“There are many who just talk, but very very few who really realize" - Self Quote

4, జులై 2013, గురువారం

పాములు పట్టే స్వాములవారు

అనగనగా ఒక ఘనత వహించిన స్వామీజీ ఉన్నారు.వారు పాములు పట్టడంలో బహు నిష్ణాతులు.కావాలంటే తన శిష్యులకు ఉచిత 'డెమో' కూడా ఇస్తారు.వారినందరినీ ఒక లాన్ లో కూచోబెట్టి అక్కడ గడ్డిలో ఒక పామును  వదులుతారు.ఆయన దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ చివరికి లాఘవంగా దానిని పట్టి బుట్టలో పెట్టి బంధిస్తారు.శిష్యులూ శిష్యురాళ్ళూ ఆనందం పట్టలేక 'జై గురుదేవ్' అని అరుస్తూ ఒంటిమీద గుడ్డలు చించుకుంటూ గడ్డిలో పడి దోర్లుతారు.

నాకొక మంచి మిత్రుడున్నాడు.ఆయన ఈ గురువుగారి వీరభక్తుడూ, పరమశిష్యుడూనూ.ఆయన గురించి నాకు అప్పుడప్పుడూ చెబుతూ ఉంటాడు.నేను మౌనంగా వింటూ ఉంటాను.మొన్నా మధ్య కలిసినప్పుడు ఒక సంఘటన గురించి చెప్పాడు.

'ఈ మధ్యనే మా గురువుగారు ఒక కొత్త ప్రోగ్రాం సృష్టించారు.' అన్నాడు.

'ఈసారి ఏం మూడిందో పాపం ఈ పిచ్చిభక్తులకు?' అనుకుంటూ, 'ఏమిటా కొత్త ప్రోగ్రాం?' అడిగాను.

'సూర్యక్రియ అంటూ ఒక కొత్త టెక్నిక్ ను స్వామీజీ ఈమధ్యనే జనంలోకి వదిలారు.'అన్నాడు. 

'జనంలోకి వదలడానికి అదేమన్నా ఆయన పట్టుకున్న పామా?' అన్నాను నవ్వుతూ.

'అలాకాదు.సీరియస్ గా వినండి.' చెప్పాడు.

'సీరియస్ గా ఉండటం నాకు రాదు.అలా ఉండేవారంటే నాకు గిట్టదని మీకూ తెలుసుకదా?మనస్ఫూర్తిగా నవ్వలేని వాళ్ళంటే నాకు మహామంట' చెప్పాను.

'సరే వినండి.వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈ క్రియను అభ్యాసం చేసేవారట.ఇప్పుడు మా గురువుగారు ఈ క్రియను మొదటి సారిగా లోకానికి వెల్లడి చేస్తున్నారు.' చెప్పాడు.

'ఈయనకు ఈ క్రియ ఎలా లభ్యమైంది? శ్రీకృష్ణుడు రాత్రికి రాత్రి విమానంలో వచ్చి ఈయనకు ఉపదేశించి వెళ్ళాడా?' అడిగాను.

'ఏమో నాకు తెలియదు.ఇన్నాళ్ళూ ఈ క్రియ మరుగున పడి పోయిందనీ ఇప్పుడు తాను వెలికి తీశాననీ ఆయన చెబుతున్నారు.' అన్నాడు.

'మీరందరూ నిజమని నమ్ముతున్నారు' అన్నాను.

'లేదండీ.అది నిజమే.'

'ఏంటి ఆ టెక్నిక్?' అడిగాను.

'అంతా సూర్య నమస్కారం లాగే ఉంటుంది' అని ఇంకా చెప్పబోతున్నాడు.

నాకు వెంటనే విషయం అంతా ఇంట్యూటివ్ గా అర్ధమైంది.

'ఇక నే చెబుతా వినండి.సూర్య నమస్కారాలకే బ్రీతింగ్ టెక్నిక్ మార్చారు. ఎప్పుడు ఎంతసేపు ఊపిరి పీల్చాలి,ఎంతసేపు బిగబట్టాలి,ఎప్పుడు వదలాలి అనేది మాత్రం కొత్తగా మీ గురువుగారు చేర్చారు.అంతేనా?' అడిగాను.

'అవును.మీకెలా తెలుసు?' ఆయన అనుమానంగా ముఖం పెట్టాడు.

'శ్రీకృష్ణుడు రోజూ మా ఇంటి మీదుగానే వాకింగ్ కు వెళుతూ ఉంటాడు.నిన్న ఇంట్లోకి రమ్మని పిలిచి టీ ఇచ్చాను.టీ తాగుతూ ఈ విషయం చెప్పాడు.' అన్నాను.

