“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2013, శుక్రవారం

సామాన్యుడి త్యాగం

సామాన్యుడికి ఆశ ఎక్కువగా ఉంటుందనీ,సంపన్నుడికి అంతగా ఆశ ఉండదనీ జనం సర్వసాధారణంగా అనుకుంటారు.ఈ మాట మిగిలిన యుగాలలో అయితే నిజమేనేమో గాని,కలియుగంలో మాత్రం ఇది వ్యతిరేకంగా ఉన్నది.ప్రతిదానికీ సామాన్యుడే సర్దుకుని ఆశ చంపుకుంటున్నాడు. సంపన్నుడు మితిమీరిన ఆశతో రగిలిపోతున్నాడు.విలువలను కూడా విస్మరిస్తున్నాడు.

మొన్న అమావాశ్య ప్రభావంతో సరిహద్దులో మన సైనికులను పాకిస్తాన్ దళాలు నిష్కారణంగా చంపి వారి దేశానికి రంజాన్ బహుమతిగా ఇచ్చిన సంగతి అందరి కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నది.దీటుగా స్పందించవలసిన మన ప్రభుత్వాలు ఎందుకో మరి మిన్నకుంటున్నాయి.స్పందిస్తే వారివారి స్వప్రయోజనాలు దెబ్బతింటాయో ఏమో తెలియదు.ఇలాంటి పరిస్తితుల్లో కూడా ఆత్మాభిమానం మరచి శత్రువుల పట్ల స్నేహం అంటూ మాట్లాడితే అది చేతగాని పిరికితనం అనిపించుకుంటుంది గాని పరిణతి అనిపించుకోదు.

నాయకుల అసమర్ధత ఇలా ఉంటే,ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని తిరస్కరించి బీహార్ జవాన్ల కుటుంబం తన ధీరత్వాన్నీ ఆత్మాభిమానాన్నీ నిరూపించుకుంది.చనిపోయిన ఆ జవాన్ ఆత్మ తన మరణానికి కట్టిన వెలను చూచి కుంగిపోయినా,తన కుటుంబసభ్యులు దానిని తిరస్కరించి ప్రభుత్వానికి చెప్పుదెబ్బ కొట్టడం చూచి శాంతించి ఉంటుంది.

ఒక సామాన్య కుటుంబానికి పదీ ఇరవైలక్షలు అంటే కొంచం పెద్ద మొత్తమే. కానీ డబ్బు కంటే ఆత్మాభిమానమే ముఖ్యంగా ఆ కుటుంబం భావించింది. వందల వేల కోట్లు ప్రజాధనాన్ని వెనకేసుకున్నా కూడా ఆశ తీరక దేశాన్ని ఇంకా ఎలా దోచుకోవాలా అని ఆలోచించే నీచ రాజకీయులు బీహార్ వీరజవాన్ కుటుంబం ముందు కుష్టురోగుల్లా నిలబడే పరిస్తితి ఈ చర్యతో కల్పించబడింది. కాని మన నాయకులకు సిగ్గు అనేది అసలు ఉందా అని నాకు ఎప్పటినుంచో పెద్ద అనుమానం.పోనీలే వాళ్ళు ఒద్దంటే ఆ డబ్బులు మనమే తీసుకుందాం. ఒకరోజు పార్టీ చేసుకోడానికి పనికొస్తాయి అని వారు భావించినా భావించ వచ్చు.

శత్రువులు ఒకవైపు సవాల్ విసురుతున్నా ఏమీ చెయ్యలేరు.జవాన్ కుటుంబం తమకిచ్చిన పరిహారాన్ని తిరస్కరించి 'ఛీ' కొట్టినా సిగ్గు రాదు.మన రాజకీయుల ఒంట్లో రక్తం బదులు ఇంకేదైనా ప్రవహిస్తున్నదేమో టెస్ట్ చేసి చూడాలి.తల్లి లాంటి దేశాన్ని నిస్సిగ్గుగా దోచుకుంటే దోచుకున్నారు. ఉండవలసిన కనీస దేశభక్తి కూడా లేకపోతే ఎలా? తమ దేశం అంటే మినిమం గౌరవం కూడా లేని పౌరులున్న దేశం ప్రపంచంలో మనదేనేమో?

తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడమూ,తర్వాత చేతులు దులుపుకుని కూచునే నాయకులు కాదు ప్రస్తుతం మనకు కావలసింది.దెబ్బకు దెబ్బ తీసే సత్తా ఉన్న నాయకులు కావాలి.మనవాళ్ళను ఐదుగురిని పాకిస్తాన్ చంపితే,వారి సైనికులను ఏభై మందిని మట్టు పెట్టి చూపగల ధైర్యం మన సైన్యానికి పుష్కలంగా ఉంది.కాని వారికి అలాంటి ఆర్డర్స్ ఇచ్చే నాయకులేరీ?అలాంటి నాయకులని ఎన్నుకునే ప్రజలేరీ? నిన్న దివంగత సైనికులకు నివాళి అర్పిస్తూ సైన్యాధిపతి బిక్రం సింగ్ పెట్టిన ముఖం చూస్తె అతను ఎంత బాధగా ఉన్నాడో తెలుస్తుంది.కానీ ముందుకు పోనివ్వకుండా వెనకనుంచి నాయకులు లాగుతుంటే అతను ఏమి చెయ్యగలడు? ఆణిముత్యాలవంటి మన సైనికులను పోగొట్టుకోవడం తప్ప.

ఈ పిరికి పందలు ఇచ్చే జవాబు ఏమంటే,గొడవలతో గొడవలు పరిష్కారం కావు.వారు చేసారని మనమూ చేస్తే చివరికి యుద్ధానికి దారి తీస్తుంది.వారి వద్ద కూడా ఇప్పుడు అణ్వాయుధాలున్నాయి.కనుక మనం ఆచితూచి స్పందించాలి అంటారు.ఇలా ఎంతకాలం చేతులు ముడుచుకొని కూచుంటారు? దీనిని చేతగానితనంగా శత్రువు భావించడా?ఆ అలుసుతో మరింత పెట్రేగిపోడా?అప్పుడేం చేస్తారు?ఇలా ఊరుకునీ ఊరుకునీ అప్పుడు కార్గిల్ వరకూ తెచ్చుకున్నారు.ఇంకా బుద్ధి రాలేదా?

ఇదే పని ఎవరైనా చేస్తే చైనా ఊరుకుంటుందా? అమెరికా ఊరుకుంటుందా? మనమెందుకు ఊరుకోవాలి? పాకిస్తాన్లో అడుగుపెట్టి బిన్ లాడెన్ను మట్టుబెట్టి ప్రపంచానికి పీడా ఒదిలించింది అమెరికా.మనం ఎలాగూ అంత చెయ్యలేము. చివరికి మన సైనికులను మన సరిహద్దుల్లో నిష్కారణంగా చంపినా మనం చూస్తూ ఊరుకోవడం మాత్రం క్షమించరాని నేరం.ప్రాణం అంటే,అందులోనూ మనకోసం సరిహద్దుల్లో రాత్రీ పగలూ కాపలా కాసే మన సైనికుడి ప్రాణం అంటే మనకు ఎంత చులకన భావమో దీనిని బట్టి తెలుస్తోంది.

హతవిధీ!!! ఎలాంటి ఆణిముత్యాలకు జన్మనిచ్చిన మన దేశానికి ఎలాంటి దుర్గతి పట్టింది? తనను నిస్సిగ్గుగా దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని కుక్కమూతి పిందెల్లాంటి తన బిడ్డలను చూచి భరతమాత ఎంత క్షోభిస్తున్నదో కదా?మనకోసం సరిహద్దుల్లో జవాన్లు నిష్కారణంగా వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్న స్పృహా, దీనిపైన దీటుగా స్పందించాలన్న చైతన్యమూ కూడా లేని చెత్తజాతిని చూచి ప్రపంచ దేశాలు 'ఛీ' కొడుతున్నా కూడా మనకు సిగ్గు రాదు కదూ.భేష్.చేతగానితనమా వర్ధిల్లు.

