“Self service is the best service”

28, ఆగస్టు 2014, గురువారం

శ్రీ కృష్ణుని జన్మకుండలి -8(డా||రాఘవన్ & డా||సంపత్ అయ్యంగార్ వర్గం)

శ్రీ కృష్ణ జనన తేదీమీద పరిశోధన చేసినవారు ఇంకా చాలామంది ఉన్నారు.డా||GS Sampath Iyengar and డా||రాఘవన్ గార్లు వారి పరిశోధనలో తేల్చిన విషయాన్ని బట్టి 27-7-3112 BC అనేది శ్రీకృష్ణుని జనన తేదీ.

ఈ తేదీకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇది జూలియన్ కేలండర్ తేదీ గనుక దీనిని గ్రెగేరియన్ కాలెండర్ లోనికి మార్చగా 1-7-3111 BC అవుతుంది.ఆ సమయానికి కుండలి ఏమంటున్నదో చూద్దాం.

శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ అష్టమి గురువారం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం అయింది.

యధావిధిగా చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.గురువు ఉచ్ఛస్థితికి దగ్గరగా ఉన్నాడు.శ్రీ రామకృష్ణుని జాతకంలో కూడా గురువు మిధునంలోనే ఉన్న విషయం గమనించాలి.శుక్రుడు నీచలో ఉన్నాడు గాని తద్రాశినాధుడైన బుధుని చతుర్ధ కేంద్రస్థితివల్ల నీచభంగం అయింది.శని ఉచ్చస్థితిలో ఉన్నాడు.కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.రాహుకేతువులు కూడా ఉచ్ఛస్థితికి దగ్గరలో ఉన్నారు.కనుక దాదాపు ఏడుగ్రహాలు తమ తమ ఉచ్చస్థితిలో గాని దానికి దగ్గరగా గాని ఉన్నట్లు లెక్క.

ఈ గ్రహస్థితి అవతార పురుషుని జాతకానికి చాలా దగ్గరగా ఉన్నది. భగవంతుని అవతారం అయిన వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉంటుందో శ్రీరామకృష్ణుని జాతకమే మనకు మోడల్ జాతకం  అని ఇంతకు ముందే చెప్పాను.ప్రస్తుత జాతకం శ్రీరామకృష్ణుని జాతకానికి చాలా పోలికలతో దగ్గరగా ఉండటం గమనించవచ్చు.

జనన సమయంలో ఈ జాతకునికి చంద్ర/శుక్ర/బుధదశ జరుగుతున్నది. శుక్రుడు షష్టాధిపతిగా మేనమామను సూచిస్తున్నాడు. అంతేగాక గండాన్ని సూచిస్తున్నాడు.పంచమంలో నీచలో ఉంటూ కుట్రను సూచిస్తున్నాడు. బుధుడు చతుర్దంలో చతుర్దాతిపతితో కలసి ఉంటూ మాతృవర్గాన్ని సూచిస్తున్నాడు.వెరసి జనన సమయంలో మేనమామ వల్ల వచ్చిన ప్రాణగండం స్పష్టంగా కనిపిస్తున్నది.

లగ్నానికి పట్టిన గ్రహార్గళం వల్ల ఇతని జననం ఒక చెరసాలలో జరిగిందన్న సూచన ఉన్నది.

చతుర్దంలో రెండుగ్రహాల వల్ల ఇద్దరు తల్లులున్న విషయం తెలుస్తున్నది. పంచమంలో నీచశుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు కనిపిస్తున్నాయి.నవమంలో ఉచ్ఛ కుజుని వల్ల అనేక వివాహాలూ, ద్వాదశం లోని రాహువుపైన కుజదృష్టి వల్ల జ్ఞాతిపోరూ సూచితం అవుతున్నది. నవమాధిపతి షష్ఠమంలో కేతువుతో కూడిన ఉచ్చస్థితి వల్ల జ్ఞానస్వరూపుడూ జగద్గురువూ అవతారమూర్తీ అని తెలుస్తున్నది.ధర్మస్థాపన కోసం అవతరించాడని అర్ధమౌతున్నది.

