నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

15, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగసిద్ధాంతం-4(పురాణాలలో సృష్టిక్రమం)

మన పురాణాలలో సృష్టి అధ్యాయం ఒకటి తప్పకుండా ఉంటుంది.

అంటే-

అసలు సృష్టి ఎలా మొదలైనది? ఈ సృష్టిలో ఏయే లోకాలు ఎలా ఉంటాయి?వాటి వరుసలు ఏమిటి? కాలం అంటే ఏమిటి? మానవ పితృ దైవ కాలమానాలు ఎలా ఉంటాయి? మొదలైన వివరాలు వాటిలో ఇవ్వబడినాయి.

మహాభాగవతం తృతీయస్కంధం పదకొండో అధ్యాయంలో సృష్టి వర్ణనమూ కాలవిభజనమూ ఉన్నాయి.అలాగే విష్ణుపురాణంలో ఉన్నాయి.బ్రహ్మాండ పురాణంలో కూడా ఉన్నాయి.ఇవన్నీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి(స్వల్ప భేదాలతో).

నేటి సైన్స్ నిన్నగాక మొన్న కనుక్కున్న అణువు పరమాణువు మొదలైన మాటలు మన పురాణాలలో వేల సంవత్సరాల నాడే వాయబడి ఉన్నాయి.మన పురాణాలలో ఇవి వ్రాయబడిన సమయానికి నేడు వరల్డ్ లీడర్స్ అని చెప్పబడుతున్న దేశాలు కొన్ని లేనే లేవు.అవి అప్పటికి పుట్టనే లేదు.

మన పురాణాలు వ్రాయబడిన సమయానికి ఆయా దేశాలలోనూ ఉన్న మనుషులకు కనీసం బట్టలు ఎలా కట్టుకోవాలన్న విషయం కూడా తెలియదు.అంతటి ఆటవికస్థితిలో వాళ్ళు ఆ సమయంలో బ్రతుకుతున్నారు. అదే సమయానికి మన ఋషులు ప్రపంచం యొక్క స్థితినీ గతినీ సృష్టినీ ప్రళయాన్నీ ఆయా కాలగమనాలనూ కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు.

ఈ విషయాన్ని పరికిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ విషయంలో మహాభాగవతం ఏమంటున్నదో చూద్దాం.

చరమః సద్విశేషాణామనేకో సంయుత: సదా
పరమాణు సవిజ్నేయో నృణామైక్య భ్రమో యత:

అనేకములుగా కనిపిస్తున్న ఈ సమస్తానికీ మూలం పరమాణువే.ఇవి అన్నీ నశించినా అది నశించదు ఏక రూపంలో నిలిచి ఉంటుంది.ఈ విషయం తెలియక మానవుడు భ్రమలో మునిగి ఉంటాడు.

ఈనాడు సైన్స్ చెబుతున్న మాటనే భాగవతం వేల ఏళ్ళనాడు చెప్పింది. అణువు పరమాణువు అనేమాటలు భాగవతంలో మనకు కనిపిస్తాయి.వీటిని కనుక్కోక ముందు,ఎందఱో ఈ భావాలు చదివి ఎగతాళి చేసేవారు.ఇప్పుడు వారే నోళ్ళు మూసుకుంటున్నారు.

అహంకారమూ దురుసుప్రవర్తనా కలియుగపు ప్రజల సహజలక్షణాలు. విచిత్రమేమంటే ఆధ్యాత్మికులుగా చెప్పుకునే వారిలోకూడా ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.వారిది ఏ రకమైన ఆధ్యాత్మికతో వారికెలాగూ అర్ధం కాదు.కనీసం వారి సోకాల్డ్ గురువులకైనా అర్ధమైతే అదే చాలు.

సత ఏవ పదార్ధస్య స్వరూపావస్తితస్య యత్
కైవల్యం పరమ మహాన్విషేశో నిరంతర:

మనకు కనిపించే పదార్ధం యొక్క స్వరూపమూ స్థితీ కూడా కేవలం అయిన పరమాణువులే.వాటికి ఏ విశేషమూ లేదు.అవి నిరంతరం నిలిచి ఉన్నాయి.

