నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

11, సెప్టెంబర్ 2014, గురువారం

యుగసిద్ధాంతం-2(దైవ-పితృ-మానవ యుగాలు)

మన పురాణాలలోని యుగాల లెక్కలు మనుషుల ఊహల మీద ఆధారపడినవి కావు.

అవి సూర్యగమనం మీదా,చంద్రగమనం మీదా,నక్షత్రాల మీదా ఆధారపడి ఖగోళ సూచికల ఆధారంగా వేసిన లెక్కలు.

విశ్వపు నడకకూ ఈ లెక్కలకూ అవినాభావ సంబంధం ఉన్నది.విశ్వంలో నడుస్తున్న విషయాలకు ఈ లెక్కలు దర్పణాలు.

మన పురాణాల లెక్కల ప్రకారం మనకు కొన్ని ప్రాధమిక విషయాలు తెలుసు.

అవేమంటే:--
  • మానవ కాలమానం కంటే పితృదేవతల కాలమానం 30 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  • పితృదేవతల కాలమానం కంటే దేవతల కాలమానం 12 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  • మానవుల కాలమానం కంటే దేవతల కాలమానం 360 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
వీటికి ఖగోళపరమైన ఆధారాలున్నాయి.అవి ఎలా వచ్చాయి అనే విషయం చూద్దాం.
దేవతల కాలమానం

మన ఆరునెలల కాలం(ఉత్తరాయణం)=సూర్యుడు మకరరాశి నుంచి మిధునరాశి వరకూ సంచరించే ఆరు నెలల కాలం=దేవతలకు ఒక పగలు

ఇంకొక ఆరునెలల కాలం(దక్షిణాయనం)=సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధనూరాశివరకూ సంచరించే ఆరునెలల కాలం=దేవతలకు ఒక రాత్రి.

అంటే మన ఒక సంవత్సర కాలం=దేవతలకు ఒక రోజు.

కనుక మనకూ దేవతలకూ కాలవ్యవధి (time scale) 360 రెట్లు ఉంటుంది.

ఇప్పుడు పితృదేవతల కాలగమనం చూద్దాం.

పితృదేవతల కాలమానం

మన పదిహేను రోజుల కాలం=శుక్ల పక్షం=పితృ దేవతలకు ఒక పగలు.

మన ఇంకొక పదిహేను రోజులు=కృష్ణ పక్షం=పితృదేవతల రాత్రి.
అంటే మనకు ఒక నెల=పితృదేవతల ఒక రోజు.

పితృదేవతల ఒక సంవత్సరం=మన లెక్కలో 360 నెలలు.

=30 మానవ సంవత్సరాలు
పితృదేవతల 100 సంవత్సరాలు=3000 మానవ సంవత్సరాలు.

అంటే మన కాలమానానికీ (time scale) పితృదేవతల కాలమానానికీ ముప్పైరెట్లు తేడా ఉన్నది.

పాతకాలంలో ఇలాంటి వాక్యాలను మన పురాణాలలో చదివి మనవాళ్ళే ఎగతాళి చేసేవారు.మిడిమిడి జ్ఞానపు ఇంగ్లీషు చదువుల ఫలితం అది.అదే, వారు నమ్మే సైన్సు ఇదే విషయాన్ని చెబితేమాత్రం, నోర్మూసుకుని ఇదే విషయాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.అన్ని గ్రహాల మీదా time scale ఒకే విధంగా ఉండదు.మన భూమి మీద ఉండే 24 గంటలు చంద్రుని మీద ఉండవు.అలాగే ఇతర గ్రహాలు కూడా.ఈ సంగతి సైన్స్ వివరించింది.

ఇతర గ్రహాలమీద ఎక్కడికక్కడ పగటి నిడివీ,రాత్రి నిడివీ,నెలా,సంవత్సరమూ అన్నీ మనకంటే తేడాలుగా విభిన్నంగా ఉంటాయి.అక్కడదాకా ఎందుకు? అమెరికాలాంటి దేశాలలో కొన్ని చోట్ల పగళ్ళూ రాత్రులూ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు.ఇక భూధృవాలవద్దకు వెళితే అక్కడ ఆర్నెల్లు పగలూ ఆర్నెల్లు రాత్రీ ఉంటాయి. 

