Human ignorance is incurable

28, డిసెంబర్ 2012, శుక్రవారం

భక్తీ - సివిక్ సెన్సూ

ఆంధ్రాలో దీక్షల సీజన్ వచ్చింది గనుక యధావిధిగా సీజనల్ దొంగదీక్షలు మొదలయ్యాయి. ఎక్కడ చూచినా మైకులు హోరెత్తుతూ ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఎవరైనా కొంచం మైకు సౌండ్ తగ్గించమని అడిగితే - 'ఏం? చర్చిలలో మసీదులలో మైకులు పెడుతుంటే అడిగే ధైర్యం మీకుందా?హిందువులై ఉండి,హిందూ మైకులనే ప్రశ్నిస్తారా?' అని ఎదురు ప్రశ్నలు వస్తాయి.'మైకులందు హిందూ మైకులు వేరయా' అనుకోవాలేమో. ఒక్కొక్కసారి అక్కడ చూస్తె ఒక్క మనిషీ కనిపించడు.ఉత్త మైకు మాత్రం పాడుతూ ఉంటుంది.మరి మోక్షం బహుశా మైకుకే వస్తుందేమో అని నా ఊహ.

ఒక సీజనల్ గుడి పక్కనే ఉన్న ఇంటిలో ఒక ముసలామె ఉండేది.ఆమెకు 90 ఏళ్ళు పైనే ఉండేవి.ఆమె గుండె జబ్బుతో బాధపడుతూ ఉండేది.అయ్యప్ప సీజన్లో కాస్త మైకు హోరు తగ్గించమని ఆ వృద్ధురాలి కుమారుడు ఆలయ కమిటీని అడిగినందుకు అతని మీదకు భక్తరౌడీలను కమిటీవారు పంపించి బెదిరించారు. పైగా'ముసిల్ది పోతే పోతుంది.భజన వింటూ పోతే సరాసరి దేవుడి దగ్గరికే పోతుందిలే' అని ఎకసక్కెంగా జవాబిచ్చారు.చివరికి ఆమె ఒకరోజున హార్ట్ ఎటాక్ తోనే పోయింది.బహుశా భజనల విపరీతధ్వనితో రాత్రి పదకొండుకి కూడా మోగుతున్న మైకు దెబ్బకే ఆమె చనిపోయి ఉండవచ్చు. ఇది హత్యే అని నేనంటాను.

ఆ మధ్య ఒక పరీక్ష నిర్వహించడానికి ఒక కాలేజీకి వెళ్లాను. పరీక్ష సమయం ఉదయం 11 నుంచి 12.30 వరకూ. అనుకున్నట్లు గానే పరీక్ష మొదలై అంతా సజావుగా సాగుతోంది. సమయం మధ్యాన్నం 12 అయింది.నేను ప్రిన్సిపాల్ గదిలో కూచుని ఉన్నాను.ఇంతలో గుండెలు అదిరేటట్లు మైకులో 'నమాజ్' మొదలైంది.కాలేజిలోనే మైకు పెట్టినంత ధ్వని వస్తున్నది.ప్రిన్సిపాల్ వైపు ప్రశ్నార్ధకంగా చూచాను.'ఏం చేస్తాం?కాలేజీ గోడకు ఆనుకొని మసీదు ఉన్నది.రోజుకు అయిదుసార్లు ఈ ధ్వని కాలుష్యం తప్పదు.చెప్పిచెప్పి విసిగిపోయాం.వారు వినరు. విద్యార్ధులకు ఈ భాద తప్పదు.'అన్నాడు.

మరి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు ఏకాగ్రత భంగమై సరైన మార్కులు రాక రావలసిన ఉద్యోగం చేజారిపోతే వారి గతేంటి?వారిలో ఎవరి కుటుంబ పరిస్తితులు ఎలా ఉన్నాయో?నిజంగా ఉద్యోగం అవసరం అయిన మనిషికి ఈ ధ్వనికాలుష్యం వల్ల ఉద్యోగం రాకపోతే అతని పరిస్తితి ఏమిటి?'అన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఆ మైకు పెట్టినవారికి ఇదంతా అనవసరం.వారి భక్తి ప్రదర్శనే వారికి ముఖ్యం. అసలు భక్తికి ప్రదర్శన ఎందుకో నాకు చస్తే అర్ధం కాదు.ఈ కాలేజీలో చదివే విద్యార్ధులకు ఏం వచ్చినా రాకపోయినా నమాజ్ మాత్రం వినీ వినీ కంఠతా వచ్చేస్తుంది. ఇది విద్యా హక్కుల హననం అని కూడా నేనంటాను.

చాలా ఊళ్ళల్లో కొన్ని పేటల్లో అయితే తెల్లవారి 4 తర్వాత ఎవరూ నిద్రపోలేరు.చచ్చినట్లు మెలకువ వచ్చేస్తుంది.కారణం? అక్కడ ఉన్న మసీదూ,చర్చీ,గుడీ మూడు మైకులూ మేలుకుంటాయి గాబట్టి.అన్ని రకాల భక్తి అరుపులూ అంత బాగా వినిపిస్తుంటే ఇక నిద్రపోయేవాడు ఎలా నిద్రపోగలడు? షిఫ్ట్ డ్యూటీలు చేసి వచ్చిన ఉద్యోగులూ,పరీక్షలకు రాత్రంతా చదివి అప్పుడే పడుకున్న విద్యార్ధులూ-వీళ్ళ గతేమిటో ఆ దేవుడికే తెలియాలి. 

ఇకపోతే,పైన ఉదాహరించిన అయ్యప్ప గుడి దగ్గర కొందరు రౌడీగ్యాంగు చేరి ట్యూషన్ల నుంచి వచ్చే పోయే అమ్మాయిలను ఏడిపించడం నిత్యకృత్యం.ఆ గ్యాంగులో ఆ గుడి పూజారులు కూడా ఉండటం ఇంకో వింత. ఇది భక్తి పూరిత ఈవ్ టీజింగ్ అని కూడా నేనంటాను.రైళ్ళలో టికెట్ లేకుండా ప్రయాణించే రంగుబట్టల దీక్షాధారులను పట్టుకున్నప్పుడు,డబ్బుల్లేవని వాళ్ళు బుకాయించడమూ,తర్వాత వారిని సోదా చేయిస్తే వారివద్ద వేలకు వెలు డబ్బు ఉండటమూ నేను చూచాను.ఏడాది పొడుగునా ఏ నీతీ పాటించని వారే ఆ నలభై రోజులూ నీతిమంతులుగా నటిస్తారనీ, ఎప్పుడెప్పుడు ఈ దీక్ష అయిపోతుందా అని బిగబట్టుకుని ఉంటారనీ అందరికీ తెలిసిన వాస్తవం.ఏడాది పొడుగునా చేసిన పాపాల గిల్టీ ఫీలింగ్ వెంటాడి వేధిస్తుంటే పాపాలు ఇలా అన్నా ప్రక్షాళన అవుతాయేమో అనే మూఢ నమ్మకంతో ఈ దీక్షలు తీసుకుంటారన్నది కూడా వాస్తవమే.

అదే గుడి దగ్గర మొన్న పడిపూజ జరిగింది.ఆ రోడ్డంతా బ్లాక్ చేసి పందిళ్ళు వేశారు.అది తెలీక ఆ వీధిలోకి తిరగబోయిన కార్లూ రెండు చక్రాల వాహనాలూ ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి ఎటేటో తిరిగి పోవలసి వచ్చింది.దానికి ఆ గుడి వారికి చీమ కుట్టినట్లు కూడా లేదు.ఇలా రెండు రోజులపాటు ట్రాఫిక్ అంతా బ్లాక్ అయింది.ఇదీ పౌరహక్కుల హననమే.    

ఇకపోతే, పడిపూజంటూ రాత్రి 9 కి మొదలు పెట్టి తెల్లవార్లూ అయ్యప్ప భజనతో పెద్ద ఆర్కేష్ట్రాని తెల్లవారేవరకూ గార్ధభస్వరాలతో సినిమారాగాలతో పిచ్చిపాటలు పాడి ఆ పేటంతా ఎవరికీ నిద్రలేకుండా చేశారు.ఇదొక పబ్లిక్ న్యూసెన్స్. దాని తర్వాత అక్కడ కట్టిన అరటి చెట్లూ,స్టేజి అలంకరణ కోసం వాడిన అరటి దూటలూ రోడ్డంతా రెండు రోజులు ఆక్రమించి వచ్చే పోయే వాహనాలకు ఆటంకం కలిగించడం,అవి కుళ్లిపోయి పక్కన ఉన్న ఇళ్ళకు దుర్వాసన వ్యాపించడం,ఆ రాత్రంతా అయ్యప్ప భక్తులు చేసిన మూత్ర విసర్జనతో ఆ వీధి వీధంతా పబ్లిక్ టాయిలెట్ అయిపోవడం -- దీనిని ఏమని పిలవాలో నాకు పదాలు రావడం లేదు.'ఇట్ హాప్పెన్స్ ఓన్లీ ఇన్ ఇండ్యా' అని ఊరుకోవాలేమో.

కొన్ని ఊళ్లలో కొన్ని ఏరియాలలో ఆదివారం వచ్చిందంటే చర్చి మైకుకు జీవం వచ్చేస్తుంది.వారమంతా పనిచేసి అలసిపోయాం. కనీసం ఈ ఒక్కరోజన్నా హాయిగా ఇంటిపట్టున ఉండి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆ అవకాశమూ చర్చి మైకుదెబ్బకి గాలిలో కలిసిపోయే ఏరియాలు ఎన్నో ఎన్నెన్నో.ఇదీ ఆలోచనా రహిత ధ్వని కాలుష్యమే.

'మన భక్తి పక్క వ్యక్తికి అసౌకర్యం కలిగించకూడదు' అని నేను గట్టిగా నమ్ముతాను.అది ఏ మతం వారైనా సరే కావచ్చు. వారి భక్తితో పక్క మనిషికి ఇబ్బంది కలుగకూడదు.అలాకాక,ఒకరిని చూచి ఒకరు ఇలా పబ్లిక్ న్యూసెన్స్ పెంచుకుంటూ పోతే చివరికి సివిల్ వార్ తప్ప మన సమాజానికి ఇక దారీ తెన్నూ ఉండదు.

పక్కవ్యక్తిని బాధ పెట్టకూడదు అన్న ఇంగితం లేనివ్యక్తి,భక్తుడు ఎలా అవుతాడో,అలాంటి వ్యక్తి చేసే ప్రార్ధనను దేవుడు ఎలా మెచ్చుతాడో  నాకెప్పటికీ అర్ధం కాదు.అయినా నా పిచ్చిగానీ ఈ ప్రహసనం అంతా భక్తెలా అవుతుంది? వారి కోరికలు తీర్చుకోవడానికి దేవుడికి లంచం ఇస్తూ, ఆ క్రమంలో తమని తాము హింసించుకుంటూ,పక్క వ్యక్తిని హింసించే ఈ కార్యక్రమానికి ఏదైనా కొత్త పేరు ఒకటి కనుక్కోవాలి. బహుశా 'డివైన్ శాడిక్ మెసోచిజం' అనే పదం బాగుంటుందని అనుకుంటాను.ఏది ఏమైనా దీనిని 'భక్తి' అంటేమాత్రం నేను ఒప్పుకోలేను.ఇదొక ఆత్మవంచనా,స్వార్దానికీ, అహంకారానికి పరాకాష్టా మాత్రమె అని నేనంటాను.ఇకపోతే,ఇదొక పెద్ద సీజనల్ వ్యాపారం అనే విషయం అందరికీ తెలిసినదే.

మన దేశంలో ఎవరికీ ఏ హక్కులూ ఉండవు.ఇక్కడ బలం ఉన్నవాడిదే రాజ్యం.దౌర్జన్యం చెయ్యగలిగిన వాడిదే ఇష్టారాజ్యం. ఆ దౌర్జన్యం ఏరకంగా నైన ఉండవచ్చు,ఎన్నో రకాలుగా కూడా ఉండవచ్చు.ఈ మధ్య ఎవరో రాజకీయ నాయకుడు 'మన రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి' అన్నాడు. అసలు మన దేశాన్నే దేవుడు అర్జంటుగా రక్షించాలని నేనంటాను. అదెలా? అని ఎవరైనా అడిగితే 'సివిక్ సెన్స్' ప్రతి మనిషికీ నేర్పించి - అని జవాబిస్తాను.

భారతీయ పౌరుడు 'సివిక్ సెన్స్'ఒక్కటి నేర్చుకోగలిగితే ప్రస్తుతానికి అదొక్కటి చాలు.మిగిలినవన్నీ తర్వాత చూచుకోవచ్చు. ఇదే లేని మనిషి దేవుడూ, దీక్షలూ,మతమూ, మోక్షమూ అని ఏదేదో మాట్లాడటం అంతా వృధా.ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎలా ఎక్కగలదు? ఆధ్యాత్మికతకు పేరెన్నిక గన్న దేశంలో కనీస పౌర బాధ్యతలు విస్మరింపబడటం బాధాకరం.దానికి సమాజం యావత్తూ నిస్సిగ్గుగా వత్తాసు పలకడం ఆశ్చర్యకరం.

ఏ రాయైతేనేం తల పగలగోట్టుకోడానికి? అని మనకో సామెతుంది. అలాగే,ఏ మైకైతేనేం మన నిద్ర పాడు గావడానికి? ఏ మతమైతేనేం మనిషి హక్కుల్ని హరించడానికి? అని ఆ సామెతని మార్చుకోవాలేమో? ఈ దేశంలో సివిక్ సెన్స్ పెరిగే వరకూ, తప్పేదేముంది అలాగే చేద్దాం.