ఏవం కాలోప్యనుమిత: సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ
సంస్థాన భుక్త్యా భగవానవ్యక్తో వ్యక్తభుగ్విభు:

కనుక కాలమును స్థూల సూక్ష్మ ఉత్తమ స్థితులలో కొలవగలము.ఈ పరమాణువుల రకరకాల మేళవింపుల ద్వారా కదలికల ద్వారా,కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని భగవంతుడు నియంత్రిస్తున్నాడు.కాని తానుమాత్రం ఎవరికీ కనిపించకుండా ఉంటాడు.

స కాల: పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతామ్
సతో విశేష భుగ్యస్తు కాల: పరమో మహాన్

పరమాణు కాలం పరమాకాశగమనం లో కొలవబడుతుంది.స్థూల మహాకాలం అనేది స్థూలంగా కొలవబడుతుంది.

స్థూలమైన వాటిని కొలవాలంటే స్థూలవిధానాలు అవసరమనీ సూక్ష్మమైన వాటిని కొలవడానికి సూక్ష్మవిధానాలే శరణ్యమనీ ఇక్కడ సూచన ఉన్నది.

అన్నింటినీ సైన్స్ పరికరాలతో కొలవటం సాధ్యం కాదు.ఆత్మ ఉనికిని ఏ సైన్స్ పరికరమూ నిరూపించలేదు.ఎందుకంటే భౌతిక పరికరాల స్థితీ స్థాయీ వేరు. ఆత్మయొక్క స్థితీ స్థాయీ వేరు.కనుక వాటితో ఆత్మను నిరూపించడం ఎన్నటికీ సాధ్యం కాదు.

పరమాణువు నుంచి బ్రహ్మదేవుని వరకూ కాలగణనం

అణుద్వౌ పరమాణూ స్యాత్రసరేణు స్త్రయ: స్మృత:
జాలార్క రశ్మ్వ్యవగత: ఖమేవానుపతన్నగాత్

రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది.అవి మూడు కలిస్తే ఒక త్రసరేణువు అవుతుంది.ఇవన్నీ ఎలాఉంటాయో చూడాలంటే ఒక వలలో(network)నుంచి ప్రసరిస్తున్న సూర్యరశ్మిలో చూస్తే ఆకాశంవైపు ఎగసిపోతున్న అనేక సూక్ష్మరేణువులు కనిపిస్తాయి కదా.ఈ అణువులూ పరమాణువులూ ఆ విధంగా ఉంటాయి.

త్రసరేణు త్రికం భుంక్తే య: కాల: స త్రుటి స్మృత:
శతమాగస్తు వేధ: స్యాత్తై స్త్రిభిస్తు లవ: స్మృత:

మూడు త్రసరేణువులు కలవడానికి ఎంత సమయం పడుతుందో అది త్రుటి అవుతుంది.నూరు త్రుటులు ఒక వేధ అనబడుతుంది.అవి మూడు కలిస్తే లవము అనబడుతుంది.

నిమేషస్త్రిలవో జ్ఞేయ:అమ్నాతస్తే త్రయ క్షణ:
క్షణాన్ పంచవిదు: కాష్టాం లఘు తా దశ పంచ చ

మూడు లవములు ఒక నిముషం.మూడు నిముషములు ఒక క్షణం అవుతుంది.అయిదు క్షణములు ఒక కాష్టము అవుతుంది.పదిహేను కాష్టములు ఒక లఘువు అవుతుంది.

లఘూనివై సమామ్నాతా దశ పంచచ నాడికా
తే ద్వే ముహూర్త: ప్రహర: షడ్యామ: సప్తవా నృణాన్

పదిహేను లఘువులు ఒక నాడి అవుతుంది.ఇవి రెండు కలిస్తే ఒక ముహూర్తం అవుతుంది.ఆరు లేదా ఏడు నాడులు కలిస్తే ఒక ప్రహరం(ఝాము) అవుతుంది.

ద్వాదశార్ధ పలోన్మానం చతుర్భిశ్చతురంగులై:
స్వర్నమాషై క్రుతస్చిద్రం యావత్ప్రస్థ జలప్లుతం

నాడి అనే కాలమానాన్ని కొలిచే పరికరం తయారుచేసే విధానం:--

ఆరు పలముల బరువున్న ఒక రాగిపాత్రలో నాలుగు అంగుళముల రంధ్రాన్ని ఒక బంగారుమాసం తో చెయ్యాలి.ఈ పాత్రను నీటిపైన ఉంచినపుడు దానిలో నీరు ప్రవేశించి అది పూర్తిగా మునగడానికి పట్టే సమయం ఒక నాడీకాలం.

