“No one wants advice, only corroboration." - John Steinbeck

28, మే 2013, మంగళవారం

గుడ్డి గురువులు-పిచ్చి శిష్యులు


లోకంలో అజ్ఞానం ఎంత దట్టంగా అలముకుని ఉందో అనడానికి మొన్న జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ.

'సాయిబాబా ప్రసాదం తీసుకోండి' అని ప్రసాదం ఇచ్చాడు ఒక మిత్రుడు.

ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నా.

'సాయి మాస్టర్ గారని ఒకాయన వచ్చారు మీకు వీలైతే దర్శనం చేసుకోండి?' అన్నాడు.

'పొద్దున్నే బుక్కై పోయాన్రా బాబూ' అని పరమ చిరాకేసింది.ఆ ఒక్కమాటలోనే విషయం మొత్తం అర్ధమైంది.ఇతనికి కాస్త జ్ఞానోపదేశం చేద్దాం అనుకున్నా.

'అంటే ఈయన సాయిబాబాకి మాస్టారా?ఏ సాయిబాబాకి? శిరిడీనా? పుట్టపర్తా? ఏ మాష్టారు? లెక్కలా? ఇంగ్లీషా?' అడిగాను.

'ఛీ పుట్టపర్తి కాదు.శిరిడీనే.కాని ఈయన బాబాకి మాస్టర్ కాదు.భక్తుడు.' చెప్పాడు మిత్రుడు.

'మరి అదేం పేరు అలా పెట్టుకున్నాడు.'సాయిభక్త' అని పెట్టుకోవాలిగాని 'సాయి మాస్టర్' ఏమిటి? సరే, ఈయన ఏం చేస్తుంటాడు?' అడిగాను.

'సాయిబాబాకి గుళ్ళు కట్టిస్తూ ఊళ్లు తిరుగుతూ ఉంటాడు' 

'చాలా మంచిపని.పెట్టుబడి అవసరం లేదు.ఇదిగాక ఇతర పనీపాటా ఇంకేమీ లేదా ఈయనకి? లేకపోతే ఇదే మంచి లాభసాటి వ్యాపారంగా అనిపించిందా?' అడిగాను.

మిత్రుడు బిత్తరపోయాడు. 

ప్రసాదం తీసుకునేసరికి మెల్లిగా మార్కెటింగ్ చేద్దాం అనుకున్నాడల్లె ఉంది. ఊహించని నా స్పందనకి అతనికి మాటరాలేదు.

'అదేంటి సార్ అలా అంటారు?' అడిగాడు నోరు పెగుల్చుకుని.

'చెప్తాగాని. మీరు ఆయన భక్తబృందం లోని వారా? అడిగాను.

'అవును' చెప్పాడు.

'మీరు కట్టించిన సాయిబాబా గుడిలో పూజలు ఏమేం చేస్తారు?' అడిగాను.

'అన్నీ ఉంటాయి.అష్టోత్తరాలూ సహస్రనామాలూ అభిషేకాలూ ఆకుపూజలూ వగైరా అన్నీ చేస్తాము.' అన్నాడు.

'నువ్వు హిందువునని చెప్పుకోడానికి నీకు సిగ్గుగా లేదూ?' సూటిగా అడిగేశాను.

అతని ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు.

'చూడు బాబు.నీకు తెలీకపోతే తెలీనట్లు ఉండు.అంతేగాని తెలిసీ తెలియని తిక్కపనులు చేసి హిందూమతాన్ని ఇంకా భ్రష్టు పట్టించకండి. సాయిబాబా ఒక సూఫీసాధువు.ఆయన్ని అలాగే ఉండనివ్వండి.సూఫీమార్గం ఇస్లాంలో ఒక తెగ.అంటే ఆయన పక్కా ముస్లిమే.ఆయనకు హిందూ సాంప్రదాయంలో పూజలు చెయ్యకూడదు.అది ధర్మవిరుద్ధం.ముస్లిం సూఫీ సాధువులకు గుళ్ళు కట్టించి వైదిక సాంప్రదాయంలో ఇలాంటి పూజలు చెయ్యవచ్చని ఏ ఆగమశాస్త్రంలో ఉందొ కొంచం ప్రమాణం చూపిస్తావా?' అడిగాను.