'మీకు ప్రతీదీ జోకే.ఈ టెక్నిక్ ను అందరికీ నేర్పరు.వేల మందిలో మన గుంటూరులో ఒక అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేసి ఈ టెక్నిక్ నేర్పారు. ఇతరులకు నేర్పించే అధికారం ఆ అమ్మాయికి ఇచ్చారు.'అన్నాడు.

'ఎంత వసూలు చేశారేమిటి 'అధికారం' ఇవ్వడానికి?' అడిగాను.

'ఆ అమ్మాయి దగ్గర సింపుల్గా రెండు లక్షలు ఫీజు వసూలు చేశారు.తను ఇతరులకు నేర్పాలంటే ఎంత ఫీజో ఆ అమ్మాయే డిసైడ్ చేసుకోవచ్చు.' అన్నాడు.

'ఓహో.హోల్ సేల్ రేటు తను నిర్ణయించి రిటైల్ రేటు డీలరుకు వదిలేశారన్న మాట.మీ గురువుగారు మంచి బిజినెస్ మ్యాన్ లా ఉన్నారే? అడిగాను నవ్వుతూ.

'ఫ్రీగా చెబితే విలువ ఉండదండి.ఎవరూ లెక్క చెయ్యరు.నమ్మరు.' చెప్పాడు.

'గుంటూరు అమ్మాయి ఎంత ఫీజు తీసుకుంటుంది ఈ టెక్నిక్ నేర్పడానికి?' అడిగాను.

'రెండు వేలు తీసుకుంటుంది.' చెప్పాడు.

'ఆమె అప్పాయింట్ మెంట్ దొరుకుతుందా?' అడిగాను.

'ఎందుకు? మీరూ ఆ టెక్నిక్ నేర్చుకుంటారా?' ఉత్సాహంగా అడిగాడు మా ఫ్రెండ్.ఇన్నాళ్ళకు నాకు మంచి బుద్ధి పుట్టిందని ఆయనకు సంతోషం కలిగినట్లుంది.

'లేదు.ఆమెకేమైనా సందేహాలుంటే కరెక్ట్ చేద్దామని' చెప్పాను నవ్వుతూ.

'అలా ఏమీ ఉండదు.ఆమెకు బాగా నేర్పించే జనంలోకి వదిలారు మా గురువుగారు' అన్నాడు.

'ఈ పాములు పట్టె గోలేమిట్రా భగవంతుడా?' అనుకున్నా మనసులో.

'అమ్మాయినికూడా జనంలోకి వదిలాడా?' అడిగాను నవ్వుతూ.

'చెప్పా గదా మీకు ప్రతీదీ జోకేనని' అన్నాడు.

'నాకెక్కువగా వద్దు.ఒక లక్ష ఇస్తే చాలు.ఆమె జన్మలో మరిచిపోలేని టెక్నిక్ నేర్పిస్తాను' చెప్పాను.

మా ఫ్రెండ్ అనుమానంగా చూచాడు.

'నిజమేనా?'

'ఇందులో అబద్ధం ఏముంది?' చెప్పాను.

ఒక్కసారి నా వైపు ఎగాదిగా చూచాడు.నాకు గడ్డాలూ మీసాలూ విచిత్ర వేష ధారణా లేవుకదా అందుకని ఆయన నమ్మినట్లుగా నాకు అనిపించలేదు.ఇక ఆ విషయం అంతటితో వదిలేశాను.

మన యోగశాస్త్రానికి పాపం పేటెంట్ అంటూ లేదు.అందుకని మన స్వామీజీలు అందరూ వారి ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క ముద్రనూ,ఒక్కొక్క క్రియనూ కొట్టేసి వారి సొంత ఆవిష్కరణ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ మంచి మార్కెటింగ్ చేసుకుంటున్నారు.తెలీని శిష్యులు కూడా నమ్ముతూ బుట్టలో పడిపోతున్నారు.మైక్రో మార్కెటింగ్ ఫలితమా అని ఒకరికి పదిమందిని చొప్పున చేర్పిస్తూ గురుఋణం కూడా తీర్చుకుంటున్నారు. బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతూ ఉంది.

