“Self service is the best service”

18, ఆగస్టు 2014, సోమవారం

శ్రీ కృష్ణుని జన్మకుండలి - 1

"పలికెద వేరొండు గాధ పలుకగనేలా"-- అన్నాడు భక్తకవి పోతనార్యుడు.

మామూలు మానవుల జాతకాలు ఎన్ని పరిశీలిస్తే మాత్రం ఏముంటుంది?ఈతిబాధలూ ఈర్ష్యాద్వేషాలూ తప్ప వాటిలో ఇంకేమీ ఉండవు.

వివేకానందస్వామి,రమణమహర్షి వంటి మహనీయుల జాతకాలూ, అవతార పురుషులైన శ్రీరామకృష్ణ, చైతన్యమహాప్రభుల వంటివారి జాతకాలూ పరిశీలిస్తే వారి దివ్యలక్షణములూ సద్గుణసంపత్తులూ కొంచమన్నా మన మనసుకు అంటుకుంటాయి.

అందుకే  భగవంతుడైన శ్రీకృష్ణుని జాతకాన్ని వివరించే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను. 

జాతకపరిశీలన కూడా ఒక రకమైన ధ్యానమే.

ఎవరి జాతకాన్ని పరిశీలిస్తున్నామో వారి సంస్కారాల మీద మనకు తెలీకుండానే మనసు నిలపవలసి ఉంటుంది. కొద్దో  గొప్పో ఆ వాసన మనకు అంటుతుంది. కానీ మానవజాతకాలకూ మహనీయుల జాతకాలకూ భేదాలున్నాయి. మానవుల జాతకాలలో అన్నీ బలహీనతలూ తప్పులూ కనిపిస్తాయి. వాటిమీదే మనసు లగ్నం చెయ్యవలసి వస్తుంది. మహనీయుల జాతకాల పరిశీలన వల్ల వారియొక్క ఉత్తమలక్షణాల మీద మనసు నిలుస్తుంది. దానివల్ల పుణ్యమూ పురుషార్ధమూ రెండూ కలుగుతాయి.

అష్టాదశ పురాణాలు రచించికూడా చింతాగ్రస్తుడైన వ్యాసమహర్షికి నారదమహర్షి ఉపదేశవశాన భాగవతరచనా వ్యాసంగం వల్ల శాంతమూ ఆనందమూ లభించాయి. వాసుదేవుని దివ్యగుణగానం వల్లా, ధ్యానంవల్లా కలిగే ఫలితం అది.

శ్రీకృష్ణభగవానుని జాతకపరిశీలనకు ముందుగా ఆయన జననతేది తెలియాలి. ఈ దిశగా పండితులు ఇప్పటికే పరిశీలన పరిశోధన చేసి ఉన్నారు కనుక పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటాం.

కాని చిక్కులున్నాయి.

ఈ దిశగా భాగవతం నుంచి, విష్ణుపురాణం నుంచి, హరివంశం నుంచి మనకు కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి.

భారతయుద్ధం అయిపోయిన తరువాత కొన్నేళ్ళకు కృష్ణనిర్యాణ సమయం దగ్గర పడింది. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు(కొన్ని పురాణాలలో వాయుదేవుడు అని ఉన్నది) కృష్ణభగవానుని ఎదుట సాక్షాత్కరించి ఆయన భూమ్మీద అవతరించి నూరేళ్ళు దాటి (వర్షాణాం అధికం శతం)కొన్నేళ్ళు గడిచాయనీ అవతార పరిసమాప్తి సమయం దగ్గర పడిందనీ అంటాడు.శ్రీకృష్ణనిర్యాణంతో కలియుగం క్రీ పూ 3102 లో మొదలైందని సామాన్యంగా అందరూ ఒప్పుకుంటున్న తేదీ.

ఈ తేదీ నిజం అయితే, శ్రీకృష్ణజననం 3102 +100  = 3202 BC ప్రాంతంలో కొంచం అటూ ఇటూగా జరిగి ఉండాలి.

ఇకపోతే శ్రీకృష్ణజనన సమయానికి ఉన్న గ్రహస్తితిని వ్యాసభగవానుడు పెద్దగా వర్ణించలేదు.  రోహిణీ నక్షత్రం ఆ సమయానికి ఉన్నది అన్నాడు గాని ఇంకేమీ వివరాలు ఇవ్వలేదు. కృష్ణనిర్యాణం  జరిగినరోజే కలియుగం మొదలైంది అని కొందరి భావన. కాని "కొంతకాలం తదుపరి" అని కొన్ని పురాణాలలో ఉన్నమాటను లెక్కలోనికి తీసుకుంటే ఈ లెక్కలన్నీ మారిపోతాయి.