యామాశ్చత్వార చత్వారో మర్త్యానామహనీ ఉభే
పక్ష: పంచదశాహాని శుక్ల కృష్ణశ్చ మానద

నాలుగు నాలుగు యామములు(ఝాములు) పగలు రాత్రులలో ఉంటాయి.అలాంటి పదిహేను రోజులు ఒక పక్షంలో ఉంటాయి.అలాంటి రెండు పక్షములు(శుక్ల,కృష్ణ పక్షములు) కలసి ఒక మాసం అవుతుంది.

తయో సముచ్చయో మాస: పిత్రునాం తదహర్నిశం
ద్వౌ తావ్రుతు: షడయనం దక్షిణం చోత్తరం దివి:

అలాంటి ఒక మాసం పితృదేవతలకు ఒక రోజు అవుతుంది.రెండు మాసములు ఒక ఋతువు.అలాంటి ఆరునెలలు ఒక అయనం అవుతుంది. సంవత్సరములో ఉత్తర దక్షిణములనే రెండు అయనములున్నాయి.

అయనే చాహనీ ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృత:
సంవత్సర శతం నృణాం పరమాయుర్నిరూపితం

ఒక అయనం దేవతలకు ఒక పగలు అవుతుంది.అలాంటి ఒక పగలూ ఒక రాత్రీ కలసి పన్నెండు మాసములతో కూడిన ఒక మానవ సంవత్సరం అవుతుంది.అలాంటి సంవత్సరములు ఒక నూరు కలిస్తే అది మానవుని పరమాయువు అవుతుంది.

పై కాలగణనాన్ని సంక్షిప్తంగా చూస్తే

మానవుని ఆయువు-100 సంవత్సరములు.
ఒక సంవత్సరం-12 నెలలు.
ఒక నెల-రెండు పక్షములు
ఒక పక్షము-15 దినములు+15 రాత్రులు
ఒక దినము(లేదా రాత్రి)-4 ఝాములు
ఒక ఝాము-ఆరు/ఏడు నాడులు=180 నిముషములు
ఒక నాడీ=30 నిముషములు=15 లఘువులు
ఒక లఘువు=2 నిముషములు=15 కాష్టములు
ఒక కాష్టము=8 సెకండ్లు(ఇప్పటి లెక్కలో)=5 క్షణములు
ఒక క్షణం=8/5 సెకండ్లు=మూడు నిమేషములు
ఒక నిమేషము=8/15 సెకండ్లు=మూడు లవములు
ఒక లవము=8/45 సెకండ్లు=మూడు వేధలు
ఒక వేధ=8/135 సెకండ్లు= నూరు త్రుటులు
ఒక త్రుటి=8/13500 సెకండ్లు=మూడు త్రసరేణువులు
ఒక త్రసరేణువు=8/40,500 సెకండ్లు=మూడు అణువులు
ఒక అణువు=8/1,21,500 సెకండ్లు=రెండు పరమాణువులు
ఒక పరమాణువు=8/2,43,000 సెకండ్లు
=1/30,375 సెకండ్ల కాలం.

1/30,375 సెకండ్ల కాలాన్ని ఒక పరమాణుకాలం అని భాగవతం అన్నది. అంటే సెకండ్ లో ముప్పైవేల వంతువరకూ వ్యాసమహర్షి ఊహించగలిగాడు. అంతేకాదు ఆ లెవల్ అనేదే 'అటామిక్ టైం స్కేల్' అన్న విషయాన్ని ఆయన వేల సంవత్సరాల క్రితం మనకు సూచించాడు.

ఇలాంటి విషయాలు మన పురాణాలలో ఉన్న సంగతి గ్రహించలేని మనం, వాటిని 'పుక్కిటి పురాణాలు' అని ఎగతాళి చేస్తుంటాం.ఈ దేశపు మహత్తరమైన ప్రాచీన సంపద ఎదురుగా ఉన్నాకూడా దానిని సక్రమంగా అర్ధం చేసుకోలేని వారికీ దానినే కువిమర్శలు చేస్తూ కాలం గడిపేవారికీ ఈ దేశంలో పుట్టే హక్కు ఉన్నదో లేదో అలా ఎగతాళి చేసేవారు ఒక్కసారి ఆలోచించుకుంటే సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వారికి తలెత్తుతుంది (వారికి మనసనేది ఒకటి ఉంటే).