'నాకు తెలీదు' నిజాయితీగా ఒప్పుకున్నాడు.

'నే చెప్తా విను.మీలో ఎవరి దగ్గరో బ్లాక్ మనీ మూలుగుతూ ఉంటుంది.లేకుంటే అందరి దగ్గరా చందాలు పోగేసి ఒక గుడి కట్టిస్తారు.పూట గడవకో,డబ్బుకు కక్కుర్తిపడో ఎవరో ఒక పురోహితుడు పూజారిగా కుదురుతాడు.వేదోక్తంగా ఏ శివలింగానికో చెయ్యవలసిన అభిషేకాలూ నమకచమకాలూ పురుషసూక్త విధానంలో పూజలూ బాబా విగ్రహానికి చేస్తుంటారు.అసలు ఇలా చెయ్యవచ్చా లేదా అనే విషయం ఎవరైనా వేదపండితులను అడిగి చేస్తున్నారా? లేక మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు చేస్తున్నారా?' అడిగాను.

'మా దగ్గిర మంచి వేద పండితులున్నారు' అన్నాడు.

'ఉంటారు.డబ్బుకు కక్కుర్తి పడే ప్రతివాడూ వేదపండితుడే.వీళ్ళ సంగతులు నాకు బాగా తెలుసు.దయచేసి ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పకండి'అన్నాను.

'పోనీ మీ ఉద్దేశ్యం చెప్పండి.' అడిగాడు.

'చెప్తే మీరు విని తట్టుకోలేరు.సత్యాన్ని విని నిలబడాలంటే గుండెధైర్యం కావాలి. సాయిబాబా ఒక సూఫీసాధువు అని ముందేచెప్పాను కదా.అంతే.ఆయన్ను దేవునితో సమానం చేసి గుళ్ళు కట్టించడం తప్పు.ఆయన నమ్మి అనుసరించిన ఇస్లాం మతమే దీనిని ఒప్పుకోదు.సరే కట్టించారు అనుకుందాం, అక్కడ ఇస్లాం చెప్పిన రీతిలో ప్రార్ధనలు చేసుకోవాలి. అంతేగాని వాటిలో వేదోక్తపూజలు చెయ్యడం మరో పెద్దతప్పు.అష్టోత్తరాలూ సహస్రనామాలూ ఎవడికి తోచినవి వాడు రాసేసి వాటితో పూజలు చెయ్యడం మూడోతప్పు. సాయిబాబాకు ద్వారపాలకులుగా జయవిజయులనూ, విఘ్నేశ్వరున్నీ కుమారస్వామినీ ఆంజనేయస్వామినీ గరుత్మంతుడినీ ప్రతిష్టించడం మహా ఘోరమైన తప్పు.ఇదంతా వేదవిరుద్ధం.ఆగమశాస్త్ర విరుద్దం.దిగజారుతున్న హైందవ సాంప్రదాయానికి ఇదంతా తార్కాణం.' అన్నాను.

'సాయిబాబా సర్వమతాలనూ సమానంగా చూడమని చెప్పారు' అన్నాడు.

'అంతకంటే ముందు కొన్ని వేల ఏళ్ళనాడే మన వేదఋషులు ఇదే మాట ఎన్నో మంత్రశ్లోకాలలో చెప్పారు.'ఆనో భద్రా క్రతవో యంతు విశ్వత:', ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహురధో దివ్యస్ససుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం యమం మాతరిశ్వాన మాహు:' అనే వేదమంత్రాలూ ఇంకా ఎన్నో మంత్రాలూ ఇదే భావాన్ని చెప్పాయి.మన జీవనవిధానం కూడా అదే.లేకుంటే మనదేశంలో ఇన్నిమతాలకు ఎందుకు స్థానం కల్పిస్తాం? ప్రాచీన యూదులు, జోరోష్ట్రియన్ల దగ్గరనుంచీ నేటి దలైలామా వరకూ అందరూ వచ్చి మన దేశంలో తలదాచుకున్నారు.సర్వ మతాలను ఆదరించమనేది సాయిబాబా బోధన కాదు.అంతకుముందే ఎన్నో వేలఏళ్ళుగా మన దేశపు మట్టిలో ఆ భావన ఉన్నది. కనుకనే సాయిబాబా వంటి ముస్లిం సాధువును మనం ఆదరిస్తున్నాం.అదే నీవు పోయి ఏ పాకిస్తాన్ లోనో హిందూవేషంలో ఉంటూ ఒక గుడి కట్టించి అందులో ఉంటూ అన్ని మతాలూ ఒకటే అని వారికి  బోధించు.ఏమవుతుందో చూడు..తెల్లవారేసరికి నీశవం కూడా అడ్రస్ లేకుండా మాయం అవుతుంది.నీగోరీ మీద ఇంకో మసీదు లేస్తుంది.అదీ మనకూ వారికీ తేడా' చెప్పాను.

