ అవరోహణా శక్తి నడుస్తూ ఉన్నది కనుక ప్రవాహం అధోముఖంగా పోతూ ఉంటుంది.కృత/త్రేతాయుగంలో అది ఒక పాదం క్షీణిస్తుంది.కృత/ద్వాపర యుగంలో ఇంకొక పాదం క్షీణిస్తుంది.అలా కృత/కలియుగంలో ధర్మం ఉన్నప్పటికీ అధర్మం కూడా బాగానే ఉంటుంది.ఎందుకంటే,అవరోహణా యుగంలో ధర్మం తగ్గుతూ వస్తుంది.అది దాని విధానం.

దీనికి విభిన్నంగా ఆరోహణా కృతయుగంలో అధర్మం క్రమేణా తగ్గుతూ ధర్మం పెరుగుతూ పోతుంది.ఇది ఆరోహణాయుగ చక్రపు ధర్మం.

అలా కాకుండా కృతయుగంలో సత్యమూ ధర్మమూ నాలుగు పాదాలతో పరిపూర్ణంగా నడిస్తే, ప్రకృతిలోని మత్స్య కూర్మ వరాహ నృసింహ మొదలైన జీవుల రూపంలో అసలు భగవంతుని అవతారాల అవసరం ఎందుకు వచ్చింది?

చేపరూపంలో ఉన్న విష్ణువు వేదాలు దొంగిలించిన శంఖాసురుడిని సంహరించినట్లు మనకు కధ ఉన్నది.అలాగే, జలప్రళయ సమయంలో వైవస్వత మనువునూ సప్తరుషులనూ మహాప్రళయం నుంచి రక్షించినట్లు కూడా కధ ఉన్నది.కనుక కృతయుగంలో కూడా అధర్మం ఉన్నది.పోనీ శంఖాసురుని కధ ప్రక్షిప్తం అనుకుంటే కూడా,లోకానికి ఒక మహాపద రావడమూ ఆ ఆపదనుంచి జీవకోటిని రక్షించడానికి భగవంతుడు ఒక రూపాన్ని ధరించి మానవులను రక్షించడమూ కృతయుగంలో కూడా ఉన్నది.

సత్యమూ ధర్మమూ పరిపూర్ణంగా ఉన్నపుడు మానవాళికి అసలు ఆపద అంటూ ఎలా వస్తుంది?

అలాగే,కూర్మావతారంలో చూస్తే,సముద్రమధనానికి ఆధారంగా తాబేలు రూపంలో విష్ణువు మంధరపర్వతాన్ని మోసినట్లు మనం చదువుతాం.ఇక్కడ కూడా లోకానికి సహాయం చేసే విధమైన అవతారమే వచ్చింది.ఒకరిని సంహరించ వలసినంత అవసరం అప్పటికి దైవానికి రాలేదు.ఎందుకంటే మానవులలో అప్పటికి ఇంకా అంత దానవత్వం పెచ్చు మీరలేదు.అయితే సముద్రమధన సమయంలో వర్గపోరాటమూ ఆశా ఇరువర్గాలలోనూ కన్పిస్తాయి.

పోతే హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని విశ్వసముద్రంలో అట్టడుగున దాక్కుంటే విష్ణువు వరాహావతారంలో అతడిని సంహరించి భూమిని లేవనెత్తి రక్షించినట్లు మనం చూస్తాం. ఈ అవతారం కూడా కృతయుగం లోనిదే.అంటే అప్పటికి ఒకనిలో రాక్షసత్వం మూర్తీభవించడమూ స్వార్ధం పరాకాష్టకు చేరడమూ భూమిని మొత్తం స్వాహా చేసేద్దామని ప్రయత్నించడమూ వానిని సంహరించడానికి భగవంతుడు అవతరించి రావడమూ జరిగింది.ఇదంతా కృతయుగంలోనే జరిగిందని మర్చిపోరాదు.ధర్మమూ సత్యమూ నాలుగు పాదాలతో నడుస్తుంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది?కనుక ఆ యుగంలో కూడా రాక్షసత్వమూ అధర్మమూ ఉన్నాయి కదా.

అయితే ఇక్కడకు వచ్చేసరికి ఊరకే సహాయం చెయ్యడం కాకుండా ఒక రాక్షసుడిని వధించే విధంగా దైవంయొక్క అవతారం వచ్చింది.అంటే మనుషులలో రాక్షసప్రవృత్తి పెరిగింది.అంటే కృతయుగంలో కూడా ధర్మక్షీణత ఉన్నది అని తెలుస్తున్నది కదా.

ఇదే నేను చెప్పే యుగాలు- వాటిలోని ఉపయుగాల ప్రభావం. 