మన భూమిమీదే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఇతర గ్రహాల మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా.కనుక ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాలప్రమాణం ఉంటుందన్న విషయం హేతుబద్ధమే.ఈ విషయాన్ని సైన్స్ చెప్పాక మన పురాణాలలోని time scales ను విమర్శిస్తున్న సోకాల్డ్ విమర్శకుల నోళ్ళు మూతలుబడ్డాయి.

ఇప్పుడు దేవతల కాలవ్యవధి చూద్దాం

మన ఒక సంవత్సరం=దేవతలకు ఒక రోజు.

దేవతల ఒక సంవత్సరం=మనకు 360 సంవత్సరాలు.
దేవతల 100 సంవత్సరాలు=మన లెక్కలో 36,000 సంవత్సరాలు.

యుగముల లెక్కలు-మహాయుగములు

యుగముల కాలవ్యవధి మానవ,పితృ,దేవతా గణములలో ఎవరికైనా ఈ క్రింది విధంగానే ఉంటుంది.

కృత 4800+త్రేతా 3600+ద్వాపర 2400+కలి 1200=12,000 మహాయుగం.
  • మానవ మహాయుగం =12,000 సంవత్సరాలు.
  • పితృ దేవతల మహాయుగం=12,000x30 మానవ సంవత్సరాలు.
=3,60,000 మానవ సంవత్సరాలు.
  • దేవతల మహాయుగం=12,000x360 మానవ సంవత్సరాలు.
=43,20,000 మానవ సంవత్సరాలు.
  • లేదా,360 మానవ మహాయుగాలు జరిగితే, ఒక దేవతల మహాయుగం అవుతుంది.
పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని జీవితకాలం-దాదాపు మూడుకోట్ల కోట్ల మానవ సంవత్సరాలు.

దేవతల మహాయుగములు వెయ్యి = బ్రహ్మ దేవునికి ఒక పగలు అవుతుంది.

అంటే,1000 దేవతల మహాయుగములు=1000x43,20,000 మానవ సంవత్సరాలు.

=432 కోట్ల మానవ సంవత్సరాలు
=బ్రహ్మదేవుని జీవితకాలంలో ఒక పగలు.
అంతేకాలం ఒక రాత్రి గనుక,
బ్రహ్మదేవుని ఒకరోజు =864 కోట్ల మానవ సంవత్సరాలు.

కనుక,బ్రహ్మదేవునికి 1 సంవత్సరం =864x360=3,11,040 కోట్ల మానవ సంవత్సరాలు.

బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు=3,11,04,000 కోట్ల సంవత్సరాల మానవ కాలం.

అంటే దాదాపు మూడుకోట్ల పదకొండు లక్షల కోట్ల మానవ సంవత్సరాల కాలం.

ఇప్పుడు దేవతల మహాయుగంలో ఒక్కొక్క యుగానికి ఎన్నెన్ని సంవత్సరాలు వచ్చాయో ఒక్కసారి గమనిద్దాం.

దేవతా మహాయుగపు లెక్క

దేవతల మహాయుగం(12,000 సం)=12000x360=43,20,000 మానవ సంవత్సరాలు.

వీటిలో,

దేవతల కృతయుగం=4320000x4/10
=17,28,000 మానవ సంవత్సరాలు.
దేవతల త్రేతాయుగం=4320000x3/10
=12,96,000 మానవ సంవత్సరాలు.
దేవతల ద్వాపరయుగం=4320000x2/10
=8,64,000 మానవ సంవత్సరాలు.
దేవతల కలియుగం=4320000x1/10
=4,32,000 మానవ సంవత్సరాలు.

చూచారా ఇక్కడ చిక్కు ముడి విడిపోయింది!!!