ఇంకా ఇలా చెప్పాను.

'ఆ సాయిమాస్టర్ ఎవరో నాకు తెలీదు ఆయన పేరు కూడా నేను వినలేదుగాని. నీకు వీలైతే ఆయన్ను నా దగ్గరికి తీసుకురా.అతని అజ్ఞానాన్ని పోగొట్టి అసలైన హిందూమతం అంటే ఏమిటో వివరించి అతని కళ్ళు తెరిపిస్తాను. అతను సాయి భక్తుడైతే కావచ్చు.కాని అతను చేస్తున్న పని శుద్ధతప్పు.ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒక సాధువుకు భక్తుడు కావడం కూడా తప్పే. అసలు సాయిబాబా బతికుంటే ఆయనే ఈ భావనను ఒప్పుకోడు.ఎందుకంటే ఆయన అనుసరించిన ఇస్లాం ఈ భావనను పూర్తిగా నిషేధించింది. 'సర్వోత్తముడైన అల్లాహ్ తప్ప వేరే ఎవరూ ఆరాధనకు తగరు' అంటుంది పవిత్రఖురాన్. కనుక ఆరకంగా చూచినా మీ మాస్టర్ కు విషయం ఏమీ అర్ధం కాలేదు అన్న సంగతి తేటతెల్లం అవుతున్నది.సాయిబాబా వద్దని చెప్పిన పనిని మీ మాస్టర్ చేస్తున్నాడు.మళ్ళీ తాను సాయిభక్తుణ్ణి అని చెప్పుకుంటున్నాడు.ఆయనే కాదు. మీరందరూ కూడా అదేతప్పు చేస్తున్నారు.అర్ధం అవుతున్నదా?' అడిగాను.

'సాయిబాబా హిందువే అని మా మాస్టర్ అంటారు' అన్నాడతను.

'మళ్ళీ ఇదొక అబద్దపు ప్రచారం.ఒకటి అడుగుతాను చెప్పు. సాయిబాబా ఎప్పుడైనా సంధ్యావందనం చేసినట్లు నీవు ఎక్కడైనా చదివావా? పోనీ హిందూ సాంప్రదాయ విధానంలో ఒక్కరోజైనా ఆయన దినచర్య ఉన్నట్లు ఎక్కడైనా రుజువులు ఆయన చరిత్ర నుంచి ఉన్నాయా?' అడిగాను.

'నాకు తెలీదు.మా మాస్టర్ చెప్పింది మేము నమ్ముతున్నాం' అన్నాడు.

'మీలాంటి వారివల్లే హిందూమతం నానాటికి దిగజారి భ్రష్టుపడుతున్నది. కనీసం సాయిబాబా చరిత్ర చదవండి. మీ మాష్టర్ లాంటి భక్తులు వ్రాసిన కాకమ్మకబుర్ల చరిత్రలు కాదు.మరాటీలో ఉన్న పాతకాలపు పుస్తకాలు చదవండి.అప్పుడు సాయిబాబా ఒక ముస్లిం అన్నది అర్ధం అవుతుంది. ముస్లిం ఆచారవిధానాన్ని ఆయన ఖచ్చితంగా పాటించేవాడు.కాకపోతే ఆయన ఉదారభావాలున్న ఒక సూఫీ. సూఫీలలో ఉదారభావాలు సహజమే కాని వారుకూడా ఇస్లాంను అనుసరించే ముస్లిములే.కనుక సాయిబాబాను దేవుణ్ణి చేసి ఆయనకు గుళ్ళు కట్టించడం హిందూధర్మవ్యతిరేకం.అంతేగాక సాంప్రదాయ విరుద్ధం కూడా.ఇలా చెయ్యవచ్చు అని ఏ ఆగమశాస్త్రంలోనూ ప్రమాణం లేదు.మీరు చేస్తున్నది శుద్ధతప్పు.' తేల్చి చెప్పాను.