కనుక దైవయుగపు మహాచక్రంలో,వ్యావహారిక యుగమూ,దానిలోని ఉపయుగమూ వాటివాటి ధర్మాలను అనుసరిస్తూ ఆరోహణా అవరోహణా లక్షణాలను బట్టి వృద్ధి చెందుతూ క్షీణిస్తూ వృత్తాకారంగా నడుస్తూ ఉంటాయి.అలాగే ధర్మమూ అధర్మమూ రకరకాల పాళ్ళలో కలసిమెలసి ఆయా సమయాన్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

ఇలాగే మిగతా యుగాలలో కూడా ఉపయుగాలు ఎలా ఉంటాయో చూద్దాం.

త్రేతాయుగం-3600 years.

త్రేతా/కృత -1440 years
త్రేతా/త్రేతా-1080 years
త్రేతా/ద్వాపర-720 years
త్రేతా/కలి-360 years

ద్వాపర యుగం-2400 years

ద్వాపర/కృత-960 years
ద్వాపర/త్రేతా-720 years
ద్వాపర/ద్వాపర-480 years
ద్వాపర/కలి-240 years

కలియుగం-1200 years

కలి/కృత-480 years
కలి/త్రేతా-360 years
కలి/ద్వాపర-240 years
కలి/కలి-120 years

ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వ్యావహారిక యుగచక్రానికి ఉపయుగాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

13800 BC నుంచి 1800 BC వరకూ ఒక 12000 సంవత్సరాల అవరోహణా యుగచక్రం జరిగింది.


అందులో 13800 BC నుంచి 9000 BC వరకూ అవరోహణా కృతయుగం నడిచింది.

13800 నుంచి 11880-కృత/కృత

11880-10440-కృత/త్రేతా
10440-9480-కృత/ద్వాపర
9480-9000-కృత/కలి

9000 BC నుంచి 5400 BC -త్రేతాయుగం


9000-7560-త్రేతా/కృత

7560-6480-త్రేతా/త్రేతాయుగం (ఇక్కడ శ్రీరాముని జననం జరిగింది)
6480-5760-త్రేతా/ద్వాపర
5760-5400-త్రేతా/కలి

5400 BC నుంచి 3000 BC వరకూ ద్వాపరయుగం నడిచింది.


5400-4440 ద్వాపర/కృత

4440-3720 ద్వాపర/త్రేత
3720-3240 ద్వాపర/ద్వాపర
3240-3000 ద్వాపర/కలి--(ఇక్కడ శ్రీకృష్ణుని జననం జరిగింది)

3000 BC నుంచి 1800 BC వరకూ కలియుగం నడిచింది.


3000-2520 కలి/కృత
2520-2160 కలి/త్రేతా
2160-1920 కలి/ద్వాపర
1920-1800 కలి/కలి--(ఇక్కడ బుద్ధుని జననం జరిగింది.దీనికి వివరణ కావాలంటే కోట వెంకటాచలం గారి పరిశోధనా పూర్వక రచనలు చదవండి)

1800 BC నుంచి 10200 AD వరకు ఆరోహణా యుగచక్రం మొదలైంది.
ఆరోహణా చక్రంలో నడక క్రిందినుంచి పైకి ఉంటుంది.అంటే కలియుగంతో మొదలై కృతయుగానికి ఎదుగుతుంది.

1800 BC-600 BC ఆరోహణా కలియుగం.

1800-1680 కలి/కలి

1680-1440 కలి/ద్వాపర
1440-1080 కలి/త్రేత
1080-600 కలి/కృత

600 BC నుంచి 1800 AD ఆరోహణా ద్వాపరయుగం


600 BC-360 BC ద్వాపర/కలి-(ఇక్కడ ఆదిశంకరాచార్యుల జననం జరిగింది).
360 BC-120 AD ద్వాపర/ద్వాపర
120 AD-840 AD ద్వాపర/త్రేతా
840-1800 AD ద్వాపర/కృత

1800 AD-5400 AD ఆరోహణా త్రేతాయుగం


1800-2160 త్రేతా/కలి--(ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము)
2160-2880 త్రేతా/ద్వాపర
2880-3960 త్రేతా/త్రేత
3960-5400 త్రేతా/కృత

5400 AD-10200 AD ఆరోహణా కృతయుగం


5400-5880 కృత/కలి

5880-6840 కృత/ద్వాపర
6840-8280 కృత/త్రేత
8280-10200 కృత/కృత


అక్కడనుంచి మళ్ళీ యుగచక్రం క్రిందకు తిరగడం మొదలౌతుంది.ఈ చక్రభ్రమణం అంతులేనిది.ఇప్పటికి ఎన్ని కోటానుకోట్ల పరిభ్రమణాలు ఇలా జరిగాయో లెక్కే లేదు.ఎన్నిసార్లు నాగరికతలూ శాస్త్ర పరిజ్ఞానాలూ ఈ భూమిమీద పుట్టి పెరిగి గతించాయో లెక్కే లేదు.ఇప్పటికి ఎన్నిసార్లు ఈ భూమిమీద మనం పుట్టి గతించామో లెక్కేలేదు.

ఈనాడు మనం చూస్తున్న సైన్స్ మొదటిసారి మనకు తెలిసినది కాదు. ఇప్పటికి ఇలాంటి సైన్స్ మనకు చాలాసార్లు తెలుసు.ఇంతకంటే ఇంకా గొప్ప సైన్స్ కూడా తెలుసు.అలా ప్రాచీనకాలంలో మనకు తెలిసిన సైన్స్ ఆనవాళ్ళే భూమిమీద ఇప్పటికీ ఉన్న అనేక అంతుబట్టని వింతలు.


భూమిమీద అనేక చోట్ల ఉన్న అణుయుద్ధపు ఆనవాళ్ళూ,భూమినుంచి కొన్ని మైళ్ళు ఆకాశంలోకి పోయి చూస్తెగాని అర్ధంకాని విచిత్ర రేఖాగణిత డిజైన్లూ,మైళ్ళకు మైళ్ళు విస్తరించి ఉన్న శ్రీచక్రం వంటి గుర్తులూ ఇలా అనేక రుజువులు ఇప్పటికీ భూమి మీద అనేకచోట్ల ఉంటూ అతిప్రాచీన కాలంలో భూమిమీద ఉన్న గొప్ప సైన్స్ కు ఆనవాళ్ళుగా మనకు కనిపిస్తున్నాయి.

సైన్స్ పరంగా మనకంటే ఇంకా ఎంతో ఎక్కువ ముందుకెళ్ళి అకస్మాత్తుగా సర్వనాశనమై సముద్ర గర్భంలో కలసి పోయిన 'అట్లాంటిస్' నాగరికత కూడా ఈ భావననే నిరూపిస్తున్నది.

మహాభారతంలో బ్రహ్మాస్త్రం మొదలైన దివ్యాస్త్రాలు ప్రయోగింపబడినప్పుడు ఏమి జరిగింది?వాటి ప్రభావం ఎలా ఉన్నది? మొదలైన ఘట్టాలనూ వ్యాసమహర్షి వర్ణించిన శ్లోకాలనూ మనం చూస్తే నేటి అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు ఏ తీరులో విధ్వంసం జరిగిందో అదే తీరు కళ్ళకు కట్టినట్లుగా వర్ణింపబడటం చూడవచ్చు.

బ్రహ్మాస్త్రప్రయోగం జరిగినప్పుడు "ఒక బ్రహ్మాండమైన పుట్టగొడుగు వంటి విస్ఫోటనం జరగడమూ,క్షణాలలో మైళ్ళ దూరంవరకూ ఆహారపదార్ధాలన్నీ విషంగా మారడమూ,వేలాది సైనికుల ఒళ్ళు క్షణంలో కాలి మాడిపోవడమూ,ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఎంతో దూరంలో ఉన్న ప్రజలకు కూడా రకరకాల వ్యాధులు రావడమూ"ఇదంతా సైన్స్ అనేది ఏమీ తెలియని అడివిలో ఉండే ఋషులకు ఎలా తెలుసు?మహాభారతంలో ఇదంతా ఎలా వర్ణింపబడింది?వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి ఇదంతా ఎలా వ్రాయగలిగాడు?

కనుక నాగరికతా,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ మనం ఇప్పుడే మొదటిసారిగా చూడటం లేదు.ఇంతకు ముందు ప్రాచీనకాలంలో ఇలాంటి నాగరికత ఎన్నో సార్లు ఉన్నది.ఇప్పుడు మనకు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ సైన్స్ చాలాసార్లు ఈ భూమిమీద విలసిల్లింది.కానీ అదంతా నాశనమై పోయింది.అలా నాశనం కావడానికి మానవుడి దురాశా గర్వమూ అహంకారాలే కారణాలు.

కాలచక్ర భ్రమణంలో మనుషులైనా నాగరికతైనా సైన్సైనా పుట్టడం పెరగడం తరగడం నశించడం మళ్ళీ పుట్టడం తప్పదు.ఇదొక చక్రభ్రమణం.దీనికి అంతులేదు.

ఈ సత్యాన్నే యుగసిద్దాంతం నిరూపిస్తున్నది.

(ఇంకా ఉన్నది)