ఈ దేవతల కలియుగ ప్రమాణమైన 4,32,000 సంవత్సరాలను మన భూలోక కలియుగ ప్రమాణంగా స్వీకరించినందువల్ల మన పంచాంగాలలో అసలైన పొరపాటు జరిగింది.అయితే దీనిని పొరపాటు అనవచ్చా?అనకూడదా? అనే విషయాన్ని ముందు ముందు పరిశీలిద్దాం.

కనుక భూలోక కలియుగం 4,32,000 సంవత్సరాలు కాదు.అది మానవ సంవత్సరాలలో దేవతల కలియుగ ప్రమాణం.

మనకూ దేవతలకూ time scale 360 రెట్లు తేడా ఉంటుంది కనుక,మన కలియుగం =4,32,000/360=1200 సంవత్సరాలే.

అయితే ఈ పొరపాటు ఎక్కడ జరిగింది?

మహాభారతయుద్ధం తర్వాత మన దేశంలో భయంకరమైన మేధాశూన్యత్వం (intellectual vacuum) ఏర్పడింది.లెక్కలు చెప్పేవారు ఎవరూ లేరు. పండితులు లేరు.కాలగణనం సరిగ్గా చేసేవారు ఎవరూ లేరు.అంతా సర్వనాశనం అయింది.కనుక అక్కడనుంచి కాలగణనంలో పొరపాటు జరిగిందని స్వామి యుక్తేశ్వర్ గిరిగారన్నారు.

అయితే మన సంకల్పంలో చెప్పే "కలియుగే ప్రధమే పాదే" అనేది తప్పా?

ఒక్కసారి సైన్స్ లోకి తొంగి చూద్దాం.

మనకు తెలిసిన విశ్వం వయస్సు దాదాపుగా 13.75x1,00,00,00,000 సంవత్సరాలని సైన్స్ అంటుంది.

అంటే దాదాపుగా 1375 కోట్ల ఏళ్ళన్నమాట.

బ్రహ్మదేవుని ఒక రోజు 864 కోట్ల ఏళ్ళు గనుక,ఇప్పుడు ఆయన జీవితంలో రెండో రోజు నడుస్తున్నదన్న మాట.అయితే అది ఎన్నో రెండో రోజో మనకు తెలియదు.

ఆ వివరాలు కొద్దిగా తర్వాత చూద్దాం.

ఇప్పుడు మన యుగాల లెక్కలను ఒకసారి పరిశీలిద్దాం.

మొదటి విధానం

విశ్వపు వయస్సును భూమి వయస్సుతో పోల్చి చూద్దాం.

దీనిలో కృతయుగం=549 కోట్లు
త్రేతాయుగం=412 కోట్లు
ద్వాపరయుగం=275 కోట్లు
కలియుగం =138 కోట్లు
ఇప్పటివరకూ విశ్వపు వయస్సు మొత్తం =1374 కోట్ల సంవత్సరాలు

(విశ్వపు వయస్సు ఇప్పటివరకే లెక్కించటం జరిగింది.ఇంకా ఎన్నేళ్ళు విశ్వం ఇలాగే భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుందో ఎవరికీ తెలియదు)

భూమి పుట్టి ఇప్పటికి దాదాపుగా 454 కోట్ల సంవత్సరాలైంది.

విశ్వపు వయస్సుతో భూమి వయస్సును పోల్చి,ఈ లెక్కన చూచినా కూడా, ప్రస్తుతం ఇంకా కృతయుగమే జరుగుతూ ఉన్నదన్నమాట.

కనుక ఇది కరెక్ట్ కాదు.

రెండవ విధానం

పోనీ, భూమి పుట్టిన దగ్గరనుంచీ మానవయుగాలతో లెక్కించి చూస్తే,

454,00,00,000/12,000=378333.33
=0.33x12,000
=3960

అంటే,ఈ లెక్కన చూచినా కూడా చతుర్యుగాలతో కూడిన మహాయుగాలు 3,78,333 సార్లు ఆవృత్తులు జరిగి ఇప్పుడు ఆ తర్వాతి ఆవృత్తిలో 3961 సంవత్సరం జరుగుతున్నదన్నమాట.