గ్రహర్క్ష తారా చక్రస్థ పరమాణ్వాదీనా జగత్
సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభు:

పరమాణువులు గ్రహాలూ నక్షత్రాలతో కూడిన ఈ సమస్త జగత్తూ ఒక సంవత్సరకాలంలో ఒక పరిభ్రమణం గావిస్తుంది.ఈ మొత్తాన్నీ కాలాతీతుడైన విభుడు (భగవంతుడు) నియంత్రిస్తున్నాడు.

సంవత్సరః పరివత్సర ఇడావత్సర ఏవచ
అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాశ్యతే

సంవత్సరం అయిదు రకాలుగా ఉన్నది.ఈ భేదములు వేత్తలకు తెలుసు.

1.సూర్య గమనంతో వచ్చేది.
2.బృహస్పతి గణనంతో వచ్చేది.
3.నక్షత్ర గణనంతో వచ్చేది.
4.చంద్రగమనంతో వచ్చేది.
5.మామూలుగా రోజుల గణనంతో వచ్చేది.

మానవుడు పుట్టిన మొదటిది సంవత్సరం,రెండవది పరివత్సరం,మూడవది ఇడావత్సరం,నాల్గవది అనువత్సరం,అయిదవది వత్సరం.వీటియొక్క అంతరార్ధములూ,ఉపయోగములూ కూడా వేత్తలైన వారికి తెలుసును.

మనిషి జీవితానికి కావలసిన ప్రాణశక్తి సూర్యుడూ, చంద్రుడూ, బృహస్పతీ, నక్షత్రాల కాంతీ,పగలూ రాత్రీ ఇచ్చే శక్తి నుంచీ వస్తున్నది.వాటిని మరచి పోవడం పరమ ఘోరమైన పాపం.కృతఘ్నత అంటే అదే.

యః సృజ్యశక్తి మురుధోచ్చ్వసయన్ స్వశక్త్యా
పుంసోభ్రమాయ దివి ధావతి భూతభేద:
కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వం
స్తస్మై బలిం హరత వత్సర పంచకాయా

పుట్టిన దగ్గరనుంచీ ప్రతి అయిదు సంవత్సరాల కొకసారి యధాశక్తిగా సూర్య భగవానుని అర్చన చెయ్యాలి.అలాంటి ఒక క్రియ ప్రాచీనకాలంలో ఉండేది. నేడు అవన్నీ గాలికెగిరిపోయాయి.ప్రస్తుత మానవునికి రెండే దైవాలు.ఒకటి డబ్బు.రెండు ఇంద్రియభోగములు.ఈ రెండు తప్ప ఎవరికీ ప్రస్తుతం ఏ దైవాలూ లేరు.మనిషి ఏ దైవాలనూ ఏ గురువులనూ కొలుస్తున్నా ఈ రెంటికొరకే.వీటిని అప్పనంగా ఇచ్చే దేవుళ్ళకు పాపులారిటీ ఉంటుంది. మార్కెట్ ఉంటుంది.యదార్ధం చెప్పే దేవుళ్ళూ గురువులూ అనామకులుగా ఉండిపోతారు.కనుక నేటి మానవుని నిజమైన దైవాలు ఈ రెండే అని నేనంటాను.

పంచభూతాలను నడిపిస్తున్నది సూర్యభగవానుడే.కనుక ఒక అయిదు సంవత్సరాల కాలం జీవితంలో సక్రమంగా గడిచినందుకు ఆ తర్వాత సూర్యార్చన గావించాలి.అలా జీవితాంతమూ ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉండాలి.మన జీవితమూ ప్రాణశక్తీ రక్షింపబడుతూ ఉన్నందుకు ప్రకృతికీ సూర్యునకూ మనం చూపే కృతజ్ఞత అది.