అయితే ఈ ధర్మస్థాపన ఉత్త బోధనాపరంగా కాకుండా ఒక మహాయుద్ధం ద్వారా భూభారం తగ్గించే పని జరుగుతుందన్న విషయం షష్ఠంలోని శని కేతువుల వల్ల తెలుస్తున్నది. తృతీయం మీద ఉచ్చకుజుని దృష్టి వల్ల మహాపరాక్రమశాలి అని తెలుస్తున్నది.ధర్మస్థానం నుంచి ఉచ్ఛకుజుని దృష్టి చతుర్దంలో ఉన్న దారాకారకుడూ పంచమాధిపతీ అయిన బుధునిపైన పడుతూ ఆధ్యాత్మిక పరమోత్కృష్ట ఘట్టమైన రాసలీలను సూచిస్తున్నది.

ఈ జాతకునికి కుజదశ తన 8 వ ఏట అయిపోతుంది.రాసలీల జరిగినప్పుడు కృష్ణునికి దాదాపు అంతే వయస్సు ఉంటుంది.అందరూ అనుకున్నట్లు అది కామకేళి కాదు.అది సామాన్య మానవుల మనస్సులు ఊహించలేని అత్యంత మధురమైన దివ్యఘట్టం.నిమ్నమైన మనోభూమికలలో విహరించడానికి అలవాటు పడిన సామాన్యులు రాసలీలను ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు.

రాసలీల గురించి ఒక సందర్భంలో శ్రీ రామకృష్ణులు ఇలా అన్నట్లుగా 'గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ' గ్రంధకర్త మహేంద్రనాధ గుప్త రికార్డ్ చేశారు. 

"రాసలీలా సమయంలో గోపికలందరూ సమాధిస్థితిలో అత్యంత దివ్య పారవశ్యస్థితిలో ఉన్నారు.వారికి దేహస్పృహ ఏ మాత్రమూ లేదు.కృష్ణుని దివ్యసన్నిధిలో అప్రయత్నంగా వారి కుండలిని సహస్రారచక్రానికి అధిరోహించగా అందరూ మాటలకందని పరమ పారవశ్య సమాధిస్థితిలో లీనమై ఉన్నారు.వారి ఆత్మలన్నీ శ్రీకృష్ణునిలో లయించాయి. దేహస్పృహను దాటిన పరమానంద స్థితిలో వారు ఆ రాత్రంతా మునిగి ఉన్నారు."

ఒక సందర్భంలో 'రాసలీల' గురించి మాట్లాడుతూ వివేకానంద స్వామి ఇలా అన్నారు.

"మనస్సులో కామం లేశమాత్రమైనా మిగిలి ఉన్నంతవరకూ ఏ మానవుడూ రాసలీల యొక్క పరమోత్క్రుష్టమైన స్థాయిని కనీసం ఊహించను కూడా ఊహించలేడు."

కనుక ఎనిమిదేళ్ళ లోపు వయస్సులో జరిగిన రాసలీలను కూడా ఈ జాతకం స్పష్టంగా సూచిస్తున్నది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ సంఘటన 3104-3105 BC మధ్యలో జరిగి ఉండాలి.ఎందుకంటే,ఆ సమయంలో ఈ జాతకంలో కుజ/శుక్రదశ నడిచింది.అప్పటికి కృష్ణునకు ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది.ఆ వయస్సులో ఆయన ఎంత ముద్దుగా ఉండేవాడో ఊహిస్తే ఆ చిన్నికృష్ణుని సమక్షంలో గోపికల దివ్యపారవశ్య స్థితి ఏమిటో- రాసలీల అంటే ఏదేదో అనుకునే మన మట్టిబుర్రలకు లీలగా చూచాయగా అయినా అందుతుంది.

మన ఎదురుగా కనిపిస్తున్న మనుషులనే మనం సరిగ్గా అర్ధం చేసుకోలేం. ఇక ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక మహోన్నతమైన దివ్యసంఘటనను మన మురికి బట్టిన మనస్సులతో ఎలా అర్ధం చేసుకోగలం?భగవంతుని లీలను మన ఊహతో ఎలా కొలవగలం?అది జరిగే పని కాదు.అందుకే రాసలీల అంటే ఏమిటో ఇప్పటికీ ఎవరూ సక్రమంగా అర్ధం చేసుకోలేరు.మనుష్యుల నీచ మానసిక స్థితులను గమనిస్తే అలా అర్ధం చేసుకోలేకపోవడం సహజమే అనిపిస్తుంది.

హిమాలయాలలో వేల అడుగుల ఎత్తులో ఉన్న మానససరోవర తీరంలో ఉండే మనోహర వాతావరణం,మన ఊరిలోని బురదగుంటలో పొర్లే పందికి ఎలా అర్ధమౌతుంది? అసాధ్యం!!