మనకు తెలిసిన కృతయుగం నిడివి 4800 ఏళ్ళు గనుక ప్రస్తుతం ఇంకా కృతయుగమే జరుగుతున్నది.

కనుక మానవ మహాయుగాలతో వేసిన ఈ లెక్కా కరెక్ట్ కాదు.

మూడవ విధానం

పోనీ దేవతల మహాయుగప్రమాణమైన 43,20,000 సంవత్సరాల లెక్కతో భూమి వయస్సును కొలిస్తే,

454,00,00,000/43,20,000
=1050.92593

కనుక,
0.92593x43,20,000
=40,00,017

అంటే,ఇప్పటికి మహాయుగాలు 1050 సార్లు ఆవృత్తి అయిపోయి ఆ తర్వాత ఆవృత్తిలో 40,00,017 సంవత్సరాలు గడిచాయన్నమాట.

అంటే,
కృతయుగం 17,28,000
త్రేతాయుగం 12,96,000
ద్వాపర          8,64,000
--------------------------
                  38,88,000
సంవత్సరాలు గడిచాయి.

కనుక,

40,00,017 (-)
38,88,000
------------------
1,12,017

అనగా,మిగిలిన 4,32,000 కలియుగ వ్యవధిలో ప్రస్తుతం 1,12,017 సంవత్సరాలు గడచినాయన్నమాట.

భూమి పుట్టి ఇప్పటికి 1050 సార్లు ఈ దైవమహాయుగాల ఆవృత్తులు అయిపోయి,ప్రస్తుతం 1051వ దైవమహాయుగపు ఆవృత్తిలో కలియుగమే నడుస్తున్నది.ఇది మానవ మహాయుగపు 12,000 సంవత్సరాల ఆవృత్తి కాదు.43,20,000 సంవత్సరాల దైవ మహాయుగ ఆవృత్తి.అలా లెక్కిస్తేనే ఈ లెక్క సరిపోతున్నది.

4,32,000 ల దైవకలియుగాన్ని నాలుగు పాదాలు చేస్తే,ఒక్కొక్క పాదం 1,08,000 అవుతుంది.ఈ రకంగా చూచినప్పుడు కలియుగం మొదటి పాదం అయిపోయి ప్రస్తుతం రెండో పాదంలో,

112017-108000=4017 సంవత్సరాలు గడిచాయన్నమాట.కలియుగం రెండవ పాదం వచ్చింది గనుక ఇది కరెక్ట్ కాదు.

అలా కాకుండా కలియుగాన్ని కూడా మళ్ళీ 4:3:2:1 నిష్పత్తిలో విభజిస్తే,

కలియుగం ప్రధమ పాదం=1,72,800 (కలి x కృత)
రెండవ పాదం                   1,29,600 (కలి x త్రేతా)
మూడవ పాదం                    86,400 (కలి x ద్వాపర)
నాల్గవపాదం                        43,200 (కలి x కలి)
----------------------------------------
మొత్తం                           4,32,000
----------------------------------------

అలాంటప్పుడు కలియుగం మొదటి పాదంలో(అంటే కలి xకృతయుగంలో),

1,72,800 లో ప్రస్తుతం 1,12,017 గడచి ఇంకా 60,783 మిగిలి ఉన్నాయని తెలుస్తున్నది.

అప్పుడు "కలియుగే ప్రధమేపాదే" అన్న సంకల్పం ఖచ్చితంగా సరిపోతున్నది.

కనుక మన సంకల్పంలో దైవయుగాల లెక్కను తీసుకున్నందువల్ల ఇలా 'కలియుగే ప్రధమేపాదే' అన్న మాటను వాడుతున్నామని స్పష్టంగా కనిపిస్తున్నది.కనుక అలా సంకల్పంలో చెప్పడం తప్పు కాదు.భూమి సృష్టి అయిన మొదటినుంచీ ఇప్పటివరకూ నడుస్తున్న దైవయుగాలను చెప్పుకుంటూ మహాసంకల్పంలో మనం అలా అంటున్నాం.వీటికీ భూమిమీద నడుస్తున్న మానవయుగాలకూ సంబంధం లేదు.