ఈ లెక్కలన్నీ బీ.వీ.రామన్ గారు తన Notable Horoscopes అన్న పుస్తకంలో చర్చించారు. కాని ఆయన వాడిన రామన్ అయనాంశ సరైనది కాదు. కనుక ఆయన వేసిన కృష్ణుని జాతకం తప్పులతడికగా వచ్చింది. అందులో అవతార లక్షణాలు ఏమాత్రం లేకపోగా, ఆయన వివరణ అంతాకూడా ఏదో సరిపెట్టాలని చూసిన అతుకుల బొంతగా కనిపిస్తుంది. ఇదంతా కూడా అయనాంశ లోని తేడాలవల్ల కలిగింది.


భారతయుద్ధకాలాన్నీ, కృష్ణుని జననకాలాన్నీ మహాభారతంలో ఇచ్చిన ఖగోళవివరాలను బట్టి లేక్కించాలని చాలామంది మేధావులూ, శాస్త్రవేత్తలూ ప్రయత్నించారు. అసూయతో నిండి కుళ్ళిపోయిన క్రైస్తవ పరిశోధకులు 1500 BC ప్రాంతంలో భారతయుద్ధం జరిగిందన్నారు.అది వారు తమ అసూయతో నిర్ధారించిన సమయం తప్ప నిజం కాదు.బైబిల్ ప్రకారం సృష్టి జరిగింది BC 4000 ప్రాంతంలోనట.అందుకని ఇతర దేశాల నాగరికతలన్నీ ఆలోపలే సరిపెట్టాలని వారు విశ్వప్రయత్నం చేశారు.

కానీ పురాతనమైన ఈజిప్టూ చైనా ఇండియాల చరిత్ర విషయంలో వారికి విషయం ఏమీ అర్ధం కాలేదు.ఎందుకంటే ఈ దేశాల చరిత్రలు BC 10,000 దాటి ఇంకా వెనక్కు పోతూ కనిపిస్తున్నాయి.

అందుకని వారి ఇష్టం వచ్చిన చరిత్ర వ్రాసి మనమీద రుద్దారు.చైనాలో మన లాగా కాదు.చాలా పాతకాలం నుంచీ చరిత్రను రికార్డ్ చెయ్యడం వారికి అలవాటు గనుక యూరోపియన్ల ఆటలు వారివద్ద సాగలేదు.

మనదేశం ఒక కలగూరగంప గనుకా,మహాభారత యుద్ధం తర్వాత మనం సర్వనాశనం అయిపోయాం గనుకా,మనకొక పద్ధతీ పాడూ ఏమీ లేకుండా పోయింది గనుకా,ప్రపంచం లోని ప్రతిజాతీ మనపైకి దండెత్తి వచ్చింది గనుకా,వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఊరుకోకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు మన చరిత్రకూ సంస్కృతికే ఎసరు పెట్టాలని చూచారు గనుకా,అలాంటి వారిని కూడా మనం ఆప్యాయంగా కౌగిలించుకుని మన అతిప్రేమను ప్రదర్శించాం గనుకా,దానికి ప్రతిగా మనల్ని వారు చావగొట్టి మన చెవులే మూశారు గనుకా,ప్రస్తుతం మన చరిత్ర మనకే తెలియని పరిస్థితీ రాముడూ కృష్ణుడూ నిజంగా ఉన్నారో లేరో తెలియని పరిస్థితీ,మన ఋషులు చారిత్రిక పురుషులా కాదా అని అనుమానించే దుస్థితీ దాపురించింది.

కాకపోతే చరిత్రను రికార్డ్ చెయ్యడంలో మన విధానం వేరు.మనది ఖగోళ విధానం.రాళ్ళమీదా రప్పలమీదా వ్రాస్తే చెరిగిపోతాయని మనకు తెలుసు గనుక నక్షత్రాలలో మన వాళ్ళు చరిత్రను బంధించారు. 