ఇలాంటి సున్నితమైన భావాలూ,కృతజ్ఞతతో కూడిన హృదయ స్పందనమూ నేటి మనుషులలో కరువై పోయాయి.నేటి వారికి ఎంతటి మేలు చేసినా ఇంకా చాలదు.వారికేం కావాలో వారికే తెలియదు.వారి ఆశలకు అంతులు ఉండవు.'ఇంకా కావాలి,ఇంకా కావాలి'.. అన్న అరుపులు తప్ప భగవంతుని చెవులకు ఇంకేమీ ప్రస్తుతం వినిపించడం లేదు.పోనీ ఇప్పటివరకూ పొందిన వరాలకు వారికి కృతజ్ఞతాభావం ఉంటుందా అంటే అదీ ఉండదు.అవసరం తీరిన మరుక్షణం,ఆ దేవుడు కూడా మళ్ళీ ఇంకొక అవసరం తలెత్తేవరకూ గుర్తురాడు.అదీ నేటి మానవుని హీనస్థితి.

కృతజ్ఞతా,ఉత్తమసంస్కారమూ,మర్యాదాపూర్వక ప్రవర్తనా ఇవన్నీ నేడు మృగ్యములై పోతున్నాయి.ఇది కలిప్రభావమే.

పితృదేవ మనుష్యాణా మాయు: పరమిదం స్మృతం
పరేషాం గతిమాచక్ష్వ యే స్యు: కల్పాద్ బహిర్విద:
భగవాన్ వేదకాలస్య గతిం భగవతో నను
విశ్వం విచక్షతే ధీరా యోగరాద్దేన చక్షుషా

పితృదేవతల మనుష్యుల ఆయువు ఎలా ఉంటుందో వివరించావు.ఇప్పుడు కల్పచక్రం బయట నివసించే వారి గతి ఏమిటో వివరించు.కాలగతిని నీవు ఎరిగినవాడవు.విశ్వగమన గతిని నీ యోగచక్షువులతో ధీరుడవై గమనించగల శక్తివంతుడవు.

యుగములు - వాటి వివరం

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం
దివ్యైర్ ద్వాదశభిర్వర్షైహి సావధానం నిరూపితం

కృత,త్రేతా,ద్వాపర,కలి-అనేవి నాలుగు యుగములు.ఈ నాలుగు కలసి 12 దివ్యవర్షములౌతున్నాయి(12,000) సంవత్సరాలు.

చత్వారి త్రీణి ద్వై చైకం కృతాదిషు యధాక్రమం
సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతానిచ

కృతయుగం మొదలుకొని నాలుగు,మూడు,రెండు,ఒకటి చొప్పున వేలూ వందలలో రెట్టింపుగా ఇవి ఉంటాయి.

సంధ్యా సంధ్యాంశయో ర్యన్తర్యో కాల: శతసంఖ్యయో:
తమేవాహుర్యుగం తజ్నా తత్ర ధర్మో విధీయతే

యుగముల మధ్యలో వచ్చే సందికాలములు వందల సంఖ్యలో ఉంటాయి.ఈ విధంగా యుగములు ఉంటాయి.

ధర్మ చతుష్పాన్ మనుజాన్ కృతే సమనువర్తతే
స ఏవాన్వేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధతా

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది.మిగతా యుగాలలో అది ఒక్కొక్క పాదం తగ్గిపోతుంది.

త్రిలోక్యా యుగసాహస్రం బహిరా బ్రహ్మణో దినం
తావత్యేవ నిశా తాత యన్నిమీలతి విశ్వసృక్

ఈ యుగములు వెయ్యి జరిగితే బ్రహ్మకు ఒక దినం అవుతుంది.అంతే సమయం రాత్రి అవుతుంది.ఆ సమయంలో సృష్టికర్త యైన బ్రహ్మ నిద్రిస్తాడు.

నిశావసాన ఆరబ్దో లోకకల్పో అనువర్తతే
యావద్ధినం భగవతో మనూన్ భుంజం చతుర్దశ

రాత్రి అయిపోయి మళ్ళీ పగలు వచ్చినపుడు లోకకల్పములు మళ్ళీ మొదలౌతాయి.బ్రహ్మదేవుని ఒక పగటి కాలంలో పద్నాలుగురు మనువులు పుట్టి గతిస్తారు.

స్వంస్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిం

ఒక్కొక్క మనువు కాలప్రమాణం 71 మహాయుగములు ఉండి ఇంకొంచం ఎక్కువ ఉంటుంది.ఎందుకంటే 71x14=994 సంవత్సరాలే అవుతుంది.వెయ్యి దివ్య సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక పగలు గనుక,మిగతా ఆరు సంవత్సరాల కాలం ఈ 14 మంది మనువులకు సంధికాలంగా ముందు వెనుకలలో సర్దబడుతుంది.