'కాని మీరు సాయిబాబాను అలా విమర్శించడం బాలేదు సార్.' అన్నాడు.

'నేను సాయిబాబాను విమర్శించడం లేదు.మిమ్మల్నీ.మీ కక్కుర్తిబుద్ధుల్నీ మీ అజ్ఞానాన్నీ,మీ సో కాల్డ్ గురువుల మోసాన్నీ విమర్శిస్తున్నాను.  మొదట్లో నేనడిగినప్పుడు పుట్టపర్తి బాబాను 'ఛీ' అన్నారు కదా మీరు. అది కరెక్టేనా మరి? అలా అనమని మీ సాయిబాబా ఎక్కడా బోధించలేదే?' ప్రశ్నించాను.

'గుడులు అందరూ కట్టిస్తున్నారుగా. ఏ గురువులూ ఇది తప్పని చెప్పడం లేదే?' అడిగాడు.

'చెప్పేవారు ఉన్నారు.కాని మీరు వినరు.వింటే మీ వ్యాపారాలు సాగవుగా. దేవుళ్ళను కూడా మనం కులాని కొకళ్ళ చొప్పున పంచేసుకున్నాం కదా. చెప్పవలసిన గురువులు కూడా వాళ్ళవాళ్ళ రాజ్యాలు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు.మీకు చెప్పేవారేరి? చెప్పినా వినేవారేరి?ఎవరైనా సరే డబ్బుకు ఆశపడని నిఖార్సైన వేదపండితులను అడిగి చూడు.నేను చెప్పినదే చెబుతారు' అన్నాను.

జవాబు లేదు.

'చూడు నాయనా.నాకు మీ సాయిబాబా అంటే ద్వేషం ఏమీ లేదు.ఒక సూఫీ సెయింట్ గా ఆయన్ను నేను గౌరవిస్తాను.కాని ఆయన్ను దేవుణ్ణి చెయ్యకండి.మీరలా చెయ్యడం ఆయనకూ ఇష్టంలేదన్న సత్యాన్ని గ్రహించండి. ఆయన నమ్మిన ఇస్లాంమతంలో ఈ భావన మహా ఘోరాపరాధం అన్నసంగతి తెలుసుకోండి.పోనీ ఒకపని చెయ్యండి. మీకంత ఉదారహృదయం ఉంటె ఏసుక్రీస్తుకు కూడా గుడికట్టించి వేదోక్తంగా నమక చమకాలతో ఆయనకు కూడా రుద్రాభిషేకం చెయ్యండి.బాగుంటుంది.' చెప్పాను.

అతనికి చాలా కోపం వచ్చేసింది. అసహసనంగా కదులుతున్నాడు.

'నేనెప్పుడూ ఒకమాట చెబుతూ ఉంటాను.మన ఇంటి అడ్రస్ మనం మర్చిపోతే ప్రతి ఇల్లూ మన ఇల్లులాగే కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో చూచినా వారివారి అడ్రస్లు వారికి బాగానే గుర్తుంటాయి.తన ఇంటి అడ్రస్ మర్చిపోయి ప్రతి ఇంట్లోనూ జోరబడేది ఒక్క హిందువే.అంత అవసరం లేదు.మన మతాన్ని మనం సరిగా అర్ధం చేసుకుంటే ఇలాంటి తిక్కవేషాలు అవసరం ఉండదు.మనకు చాలామంది దేవతలున్నారు.కొత్తకొత్త హైబ్రిడ్ దేవతలను మీరు ఇప్పుడు సృష్టించనక్కరలేదు. అని మీ గురువుగారికి నామాటగా చెప్పు.ఆయనకు ఏమైనా సందేహాలుంటే వచ్చి నన్ను ముఖాముఖీ కలవమను.సందేహనివృత్తి చేస్తాను.'-అనిచెప్పి అతన్ని పంపించేశాను.