కనుక మన మహాసంకల్పంలో 'కలియుగే ప్రధమేపాదే' అన్నమాట సరియైనదే.అయితే ఆ కలియుగం మానవ కలియుగం కాదు.దైవయుగం అని గుర్తుంటే ఏ ఇబ్బందీ లేదు.

దైవ మహాయుగాలతో మానవ యుగాలను కలగలిపి గందరగోళ పడినప్పుడే అసలైన సంకటం తలెత్తుతుంది.సరిగ్గా వేటికి వాటిని సక్రమంగా అర్ధం చేసుకుంటే ఏ బాధా ఉండదు. 

అంతేకాదు ప్రతి యుగాన్నీ నాలుగు సమభాగాలు చెయ్యకూడదనీ దానిని మళ్ళీ యుగవిభజన నిష్పత్తిలో 4:3:2:1 పద్దతిలోనే విభజించాలనీ తెలుస్తున్నది.అలా చేసినప్పుడే 'కలియుగే ప్రధమేపాదే' అన్న మాట సరిపోతుందనీ తెలుస్తున్నది.ఈ నిష్పత్తి సరియైనది.ఎందుకంటే ఒక యుగంలో అన్ని భాగాలూ సమపాళ్ళలో ఉండటం తార్కికం కూడా కాదు.అన్నిటికంటే కృతయుగపు భాగం ఎక్కువ ఉండాలి.కలియుగపు భాగం తక్కువ ఉండాలి.వీటి మధ్యన నాలుగు రెట్లు తేడా ఉండాలి.

ఈ విధంగా మన పురాణాలను సరిగ్గా అర్ధం చేసుకుంటే విషయం అంతా సవ్యంగా అర్ధమౌతుంది.అలా కాకుండా ఏదో ఎగతాళి ధోరణిలో పిచ్చిమాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏమీ అర్ధంకాక,అజ్ఞానపు చీకటిలో అల్లాడటమే మనపని అవుతుంది.

అయితే,మంచు యుగం అనేది దాదాపుగా ప్రతి పదివేల సంవత్సరాలకొకసారి భూమ్మీద వస్తూనే ఉంటుంది.చాలా మతాల గ్రంధాలలో రికార్డ్ చెయ్యబడిన జలప్రళయం అదే కావచ్చు.అలాంటప్పుడు జలప్రళయం సమయంలో మొత్తం నాశనం అయిపోతే,ఆ తర్వాత ఈ లెక్కలను ఎవరు గుర్తుంచుకున్నారు?ఏ విధంగా తరువాత తరాలకు ఎలా అందించారు?ఇన్ని లక్షలాది సంవత్సరాలుగా ఈ లెక్కలు ఇలా అనుస్యూతంగా వస్తూ ఉండటం ఎలా సాధ్యమైంది?

ఇవన్నీ నేటికీ ఎవరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్నలు.

అసలీ గోలంతా ఎందుకు?ఇన్ని యుగాలూ ఇవన్నీ ఎందుకు?అనే అల్పమైన ప్రశ్నలకు జవాబులు ముందే చెప్పాను.

ఈ లెక్కలు మన కపోల కల్పితాలు కావు.విశ్వం ఆ లెక్కల ప్రకారం నడుస్తున్నది.గ్రహాలూ సౌరమండలమూ నక్షత్రాలూ ఒక తీరులో నడుస్తున్నాయి.ఆ తీరును అర్ధం చేసుకునే ప్రయత్నం మన పూర్వీకులు చేశారు.ఆ విజ్ఞానాన్ని మనకు అందించారు.

వారు చెప్పినదానిని కనీసం సక్రమంగా అర్ధం చేసుకోలేక,తిరిగి వారినే విమర్శిస్తుంటే మన చేతగానితనాన్నీ అల్పత్వాన్నీ మనమే బయట పెట్టుకున్నట్లు కాదూ?

(ఇంకా ఉన్నది)