దీని జ్యోతిష్యపరమైన అర్ధం ఏమిటో తర్వాతి పోస్ట్ లలో వివరిస్తాను.

మన్వంతరేషు మనవస్స్తద్వంశ్య ఋషయస్సురా:
భవంతి చైవ యుగపత్సురేశాశ్చాను ఏ చ తాన్

ఒక మన్వంతరం అయిపోయిన తదుపరి ఇంకొక మనువు ప్రభవిస్తాడు. ఆయనతో బాటు ఆయన పరివారమైన ఆయా సప్తఋషులూ ఇంద్రాది దేవతలూ పుట్టుకొస్తారు.

ఏష దైనందిన స్సర్గో బ్రహ్మస్త్రైలోక్య వర్తన:
తిర్యన్నృపిత్రు దేవానాం సంభవో యత్ర కర్మభి:

ఈ విధంగా బ్రహ్మదేవుని ఒక్కదినంలో(స్వర్గము,భూలోకము,పాతాళము) అనబడే మూడు లోకములు వాటిలో ఉండే దేవతలు, పితరులు, మానవులు, జంతువులు మొదలైన సమస్త జీవరాశులూ వారి వారి కర్మానుసారం పుట్టి గతిస్తూ ఉంటారు.

మన్వంతరేషు భగవాన్ భిభ్రాత్సత్వం స్వమూర్తిభి:
మన్వాదిభిరిదం విశ్వమవత్యుదిత పౌరుష:

ప్రతి మన్వంతరంలోనూ మనువు మొదలైన దివ్యపురుషులుగా భగవంతుడు అవతరిస్తూ లోకాన్ని నడిపిస్తూ ఉంటాడు.

తమోమాత్రాముపాదాయ ప్రతిసంరుద్ధ విక్రమ:
కాలేనానుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే

బ్రహ్మదేవుని పగలు అంతమయ్యే కాలంలో అజ్ఞానపు ఒక ఛాయ రాత్రిగా సృష్టిని ఆక్రమిస్తుంది.ఆ సమయంలో సమస్త సృష్టీ అందులోని జీవజాలం అంతాకూడా అణగిపోతుంది.

అంటే సృష్టి మొత్తం ఒక రకమైన hibernation లోకి వెళ్ళిపోతుంది.

తమేవాన్వపి ధీయంతే లోకా భూరాదయస్త్రయ:
నిశాయామనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం

ఈ బ్రహ్మదేవుని రాత్రి అనేది వచ్చినపుడు భూరాది మూడు లోకాలలోనూ వెలుతురు అనేది ఉండదు.చంద్రుడు సూర్యుడు మొదలైన గ్రహములు కాంతిని కోల్పోతాయి.అవి ఉంటాయి.నశించవు.కానీ కాంతిహీనములౌతాయి. సమస్త విశ్వమూ అప్పుడు చీకటి మయం అవుతుంది.

త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా
యాన్త్యూష్మణా మహర్లోకాజ్జనం భృగ్వాదయోర్దితా:

ఆ సమయంలో మూడులోకాలనూ(భూ,భువ,సువ) దహించే సంకర్షణాగ్ని తీక్షణతకు తట్టుకోలేక మహర్లోకంలో ఉండే భ్రుగువు మొదలైన మహర్షులందరూ అంతకంటే పైదైన జనలోకానికి చేరుకుంటారు.

తావత్త్రిభువనం సద్య: కల్పాన్తైధిత సింధవ:
ప్లావయన్త్యుత్కటాటోప చండవాతే రితోర్మయ:

మూడు లోకాలనూ నశింపచేసే ఈ కల్పాంత సమయంలో భయంకరమైన వాయువుచే ప్రేరేపించబడి సముద్రాలన్నీ పొంగి భూమిని ముంచివేస్తాయి.

అంత: స తస్మిన్ సలిల ఆస్తే నంతాసనో హరి:
యోగనిద్రానిమీలాక్ష: స్తూయమానో జనాలయై:

ఆ భయంకర ప్రళయ జలమధ్యంలో విష్ణువు యోగనిద్రలో ఉండి నిమీలిత నేత్రుడై శయనించి ఉంటాడు.జనలోకం మొదలైన పైలోకాలలోని ఉన్నత జీవులు ఆయన్ను ధ్యానిస్తూ ఉంటారు. 

ఏవం విధైరహోరాత్రై: కాలగంత్యోపలక్షితై:
అపక్షితమివాస్యాపి పరమాయుర్వయ:శ్శతం

కనుక ప్రతి లోకంలోనూ ఆయాలోకాలకు తగిన పగలూ రాత్రీ ఉంటాయి. ఆయా జీవులకు ఆయాలోకాలకు తగిన నూరు సంవత్సరాల ఆయుస్సు ఉంటుంది.

యదర్ధమాయుష్తస్య పరార్ధ మభిదీయతే
పూర్వ: పరార్దోపక్రాంతో హ్యాపరోధ్య ప్రవర్తతే

బ్రహ్మదేవుని ఆయుస్సులో పూర్వము పరము అని రెండు భాగాలున్నాయి.వాటిలో పూర్వభాగం అయిపొయింది.ప్రస్తుతం పరార్ధం నడుస్తున్నది.

అంటే నూరేళ్ళ ఆయన ఆయుస్సులో 50 ఏళ్ళు అయిపోయి రెండో 50 ఏళ్ళ కాలం ప్రస్తుతం నడుస్తున్నది.

పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్
కల్పో యత్రా భవద్బ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదు:

బ్రహ్మదేవుని యొక్క పూర్వార్ధంలో బ్రహ్మకల్పం అనే సమయం ఉన్నది.ఆ సమయంలోనే శబ్దబ్రహ్మము యొక్క పుట్టుక జరిగింది.

శబ్దబ్రహ్మం అంటే వేదం అని అర్ధం చేసుకోవచ్చు.

కానీ దానిని The great Universal sound అని కూడా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు The great explosion of the Universe or The Big Bang అనే సంఘటనను ఈ శ్లోకం సూచిస్తున్నదా?తన దివ్యదృష్టితో విశ్వం పుట్టక ముందు జరిగిన ఈ సంఘటనను తిలకించిన వ్యాసమహర్షి ఈ శ్లోకంలో తన అనుభవాన్ని గుప్తంగా నిక్షిప్తం చేశాడా?

అవుననే నేను భావిస్తున్నాను.

తస్యైవ చాన్తే కల్పోభూద్ యం పద్మ మభిచక్షతే
యద్ధరేర్నాభి సరస ఆసీల్లోకసరోరుహం

ఆ తరువాత వచ్చినదానిని,అంటే బ్రహ్మకల్పం అనే సమయం తర్వాత వచ్చినదానిని, పద్మకల్పం అంటారు.ఆ సమయంలోనే ఈ విశ్వం అనే పద్మం విష్ణునాభి నుంచి ఉద్భవించింది.

విష్ణునాభి అనే ప్రాంతం ధనూరాశిలో మూలానక్షత్ర మండలం ప్రాంతంలో ఉన్న ఒక గాలక్సీ క్లస్టర్ అని మనకు తెలుసు.విష్ణునాభినుంచి ఒక పద్మము వికసించి అందులో బ్రహ్మదేవుడు కూర్చుని సృష్టి గావిస్తున్నాడని మనం చిత్రాలలో చూస్తాం.వాస్తవంగా సృష్టిలో జరుగుతున్న ప్రక్రియకు అది ఒక భావుకుని రూపకల్పన.అంతకంటే సృష్టిని ఒక pictorial representation రూపంలో చెప్పడం అసాధ్యం.

పద్మం వికసించడం అంటే ఒక చిన్న బిందువు నుంచి మహావిస్ఫోటనం జరిగి విశ్వం నలుమూలలా విస్తరిస్తూ పోవడం.విశాలమైన అంతరాళంలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక విశాలమైన సరస్సులో ఒక పద్మం వికసించిన రీతిలో ఉంటుంది.నేటి సైన్స్ కూడా విశ్వం ఇంకా వ్యాకోచిస్తూ ఉన్నదనే చెబుతున్నది.

విష్ణునాభి అనేది Big bang జరగడానికి ముందు ఉన్నటువంటి ఒక highly condensed super density state in space.ఆ స్థితికి ముందు విశ్వం అంతా విస్తరించి చడీచప్పుడూ లేని స్థితిలో మౌనంగా శయనించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మనం మహావిష్ణువనీ అనంతపద్మనాభస్వామి అనీ అంటున్నాం.


అంటే ఎటుచూచినా ఏమీలేని మహాశూన్యపు చీకటిస్థితిలో ఒక మహా విస్ఫోటనం జరిగి విశ్వంలో వెలుగుతో కూడిన నక్షత్ర మండలాలు ఉద్భవించి నలువైపులా ఒక పద్మం వికసించినట్లు వెదజల్లబడిన స్థితిని వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో వీక్షించి ఆ దర్శనాన్ని ఈ శ్లోకరూపంలో మనకు అందించాడా?

అవుననే నేను అంటాను.ఎందుకంటే,దివ్యదృష్టికి తప్ప,మామూలు మానవుల క్షుద్రమైన మనస్సుల దృష్టికి ఇలాంటి భావనలు అందేవి కావు.

అయం తు కధిత: కల్పో ద్వితీయస్యాపి భారత
వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీచ్చూకరో హరి:

బ్రహ్మదేవుని రెండవ జీవితభాగంలోని మొదటి కల్పాన్నే వరాహకల్పం అని అంటారు.ఎందుకంటే ఈ కల్పంలోనే భగవంతుడైన విష్ణువు వరాహరూపంలో అవతరించాడు.

కాలోయం ద్విపరార్దాఖ్యో నిమేష ఉపచర్యతే
అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్జగదాత్మన:

ఈ రెండు అర్ధభాగములతో కూడిన బ్రహ్మదేవుని జీవిత కాలం మొత్తమూ కూడా -- ఏ హద్దులూ లేని అనంతుడైన భగవానునికి ఒక నిమేష కాలం మాత్రమే.అంటే బ్రహ్మదేవుని మూడు కోటికోట్ల మానవసంవత్సరాల జీవితకాలం మహావిష్ణువుకు దాదాపు అర సెకండ్ కాలం మాత్రమే.


చదువరులారా -- అదీ పరిస్థితి!!!

ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏకాంతంగా కూర్చొని ఈ కాలాన్ని ఊహించే ప్రయత్నం చెయ్యండి.విశ్వవీక్షణం చెయ్యండి.సృష్టి ముందు ఉన్న మహాతమస్సునూ శూన్యపు చీకటినీ ఊహించండి.ఆ తర్వాత జరిగిన మహాజ్యోతివిస్ఫోటనాన్నీ,ఒక పద్మం విచ్చుకున్నట్లు సృష్టి నలువైపులకూ వ్యాపించడాన్నీ ఊహించండి.దేవతల యుగాన్నీ అంటే 43,20,000 సంవత్సరాల కాలాన్నీ,అలాంటి 71 యుగాల కాలమైన ఒక మన్వంతరాన్నీ,అలాంటి  14 మనువుల కాలంతో సమానమైన బ్రహ్మదేవుని ఒక దినాన్నీ అంతే ప్రమాణం కలిగిన ఒక రాత్రినీ అలాంటి 360x100=36000 రోజులతో కూడిన ఆయన జీవితకాలాన్నీ, ఆ బ్రహ్మజీవిత కాలం ఒక అరసెకండ్ తో సమానమైన మహావిష్ణువు యొక్క కాలాన్నీ ఊహించండి.

మనసూ మెదడూ దిమ్మెరపోయి,మొద్దు బారిపోయి,ఏమీ తెలియని ఒక విధమైన అచేతనమైన స్థితిలోకి వెళ్ళిపోయి రోజంతా అలాగే ఉండిపోతాము.   

కాలోయం పరమాన్వాది ద్వీపరార్ధాంత ఈశ్వర:
నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో దామమానినాం

ఈ కాలం అనేది పరమాణువు మొదలుకొని బ్రహ్మదేవుని జీవితకాలం వరకూ సమస్తాన్నీ నియంత్రిస్తుంది.కానీ అది సమస్తానికీ ప్రభువైన భగవంతుని నియంత్రించలేదు.దానిని ఆయనే నడిపిస్తున్నాడు.

తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణం
విష్ణోర్ధామ పరం సాక్షాత్పురుషస్య మహాత్మన:

కాలానికి లొంగని,నాశనంలేని,ఈ పరబ్రహ్మమే సర్వసృష్టికీ పరమకారణం. పరమపురుషుడైన ఆయనే భగవంతుడైన విష్ణువు.

(ఇంకా ఉన్నది)