ఇంతా చేస్తే ప్రస్తుతం నిజమైన యోగం ఎవడికీ అవసరం లేదు.ప్రస్తుతం జనానికి ముందుగా కావలసింది ఆరోగ్యం.అడ్డమైన జంక్ ఫుడ్ తిని,రాత్రుళ్ళు మేలుకుని,విపరీతమైన స్ట్రెస్ కి లోనవుతూ ఉన్న ప్రస్తుతతరానికి ముఖ్యంగా కావలసింది మంచి ఆరోగ్యం.అంతేగాని యోగం కాదు.నాకు యోగాభ్యాసం చేసేవారు కొన్ని వందలమంది తెలుసు.వాళ్ళలో అందరూ ఒళ్ళు పాడు చేసుకుని ఆరోగ్యం కోసం యోగా చేసేవారే గాని ఎవరికీ దాని అత్యున్నత సోపానాలు అందుకోవాలన్న ఇంటరెస్ట్ లేదు.వాటి గురించి అవగాహన కూడా వారికి ఉండదు.వాటిని ఈ జన్మకి అందుకోను కూడా అందుకోలేరు.కారణం ఏమిటీ అంటే వారికి అవి అవసరం లేదు. ఆరోగ్యం బాగుపడితే వారికి అంతే చాలు.మళ్ళీ ఒళ్ళు పాడయ్యేవరకూ చక్కగా ఇంద్రియభోగాలు అనుభవించ వచ్చు.

కనుక యోగం అనేది మిగిలిన అనేక వ్యాయామాల లాగే ఒక వ్యాయామం అయి కూచుంది.యోగాన్ని కూడా భోగానికి సోపానంగా వాడుకుంటున్నారు నేటి మనుషులు.డబ్బుకోసం ఆశపడి దానికి చేయూతనిస్తున్నారు నేటి కుహనా గురువులు.కలియుగపు మనుష్యుల కక్కుర్తి మనస్తత్వం ఏ స్థాయికి దిగజారుతుందో ఊహించడం కష్టమే.

ప్రకృతిలోని పవిత్రమైన వాటిని మనుష్యులు వారి ఇష్టానుసారం పాడు చెయ్యకూడదు.మనకు అర్హత లేనప్పుడు ప్రతిదాని జోలికీ అనవసరంగా పోకూడదు.కేదార్నాద్ లో జరిగిన విలయమే దీనికి నిదర్శనం.

సరియైన భావాలూ మన ఆలోచనాధోరణిలో స్పష్టతా లేకుండా యోగం జోలికి పోవడం మంచిది కాదు.అలా పోతే దానివల్ల మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుంది.లేదా,మేము కూడా ఫలానా కోర్స్ చేశాము అని చెప్పు కోడానికి పనికొస్తుంది.అంతేగాని దాని  యొక్క అత్యున్నత ప్రయోజనం ఇలాంటి వెర్రివేషాలవల్ల నెరవేరదు.

యోగసాధనా రహస్యాలు ఎవరికిబడితే వారికి ఎన్నటికీ అందవు.అసలు చాలామంది నేటి గురువులకే అవి తెలియవు.తెలిసినట్లు ఫోజు కొడుతూ శిష్యులను మాయ చేస్తుంటారు.ఈ శిష్యులు కూడా గురువుగారి హీరో వర్షిప్ మాయలో పడి,మా గురువుగారు అంత ఇంత అని డప్పు కొడుతూ ఇంకా కొత్త బకరాలను పోగు చేస్తుంటారు.తీరా చూస్తే ఈ గురువులకూ శిష్య భక్తులకూ ఎవ్వరికీ యోగం యొక్క అత్యున్నత స్తరాలు అందవు. అనుభవంలోకి రావు.

కపటంతో నిండిన మనుషులకు మోసగాళ్ళే గురువులుగా దొరుకుతారు. స్వచ్చమైన హృదయం ఉన్నవారికి మాత్రమే ఆధ్యాత్మిక లోకపు ద్వారాలు తెరుచుకుంటాయి.కట్టవలసిన ఫీజులో ఒక్క పైసా తగ్గినా అక్కడ ద్వారాలు తెరుచుకోవు.అందరూ అనుకునేటట్లు ఆధ్యాత్మిక లోకంలో సోషలిజమూ సమానత్వమూ ఉండవు.అక్కడ దారుణమైన సెలెక్టివిజం ఉంటుంది.తమను తాము ఎక్కువగా ఊహించుకునే వారికి అక్కడ తీవ్ర ఆశాభంగం తప్పదు.

ఈలోపల ఈ మాయలోకంలో మాయగురువుల దందా నడుస్తూనే ఉంటుంది.అది వాళ్ళ తప్పుకూడా కాదు.కలిప్రభావానికి లోనై కపట స్వభావంతో స్వార్ధపరతతో అహంకారంతో నిండిఉన్న నేటి కాలపు మనుషులు ఇలాంటి దొంగగురువుల వలలోనే చిక్కుకుంటారు. మాయగాళ్ళకి మాయగాళ్ళే లభిస్తారు.ఈ కర్మసూత్రాన్ని ఎవ్వరూ ఉల్లంఘించలేరు అన్నది సత్యం.