“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఆగస్టు 2014, సోమవారం

శ్రీకృష్ణుని జన్మ కుండలి -6(డా||వర్తక్ గారి పరిశోధన)

డా||వర్తక్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీకృష్ణజననం 23-5-5626 BC తేదీన జరిగింది.అంత దూరంగా ఉన్న గ్రహస్థితులను లెక్కించే సాఫ్ట్ వేర్ నా వద్ద లేదు.

కనుక డా|| వర్తక్ గారు ఇచ్చిన గ్రహడిగ్రీలనే మనం స్వీకరిద్దాం.

* అనేది 'డిగ్రీ' కి గుర్తుగా చదువరులు గమనించాలి.

Sun-132* =Simha 12*
Moon -48* =Vrishabha 18*
Mars -337*=Mina 7*
Mercury-Kanya.
Jupiter-100*=Karkataka 10*
Venus-82*=Mithuna 22*
Saturn-64*=Mithuna 4*
Rahu-93*=Karkataka 3*
Ketu-273*=Makara 3*
Uranus-15* Mesha
Neptune-178*=Kanya 28*
Pluto-296*=Makara 26*
Lagna -Vrishabha.

ఇప్పుడు చదువరుల ఊహాశక్తికి పదును పెట్టే మానసిక వ్యాయామం ఇవ్వబోతున్నాను.ఇక్కడ జాతకచక్రం లేదు గనుక జాతకచక్రాన్ని కళ్ళ ముందు చూస్తూ ఈ లెక్కలు అర్ధం చేసుకోవాలి.


లగ్నం యధావిధిగా వృషభం అయింది.
చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు.
రెండింట శుక్ర శనులు
మూడింట గురురాహువులు
నాలుగింట రవి
అయిదింట బుధుడు
తొమ్మిదిలో కేతువు
పదకొండులో కుజుడు

చంద్రుడు 48 డిగ్రీలు అంటే, చంద్రదశా శేషం 4 సంవత్సరాలు ఉంటుంది.జనన సమయానికి చంద్ర/శని/గురుదశ జరుగుతున్నది.శని పిత్రువర్గాదిపతి. శుక్రునితో కలయిక వల్లా కుటుంబస్థానంలో ఉన్నందువల్లా తన బంధువులతో అందులోనూ మేనమామతో శత్రుత్వాన్ని సూచిస్తున్నాడు. గురువు అష్టమాదిపతి గనుక గండాన్ని సూచిస్తున్నాడు.తృతీయంలో రాహువుతో కూడినందువల్ల కుట్రపూరితమైన ప్రాణగండం సూచన ఉన్నది.

చరకారకులను లెక్కిస్తే,గురువు మాతృకారకుడవుతున్నాడు.వర్తక్ గారు బుధుని డిగ్రీలు ఇవ్వలేదు.కనుక బుధునికి ఏమి కారకత్వం వస్తుందో చెప్పలేము.ప్రస్తుతం ఉన్న లెక్కలప్రకారం గురువుకు మాతృకారకత్వం వస్తే,అప్పుడు జననకాల దశా ప్రకారం మేనమామ నుంచి ప్రాణగండం సరిగ్గా సరిపోతున్నది.

23-5-5626 BC నుంచి 5616 లోపు చంద్ర కుజ దశలు అయిపోతాయి.కుజుడు సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు.పంచమం నుంచి ఉచ్ఛ బుధునితో చూడబడుతూ ఉన్నాడు.కనుక ప్రేమ వ్యవహారాలూ సూచితమే.అనేకమంది భార్యలూ సూచితమే.

కానీ నాలుగింట ఉన్న ఒకేఒక గ్రహమైన రవి ఇద్దరు తల్లులను సూచించడం లేదు.

తృతీయ ఉచ్ఛగురువుకు రాహుస్పర్శ మంచిది కాదు.ఇది అవతార పురుషుని జాతకసూచనగా అనిపించడం లేదు.ఒక బోగస్ గురువు యొక్క జాతకంలో ఇలా ఉంటుందేమో గాని ఒక అవతారపురుషుని జాతకంలో గురువుకు రాహుస్పర్శ అనేది జీర్ణించుకోలేని విషయం.


16-10-5561 న మహాభారత యుద్ధం మొదలైందని వర్తక్ గారి అభిప్రాయం. దీనికి ఒక బలమైన లాజిక్ ఆయనకున్నది.ఆయన రీసెర్చి మెటీరియల్ చదివితే అది గట్టి లాజిక్ తో ఉన్నట్లే అనిపిస్తుంది.

మనం ఖగోళ వివరాలలోనికి పోకుండా ఉత్త జ్యోతిష్యపరంగా మాత్రమే చూద్దామని అనుకున్నాం కదా.కనుక కృష్ణునికి 65 ఏళ్ళ వయస్సు ఉన్నపుడు మహాభారత యుద్ధం జరిగి ఉండాలని పై తేదీలను బట్టి డా||వర్తక్ గారి పరిశోధన కూడా సూచిస్తున్నది.

ఇప్పుడు,దశలను పరిశీలిస్తే,5561 BC లో ఈ జాతకానికి బుధ/బుధ/శుక్రదశ జరిగినట్లుగా కనిపిస్తున్నది.సప్తమాధిపతి కుజుడి దృష్టి బుధుని మీద ఉన్నందునా,శుక్ర విదశ ఉన్నందునా,యుద్ధసూచనా,పుత్రవర్గ నాశనమూ సూచింపబడుతున్నది.కానీ బలమైన సూచన కాదు.

ఇకపోతే 5524 BC లో ఈ జాతకానికి,శుక్ర/శని/శుక్ర దశ జరిగింది.శుక్రుడు ఆత్మకారకుడు,శని నక్షత్రంలో ఈ జాతకానికి మారకుడైన కుజుడున్నాడు.పైగా పదకొండులో కుజుని వల్ల కాలికి గాయం అవడం ద్వారా మరణం కలుగుతున్నదని సూచన ఉన్నది.ఈ సంగతి ఆయన కూడా వ్రాశారు.

ఇంతవరకూ బాగానే ఉందికానీ ఈ సమయంలో ముసలంవల్ల యాదవవంశ నాశనాన్ని ఈ దశలు చూపడం లేదు.శుక్రునికీ శనికీ కూడా రాహుస్పర్శ లేదు.కనుక స్పష్టత లేదు.

డా|| నరహరి ఆచార్ గారి విధానంలో వచ్చినంత స్పష్టత ఈ జాతకంలో లేదు.కనుక దానికంటే దీనికి తక్కువ మార్కులే వచ్చాయని చెప్పవచ్చు.

(ఇంకా ఉన్నది)