మహాభారతంలో దాదాపు 150 ఖగోళ రిఫరెన్స్ లు ఉన్నాయి. ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఉన్న నక్షత్రగ్రహస్తితులనూ, ఖగోళంలో కనిపించిన విపరీత శకునాలనూ వ్యాసమహర్షి వర్ణించారు. వాటి ఆధారంగా ఆయా సమయాలను లెక్కిద్దామని ప్రయత్నాలు జరిగాయి. 

ఈ మొత్తం ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్ళు ఉన్నాయి.

అవి 

1. కలియుగ ప్రారంభ తేది.
2. మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం.
3. ధర్మరాజు పరిపాలించిన సంవత్సరాలు.
4. కృష్ణ నిర్యాణం జరిగిన సమయం.
5.కృష్ణుడు భూమిమీద జీవించి ఉన్న సంవత్సరాలు.

వీటిలో ఉన్న చిక్కుముళ్ళను విడదీస్తే కృష్ణభగవానుని జననతేదీని కనుక్కోవచ్చు.

ఈ అన్ని పాయింట్లనూ ఎందఱో పరిశోధకులూ పండితులూ శోధించి వారి వారి పరిశోధనల ప్రకారం కొన్ని కొన్ని తేదీలు ఇచ్చారు.వీటిలో ఎవరి లాజిక్కులు వారివి.అందరూ తమతమ తేదీయే కరెక్ట్ అంటున్నారు.

అవేమిటో మనం క్లుప్తంగా చూద్దాం.ఆ గందరగోళపు లెక్కల జోలికి పోకుండా జ్యోతిష్యపరంగా మాత్రమే పరిశీలిద్దాం.


శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడని మన నమ్మకం.

అంతేకాదు ఆయన అంశావతారం కాదనీ భగవంతుని పూర్ణావతారమే ననీ మన శాస్త్రాలు చెబుతున్నాయి.'కృష్ణస్తు భగవాన్ స్వయం' అన్న మాటలోనే అది దర్శనమిస్తుంది.

నలందా తక్షశిలా విక్రమశిలా విశ్వవిద్యాలయాలు ముస్లిం దండయాత్రలలో ధ్వంసం కావడంతో మన విలువైన గ్రంధాలు ఎన్నో తగలబడి పోయాయి. ఎంతో సమాచారం శాశ్వతంగా మననుంచి మాయమై పోయింది.మన చరిత్ర మనకే తెలియకుండా పోయింది.

నలందా విశ్వవిద్యాలయపు గ్రంధాలయం వారంరోజుల పాటు ఆరకుండా తగలబడుతూనే ఉన్నదంటే ఎన్ని లక్షలాది విలువైన గ్రంధాలు అందులో కాలిపోయాయో మనం అర్ధం చేసుకోవచ్చు.ఎంతో విలువైన ప్రాచీన విజ్ఞానం అందులో నాశనం అయిపోయింది.

ముస్లిం దండయాత్రల వల్ల మన దేశానికి పట్టిన అతిభయంకరమైన దురవస్థలలో ఇదొకటి.మన చేతగానితనం వల్ల మనకు తగిలిన అనేక భయంకర శాపాలలో ఇదొకటి.

మనకంటూ మిగిలిన కొన్ని నమ్మకాలనూ బ్రిటీష్ వారు మనపైన రుద్దిన క్రైస్తవమతం తుడిచి పెట్టాలని ప్రయత్నించింది.ఆ క్రమంలో,మన చరిత్రను వారు చెబితే మనం నమ్మవలసిన దుస్థితిలోకి మనల్ని నెట్టివేసింది.

అయితే హిందూధర్మం ఈ నాటిది కాదు.దాని మూలాలు ఇప్పటివి కావు. ఇప్పుడు మనం చూస్తున్న మతాలన్నీ దానిముందు మునిమునిముని మనవలు కూడా కావు.ఇంకా చిన్నవి.

అదృష్టవశాత్తూ వేదాలు మాత్రం మేధస్సులో నిండి ఉన్న విజ్ఞాన భాండాగారాలు గనుకా ఒకరినుంచి ఒకరికి నేర్పబడేవి గనుకా అవి మాత్రం కొద్దో గొప్పో ఈ దాడులనుంచి నిలిచి ఉన్నాయి.


అదలా ఉంచితే,పురాణపురుషుల జాతకాలు వెయ్యాలని చాలామంది ప్రయత్నించారు.వారిలో ఉన్న భక్తే వారిని ఆ పనికి పురికొల్పింది.తమ తమ ఇష్టదైవాలు మానవులుగా సంచరించారు గనుక ఆయా జాతకాలు చూచి ఇంకా వారివారి దివ్య గుణగణాలను నెమరు వేసుకుందామని మాత్రమె వారు ప్రయత్నించారు.


శ్రీకృష్ణుని జాతకాన్ని వెయ్యాలని చాలామంది ప్రయత్నించారు.BV Raman వంటి వారు ప్రయత్నం చేశారు కూడా.అయితే వారు తీసుకున్న 3228 BC అనే తేదీ తప్పు అని ఈమధ్యన Dr PV Vartak గారి పరిశోధనలో తేలింది.వర్తక్ గారి పరిశోధన ప్రకారం శ్రీకృష్ణుని జననతేదీ ఇప్పుడు అందరూ నమ్ముతున్న తేదీకంటే ఇంకా 2400 ఏండ్లు వెనక్కు అంటే 5626 BC లోకి వెళ్ళిపోయింది.

అరేబియన్ సముద్రంలో బయటపడిన ద్వారకా నగర శిధిలాలు దాదాపు 9000(కనీసం) ఏండ్ల నాటివని పరిశోధకులు అంటున్నారు.అలా అయితే 5626+2014=7640 సంవత్సరాల కాలం కృష్ణుడు పుట్టి ఇప్పటికి గడచినట్లు వర్తక్ గారి తేదీతో దాదాపుగా సరిపోతున్నది.

BV Raman గారు ఇంకా ఇతరులు నమ్మిన 3200 BC తేదీ మెరైన్ ఆర్కియాలజీ వారి ఫలితాలతో సరిపోదు.కనుక వారి లెక్క తప్పు అని ఇప్పుడు అంటున్నారు.వర్తక్ గారి తేదీనే వాస్తవానికి దగ్గరగా ఉన్నది అని కొందరు అంటున్నారు.

BV Raman గారు తన Notable Horoscopes లో ఇచ్చిన రాముడు కృష్ణుడు బుద్ధుడు జీసస్ మొదలైనవారి జాతకాలన్నీ తప్పుల తడికలని నేను ఎప్పుడో చెప్పాను.కావాలంటే ఈ టాపిక్ మీద నా పాత పోస్ట్ లు చదవండి.

నేనిలా చెప్పినపుడు 'బ్లాగు కౌరవులు' కొందరు నన్ను తెగ తిట్టిపోశారు. వారు BV Raman గారి వీరాభిమానులట.వర్తక్ గారి పరిశోధన నేను చెప్పిన మాట నిజమని రుజువు చేసింది.సత్యాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలని Dr PV Vartak గారి పరిశోధనా మూలకంగా నేను వారికి మళ్ళీ చెబుతున్నాను.

Dr PV Vartak గారి ప్రకారం శ్రీకృష్ణుని జనన తేదీ 23-5-5626 BC.

ఆరోజుకున్న గ్రహస్థితులను ఆయన లెక్కగట్టి వ్యాసమహర్షి ఇచ్చిన గ్రహస్తితులతో ఇవి ఎలా కరెక్ట్ గా సరిపోతున్నాయో నిరూపించారు. కావలసినవారు ఆయన సైట్ చూడండి.

https://sites.google.com/site/vvmpune/essay-of-dr-p-v-vartak/rama-krishna

అయితే ఆయన తేదీని అందరూ ఒప్పుకోవడం లేదనుకోండి.అది వేరే విషయం.మన పండితులలో ఎవ్వరూ కూడా ఎదుటివారిని అంత త్వరగా ఒప్పుకోరు.పండితాహంకారం అనేది మనిషిని అంత త్వరగా వదలదు.

ఇప్పుడు ఈ పండితులందరూ వారివారి పరిశోధనలో తేల్చిన తేదీలను జ్యోతిష్యపరంగా పరిశీలించి అందులో ఏది కృష్ణుని జీవితానికి దగ్గరగా ఉన్నదో తేల్చే ప్రయత్నం మాత్రమే మనం చేద్దాం.ఖగోళ గందరగోళ లెక్కలలోకి మనం వెళ్ళకుండా జ్యోతిష్య పరంగా మాత్రమే ఈ పనిని చేద్దాం.

(ఇంకా ఉన్నది)