మరో వైపు యువరాజుగారు ఇంకో మాటన్నారు.పేదరికం ఒక మానసిక స్తితి అట.చాలా అద్భుతంగా వాక్రుచ్చారు.పుట్టడమే బంగారు ఉయ్యాలలో పుట్టినవాడి మాటలు ఇలాకాక ఇంకెలా ఉంటాయి?కడుపు నిండిన వాడికే ఫిలాసఫీ వస్తుంది.కడుపు కాలేవాడికి రాదు.అందుకే పాత రోజుల్లో కూడా రాజులే వేదాంతం మాట్లాడేవారు ఆచరించేవారు.సామాన్యుడికి జీవన పోరాటమే సరిపోయేది.ఇప్పుడూ పరిస్తితి అంతే.

రొజుకి నూరు డిషెస్ తో భోజనం చేసేవాడు ఒకరోజున పాతిక డిషెస్ చాలులే అని నిర్ణయించుకుని ఈ రోజుకి పాతిక డిషెస్ మాత్రమె వండు అని కుక్ తో చెబితే,ఆ రోజు అతనికి పేదరికంలో గడచినట్లే లెక్క.ఆ పేదరికానికి కారణం మానసికంగా అతను తీసుకున్న నిర్ణయం.కనుక ఈ విధంగా చూస్తె పేదరికం అనేది ఒక మానసిక స్తితి అనే మాట నిజమే.కాని పూట గడవటానికి ఒక ముద్ద అన్నంకోసం ఎదురుచూచే నిజమైన పేదవానికి ఈ సూక్తి వర్తించదు. అతనివరకూ చూస్తె,పేదరికం ఒక మానసిక స్తితి కాదు.అదొక చేదునిజం. కళ్ళెదురుగా కనిపిస్తూ తనను వెక్కిరిస్తున్న ఒక నగ్నసత్యం.

పేదరికం లేదు,లేదు అని ఒక పేదవాడు నూరుసార్లు తనకు తాను నచ్చ చెప్పుకుని తన మానసికస్తితిని మార్చుకున్నంత మాత్రాన అది లేకుండా పోదు.అతని ఆకలి తీరదు.అతని పెళ్ళాం పిల్లల ఆకలీ తీరదు.అతని వరకూ పేదరికం ఒక మెటీరియల్ అండ్ రియల్ ఫాక్ట్.అదొక మానసిక భావన కాదు.

థింక్ బిగ్ అనేది ఒక మేనేజిమెంట్ సూత్రం.కాని అది అన్ని పరిస్తితుల్లోనూ వర్తించదు.మేధస్సుకు విలువనిస్తూ,లా అండ్ ఆర్డర్ నిక్కచ్చిగా అమలు చేస్తూ,దేశభక్తి గల పౌరులు నివసించే దేశాలలో 'థింక్ బిగ్' పనిచేస్తుంది.కాని అవినీతీ,నిరక్షరాస్యతా,పేదరికమూ,దేశభక్తి లేమీ, కులమతాలూ వంటి కుళ్ళుతో నిండిన దొంగలు ప్రజలుగా ఉన్న దేశానికి 'థింక్ బిగ్' సూత్రం వర్తించదు.ఇక్కడ వర్తించే సూత్రం 'గ్రాబ్ మోర్ అండ్ స్టీల్ మోర్' మాత్రమే.

దేశ సమస్యలంటే ఇంత గొప్ప గేనం ఉన్నవారు రేపు ఈ దేశానికి రాజులు కాబోతుండటం మన దేశపు పెజల అదురుట్టం.ఇంత గొప్ప పరిపక్వత కలిగిన దరమ పెబువుల్ని ముందుముందు మనకు పెబువులుగా ఇచ్చినందుకు ఆ పెబువుకు మనమంతా ముందుగా దన్యవాదాలు సెప్పుకోవాల.పదుండ్రి ముందా పని సూద్దాం.
read more " సామాన్యుడి త్యాగం "

శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం

కొన్ని ముఖ్యమైన పనులలో ఉండటం వల్ల పాడ్యమి ముందే వ్రాయవలసిన దేశజాతకం తృతీయనాడు వ్రాస్తున్నాను.