ద్వితీయం నుంచి గురుదృష్టి శనికేతువుల మీద పడుతూ తన చతుర సంభాషణలతో ఎంతటి శత్రువునైనా లొంగదీసుకోగల ధార్మికతనూ చతురతనూ సూచిస్తున్నది.

అష్టమంమీద ఉన్న రాహు,గురు,శని,కేతు,రవి బుధుల దృష్టుల వల్ల ఒక మహోన్నతమైన,నిగూఢమైన,ఊహాతీతమైన రహస్యదైవశక్తి సూచింప బడుతున్నది.దాని పరిధి ఎల్లలు లేకుండా ఉన్నదనీ అది సర్వతోముఖంగా వ్యాపించి ఉన్నదనీ,దాని లోతులు కొలవడం మనకు అసాధ్యం అన్న విషయం రహస్యస్థానం అయిన అష్టమంమీద ఉన్న ఇన్ని గ్రహాల శక్తివంతములైన దృష్టుల వల్ల సూచనాప్రాయంగా మనకు తెలుస్తున్నది.

ఇది స్పష్టంగా కనిపిస్తున్న అవతార లక్షణం.

అవతార పురుషుడు భూమిమీద జీవించి ఉన్న సమయంలో ఎవరికీ అంతుబట్టడు.తర్వాత కాలం గడిచేకొద్దీ మాత్రమే ఆయనను లోకం గుర్తించడం ఆరాధించడం మొదలుపెడుతుంది.లోకంలో ఇది సర్వసాధారణం. దైవం యొక్క అవతారాన్ని అందరూ గుర్తించలేరు.అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే అలా చెయ్యగలరు.ఎందుకంటే,లోకం మొత్తం ఆయన్ను గుర్తిస్తే ఆయన ఎందుకోసం వచ్చాడో ఆ పని నెరవేరదు.ఇక జనుల క్షుద్రమైన కోరికల చిట్టాను తీర్చడమే ఆయనకు నిత్యకృత్యం అయిపోతుంది.

శ్రీ రామకృష్ణులు కూడా తన చివరి దశలో ఇలా అనేవారు.

'నన్ను ప్రజలు గుర్తించడం మొదలు పెట్టిన మరుక్షణం నేనిక్కడ ఉండను.ఈ శరీరాన్ని వదలివేస్తాను.'

అలాగే శ్రీకృష్ణుడు జీవించి ఉన్నసమయంలో కూడా ఆయన దేవుడని,అతి కొద్దిమందికి తప్ప, మిగతా ఎవ్వరికీ తెలియదు. 

అందరూ ఆయనొక తెలివైన మాయలమారి అనీ స్త్రీలోలుడనీ అత్యంత సమ్మోహనా శక్తి కలిగిన మంత్రగాడనీ మాత్రమే అనుకున్నారు గాని ఆయనలోని దైవాంశను గుర్తించిన వారు చాలా తక్కువ. అదికూడా ఆయన యొక్క యోగమాయా ప్రభావమే.ఇదంతా అష్టమం మీద ఉన్న ఈ గ్రహాల దృష్టుల వల్ల సూచింపబడుతున్నది.

నవమంలో ఉన్న ఉచ్ఛకుజుని మీద ఉన్న గురుని నవమదృష్టి వల్ల ఒక మహోన్నత ధార్మిక శక్తిస్వరూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షమౌతున్నది.

ఇప్పుడు మిగతా సంఘటనలు చూద్దాం.

'వర్షాణామ్ అధికం శతం' అన్న పదానికి 'నూరేళ్ళు దాటి' అనిన అర్ధాన్ని స్వీకరిస్తే,జనన సంవత్సరం 3111 గనుక దేహత్యాగం 3011-3010 ప్రాంతంలో కొంచం అటూ ఇటూగా జరిగి ఉండాలి.ఆ సమయంలో ఏ దశ జరిగిందో చూద్దాం.

3011-3010 BC ప్రాంతంలో ఈ జాతకునికి శుక్ర/శనిదశ జరిగింది.ఈ దశా ప్రభావాన్ని కాళిదాసు ఎలా వర్ణించాడో ఇంతకు ముందే చెప్పి ఉన్నాను.కనుక మళ్ళీ వివరించనవసరం లేదు.కాకపోతే శుక్రునికి షష్టాదిపత్యం రావడమూ శని షష్ఠంలో ఉండటమూ ఆ సమయంలో భయంకర దుర్దశనూ ముసలాన్నీ సూచిస్తున్నాయి.కనుక ఇది కూడా సరిగ్గా సరిపోయింది.

ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగిన సమయం చూద్దాం.డా||రాఘవన్,డా||సంపత్ అయ్యంగార్ డా||నరహరి ఆచార్ గార్ల పరిశోధన ప్రకారం మహాభారత యుద్ధం ఖచ్చితంగా 22-11-3067 BC న మొదలైంది.

ఆ సమయానికి ఈ జాతకంలో శని/శనిదశ జరిగింది.శని ఖచ్చితంగా యుద్ధాన్ని సూచించే షష్ఠం లో ఉండటం కనిపిస్తున్నది.వీరి లెక్క ప్రకారం తేదీకూడా ఇచ్చారు గనుక దశ/అంతర్దశ/విదశ/సూక్ష్మదశ/ప్రాణదశ వరకూ పరిశీలించి చూద్దాం.

అద్భుతం!!!

22-11-3067 తేదీన ఖచ్చితంగా మహాభారత యుద్ధం మొదలయ్యే సమయానికి ఈ జాతకునికి శని/శని/కుజ/శని/రాహుదశ జరిగింది.అంటే శపితయోగం స్పష్టాతిస్పష్టంగా దర్శనమిస్తున్నది.

శని షష్ఠంలో ఉంటూ యుద్ధాన్ని సూచిస్తున్నాడు.కుజుడు సప్తమ ద్వాదశాధిపతిగా వినాశనానికి కారకుడు.రాహువు ద్వాదశం లోనే ఉన్నాడు.కుజుణ్ణి సూచిస్తున్నాడు.శని/కుజ/రాహువుల కలయిక ఖచ్చితంగా కనిపిస్తున్నది !!!

ఇప్పుడు ఇంకొక సంఘటనను పరిశీలిద్దాం.

వీరి పరిశోధన ప్రకారం భీష్మనిర్యాణం 17-1-3066 BC రోజున జరిగింది. అంపశయ్య మీద ఉండి భీష్ముడే విష్ణుసహస్రనామాన్ని ధర్మరాజుకు చెప్పినట్లు మనకు తెలుసు.ఈ సంఘటన సరిపోతున్నదో లేదో చూద్దాం.

17-1-3066 న ఈ జాతకంలో శని/బుధ/బుధ/చంద్ర/కుజ దశ జరిగింది.శని నవమాధిపతిగా ఉచ్ఛస్థితిలో సహజ మోక్షకారకుడైన కేతువుతో కలసి ఉంటూ ఒక ధార్మిక మహాసంఘటనను సూచిస్తున్నాడు.బుధుడు పంచమాధిపతిగా సూర్యునితో కలసి బుధాదిత్య యోగంలో ఉంటూ ఒక మహోన్నత సాహిత్య అవతరణాన్ని సూచిస్తున్నాడు. చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు.కుజుడు నవమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.కనుక ఆ సమయంలో విష్ణు సహస్రనామం ఉద్భవించడానికి సరిపోయే దశలు ఖచ్చితంగా జరుగుతున్నాయి.

కృష్ణుని జీవితంలో మనకు తెలిసిన అన్ని పెద్ద సంఘటనలూ ఈ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కనుక ఇప్పటివరకూ విశ్లేషించిన జాతకాలన్నింటిలో ఈ జాతకానికి ప్రధమస్థానం ఇస్తున్నాను.నరహరి ఆచార్ గారి వర్గానికి రెండవస్థానం ఇచ్చాను.వర్తక్ గారి పరిశోధనకు మూడవస్థానం ఇచ్చాను.

కాకపోతే ఇందులో ఒక చిన్న చిక్కు ఉన్నది.

ఈ జాతకుడు పుట్టినది భాద్రపద బహుళ అష్టమి.శ్రావణ బహుళ అష్టమి కాదు.కనుక ఈ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి జాతకం ఏమంటున్నదో కూడా మనం పరిశీలించాలి.అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు.ఆ జాతకాన్ని కూడా పరిశీలించిన తరువాత మాత్రమే మనం ఒక నిశ్చితాభిప్రాయానికి రాగలం.

ఆ పని వచ్చే పోస్ట్ లో చేద్దాం.

(ఇంకా ఉన్నది)