ఈ మాసంలో దేశ పరిస్తితి,రాష్ట్ర పరిస్తితి ఎలా ఉందో జ్యోతిష్య పరంగా గమనిద్దాం.పాడ్యమి నాటి కుండలి ఇక్కడ చూడవచ్చు.

లగ్నం దేశలగ్నమే అయిన వృషభం అయింది.చక్రంలో గ్రహాలు మొత్తం కాలసర్ప యోగపరిధిలో ఉన్నవి.

దాదాపు పదహైదు వందల ఏండ్ల క్రితం వరాహమిహిరాచార్యుడు కాలసర్ప యోగాన్ని గురించి చెబుతూ "కాలసర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం" అన్నాడు. ఈ యోగం పట్టినపుడు రాజూ రాష్ట్రమూ ఈ రెండికీ కీడు మూడుతుంది.అన్నాడు.అది అక్షరాలా జరుగుతూ ఉండటం మన కళ్ళెదురుగా చూస్తున్నాం.

తృతీయంలో అమావాస్య వల్ల కమ్యూనికేషన్ చాలా ఘోరంగా దెబ్బ తింటుంది.ఎవరు ఏమి చెబుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కాదు పట్టదు.ఎవరి స్వార్ధం మేరకు వారు మాట్లాడుతూ ఉంటారు.బయటకు చెప్పేది వేరు.లోపల ఉండే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి.

వీరితో బుధుని కలయికవల్ల ఎవరి వాదనను వారు సమర్ధవంతంగా వినిపిస్తారు.తెలివిగా మాట్లాడతారు.కాని అంతర్లీనంగా రాష్ట్ర ప్రయోజనం కంటే ఎవరికి వారికి వ్యక్తిగత స్వార్ధమే బలమైన అంశంగా పనిచేస్తుంది.

రాహుకేతు ఇరుసు  6-12 భావాలలో పడింది గనుక రాష్ట్రానికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది.కొందరు బహిరంగ శత్రువులు,మరికొందరు రహస్య శత్రువుల మధ్యన రాష్ట్రం విలవిలలాడుతుంది.గొడవలు గందరగోళాలు జరగడం ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం.12 నుంచి 18 వరకూ,మళ్ళీ 24,25 తేదీలలోనూ ఈ గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయి.జనానికి చాలా విసుగూ చికాకూ కలుగుతాయి.

చతుర్దంలో శుక్రస్తితి వల్ల జనజీవనంలో పెద్దగా విధ్వంసం ఏమీ జరుగదు.కానీ ఆందోళనలు జరుగుతాయి.ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి.

రెండింట గురుకుజుల వల్ల నాయకులు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తీవ్రంగా తిట్టుకుంటారు.ఆర్ధికరంగం అతలాకుతలం అవుతుంది.ఇక్కడ నాలుగు ఆరూడాలు కలవడం వల్ల అనవసరమైన వాగ్వాదాలూ పరస్పర దూషణలూ సర్వసాధారణంగా ఉంటాయి.కాని చివరకు వీరి వాగుడుని బట్టి జరిగేది ఏమీ ఉండదు.

  • 7 నుంచి 9 వరకు గొడవలు గోలా ఉంటాయి;దూషణల పర్వం సాగుతుంది.
  • 10 నుంచి 13 లోపల ఒక నష్టం జరుగుతుంది.ప్రజలూ నాయకులూ పిచ్చేక్కినట్లు తిట్టుకుంటారు.
  • 14 నుంచి 19 వరకూ జనాభిప్రాయానికి బలం వస్తుంది.
  • 20 నుంచి 23 వరకూ దూషణల పర్వం మళ్ళీ పుంజుకుంటుంది.
  • 24-25 తేదీలలో ప్రగల్భాలు ఎక్కువౌతాయి.
  • 26 నుంచి 30 వరకూ శత్రుపీడ ఎక్కువౌతుంది.
  • 31 నుంచి 3 వరకూ చర్చలవల్ల కొంత మేలు జరుగుతుంది.
  • 4 నుంచి 6 వరకూ మళ్ళీ శత్రుపీడా,స్తంభనా  ఉంటాయి.
read more " శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం "